14 జులై, 2015

కళ్యాణ వైభోగమే.... !


పెళ్ళి అనగానే
పిల్లలకు ఆనందం..
పెద్దలకు కంగారు.
పెళ్ళి వారి గురించి మంచీ చెడ్డా వాకబు చేసి..
వరుని గుణ గణాలు .. 
సంపాదనా చాతుర్యాన్ని  గూఢచర్యం చేసి..
వారి స్థితీ గతీ తెలుసుకుని..
గణాల పొందిక ను గమనించి
తిథి వార నక్షత్రాలు చూసి..
ముహూర్తం నిర్ణయించి..

అమ్మాయి గునిసినా..

వాడు నిన్ను బాగా చూసుకుంటాడని గదిమి..
పిల్లాడు పిల్ల ముందు తేలిపోయాడనీ..
కాకి ముక్కుకి దొండ పండనీ 
యెవరైనా గుస గుసలాడినా
రూపం కాదు గుణం ప్రధానం..
అందాన్ని కొరుక్కు తింటామా..
ఇత్యాదులతో సర్ది చెప్పుకుంటూ..
తన బిడ్డ పొయినింట సంతోషంగా ఉందాలని ఆరాటపడుతూ..

ఇంట్లో అందరికీ నగలూ బట్టలూ..
వంటవాళ్ళూ పురో హితులూ..
పందిరి మేళాలు..
శుభలేఖలూ.. పిలుపులూ .. 
అయ్యాక ముహూర్తం సమీపిస్తున్న కొద్దీ..
పెళ్ళిపెద్దలో ఇంకా యేదో అలజడి ..
అప్పగింతలై పిల్ల అత్తవారింట అడుగు పెట్టేదాక..
శుభ కార్యం నిర్విఘ్నంగా జరిపించమని
వేయి దేవుళ్ళకు మొక్కులు..
ఇది మామూలు పెళ్ళి తంతు..

బంధాలకు దూరంగా 

ముక్కు మూసుకుని తపస్సు చేసుకుందామని వెళ్ళిన ఋషులూ 
పుత్రికా వ్యామోహంలో చిక్కుకుని..
వారి భవితవ్యానికై చింతించడం మనం చూశాం

విశ్వామిత్రుని తపోభంగం చేయడానికొచ్చిన మేనక

కార్యం పూర్తి కాగానే 
పుట్టిన శిశువుని అలా వదిలి 
దేవలోకానికి చక్కా పోయింది..

ఛ.. నా తపస్సంతా భంగమైపోయింది..

అనవసరంగా స్త్రీ లౌల్యంలో చిక్కుకుపోయాను అని
విశ్వామిత్రుడూ తన దారిన పోయాడు..

అటుగా వెళుతున్న కణ్వ మహర్షి..

పక్షులు  పెంచుతున్న బాలికను చూసి 
ముచ్చట పడి ఆశ్రమానికి తెచ్చి పెంచుకోవడం

ఆపై దుష్యంతునితో ఆమె గాంధర్వ వివాహం..
శాపవశాత్తు అతను ఆమెను భార్యగా అంగీకరించకపోవటం..
ఒక ట్విస్టు..

చివరికి ఆకాశవాణి కలుగజేసుకుని
నిజం చెప్పడంతో వారి కాపురం చక్కబడుతుంది..
కణ్వుడు ఊపిరి పీల్చుకున్నాడు..

కవులు తమ కావ్యకన్యలను  

రాజుల కంకితం ఇస్తుంటారు..
తమ కావ్యాలలో పెళ్ళిళ్ళు చేయడంకూడా 
కవులకు రివాజే..

ఇక్కడ విషయమేమిటంటే..

ఇదిగో ఇది..

అది వసురాజు వివహ మహోత్సవ వేడుక..
వరుడు వసురాజు.. 
వధు వు గిరిక.. 
పెండ్లిపెద్ద దేవేంద్రాదులు..

''వసు చరిత్ర సాహితీ సౌరభములు''
 విశేషాలను 
అనన్య సామాన్యం గా  వర్ణించిన పుట్టపర్తికి.. 
గిరికా వసురాజుల పెండ్లి ముహూర్త విషయంలో 
ఒక సందేహం పీడించిందట..

చిత్తగించండి..

''దినమును దేవేంద్ర సభకు బోవుట..
వసురాజున కలవాటు..
ఆనాడాతడు సభకు రాలేదు..
దేవేంద్రునకు గరణము దెలిసికొందమనిపించినది...
ఆ నిరవద్య మిత్రుని..
నేచింత పీడించుచున్నదోయని..

యాతని యాలోచన..

ఇంద్రుడు యోచించి చూచెను..
వసురాజు కలత యాతనికర్థమైనది..
వారు దేవతలు గదా..
పేరామని చలికి..కలువల చెలికి వసురాజెంత కలత జెందెనో యని
ఇంద్రుడు కటకటబడినాడు..

