9 నవం, 2012

రాయల పద్యానికి ఆచార్యుల వ్యాఖ్య..సాహితీ సమరాంగణచక్రవర్తి
కృష్ణదేవరాయలు
వారి రచన 'ఆముక్త మాల్యద'
దీనికి 'విష్ణుచిత్తీయం' అనికూడాపేరు
పంచకావ్యాలలో ఇది ఒకటి

ఇది శృంగార కావ్యం కాదు
భక్తి వైరాగ్య రసాల మేళవింపు
నారికేళపాకంగా ప్రసిధ్ధి పొందిందిది.
అంటే అంత సులభంగా కొరుకుడు పడదన్నమాట.


కానీ 
కొన్ని లలితమైన పద్యాలూ 
మనల్నిపరవశింపజేస్తాయి 

"తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను


 తెలుగు రేడ నేను తెలుగొకండ
 

 యెల్లవారు వినగ యెరుగవే బాసాడి


 దేశ భాష లందు తెలుగు లెస్స"-'దేశ భాషలందు తెలుగు లెస్స..'

 అని నేటికీ మనం అనుకుంటూ వుంటాం 

రాయల వారిని తలుచుకుంటూ 


 'సంగతియె యోయి? ఇసుమంత ఠింగణావు!

 తత్వ్త నిర్ణయ వాదంబు తరమె నీకు?

 ఓడితేనియు పట్టి మొర్రో అనంగ

 లింగమును కట్టకుడుగ మెరింగి నొడువు!'


పాండ్య రాజు 

తనను వైష్ణవుణిగా చేయడానికి వచ్చిన 

యామునుణితో అంటాడిలా..'ఇసుమంత ఠింగణావు' అనడంలో ఎంత 


 సహజత్వముందో కదా..

 మొర్రో అన్నా లింగాన్ని కట్టకుండా వదలడట..


పుట్టపర్తి వారి పద్యంబొక్కటి చెప్పి 


ఆంధ్ర ప్రభలో వచ్చేది


ఆముక్త మాల్యదలోని క్రింది పద్యానికి 

వారి వ్యాఖ్య ఇది

రాయలవారూ వైష్ణవుడైనందున 

వైష్ణవపధ్ధతులను చక్క్గగా  వర్ణించాడన్నారు గోదాదేవి తాను మాలలను ధరించి మురిసి

అవే మాలలను ఆలయానికి పంపేది

ఆ మాలలను స్వామీ

ప్రేమగా అందుకొని ధరించేవారు

భక్తి లోని  అధికారాన్ని 


మనకు దర్శనం చేయిస్తుంది గోదా కథ.

"అందుండున్ ద్వయ సద్మపద్మవదనుం,డద్వంద్వు దశ్రాంతయో
గాందూబధ్ధ్,మధు ద్విషద్ద్విరదు,డన్వర్థాభిధానుండు రు
చ్ఛందో బృంద తదంత వాగ పఠనా సంజాత తజ్జన్య ని
ష్పందద్ద్వైత సుసంవిదాలయుడు నిష్ఠన్ విష్ణుచిత్తుండనన్"

పై పద్యం ..
ఆముక్త మాల్యదలోనిది 
ఆ గ్రంధాన్ని రచించిన వారు కృష్ణదేవరాయలు 
ఇందులో నాయిక గోదాదేవి 
ఆవిడ తాను కొప్పులో పెట్టుకుని 
వదలిపెట్టిన మాలను 
శ్రీరంగనాధునికి సమర్పించిందట 
రంగనాధునిపై అంతటి అధికారం 
ఆమె భక్తికి 
శ్రీరంగాధిపుడంతగా వశమైపోయినాడు 

రాయల రచనలో 
నిర్లక్ష్యంగా చేసే ప్రయోగాలూ 
చిత్రములైన సంస్కృత సమాసాలూ 
నిర్భీకమైన రచనా 
ఇవన్నీ తటస్థిస్తాయి పద్యాన్ని 

అన్వయించడంలో 
సంస్కృత మర్యాద 
కొట్టవచ్చినట్లు కనబడుతుంది. 

