20 ఏప్రి, 2012

పుట్టపర్తి నారాయణాచార్యుల వ్యక్తిత్వ దర్శనం--పుట్టపర్తి అనూరాధ

puttaparthi  Anuradha
సకల శాస్త్రాలూ చదివి
పునర్జన్మ పట్ల కర్మ సిధ్ధాంతం పట్లా 
గాఢమైన నమ్మకం విశ్వాసం కలిగిన ఈ పండితుడు..
మార్క్స్ సాహిత్యాన్ని ఆమూలాగ్రం చదివి..
అతన్ని అతనికన్నా ప్రేమించి అర్థం చేసుకొని..
ఈ సిధ్ధాంతాలకు 

బహుధా వ్యతిరేకి అయిన మార్క్స్ ను 
మహర్షి అన్నాడు..
 
కారల్ మార్క్స్ కు ముందు 
ఈ సమాజంలో ఉండే చెడును పోగొట్టడానికి 
శాస్త్రీయ మార్గం ఏర్పడలేదు.
ఆయన తరువాత 
ఈ ప్రపంచంలో ఉండే చెడును అరికట్టడానికి 
మార్గం తెలిసింది. 
అందుకే అనేక సార్లు చెప్పాను 
ఆయన మహర్షి అని.
అంటాడు..
 

ఎవరికీ తలవంచని స్వతంత్ర ప్రవృత్తి 
విశృంఖలతకు దారి తీసినా 
ఆ ఇనుప సంకెళ్ళనుంచీ 
జాగ్రత్తగా తన జీవిత కమలాన్ని 
పరమాత్మ పాదాలకు 
సమర్పణ చేసే దిశగా పయనించి 
తిరిగి దిద్దుకోలేని తప్పులనే చీకటి లోయలలో పడిపోకుండా 
జీవితాన్ని ఎలా కాపాడుకోవచ్చో 
మానవజాతికి నిదర్శనంగా 
తన జీవితాన్ని చూపించాడు..మా అయ్య..




మార్క్స్ ను చదువు తున్నప్పుడు 
బ్రహ్మాండమైన సానుభూతీ..
తరువాత 

అరవింద ఘోష్ ను చదువుతున్నప్పుడు..
 

అయ్యో ..
కేవలం భౌతిక దృష్టి ఎక్కువై ..
మానవుడు తక్కినవన్నీ నిర్లక్ష్యం చేస్తున్నాడే..
అనే దృష్టీ ..
పృధివీ.. ప్రతిష్టా ..అంటాడు అరవిందుడు ..
భూమిలేనిది పరలోకమే లేదు పోరా.. అంటాడు. 

అందుకే ..
అతనంటే నాకు చాలా ఇష్టం. 
బుధ్ధిజాన్నీ ..సన్యాసి తత్వాన్ని ..
అతడు అంగీకరించడు..
కనుకనే ..
మార్క్స్ నూ ..అరవిందుడినీ..
ఎవరైనా దగ్గరికి తెస్తే బాగుంటుంది కదా 
అన్న చాపల్యం ..
తీవ్రంగా ఏడిపిస్తుంటుంది నన్ను .
నాకు వయసెక్కువైపోయింది నాచేతకాదు. 

ఏం 
కళ్ళల్లో నీరు తిరిగి అక్షరాలు కనబటంలేదా..
ఇంకా చూడండి..
 

శ్రీవైష్ణవుడై ..
దాసానుదాసత్వాన్ని శిరసావహించే 
ఈ మానవుడు..
సంప్రదాయవాదులు ఆచరించే 
నియమ నిబంధనలను తుంగల్లో తొక్కి..
వారి ఆగ్రహానికి గురి అయినాడు..

అందుకే 
కాఫీ తాగి అయ్య బీడీ వెలిగించటం 
పడమటి కొండల్లో పొద్దు పొడుపులాగా 
అనిపించింది వల్లంపాటి గారికి..


