21 మార్చి, 2012

పుట్టపర్తి నారాయణాచార్యులు జిళ్ళెళ్ళమూడి అమ్మ

ఒకసారి..
ఒకసారేమిటి ..
తరువాత చాలాసార్లు..
అమ్మ అయ్య నేను..
జిళ్ళెళ్ళమూడి వెళ్ళాం..
అప్పుడు నాకు పది పన్నెండేళ్ళుంటాయేమో..
 
చివరిదాన్నీ ..
చిన్నదాన్నీ ..
అవటం వలన..
అమ్మ అయ్య ఎక్కడికి వెళ్ళినా ..
వెనుక నేనుండ వలసిందే..
 
అలానే ..
నాలుగేళ్ళనుంచే ..
పండరి ..తులజాపూర్ ..షిరిడీ..
చాలా పుణ్య క్షేత్రాలు చూసాను..
కానీ చిన్నతనం వలన..
ఆ మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాను..
 
కానీ..
నాకు పూర్వ జన్మ పుణ్యం ఉండటం వల్లనే ..
అంతటి అయ్య అమ్మ ల..
ముద్దు మురిపాలనూ పొందే అవకాశం..
దొరికిందని నమ్ముతున్నాను...
 
అలానే ..
అమ్మ అయ్య లకు చివరి రోజులలో..
 సేవ చేసే అవకాశం కూడా..
 మహద్భాగ్యంగా లభించింది...
 
నా పదిహేడేళ్ళ వయసులో..
అమ్మ పెరాలిసిస్ వస్తే ..
 దాదాపు సంవత్సరం సంవత్సరమ్న్నర..
 అమ్మ మల మూత్రాలు శుభ్రం చేయడం..
 స్నానం చేయించటం ..
అన్నం నోట్లో పెట్టటం ..
అమ్మ పక్కనే పడుకోవటం జరిగింది..
 
చిన్న వయసులో..
అంతటి గొప్ప అదృష్టం పొందటం కూడా..
నా పూర్వ జన్మ సుకృతం గానే ..
నేను భావిస్తాను..!
 
ఇక కథలోకి వస్తే..
అయిదుగురు ఆడపిల్లలు..
 అందులో ముగ్గురికి పెళ్ళయింది..
మనుమలు మనుమరాళ్ళు..
ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు..
 
అద్దె ఇల్లు..
ఇంతవరకూ..
ఒక చిన్న సొంత ఇల్లు కొనలేదు..
కొనడానికి దాయడమేదీ..??
ఒక చీటీ లేదు..
ఒక ఎల్ ఐ సీ లేదు..
ఒక బ్యాంక్ సేవింగ్స్ లేదు..
పిల్ల పెళ్ళి చేయాలా..??
అయ్య
రాఘవేంద్ర స్వామి స్తోత్రం నూటా ఎనిమిది సార్లు..
ఏ తెల్లవారి రెండు కో లేచి చేస్తారు..
ఏదో విధంగా డబ్బు సమకూరుతుంది..
అమ్మాయి పెళ్ళయి..
ఇంటి నుంచీ వెళ్ళి పోతుంది..
 
మహా పురుషులు..
యేమి చెప్పుకోవలసి వచ్చినా..
పరమాత్మతోనే చెప్పుకుంటారు...
వారి నిత్య మానసిక సంబంధం..
పరమాత్మ తోనే..
దుఃఖం వచ్చిందా..??
పరమాత్మతో..
సుఖం వచ్చిందా.. ?
పరమాత్మతో..
పిల్ల పెళ్ళి చేయాలా .??
పరమాత్మతో..
అంతే కానీ ..
యే అప్పుల వాడి దగ్గరికో కాదు..
 
కొంతమంది ..
సంసారంలో ఉండి సన్యాసులుగా జీవించారు..!!
కొంతమంది..
కొంతమంది సంసారంలో ఉండి ..
అపార ఐశ్వర్యం ఉండీ..
వానితో సంగం లేక జీవించారు..!!
మరికొంత మంది..
సంసారంలోనే ఉండి..
జ్ఞానులుగా జీవించారు..!!

