5 జన, 2012

విదుషీమణి కవయిత్రి శ్రీమతి కనకమ్మ గారు


విశ్వనాధవారు మాఇంటికి తరచూ వచ్చేవారట..
అయ్యకూ ..ఆయనకూ పాండిత్యంలో సమాన స్థాయివున్నా..

అది ఆయన గుర్తించడం ఆయన గొప్పదనం..

పాండిత్యానికి మించి ..

అయ్యలోని పరమాత్మను గురించిన 
నిజమైన వేదన..
పారమార్థికంగా దేన్నో సాధించాలని..
దేన్నో చేరుకోవాలనే ఆరాటమూ..
ఆయనను ఆకర్షించి వుండవచ్చు..


మా ఇంటి వాతావరణం ..
నిత్య దారిద్యం..
నిరంతర పూజలూ .. జపాలు..
సంసారాన్ని పట్టించుకోకపోవటం..
ఇవన్నీ ఆయన్ని అబ్బురపరచి వుండవచ్చు..


ఇలాంటి మనిషికూడా ఈ లోకంలో వుంటాడా ..?

అని ఆయన ఆలోచించి వుండవచ్చు..

ఎప్పుడూ రమణులూ.. రామకృష్ణ పరమహం
లూ.. మదిలో తిరగాడుతూ వుండవచ్చు..

కానీ..
వారు చెప్పిన దాన్ని త్రికరణ శుధ్ధిగా ఆచరించ ప్రయత్నించడము సామాన్య విషయం కాదు కదా..
దానిలో అయ్య ఏమైనా సాధించారో.. లేదో..
అది తరువాతి విషయం..
ఈ రోజు కమలాలతో పూజ చేయాలి ..
అని అయ్య నోటి వెంట మాట వెలువడిన తక్షణం ..
పది మంది శిష్యులు ..            


ఏ ఎర్రగుంట్ల సమీపంలోని చెరువుకో ..
దువ్వూరు దగ్గర కొలనుకో.. 
వెళ్ళి తెల్ల తామరలు గోనె సంచుల నిండా పట్టుకొచ్చే వాళ్ళట..

ఫోటోలు పెట్టి ..శుక్రవారం మంగళవారం..
లక్ష్మీ నారాయణులకు పూజలు..
నిత్యం వండుకోవటమూ.. తినటమూ.. 
ఉద్యోగ వ్యాపారాలు విర్వహించుకోవటమూ ..
మానవులపని ఇంతే కదా..
మహా అయితే ఏ రోజో ఇంత పూజచేసి ..
ఒక కొబ్బరికాయ కొట్టి ..
గోవింద అని .. పూజ చేశామనిపించు కోవటమే తప్ప..
మరి విజయవాడలోని విశ్వనాధ ..
కడపలో అయ్యను వెతుక్కుంటూ రావటమూ..
అయ్యతో సాహిత్య చర్చలూ..
వంట ఇంట్లోని అమ్మకు రామాయణ కల్పవృక్షంలోని పద్యాలను వినిపించటమేమిటీ..
అమ్మ వానికి మూలంలోని శ్లోకాలను ఉదహరించటమేమిటి..
ఒక దశలో ఆయనా ..
అమ్మ అమ్మతనం ముందు పసిపిల్లవాడయిపోయారేమో నని నాకనిపిస్తుంది.. 


కానీ.. 
అమ్మ..
అయ్యకు సాహిత్యంలోనూ చేదోడు గా నిలచి..
అయ్య వెంట నీడలా నడచి ..

పిల్లల భవిష్యత్తును 
తన చేతనైనంత వరకు చక్కదిద్ది..
తన జీవిత పరమావధిగా పెట్టుకున్న 

రామాయణ పారాయణలోనే 
తన ముప్పావు వంతు జీవితాన్ని 
వెచ్చించిన అమ్మ..

చాలా దయనీయంగా ..
చాలా అన్యాయంగా చనిపోయింది..
నిరంతరం భగవన్నామం చేసే..
అమ్మకు బ్రెయిన్ క్యాన్సరు వచ్చింది..