"కాఫీ తాగి తాజ్ మహల్ బీడీ వెలిగించారు.
వారు బీడీ వెలిగించడం నాకు 
ఎందుచేతనో చాలా చిత్రమనిపించింది.
అంతటి మహాకవీ, మేధావి, పండితుడూ, 
ముఖ్యంగా
సంస్కృతపండితుడూ, 
బీడీ కాల్చటం ఏదో పడమటికొండల్లో
 పొద్దుపొడుపులాగా విచిత్రంగా కనిపించింది"


అప్పుడప్పుడూ సంభాషణల్లో 
“నా బుద్ధి అద్వైతం, హృదయం విశిష్టాద్వైతం”
అని నవ్వేవారు.
కొంతమంది బంధువులకు ఇది నచ్చేది కాదు.
వారిలో కొందరు 
“శివతాండవం విన్న వీరినోట కృష్ణలీలలు వినాలని
 ఉంది” అనో, 
లేకపోతే 
“శివతాండవం కన్నా మేఘదూతం మేలైన రచన
” అనో సన్నాయి నొక్కులు నొక్కేవారు. 
చాలా మంది బ్రాహ్మణులు
వారిని చెడిపోయిన బ్రాహ్మణ్ణిగానే చూసేవారు. 

కడపవీధుల్లో
జట్కాసాయిబుల భుజాల మీద చేయి వేసుకుని నడుస్తున్న
వారిని చూసి లోపల్లోపల అసహ్యించుకునేవారు. 
ఎదుట పడ్డప్పుడు మాత్రం 
పాదాభివందనాలు చేసేవాళ్ళు.
భక్తికీ హృదయానికీ సంబంధాన్ని చూడండి.

“భక్తి నిరంతర ప్రేమ ప్రవాహమన్నాడు. 
అంతేకాదు, 
భగవంతుణ్ణి
బుద్ధితో కాకుండా హృదయంతో చూడడమే భక్తి. 
అన్నం లేకుండా బతకగలను.
కానీ భగవంతుడు లేకుండా బతకలేను” 
అనేవారు. 
వారి హృదయాన్ని
అర్థం చేసుకోవటానికి ’పాద్యము’ చదవటం అవసరమని
నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను.
 
                 





గొల్లాపిన్ని శేషాచలం గారు..
అయ్యకు సన్నిహితుడు..
మా అన్నయ్య అరవిందు వయసువాడు..
అయ్యపై సిధ్ధాంత వ్యాసం వ్రాసారు 

ఆయనకు ఫోన్ చేస్తే 
తన జ్ఞాపకాలు కొన్ని పంచుకున్నారు.
               


1960-62 మాట ..
తులసీదాసునీ ..శ్రీనాధునీ..

పరిచయం చేస్తూ పుట్టపర్తి వారు..
కడప , రామ కృష్ణా హైస్కూలులో..

దాదాపు అయిదారు గంటలపాటు క్లాసు తీసుకొనేవారు..
ఆ రోజు ఇక యే క్లాసులూ జరగవు..
ఆయనకి బుధ్ధి పుడితే..

లేకపోతే..
తన చదువూ తన వ్యాసంగంలోనే వుండేవారు..
ఎవ్వరూ ఆ స్కూలులో 

ఆయనని ..
మీరు అందరిలా క్లాసులు తీసుకోవాలనీ 
పాఠాలు చెప్పాలనీ 
నిర్బంధించేవారు కాదు..

 

ఎంత బాగుంది స్వామీ అని పొగడితే..
మీరెవర్రా పొగిడేదానికి 

వాళ్ళు స్వతహాగా గొప్పవారు
అని తిట్టేవారు..
 

జనప్రియరామాయణంపై సిధ్ధాంత వ్యాసం చేయాలనుకున్నాను స్వామీ 
అంటే..
నేను బ్రతికుండగానే చేయరా..
అన్నారు.
 
కానీ నా దురదృష్టం..
చేయలేకపోయాను..
 

ఆయన డెబ్బయ్ దాటిన వయసులో..
తబలా వాయిస్తుండగా ..
మా నాన్నగారితో వెళ్ళినప్పుడు ..
నేను చూసాను.

అలానే 
కడపలో గజ్జె కట్టడమూ నేనెరుగుదును..

ఇక అయ్యవ్యక్తిత్వంలోని వైశిష్ట్యాన్ని చూద్దామా.. 
                 
కవితా పుత్రుని కవితా మార్గం


గొల్లాపిన్ని శేషాచలం ,
ఆంధ్రోపన్యాసకులు,
ప్రభుత్వ జూనియర్ కళాశాల, తాడిపత్రి.