తెల్లవారినంతనే.. 
యాతడు శీతనగ పుత్రుని చెంతకు వచ్చెను..
ఆతడీ కన్నెను వసురాజుకు యాచించినాడు..
'సిరిరా మోకాలొడ్డు ' వాడెవడుండును..
కోలాహలుడు సమ్మతించెను..
గట్టురాపెద్దలు.. పుణ్యవాహినులు.. పెండ్లికాహ్వానింపవడిరి..

వివాహ మహోత్సవమున కప్పటికప్పుడు దేవేంద్రుడొక పట్టణమును సృజించినాడు...
వివాహ మానాడే జరుగవలెనని ...
యాతని పట్టుదల..
యేర్పాటులన్నియు వడి వడిగా సాగెను..
వసురాజునకు వార్త దేవేంద్రుడే దెల్పెను...

ఈ రేయికే యొక శుభలగ్నమేర్పాటుజేయుమని బృహస్పతికి విన్నవించికొన్నాడు..

వధూవరుల యలంకారములతో మధ్యాహ్నము జెల్లినది.. అప్పటికే..

''పౌలోమిఈ ప్రభృతుల్ గుమారినిటు సంభావింపగా మున్ను ది

క్పాలుర్ భూపునలంకరించి, శుభలగ్నంబుంప్రతీక్షింపగా..
నాలోదాను దాను దదర్హవన్మణీ విశేషాన్వేష సన్నధ్ధుడో, నా
నాలోకాప్తుడుచేరె రాగ మహిమన్ రత్నాకర ప్రాంతమున్..''

ఇంతలో .. 
రేగన్నియ రేనిమేను  తొలిగట్టుతుద బొదలినది..
అంగిరసుడు లగ్నమాసన్నమైనదని యెచ్చరించెను..
దైవతవిభుడాదరోక్తి బిలిచినాడు.
వసురాజు సితకరినెక్కి శీతనగోజ్జ్వల శంకరాకృతితో గోలాహలపురముచేరజనెను..
పురియందున్న స్త్రీలు అతని జూచుటకు మేడలపై నిలచిరి..
వసురాజు వేదిక చెంతకు వచ్చెను..''

ఇక్కడ నొక చిక్కున్నది..
గిరికా వసు రాజుల  వివాహము జరిగినది
మిధున లగ్నమందు..
వివాహ దినము చైత్ర శుధ్ధ చతుర్దశి..

మాంగల్యధారణము సూర్యాస్తమయమైన తరువాత..

చైత్రమాసమున మిధున లగ్నము రాత్రిపూట వచ్చుటకు వీలులేదు..

మరి జ్యోతిషమునందు బండితుడైన భట్టుమూర్తి

యీ పొరపాటెట్లు చేసినాడు..?

ఈ సమస్య నన్ను చాల దినములు పీడించినది..
పండితుల నడిగితిని..
వారొక చిన్న సవరణ చెప్పినారు..
అది యుండవచ్చనిపించినది..
వారి సమాధానమిది..

'' ఒక్క సంవత్సరమునకు ... 
మేషరాశియొక్క యాదిబిందువేబదిమూడు విలిప్తల ప్రకారము తిరోగమించును..

అనగా..
బ్రతియరువదియేండ్లకును ..
ఒక్క యంశతిరోగమనము
మున్నూటయరువది యంశలు తిరోగమించుటకు 21600 సంవత్సరములు పట్టును..
గాని ..
10800 సంవత్సరములకు గాని దాని బేసిసంఖ్యలబ్దమునక్గాని లగ్నసప్తమ పరివర్తన మేర్పడును

అందుచే ..
బగటి రాసులు రాత్రియందును..
రాత్రి రాసులు పగటియందును వచ్చుటకు వీలున్నది..
సూర్య చంద్రుల సంబంధము చేతనే తిధులేర్పడుచున్నవి..
కనుక తిధిలో భేదము వచ్చుటకు వీలులేదు..
నేడు చైత్ర శుధ్ధ చతుర్దశికి చంద్రుడు హస్తలోను
రవి మీనమునందుండునని యంగీకరించుచున్నాము..

కానీ  .. 

అయనాంశను బట్టి వసురాజునాటికి చైత్రమునందు ..
రాత్రిరాసులైన కన్యాదికుంభాంతము  ఉదయరాసులుగా నుండియుండవచ్చును..
ఈ విషయమున నాకన్నను 
సత్యము దేల్చికొనుటకు మీరే యధికారులు ..
నాకును .. గణితమునకును షష్టాష్టకము..
పై పండితులు చెప్పిన  సమాధానమును 
మీకు  మనవి చేసినానంతే..''

అదీ సంగతి .. 
జ్యోతిష శాస్త్ర వాసనలు 
పుట్టపర్తిని ఎలా ఆలోచింప జేశాయో   చూసారా ..