ఏ బుధ్ధిలో 

రామాయణం అహరహమూ పారాడిందో..
ఏ బుధ్ధిలో 

దారిగాచె శబరీ రాముండిటు వచ్చుననీ ..
పూ గొనునటంచు.. 
అని శబరి సాక్షాత్కరించిందో..

ఆ బుధ్ధిలో 

క్యాన్సరు పుండు మహమ్మారియై ..
అమ్మను మింగేయటానికి అడుగుపెట్టింది.
ఆ తర్వాత 

అమ్మకు ఫిట్స్ స్టార్ట్ అయ్యాయి..
బ్రెయిన్లో రక్త ప్రసారం జరగటం లేదన్నారు..
ఎంత శారీరక బాధను అనుభవించిందంటే..
శత్రువులకు కూడా అంతటి బాధ రాకూడద
అమ్మను ముందుకు వంచి

కడుపులో తల వత్తి పట్టి ..
వెన్నులోకి పేద్ద సూదిని గుచ్చి ..
మెదడులోని నీరు తీయాలన్నారు..
అమ్మ ఊపిరి అందక కేకలు వేస్తే ..
అక్కడి మగ నర్సులు.. ఆయాలు ..
మమ్మల్ని పొమ్మని ..
వారు పది మంది అతి కర్కశంగా నొక్కి పట్టి ..
వెన్నులోకి సూదిని ఎక్కించారు..

ఇంత బాధ 

ఆ రాముని నమ్మిన ఆ శబరికి ఇవ్వటం 
ఆ రామయ్యకు న్యాయమా..??
రోజు రోజుకూ అమ్మ పరిస్థితి దిగజారిపోతూంది..
ఒక చేయి ఒక కాలు పడిపోయి పూర్తిగా పడకకే పరిమితమైపోయింది.
కనులవెంట 

ధారగా కన్నీరు కారిపోయేది..

ఆ రామయ్యకు ఎంతగా 

వేడు కొలుపులు ప్రాణ నివేదనతో చేసిందో 
నా తల్లి..
మరి ..
ఒక పక్క అయ్య కూడా 
పసివాడితో సమానమే..
అమ్మ వేదనను రామయ్య వినలేదు..
నా ప్రార్థన సీతమ్మ తల్లి ఆలకించలేదు..
మా అయ్య సగ ప్రాణాన్ని 

తనతో తీసుకునే పోయాడు కర్కశుడై రాముడు.

ఎందరి సమస్యలకో ..
తన పారాయణలో పరిష్కారం వెదకిన నా తల్లి ..



తన సమస్యలను 
ఆ రామునిపై వదలటం తప్ప యేం చేయలేకపోయింది..

తన కర్మను 

నిశ్శేషంగా అనుభవించిందన్నారు..
ఇప్పుడామె యోగస్థితిలో వుందన్నారు..

పరమేశ్వరుని లీలలు భక్తులకు తప్ప 

యెవరికి అర్థమౌతాయి..?

భగవంతుని చేతలకు భక్తులు 
మహత్తరమైన అర్థాన్ని వెతుక్కుని ఆనందపడుతుంటారు..
  


నేను అయ్యను ..అమ్మను ..
ఏ వివేకానందులతోనో రమణులతోనో 
పోల్చటానికి ప్రయత్నిస్తున్నానని.. అనుకోకండి..

చిన్నతనం నుంచీ మేము చూసిన మా అమ్మ అయ్యలను మీ ముందుంచుతున్నా..

అయ్యకు సంబంధించిన 

జ్ఞాపకాలు..
విషయాలు ..
కాలగర్భంలో కలిసిపోకూడదని..
విజ్ఞులు మీరే ఆలోచించండి..






విదుషీమణి  కవయిత్రి శ్రీమతి కనకమ్మ గారు
Dr.నందుల రామలింగేశ్వరుడు.