ఒకసారి..
శంకర భగవత్పాదుల వద్దకు..
 బీద దంపతులు వచ్చారు..
"భగవన్ ..!
అమ్మాయి పెళ్ళి చేయాలి..
బీదవారం..
అందుకు పద్దెనిమిది బంగారు కాసులు అవసరమవుతాయి..
తమరు దయచేస్తారని ఆశతో వచ్చాం.."
 
భగవన్ బదులు పలుకలేదు..
"భగవన్ తమరు మహా శక్తి సంపన్నులు ..
సహాయం చేయండి.."
భగవన్ నుంచీ బదులు లేదు..
కాసేపయ్యాక..
"భగవన్ మేము వెళ్ళి వస్తాం.."
ఇంతలో ..
ఆశ్చర్యకరంగా..
"భగవన్ ..
తమకు ..
ఈ పద్దెనిమిది బంగారు కాసులూ..
సమర్పించుకుందామని వచ్చాం..
స్వీకరించండి.."
ఓ సంపన్న కుటుంబం ..
ఆచార్యులవారి పాదాల వద్ద ఆ కాసులను ఉంచారు..
శంకరాచార్యుల వారు ..
ఆ కాసులను..
ఆ బీద దంపతుల వేపుకు..
తమ సత్య దండంతో తోశారు..

ఆ బీద దంపతుల విజ్ఞాపనను..
కామాక్షి అమ్మవారికి నివేదించారు ..
వెంటనే ఫలితం వచ్చింది..
అంతే..
అంతటి మహిమా సమన్వితులు ..
నడిచేదైవం..!!

కడపలో అప్పటికే ..
నాలగైదు ఇళ్ళు మారారు..
ఇంటెడు సామాను..
అది కాక అయ్య పుస్తక భాండాగారం..
ఎద్దుల బళ్ళు ఉపయోగించేవారు అమ్మ. 
సామాను తరలించడానికి..
ఎద్దుల బండితో పాటూ ఇంటెడు సామానూ అయ్యేదాకా అన్నిసార్లూ అమ్మ తిరిగేది..
అబ్బ..
అమ్మ ఎంత కష్ట పడేదో..
అయ్య యేమీ పట్టించుకునే వారు కాదు..
 
అమ్మ కూడా ..
అయ్యకు ఆపనీ ఈ పనీ చెప్పి..
చులకన చేసేది కాదు..
అయ్యంటే ..
ఎంత భక్తో..
ఎంత గౌరవమో..
కొండమీది దేవునికి మల్లెనే అమ్మ అయ్యను చూసుకుంది..
ఎంత శ్రమ అయినా..
అది శారీరకమైనా..
మానసికమైనా ..అమ్మే భరించింది..
 
తెల్లటి శరీరం ..
జారుముడి..
నుదుట కుంకుమ బొట్టు..
మా అమ్మ పార్వతీ దేవే..
నాకు మా అమ్మ కళ్ళలో మెదలి..
కన్నుల నీరు కారిపోతోందండీ..
 
అలా ..
ఆలా..
ఆలూరు రాధాకృష్ణ వాళ్ళ ఇల్లు ఖాళీ చేసి..
ఇందిరమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం..
నేను అప్పుడు నాలుగో తరగతి..
కొద్ది రోజులయ్యాయో లేదో..
ఇందిరమ్మ ఇల్లమ్ముతానంది..
ఇరవై అయిదువేలట..
 
అమ్మ అనుకుంది..
ఇక లాభం లేదు..
ఈ అద్దె ఇళ్ళ బాధ భరించలేం..
ఎలాగైనా ఒక సొంత ఇల్లు కొనాలి ..
అయ్యకు చెప్పింది..
 
అయ్య ఆలోచనలోపడ్డారు.
కొనడానికి డబ్బేదీ..??
మళ్ళీ ఏ దైవమో దొరకడా.. ??
మాకు మళ్ళీ తిరిగి ఇవ్వక్కరలేని అప్పుల వాడు..
 
అయ్య అప్పుడు ఏ పూజ చేసారో ..
నాకు గుర్తు లేదు..
కానీ..
అప్పుడే ఎవరిద్వారానో ..
జిళ్ళెళ్ళమూడి అమ్మ పరిచయమైంది..

