27 సెప్టెం, 2012

సుకవి





అది తిరుపతిలోని 
మధురాంతకం రాజారాంగారి ఇల్లు. 
కథకుడు, 
విమర్శకుడు 
వల్లంపాటి వెంకటసుబ్బయ్య 
ఆనాటి రాత్రి 
అక్కడ ఆతిథ్యం పొందుతున్నారు. 
భోజనానంతరం వల్లంపాటివారు 
ఓ కావ్యం చదవడం మొదలుపెట్టారు. 

అంతలో కరెంట్ పోయింది. 
వల్లంపాటి కవితాగానం మాత్రం ఆగలేదు. మధురాంతకంవారి సతీమణి ఆశ్చర్యపోయారు. 
‘చీకట్లో ఎట్ల చదువుతున్నారన్నా?’ 
అని అడిగారు. 
‘ఈ కావ్యం 
అచ్చులో చూసి చదవాల్సిన పనిలేదు - 
అది నా నాలుకమీద నర్తిస్తూనే ఉంటుందమ్మా!’ 
అన్నారు వల్లంపాటి. 
ఆ కావ్యం ‘శివతాండవము’. 
దాన్ని రాసింది 
‘సరస్వతీపుత్ర’ 
పుట్టపర్తి నారాయణాచార్యులు. 
‘సుకవి జీవించు ప్రజల నాలుకలపైన’ 
అన్న జాషువ వాక్యానికి 

ఇంతకన్నా నిర్ధారణ వేరేం కావాలి?

25 సెప్టెం, 2012

పింగళి సూరన్న 'సభంగ శ్లేష'








పదహారవ శ తాబ్దానికి చెందిన సూరన
అష్టదిగ్గజాలలో ఒకడు
కృష్ణదేవరాయల 
భువనవిజయమనే మణిమాలలో 
ఒక అనర్ఘ రత్నమై భాసిల్లాడు.

రాఘవపాండవీయం  
శ్లేషకవిత్వంతో నిండి 
పదము పదము వెనకాపాఠకుడి ఆలోచనలకు పదును పెడుతూ పరుగెడుతుంది.
రామాయణ కధకూ 
భాగవత కథకూ ఒకేసారి అన్వయిస్తూ సాగుతుంది 

6వ శతాబ్దము మధ్యభాగములో 
పింగళి సూరన రచించిన కళాపూర్ణోదయము 
దక్షిణ ఆసియాలోనే మొట్టమొదటి 
నవలగా భావిస్తారు. 
కళాపూర్ణోదయాన్ని తెలుగు సాహిత్యం లో మొట్టమొదటి కావ్యంగా పరిగణిస్తారు 
ఇది అద్భుతమైన ప్రేమ కావ్యము.







"సుబల తనయ, గుణమహిమన్
ప్రబలి తనకు దార ధర్మ పాలన లీలన్
సొబగొంది వన్నెదేగా
విబుధస్తుతుడవ్విభుండు వెలసెన్ ధరణిన్"
 
రెండర్థాలతో వుండే 
ఒక పద్యాన్ని చెప్పడమే చాల కష్టం 
అట్లా కావ్యమంతా నిర్మిస్తే 
కవులు ఓహో అనరా 
అంటాడు పింగళి సూరన్న
రామ కథలు జోడించి 
రాఘవ పాండవీయాన్ని రచించాడు 

ఆ కావ్యం చూస్తే 
సూరన అన్నమాట 
అక్షరాలా చెల్లించుకున్నాడా అనిపిస్తుంది 
తరువాత ఆయన పైన కసి పెట్టుకొని 
యెందరో ద్వర్థి కావ్యాలు వ్రాసినారు 

ముఖ్యంగా..
సమకాలికుడూ.. 
శ్లేషరచనా చక్రవర్తి..
 అయిన రామరాజ భూషణుడు 
"హరిశ్చంద్ర నలోపఖ్యానం" వ్రాసాడు 

అందులో అతడు పడిన పాట్లు చూస్తే 
"అయ్యో..
 ఎందుకింత శ్రమపడడం..!"
 అనిపిస్తుంది 
పింగళి సూరన్న కంటే 
శబ్ద భాండాగారం రామరాజ భూషణుడికి 
చాలా దండిగా ఉండేది 

వసుచరిత్రలో 
ఒక్కొక్క పద్యంలో రెండు మూడర్థాలు 
యెంతో రమణీయంగా చెబుతాడు 

ఆంధ్ర సంస్కృతాలేకాక 
ఆ శ్లేష రచనలో 
పింగళి సూరన్నతో సాటిరాలేక పోయినాడు 
ద్వర్థి కావ్య రచనలో 
పింగళి సూరన్నతో సాటి రాలేక పోయినాడు 

అతడు సర్వ సులభంగా 
ఊపిరి వదలినట్లుగా రెండర్థాలు చెబుతాడు 
దీనికిపై కందపద్యం ఒక ఉదాహరణం 

అందులో..
ధృతరాష్ట్రుణ్ణీ దశరధుణ్ణీ వర్ణిస్తున్నాడు 
'సుబలతనయ..'
 అంటే గాంధారి 
ఆమె 'నయగుణ మహిమతో ..'
అనగా పతివ్రతా ధర్మంతో 
దానధర్మ పాలన లీలను చెల్లిస్తూ వున్నదట 

'విబుధస్తుతుడు'
 అంటే పండితులచే పొగడబడినవాడని అర్థం 
 దీనితో భారతార్థం ముగుస్తుంది. 