శ్రీమాన్ పుట్టపర్తివారి సాహిత్య సమాలోచనాన్ని సాగిస్తున్నప్పుడు ..
మనకొక అజ్ఞాత సాహితీ విదుషీమణి తారసపడుతుంది.
ఆమె పేరు కనకమ్మ గారు..

ఆ మహా ఇల్లాలు సాక్షాత్తూ..
శ్రీ పుట్టపర్తి వారి సతీమణి..

ఆమెగారి సంపూర్ణ సహకారం పుట్టపర్తి వారికి పుష్కలంగా లభించిందనే చెప్పాలి.

ఆమె శ్రీమాన్ ఆచార్యులవారి నిజ జీవితంలోనూ ..
సాహితీ జీవనంలోను ..
ముమ్మూర్తులా అర్ధాంగియే.


సరస్వతీ పుత్రుని రచనా వ్యాసంగంలో ..
ఆమె గారి సంపూర్ణ సహకారం సర్వదా లభించేదని స్పష్టమౌతొంది.

ఆమె గారి ప్రోత్సాహమే శ్రీవారిని బహుముఖ ప్రజ్ఞా వంతుని గావించింది..

శ్రీమతి కనకమ్మ గారు ..
అలనాటి ఉద్దండ పండితులైన శ్రీమాన్ ధన్నవాడ రాఘవాచార్యులుగారి మనుమరాలు..
సంస్కృతాంధ్రాలో..
ఆమె గారికి మంచి పాండిత్యం పారంపర్యంగా లభించింది. వాల్మీకి రామాయణం వారికి కంఠస్ఠం . 
చక్కని ..చిక్కని ..
పాండిత్యం చేజిక్కించుకున్న విదుషీమణి ఆమె . 

గృహ కలాపాల నుండి బయటపడిన పిదప..
ఆమె తీరిక సమయాలలో ..
తనలో తలెత్తిన తీవ్ర వేదనను ..
కవితా ఖండికల రూపంలో అభివ్యక్త పరచటం సర్వసాధారణాంశం.

పుట్టపర్తి దంపతులు అగ్నివీణ..
గాంధీజీ మహా ప్రస్ఠానం ..
కలిసి వ్రాసి వారే స్వయంగా ప్రచురించారు. 

శ్రీమతి కనకమ్మ గారు స్వయంగా సంస్కృతంలో రామ సుప్రభాతం నరసిమ్హ సుప్రభాతం రచించారు. 
తెలుగులో పార్థసారధి సుప్రభాతం రాసారు. 

ఆమె గారు తన రచనలు చేయటం కంటే ..
తమ శ్రీవారి రచనలను వ్రాయటం లోనూ..
వారికి సహాయ పడటంలోనూ..
సంతృప్తి పొందిన సాధ్వీమణి..


1936 లో పుట్టపర్తి వారు శ్రీమతి కనకమ్మ గారిని సహధర్మచారిణిగా స్వీకరించారు. 
నాటినుండి ఆమెకు కుటుంబ బాధ్యతలతో పాటూ 
శిష్యులతో సాహిత్య పునశ్చరణ చేయించటం ..
మంత్ర లోపాలను సవరించటం ..
కూడా ఒక బాధ్యతగా తయారైంది. 


తీరిక సమయాలలో..
ఆమె రహస్యంగా వ్రాసుకున్న కవితా ఖండికలు
ఒకసారి ఆచార్యుల వారి కంట పడ్డాయి.

వానిలోని స్త్రీ సహజమైన కోమలత్వం ..
భావ ప్రకటనలోని పరిపక్వత భాషా సౌందర్యం ..
ఆచార్యుల వారిని బాగా ఆకట్టుకుంది. 



వెనువెంటనే ..
వారే స్వయంగా వానిని పత్రికలకు పంపటం ..
అవి ముద్రించబడి ..
సహృదయులైన పాఠకుల అభిమానాన్ని చూరగొనడం క్షణాలలో జరిగిపోయింది. 

నాటి నుండీ ..
అడపా దడపా ..ఆమె గారి రచనలు పత్రికలలో ముద్రితమౌతూనే వచ్చాయి.

