28 అక్టో, 2014

నాయిక సంగీతజ్ఞురాలైతే.. రాగాలే రాగాలు..


 మొన్న 'పాడుతా తీయగా' లో 
గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంగురించి చెబుతూ
వారు అక్కడి చిలుకలకు మాట్లాడటం నేర్పిస్తున్నారనీ
మరికొంతకాలానికి ఆ చిలుకలు కూడా 

మన పాడుతా తీయగా లో పాల్గొంటాయని చెప్పారు..
కార్యక్రమంలో పాల్గొనే ప్రతి పిల్లనూ పిల్లవాడినీ 

చిలుకలని సంబోధిం చారు..
 

( పూర్వ జన్మ పుణ్యం వల్ల 
మా అయ్యతో నా చిన్నప్పుడు నేను 
గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో 
రెండు మూడు రోజులు ఉండే అదృష్టం 
ఆ దేవుడు కల్పించాడు
అక్కడ మా అయ్యకు స్వామీజీ సన్మానం చేసారు..)


అది రాయల కాలం 
 అంతులేని సంపద..
రత్నాలను కుప్పలుగా పోసి రొడ్లపై విక్రయించే వైభవం
చీకూ చింతా లేని జీవితం..
అప్పుడేం కావాలి ..?

వినోదం.. మనోల్లాసం..ప్రభువు కళాభిరుచి కలవాడైతే..
ఆ రాజ్జం లో కళ లకు పట్టాభిషేకమే జరుగుతుంది


అనాటి వినోద సాధనాలు
సంగీతం నాట్యం కవిత్వం..
అందు కే సంగీతంలో..  కవిత్వం నాట్యమూ
నాట్యంలో ..సంగీతమూ కవిత్వమూ
కవిత్వం లో.. సంగీతమూ నాట్యమూ దోబూచులాడాయి..

ఇంట్లో చిలుకలకు మాటలూ మయూరాలకు  నాట్యాలూ నేర్పేవారట..
రాజుల అంతఃపురాలలో 

ప్రత్యేకమైన డిపార్ట్ మెం టులేవుండేవట..

రాయలనాటి రసికతా జీవనంలో
ఆనాటి జీవనాన్ని పుట్టపర్తి ఎలా చెప్పారంటే..
కృష్ణదేవరాయలు గొప్ప వైణికుడు
సంస్కృత ఆంధ్ర కన్నడ భాషా ప్రవీణుడు..
తాను కవిత్వం రాస్తాడు.. 

కానీ ఇతర కవులను చులకన చేయడు
వారి కవిత్వాన్నీ ఆనందిస్తాడు.. 

స్వర్ణాభిషేకాలూ
కనకాభిషేకాలూ చేస్తాడు..
ఆయన అంతఃపురంలో 

నూ ర్లకొలది గాయనాచార్యులు.. 
నాట్యాచార్యులూ ఉండేవారట..
సంతోషసమయాలలో సంగీతం సరే సరి..
విషాదాలకూ ఆశాభంగాలకూ సంగీతం అందుకోకపోతే ఆమె విజయనగర చిన్నది కానేకాదు..

కవులు  సృష్టించిన ప్రబంధ నాయికలు..
తాళమూ రాగము తప్పిపోకుండా యేడ్చి యేడ్చి దుఃఖపడేవారు..
 

పాత సినిమాలలో హీరోయిన్లు..
ప్రేమ విరహం బాధ ఇలా ఏది వచ్చినా..
పాటందుకొనేవారు
 

అలా ఆనాటి  విరహిణులు  
వారి దుఃఖాన్ని ధ్వనింపజేసే రాగాలనే 
ఎన్నుకొని .. ఎన్నుకొని..  మరీ ఏడ్చేవారట..
ప్రవరుడు వదలి పోయిన నాటి సాయం కాలం 

వరూధిని నాట రాగంలోనే యేడ్చినదట..