ఇక రామాయణార్థం చూద్దాం ..
ఆయనకున్న 'సుబలత'
 అనగా బల ప్రకర్షణము 
'నయగుణ మహిమతో '
ప్రబలిందట ..
బలాన్ని ఇష్టమొచ్చినట్లు కాకుండా 
వివేచనతో వినియోగించే వాడని అర్థం. 

ఈ గుణము ఎందుకు ఉపయోగపడింది.. ??
ఉదారమైన ధర్మ పాలనకు ఉపయోగపడింది 
రాజ్జాన్ని ధర్మము తప్పకుండా 
పరిపాలించినాడన్న మాట. 
విబుధులంటే దేవతలు 
దశరధుడు వారి యుధ్ధాలలో 
సహాయకుడుగా వెళ్ళినవాడు 
ఇది రామాయణార్థం 

ఆయన వాడే పదాలు చిన్న చిన్న తునకలై 
రెండో అర్థాన్ని అతి సులభంగా చిత్రిస్తాయి. 
"సుబల తనయ గుణమహిమన్"
 అతి సూక్ష్మమైన మలుపు 
అలాగే దారధర్మము ఉదారధర్మము 
ఇలాగా ద్వర్థి కావ్యం చెప్పినవాడు 
పింగళి సూరన్న ఒక్కడే 
ఇట్టిదానినే 'సభంగ శ్లేష' అంటారు
 

15.10.1982 ఆంధ్రజ్యోతి వార పత్రిక

23 సెప్టెం, 2012

వాఙ్మూర్తి..పుట్టపర్తి ..సినారె



హలో ..
హలో ..
"నేను ..
పుట్టపర్తి వారి అమ్మాయినండీ.."
"ఆ.."
"నేనూ ..
పుట్టపర్తి నారాయణాచార్యులవారి అమ్మాయిని.."
"ఎవరూ పుట్టపర్తి నారాయణాచార్యులా..??"
"ఆ అవునండీ.."
"చెప్పమ్మా.."
"మేము ఇంటర్ నెట్లో పుట్టపర్తి వారిపై 
ఒక వెబ్ సైట్ పెట్టమండీ .."
"మా నాన్న జీవిత విశేషాలూ రచనలూ 
వారిపై ఇతరులు వ్రాసిన వ్యాసాలూ ఫోటోలూ 
అన్నీ..
అన్నీ సేకరించి.. 
ఒక పూలతోటలా డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నామండీ.."
"మంచిది.."
"ఇందులో భాగంగా పుట్టపర్తి వారిపై చేసిన PhD పుస్తకాలనూ రప్పించుకుంటున్నాము.."
"సరే.."
"ఇంకొక విషయమండీ ..
మా నాన్న గారితో పరిచయము 
అనుబంధమూ సాహితీ మైత్రి గురుత్వం 
ఇలా ఉన్న వారిని కలిసి 
వారి స్వరాలనూ సేకరిస్తున్నాము.."
"ఆ.."
"మీరు మా నాన్న గారిని 
యాభయ్ లనించీ తెలిసిన వారు 
మంచి సాహితీపరులు 
మా నాన్నగారి పై నాలుగు విషయాలు చెబితే సంతోషిస్తాం.."
సరే..
"ఫోన్ లోనేనా..?"
"అవునండీ.."
"సరే.. నా సెల్ నెం రాసుకో .."
.............
"మాకు అగ్రజ సదృశులు..
 పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు.."
"సారీ ..కట్.. 
ఇద్దరున్నారు కదూ.." (నవ్వు)
కొంచం కష్టం వేసింది..
కళ్ళలో నీళ్ళు కాబోలు 
అవి కూడా వచ్చాయి..
"రెడీ.."
"నాకు అన్న లాంటి వారు..
డా.పుట్టపర్తి నారాయణా చార్యులు గారు
కవిత్వం పాండిత్యం రెంటినీ ..
సమానంగా ఆకళింపు చేసుకున్న ..

వాఙ్మూర్తి ..
నన్ను తమ్ముణిగా భావించేవారు 
"తమ్ముడూ.." అనేవారు..
ఒక సారి జనగామకు పిలిచాం.."


పుట్టపర్తికి కొండగుర్తిక జానుమద్దేనోయ్








నేనీమధ్య 
పుట్టపర్తి వారితో అనుబంధమున్న 
వారి పాండితీ విభవం గురించి తెలిసిన 
వారి సెల్ ఇంటర్వ్యూలు చేయటం మొదలు పెట్టాను. ఒకరి నుంచీ ఒకరికి ప్రయాణిస్తున్నాను. 
ఆత్మ తృప్తి అంతే
జానుమద్ది హనుమచ్చాస్త్రి గారికి 
ఎనభై అయిదేళ్ళ వయసు 
దాదాపు అరవయ్యేళ్ళు పుట్టపర్తి వారిని 
నీడలా అనుసరించారాయన
ఇప్పుడు నేను సేకరించిన వారి కంఠస్వరం 
రేపటికి అది ఒక విలువైన గుర్తు.
అలా మా అయ్యది కూడా లేదు
అయ్య ప్రతి సభా ప్రతి సందర్భమూ ప్రతి వాక్యమూ అయ్యకంటే ఎక్కువ ఆయనకు గుర్తు
తన పై రిసెర్చి చేయటానికి వచ్చిన విద్యార్థులను 
తన గురించిన సమాచారం ఇవ్వటానికి 
జానుమద్ది వారి వద్దకు పంపేవారు అయ్య 