అబ్బా..
అమ్మంటే..
అమ్మే..
జిళ్ళెళ్ళమూడి అమ్మ..
తెల్లని విగ్రహం..
కనుబొమ్మల నడుమ పెద్దదైన బొట్టూ..
ముక్కుకి బులాకీయా ..
అదేనేమో ..తళ తళ మెరుస్తూ..
ముఖంలో ప్రశాంతత..
పెదవులపై చిరునవ్వూ..
ఇవి చాలవూ అమ్మకు..
 
బాపట్ల వెళ్ళాం.. అయ్యకు సన్మానం.
అక్కడినుంచీ ..
ఎవరో కారు అరేంజ్ చేసారు..
జిళ్ళెళ్ళమూడి చేరాం..
 
చిన్న గ్రామం..
అమ్మ దర్శనానికి తీసుకు వెళ్ళారు..
సిమ్హాసనంపై అమ్మ కూర్చుంది..
కాళ్ళు పెట్టు కోవడాఅనికి ఇంకో పీటలాంటిది..
అమ్మ పాదాలు చిన్నవి చిన్న చిన్న వేళ్ళు..
అందమైన మెట్టెలు..
అందరం నమస్కరించాం..
అమ్మ ప్రేమగా తల నిమిరింది..
బుగ్గలు నిమిరింది..
కళ్ళ నీరు తుడిచింది..

ఇక మనలోని పసివాడు బయటికి వస్తాడు ..
వాడినాపటం ఎవరివల్లాకాదు..
మనకు భగవంతుని దగ్గర దొరికేది కూడా ఇదే.. 
ఓదార్పు..
యే సమస్యకూ పరిష్కారం ఉండదు..
కాలమే చక్కని పరిష్కారం..

 
అయ్య ధారాపాతంగా ఏడ్చారు..
అంతటి పండితుడూ..
విద్యాహంకారి..
అష్టాక్షరీ మంత్ర సాధకుడూ..
వెక్కి వెక్కి యేడ్చారు..
 
ఎప్పుడో అయిదేళ్ళప్పుడు..
చేజార్చుకున్న అమ్మ ఒడి..
అమ్మ ప్రేమ..
అమ్మ లాలన..
అమ్మ..
నిన్ను పోగొట్టుకుని నేను తపించానమ్మా..

అమ్మా..
నీవు నన్నొదిలి ఎక్కడికి పోయావ్..
అమ్మా..
అమ్మా..
నీవు లేవు..
నీ ప్రేమ లేదు..
నాలో అగ్ని..
బడబాగ్ని..
దావానలం..
పుట్టింది..
 
అది నీవు కావాలనే కోరిక..
నిన్ను చేరాలనే దాహం..
సరస్వతియే నన్నావహించిందో ..యేమో..
అమ్మవై నీవే కటాక్షించావేమో ..
పుస్తకాలన్నీ చదివేసానమ్మా..
సంగీత సాహిత్యాలన్నీ ..
అణువణువూ వెతికానమ్మా..
నీకోసం..
నాకు వేనిలోనూ నీవు పూర్తిగా దొరకలేదు..
మంత్ర సాధన మంత్ర సాధన ..
అక్కడా నాకు ఆర్తే..
 

నీ ఒడి నాకు ఎప్పుడూ కావాలి..
నీవు నా దగ్గరే ఉండాలి..
నన్ను ఒదిలి ఎక్కడికీ వెళ్ళిపోకూడదు..

అమ్మ వింది..
కళ్ళలో జాలి కురిపించింది.
ఏడవకు నాన్నా..
నేను నిన్నొదిలి ఎక్కడికి వెళ్ళాన్రా..
నేను నిన్నొదిలి ఎక్కడికి వెళ్ళన్రా..

ఇంతలో ..
వెండి పళ్ళెం పేద్దది వచ్చింది..
అన్నం వడ్డించారు..
పప్పు వేసారు..
అమ్మ చారెడు నెయ్యి పోసింది..
నిజ్జంగా చారెడు నెయ్యే..
అమ్మ నెమ్మదిగా కలిపింది..
బంగారు ఉంగరాలు ..చిన్న చేతులు..
అన్నాన్ని కలిపాయి..
 
తరువాత..
చిన్న చిన్న ముద్దలు చేసి ..
అందరికీ అమ్మ ముద్దలు తినిపించింది..
అయ్యకొక ముద్దా..
నా కొక ముద్దా..
అమ్మ కొక ముద్దా..
 
