13 జూన్, 2012

శ్రీనాధుడు.






''చిన్నారి పొన్నారి ..
చిరుత ప్రాయమునాడు ..
రచియించితి మరుత్తరాట్చరిత్ర ..''
బాల్యములోనే బృహత్కావ్యాన్ని  రచించిన 
ప్రౌఢకవి శ్రీనాధుడు.
  
పల్నాటి వీర చరిత్రము
భీమ ఖండము వంటి కావ్యాలను వ్రాశాడు.

కొండవీటి ప్రభువు 
సర్వజ్ఞ సింగ భూపాలుని ఆస్థానకవి
డింఢిమభట్టు అనే పండితుడిని 
వాగ్యుధ్ధంలో ఓడించి 
అతని కంచుఢక్కను పగులగొట్టించినాడు. కవిసార్వభౌముడనే 
బిరుదమును కలిగినవాడు. 
 శ్రీనాధునికి కనకాభిషేకం జరిగింది.. 


భోజన ప్రియుడు..
ఎన్నో భోగాలననుభవించాడు.
 శ్రీనాధ మహాకవి చాటువులు మహా ప్రసిధ్ధి.
శ్రీనాధునిపై పుట్టపర్తి వారు వ్రాసిన 

ఈ వ్యాసరాజం 
శ్రీనాధుని లోని వివిధ కోణాల్ని 
ఎంతో చక్కగా ఆవిష్కరిస్తుంది.
 
ఆనాటి శాస్త్ర చర్చలు..
తల చెడిన వారి విషయంలో 

శ్రీనాధుని వెకిలితనం ..
 

జీవితములోని ఎచ్చుతగ్గులను 
అంతగా పట్టిం చుకొనని అతని వైఖరి..
శృంగార రస పోషణ రచనలో జీవితములో
 
ఆయన కవిత్వాన్ని జీవితంలో గాఢంగా అతికించుకున్న వైనం 
 ఇవన్నీపుట్టపర్తి వారి వ్యాఖ్యలలో 
కొత్త నిగారింపులందుకున్నాయి.

  
నిరాశ్రయుడైనా .., 
భోగి అయినా..
ఈశ్వరార్చనాతత్పరుడు ..

క ళాశీ లుడు  ..
లోకజ్ఞుడు..

మహా కవులలో 
 తెలుగు కవిత్వాని పుష్టివంతం చేసిన మహానుభావుడు శ్రీనాధుడు..

కానీ చివరికి..
శ్రీనాధుని జీవితమూ..
దుర్భరంగా గడిచింది..
ఎంతవారైనా కాలానికి అతీతులు కాదని మనకనిపిస్తుంది.

కొండవీటి ప్రాభవంతో పాటు 
శ్రీనాధును ప్రభ కూ చీ డ ప ట్టి న ది
ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టేయి. 

కృష్ణాతీరాన ఉన్న గ్రామాన్ని గుత్తకు తీసుకొని 
శిస్తు కట్ట ని కారణంగా 
ఆయన భుజంపై 
ఊరిబయటనున్న శిలను ఉంచి 
ఊరంతా  ఊరేగించేరని 
ఆయన చరమ పద్యంద్వారా తెలుస్తుంది.
కానీ కాలమనే పుస్తకంలో 
ఎప్పటికీ మసకబారని సంతకం శ్రీనాధునిది..






శ్రీనాధుడు..
శ్రీనాధుడు ఎంత చక్కని పేరు.. 
పెట్టిన మారయ్య 
గొప్ప సంస్కారియై యుండవలెను. 
తండ్రిని గూర్చి శ్రీనాధుడు
 "విద్యారాజీవభువు"డని వాక్రుచ్చెను
 అనగా విద్యలకు బ్రహ్మ వంటి వాడు ! 
చాలా పెద్దమాట.. 

ఆ కాలమున విద్యలనగా శాస్త్రములు 
మారయ్య సాహిత్యమునకు తోడు 
శాస్త్ర వ్యాసంగము కూడ జేసియుండెనేమో.. 

అతని పేరిట కావ్యమైయును లేదు 
అతడు వ్రాయనేలేదేమో..
లేక ..వ్రాసిన కావ్యము కనపడుట లేదో ..

చదువు కొన్నంత మాత్రమున
రచన చేసి తీరవలెనను..
 నియమేమున్నది..?

చక్కగా చదువుకొని.. 
కీర్తి కండూతి లేని వారిని ..
యేందరినో నేనెరుగుదును. 

మారన్న యట్టివాడేమో.. 
తాతను మాత్రము ..
శ్రీనాధుడు చాలా గొప్పగా జెప్పికొనెను. 
అతడు "వినమత్కాకతిసార్వభౌముడు" 
కవితా విద్యాధరుడు. 
ఇది బిరుదమో ..పొగడ్తయో.. తెలియదు. 

'కనకక్ష్మాధర ధీరుడ'ట.. 
వారిధితటమునందున్న క్రాల్పట్టణమును పరిపాలించుచుండిన వాడు 
"పద్మ పురాణములు"ను 
సంగ్రహీకరించి కవిత్వమల్లెను 

గడచిన దశాబ్దములలో 
శ్రీనాధుని జన్మస్థాన చర్చలు రేగినవి. 
మచిలీపట్నము నకు గొందరీడ్చిరి. 
కొందరు "కర్నాటకమున' పడవేసినారు.
 శ్రీనాధుడు 'మావాడ'ని నెల్లూరివారందురు. 

కొండవీటి రెడ్లు 
నెల్లూరినుండి తరలిపోయిన వారట.. ఆయభిమానముతో ..
శ్రీనాధుని తెరకెక్కించి యాడించిరట.. 

ఇంతకు నతడు ..
దన స్వగ్రామమున యుండెనో..? లేదో..?
చూచెనో ..?లేదో..?

ఒకడెవడో మర్కట బుధ్ధి 
శ్రీనాధుని పేరు' సీనయ్య' యై యుండుననియు 
ప్రసిద్ధుడైన తరువాత ..
శ్రీనాధుడుగా మారెననియు వ్రాసినట్లు గుర్తు 
ఇది యాశిఖాంతము కొంటెవాదము.

సీనయ్య శ్రీనివాసుడగునే గాని ..
శ్రీనాధుడు గాలేడు.

దగ్గుపల్లి దుగ్గన నాసికేతో పాఖ్యానములో..
 శ్రీనాధుని పాండిత్యమునిట్లు చెప్పినాడు..

సి 11 "సంస్కృత ప్రాకృత సౌర సేనీముఖ్య
భాషాపరిజ్ఞాన పాటవంబు..
పన్నగపతి సార్వభౌమ భాషిత మహా
భాష్య విద్యా సమభ్యా సబలము..
నక్షపాద కణాద పక్షిలో దీరిత
న్యాయకళా కౌశలాతిశయము..
శృతి పురాణాగమ స్మృతి సాంఖ్య సిధ్ధాంత
కబళన వ్యుత్పత్తి గౌరవంబు..
పూర్వకవి ముఖ్య విరచితా పూర్వ కావ్య
భావరస సుధాచర్వణ ప్రౌఢతయును
కందళింపంగ కాశికాఖండ నైష
ధ ప్రముఖ వివిధ ప్రబంధము లొనర్చి.."

పై పద్యములో ..
మహా భాష్య ప్రసక్తి వచ్చినది. 
ప్రాచీన నవీన తర్కములు చదివినవాడు 
పూర్వోత్తర మీమాంసలు పరిశోధించి యుండెను. 

కొంత వేదాధ్యయనమును..
ఇవన్నియునట్లుండగా.. 
సంస్కృతములోని ప్రౌఢకవులనందరిని.. జీర్ణించికొన్నాడు.

 నన్నయ్యగారి
'ఉభయ వాక్ప్రౌ ఢీ 'స్వాధీనమైనది. 
తిక్కన్న 'రసాభ్యుచిత బంధమునూ 'పసికట్టినాడు.
ప్రబంధ పరమేశ్వరుని 'సూక్తివైచిత్రీ 'దక్కినది. వేములవాడ భీమకవి యొక్క 
'యుధ్ధండలీల'
యతని జీవితములోనే యొక భాగము. 

సంస్కృతములో 
బాణుడు ..
మయూఖుడు.. 
బి ల్హ ణుడు ..
ఒకడేల 
ప్రౌఢకవులందరును 
శ్రీనాధుని నాల్కపై నాడుదురు. 

నైషధములో 
" మాఘ భారవి వచోమకరంద నిష్యంద 
మాధుర్యమునకు సమ్మదము నొంది " అన్నాడు.