మహాత్మా గాంధీ దారుణ హత్యకు గురి కావటం..
ఆ దంపతుల కవి హృదయానికి పెద్ద గాయమైంది.



వారి శోకం గాంధీజీ మహా ప్రస్థానం అందులోని మొదటి మజిలీ మొత్తం పుట్టాపర్తి కనకమ్మ గారిదే. మూర్చనలు పోయింది.


ఆమె భావాలు లలిత పరంపరకి ప్రతీకలు..
మహాత్ముని మరణాన్ని శ్రీమతి కనకమ్మగారు ఇలా సంభావించారు. 
ఆ భావాలలోని మధురిమను ఆస్వాదించటం మనవంతు.

ఎన్ని సుమములో భువి జనియించు గాని..
ఆ సురభిళమ్ము పువింక యవని లేదు..!!
మధుకరము లేడ్చులే బిట్టు మసలి మసలి..
వెనుదిరుగునేమె..? గడిచిపోయినవి కలలు..!!

శ్రీ కనకమ్మ గారిది భక్త హృదయం..

వాల్మీకి రామాయణమంటే ఆమెకి పంచ ప్రాణాలు వారానికో మారు రామాయణాన్నంతా పూర్తిచేసి ..


ప్రతి శనివారం ..
పేద్ద యెత్తున పట్టాభిషేకం చేసి పారాయణ ముగించటం మరుసతి రోజు మళ్ళీ పునః ప్రారంభించటం ఆమెకు ఆనవాయితీ.

ఆమె పాండిత్యాన్ని పుట్టపర్తి వారి మాటలే మనకు తెలియజేస్తాయి.

నా భార్య 387 సార్లు రామాయణాన్ని పారాయణ చేసింది
విశ్వనాధ సత్యనారాయణగారు మా ఇంటికి వస్తే
వంట ఇంట్లో నా భార్యకు తన కల్ప వృక్ష పద్యాలను వినిపించే వాడు. 
ఆ పద్యాలకు corresponding verses ఆమె మూలం నుంచీ చెబుతుండేది.
ని వారే స్వయంగా చెప్పారు.
ఆమె పాండిత్యం..
రామాయణ పారాయణ ప్రావీణ్యం..
ఆయమ్మది అంతటిది.
శ్రీ రామచంద్రుడు ఆమె ఆరాధ్య దైవం...

ఆచార్యులవారు రచించిన శ్రీనివాస ప్రబంధంలో 
ఆమె ప్రసక్తి యెలా వుందో గమనించండి..

మద్భార్య వాల్మీకి మారంద మాధుర్య..
రచనా విశేష విక్రాంత హృదయ..

అని వారు ఆమె పాండితిని ఆవిష్కరించారు.
శ్రీరాముని గూర్చి పరమ తారకనామ ముద్రలో అనేక భక్తి రచనలను చేసారీమే.

నేటికీ ఆకాశవాణి కేంద్రాలనుండి అయ్యవారి అష్టాక్షరీ రచనలు ..
అమ్మగారి తారక రాముని ప్రస్తుతి గీతాలు..
భక్తి రంజనిలో వస్తూనే వుంటాయి.

విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుండీ..

రాముని సేవించెను ప్రేమమ్మున సకల ప్రకృతి

 అన్న భక్తి కీర్తన నిరంతరం వి
నినిపిస్తూనే వుంటుంది.
అది కనకమ్మ గారి రచనయే...
కాని..
ఆమె గారిపేరు ప్రచారం లోకి రావాలనే ఉబలాటం ఆమెకి యే మాత్రం ఉండేది కాదు.

ఆమె యెల్లవేళలా అయ్య గారికి "వ్రాయసగత్తె" (స్క్రైబ్ గా) పనిచేయటంలోనే అమితానందాన్ని పొందేది.
అయ్యగారు TTD దేవస్థానం వారికి వ్రాసిన "భాగవత సుధా లహరి" సంపుటాలన్నీ స్వామివారు చెపుతుంటే ఆమె వ్రాసినవే...
ఆమె మరణానంతరం నిజంగా ఆపని ఆగిపోయింది. 