పుట్టపర్తి జనప్రియం (సిద్ధాంత వ్యాసం)
రచన : డా. గొల్లాపిన్ని శేషాచలం
పేజీలు : 352, వెల: రూ.250/-
ప్రతులకు : 09440745878
శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల వారిది 
ఒక విలక్షణమైన ప్రకృతి.
అనువంశికంగా అందిన ప్రతిభావ్యుత్పత్తులూ 
బహు భాషా పరిచయం వల్ల కలిగిన 
విశాల దృష్టి 
భారతదేశం లోని 
పలు ప్రాంతాలను దర్శించుటవల్ల కల్గిన అనుభవం 
వివిధ ప్రాంతాల రచయితల తోడి 
పరిచయం వలన కలిగిన 
శేముషీ విభవం 
పుట్టపర్తి వారిని 
ఒక విశిష్ట వ్యక్తిగా తీర్చినాయి.
 
జన్మతః సంక్రమించిన స్వతంత్రతా ప్రవృత్తి ..
విశృంఖలతకు దారితీసినా ..
సం యమన శీలంపై మక్కువతో..
ఆత్మావలోకనం చేసుకొనే గుణం సహజమైంది. 

అందుబాటులో ఉన్న ప్రతి కొత్తను..
తనదిగ చేసుకోవాలనే తహ తహ వుంది.
 
ఆ గుణం వల్లే 
పధ్నాలుగు భాషల అధ్యయనం సాధ్య పడింది. 
శృతి స్మృతి పురాణేతిహాస ప్రబంధాలను 
ఆపోశనం పట్టడం కూడ 
ఇందువల్ల సాధ్యమైంది.
 
ఆంగ్ల సారస్వత మధనం 

మార్క్స్ పంధా పరిశీలనం 
గాంధీ తత్వానుశీలనం 
 అంతెందుకు 
కంటికి కనపడిన 
చెవికి వినపడిన 
మనసుకు అందిన సర్వాన్ని 
తనదిగా చేసుకోదలచిన 
నిత్యాధ్యయనశీలి ఆయన.
 
ఆయా సమయాలలో దివిన చదువులు
 క్రమ పరిణామశీలమైన వయసు 
విభిన్న సంస్కారులైన సహచరులు 
అతణ్ణి అతని భావాలను 
అనేక గతుల మార్చినాయి
 
ఆస్తికతపై ఆసక్తి 
భౌతికత వాదంపై అనురక్తి 
సంప్రదాయ సిధ్ధాలైన ఆచార వ్యవహారలపై విరక్తి 
ఇలాగ ఆయన భావాలు శబలితాలై కంపిస్తాయి.
 
పుట్టపర్తి శ్రీ వైష్ణవుడైననూ 
శివభక్తిని ప్రదర్శిస్తూ 
అనేక కీర్తనలూ 
శివతాండవమను కావ్యం రచించినాడు.
పోనీ ఆయన శైవుడందామా 
శ్రీ వైష్ణవ దాసానుదాసత్వము 
ఆయనకు ప్రీతికరమైన విషయము.
 
అద్వైతియా కాదు
అష్టాక్షరీ మంత్ర జప ప్రాయణత్వమే కాదు 
కీర్తన లన్నీ అష్టాక్షరీ మిళితాలే 
విష్ణు పారమ్యతను 
జనప్రియ రామాయణం లో 
శైవ వేష్ణవ ధనుశ్చరిత్రలో 
హృదయ గతంగా చాటినాడు.
 
పునర్జన్మ సిధ్ధాంతాన్ని 
కర్మ సిధ్ధాంతాన్ని నమ్ముతూ
 వాటిపై ఆధార పడిన 
పండరీ భాగవత రామాయణాదులను 
రచించినాడు.
ఈ సిధ్ధాంతాలకు బహుధా వ్యతిరేకి అయిన 
మార్క్స్ ను మహర్షి అన్నాడు. 
మేఘదూత అనే కావ్యాన్ని రచించాడు.
ఈ విధంగా ఇదమిధ్ధంగా 
ఇతడిట్టివాడని ఇతని తత్వమిట్టిదని 
తేల్చి చెప్పుటకు వీలులేని 
ఒక జటిలమైన వ్యక్తి శ్రీ పుట్టపర్తి.
ఆయన పెద్ద వయసు వరకు జీవించినారు
ఆయనలోని పరిణతి చాలా గొప్పది.
 
ఆయన బాణీననుసరించి 
కవిత్వం వ్రాయాలనే రచయితలున్నారు. 
కానీ 
ఆయనవలె పాండిత్యాన్ని సాధించిన వారు అరుదు. 
 ఆయనవలె పఠనాసక్తి గలవారు తక్కువ.
 