భారవి శ్రీనాధున కందడు. 
అతడు మహా సం యమనశీలి. 

మాఘుడు భారవి ననుసరించుటకు 
యాతన పడినవాడు..
అనుసరింపలేని వాడు ..

"హరవిలాస"మందలి కిరాతార్జునీయ కధకు 
భారవితో సంబంధములేదు. 

శ్రీనాధుడు సర్వాంగీణ కీర్తి ఖర్జువు. 
ప్రతిభకన్న పాండిత్యమెక్కువ. 
పై జెప్పిన చదువంతయు 
శ్రీనాధునకు సుమారిరువదియైదేండ్లు 
లోపుననే ముగిసియుండును . 

ఆ జీవితము ననుసరించి ..
ఆ చదువు లబ్బుట నా కబ్బురము గాదు. 
వేదాంత దేశికులు 
" వింశత్యబ్ధే విశ్రుత నానావిధ విద్యః" 
అని తామే చెప్పికొన్నారు. 

చదువు తరువాత..
 శ్రీనాధుడు కొంత కచ్చి పోతు. 
తన ప్రక్కన తనంతది వాడొకడుండరాదు. కాశీఖండములో వింధ్యముతో 
శ్రీనాధుడీ పద్యములనిపించినాడు.

తే 11    "శాస్త్ర  మాచార్య సన్నిధిఁ జదువడేని
              నిధ్ధ బోధంబు మరి సంగ్రహింపడేని
              తెగువమీరి ప్రతిజ్ఞ సాధింపడేని
              జ్ఞాతిజయ మందడేని తజ్జనుడు జనుడె..?

ఉ 11    " కంటికి నిద్ర వచ్చునె సుఖం బగునే రతికేళి..? జిహ్వకున్
               వంటక మిందునే ఇతర వైభవముల్ పదివేలు మానసం
               బంటునె  మానుషంబు గల యట్టి మనుష్యున కెట్టివానికిన్
               గంటకుడైన శాత్రవుడొకండు తనంతటి వాడు గల్గినన్.."

ఈ రెండు పద్యములను ..
సందర్భములో నదుకలేదనుట స్పష్టమే..
ఎప్పుడో వ్రాసినవి జోడించినాడు. 
అతనికీ యలవాటు కద్దు..!

కొండవీటిలో వామన భట్టబాణుడుండెను. 
అతడొక యుధ్ధతుడు. 
శ్రీనాధుడచట నున్నపుడాతనితో 
స్పర్థతప్పినదిగాదు.

వామన భట్టబాణుడు..
 విద్యానగరమునుండి వచ్చి 
రెడ్డి రాజుల నాశ్రయించినాడు. 
అతనికి డిండిములపై నభిమానము.

శ్రీనాధుడు 
డిండిములతో వాదించుట కిదియు నొక కారణము. 
కవి సార్వభౌముడు రెడ్ల విద్యాధికారి. 
బహు దేశబుధులతో సంభాషణము 
భాషణమనగా ఘర్షణయే..

'పూర్వపక్షము'తో నారంభమగును. 
తరువాత కుశల ప్రశ్నలు ..మర్యాదలు..
 తాము పరిశ్రమించిన శాస్త్రములందు
 వారి యభినివేశము గూడ మూర్ఖము. 

మనకు నవ్వు వచ్చును..
 ఏ శాస్త్రమును పూర్తిగా రాదుగనుక ..
ఇంతకును మొదటి పూర్వ పక్షము 
సల్లాపము మాత్రమే. 

జట్లు పరస్పరము భుజములు రాచికొన్నట్లు. 
జయాపజయములు నిర్ణయము 
సభలలో పండితుల యెదుట ..
రాజునెదుట..

సల్లాపములో 
"క్రోడపత్రము" ల రహస్యములు బయటపెట్టరు. 
వానిని విప్పుట వాదములందే. 
సల్లాపములలో ..
శాస్త్రసామాన్య విషయములపై చర్చలుండును. 
భారతములో విరాటపర్వములో..
నొక ఘట్టము వచ్చును

గోగ్రహణమునకు వెడలిన యర్జనుడు
 భీష్మ గురు కృపుల చరణముల బడ
 రెండు బాణములు వేసినాడు. 
అది నమస్కారము..!

రెండేసి బాణములు 
కర్ణములు దూసిపోనేసెను. 
అది కుశల ప్రశ్న..!
వీరుడిది గాక మరియేమి సేయును..!

శాస్త్రకారులు గూడనంతే.. 
వారును వీరులే. 

తిరుపతిలో కపిస్థలం దేశికాచార్యపాదులుండిరి. 
వారు మహామహోపాధ్యాయులు. 
క్రోడపత్రములకు నిధి. 
అవి లేనిది వాది విజయము కష్టము 

శ్రీనాధుని తలలో 
నాక్రోడ పత్రములెన్ని యుండెనో 
ఇది వాదమునకు పెట్టుబడి. 
ఆ పైని ప్రతిభ.

దానికి మెరుగువెట్టు సమయస్పూర్తి. 
ఇర్వురు పండితులు వాదించునప్పుడొక 
మధ్యవర్తి యుండును. 
అతడు వీరిర్వురికంటి కాగవలెను. 
ఇరువైపులను 
వారి వారి శిష్యప్రజయుండును. 

వీరు " పింపాటగాండ్రు " 
రెండు వైపుల తాళపత్ర గ్రంధముల కుప్పలు 

సాధారణముగా శాస్త్రచర్చలు 
వాచో విదేయములే. 
అవసరమైనప్పుడు గ్రంధములనుండి తోడి పండితులాధారమునెత్తి చూపుదురు. 
వాదములు సంస్కృతములోనే ..

నడుమ.. నడుమ ..
బూకరింపులు..
రుపులు..
పరస్పరావహేళనములు.. 

కొందరి వాదవైఖరి 
మహా చిత్రముగా నుండును ..
వారికి సిధ్ధాంత గ్రంధములకంటెను 
పూర్వపక్ష గ్రంధములపై గొప్ప నధికారము. 

ఉత్తరాది మఠస్వాములు 
సత్యధ్యానతీర్థులుండిరి. 

వారు ద్వైతులు. 
దానశూరులు. 
వారి కాదిశంకరుల గ్రంధములు కొట్టిన పిండి. 

వాదములలో ..
శాంకర గ్రంధములలో ..
పరస్పర వైరుధ్యములు జూపెడివారు. 
పూర్వపక్షమునకే యవకాశమివ్వరు. 

వీరు జూపించు విరోధముల నెత్తిపోసికొనుటలోనే ప్రతివాదులకు సరిపోవును. 
ఇది యొక మహా ప్రతిభ. 

కళాశాలాధ్యక్షులు సుబ్బారావుగారుండిరి. 
అది యొక జ్ఞానప్రధానావతారము. 
వారే శాస్త్రములో పూర్వ పక్షము జేసినను 
సమాధానము వారు చెప్పవలసిందే.. 
అట్టి వాద సభలు కాళిదాసన్నట్లు
 "కాంతం క్రతుం చక్షుషం " 
అంతే..

నేడా వ్యాసంగములు లేవు.
ఉన్నవానికి కూడులేదు ..
నేడు చదువనగా శబ్దసంచయ సంగ్రహణము. వ్యాసంగమనగా ..
కవిత్వము. 
నాల్గు పద్యములల్లినచో
 జన్మ ధన్యమైనట్లే.

నాటి శాస్త్ర వాద పధ్ధతిని 
రాయలిట్లు వర్ణించెను. 
 'పెద్దల జీవిత సన్నివేశాలూ ..సంభాషణలూ..
 ఎక్కడికీ పోవు.. !
సూక్ష్మ లోకాల్లో..
 అవి భద్రపరచబడివుంటాయి ..!

దైవానుగ్రహం వలన ..
చూడగలిగిన  వారికి ..
చూడవలసిన సమయంలో..
 అవి కనులకు కనబడతాయి..
 చెవులకు వినబడతాయి. ! ''
 
సీ 11 "అందులో వొకమేటి కభిముఖుడై యాత
           డనిన వన్నియును మున్ననువదించి
           తొడగి యన్నిటికన్ని  దూషణంబులు, వేగ
           పడక ,తత్సభ యొడవడగ బల్కి
           ప్రక్క మాటల నెన్న కొక్కొక్క మాటనె
           నిగ్రహస్థాన మనుగ్రహించి
           క్రందుగా రేగిన గలగ కందర దీర్చి
           నిలిపి, యమ్మొదలి వానికినె మగిడి.."