ఇక 'గిరిక '

'కాంభోజీ రాగ' మెక్కడ తప్పిపోవునో యని
జాగ్రత్తగా రాగ వర్జ్యముల వదలి వదలి యేడ్చినదట..
పుట్టపర్తి వర్ణన పైగా చమత్కార వైభవం..
అందుకే పుట్టపర్తి రచనలు 

పండితులనెంత ఆకర్షించాయో
పామరులనూ అంతే మురిపించాయి


   


27 అక్టో, 2014

ప్రబంధ నాయికలపై రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారి అభిప్రాయం చూద్దాం ..


భారతి సంపాదకీయాలుగా ప్రబంధ నాయికలు వ్యాసాలు 1938 లో ప్రధమంగా ప్రచురింపబడ్డాయి...
రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు 
ముందు మాట రాస్తూ
 పుట్టపర్తి వాక్కు వణుకులేనిది అని వ్యాఖ్యానించారు..

తరువాత 
అన్నామలై
 ఆంధ్ర 
ఉస్మానియా 
మద్రాసు యూనివర్సిటీలలో పాఠ్య గ్రంధంగా ప్రభుత్వాలు ప్రకటించాయి..

ముద్రణ కాక మునుపే ప్రాచుర్యం  పొందిన యీ రచన 
మహాకవుల హృదయాలు పట్టించే విధంగా వర్ణన వుందని దివాకర్ల వెంకటావధాని గారు అభిప్రాయపడ్డారు


 అల్లసాని వారి అల్లిక జిగిబిగి లో చెప్పినట్లు రాయలేరుకున్న  కథ నిజముగ 
చతుర రచన కనుకూలమైనది..

కథా సంవిధానములో తొలుత తిక్కన వలె 
అతడు గొన్ని రేఖలను గీయును
తరువాత పాత్ర చిత్రణమంతయు 
ఆ రేఖలపై నడచును..

పెద్దన ప్రవరుడు. 
మకరాంక శశాంక మనోజ్ఞ మూర్తి..

తక్కిన వ్రాతగాండ్రు వర్ణించి విసిగించు 
అనేక ఘట్టములనీతడు సంగ్రహించును.

ఇతర కవులైనచో అరుణాస్పద పురములోని  
గుర్రపు దోకలు మొదలుకొని.. 
యేను గుల తొండములవరకును 
సాగదీసి వర్ణించి మనల చంపి యుందురు..
అంటారు పుట్టపర్తి

ఔచిత్యమునకు ఆచార్యుడగు పింగళి సూరన్న కూడా ముసలి ముప్పున ఈ పనియే చేసినాడట
అదేమిటంటే
అతని ప్రభావతీ ప్రద్యుమ్నములోని
 ద్వారకా నగర వర్ణనము నాతడెట్లు వ్రాసెనో గాని చదువుటకు మనకు పెద్ద వేధ..
 ఇదీ పుట్టపర్తి తీరు   

వ్యంగ్యం.. 
చమత్కారం..
 సందర్భం కుదిరి
వచన రచనలో పుట్టపర్తిని 
శిఖరాగ్రాన కూర్చోపెట్టినాయి..

శ్రీశైలం గారి మాటల్లో..


22 అక్టో, 2014

అహంకార పంచకం

ఔను ప్రభూ.. !!

ఈ భావాన్ని నేను పాడాను..
గొంతు అంతగా బాలేదు..
సంగీతం కూడా అంతగా రాదు
రాగాలు కట్టటం కూడా సరిగా తెలియదు
నా ప్రయత్నంలో తప్పులున్నా క్షమిస్తారు అనుకుంటున్నాను
ఇది కేవలం ఉత్సాహం మాత్రమే..
ఎవరూ సీరియస్ గా తీసుకోవద్దు
అలానే నా రాతలు కూడా

6 అక్టో, 2014

సిరి కల నాడు ..


