23 జులై, 2015

దొరకునా ఇటువంటి సేవ


'ఈలాగున వివరింపలేను
చాలా స్వానుభవైకవేద్యమే '
అన్నారు త్యాగరాజ స్వామి


'మూ కాస్వాదనవత్'
 అన్నాడు నారదుడు
మూగ వానికి తీపి పదార్థాలను పెట్టి 
ఎలాగున్నాయంటే ఏం చెప్తాడు.. 

అలానే .. 
భక్తి సామ్రాజ్జాన్ని అనుభవిస్తున్న భక్తుని చూస్తే 
కలిగే ఆనందం వర్ణనకందదు..

సంగీతంతో ఎన్నెన్ని సాధించవచ్చో 
ఋజువు చేశాడు త్యాగయ్య
ఋజువు చేయాలని కాదు

దివ్యమైన  అనుభూతితో 
హృదయాన్ని పరమాత్మతో అనుసంధానం చేసినప్పుడు..
ఆ విద్యకు ఈశ్వర శక్తి వస్తుంది..

యే విద్య హృదయంతో ఈశ్వరునితో 
అనుసంధానం అవుతుందో..
ఆ విద్యకు ఈశ్వర శక్తి వస్తుంది..



'వసుచరిత్ర సాహితీ సౌరభము' లో 
భట్టుమూర్తి గురించి ప్రస్తావిస్తూ 
ఒక చోట ఇట్లంటారు పుట్టపర్తి ...

''ఇక నీతని సంగీత కళాపాండిత్యము 
కొంత చవిచూడవలసియున్నది..
ఇతని దయతో దిరుమల రాయడును 
నాద రక్తి రసికుడైనాడు 

మూర్తి కవికి 'నాద' శబ్దముపై 
నెక్కువ ప్రణయము..
సంగీత విషయము చెప్పవలసి వచ్చినపుడు..
' నాద ' శబ్దమున కెట్లును 
ప్రధమ తాంబూలము తప్పదు..

వేరు చోటులను మూర్తికవి సామాన్యముగా 
శబ్ద పర్యాయముగా 'నాద'మనియే వాడును 

'నాదోపాసనమే సంగీతము.. ' 
'నాదోపాసనతో నారాయణ విదులు తరించిరని'
త్యాగరాజన్నాడు

గాన యోగుల దృష్టిలో 
జగమంతయు నాదమయమే..
పరమశివుడు నాదతనుడు
రాగరత్న మాలికచే హరిరంజిల్లు నట..

'స్వాదుఫల ప్రద సప్త స్వర రాగ నిచయ నిహిత 
నాదలోలుడై బ్రహ్మా నంద మందవే మనసా'

యని త్యాగయ్య హితబోధ..
సంగీత జ్ఞాన హీనులకు 'మోక్షము గలదా..?'
యని యాతని సవాలు..
'నిద్దుర నిరాకరించి..
శుధ్ధమైన మనస్సుతో '
బాడినంత రాముడు సంతోషింపడు..
'ముద్దుగా తంబూరా బట్టి సుస్వరముతో బాడవలె' నట..

సంగీత మర్థముగాని మొద్దులను జూచి 

''అటుకుల రుచి యెద్దులకు దెలియునా..?'' 
యని త్యాగ బ్రహ్మము నవ్వినాడు..

ఆ సప్త స్వర సుందరుల యనుభూతి 
యచ్చరల యాలింగనమునకు బైచేయి
కమ్మగా స్వర శృతిలో లీ నమై.. 
స్వరములు బల్కించుట 
బహుజన్మ తపః ఫలము 
త్యాగరాజు రాముడు గూడ నిట్టివాడు..

''నాద సుధా రసం బిలను నరాకృతాయెరా..
వేదపురాణాగమ శాస్త్రాదుల కాధారమౌ..

స్వరములు ఆరొక గంటలు వరరాగము కోదండము..
దురనదేశ్యము త్రిగుణము నిరతగతి శరము రా

సరస సంగతి సందర్భము గలగిరములు రా..
ధరభజనే భాగ్యమురా .. త్యాగరాజు సేవించు.. 

నాద సుధా రసమే రామ స్వరూపమైనదట..
ఆ మూర్తికీ రాగమే కోదండము
స్వర సుందరులే దాని గంటలు
నిరంతర రాగాలాపనమే శరము..

ఓహో.. ఎంత మధురమైన ఉపాస..
త్యాగయ్య తన్ను మరచి పాడినవాడు
అంటారు పుట్టపర్తి ..

యేమైనా 

తనకోసం తపించే వారి వద్దకు 
తానూ వెతుక్కుంటూ వెడతాడు పరమాత్మ.. 
ఎవరైతే ఏకాగ్ర చిత్తంతో పరతత్త్వాన్ని ధ్యానిస్తూ వుంటారో .. 
దైవం వారి వద్దకు తానే వెళుతుంది .. 
అంతటి ఉదారంతో కూడినది ఆయన కారుణ్యం ..