టే 111 "మరి శృతి స్మృతి సూత సమాజమునకు
             నైకకంఠ్యమ్ము గల్పించి యాత్మమతము
             జగ మెరుగగ రాధ్ధాంతముగ నొనర్చి
             విజితు గావించి, దయ వాని విడచి పుచ్చి"

కం 11  "నీవే మంటిని రమ్మం

              చావలి వానికిని మగిడి, యట్లనె వానిన్
              గావించి, యొకడొకడు రా
              నా విప్రుడు వాద సరళి నందర గెలిచెన్"
 


 శ్రీనాధుడిట్టి వివాదములెన్నిజేసెనో
ఈ ఘర్షణలచే నాతని విద్య నిత్య నూతనమైనది.
ప్రౌఢదేవరాయల సభలో ..
డిండిమునితో వాదమయ్యెను. 

సామాన్యముగాదు.
" ఉధ్భట్"
వివాదము. 

మధ్యవర్తి చంద్రశేఖర క్రియా శక్తి రాయలు. 
ఆరు మాసములు వాదము నడచెనట ..
ఇన్ని దినములు కవిత్వముతో 
నేమి పోట్లాడుదురు. ?

వారి విహార భూములు శాస్త్రములే. 
కడపట కవిత్వము.
" మధురాంతం సమాపయేత్ " అన్నట్లు 
నాటి మధ్య వర్తులు కేవల న్యాయైక దృక్కులు. 

ఒకసారి ..
యక్షోభ్యతీర్థలకు విద్యారణ్యులతో వివాదము.
 అక్ష్యోభ్యులు 
మధ్యాచార్యులకు నేరుగా శిష్యులు 
మధ్యవర్తి దేశికులు. 
విద్యారణ్యులు దేశికుల సహాధ్యాయులు.
 వారిర్వురు కంచిలో చదువుకొన్నారు. 

వాదమెంతకాలము కడచెనో 
కడకు దేశికులిట్లు నిరూప మిచ్చినారు.
"అసినాతత్వ మసినా పరజీవ ప్రభేదినా
విద్యారణ్య మహారణ్య మక్ష్యోభ్యముని రచ్చినత్ "
విద్యారణ్యుల తోడి చెలిమి 
దేశికులు తీర్మానమున కడ్డురాలేదు. 

శ్రీనాధునినాడు 
చంద్రశేఖర క్రియాశక్తి వీరశాఇవ పండితులలో 
మేరు శిఖరము. 
ఇఛ్చా జ్ఞానక్రియా శక్తులను మఠములు మూడు వీరశైవులకు ప్రధానములు. 

మొదట డిండిమ కవితో 
దేశికులకు కూడ వివాద మేర్పడినది. 
దేశికులు మొదట డిండిముని ఓడించిరి. 

కాని ..
డిండిమము బగులగొట్టించువరకు పోలేదు. 

వారు విరక్తులు. 
శ్రీనాధుడు రాజసము గలవాడు. 
విరుదు డిండిమము బగులగొట్టించిననే 
తృప్తి గలిగినది. 

ఈ విజయమాతని జీవితములో 
మట్టమధ్యాన్నము..

శ్రీనాధుడు
 " కర్నాటక దేశ కటక పద్మవన హేళి " యైనాడు. బ్రహ్మాండముగా కనకాభిషేకము సాగినది. 

ఇంతకు..
 చెప్పవచ్చినదేమనగా
 శ్రీనాధుడు శాస్త్రములలో గూడ గొప్పవాడై వుండును. 

మరి యాతడు 
శాస్త్ర గ్రంధ మేదైన వ్రాసెనో.. 
లేదో తెలియదు.

విద్యాధికారియైన శ్రీనాధునకు 
దానశాసనములు వ్రాయుటయు నొకపని. 
ప్రభువుల యాజ్ఞ ననుసరించియో..
 తన యనుకూలమునుబట్టియో  
యవి సంస్కృతమునందో 
తెనుగునందో యుండును. 

అతని దృష్టిలో 
రెండు భాషలకును భేదమంతగా లేదు. 
ఆంధ్ర రచనలోని సాహస విశంక ట తలే ..
 సంస్కృతమందును
 రెడ్డిరాజు వ్రాసిన 
" మాళవికాగ్ని మిత్ర "
 "గాధా సప్తశతి "
 " అమరుకాది " వ్యాఖ్యలలో
శ్రీనాధుని కైవాడ ముండియుండును. 

కవి సార్వభౌముని చాటువులు కోకొల్లలు 
వేమన పద్యముల తర్వాత..
 శ్రీనాధుని చాటువులకే ప్రశస్తి ..
ఆ చాపల్యములు మనకు గూడ నున్నవి 
గనుక కారణమేమైననేమి ..
అతడు తెనుగు దేశమంతయు జుట్టినాడు. 

ఒకసారి కనకాభిషేకము..
ఒకసారి కంచములో జొన్నకలి..
ఒకనాడు దక్షపురి సాని కూతురు..
ఒకనాడు ..
అంకెకు రాని దాసరి దాని వక్షోజములపై చూపు..
 
జీవితములోని యెచ్చుతగ్గుల నాతడంతగా
మనస్సునకు బట్టించుకొనెడి వాడు గాడేమో..
ఏ సన్నివేశము గనిపించినను..
 అన్నిటికన్నను ముందు 
పదము నేనున్నానని దూకును ..
 
కవిత్వమును 
జీవితములో నింతగా నదికించికొన్న 
కవి మరియొకడు లేడు. 
అందమే గాదు ..
అసహ్యము గూడనాతనికి కవితావస్తువే..
 
'అగ్గిపుల్లా.. సబ్బుబిళ్ళా ..'యన్నట్లు. 
తాత్కాలిక భావము తోచినది తోచినట్లుగా 
నతనికి దెలియక యే గడ్డకు వచ్చును. 

నేను కవి సార్వ భౌముడను గదా ..
ఈ భావము నా పేర నుండవచ్చునా ..?
ఇతరులు నన్ను గూర్చి యేమనుకొందురు..? 
ఈ జంకు గొంకు లాతని జాతకమునకే లేవు .

ఒకవేళ నెవడైన నాక్షేపించినచో ..
జవాబు తెన్నాలివాడు..
" ఒకని కవిత్వ మందెనయు నొప్పులు తప్పులు "
 అన్న బాపతు..

రామయమంత్రి 
భోజన పరాకమముపై పద్యమున్నది. 
" దూడరేణము " 
పసిబాలుర శౌచము 
రచనల కెక్కినవి 
జంగము రాలి వక్షోజా ల మధ్య నిరికించుకొని 
బాధపడు లింగమూర్తి రచనయైనాడు. 
తిరిపెమున కిద్దరాండ్రా యని సవాలు. 
భోగము దానికి గాక
'మగనాలికి నింత విలాసమేటి' కని
యభావేర్ష్య" లోని 

శృంగార మొకింతలేదని యతృప్తి. 

ఇంక నెన్నెన్నో..
తానితరులును గడుసుగా నన్నపుడు 
వారు నొచ్చుకొందురేమో ..
పాపమను ..
భావము గాడ నాతనికున్నట్లు లేదు. 


శ్రీనాధుని దృష్టిలో 
మగడు చచ్చిన మగువ బ్రదుకరాదు. 
వారి ప్రస్తావన వచ్చినపుడంతయు 
" ముండ దీవెన .."
 యనును ..
'తలకు మాసిన ముండలని'
 చీదరించికొనుట..
'విధవ చన్నులని..'
 వెకిలిగా నవ్వును. 

కర్నాటమున నాతడు బడిన పెద్ద కష్టములలో
 విశ్వస్త వడ్డించుట యు నొకటి ..
నేను చదివినప్పుడంతయు..
 నొప్పి పడునొక ఘట్టము ..
గుణనిధి ( కా.ఖం.4.76) కధలో వచ్చును. 

యజ్ఞదత్తుడు బ్రాహ్మణుడు ..
అతనికి గుణనిధి కొడుకు ..
తల్లికి వాడు గొడ్డు వీగి కన్న కొడుకు 
వాడు చెడి చెటాకులయ్యెను. 

జూదములు మరిగినాడు. 
తండ్రి గృహ కార్యాంతర వ్యగ్రుడు
కొడుకును సరిగా విచారించికొనడు. 
కుమారుని సరిదిద్దుటకు 
తల్లి యెంతయో ప్రయత్నించెను. 

వాడు వినడు. 
పలుమారు బ్రతిమాలినది 
కన్నకడుపు. 
తండ్రికి దెలిసెనా అగ్గిరాముడు. 

మేని రవణము అమ్మి యప్పులకు గట్టెడిది. 
ఒకసారి ..
తన యుంగరమొక జూదరి వ్రేలినున్నది. 
యజ్ఞదత్తుడిది యెక్కడిదని ప్రశ్నించినాడు. 

