28 జూన్, 2013

వారాల అబ్బాయిలు

                        
వట్టి చేతులతో వచ్చిన లక్ష్మీదేవికి ఎవరు ఆతిధ్యమివ్వగలరు..?


ధనం ఉన్నప్పుడే దానం చేయగలడనీ..
ఉపాధి ఉన్నవాడే ఊరికి ఉపకారం చేస్తాడనీ..
అనుకోవడం వెర్రి తనం ..

గుండె పండినవాడే పదిమందికి సాయం చేస్తాడు..
చెప్పులు కుట్టే చంద్రయ్య కైనా 
రోజుకి అర్ధరూపాయ్ వస్తుందేమో
 కానీ
అచ్యుతరామయ్యకి ఖచ్చితంగా ఇంత వస్తుందని  ఉండేది కాదు..
పొద్దుటే ముష్టి చెంబు పట్టుకుని
సీతారామాభ్యాన్నమః
అంటూ నాలుగు వీధులూ తిరిగితే అర్ధశేరు బియ్యం
జంధ్యాలు వడికితే అర్ధరూపాయి దక్కేవి
వీటితో సంసారం గడవడం కష్టమే

అయినా అతనెప్పుడూ దీనంగా దిగులుగా ఉండేవాడు కాదు..
పదిమందికీ తల్లో నాలుకలా నవ్వుతూ నవ్విస్తూ 
పదిమందికీ సాయం చేస్తూ కాలక్షేపం చేసేవాడు

ఊరంతా ఉప్పునీళ్ళే
కూలిపోతున్న పాకా 
ఓ మందార చెట్టు 
పక్కనే ఓ మంచినీళ్ళ బావీ..

ఊరందరూ అతని బావిలో నీరు తోడుకు వెళ్ళవలసిందే..
అతను కాదంటే వారికి మరో మార్గం లేదు..
అతని దారిద్ర్యం ఆసరా చేసుకుని 
అందరి దగ్గరా తలా అర్ధరూపాయ్ వసూలు చేసినా 
అతని బీదరికం మటుమాయమయ్యేది..

కానీ 
అతనికి అలాంటి నీచమైన ఆలోచన యెప్పుడూ రాలేదు..
ఊరంతా తన బావిలో నీళ్ళు తోడుకుని వెడుతుంటే 
ఆనందంగా సంతోషంగా చూస్తూ ఉండేవాడు..
ముసలి వాళ్ళూ 
పిల్లలూ చేద లాగలేక ఇబ్బంది పడితే
తాను వెళ్ళి సాయం చేసి వారు కృతజ్ఞతలు చెప్పబోతే.. 
చాల్లెండి ఏమాత్రానికేనా 
అని సిగ్గు పడిపోయేవాడు..

అవతలి వాడు అవసరం లో ఉన్నాడు కదా
 వీలైనంత దండుకుందాం 
అనే తత్త్వం ఆ రోజుల్లో నూటికి తొంభై మందికి ఉండేది కాదు 

ఇలా 
''ఆరోజుల్లో..'' పుస్తకంలో 
పోలాప్రగడ సత్యనారాయణమూర్తి గారు 
పరిచయం చేసిన నాటి మనుష్యుల మనస్తత్వాలు ఎన్నో
చెయ్యి తిరిగిన రచయిత ఏది చెప్పినా అద్భుతమే..

నిజమే ఆ రోజుల్లో దాతృత్వం పాలు ఎక్కువే..
మా ఇంట్లో 
వారాల అబ్బాయిలు ఎప్పుడూ ఉండేవారట..
ముగ్గురు నలుగురు..

వంటవగానే మా అమ్మ 
అప్పటికి పదేండ్ల దయిన మా నాగక్కయ్యతో 

"ఏయ్ నాగా..
 వెళ్ళి వాళ్ళని అన్నానికి రమ్మను పో .."అనేదట
మా అక్కయ్య రివ్వున వెళ్ళి
"అన్నా..
 అన్నానికి రావాలంట
వంటయింది..
మా అమ్మ రమ్మంటూంది.."
అని చెప్పేది..

ఆ హైస్కూల్ పండితుని 
రెండువందల జీతంలో 
అద్దె ఇంట్లోనితమ అయిదుగురు పిల్లలతో  పాటూ
 వారాల అబ్బాయిలూ బరువనిపించలేదు..

ఒకసారి
మా పిన్ని కూతురు అల్లుడూ వచ్చారు చూడటానికి
''ఉండండి..
సాపాటు చేద్దురు ..''అంది అమ్మ

కానీ
ఇంట్లో బియ్యం లేవు
పక్క ఇంట్లో అరువుకు బియ్యం కావలసిన సామగ్రి తెచ్చి 
వారికి అతిఢి సత్కారం చేసింది మా అమ్మ

మా పిన్ని అల్లుడు పుట్టపర్తికి అమిత భక్తుడు
ఉపాసనాపరంగా సాహిత్య పరంగానూ
ఆయన ఇంటి పరిస్తితి చూసి 
అంతటి పండితునికీ పరిస్తితి యేమిటో కదా
అని చాలా బాధ పడ్డాడట..