24 అక్టో, 2015

బాష్ప తర్పణముప్రొద్దుటూరులో జీవితం మొదలుపెట్టిన రోజులలో
మామూలుగానే క్రిందివారిని పరిహసించటం..
పైకి వస్తున్నవారిని కిందకు లాగటం వంటి
మనస్తత్త్వాలు పుట్టపర్తిని బాధించాయి..

చిన్నతనంలోనేఅమ్మను కోల్పోయిన పుట్టపర్తి
సున్నిత హృదయుడు..
పైకి కాఠిన్యం
ఎవరి వద్దా చేయి చాచటం
ఆత్మాభిమానాన్ని కుదువబెట్టి ప్రాపకం సంపాదించటం
వారిపై వీరిపై కథలల్లి వినోదించటం 
వంటి అవలక్షణాలు అంటని
పూవులాంటి స్వచ్చమైన వైఖరి..

సుబ్బయ్య అనే వ్యక్తి అక్కడ తారసపడ్డాడు
ధనవంతుడు.. 
అక్కడి రాజకీయాలనెరిగినవాడు.. 
పుట్టపర్తి తత్త్వాన్నీ
వైదుష్యాన్నీ బాగా గుర్తించినవాడు

అతడు పుట్టపర్తికి ఉద్యోగమిచ్చి
అండదండగా నిలబడ్డాడు..
కానీ కాలం మంచి వాళ్ళని బ్రతకనివ్వదుగా..
ఆయన భగవంతునికి ప్రీతిపాత్రుడయ్యాడు

అందరూ దుఃఖించారు
పుట్టపర్తి దుఃఖం 
ఇలా రాయలసీమ యాసలో వేదనలు చల్లింది..

సామాన్యంగా పంచరత్నాలు.. నవరత్నాలు.. 
గొప్పవారి ప్రాపకం కోసం 
తేలికగా కవుల నోళ్ళలో కులుకుతుంటాయి

కానీ పుట్టపర్తి తత్వా నికది విరుధ్ధం
తన మనసు స్పందించినపుడే అది కవిత అవుతుంది
కల్లలు కథలు పుట్టపర్తి నోట రావు..

కానీ సుబ్బయ్య మరణం
 పుట్టపర్తిని నిశ్చేతనుని చేసింది..

చూడండి..
అన్నీ కాదు గానీ అక్కడక్కడా.. విని పిస్తాను..

''దేవలోకంబునందు నినదించి రెవరొ
బసిడిగంటలు , నగవులు బరిఢవిల్ల
నిచట సుబ్బయ్యగారు గతించిరనుచు
గర్ణములు సోకినది.. వేడి గాడ్పు బలుకు..''

''మృత్యుదేవత నిప్పుల రెక్కలార్చి
కప్పికొనుటయె చావు లోకంబునందు
గాని సుబ్బయ్య యెడనది కనక రథము
దన్ను గొనిపోయె మోక్ష సౌధమ్ము కొరకు''

''చచ్చినాడందురేమియో జాల్ములార
జావలేదు మా సుబ్బయ్య జావలేదు
బ్రదికినాడోయి మృత్యుదేవతకు నతని
దాకు నధికారమేలేదు తథ్యమద్ది''

పుట్టపర్తి ఇంతలా బాధపడటానికి కారణమేంటి
ఆ కొప్పరపు సుబ్బయ్య ఎలాంటివాడు

''కవులకును రవ సెల్లాలు గప్పినాడు
బీదలకు మునుదెర్వు జూపించినాడు
బండితులకై గాన్కలు బంపినాడు
జేయని పనేమి యతడాంధ్రసీమయందు''

అదీ..
కొంచెం ధనవంతుడైతే..
ఆ ధనాన్ని దాచుకోవటమెట్లా అని చింత
ఎవరైనా లాక్కుపోతారేమోనని దిగులు
దీన్ని పెంచటమెలా అన్న బాధ
ఇదే కదా లోకం

ఆ ధనాన్ని మంచిపనులకు వినియోగించటం తెలిసిన వారెందరు
కొప్పరపు సుబ్బయ్యగారు కవులకు రవసెల్లాలు కప్పి తన కళాహృదయం చాటుకున్నాడు
అంతేనా
బీదలౌ తెరువు చూపించినాడు
పండితులకు కాన్క లూ పంపాడట..
ఇవి యే రాజుకో ఉండవలసిన లక్షణాలు కదూ..

ఇంకా చూద్దాం
ఆకలియటంచు దరిజేరినట్టివాని
నుస్సురననివ్వలేదట..

మాన్యులగు వారికొక యవమానమునుకూడా జరుగనివ్వలేదట..
ధర్మముంకు విఘాతమేర్పడు సమయంలో బదుగురను బిలచి ధర్మం జరిపించాడేమో..

ఇతడు హిందువు మన ఇంటివాడు..
ఇతను ముస్లిము పరాయివాడు
అన్న బేధమే చూపలేదట..

తనచుట్టూ వున్నవారిని
తల్లిప్రేమమ్ము..
తండ్రి చిత్తంబులోని క్షేమ తర్కమ్ము
చేర్చి ఆ నలువ సుబ్బయ్యను సృష్టించినాడట..
అందుకే సుబ్బయ్యగారి పలుకులందు  
అంత వాడిమి..  చిత్తమందు అంత తడి.. 
అంటారు పుట్టపర్తి

నిజమే కదా మానవత్వం గలవారిని చూచినపుడు
మన మనసులో కలిగే భావాలు ఇలాంటివే కదూ..