వాడు ..
నీ కొడుకు జూదమున నోడెనన్నాడు. 
ఇంటికి వచ్చి ..
"నా యుంగరమేదని ..?"
బ్రాహ్మణుడు భార్యనడిగెను. 
సత్యము గడ్డకు వచ్చినది. 
తండ్రి భయముతో అంతకు ముందే 
కుమారుడిల్లు వదలినాడు 

బ్రాహ్మణుడు వెంటనే 
"యొక శ్రోత్రీయుని పుత్రిం  బెండ్లియాడి 
గృహస్థ ధర్మంబు నిర్వర్తించెను"
కథ కంచికి పోయినది..
 
ఆ తల్లిని గూర్చి ..
యొక మాటా బ్రాహ్మణుడాడలేదు. 
అనగా..
 శ్రీనాధుని మనసులో సానుభూతి లేదు. 

విశాంకటములై ..
ధూర్తములైన ..
యాతని చాటువులలో ..
నెన్నియో రమ్యముగా నుండును.
ఈ క్రింది దొకటి..

 "పంచారించిన నీపయోధరము లాస్ఫాలింతునో..లేక బొ
మ్మంచున్ క్రొంజిగురాకు మోవి ణిశిధాత్త్వర్థం బనుష్టింతునో
పంచాస్త్రోపనిష  ద్రహస్యపరమ బ్రహ్మస్వరూపంబు నీ
కాంచీదామపదంబు ముట్టుదునో యోకర్ణాట తాటంకినీ.."
 

పద్యము మదగజగమనములో సాగినది.
"ఆస్ఫాలింతునో" 

అనుక్రియ కొట్టవచ్చినట్లు 
" శ్రీనాధుడు " " శ్రీనాధు" డనుచున్నది.

 వేసిన దీర్ఘ  సమాసములోని యర్థమెట్లున్నను.. కూర్పురమణీయమై..
 అర్థము మరచి ..
చదువుద మనిపించుచున్నది. 

చిరకాలముగా నిలుచు తన రచనలో నిట్టి సమాసమును వేయు సాహసము
 శ్రీనాధుడు
అతనివంటి వారికె యుండును. 

కవిసార్వభౌముని వ్రాతలలో
 ప్రధానమైన గుణములు మూడు
వినయము సమ్యమనము లేని 

సమాస ఘటనము 
లాక్షణికములైన ప్రయోగములు 
చిత్రములైన క్రియాపదములు 

"కులుకు ప్రాయంపు నూనూగు కొదమ యెండ" అనుచోట
 నెండలో కులకు ప్రాయము నూహించుట కష్టమే
 " నూనూగు ప్రాయమును సరిగా నదుకదు.
 ఇన్ని చెప్పి మరల 
కొదమ యెందుకో తెలియదు. 
కాని అతడాలోచింపడు. 
మనల నాలోచింప నివ్వడు. 
ఆ చిత్రమైన బంధములో 
మనము కొట్టుకొని పోదుము. 
" శిఖల నెన్నడుములు " 
అనుటయు నిట్టిదే. 
మధ్యయని యర్థము. 
చిన్నారి పొన్నారి చిరుత కూకటి 
ఇది మరి యొకటి. 
లాక్షణిక ప్రయోగములు 
శ్రీనాధుని జీవనౌషధములు. 
చాలనందుకు 
" ఆస్ఫాలించు "
" పిసాళించు "
 "అత్తమిల్లు "
 "జొత్తమిల్లు "
 ఇత్యాదులు తరుముకొని వచ్చును.

 శ్రీనాధుని చాల చాకచక్యముగా సమర్థముగా వాడుకొన్నవారు పెద్దనామాత్యులు. 
తమ సమ్యమనమును వదలక 
శ్రీనాధుని శైలికి లాలిత్యమును జోడించినారు. 

కల్పనా పాఠము నేర్పినారు. 
ఆంధ్ర కవితా పితామహులైనారు.
 పెద్దనామాత్యుల వశిత్వము 
తెనుగులో చాలమందికి లేదు. 
అది యట్లుండె..

కవి సార్వభౌముడు ..
ముఖ్యముగా వాచ్యకవి.
 ఒక్కొక్కసారి 
తానేయు బాణమెవ్వరికి దగులునో 
గూడ గమనింపడు.
ఈ క్రింది పద్యము జూడుడు..

శా 11 " కుల్లా యుంచితి ,కోక గట్టితి, మహా కుర్పాసమున్ దొడ్గితిన్,
            వెల్లుల్లిన్ ,తిలపిష్టమున్ ,మెసవితిన్, విశ్వస్తవడ్డింపగా..
            చలాయంబలి ద్రావితిన్, రుచులు దోసంబంచు పోనాడితిన్..
            తల్లీ ..కన్నడ రాజ్య లక్ష్మి దయలేదా ..?నేను శ్రీనాధుడన్..
  "


శ్రీనాధుడు ..
రాయల దర్శనమునకు పోయెను. 
చాలాకాలము వరకును సన్నిధి చిక్కలేదు. కన్నడమున కర్ణాతదేశాచారము 
అనుసరింపవలసి వచ్చినది తలపై తపారము వెట్టినాడు. 
అంగీవంటి యొక దుస్తును వేసికొనెను. 

కన్నడ రాజ్జ్యలక్ష్మితో దన కింతకు ముందు బరిచయమున్నట్లేమో
 చనువుగా జెప్పుచున్నాడు. 
మంచిదే ఇక్కడ' తల్లీ ..'అనుచునే 
'నేను శ్రీనాధుడన్' అని ముగించుచున్నాడు. 
ఒక యశ్లీలార్థము స్ఫురించుచున్నది. 

ఇది యాతడూహించియుండడు. 
ఏదో ధోరణిలో ననివేసినాడు. 

ఇక్కడ తోచు నశ్లీలమును 
స్వారస్యముగా గూడ వ్యాఖ్యానించెడు 
పిచ్చివారిని నేనెరుగుదును.
 శ్రీనాధుడు మాత్రమా ముమ్మాటికూహించి యుండడు. 
కూడు లేక నానా తిప్పలు పడుచున్నాడు కదా.. ఇంతకు ముందటి పద్యములో 

"పంచారించు"
అచ్చముగా రాయలసీమ పదము. 
బొమ్మంచు కంచి పంచెలకు వాడుదురు. 
అది యెర్రగనే యుండును.
 "ణిసిచుంబనే "అని ధాతువు. 
అనగా చుంబింతునా యని అర్థము. 

ఇంతమాత్రమునకీ 
కొండవీడు చేత్రాడవసరము లేదు ఇంతపదమెందుకంటిమా..
శ్రీనాధుడు చచ్చినట్లే. 
శబ్దములలో హితమిత ప్రయోగము 
అతని పుట్టుకకే లేదు.
 శ్రీనాధుని రస వాదమంతయు శాబ్దికమే. కర్ణాటతాటంకినీ యనుచున్నాడు. 

కర్ణాటకదేశ స్త్రీలకు వజ్రాలకమ్మలు ప్రత్యేకత. 
నేడు గాకున్న నాడు వారికి 
వజ్రకరూరు నందును 
కృష్ణానది లోయలయందును
 పుష్కలముగా వజ్రములు లభించెడివి. 

శ్రీనాధుడే మరియొక చోట 
'కర్ణాటకామినీ కర్ణహాటక రత్న
 తాటంక యుగ ధాళ ధాళ్యములకు'
అనుచున్నాడు. 

ఇంత తెనుగు దేశమంతయు చుట్టినను 
శ్రీనాధునికి ఎక్కడో లోపల 
దాక్షిణాత్య స్త్రీలన్నను ..కర్ణాటకులన్నను ..
కొంత మంపర మున్నట్లున్నది. 

వసివాళ్వారుచు వచ్చుచున్నయది 
కర్ణాటాంగనన్ గంటిరే.. 
యని తాను చూచినది చాలదన్నట్లు 
అందరినీ చూడమనుచున్నాడు. 

తనకు గనకాభిషేకము జరిగిన నేల 
ఆ గౌరవముతో 
నిక్కడ ననేక సామంత దండనాధులతో బరిచయము మాటిమాటికిని 
జెవినిబడిన కన్నడపు బలుకుబడులా
 అచటినుండి తాను గిల్లుకొన్న క్రియాప ల్లవములు. కుమార వ్రాసుని భారతమును గూడ
 శ్రీనాధుడు జూచియో వినియో యుండునని 
నా యనుమానము ..