అంటే ..
తన సమాచారమూ 
తన వద్ద భద్రపరచుకోని వారిని ఏమనాలి
వానిపై అంత శ్రధ్ధ లేదంతే..
వాటికి అంత విలువ ఇవ్వలేదు...
ఏమో ఆ తరం అలా వెళ్ళిపోయింది.
అలాంటి వారిని తలుచుకోవటానికీ 
వారి గురించి తెలుసుకోవటానికీ 
ఈ తరం వారికి ఓపిక లేదు..
నాకున్న కంప్యూటరు పరిజ్ఞానం తక్కువ..
ఆడియోను వీద్లియోగా కన్వర్ట్ చేయడానికి 
నాకు తెలిసిన ఒకే ఒక సాధనం 
మూవీ మేకర్ ఆన్ లైన్ 
అది ఎందుకో కొద్ది రోజులుగా పనిచేయటం లేదు.
అప్పుడప్పుడూ ప్రయత్నించి చూచినా 
అది పని చేయనంటే చేయనని 
మొరాయించి కూచుంది.
నిన్న ఆ సాయిని ధ్యానించి 
బాబా అది పని చేసేలా చూడు 
అని ఒక్క క్లిక్ ఇచ్చాను
"ఆశ్చర్యం.."
 పని చేయటం మొదలు పెట్టింది
అలా పరమాత్మ తానున్నానని 
అప్పుడప్పుడూ నిరూపిస్తూ ఉంటాడు కదూ
పుట్టపర్తి వారి పుస్తకాలపై 
పరిశోధన చేసిన వారి పై పడ్డాను.
వారి ఫోన్ నంబర్ సంపాదించి 
వారి మాటలూ రికార్డ్ చేసాను
అలా తగిలినవారే వఝ్ఝల రంగాచార్యులు
ఆయన శివతాండవం పై Phdచేసారు
భౌతిక శాస్త్ర రీత్యా శివతాండవాన్ని నిరూపించే ప్రయత్నం చేసారట
వారు కొని నంబర్లు ఇచ్చారు
ఇలా ఒక్కొక్కరూ పుట్టపర్తి వారితో 
తామెలా స్పూర్తి పొందామో 
వారిలో తామే కోణాన్ని దర్శించామో చెబుతుంటే
నాలో ఏదో ఆనంద తాండవం
ఈ ప్రయత్నాలు 
ఆయన బ్రతికున్న రోజులలో చేసింటే 
ఎంత బాగుండేదో కదా 
అన్న ఒక పశ్చాత్తపం
ఇప్పటికైనా ఏదో నాకు తోచిన రీతిలో 




మా తండ్రి గారి సేవ చేస్తున్నానన్న తృప్తి
ఏమో లెండి..
అలా..
అలా ..
నేను సినారేనూ చేరాను
ఆయనా ఆయన పధ్ధతిలో మాట్లాడారు
నాకు దానిలో కట్ చేయాలని ఏదీ అనిపించలేదు
వాస్తవం ప్రజలు తెలుసుకోవాలి కదా
ప్రస్తుతం 
జానుమద్ది గారి స్వరానికి 
కొన్ని ఫోటోలు కలిపి 
ఒక వీడియో రూపొందించాను
వినండి

22 సెప్టెం, 2012

devulapalli ramanujarao



లోకంబులు లోకేశులు
లోకస్థులు తెగిన తుది అలోకంబగు
పెంజీకటి కవ్వల
ఎవ్వండేకాకృతి వెలుగు నతను నే సేవింతున్

సాహిత్య అకాడమీ కార్యదర్శి 
దేవులపల్లి రామానుజరావు గారు 
నాకు జిరకాల మిత్రులు 
సాహితీపరులు 
ఉదారులు వారు 
అకాడమీ పక్షమున 
మొదలు పండరీ భాగవతము నకై 
వేయి రూపాయలు మంజూరు చేయించిరి. 
మరల నా కష్టములు చెప్పికొనగా సాహసించి 
రెండవ వేయి నిప్పించినారు 
వారికి నా నమోవాకములు.

పండరీ భాగవతము పీఠికలో 

దేవులపల్లి వారి ప్రస్తావన 
 

ఈ గ్రంధం మొదటిభాగం పూర్తి కావడానికి 
నానా యాతనా పడవలసి వచ్చింది 
రచన సాగుతూ వున్నప్పుడు 
కుం.సౌ. నా భార్య పోయింది. 
ఆమె పోవడం నా జీవితంలో పెద్ద దెబ్బ 
రచనకు మనసు అభిముఖంగా లేదు 
అయినా వ్రాత సాగవలె 
అత్యంత క్లిష్ట పరిస్థితులలో కూడా 
ఒక యోగివలె మనస్సును కుదించుకొని
 వ్రాయవలసి వచ్చింది 

దేవులపల్లి రామానుజరావు గారు 
ఈ గ్రంధాన్ని గడ్డకు తేవడంలో 
యెన్నో రీతుల 
ఓర్పును ప్రదర్శిస్తూ వచ్చినారు 
ఆయన నా నిరంతర శ్రేయోభిలాషి 
ఆయన ఋణాన్ని తీర్చుకోలేను. 

