22 డిసెం, 2011

ముగ్ధ పూజ





"మనసు మెదలదు..గన్నులు గనవు.., పలుకు
బయలుదేరదు..ఉపచార వాక్యములకు..
ప్రభలు చల్లు నివాత దీపంబు నీవు...
మోహనంబైన యొక్క ముగ్ధ పూజ నాది.."

అయ్యది ఉష్ణ శరీరం ..
అయ్యకు తలపై దండిగా నూనె పెట్టి 
బాగా మర్దన చేయాలి..
భృంగామలక తైలం ..
అరి కాళ్ళకు .. 
అర చేతులకూ..
మొత్తం వళ్ళంతా బాగా మాలిష్ చేసేవాళ్ళం 
మా అక్క చెల్లెళ్ళందరం..
మొదట్లో అమ్మ చేసేదనుకుంటా..

ఓ నాలగైదు గంటలు నాని 
తరువాత స్నానం చేసేవారు అయ్య..
 
ఇలానే ఒకరోజు 
అయ్య తలనిండా నూనే పెట్టుకొని కుర్చీలో కూర్చున్నారు..
తులసీ రామాయణాన్ని చదువుతున్నారు..
అది పారాయణ కాదు 
కంఠస్ఠం చేయటం..

ఇంతలో  వీధిలో 
ఒక బిచ్చగాడు నిలబడ్డాడట
అయ్యను చూశాడు ..
నెత్తిమీద నూనె పెట్టుకొని..
స్నానం చేయకుండా..
 అలానేనా రామాయణాన్ని చదివేది..?


  వచ్చిన వాడు బిక్ష అడగకుండా..
ఇలా మాట్లాడేసరికి..
అయ్యకు కోపమొచ్చింది..
అసలే అయ్యకు విపరీతమైన కోపం 
 

వాడలా అడిగే సరికి 
అగ్గిమీద గుగ్గిలం అయిపోయారు..

 

వాడిని నీ అమ్మ కడుపు కాలా ..
ఏరిగితే  కడుక్కునేదానికి రాని నీవు.. ..
నాకు చెప్తావా.. ఫో రా.. ఫో .. 
అని శివతాండవం చేసారు..

 
ఏదో ..
ఒకటో.. రెండో గంటలు 
దేవుని ముందు కూర్చుని 
పూజ అయిందనిపించేవానికి నిబంధనలు గానీ..

ఇరవై నాలుగ్గంటలూ ..
ఆ రాముణ్ణీ.. 
ఆ కృష్ణుణ్ణీ ..
పట్టుకు పాకులాడే వానికి స్నానమేమిటీ..? పానమేమిటీ..?
అదీ అయ్య భావన..

ఏమైందని అమ్మ వచ్చి విచారించింది..
అయ్యకు ఎదురు చెప్పే సాహసం 
అమ్మకు ఎక్కడిది..?

 ఎందరో సాధు సంతులను ..
కలసి వారి తత్వాన్ని 
నిరంతరం మననం చేసే అయ్య..

వచ్చిన వాడు ..
ఏ సాధకుడో.. 
లేక సాక్షాత్తూ ఆ శ్రీ రామ చంద్రుడో..
లేక ఆయన సేవకుడు హనుమంతుడో..
అయ్య మనసులో .
.

అంతే..
చిన్న టవలు కట్టుకుని .. 
నూనె కారుతున్న ఆ అవతారం తోనే ..
పరుగు పరుగున వీధులన్నీ వెతికారు..
అతని కోసం..
ఇంట్లో పిల్లలూ .. 
శిష్యులూ .. 
బాణాల్లా కదిలారు..
రామచంద్రుని వెదకడానికి..
 
ఊహూ..
ఎ..ఖ్ఖడా ..కనపడలేదు..
ఇల్లిల్లూ అడుక్కునే వాడయితే 
నాలుగిళ్ళ అవతలో .. 
లేదా పక్క వీధిలోనో దొరకాలి..
కానీ ఇతనలా దొరక లేదే..
ఇతనే శ్రీ రామ చంద్రుడేమో..?                   
లేదు ..లేదు.. 
ఆంజనేయ స్వామి అయివుంటాడు..
 
ఇక పశ్చాత్తాపం ..
అంతులేని ఆత్మ పరిశీలన..
ఈ విధమైన దాగుడు మూతలు 
అయ్యకు దేవునికీ చాలాసార్లే జరిగాయి..

భగవంతుడూ .. 
భాగవతమూ.. 
భక్తుడూ ఒక్కటేరా.. 
అని తన శిష్యునికి భాగవత సారాన్ని వివరిస్తూ..
శ్రీనివాసా ..
అని ఆఖరిమాటగా కన్ను మూసిన అయ్యకు..

అయ్య జీవితపు ఆఖరి క్షణంలో 
జాలిపడి ఆ పరమాత్మ 
అయ్యకు సాక్షాత్కరించి 
పసిపిల్లాడిలా అక్కున చేర్చుకున్నాడని  
అనుకుందాం..