అమ్మంటే మరిచిపోయాను..
నిత్య రామాయణ పారాయణలో ధన్యమైన ..
మా బంగారు అమ్మ.. 
ఆ అమ్మ ముందు ..
ఒక శక్తి స్వరూపం ..
మరొక శక్తి స్వరూపం ముందు..
ఆ క్షణాలు ..
నిజంగా ఎంత మధుర మైనవండీ..!!
 
అక్కడ ఉండీ ..
పాలు పంచుకున్న నేను ..
ఎంత అదృష్టవంతురాలినో..
 
అమ్మ చేతి గోరుముద్దలు..
అందరం సంతోషంగా తిన్నాం..

ఇల్లు కొనుక్కొవాలి సహాయం చెయ్యమ్మా..
అని అడగాలనుకున్న అయ్య
పునరావృత్తి రహిత నిజ శివ సాయుజ్య స్థితినివ్వమ్మా..
అని అడిగారు..
వింత కదూ..


అదేమి చిత్రమో ..
వెంట వెంట సభలు ..
వెంట వెంట సన్మానాలు..
అక్కడక్కడే ఏర్పాటయ్యాయి..
మాక్కావలసిన ..
ఇరవై అయిదు వేలూ సమకూరాయి..

చలంగా ప్రసిధ్ధుడైన గుడిపాటి వెంకటా చలం ..
సుప్రసిధ్ధ తెలుగు రచయిత ..
వేదాంతి ..
సంఘసంస్కర్త హేతువాది...!!


స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలకు ..
స్పందించి ..
హేతువాద దిశగా నడచి నడచి డస్సి పోయి..
చివరకు ..
అమ్మ ఒడిలో సేదతీరారు..
ఆస్తిక వాదులకు అమ్మ ఒడి ఉంది..
నాస్తిక వాదులకు ఒయాసిస్సు తప్ప యేముందీ..
 
ఎందుకండీ అరుణాచలం వెళ్ళారు 
అంటే పింగళి నాగేంద్ర గారు..
శాంతి కోసం అన్నారట..
యేం హేతువాద రహదారుల్లో శాంతి దొరకలేదా..


పై అభిప్రాయాలు గలిగిన చలం
 చివరికి రమణుల అభయ హస్తం లో విశ్రమించారు..
చిట్ట చివరికి ..
తనకు తానుగా 
తనలో తానుగా మిగిలినప్పుడు..
ఒటరితనం ముందు నిలవగలిగే శక్తి 
ఒక్క ఆధ్యాత్మికతకే వుంది..
దీనికి ఎవరు యే పేరుపెట్టుకున్నా సరే..



పుట్టపర్తి వారితో కలిసి..
చాలా ప్రయాణాలు చేశాను. 
వారూ, నేనూ కలిసి రమణాశ్రమం వెళ్ళాం. 
చలం గారిని చూశాం. 
ఆ కలయిక 
ఇద్దరికీ నచ్చలేదని నా అనుమానం. 
“జనప్రియ రామాయణం” లోని 
రామజనన ఘట్టాన్ని వారు
చలం గారికి చదివి వినిపించారు.
ఇక్కడ ఒక్కమాట..
రామ జనన ఘట్టం అత్యద్భుతంగా వుంటుంది..
కానీ..
“ఒక్క మాట కూడా నాకు అర్థం కాలేదు” 
అన్నారు చలం గారు.
“ఏం చేద్దాం ఎవడి స్థాయి వాడిది” 
అన్నారు పుట్టపర్తి వారు.


  అంటూ తన అనుభవాన్ని చెప్పుకున్నారు వల్లంపాటి వెంకట సుబ్బయ్యగారు.



ఈశ్వరుణ్ణి చూసినవారు లేరు. 
ఆఖరికి ..
చూశామన్నవారు గూడా లేరు..
ఈశ్వరుణ్ణి చూడలేదు..
 అనేవారూ లేరు.-- (ఆత్మకథ 124 పుట నుండి)
 
ఈశ్వరుడు ఉన్నట్టు రూఢీగా తెలిస్తే..
నమ్మనా? 
అంతవరకు ..
ఈశ్వరుడు లేనట్టూ రూఢీ లేదు మరి!
ఉంటే నమ్మడానికి నాకేం అభ్యంతరం? --(స్తీ 14వ పుట)
అన్న చలం..
రమణుల పాద దాసుడై ఆధ్యాత్మికోన్నతి కోసం చకోరపక్షిలా ఎదురుచూశాడు..