ఈ పద్యంలో 
గోదాదేవి తండ్రి విష్ణుచిత్తునిది 
అన్వర్థమైన అభిదానం 
'సార్థకమైన పేరు..'
 అని భావం.

విష్ణు చిత్తుడంటే అర్థమేమిటి..?
తన మనస్సులో యెప్పుడూ..
శ్రీమహావిష్ణువును నిక్షేపించికొని వుండేవాడు.. 

శ్రీమహావిష్ణువు చిత్తంలో 
తాముండేవారని కూడా అర్థం. 
అంటే ..
పరమాత్ముణ్ణి భక్తితో 
తన హృదయంలో యెప్పుడూ కట్టివేసుకున్నవాడు. 

ఆ అర్థాన్నే 
రెండవపాదంలో చెప్పుతున్నాడు. 
ఇతని భక్తికి భగవంతుడున్నూ 
యెప్పుడూ విష్ణుచిత్తుణ్ణి అనుకుంటూ వుంటాడు.

ఈ రీతిగా 
రంగనాయకులకూ 
విష్ణుచిత్తునికీ వున్న సంబంధం 
పరస్పరాశ్రయమైనది. 

తమిళంలో 
విష్ణుచిత్తుణ్ణి పెరియాళ్వార్ అంటారు 
'ద్వయపద్మ పద్మ వదనుడు...'
ఈ మాటకర్థమేమిటి..?

వైష్ణవులకు నారాయణమంత్రం ప్రధానం 
దాన్ని యెల్లప్పుడు జపించడానికి వీల్లేదు 
నిష్టలోనే జపించాలి. 

ద్వయ మనే మరో మంత్రముంది 
దానికి రెండు పాదాలుంటాయి. 
అందుచేతనే దాన్ని ద్వయమన్నారు. 
లక్ష్మీ విశిష్టుడైన నారాయణుని గూర్చి 
ఆ మంత్రం చెబుతుంది. 

దీన్ని సర్వకాల సర్వావస్థల యందు జపించవచ్చు 
ఆ విషయాన్నే రాయలు చెప్పుతున్నాడు 
విష్ణుచిత్తుడు సర్వకాలాలోనూ 
ద్వయమంత్రాన్ని 
అనుసంధానం చేస్తూ వుంటాడన్నమాట. 

మూడవ పాదంలో
 వేదాలు ఉపనిషత్తులూ చదవకపోయినా 
వానిచే సంపాదించుకోదగిన విజ్ఞానాన్ని పొందినవాడంటున్నాడు. 

సంప్రదాయ సిధ్ధంగా 
పెరియాళ్వారును గూర్చిన ధ్యాన శ్లోకం కూడా 
ఈ విషయాన్నే చెబుతుంది. 

పెరియాళ్వార్ 
యెక్కువగా చదువుకున్నవాడు కాదు. 
చిన్ననాటినుంచీ 
భగవద్భక్తికి అలవాటు పడినవాడు. 

ద్వైత శబ్దానికేమర్థం ..?
'శేష-శేషి' భావం 
ఇది చాలా ముఖ్యమైనది. 

భగవంతుడు సమస్త ప్రపంచానికీ శేషి. 
జీవుడు శేషుడు. 
ఈ భావం యెప్పుడూ 
విష్ణు చిత్తుని మనస్సులో వుంటూండేదంటాడు 

రాయలు వైష్ణవ సంప్రదాయానికి చెందినవాడు. 
అందులోని రహస్యాలన్నీ 
చక్కగా ఆకళించుకొన్నవాడు. 
ఆ వైష్ణవ సిధ్ధాంతాల పై నిర్మించిన పద్యమిది.

6.8.1982