                                

ఉప్పలపాటి రఘూత్తమరావ్..

ఉప్పలపాటి రఘూత్తమరావ్..
అయ్యకు పరమ భక్తుడు..
MA Mathas..MA English..
హైస్కూల్ లో టీచరు..

అయ్యతో అదేమి అనుబంధమో ..
అయ్య ఆజ్ఞను శిరసావహించటం తప్ప వేరే కర్తవ్యమే లేనట్లు వుండేవాడు..
రాత్రీ పగలూ అయ్యతోనే..

జ్యోతిష్య పండితుడు కూడా..లెక్కల్లో అసాధ్యుడు..
ఒకసారి అయ్యకు గుర్రప్పందేలు ఎవరో ఎక్కించారు..
ఇక గురు శిష్యులిద్దరూ.. ఆ గుర్రాలపై పడ్డారు..

రఘూత్తమ రావు సారు గుర్రాల నంబర్లకు జ్యొతిష్యాన్ని జోడించి విపరీతమైన లెక్కలు కట్టేవాడు..
ఈ గుర్రానిదీ నంబరు దీని అధిపతి గురువు..దాని అధిపతి కుజుడు..                             

కానీ లక్ష్మిని ప్రసన్నం చేసుకోవడానికి వీళ్ళు వేసిన పాచికలు యేవీ పారలేదు..
ఎప్పుడూ ఆమె వీరిని చూసి నవ్వేసి వెళ్ళిపోయేది..
కొన్నాళ్ళు ఆ పిచ్చిలో మునిగితేలి ఇక వదిలేసారు..
అమ్మ కోపంతో రఘూత్తమ రావ్ సారును ఘూత్తముడు అనేది కోపంగా..

అయ్య జాతకాన్ని ఎన్ని వందల సార్లు శోధించి చూసాడో మహానుభావుడు..
నాకు డబ్బు వస్తుందా..?
నా కూతురికి మంచి మొగుడొస్తాడా..?
ఇవి కావు ..
అమ్మ

నేను 30 కోట్ల అష్టాక్షరి చేసాను..

నాకు పునర్జన్మ వుందా.. ?
కృష్ణ సాక్షాత్కారమౌతుందా..?

ఇవే ప్రశ్నలు..

వీనికి ఆయన గ్రహాలను సాధించి వదిలి పెట్టేవాడు..
టిఫెను .. భోజనమూ.. పడక .. అన్నీ అయ్య తోనే..
అప్పుడప్పుడూ..అమ్మని వినమని పిలిచేవారు..
అమ్మ కొంచం విని మెల్లగా వెళ్ళీపోయేది..
ఇది ఎన్నవసారో అమ్మకు కూడా గుర్తు వుండదనుకుంటా..

ఆయన విపరీతంగా MA లకు కట్టేవాడు..
పరీక్షకు వెళ్ళాలంటే..
కట్టిన ప్రతిసారీ అయ్య ఏం పోతావులేరా..వుండు.. అనేవారట..
చిత్రంగా ఆయన అయ్య మాటకు ఎదురు చెప్పేవాడేకాదు..
సుమారు ఇరవైసార్లు కట్టాడంట ఇలా..
అయ్యను శ్రీ మహా విష్ణువుగా ఆయన చెబుతా
డు...
మత్రోపదేశం చేయమని అయ్య వెంట బడ్డాడట..
 
చూడు.. నా వెనుక వస్తే.. నీకన్నీ కష్టాలే..
మీ అమ్మ తో వెళ్ళు (అంటే అమ్మతో ఉపదేశం పొందమని)..ధన కనక వస్తు వాహనాలతో సుఖిస్తావు.. అని ఎన్నో సార్లు.. చెప్పారట అయ్య..
 
ఎన్నో సంవత్సరాలు ఉపదేశం ఇవ్వలేదు..
కానీ నాకు అవేవీ వద్దు..నాకు మీరే గురువు అని ప్రధేయపడ్డాడు..
అన్నట్లుగానే ఆయన కళ్ళ ముందరే ఆయన భార్య చనిపోయింది..

మా సుభ్రమణ్యం అన్నయ్య

ఎదిగిన ఒక కూతురు.. కొడుకూ .. పోయారు..
అయినా నేను గురు పాదుకలు వదలలేదు..అనేవాడు ఆయన..

వాళ్ళ ఇంట్లో కూడా అయ్య సాంగత్యం వదలమని పోరేవారు..

ఇది పూర్వ జన్మ సంబంధమా..?

కాక పిచ్చితనమా..?

ఇలా ఈయనే కాదు.. ఎందరో .. అయ్యను మనస్ఫూర్తిగా నమ్మారు..
 
ఆయన జీవితం తెరిచిన పుస్తకం ..
జీవన విధానంలో ఎక్కడా దాపరికాలు లేవు..
అది మంచికానీ చెడుకానీ..
 