ప్రౌఢదేవరాయల కాలమునాడు..
 కుమార వ్యాసుడొక చక్రవాత్య
 శ్రీనాధకుమార వ్యాసుల శైలి నాకేమో పరస్పరమందికొన్నట్లుండును. 

చూడుడు. 
తాను భారతమెందుకేరికొన్నాడు 
దానికి గదగుకవి సమాధానము. 

"తిణికి దను ఫణిరాయ రామా
యణ దకవిగళ భారదలి, తిం
తిణియ రఘువర చరితెయలి, కాలిడలు తెరపిల్ల
బణుగుకవి గళలెక్కిపనె, సా
కెణిసదిరు,  శుకరూపనల్లెదె
కుణిసి , నగనె కవికుమార వ్యాసనుళిదవర..
 

అరసుగళిదువీర ద్విజరిగె
పరమ వేదదసార యోగీ
శ్వరతత్వవిచార మంత్రిజనక్కెబుధ్ధిగుణా
విరహిగళ శృంగారవిద్యా

పరిణత రలంకార, కావ్య కై
గురువెనలు రచిసితకుమార వ్యాసభారతవ.."
 
అల్పకవుల నూరక నవ్వినజాలదు ..
కుణిసి నవ్వవలె ..
ఆదిశేషుడు రామాయణ కవుల భారముతో

 " తిణికి" నాడట.. 
పురిటి నొప్పులు పడినాడని యర్థము. 

"రాయరహెణి తిహెత్తరె ఊరెల్లతిణుక బేకో '
యని సామెత
 సైరంధ్రి 
సుధేష్ణ యంతఃపురము వైపుగా వచ్చుచున్నది. 
తిక్కన సైరంధ్రి పోకలేవేరు. 
అది యనన్యాదృశ్యము. 
కుమార వ్యాసుని సైరంధ్రిని జూచి 
" అశుకిదరుమను ధనగరుడియ, బరవె గారరు"
 అంత మాత్రమే గాదు.

"సరసి జాయతదందవనుమో
హరిసి ముంచు వదృగు యుగవనం
దరసి బీరుతబందు హొక్క ళురాజమందిరపు "

సైరంధ్రి కనులు 

పద్మముల కన్న నందములుగా నున్నవి. 
భావమిది. 
ఇట్టి యల్ప తృప్తి యాతనికి జాలదు.
 " సరసిజములు విశాలమైన యందమును మోహరించి ముచునవట .. 
యామెలోచనములు "
ఏది చెప్పినను..
 వెక్కసముగా చెప్పి ..
కోలాహలము చేయవలెను. 

శ్రీనాధునకును 
ఈ గుణము సమృధ్ధిగా నున్నది.
 ఎక్కడబట్టిన నక్కడ దొరకును 
ఒక్క లక్ష్యమును మాత్రమిత్తును
 

ఈ క్రింది పద్యము హరవిలాసములోనిది. 

" ఉభయ భాషా కవిత్వ ప్రయోగకుశలు " 
అని మాత్రమే చెప్పికొని 
తృప్తి పడిన నాల్కనుండి వెడలినది. 

చిరు తొండనంబి ఇంటికొక 
మిండ జంగము వచ్చెను. 
 అతడు తూమెడిక్షు రసముతో
 శివున కభిషేకమొనర్చునట. 

దానికి గావలసిన చెకు మోపులు 
చిరుతొండడెత్తికొని వచ్చుచున్నాడు.
 బరువు మోయలేక తికమకలాడుచుండెను.
 శంకరుడు సాయమొనర్చినాడు.
 భారమునకు దానును జెమర్చెను. 

ఈ సన్నివేశమిట జరుగుచున్నప్పుడు ..
శివుడు కైలాసమున నుండెను..
అచ్చరలాడుచున్నారు..
అపుడక్కడను శివుని మేను చెమర్చినది. 

అప్సరల స్త్రీలపై యాసగొన్నాడని 
పార్వతి యనుమానము..
జగజ్జననికిని యసూయ తప్పలేదు. 

అప్పుడు.. 

చ 11 అమరవరేణ్య ప్రేంకణములాడెడు వేలుపులేమ జూచి యే
చెమరిచి తంచుగ్రేళి సరసీరుహమెత్తి ప్రతాపమొప్పగా
హెమగిరిరాజనందన మహేశ్వరు మొత్తె మధూళికాపరా
గములు శశాంక శేఖరుని కన్నుల మూటను జిందునట్లుగాన్.."
 
ప్రతాప మొప్పగా ..

మొత్తిన గిరిజవ్రేటునకు
 శివునకు మూడు కన్నులును 
మంటకెత్తినవి. 

ఆమె కొంచెము మెల్లగా గొట్టి యుండవలసినది . పాపము కాశీ ఖండములోను ..
పతివ్రతా ధర్మములలో 
మరల నామాటయే యనుచున్నాడు. 
"మగడు తన్మొత్తిన మార్మొత్తు నలివేణి"
 

ఎప్పుడైన విసుగుతో 
కొట్లాడుకొను భార్యాభర్తలను జూచితిమేగాని కొట్టుకొనుట జూడలేదు. 

శ్రీనాధుడు జూచెనేమో ..
అంతమాత్రముతో నాగక 
మొత్తులాడుకొనువరకు వచ్చినచొ 
దేవుడే దిక్కు .

చెప్పిన దేదియు లేకున్నను
 ఏదో గొప్పగా చెప్పినారనిపించు
కనికట్టు విద్యయే ఈతని రచన . 

కాళిదాసు నందుకొనవలెనని గంపెడాస. 
కాని సాధ్యము కాదు. 
అతనిది సున్నితమైన వీణాగానము. 
వీణయైనను వితంత్రియైన తట్టుకొనలేడు. 

శ్రీనాధునిది "ఆర్గన్" వాదము.
 పై పైననుసరింప వలయుటె దప్ప 
కాళిదాసు జీవనాడి 
కవి సార్వభౌమునకు జిక్కదు. 

ఇక భవభూతి తపస్వి. 
నిలుకడలేని శ్రీనాధుకాతడామడదూరము. 
ఎకడో ఒకచోట 
" గద్గద నద్ద్గోదావరీవారి" గా 
తెర మరగు బొమ్మ భవభూతి 
ఇక మురారి మొదలైన వారిని
 'వ్యామ గ్రాహ్యము'గా బట్టికొన్నాడు.

 ఈ క్రింది పద్యము చూడుడు..

శా 11 "చంచల్లీలలు హస్త కంకణ మణిచ్చాయల్ పిసాళింప బూ
జించున్ వేమ మహీ విభుండు నవరాజీవంబులన్ కల్వలన్
ప్రాంచత్కాంచన పుష్ప కేసరములన్ ప్రాసాద పంచక్షరిన్
మంచుంగొండ యనుంగు పెండ్లి కొడుకున్ మధ్యాహ్నకాలంబునన్

పై పద్యములో నేమి యున్నది.. 

మధ్యాహ్నకాలమున అల్లవేమ విభుడు 
శివుని పూజించుచున్నాడని యర్థము. 

శివునకు 
'మంచుకొండ యనుంగు పెండ్లికొడక' ని
 బారెడు మాట 
ఇంక తక్కినన్ని పుష్పముల పేర్లు. 
'హస్త కంకణ మణిచ్చాయ' లొక సొమ్ము ప్రాసస్థనములో 'చంచల్లీలలు" 

ఈ పద్యములో 
పైన పటారము లోన లొటారమని 
యందరికిని దెలియును.
 కాని నేను గూడ ఈ పద్యమును 
పలుమారు చదివికొందును. 
శ్రీనాధుని రసవాదమిదియే. 
ఇట్టిదే రాయల దొక పద్యమున్నది.

మ 11 సొరిదిన్ జేర్చిన తీగమల్లియలు ఖర్జూరంబులన్ పుష్పమం
జరులున్ మామిడి గుత్తులున్ గుసుమముల్ సంపెంగలున్ పచ్చగ
న్నెరులున్ బాళలు గల్గి రాజనపుగాంతిన్ తారుముల్సూపిచే
లరుదార న్నగు పూవుదోటల బలాకానీక దంభంబునన్.."

 

శ్రీనాధునికన్నను గొప్ప చమత్కారమే 
పూవులు కొన్ని చెట్లు ఇవన్నియు వడ్లే. 
జాతులు గూడ. 
"రాజనాలూ వడ్లలో నొకరకము. 
వానికి ముండ్లుండును. 
త్రాసునకును నడుమ ముండ్లుండును కదా 
బరువైన వైపునకదివంగును.
 చేలకును పూవుదోటలకును పోటీ పడినది

తక్కెడలో బదార్థములు పెట్టి తూచినారు. 
రాజనాలు చేలలోనున్నవి తోటలలో లేవు. 
అందుచే ముల్లు చేలవైపు వంగినది. 
పూవుదోట లోబడిపోయినవి.
ఓడిన తోటలను చేలు బలాకానీకదంభముతో హాస్యమాడుచున్నదట. 