సుబ్బయ్య గారి ఇంటిని పుట్టపర్తి ఏమని వర్ణించారు

''అది గృహమె గాదు నిజముగా నన్న సత్ర
మతడు గృహిగాడు .. జనకుని యట్టి కర్మ
యోగి యాతని మనుగడ వ్యోమగంగ
త్యాగ భోగములకు సమర్థనము సెట్టి..''

నిజంగా ఒకప్పుడు 
ప్రతి ఇల్లూ అన్న సత్రం లాగే వుండేది కదా..
రాత్రి తొమ్మిదీ పది గంటలకు బిచ్చగాళ్ళు 
అమ్మా అంటూ
వచ్చేవారు..
ఆరోజు మిగిలిన కూరలు పప్పు అన్నం అన్నీ కనీసం ఒకరిద్దరి కడుపు నింపేవి..
కానీ ఈ ఫ్రిజ్జు లొచ్చిన తరువాత
బిక్షగాళ్ళూ లేరు..
మిగిలిన అన్నం వేయటమూ లేదు అన్నీ ఫ్రిజ్ లోకే
ఆ చలువ పెట్టెలు మన గుండెల్లోని చలువనెత్తుకెళ్ళిపోయాయేమో..'

డొక్కా సీతమ్మగారు అన్నదానానికెంత పేరుగన్నవారు
ఈనాటికీ ఆమెను స్మరించే వారు ఎందరో వున్నారు 

ఇదేమిటీ పుట్టపర్తి ఇలా పొగడుతున్నారు
అనుకుంటున్నారా..
ఇది చూడండి

''నాకు బొగడింత యన్నచో నచ్చదైన
బొగడకుండగలేను ఆ పుణ్యమూర్తి
గుణము గనపడ్డచో మెచ్చుకొననివాడు
తనువు దాల్చిన దయ్యంబు దైత్యకులుడు..''

పుట్టపర్తికి పొగడటం పొగిడించుకోవటం సరిపోదు
కానీ నిజంగా పొగడవలసినంత ఘనత ఎదురుగా కనపడితే..
గుండె విప్పి పొగడుతారు
అలా పొగడని వాడు 
'తనువు దాల్చిన దయ్యంబు ..దైత్య కులుడు'
 అంటారు నిజమే కదా..

మనం చూస్తూ వుంటాం
ఒకరు అందరినీ పొగడుతుంటారు..
దానిలో కొంత లౌక్యం..
మరికొంత ఒక మంచిమాట పడేస్తే పోయేదేముంది
అన్న ధోరణి..

మరికొంత మంది పిడివాదం.. ప్రతి విషయంలోనూ .. 
అలా విభేదించటం తమ తెలివి అనుకుంటారు .. 
భక్తి అంటే..
ఎప్పుడూ గుళ్ళూ గోపురాలు పూజలూ పునస్కారాలు
వాటిలో వున్నాడా దేవుడు అంటారు..
కానీ 
అవి చేయవద్దని ఆ దేవుడూ చెప్పలేదు కదా
అలా చేస్తూ చేస్తూ ఏకాగ్రత.. భావ శుధ్ధి కలిగి పరిపక్వత వస్తుంది
మొదటే ఎవరూ డాక్టరైపోరు.. LKG నుంచీ మొదలు పెట్టాలి 

మనసును అలా వదిలేస్తే మరింత చంచల మైపోదూ..

''పుణ్య పురుషులు త్యాగులేపొద్దు లేరొ
నాడె నమ్మిన నమ్మకున్నను  ఘటించు 
ప్రళయమనునది లోకంబులారలేదు
బ్రతుకుచున్నారు సుబ్బయ్యవంటి ఘనులు..''

నిజమే 
గుండె బరువెక్కుతోంది కదా..
ఎక్కడ చూచినా అన్యాయం.. అవినీతి 
మానవత్వం క్రమ క్రమంగా అడుగంటిపోతోంది..
ఇలా ఇంకా ఎంత అధమ స్థాయికి వెళ్ళిపోతుందో లోకం..
మన బ్రతుకులిలా వెళ్ళిపోతున్నాయి
మన పిల్లల రోజులు వచ్చేసరికి ఎలా వుంటుందో ఊహించుకోగలమా..
ఎక్కడో కొండకోనల్లో అన్నీ మరచి తపస్సాధనలో మునిగిన సాధువులూ
మంచినీ మానవత్త్వాన్నీ బ్రదికిస్తూ 
సుబ్బయ్య వంటి ఘనులూ ఉండడం వల్లే.
వారి పుణ్య బలమే 
ఈ ధరిత్రిని నిలబెడుతూందేమో..

సిధ్ధ సమాధియోగా కాంపుకు వెళ్ళాం 
తిరుమల కొండలలోని అడవుల లోకి
అక్కడ నిశ్చలంగా తపస్సమాధిలో కూర్చున్న యోగులను దర్శించాం
పుట్టలు పట్టిన వారిని చూచినప్పుడు
నిజంగా మనది తపోభూమి అనిపించింది..
బాష్ప తర్పణము

ఒక వాక్యం జీవిత ప్రయాణమా .. ?