కానీ మా సుభ్రమణ్యం అన్నయ్య అమ్మ పాదాలు పట్టుకున్నాడు..
అతను మా తోడబుట్టిన వాడు కాదు..
అంతకంటే ఎక్కువ..
కోమటివాడు..తొమ్మిదేళ్ళ వయసులో మా ఇంటికి ముడి పడ్డాడుట..
 
అన్నయ్య ఎనిమిదేళ్ళ వయసులో ఒకరోజు ఎందుకో యేడుస్తూ రామకృష్ణా హైస్కూల్ వైపు వస్తున్నాడట..
అయ్య దారిలో ఎదురయ్యారు..
 
యేమిరా యేడుస్తున్నావు.. అన్నారట..
అమ్మ కావాలి అన్నా
డు అన్నయ్య..
 
ఇంట్లో వుంది చూడుపోరా. . అన్నారు అయ్య..
 
అంతే..
 
ఇంటికి వచ్చి అమ్మను చూసాడు..తెలియని మాయలో పడిపోయాడు..
 
అప్పుడు ఇంటినిండా శిష్యులు..
వచ్చీ పోయేవారు..
 
పడసాలలో మూల మూలకూ కూర్చొని జపాలు చేసేవారు..
 
ఇదీ మా ఇల్లు..
 
ఇక ఇంటికి పోలేదు..వాళ్ళ అమ్మ నాయనలు వచ్చి పిలచినా బ్రతిమాలినా సరే..
 
వాళ్ళు కోపంతో ఆగ్రహించి అమ్మను అయ్యను విపరీతంగా తిట్టి తిట్టి పోయేవారట..
 
అమ్మ ఒరే సుబ్రమణ్యం ..మీ ఇంటికి పోరా.. అంటే వినడు..
 
ఒకసారి యేదో ఎర్రగుంట్లలో రేషన్ షాపులో పనిచేసాడట..
అక్కడ రా
త్రి దొంగతనంగా ఒకటి రెండు బియ్యపు మూటలు రాత్రి బస్సులో వేసుకొని వచ్చి ఇంట్లో వేసి మళ్ళీ వెంటనే బయలుదేరి పొద్దున ఎర్రగుంట్ల కు చేరేవాడు..
 
ఎలానో oriental general insurance  లో ఉద్యోగం సంపాదించాడు.
 
అన్నయ్య చదివింది ఎనిమిదో క్లాసు అనుకుంటా..
ఏ స్థాయికి ఎదిగాడో తెలుసా.. divisional manager ..
 
నమ్ముతారా..?
 
మహిమ నమ్ముకున్న దేవునిదా..?
నమ్మిన భక్తునిదా..?
 
అయ్య ఒకసారి ఆశ్రమ జీవితమంటారు..
ఒకసారి భజనలూ .. పూజలూ.. జపతపాలు అంటారు..
ఇంకేవో వ్యామోహాలు..

ఒకసారి హిమాలయాలకు ఇంట్లో చెప్పకుండానే వెళ్ళి పోతారు ఒక కాగితం ముక్క రాసిపెట్టి..
సంసారం పట్టించుకోవటం ఆయన ఇష్టం..
 
అమ్మ రామాయణాన్ని పట్టుకొని రాముణ్ణి నిలదీస్తుంది..మరి..


కటిక చీకటిలో దొంగ కరణి బోవు..
నంతటి యవస్ఠ యే పాపమయ్య నీకు..
తెలుపగూడదో లేత వెన్నెలలు జిలుకు..
నవ్వులందించి సాగనంపగ లేనో..


అని అమ్మ పశ్చాత్తాపం అనే ఖందికలో యశోధర గొంతుతో అయ్యను సూటిగా ప్రశ్నించింది..


అంతేకాదు..


అడవులందు కాయ క్లేశమనుభవించి..
పూతమేయనుభూతిని పొందలేవో..
ఇంటిలోనుండి నేను సాధింతు దాని..
దృప్తుడా లాభ నష్టముల్ ..దేల్చి కొమ్ము..
అని ఓ ధీర వనితలా సవాలు విసిరింది ..

 
మరి ఈ పిచ్చి భక్తుని సంసారాన్ని కాపాడటానికి ఆ దేవుడే రక రకాల ఇబ్బందులను పడ్డాడని నేనంటాను..
 
అవునా కాదా ..? యేమో..

పండరీ భాగవతాన్ని రఘూత్తమ రావు సారు కొన్ని వందల వందల సార్లు.. చదివాడు..
 
భగవద్గీత భాగవతం అన్నీ ఆయనకు కంఠస్తాలే..
పండరీ భాగవతంలోని ఘట్టాలను వివశులై ఏడుస్తూ అయ్యకంటే ఎక్కువ వినిపించిన దృశ్యాలు నాకింకా నిన్నటివి లానే వున్నాయి..