శ్రీనాధుడు వ్రేలు జూపగా 
హస్తమునే దిగమ్రింగిన శిష్యులు 
విజయనగర కవులు. 
వారికి గవి సార్వభౌమునిపై వలపుగద్దు. 

తమవాడని 
కవిసార్వభౌమునిపై పెట్టుబడిపై 
నొక్కొక్క డొక్కొక్క వ్యాపారముజేసెను.
 శ్రీనాధుని పద్యము జెప్పికొని
 యానందించినట్లుగా
 రాయలవారి రచనను వల్లె వేయమే. 

యేల ఆ కిటుకు 
బంధ సౌభాగ్యములో నున్నది. 
అది కొరవడుటచే కల్పనా సౌగంధ్యమున్నను 
మన్నన సేయము.

 ఇట్టిడే భీమఖండములోనిది. 

మ 11 "  హిమవద్భూధర సార్వభౌమవరవిశ్వేశోపహార క్రియా
క్రమ సంతాడిత ఘంటికా ఘణఘణ త్కారంబు విన్నట్టి యు
త్తమ పుణ్యుండు, వినండు, ప్రాణ పవనోత్క్రాంతివ్యధావేళ, దు
ర్ధమవైవస్వత వాహ్యాఘోర మహిషగ్రైవేయ ఘంటాధ్వనుల్.."

శివపూజా సమయ ఘంటానాదము విన్నవాడు

 యమ హహిష ఘంటికా నాదము వినడు.
 ఇది యసలు సంగతి. 

కాని ఈ పద్యములో 
వాడు జచ్చుచున్నట్లు లేదు. 
దొడ్డ వివాహ సమ్రంభము 
సైనికా కోలాహలము 
అర్థగాంభీర్యములేదని యెవ్వరెరుగరు 
ఎరిగియు మాటికి జదివికొందుము.
 సంతసింతుము 
మాయని తెలిసియు 
సంసారముననుభవించినట్లు 
అవచితిప్పయ్య కంచిలో నుండెనుగదా 
ఆ స్నేహముతో నీతడు 
పలుమారు కంచికి బోయి యుండును 
అచటా కంచి యరవతలను 
చాలా సారులు చూచినాడు 
పండ్లు పులిసి ఎక్కడో 
ఈ పద్యము వ్రాసిపెట్టుకొన్నాడు.

సీ 11 ముడువంగ నేర్తురు మూలదాపటికిరా
చికుర బంధములీగ జీరు వార
పొన్నపూవుల బోలు పొక్కిళ్ళు బయలుగా
గట్ట నేర్తురు నిడువ్రేలు జెవులయం
దవతంసకంబుగా నల్లిపూవు
పచరింప నేర్తురు పదియారు వన్నియ
పసిడి పాదంబుల పట్టుచీర

గీ 11 పయ్యెదముసుంగు పాలిండ్ల బ్రాక నీక

తరచు పూయుదు రోలగంధంపుబసుపు
బందికత్తెలు సురత ప్రసంగవేళ
కంచి యరవతల సమాస్త్ర ఖడ్గలతలు (కా 3.)

 

దీనిని పోగొట్టి కొనుటకు 
శ్రీనాధునకిష్టములేదు. 
సమయమును చూచి 
కాశీఖండములో దూర్చినాడు. 
దానికి పై క్రింది పద్యములతో సంబంధములేదు. 
ఒంటి స్తంభము మేడవలె నున్నది.

 పాండ్యభూపాల శుధ్ధాంతములను 
దాక్షిణాత్య స్త్రీలను చాలా చోటులలో 
 నాతడు దడలెను.
 శ్రీనాధుని జీవితములో రచనలో 
నెక్కువ లౌల్యము కలవాడనునకు 
బట్టిన ప్రతి పద్యమును సాక్ష్యమే. 
పదలాలస కతడు పెట్టినది పేరు.

 ఒక మంచి పదము మనస్సులో భాసించినచో 
ఒక సమాసము రూపుకట్టి కొన్నచో
 దాని నెట్లైనను పద్యములో బంధింపవలెనని 
యాతని యుబలాటము.
 

తక్కిన పదములు 
దానికి పరివార గ్రహములు 
ఇక జీవితమందో మహోధ్ధతులు.

అతని కదృష్టమట్లు కలిసి వచ్చినది 
తాను శృంగార ప్రియుడనని 
ముక్తకంఠముతో 
తానే పలుమార్లు చెప్పికొన్నాడు. 
వీరభద్ర భూపాలుడు 
తన్ను బిలిచి నిండు సభలో నిట్లు పొగడినాడట.

శా 11 "ఈక్షోణిన్నిను బోలు సత్కవులు లేరీ నేటికాలంబునన్
దాక్షారామ చాళుక్య భీమవర గంధర్వాప్సరోభామినీ
వక్షోజద్వయ గంధసార ఘ్సృణ ద్వైరాజ్యభారంబు న
ధ్యక్షించున్ గవి సార్వభౌమ భవదీయ ప్రౌఢసాహిత్యముల్ "

 

శ్రీనాధుడు దీనికి సంకోచింపలేదు. 
తన రసికతపై ప్రభువులు 
నిరూపింప బడినదని సంతోషము. 
కప్పిన జోడు శాలువలలో నిది మూడవశాలువనుకొన్నాడు. 
సమయము దొరికినప్పుడంతయు 
దీనిని బిరుదుగా వాడుకొన్నాడు.

 " కర్ణాంధ్రాధిపుడైన " సాంపరాయడు దనకుదారసిల్లినప్పుడు
 కవి సార్వభౌముడు ఘంటాధ్వనితో

" అక్షయ్యంబగు సాంపరాయని తెలుంగాధీశ కస్తూరికా
బిక్షాదానము సేయురా సుకవిరాట్ బృందారకస్వామికిన్
ద్రాక్షారామపురీ విహార వర గంధర్వాప్సరోభామినీ
వక్షోజద్వయకుంభికుంభములపై వాసించు నవ్వాసనల్ "

 

అని యరచి చెప్పెను. 
మనకు శ్రీనధునిపై కోపమెందుకు. 
నాటి యభిరుచి యది శుభశకునములను గూడ గాణిక్యపరముగా (ఆము.1-18) నన్వయించిన కాలమది. 
పోయినచోటనంతయు 
నేయాడుది గనుపించినను 
దిక్కులేకున్న బహిరంగముగా 
దిక్కున్న చాటుగా
 చాటు పద్యములు చెప్పిన మనుష్యుడు ..
శ్రీనాధుడు. 

ఇట్టివానిని కొందరు 
" ఛీ ఛీ.. శ్రీనాధుడు పరమ శివభక్తుడు. "
వీర మహేశ్వరుడు 
ఏకపత్నీవ్రతుడు 
ప్రాణము పోయినను 
పరకాంతల మొగమును జూడడని " 
వసిష్ట వామ దేవాదులలో గలుపుటకు 
మొదలు వెట్టినారు 

మైరిందరిది మధ్యేమార్గము. 
ఇతడు చెప్పిన చాటువులన్నియు 
గంధర్వాంగనల పైన వేయుట. 
సంసారి స్త్రీపై చెప్పిన పద్యమ్మొక్కటియు
 మచ్చునకు దొరకదనుట. 

చెప్పిన చాటువులన్నియు ద   ప్పక దొరకినట్లు అందువలన సానుల వరకే గాని 
సంసారుల జోలికే బోలేదని యొక సాక్ష్యము.
 మన సమాజమును నాడును నేడును 
జూచుచునే యున్నాము. 
ఈ కితాబుతో 
వచ్చిన శ్రీనాధునకుగాని 
బ్రతికిన వీరికి గాని లాభమేమో తెలియుటలేదు. 
ఆ శ్రీనాధుడే దిగివచ్చి
 " నేను మీరనుకునేటంతటి 
పెద్దమనిషిని కానయ్యోయ్ " 
అని మొరపెట్టుకొన్నను 
' చాలులే నోరు మూసికొమ్మని"
 వీరు గద్దించుచున్నట్లున్నది. 

నారదుడు  తీర్థయాత్రలకేగెను. 
అతడు ఒంటిగా పోలేదు. 
శ్రీనాధుని పోనిచ్చునా
 మహతిని ధరించుట కెవ్వరో కావలెనట. 