 దానం..
ఒక్కొక్కరు ఒక్కో నియమం పెట్టుకుంటారు
కొందరు గోవులను సేవిస్తూ .. గోదానాలు చేస్తుంటారు 
కొందరు
బీదలకు పుస్తకాలు పంచిపెట్టి చదివిస్తూ విద్యాదానమే గొప్పదని అంటారు..
దానధర్మాలు చేస్తూ తృప్తి పొందుతుంటారు ఇంకొంతమంది..
రోగగ్రస్తులకు ఉచితంగా వైద్యం చేయిస్తూ.. 
ఇదే మంచిదని అనేవాళ్ళూ ఉంటారు..

తమ శరీరావయవాలను తమ తదనంతరం 
ఇతరులకు అమర్చాలని కోరేవాళ్ళు కొంతమంది..
మంచిదే చూపునూ శ్వాసనూ ఇతరులకు ప్రసాదిస్తే మెచ్చనివారెవ్వరు..

ప్రపంచంలో మాల్టా లైబీరియా ప్రజలకు 
దాన గుణం ఎక్కువట.
వరల్డ్ గివింగ్ ఇండెక్స్ సంస్థ 
153 దేశాల్లో నిర్వహించిన సర్వేలో
 శ్రీలంక ,ఐర్లాండ్, కెనడా, గయానా, 
సియర్రా లియానె వాసుల్లో 
దానం చేసే లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది


  • వైశాఖమాసము దానాలు ఇవ్వడానికి ప్రశస్తమైన మాసంగా పురాణాలు పేర్కొన్నాయి.
  • బలి చక్రవర్తి మూడడుగులు విష్ణుముర్తికి దానం చేసి చిరస్మరణీయుడైనాడు.
  • శిబి చక్రవర్తి పావురం రూపంలో వచ్చిన దేవతలకు తన శరీరాన్ని కోసి దానం ఇచ్చిన ఉత్తముడు.
  • కర్ణుడు తనకు సహజంగా ఉన్నకవచకుండలాలను రక్షకకవచాన్ని దానం చేసి "దాన కర్ణుడి"గా నిలిచాడు.
  • ఏకలవ్యుడు తన బొటనవేలును కోసి ఇచ్చాడు

దానం చేసే వ్యక్తి 
దానం స్వీకరించే వ్యక్తి 
దానం స్వీకరించడానికి తగిన పాత్రుడా కాదా 
అని ఆలోచించి 
లేదా రుజువు చేసుకొని 
అతను దాన స్వీకరణకు అర్హుడు అయినట్లయితే 
అతనికి దానం ఇవ్వాలి. 

దానం స్వీకరించే వ్యక్తి 
దాన స్వీకరణకు తగిన పాత్రుడు కానప్పటికి 
అతనికి దానం ఇచ్చినట్లయితే 
అటువంటి దానంను అపాత్రదానం అంటారు.

''అన్నిదానములను నన్నదానమే గొప్ప
కన్నతల్లికంటే ఘనములేదు
ఎన్నగురునికన్న నెక్కుడు లేదయా
విశ్వదాభిరామ వినురవేమ.''
 వేమన కూడా అన్నదానం గొప్పదన్నాడు 


నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే అనేక ఇబ్బందులనుండి, 
ఇక్కట్ల నుండి బయటపడడానికి 
చక్కటి రెమిడీగా పనిచేస్తుంది అన్నదానం 
అని చెప్తారు పండితులు. 

 పోతనకూ మంచి కుటుంబము 
తృప్తి కరమైన జీవితమూ ఉన్నాయట

హాయిగా తానూ జీవిస్తూ దానధర్మాలు చెస్తూ పోతన తరించే వాడని పుట్టపర్తి అంటారు .. 

అందుకే పోతన రచనలోను అట్టి సందర్భాలను ఎంతో 
సానుభూతితో వర్ణిస్తాడని చెబుతారు వారు.. 

రంతి దేవుడు నిట్రుపవాసం తో  తపస్సు చేసాడు 
నలభై ఎనిమిది రోజుల తరువాత 
అన్నం తిందామని అనుకున్నాడు 
ఒక బ్రాహ్మడు వచ్చాడు 
తన భోజనంలో సగమిచ్చాడు 

మళ్ళీ తిందామనుకొనేంతలో ఎవరో శూద్రుడు .. 
మిగిలిన అన్నంలో ఒక భాగం ఇచ్చాడు 

నోటముద్ద పెట్టబోయేంతలో 
కుక్కల గుంపుతో మరొకడు అన్నమడగడం..
విసుక్కోకుండా..
ఆకాస్తా ఇచ్చేయటం..