 ఆచార్యుల వారిలో ఒక నిర్లిప్తత.. 
నిరాసక్తత ..
చోటు చేసుకున్నాయి..
ఆమె గారి లేఖిని నుండి "కురుమూర్తి విలాసం" అన్న నాటకం వెలువడింది 
కాని అది వెలుగు చూడలేదు. 
ఆమె కవితా ఝరి మనోహరమైంది. 

అగ్నివీణ తెండవ మూర్చనలో 
ఆమె వ్రాసిన పద్యంలో యెంత స్త్రీ హృదయం వుందో ఊహ కందదు.
హృదయమే లేని రాముండు ప్రేమ మయిని
విడిచినాడి చాకలి వాని నుడుల కొగ్గి..
హృదయముండిన సీత జీర్ణించుకొన్న
దాత్మ దూఖంబు దయితుని యశము కొరకు..




అంటుందామె. 

రామునికి హృదయం లేకపోయినా 
సీతకు మాత్రం ఆత్మ ఉంది. 
ఆమె ఏకైక లక్ష్యం తన భర్త కీర్తి..
అందుకే దుఃఖాన్ని ఆత్మలో దిగ మింగిందని..
ఆమె ఆ ఘట్టాన్ని చక్కగ వ్యాఖ్యానించింది.

శ్రీమతి కనకమ్మ గారి సాహిత్య సేవను గమనించిన ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడ
మి అంతర్జాతీయ మహిళా సంవత్సరాన్ని పురస్కరించుకొని..
ఆమెను 27.11.1975 న 1974 సంవత్సరపు ఉత్తమ కవయిత్రిగ సమ్మానించి తన కీర్తిని నిలుపుకొంది.


శ్రీమతి కనకమ్మ గారి రచనలలో..
శ్రీరామ సుప్రభాతం వంటివి కొన్ని వెలుగు చూచినా..
ఇంకా చాలా రచనలు అముద్రితంగానే కాలం వెళ్ళదీస్తున్నాయి.
బహుకుటుంబీకురాలైన ఆమెను అందరూ అత్యంతాదరాభిమానాలతో గౌరవించటం హర్షించదగింది.
ఆమెను మాతృ మూర్తిలా పూజించే ఆత్మీయులూ శిష్యవర్గం నేటికీ వుందంటే ఆశ్చర్యం కదూ..
శ్రీ స్వామివారి వ్యక్తిత్వంలో పూర్తిగా కలిసి పోయి..
వారి కీర్తి పరిమళం లో ..
తన జీవన సుమ సుగంధాన్ని కలబోసిన ..
అపర పతివ్రతా శిరోమణి ..
కుంకుమ సౌభాగ్యవతి గానే తనువు చాలించింది (1983)

అల్లాంటి సహధర్మచారిణీ దొరకటం..
పుట్టపర్తి వారి అదృష్టం..
ఆయన జీవన నౌకకు ఆనాడే చుక్కాని విడిపోయింది.
తదాది ..
ఆచార్యులవారు అంతర్ముఖులై ..
నారయణ స్మరణ మాత్రంగానే శేష జీవితం గడిపారు.
ఆచార్యులవారి బహుముఖ ప్రజ్ఞా పాండిత్యాలకు..
ఆమె చేయూతయే ఆలంబన..
వారిరువురిదొక అపూర్వ దాంపత్యం..
ఆ దంపతులదొక విశిష్ట సాహితీ సంగమం.
అదొక అజరామరానుభూతి.

అందుకే..
శ్రీ పుట్టపర్తి దంపతులు సాక్షాత్తూ లక్ష్మీనారాయణులు..
వాణీ చతుర్ముఖులు..
శివాశివులు..
ఆ అపూర్వ సాహితీ సంగమ మూర్తులకు నా కైమోడ్పులు.