పురాణములలో నాతడు
 మహతిని తానే నిరంతరము ధరించి
 హరినామస్మరణ చేయుచుండునని విన్నాము. 

కళా పూర్ణోదయాది కావ్యములలో 
నప్పుడప్పుడాతనికి 
విశ్రాంతి కావలిసివచ్చినది. 

మగ శిష్యులన్నచో 
నారదున కిబ్బంది లేకున్నను 
శ్రీనాధునకు రోత. 

అందుచే ఒక ' తనుమధ్య '
వెదకి తెచ్చినాడు. 
ఆ వాజ్యముతో
 శ్రీనాధుని శృంగారము వెల్లివిరిసినది.

సీ 11 త్రసరేణు పరిమాణ ధాతు ధూళీ పాళి
యలికంబులకు వింత చెలువ మొసగ
ఘనమైన రారావు చనుదోయి రాయిడి
నిరుపేద నడిమికి వెరపుచూప
దొలుకారు మెరుపు దీగెలబోలు కన్నులు
వడదాకి యొక్కింత వాడబార
సిందూర తిలకంబు చెమట చిత్తడిదాకి
యలికభాగంబునందసలు కొనగ..

తే 11 గనక మేఖల జఘన చక్రమున జార

నీలి బంధంబు నాభిపై నెమ్మివదల
మహతి ధరియించి యొక తనుమధ్య తన్ను
ననుసరించును గాంధ్ర్వ మభ్యసింప " 

ఆవిడ 
గాంధర్వ మభ్వసించుకొనుచు వచ్చుచున్నది. నడచుచు నమరము చెప్పికొన్నట్లు. 
శ్రీనాధుని యగస్థ్యుడు గూడ
 శ్రీనాధుని వంటి వాడేనేమో 
తపస్సెట్లున్నను 
" మెరసి లోపాముద్ర మెరుగు పాలిండ్లపై పవళించుట " మాత్రము మరచినదే లేదు. 

భీమఖండములో
 కాశిపై కోపము గొన్న వ్యాసునకు విశాలాక్షి దర్శనమిచ్చినది. 

ఆమె ' పంచాశద్వర్ష దేశీయ ' 
ఆమె వర్ణనమది.
" ఆ సమయంబున 

గాశికానగర సోమవీధికా 
భవన వాటికా మధ్యంబున
 నొక్క ఇంటి మచ్చకంటి 
పంచాశద్వర్ష దేశీయ ఫలిత సారంబైన 
వేణికా భారంబు గైవడ. 
ముదుసలి చక్రవాకంబుతో
 నెసక్కెంబాడు వీగు చన్నుల 
వ్రేగుదనంబున
దనతనూ వల్లి జలదరింప 
గంకణ ఝణ ఝణత్కారంబు దోరంబుగా 
గ్రక్కున గోపుర ద్వారంబు 
బోరుతలుపు వాయందట్టి 
యందియల రవళి తోడం గూడి 
మట్టియల మ్రోత త్రిభువనంబులు 
నురుజగొనం
దేరు గడు పయోలం జరణ వల్లవంబు జూచి,
 యనంగ ధ్వజ వటకఠోర పాఠీనచ్చాయాదాయాదంబులైన 
వెడద కన్నులు తలచుట్టునుంబలిసి 
పొలయ కల మధుర వీణాక్వాణ 
పాణింధమంబైన యెలుంగునెత్తి 
యో బ్రాహ్మణోత్తమా శాపము స మ్హరించి
 ఇటురమ్మని 
నన్ను జేరబిలిచినదట "
శ్రీహర్షుడు నైషధములో నిట్లన్నాడు.

" ఉపసనామేత్య పితుస్స్మరజ్యతే
దినే దినే సావసరేషు వందినాం
పఠ త్సుతేఘ ప్రతిభూపతే నలం
వినిద్ర రోమాజని శృణ్వతే నలం "

 

తండ్రి సభలో ..
వంది చారణులు నలుని గూర్చి వర్ణించుచుండగా దమయంతి విన్నది.

 ఆమె 'వినిద్ర రోమ' యయ్యెను. 
శ్రీహర్షుడంతలో తృప్తి పడినాడు..

శ్రీనాధునకామాట చాలలేదు. 
అతడిట్లు తెనిగించెను.

మ 11 ' జనకున్ గొల్వగ వచ్చినప్పుడు తదాస్థానంబులో బాఠకుల్
వినుత ప్రౌఢి వసుంధరాదిపతులన్ వేర్వేర కీర్తించుచో
వనితారత్నము వీరసేన తనయున్ వర్ణింపగా నున్నత
స్తన భారంబు  కెలంకులన్ నినుచు జంచల్లీల రోమాంచముల్ "

 

అట్లే మరియొక చోట హర్షుడు..
 

' పాణయే బలరిపోరధ భైమీ
శీతకోమల కర గ్రహణార్థం
భేషజం చిరచితాశనివాస
వ్యాపదా ముపదిదేశరతేశః '

అన్నాడు.
 

దీనిని ..

 

మ 11 పవిసంగంబున దాపమొందిన శచీప్రాణేశు కెంగేలికిం
జివురుం గైదువుజోదు వైద్యముపదేశించెన్ రహస్యంబుగా
నవనీహార పయోమిళన్మలయజస్నానార్ద్రపర్యంతమై
ఇవతాళించు విదర్భరాజతనయా హృద్యస్తనద్వంద్వంబున్ "

 

అని పరివర్తించినాడు.
 శ్రీనాధుని నైషధములో
 ప్రసిధ్ధమైన పద్య మీక్రిందిది. 
చాలా మంది ' లేసు లేసని ' చెప్పికొందురు.

చ 11 " పనివడి, నారికేళఫలపాక మునంజవియైనభట్ట హ
ర్షుని కవితాను గుంభములు సోమరి పోతులు కొందరయ్య లో
నని కొనియాడనేర దది యట్టిద లే జవరాలు చెక్కు గీ
టిన పసవల్చు బాలకుడు డెందమునం గలగంగ నేర్చునే "

 

దీనికి మూలం శ్రీహర్షునిదే అతని శ్లోకమిది.

"యధా యూనస్తద్వత్పరమ రమణీయాపి రమణీ
కుమారాణామంతఃకరణ హరణం నైవ కురుతే
మదుక్తిశ్చేతశ్చేన్మదయతి సుధీ భూయ సుధియ
కిమస్యా నామస్యాదరసపురుషానాదర భరైః "
  
 శ్రీనాధుని శృంగార ప్రియత్వమునకు
 లాలసతకు ఇచ్చిన యుదాహరణములు చాలుననుకొందును.
 

కాశీఖండమెట్లున్నను 
శ్రీనాధునికి కవులలో పెద్ద గద్దె వేసినది 
శృంగార నైషధము. 

శ్రీహర్షుడు దీని మూలకర్త 
కాశ్మీర నృపసబాకమల హేళి చింతామణి మంత్ర చింతనఫలముగా కావ్యమును నిర్మించినవాడు. ' కవికులా దృష్టా ధ్వగమనుధ్వనీనుడు. 
కావ్యకుబ్జ నగరాధీశుని వద్ద 
నీతనికి తాంబూల ద్వయ గౌరవముండెనట. 
విద్వద్యోగ్యమగు నాసనప్రాప్తియు
 కేవల లౌకిక మర్యాదల తోనే యాతడు
 తృప్తి పడలేదు. 
సమధి శూరుడు గూడ. 

సాధారణముగా సంస్కృత విద్యార్థులు 
లఘుత్రయిని బృహత్తయిని చదువుదురు. 
లఘుత్రయి అనగా
 రఘు వంశ 
కుమార సంభవ 
మేఘదూతములు 

బృహత్తయిలో 
మొదటిది భారవి 
రెండవది మాఘము. 
చివరిది నైషధము. 

బృహత్రయిలో గూడ 
హర్షరచనమునకు బెద్ద పేరు.
'తావద్భా భారవేద్భాతి, 

యావన్మాఘస్య నోదయః
ఉదితే నైషధేకావ్యే క్వమాఘః క్వచభారవిః
అని పండితుల మాట ప్రయత్నించి 

శ్రీహర్షుడు తన గ్రంధములో 
వ్యాసుని వలె గ్రంధుల నుంచెనట.
 ప్రాజ్ఞమ్మన్యులుదనజోలికి రాకుండుటకు 
ఆంధ్రమునకు దించిన శ్రీనాధుడు గూడ దానికించుమించు అట్టి గౌరవమునే నిలిపినాడు. 

