23 జులై, 2012

కృష్ణ భక్తి- పుట్టపర్తి అనూరాధ



కడప 1 నవంబరు, 1967.                      సంచిక 9
                             
                            సంపాదకీయము. 

శ్రీ శ్రీ శ్రీ కంచి కామకోటి ధర్మ ప్రచార పక్ష పత్రిక సంపాదకులు: మహాకవి పుట్టపర్తి


రామోపాసన 
ఆంధ్రదేశమందున్నంతగా 
నితర రాష్ట్రములలో లేదని చెప్పవచ్చును. 
 దానికి కారణము..
రాముడాంధ్ర దేశమునందలి 
యనేక ప్రదేశములలో సంచరించుటయే. 

కేరళ దేశమందు కృష్ణ భక్తికే విశేషమైన వ్యాప్తి. 
 జయదేవుని గీతములకు 
విపులమైన ప్రచారమున్నది.
శాక్తము గూడ నెక్కువ. 

కన్నడములో ద్వైత భక్తులు 
విఠలమూర్తి నెక్కువ ప్రచారముచేసిరి. 
వీరశైవులు శివపరతత్వము బోధించిరి. 

తమిళమునందును 
రామభక్తులు చాలమంది యున్నారు 
బెంగాల్ ఒరిస్సా మొదలగు రాష్ట్రములలో 
కృష్ణ భక్తికే పట్టాభిషేకము. 

సమర్థ రామదాస స్వామి 
మహారాష్ట్రమున రామభక్తిని 
కొంతవరకు ప్రచారమునకు దెచ్చెను 
కాని యాదేశమున 
పాండురంగ భక్తులే ఎక్కువ. 

ఉత్తర హిందూస్తానములోముఖ్యముగా 
కృష్ణ భక్తికి బహుళ వ్యాప్తి దెచ్చినవాడు వల్లభాచార్యుడు..
ఇతడు కృష్ణదేవరాయలకు సమకాలికుడు 
హిందీలో అష్టచాప్ కవులు ప్రసిధ్ధులు 
వీరందరు వల్లభుడు ప్రసాదించినవారే 
భాగవత కర్త సూరదాసు వల్లభుల శిష్యుడు 
మీరా వల్లభుల శిష్యురాలు 

ఈ సంప్రదాయస్తులు 
నారీ వేషములతో నుందురు 
వీరి పీఠములు గుజరాతులో నెక్కువ 
వీరు కృష్ణునకు ప్రతినిధులని 
వారి శిష్యుల విశ్వాసము. 

గురువుల పాద తీర్థమును గూడ గైకొందురు. 
నమలిన తమ్మనల గ్రహించు నాచారమున్నది. 
అంతరంగ సేవయు గలదు 
ఏకాదశి నాడు కూడ తాంబూల సేవన మొనర్తురు. వల్లభుల నానాటి కాశీ పండితులక్షేపించిరి. 

కానీ విశ్వనాధుడే 
వల్లభుడు మహాభక్తుడని సాక్ష్యమిచ్చినాడు.
వల్లభుడు గొప్పపండితుడు 
ఇతని అణుభాష్యము ప్రసిధ్ధమైనది. 
మరికొన్ని గ్రంధములు వీరిపేరనున్నవి. 
వల్లభుడొక అపూర్వ వ్యక్తి. 
సామాన్యుల మనస్సుల కందడు. 

స్వామి నారాయణ మతము వేరొకటి యున్నది. 
వీరును కృష్ణోపాసకులే. 
వల్లభుల మతములోని కొన్ని యాచారములను ఖండించుటకిది మొదలయ్యెను. 
మహానుభావ సంప్రదాయము
మరియొకటి యున్నది. 
దీనిని నిర్మించినవాడు కృష్ణభట్టు. 
ఈ మతస్తులు నల్లని గుడ్డలను గట్టికొందురు. 
వీరు సన్యాసులే కాని క్షౌరము నిషిధ్ధము కాదు. 
కృష్ణ దత్తాత్రేయులను వీరుపాసింతురు. 

కృష్ణ చరితామృతము.. 
లీలానిధి.. 
లీలామృతము ..
అను కొన్ని గ్రంధములు 
వీరి తత్వమును బోధించును. 

హరిదాసు మతమని యొకటున్నది. 
 ఈ సంప్రదాయస్తులు 
బృందావనములో నున్నారు. 
రసిక పదము సాధారణ సిధ్ధాంతము 
మొదలగునవి వీరి గ్రంధములు.
 
"రాధావల్లభ" మతము మరియొకటి 
అక్బరు సమకాలికుడైన హరిదాసు 
ఈ సిధ్ధాంతమును ప్రచారములోనికి దెచ్చెను, బృందావనమందు రాధాకృష్ణులను ప్రతిష్టచేసినదీతడు. 

ఇంద్రియ సుఖమును 
భక్తితో సమన్వయపరచుటకు 
వల్లభాచార్యుడొనర్చిన ప్రయత్నమును 
వీరుగూడ నంగీకరించిరి.
 
హరిదాసు సమాధి 
బృందావనములో గలదు. 
"భక్తిమాల.. జీవదశ ..వేదగానం.."
అని కొన్ని గ్రంధములు వీరివి ఉన్నవి. 

కృష్ణ తత్వమును ప్రతిష్టించిన వారిలో 
నింబార్కుడు ప్రధానుడు 
వారి భాష్యమును 
ఔరంగజేబు నాశనము చేసెను. 
జయదేవుడీ సంప్రదాయమునకు చెందినవాడే 
వీరికి భాగవతము ప్రమాణ గ్రంధము. 
నిబార్క సిధ్ధాంతము ననుసరించువారు 
నేటికిని గోకులము.. బృంద ..
మొదలగు ప్రాంతములలో గలరు 
ఈ మతస్తులు పరమ శాంతులు 
భక్తిలో నాయక నాయకీ భావము ముఖ్యము 

"రత్నమాల.. రత్నమంజరి "
మరికొన్ని గ్రంధములు 
వీరి సంప్రదాయమును బోధించును 
శుకుడే భాగవతమతమను 
నొక సిధ్ధాంతమును ప్రవర్తింపజేసెను. 
శుకమహర్షి వ్రాసిన 
సూత్ర భాష్యము కూడ నొకటి యున్నదట.
"మీరా సంప్రదాయము"
గుజరాతునందెక్కువ ప్రచారములోనున్నది. 
బెంగాలులో చైతన్యుడు కృష్ణ భక్తిని ప్రచారమొనరించెను. 
వీరికి భాగవతము ..భగవద్గీత..
 ప్రమాణ గ్రంధములు 
సాధారణముగా కృష్ణభక్తులను 
ఉత్తర హిందూస్థానములో 
గోస్వాములని వ్యవహరింతురు

రూపగోస్వామిప్రసిధ్ధుడైన రచయిత 
ఆలంకారికుడు. 
కృష్ణ మతమును ప్రచారమొనర్చిన 
మఠములెన్నియో బింగాలు దేశమున గలవు.
 
కృష్ణుడెంత చిత్ర పురుషుడో 
కృష్ణ భక్తియునంత చిత్రమైనది. 
దాని నర్థము చేసుకొనుటకు 
సామాన్య హృదయములు చాలవు.
-పుట్టపర్తి అనూరాధ