సన్నయములాడి  సాగనంపటం
వచ్చిన వాడు ఇంద్రుడో.. శివుడో ఎవరికి తెలుసు..

మిగిలినవి నీళ్ళు
అవైనా గుక్కెడు నోట్లో పోసుకుందామనుకుంటే..
ఒక చండాలుడు దప్పి దప్పి అంటూ అగపడ్డాడు..
 

ఈ మాటలు విన్న రాజు హృదయం
 దయారసముతో పొంగినదట..
 

వాళ్ళకెంత ఓర్పు ఎంత నిదానమో కదా..
ఒక రోజు పూజ చేసి 

రెండుదాకా ఖాళీ కడుపుతో వుండి
కాస్త అన్నమో టిఫెనో  నోట్లో వేసుకుందామనుకొనేసరికి యెవరో వచ్చి అది నాకిచ్చెయ్ అంటే 

మనమంత శాంతంగా
 ప్లేటులో పెట్టుకున్న పదార్థాన్ని ఇచ్చేయగలమా..
వెంటనే కోపం వస్తుంది..

కానీ అటువంటి సమయం లోనూ సంయమనం  పాటించడమే నిజమైన భక్తి
తపస్సు కాదంటారా..


విశ్వామిత్రుడు తూర్పు దిక్కుకు వెళ్ళి 
కామ క్రోధాలను నిగ్రహిస్తూ బ్రహ్మాండమైన తపస్సు చేయసాగాడు
కుంభకం ఉపయోగించి శ్వాస తీసుకోవడమూ నిలిపేశాడు
ఎన్ని సంవత్సరాలూ..
వెయ్యి ..


శరీరం పుల్లలా ఎండిపోయింది..
శరీరాన్ని నిలబెట్టుకోవడం కోసం
ఒకరోజింత అన్నం తిందామని కూర్చునేంతలో
ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి బిక్ష అడుగుతాడు
మౌనంగా ఆ అన్నాన్ని ఇచ్చేసి 

మళ్ళీ తపస్సులో మునిగిపోతాడు విశ్వామిత్రుడు..
 

అందుకే ..
తపస్సంటే కేవలం ముక్కుమూసుకుని 

మంత్రాన్ని జపించటం కాదు
కామ క్రోధ లోభ మోహాలను జయించటం..
 

అందులో దేవతలు పెట్టే పరీక్షలు నెగ్గటం ఒక తంతు..
వాళ్ళ ఆమోద ముద్ర పొందాక 

వాళ్ళు రెకమెండ్ చేస్తే..
యే శివుడో బ్రహ్మో  వచ్చి..
లేవవయ్యా నీవు మహర్షి వైనావు ..
ఋషి వైనావు అని 

ఒక మెడల్ ను మెడలో వేసి వెళతారు..
 

అది నిలుపుకుంటూ 
తదుపరి గ్రేడ్లకు అప్పియర్ కావడమే తపస్సు
 పదండి పుట్టపర్తి రంతిదేవుని కలుసుకుందాం.. 

చక్కని గృహస్తున కుండవలసిన గుణములన్నియు నాతనికున్నవి 
అతిధి పూజ 
ఆ మహాకవికి ప్రాణముతో సమానము

 అయాదరమునకు పోతన్న దృష్టిలో నీయాజాతిలేదు.. భగవంతుడు విశ్వాత్ముడన్న సత్యము 
ఆతని నరనరమునను జీర్ణించినది..
అన్ని దానములకంటెను 

అన్నదాన మాతనికి చాల ప్రియమైనది..
 

నిజమే
ధనములిచ్చి యతిధిని దృప్తి పరచుట యసాధ్యము.
అన్నము బెట్టి యెట్టివానినైనను దృప్తిపడినాననిపించవచ్చును
 

అందుకే యట్టి ఘట్టములు వచ్చినపుడు
 పోతన్న యెంతయో సాహుభూతితో వర్ణించును.
 