శ్రీనివాస ప్రబంధము మున్నుడిలో 
రామానుజరావ్ గారిని 
ఇలా పుటపర్తివారు  ప్రస్తుతించారు 

ఆయనేమో 
నారాయణాచార్యుల వారితో 
నాకు నలభై సంవత్సరాల పరిచయం 
ఆ పరిచయం క్రమక్రమంగా 
ఆత్మీయతగా పరిణమించింది 

నా పట్ల 
అపారమైన అభిమానం కలిగినవారు
ఆచార్యులవారు 
హైదరాబాదుకు వచ్చినప్పుడు 
నాకు కొన్ని గంటల సహవాసము 
సంభాషణావకాశాన్ని కలిగించేవారు. 

నా యోగ్యతకన్న 
ఆయన ఆర్ద్రహృదయము సౌజన్యము 
ఇందుకు కారణము 
గడచిన ఇరవై సంవత్సరాలలో 
వారు రచించి ప్రకటించిన ఉద్గ్రంధాల పీఠికలలో 
నన్ను గూర్చి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు 
అందుకు వారి సౌజన్యమే ప్రధాన కారణం 
అంటారీయన 
పుర్వ జన్మ బంధాలు 
ఇంత ఘనిష్టంగా ఉంటాయేమో 






భావాంబరమున కావల వెల్గు దైవంబు
భావగోపీనాధుడై వేడ్కజెలగించి
రాగిణీవిభ్రమము లక్కడక్కడ దీర్చి
రాగాలవనజన్య రమణీయతలు చేర్చి
యొకయడుగు జననంబు ఒకయడుగు మరణంబు
ఒకభాగమున సృష్టి యొకవైపు బ్రళయంబు
గనుపింప దిగకన్నుగొనలు మిన్నుల నంట
మునిజనంబుల హృదయంబు దత్పదంబంట
నాడెనమ్మా శివుడు
పాడెనమ్మా భవుడు


                      అసాధారణ ప్రతిభావంతుడు 
                              స్వర్గీయ పుట్టపర్తి
                   శ్రీ దేవులపల్లి రామానుజరావు.

భారతీయ సాహిత్య సముద్రాన్ని 
ఆపోశనం పట్టిన 
అపర అగస్త్యుడు 
స్వర్గీయ డాక్టర్ పుట్టపర్తి 

నారాయణాచార్యులు 
మన దేశంలోని 
వివిధ భాషల రచనల సమాహారం 
భారతీయ సాహిత్యం అది 
అతి ప్రాచీనమైనది 
ఆధునికమైనది 
సుసంపన్నమైనది 
ఈ భారతీయ సాహిత్య స్వరూపాన్ని 
సమగ్రంగా సందర్శించిన 
కవి పండితుడు డాక్టర్ నారాయణాచార్యులు 

హిందీలోని తులసీదాసు రామాయణం 
ఆయనకు కంఠస్తం 
తెలుగు కన్నడముల చుట్టరికం 
ఆయనకు సుపరిచితం 
తమిళభాషలోని 
తిరుప్పావై మొదలైన దివ్య ప్రబంధాలు 
ఆయనకు కరతలామలకాలు 
మళయాళ సారస్వతం 
ఆయనకు సంపూర్ణంగా అవగాహనము 

ఇంకా మరికొన్ని దేశభాషల 
సాహిత్య సౌందర్యాన్ని 
ఆయన ప్రత్యక్షంగా సందర్శించినారు 
ఇంగ్లీషు సాహిత్యాన్ని సంపూర్ణంగా పరిశీలించి 
ఆ భాషలో రచనా శక్తిని ఆకళించుకున్నాడు 

మా తెలుగు తల్లికి మల్లెపూదండ 
అన్న గేయానికి 
ఆయన చేసినది మనోజ్ఞమైన అనువాదం 

ఇంగ్లీషులో ఆయన వ్రాసిన 
"The Hero" అనే నాటకం 
సాహిత్య రసికులు 
తప్పక చదువవలసిన గ్రంధం 
అనేక భారతీయభాషల్లో పాండిత్యంతో పాటు రచనాశక్తిని కూడా ఆయన సముపార్జించినాడు 

సంస్కృతాంధ్రములలో 
ఆయన పాండిత్యం లోతైనది 
విశాలమైనది 
ఉభయభాషలలో 
ఆయన రచనావ్యాసంగం చేయగల 
శక్తిమంతుడు.
సంగీతంలో ఆయనకు కూలంకషమైన ప్రజ్ఞ 
ఇంతటి బహుముఖ ప్రతిభాస్మపద 
ఆధునిక భారతీయ సాహిత్యంలో 
మరి ఎవ్వరికి ఉన్నది..?