తోవలో ..
భగవాన్ కోసం ..
పళ్ళు కొనమంటే కొననన్నాను. 
ఆయనకి సాష్టాంగ పడమంటే పడనన్నాను. 
భగవాన్ ముందు..
 నిశ్చబ్దంగా కూచున్న ప్రజలలో కూచోడం ..
నాకు బాధగా వుంది. 
వొచ్చినప్పటినించి ..
ఎప్పుడు పోదామా..
అని దీక్షితులు గారిని వేధిస్తున్నాను. 
ఆశ్రమంలో మనుష్యుల్ని చూసిన కోద్దీ..
అసహ్యం పుడుతోంది. 
'యీ మహర్షి ఏదో దివ్య పురుషుడంటారు మీరు. మనుషుల్నే మారుస్తాడన్నారు. 
ఇన్నేళ్ళమట్టి ఆయనని అంటిపెట్టుకొని వున్న
 వీళ్ళ మొహాలిట్లా వున్నాయేమిటి.. ?'

ఆ రోజు ..
భగవాన్ కొండమీదికి వెళ్ళి..
 తిరిగి హాలులోకి. మా గుంపు వెనకనించి ..
భగవాన్ వొస్తున్నారు. 
అందరూ పక్కకి తప్పుకొంటున్నారు.
 నేనే కదలలేదు.., 
'చోటు వుంది, పక్కకి తప్పుకుపోతారులే ఆయన ' అనుకుని. 
భగవాన్ సమీపించేటప్పటికి ..
దీక్షితులుగారు నన్ను పక్కకి లాగేశారు. 
భగవాన్ ..
నన్ను దాటి వెళ్ళి చప్పున ఆగి, 
వెనక్కి తిరిగి ..
నన్ను ఓ గొప్ప చిరునవ్వుతో ..
ఓ నిమిషం చూసి వెళ్ళిపోయినారు. 
ఆ నిమిషాన నాకేమనిపించలేదు గాని, 
ఇప్పుడు తలుచుకుంటే, 
ఆ నిమిషం నించే ..
నన్ను జయించేసుకున్నారు భగవాన్
అనిపిస్తుంది...    
అని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు.

ఇంకా..
పాత భక్తులూ.., 
ఘరానా వాళ్ళూ ..
భగవాన్ కి దగ్గిరగా కూచునేవారు..
 నేను చిట్ట చివర కూచుని..
 ఆయన కళ్లలోకే చూస్తో వుండేవాడిని...
 ఒకసారి భగవాన్..
 తన దగ్గిర వున్నవాళ్ళని అడిగారు.., 
అందరూ లేచిపోయినా ..
కదలక కూచున్న నన్ను చూపి..,


ఎందుకు ..
అన్ని గంటలూ అట్లా కూచుంటాడు ' అని.
వాళ్ళేదో అన్నారు. 
అది నా కర్థం కాలేదు..
నాకేం కావాలి? 
ఆధ్యాత్మికోన్నతి...
ఆ సంగతి భగవాన్ కి తెలీదా ? 

ఇప్పుడు తెలుస్తోంది..
భగవాన్ ప్రశ్నకి అర్థం.
'నన్ను చూస్తో కూచుంటే ఏమొస్తుంది? 
తనకి తాను సాధించుకోవాలి కాని.. '
అనే స్థితికి వచ్చారు..


యేమైతేనేం ..
మేము..
 
సంతోషంగా ఇంటికి వచ్చాం..
ఆనందంగా ఆ ఇల్లు కొనుక్కున్నాం..
ఆ ఇంట్లో..
అమ్మ రామాయణ పారాయణ లెన్నో చేసింది..
అయ్యకు మరెన్నో గౌరవాలు జరిగాయి..
ఎన్నో శుభాలు జరిగాయి..
అంతటి మంత్ర పూతమైన..
ఆ ఇల్లు పర్యాటక స్థలంగా చేసి ..
ప్రభుత్వం అభివృధ్ధి పరిస్తే బాగుంటుంది..
కదూ..