3 నవం, 2013

పోతన్న మహా తపస్వి.

 పుట్టపర్తి సాహితీ సర్వస్వం ముద్రింపబడుతూంది
ఆ పనిలో బిజీ గా వున్నాము

అందులో భాగవతోపన్యాసాలలో వచ్చిన కథ  మీ కోసం..



పోతన్న  భాగవతమున 
రుక్మిణీ కల్యాణ ఘట్టములు వ్రాయుచుండెనట. 
దానిలో
"హరికు ప్రేమబంధ మధికంబుగా కేశ
బంధ మధికమగుచు భామకమరె..."
 

యీ సమయమునకు సరిగా 
వంటయింటిలో పొయ్యి దగ్గర నాడుకొనుచున్న 
పోతన్న బిడ్డ ప్రొయ్యిలో బడినది. 
ఆమె శ రీరమంతయు కమరునట్లు కాలినది 
భార్య యా విషయమును పోతన్నకు దెలిపెను. 
అతడు తన వ్రాత నుండి లేవనేలేదు. 
వెంటనే మూడవ చరణము.
 

"పద్మనయన వలన ప్రమదంబు నిండార"
 యని పూరించినాడు. 
అంతలో 
నా పిల్లకు దగిలిన గాయములన్నియు మాయమైపోయినవి
యేదో కట్టుకథ 

పోతన్నకు బిడ్డయుండెనో లేదో మనమెరుగము. 
'బాలకు +అమరె 'అను చోట కమరె అను అమంగళార్థము 
ని గట్టుకొని యీడ్చినవే. తప్ప తోచునది గాదు. 
నిష్కర్షగా నీ కథ యెవరో యజ్ఞుని కల్పనయని 
దాని ముఖమే చెప్పుచున్నది. 
కాని దీని నిట నెందుకు జెప్పితిననగా 
జన సామాన్యమునకు 
పోతన్న పైనున్న దృష్టి యిట్టిదని చూపుటకు 
వారి తలపులలో 
నాతడేదో నాల్గు ఛందస్సు ముక్కలు చప్పరించి 
తోచినదెల్ల కవిత్వమని కలిపి కొట్టినవాడు గాడు. 
మహా తపస్వి. 
వశ్యవాక్కు 
శాపానుగ్రహ దక్షుడు. 
ఇంతయయ్యును పరమ సాత్వికుడు.
 మరి యీ స్థితికాతడు వచ్చుటకెన్ని సంవత్సరములు బట్టినది
 యేమో 
ఒక్కటి మాత్రము నిజము. 
ఆతడు పొందిన యీ సిధ్ధి 
మూడునాళ్ళలో సాధించినది మాత్రము గాదు. 
కామ క్రోధాదులతో 
బాహ్యమైన సమాజముతో 
యౌవ్వనముతో 
పోతనామాత్యుదెంతయో బాధపడియుండును 

 గజేంద్ర మో క్ష ములో కరిరాజు యీ పద్యముల జెప్పెను

''కలడందురు దీనులయెడ
కలడందురు పరమయోగి గ
ములపాలన్
కలడందురన్ని దిశలను
కలడు కలండనెడు వాడు కలడో లేడో''
 

''వినుదట జీవుల మాటలు
చనుదట చనరాని చోట్ల  శరణార్థులకో
యనుదట పిలచిన  సర్వము
గనుదట సందేహమయ్యె కరుణావార్ధీ..''
 

యీ పద్యములు జెప్పినది గజరాజని మనమనుకొనుచున్నను 
యీ భావములు పోతనామాత్యుడెన్ని సారులు 
హృదయమున శంకించుకొన్నవే. 
యే సాధకునికైనను యీ స్థితి తప్పదు. 
కాని యింతలో అనుత్సాహము జెందక 
నతడు ద్విగుణీకృతమైన పట్టుదలతో 
జన్మ యంతయు సాధించెను. 
సాధించి 
భాగవతమునందలి సుతలాధీశ్వరుడైన యింద్రసేనుడన్నట్లు
 


''కంటి కంటి భవాబ్ధి దాటక గంటి, ముక్తి నిధానముల్
కంటి, నీ కరుణావలోకము కంటి, పాపము నీడ, 

ముక్కంటి తామర చూలియున్, బొడగాన నట్టి మహాత్ము, నా
యింటికిన్ జనుదెంచి తీశ్వర యే కృతార్థత బొందినన్''

అని తృప్తిగ నానంద భాష్పములు రాల్చగలిగెను

.అతనికి
 

''హరిమయము విశ్వమంతయు
హరి విశ్వమయుడు సంశయము పనిలేదా
హరిమయము గాని ద్రవ్యము
పరమాణువు లేదు....''
 

అన్న భావము అడుగడుగునను భాసింపదొడగెను. 
మన ప్రాచీనులది భల్లూకపు పట్టు 
రక్తి విరక్తులలో  నేది బట్టినను సరే. 
వారు కడజూతురు. 
నేటి మన యావేశములు సోడా పొంగులవంటివి. 
చూచుచుండగనే పొంగినగ్త క్రుంగిపోవును. 
మనకు గావలసిన ప్రతి చిన్న పనియు నెవడో 
వీర భోగ వసంత రాయలు చేసిపెట్టవలయును. 
యీ సోమరి నమును సమర్థించుకొనుటకు 
వేయి కారణములను ద్రవ్వెదము.