ఆధునిక భారతీయ కవులలో 
రవీంద్రుడు ప్రధమ గణ్యుడు. 
వ్యాసవాల్మీకుల కోవకు చెందినవాడు 
రవీంద్రుడని విజ్ఞుల ఉద్ఘాటన 
రవీంద్ర సాహిత్యం 
రవీంద్ర సంగీతం 
రవీంద్ర చిత్రకళ 
సుప్రసిధ్ధమైనవి 
రవీంద్రుడు కవి గాయకుడు చిత్రకారుడు 

అనేక దేశభాషలను అభ్యసించి 
వానిలో వైదుష్యం సంపాదించిన 
రాహుల్ సాంకృతాయన్ 
భారతీయ విద్యన్మణి మండలిలో దివ్యమణి 

ఆయన వలె 
బహుభాషా పాండిత్యాన్ని 
సంపాదించిన వారి సంఖ్య మిక్కిలి తక్కువ 

స్వర్గీయ ద్వారం వేంకటస్వామి నాయుడు 
సంగీత సాహిత్యాలలో మేటియని 
ఖ్యాతి గాంచిన హరికథా పితామహుడు 
గొప్ప వాగ్గేయకారుడు 

దేశభాషలతో పాటూ 
ఫారసీ మొదలైన భాషల్లో కూడ 
పాండిత్యాన్ని సంపాదించిన 
ప్రతిభావంతుడు 

నారాయణదాసు 
రవీంద్రుడు 
రాహుల్ సాంకృతాయన్ 
వరుసలో కూర్చుండదగిన కుశాగ్రబుధ్ధి నారాయణాచార్యులు 

భారతీయ సాహిత్యంలో 
ఈ ముగ్గురి కోవకు చెందిన మనీషి పుట్టపర్తి.

పుట్టపర్తి నారాయణాచార్యులు 
కవి ..పండితుడు.. విమర్శకుడు..
 సంగీత స్వరూపాన్ని 
సమగ్రంగా సందర్శించిన రసికుడు 
అనర్గళమైన వాగ్ధాటి కలిగిన వక్త. 
కళతో పాటూ శాస్త్రాన్ని కూడా 
చక్కగా అవగాహన చేసుకొని 
సమన్వయించగలిగిన విద్వద్వరేణ్యుడు 

పండితుడుగా భాషల హద్దులను దాటి 
వీరవిహారము చేసిన 
ప్రజ్ఞా సమన్వితుడు 

రాయనసీమలో కరువు వచ్చినప్పుడు 
అప్పటి ప్రధాని పండిత జవహర్ లాల్ నెహ్రూ 
కడపకు వెళ్ళి 
ఆయనను చూచి 
సంభాషించి 
మీరు ఇక్కడ ఉండగా 
ఈ సీమలో కరువు వున్నప్పటికీ 
సాంస్కృతికమైన క్షామం లేదని 
చలోక్తి విసిరినారట. 

గోవింద వల్లభపంత్ ప్రభృతులు 
ఆయన శివతాండవం గానం చేయగా విని ముగ్ధులైనారట.

శివతాండవం 
కొన్ని నూర్ల కాదు 
వేల సభలలో గానం చేయగా 

మనదేశంలోని సాహితీపరులు ఆలకించి ముగ్ధులైనారన్న సత్యం 
అందరికీ తెలిసిందే 

మేఘదూతం 
జనప్రియ రామాయణం 
పండరీభాగవతం 
మొదలైన ఉద్గ్రంధాలు 
ఆయన తెలుగు సరస్వతికి 
సమర్పించిన మణిభూషణాలు 

అనేక సభలలో 
అనేక సాహిత్య ప్రసంగాలు చేసి 
మనదేశంలో సాహిత్య వేత్తలందరిచే 
అభినందనలు పొందిన 
ఆంధ్ర విద్వాంసుడు 
డాక్టర్ పుట్టపర్తి 

తెలుగు కన్నడ భాషల 
సన్నిహిత సంబంధాలను గూర్చి 
ఆయన ప్రామాణికమైన ఉపన్యాసాలు చేసినారు 
ప్రాకృత కవులను గూర్చి
ఆయన చేసిన ప్రసంగాలు 
తెలుగులో విమర్శనా వాజ్మ యానికి అలంకారాలు 

సంస్కృతంతో పాటూ 
ప్రాకృతములో 
ఆయనది నిష్ణాతమైన పాండిత్యం 

ప్రాకృత భాషలో వైదుష్యం కల 
కొద్దిమందిలో 
ఆయన ప్రముఖుడు 

పోతన కవిత్వం మీద 
అధికారపూర్వకమైన ప్రసంగాలు 
ఆయన గావించినారు 

తెలుగులో పదకవితను గూర్చి 
ఆయన చేసిన ప్రసంగం 
అందులోనూ తాళ్ళపాక కవులను గూర్చిన 
ఆయన ఉపన్యాసం ..
క్షేత్రయ్య ..త్యాగరాజు.. రామదాసు..
 వంటి వాగ్గేయకారుల వాజ్మ యానికి 
ఆయన చేసిన వ్యాఖ్యానాలు 
సాటిలేని వని చెబితే 
సత్యోక్తి మాత్రమే..
అతిశయోక్తి కాదు...!!

వసుచరిత్ర 
ఆముక్త మాల్యద వంటి ప్రబంధాలను గూర్చి మహోపన్యాసాలు చేసిన మనీషి 

ఆయన 
కవిత్వము.. సాహిత్య విమర్శ ..
సవ్యసాచి వలె సాధించిన 
ప్రతిభావంతుడు ఆయన
 
తెలుగులోనే కాదు 
అనేక దేశభాషలలో 
సమగ్రమైన పాండిత్యంతో పాటు 
రచనాశక్తి గలిగిన ప్రజ్ఞాధురీణుడు 
పుట్టపర్తి నారాయణాచార్యులు 

నిస్సందేహంగా 
అసాధారణమైన ప్రతిభ ఆయనది 
ఆయనరచనలు శతాధికాలు 
కొన్ని ముద్రితాలు 
కొన్ని అముద్రితాలు 
అముద్రితాలు వెలుగు చూడవలసిన 
కృషి జరుగవలెను 

తుదివరకు 
సాహిత్య తపస్సులోనే నిమగ్నుడై 
శారదాదేవి ఆరాధనలో కన్నులు మూసిన 
కవి వరేణ్యుడు పుట్టపర్తి 

ఆయన అస్తమయంతో 
సాహితీప్రపంచంలో సూర్యాస్తమయం జరిగి తాత్కాలికమైన చీకటి ఆవరించింది 
మళ్ళీ అంతటి 
బహుభాషా కోవిదుడు 
విద్వాంసుడు 
సంగీత సాహిత్యాలలో 
సమానమైన ప్రతిభావంతుడు 
ఉదయించుట ఎప్పుడో గదా..??