అనువాదము 
పద్యమునకు బద్యముగా నడచినది.
నడచినది గాదు. 

" మాతృకాను సారంబుగ "
 జేయబడిన రచన. 

విద్యార్థి దశలోనే శ్రీనాధున కామూలాగ్రము 
నైషధము బాఠమై యుండును. 
తరువాత నెంతయో కాలము దానిని 
దీరికెగా మననజేసెను. 
చేసి చేసి సర్వాంగ సౌష్టవముతో 
బయలువెడలిన యుద్గారము
 అందుచే నిది స్వతంత్ర కావ్య గౌరవమందికొన్నది.

పినవీరభద్రుడు గాబోలు 
శృంగార నైషధమును జూచి
 'మా .. 'డు,ము,వు,లూ  మాకిచ్చి..
 మీ సంస్కృతమును దీసికొమ్మన్నాడట.
 అనగా డుమువులు తప్ప 
తెనుగేమియు లేదని పరిహాసము. 

శ్రీనాధునిలో తెలుగులేకేమి యున్నది. 
కాని యది భారత కవుల తెనుగుగాదు.
 కన్నడపు బరువము సంతరించుకొని 
కను మెరయించు జవరాలు 

శ్రీనాధుడు
 'ప్రౌఢిమా వలచువాడు
 పలుకగలవాడు.
 కవిసార్వభౌముడు దప్ప 
మరెవ్వరు నైషధమునకు జేయివేసియుందినను 
అది కోతిపిల్లయై యుండెడిది. 
శ్రీనాధుడే తన కావ్యమందు
 'శబ్దము ననుసరించియూ' అనునొక ముక్క వాడికొన్నాడు. 

అనగ సాధ్యమైనంతవరకు 
సంస్కృతములోని ప్రయోగములను వదలక 
అట్లట్లే దించినాడన్నమాట 

ఒక్కొక్కసారి యాతని యాంధ్రీకరణ శక్తి మనకాశ్చర్యము కలిగించును 
హర్షనైషధములో నీశ్లోకమున్నది.

" అశ్రాంతశృతి పాఠపూతరసనావిర్భూత భూరి స్తవా
సాది బ్రహ్మముఖౌఘ విఘ్నితనవ స్వర్గక్రియాకేళినా
పూర్వంగాధి సుతేనసామి ఘటితా ముక్తాను మందాకినీ
యత్ప్రాసాది దుకూలవల్లి రనిలాందోళై రఖేలధ్ధిని "

 

పూర్వము 
త్రిశంకుని కొరకు విశ్వామిత్రుడు
 నూతన స్వర్గమును నిర్మింపనారంభించినాడు. ఇంతలో
 బ్రహ్మదేవుడు వచ్చి మొరపెట్టెను. 
అలుకమానిన గాధినందనుడా
 ప్రయత్నమును అర్థమునకే వదిలిలెను.
 కుండిన పురము నందలి ప్రాసాదములపై ధ్వజపటములున్నవి. 

అవి తెల్లగా నాకాశమును 
నూర్ధ్వముఖముగా నెగురుచుడెను.
 ఆ దుకూలములు విశ్వామిత్రుడర్థము
 సృష్టించి వదలిన మందాకినీ 
ప్రవాహమువలె నున్నవట. 

ఈ శ్లోకము నాధ్రీకరింపవలెను. 
వాడవలెను. 

మూలములోని రెండవ పాదమును
 శ్రీనాధుడు గమనించినాడు. 
హర్షుడు 'యతి ' ని గూడ సమకూర్చి యుండెను. 
వెంటనే 'దా కారప్రాసముతో 
రచన యారంభింతమనుకొన్నాడు. 
ప్రాసార గాధినందన శబ్దములుండనే యున్నవి. 'ఆవిర్భూతా శబ్దమును 
యతిస్థానమును కుదింపవచ్చును. 
'శార్దూలమే' ఇందుకు తగినదని 
హర్షుని శాసనము. 

వెంటనే..

శా 11 వేదాభ్యాస విశేష పూతరసనావిర్భూత భూరిస్తవా
సాది బ్రహ్ముఖౌఘ విఘ్నిత నవ స్వర్గ క్రియాము కేళిచే
నాదిన్ గాధి తనూజుచే సగము సేయంబడ్డ మిన్నేఱు ప్రా
సాద స్వచ్చదుకూల కేతవమునన్ జాలంగ నొప్పున్ బురిన్ 1 "

 

అన్నాడు. 
ఈ పద్యమును చూచినప్పుడు 

కొంతనిలిచి నిదానముగా జేసిన 
రచన యనిపించును 

ఇట్టి యుదాహరణలు 
చాల జూపవచ్చును 
హర్షుడు 
నలుని వెంట్రుకలను గూర్చి చెప్పుచు..

"స్వవాలభారస్య తదుత్తమాంగజైః
స్వయంచ మర్యేవ తులాభిలాషిణః
అమాగసే శంసతి బాలచాపలం
పునః పునః పుచ్చవిలోల నచ్చలాత్ "

 

అన్నాడు ..
చమరీ వాలములు 
నలుని వెంట్రుకలతో సామ్యము నిచ్చించినవి 
అది ఎన్నటికిని కుదురదు. 
బాల్యచాపల్యము మాత్రమే. 
చమరీ మృగములు తమ తోకలను శిశువులను
 "మీకా కోర్కె తగదని "
 పుచ్చవిలోలన వ్యాజముచే బుజ్జగించి 
పోరు మాన్పిం పించుచున్నవట. 

హర్షుడే మరల 
దమయంతీ చికురములను గూర్చి ప్రస్తావించుచు నిట్లు చెప్పెను.

" చికురు ప్రకరాజయంతితే
విదుషీ మూర్ఖనిసాభిభర్తియాన్
పశునాప్యపురస్కృతే నత
త్తులనా మిచ్చతి చామ రేణకః"
 
దమయంతి గొప్ప విదుషి. 
ఆమె చికురములను తలపై దాల్చి 
గౌరవించు చుండెను. 
చామరములు పశువులచేత గూడ 
పురస్కృతి నందలేనివి. 
పురస్కృతి శ్లిష్టపదము 
అట్టి చామరములను 
దమయంతి శిరోజములతో నెవడు పోల్చును.

 ఈ పద్యమును శ్రీనాధుడు 
సమర్థముగా తెనుగున కుదించినాడు.

గీ 11 విదుషీ యాయింతి తలదాల్చు వెండ్రుకలకు
నహహ యభ్భంగి సాటి సేయంగవచ్చు
పశువుచేత పురస్కృతి బడయలేక
చాపలంబున వర్తించు చామరములు "

'చాపలంబున..'
 అనునది కవిసార్వభౌముడొనర్చిన గుణాదానము. 
మరి మొదటి శ్లోకము గతి యేమి ..?
దానిని శ్రీనాధుడు వదిలివేసెను. 
వదలి మరియొక రీతిగా జెప్పినాడు. 

అది ఇది...

క 11 " తలవెండ్రుక లెగగట్టెడు
కొలదియు నానృపకుమారకుడు కడిమిమెయిన్
నలు దెసల గరుల గండ
స్థల ఫలకములన్ లిఖిమ్హ్చె జయశాసనముల్ "
చిత్ర విచిత్రములైన కల్పనలకు 
దూరాన్వయ క్లిష్టాన్వయములకు 
హర్షనైషధము పెన్నిధి.
 
ఒకసారి యా యలంకారములకుఁ
దలయుఁదోకయు నుండదు.
 హర్షుని రసనాకండూతితో 
బో   ల్చ దగిన కండూతి సంస్కృతమున 
మరి యెవ్వరికిని లేదు 
అడుగడుగునను 
అమృతాంజనము రాచుకొనవలసిన భావములకు హర్షుడు భోషాణము 
కాని శాస్త్రనిధి నైక సంప్రదాయమర్మవిజ్ఞాత. 
అతని వాక్కు 
'ఫణిభాషిత భాష్యఫక్కికా విషమా 
అనేక తావుల కుండలీకరణమే  

తెనుగు కవులలో 
శ్రీనాధుడు విపరీతమైన నాలుక దురద 
కాని యా గురువుముందది పనికి రాలేదు 

అనేక చోటులలో 
హర్షుడు ఈడ్చి ఈడ్చి వర్ణించిన ఘట్టములను తలవిదిర్చికొని శ్రీనాధుడు 
కుదింపవలసియే వచ్చినది.
 "శిష్యా దిచ్చేత్పరాజయమ్మను" 
సామెత శ్రీహర్షున కోడిపోయినది. 
గురువు గురువే శిష్యుడు శిష్యుడే.
 
ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రచురణ , 1975.