రాజ వంశోత్తములైన రంతిదేవుడు 
తపస్సు జేయుచుండెను.
ఆతడు నలువది యెనిమిది దినములు నిట్రుపవాసమొనర్చినాడు.
 

మరుదినమున గొంత యన్నము దిన సంకల్పించెను..
తొలుత వొక బ్రాహ్మణుడు వచ్చి యాచించినాడు
కలిగిన యన్నములో రంతిదేవుడు సగమాతనికిచ్చెను..
 

మరియొక శూద్రుడు వచ్చినాడు
ఆ రాజు మిగిలిన యన్నములో నొక భాగమిచ్చెను
 

ఇంతలో వేరొ క్కడు కుక్కల గుంపుతో గూడవచ్చి యన్నమడిగెను
 

రంతిదేవుడణుమాత్రమైనను విసిగి కొన్నవాడుగాడు
అన్నశేషమిచ్చి.. సన్నయము లాడిపంపెనట..
 

అంతతో పరీక్ష దీరిపోలేదు..
మంచినీళ్ళు మిగిలినవి..
వానినైనా ద్రావుదమని రంతిదేవుడు తయారయ్యెను
ఇంతలో నొక ఛండాలుడు సాక్షాత్కరించినాడు
వాడనెను.. 


కం. హీనుడ చండాలుడను
మానవ కులనాధ..దప్పిమానదు, నవలన్
బోనేర, నీకు జిక్కిన
పానీయము నాకు బోసి బ్రతికింపగదే..

 
ఈ మాటలు విన్న రాజు హృదయము 

దయా రసముతో బొంగిపోయినది..
అతడెంతో యాదరముతో ..


ఉ.
అన్నములేదు కొన్ని మధురాంబువులున్నవి ద్రావుమన్న రా
వన్న,శరీరదారులకు నాపద వచ్చిన వారి యాపదల్
క్రన్నన మాన్పి వారికి సుఖంబులు సేయుటకంటె నొండు మే
లున్నదే ? నాకు దిక్కు పురుషోత్తము డొక్కడే సుమ్ము పుల్కసా !(న.స్క.647)

 
అని పలికి


మ. బలవంతంబగు నీరు వట్టున నిజ ప్రాణాంతమై యున్నచో
నలయండేమియు వీని హృజ్జ్వరము నాయాసంబు ఖేదంబు నా
జల దానంబున నేడు మానుననుచు సర్వేశ్వరాధీనుడై
జలమున్ బోసెను రంతిదేవుడు దయన్ చండాల పాత్రంబునన్..

 

ఈ సన్నివేశము నింత మధురముగా పోతన్న వర్ణించుటకు గారణము ఆ గుణముపై నాతనికికి గొప్ప సానుభూతి యుండుటయే..

5 అక్టో, 2014

హిందీలో శివతాండవం

పుట్టపర్తి శివతాండవాన్ని శ్రీ చావలి సూర్యనారాయణ మూర్తి గారు అనువదించారు
సాహిత్య అకాడమీ ప్రచురించింది
సమర్పణ పుట్టపర్తి అనూరాధ
సహకారం శ్రీ రామావఝుల శ్రీశైలం

4 అక్టో, 2014

పాత్రల తీర్పులో ముక్కు తిమ్మన నేర్పు..

''పాత్రల తీర్పులో ముక్కు తిమ్మన నేర్పు..
రామభద్రుని శయ్యలో ఒయ్యారం..''
రచన : సరస్వతీ పుత్ర డా.పుట్టపర్తి నారాయణాచార్యులు
ఒచ్తోబెర్-నవంబరు ,1954 పరిశోధన లో ప్రచురితం..
 పుట్టపర్తి ప్రియపుత్రిక పుట్టపర్తి అనూరాధ భక్తి పూర్వక సమర్పణ
సహకారం శ్రీ రామావఝుల శ్రీశైలం