నారాయణాచార్యుల వారితో 
నాకు నలభై సంవత్సరాల పరిచయం 
ఆ పరిచయం క్రమక్రమంగా 
ఆత్మీయతగా పరిణమించింది 

నా పట్ల 
అపారమైన అభిమానం కలిగినవారు
ఆచార్యులవారు 

హైదరాబాదుకు వచ్చినప్పుడు 
నాకు కొన్ని గంటల సహవాసము 
సంభాషణావకాశాన్ని కలిగించేవారు. 

నా యోగ్యతకన్న 
ఆయన ఆర్ద్రహృదయము సౌజన్యము 
ఇందుకు కారణము 

మిత్రుల పట్ల ప్రేమ 
వ్యతిరేకులపట్ల 
ముఖ్యంగా వాదోపవాదాలలో 
ప్రతివాది భయంకర స్వరూపం 
ఆయన ప్రదర్శించేవారు 

వేదికలమీద మాట్లాడుతున్నప్పుడు 
రెచ్చగొడితే 
త్రివిక్రమ స్వరూపం చూపించేవారు 

సాహిత్య సాంస్కృతికరంగాలలో 
భిన్న శక్తుల కలయిక 
ఆయనలో మూర్తీభవించి వుండేవి. 

సాధారణంగా 
ఒకచోట ఇమడని భిన్న ప్రతిభలు 
ఆయన వ్యక్తిత్వంలో 
సరస సమ్మేళనం పొందినవి 

నారాయణాచార్యులవంటి 
మహాపండితుని 
మహాకవిని 
మహావక్తను 
గొప్ప విజ్ఞానిని 
అత్యంత ప్రతిభావంతుని 
మళ్ళీ చూడగలనా ..??
 
గడచిన ఇరవై సంవత్సరాలలో 
వారు రచించి ప్రకటించిన ఉద్గ్రంధాల పీఠికలలో 
నన్ను గూర్చి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు 

అందుకు వారి సౌజన్యమే ప్రధాన కారణం
ఆంధ్ర సారస్వత పరిషత్తుతో 
వారికి సన్నిహిత సంబంధాలుండేవి 
వారిని మాలో ఒకరిగా భావించినాము 

1953 లో ఆలంపూరులో 
జరిగిన సభలకు వారు వచ్చి 
మూడు రోజులు మాతో గడిపి 
తెలుగు కన్నడముల చుట్టరికాన్ని గూర్చి 
మంచి ప్రసంగం చేసినారు 

ఆంధ్ర ప్రదేశ్ అవతరణ మొదటివారంలో 
సారస్వత పరిషత్తు నిర్వహించిన 
పోతన వారోత్సవలలో 
పోతన కవిత్వాన్ని గూర్చి 
మేలైన ఉపన్యాసాలు రెండు చేసినారు 

పరిషత్తు రజతోత్సవాలలో వారు పాల్గొని 
తెలుగులో పదకవితను గూ ర్చి 
మూడురోజులు జరిగిన సాహిత్య సభలకు 
అధ్యక్షత వహించి 
అన్నమాచార్యులమీద 
అధికారికమైన ఉపన్యాసం చేసినారు 

పరిషత్తు ఏ  పండుగ చేసుకున్నా 
నారాయణాచార్యులు గారు ఉండవలసిందే 
నిజానికి 
అత్యంత ప్రతిభావంతులై 
బహుభాషాపారంగతులై న 
డాక్టర్ పుట్టపర్తి 
నారాయణాచార్యులుగారు 
ఆంధ్రసారస్వతపరిషత్తుకు 
ఆస్థాన విద్వాంసులు 

వారు 
పరమపదించడం
సారస్వత పరిషత్తుకు తీరని లోటు 
నా పక్షాన 
సారస్వత పరిషత్తు పక్షాన 
పుట్టపర్తికి శ్ర ధ్ధాంజలి
 

17 సెప్టెం, 2012

డా . పుట్టపర్తి వారితో ఒకరోజు




కడప  రేడియోలో నేను
మహిళాభారతి చేసేదాన్ని 
వారంలో రెండురోజులు
ఇంకా మీ ఉత్తరాలూ 

పిల్లల కార్యక్రమాలూ చేసాను.
అప్పట్లో
శాంతలక్ష్మి గారితో పరిచయం
రికార్డింగ్ కొచ్చారామె
అప్పటికి మా ఇల్లు 

అమ్మలేక బోసిపోయి వుంది.
మా హృదయాలు చిన్నబోయి వున్నాయి
అదొక పరీక్షాకాలం..

