6 ఏప్రి, 2017

తడివోవని పూలసెజ్జ..

శ్రీరామ నవమి.. అమ్మకు చాలా ప్రియమైన పండుగ..అసలు అమ్మ ఆరాధ్య దైవం శ్రీరాముడే! (అయ్య అష్టాక్షరీ ఉపాసకులు) అమ్మ పాటల్లో యెక్కువ శ్రీరామాంకితాలే!మా అమ్మగారి భావాలన్నీ, కోమల భావ భరితాలు..., లలిత పద బంధ సౌరభ సమంచితాలు....మీరూ చదివి, విని అనుభూతిస్తారని నా ఆశ.  వాటిలో యీ పాట, యెక్కువ ప్రజాదరణ పొందింది ఆకాశవాణి ద్వారా!  (శ్రీరామ నవమి శుభ తరుణాన, మా అమ్మ పవిత్ర స్మృతిలో..మా మూడో అక్కయ్య. డా.పుట్టపర్తి తులజాదేవి, .నా చెల్లెలు శ్రీమతి పుట్టపర్తి అనూరాధ తో కలిసి యీ పాట మీకోసం)

రాముని సేవించెనూ, ప్రేమమ్మున సకల ప్రకృతి
 రాముని సేవించెనూ...

అడవుల త్రోవల జనగా, అడుగులు కందెడునోయని,
తడివోవని పూల సెజ్జ అడుగడుగున పరచిలతలు..

రాముని..

తోయజ మకరంద ధునీ తోయంబుల మెల్లగా,
తోయజాంబకుని  మృదుపద తోయంబుల కడిగి నదులు..

శ్రీ రాముని...

తారక రాముడు రాముడు కారడవుల పయనించగ,
పోరాములు మాని ప్రకృతి గారాములు నెరపీ...
శ్రీ రాముని...

రచన : శ్రీమతి పుట్టపర్తి కనకమ్మగారు
సంగీతం డా.మాడభూషి చిత్తరంజన్ గారు
భక్తి రంజనికోసం ఆకాశవాణి విజయవాడలో
ముందుగా గానం చేసినది: శ్రీ డీ.వీ.మోహన కృష్ణ (బాలమురళిగారి ప్రియ శిష్యుడు) బృందం
ఇప్పుడు వినయపూర్వక సమర్పణ : నాగపద్మిని