                        

                        డా . పుట్టపర్తి వారితో ఒకరోజు
                           శ్రీమతి కె.ఎన్.శాంతలక్ష్మి

సరస్వతీపుత్ర బిరుదాంకితులు 
శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులవారి పేరు 
నేను తొమ్మిదోక్లాసు 
చదువుతూవుండగానే విన్నాను. 

ఆయన వ్రాసిన ప్రబంధ నాయికలు 
అన్న పుస్తకం నుండి 
సత్యాదేవి అనే పాఠ్యాంశాన్ని 
మాకు స్పెషల్ తెలుగులో పాఠంగా ఎన్నిక చేసారు 

అందులో 
ఆయన సత్యభామ పాత్రపోషణ 
ఈనాటికీ నాకు కళ్ళకు కట్టినట్టుగా వుంది. 

ముఖ్యంగా 
ఆయన భాష ఎంతో శక్తివంతంగా 
రాయలసీమ మాండలికాలతో 
హృదయానికి హత్తుకొనేదిగా వుండి 
సాక్షాత్ సత్యభామాదేవి 
మన కనుల ముందు వున్నదా ..?
అన్న భ్రమను కలిగిస్తుంటే 

పాశ్చాత్య కవులు 
picturesque description అంటారే 
అలాంటిదన్నమాట 
ఆచార్యులవారి వర్ణనా చమత్కృతి 

నా చదువై.. 
శ్రీ సత్యసాయి డి గ్రీ కళాశాలలో 
లెక్చరరుగా చేరిన 5,6 సంవత్సరాలకు 
తెలుగు డిపార్ట్ మెం ట్ వారు 
శ్రీమాన్ నారాయణాచార్యులవారిని పిలిపించి 
కళాశాల లైబ్రరీలో 
ఆయన ప్రసంగాన్ని ఏర్పాటు చేసినప్పుడు 
ఆయనను చూసే భాగ్యం కలిగింది. 

ఆయన రచించిన శివతాండవం 
స్వయంగా గానం చేసి 
శివతాండవాన్ని మాకందరికీ దర్శింపచేశారంటే అతిశయోక్తి కాదు. 
ఆయనకు కేంద్ర ప్రభుత్వం 
పద్మశ్రీ అవార్డు ఇచ్చిన సందర్భంలో 
ఆయన జీవితంపై 
TV లో డాక్యుమెంటరీ చూపించినప్పుడు 
ఆయన నిరాడంబర జీవన విధానం గురించి 
ఒక అవగాహన ఏర్పడడమే కాకుండా 
ఆయన నుండి తెలుసుకోవాల్సింది 
ఎంతో వుందనిపిస్తుంది.

నేను రేడియో ప్రసంగాలకి 
కడప రేడియో కేంద్రం 
వెళ్ళాల్సి వచ్చిన సందర్భంలో 
శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల వారి 
ఆఖరు కుమార్తెను 
రేడియో స్టేషనులో చూడడము జరిగింది. 

ఆచార్యులవారు 
మా మామగారైన 
ధన్నవాడ (కిడాంబి) శ్రీనివాస రాఘవాచార్యుల వారికి చాలా సన్నిహితులు 
ఆచార్యులవారి సతీమణి 
శ్రీమతి కనకమ్మగారు 
ధన్నవాడ వాళ్ళ ఇంటి ఆడపడుచు కావడం 
ఈ సాన్నిహిత్యానికి కార ణం కావచ్చు 

కాని నాకు వారితో ముఖముఖి పరిచయం సంభాషణావకాశం 
ఒక రోజు మాత్రమే లభ్యమైంది 
రేడియో ప్రసంగాలకు వెళ్ళినప్పుడు 
వారి అమ్మాయితో పరిచయం కారణంగా 
ఆ అమ్మాయి ఒకనాడు 
నన్ను ఇంటికి ఆహ్వానించినా 
ఇతర కారణాలవలన 
ఆనాడు వెళ్ళలేక పోయాను 

కాని 
ఆరుమాసాల తరువాత 
మరొక రేడియో ప్రసంగానికి వెళ్ళినప్పుడు 
రికార్డింగ్ ఆలశ్యం కావడం 
అనంతపురానికి బస్సులు లేని కారణంగా 
శ్రీమాన్ ఆచార్యులవారిని 
దర్శించినట్లు వుంటుందని 
వారి ఇంటికి బయల్దేరాను 

"జగమెరిగిన బ్రాహ్మణికి జంధ్యమేల..?"
అని ఆయన ఇల్లు కనుక్కోవటం చాలా తేలికైంది 

కాని వాళ్ళ అమ్మాయి ఊళ్ళో లేదు 
పెళ్ళి చూపులకని సోదరునితో కలిసి 
హాస్పేటకు వెళ్ళిందని 
వారి కోడలి ద్వారా తెలిసింది 

నేనెవరో ఆచార్యులవారికి తెలియనందువలన 
మా మామగారి పేరు 
పుట్టపర్తి వారి ఇంటి ఆడపడుచైన 
మా అత్తగారు శ్రీమతి మహాలక్ష్మి పేరు చెప్పుకొని 
నా పరిచయాన్ని తెలుపుకొని 
ఆచార్యులవారికి నమస్కరించాను 

ఆయన ఎంతో ఆదరణతో 
నన్ను వారి కోడలికి పరిచయం చేసి 
స్వంత ఇంటిలాగ భావించి 
రాత్రికి విశ్రాంతి తీసుకోమని 
పితృవాత్సల్యాన్ని ప్రదర్శించారు 

వారితో మాట్లాడిన కొంతసేపటిలో 
కుమార్తె వివాహానికి సంబంధించిన ఆందోళనతో 
ఆయన బాగా క్రుంగివున్నట్లు కనిపించారు 

వార్ధక్యం ఒకవైపు 
ఆర్థిక అనానుకూలత మరొకవైపు 
ఆయనను బాగా కలచివేసినట్లు 
నేను పసికట్టాను

ఆచార్యుల వారు నాతో మాట్లాడుతూ 
నా భార్య బ్రతికున్న రోజులలో 
పిల్లల వివాహాలను గురించి 
నేను ఏనాడూ పట్టించుకోలేదు 

ఆమె అన్ని ఏర్పాట్లు చేస్తే 
చివర విజిటర్ లాగా వచ్చి 
పీటల మీద కూచుని 
వివాహాలలో పాలు పంచుకునేవాడిని 

అటువంటిది 
ఈ చివరి అమ్మాయి పెళ్ళి విషయం 
నా మెడకు చుట్టి ఆమె వెళ్ళిపోయింది 
ఇది నాకు అలవాటు లేని విషయం 
ఎలా జరుగుతుందో..?
 అని ఆవేదన వ్యక్తం చేసేటప్పుడు 
ఆయన కళ్ళల్లో తడి 
గొంతులో ఆర్ద్రత కనిపించింది 

జనక మహారాజంతటివాడే 
శివధనుస్సును ఎక్కుపెట్టలేక 
సతమతమౌతున్న రాజాధిరాజులను చూసి 
జానకికి కళ్యాణయోగం వుందా..? లేదా..?
 అని ఒక్క క్షణం తపించినప్పుడు 
సామాన్య మానవుల మనఃస్తితి చెప్పేదేముంది 

కాని 
భగవంతుడాయన ఆవేదనను 
అర్థం చేసుకున్నాడా అన్న్నట్లు 
నేను వెళ్ళినప్పుడు ఏ సంబంధం ప్రయత్నించారో 
ఆ సంబంధమే కుదిరి 
ఆ అమ్మాయి వివాహమైనట్లు తెలిసి 
నాకు చాలా సంతోషం కలిగింది.

టి వి లో చూచిన విధంగానే 
ఆయన ఇల్లు జీవన విధానం 
ఎంతో నిరాడంబరంగా వుంది 
ఆయన పౌత్రుడితో ఆడుకునే కొంచంసేపు 
వారు పసిపిల్లవానిలా కనుపించారు 

ఎన్నో భాషలు నేర్చి 
ఎన్నో గ్రంధాలను రచించి 
మరెన్నో సన్మానాలు పొందినా 
ఆయనలో ఎక్కడా 
అహం కాని దర్పం కాని చోటుచేసుకోలేదు 

నాతో మాట్లాడినరోజు 
ఈ సన్మాన విషయాలను గురించి ప్రస్తావిస్తూ కలకత్తాలో ఒక సన్మానం వుందని 
దానికి తమ అనారోగ్య కారణాల వలన 
తాము రాలేమని తెలిపినా 
వారు ఆచార్యులవారికి 
వారితో పాటూ వచ్చేవారికి 
విమాన చార్జీలను ఇస్తామని 
వారిని తప్పక రావలసిందిగా 
ఆహ్వానించినట్లు చెప్పారు. 

కాని వార్ధక్యం తమను 
అంతదూరం ప్రయాణం చేయనివ్వడం 
అనుమానమే అని అన్నారు 

అనంతపురంలోకూడా సన్మానం వుందని 
దానికి వీలైతే రాగలనని అన్నారు 
వారు వచ్చి వెళ్ళింతరువాత తెలిసింది

అనంతపురం వీధుల్లో ఎన్నో సార్లు తిరిగినా 
శ్రీమాన్ నారాయణాచార్యుల వారి 
ప్రతిభను గుర్తించిన వారు చాలా తక్కువ 
కాని ప్రభుత్వం 
పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించగానే 
వారికి సన్మానం ఏర్పాటుచేసారు 

బహుశా భానుమతి రామకృష్ణగారు 
ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పినట్లు 
ఆంధ్రులను ఆంధ్రేతరులే తొందరగా 
వారి ప్రతిభను గుర్తించి గౌరవిస్తారన్నది 
మరోసారి ఋజువైంది. 

శ్రీమాన్ ఆచార్యులవారు 
అనంతపురం సభలో మాట్లాడుతూ 
తమకి కావల్సింది 
సన్మానాలు పూలమాలలు ప్రశంసలూ కావనీ 
తాము రచించిన పుస్తకాలను ముద్రించి 
వెలుగులోనికి తీసుకురావటం 
వానిని చదవటం 
చదివింపజేయటం ద్వారా 
తమలోని కవికి నిజమైన సన్మానమని అన్నారట.
 
ఏది ఏమైనా 
అంతటి మేధావి సాహితీవేత్త ఇకలేరు
అంటే నిరుత్సాహం కలుగుతుంది
వారి శిష్యులు ప్రశిష్యులు 
ఆశ్రితులు అభిమానులు మొదలైనవారు ఆచార్యులవారి అముద్రితాలైన రచనలను 
క్రమక్రమంగా 
వెలుగులోనికి తీసుకురావటం ద్వారా 
వారికి నిజమైన శ్రధ్ధాంజలి ఘటించిన వారౌతారు.