తనను విమర్శించిన వారిని కూడ పుట్టపర్తి 
తన రచనల్లో తప్పుపట్టలేదు.
 
"నవ్యతరమైన మధుర గాన స్రవంతి..
కొకడు తలయూచు మఋఇయొకడోసరిల్లు..
వీణదోషమా ..?లేక వినెడివారి..
తప్పిదమా..? కాదు.. భావ భేదమె సుమ్ము..!"
పుట్టపర్తి వారి షాజీ కావ్యం నుంచీ..
 
ఈ పద్యాన్ని మనసులో పెట్టుకుని 
పాణ్యం సోదరులు (ఉయ్యాలవాడ) 
ప్రభాతరేఖలు అన్న తమ కావ్యంలో 
ఇలా అన్నారు.  
"హారి ఘుమ ఘుమ పరిమళమౌచు తా సు
మమ్ము విచ్చుటే ప్రకృతి సిధ్ధమ్ము సుమ్ము..
కొన్ననేమి సరే కొనకున్ననేమి..
దానికేలాటివియు కొరతలును లేవు."

పుట్టపర్తి దృక్పధంలో 
తన కవిత్వం శ్రావ్యమై 
మనో హరం గా ఉండటమే కాదు 
జనప్రియంగా ఉండాలన్నది ఆయన కోరిక
 
అందుకే 
రాగ తాళ లయ బధ్ధంగా ఉండే రీతిగా 
తన రచనలను రూపొందించుకున్నాడు.
కవి వాల్మీకి అభిప్రాయం కూడా ఇదే కదా..
 
ఇంక కవిత్వంలో 
తన భావాంబర వీధిలో తళుక్కుమన్న ఊహలేకాక 
సార్వ కాలీనమైన 
పూర్వ కావ్యాలలోని 
ఇతర భాషా కవుల యొక్క భావాలను 
తన రచనలో ఇముడ్చుకొన్నారు.
ఆయన ఇతర కావ్యాలనుండి 
భావార్థాలను యధేచ్చాగా తీసుకోవటంలో 
తన రచన సర్వాంగ సుందరంగా 
వుండాలనే జన ప్రియంగా మలచాలనే 
ఉద్దేశ్యం ఆయనకుంది.
సంప్రదాయ కవిత్వరీతులు 
పాండిత్య ప్రకర్షపై అభిమానం 
(పండరీ భాగవతాదులు)
కలవాడైనా 
ఆయా సందర్భాలలో 
చందోబంధాల్నీ పాండిత్యాన్నీ వదిలేస్తారాయన 
దీనికి 
జనప్రియ రామాయణం 
మేఘదూతం 
చక్కని ఉదాహరణాలు.
 
పుట్టపర్తి కవి భావాలు 
చాల సునిశితమైనవి
ఆధునాతనకాలంలో కవిత్వాన్ని గూర్చి 
కొన్ని భావాలున్నాయి. 
సామాన్యులకు సైతం అర్థమయ్యేదే 
ఉత్తమ సాహిత్యం అని ఒక అభిప్రాయం.
 
పుట్టపర్తి ఈ అభిప్రాయానికి స్పందిస్తూ
సామాన్య ప్రజలు 
అన్నమాటకి అర్థం పరిమితమైంది
అందరికీ అర్థమయ్యేలా కవిత్వం ఎవ్వరూ చెప్పలేరు.
సంస్కారాలు భిన్నంగా ఉంటాయి 
అందరూ అర్థం చేసుకోలేరు అంటారు.
 
సామాజిక స్పృహ అనేమాట కొత్తది కాదని 
ప్రాచీనులలో అభ్యుదయ వాదులు లేరనడం 
పొరబాటనీ 
ఈనాడు వస్తున్న సాహిత్యంలో 
రాజకీయలు చోటు చేసుకొంటున్నాయనీ 
పుట్టపర్తి అభిప్రాయం 

అంతేగాక 
ఇనాడు 
సాహిత్యంలో ఒకరి రచనలు ఒకరు చదువరు
 పరస్పర గౌరవాభిమానాలు లేవు 
అని కూడా అంటుండేవారు 
కేవలం అభిప్రాయాలు 
అభిమాన దురభిమానాలను బట్టి ప్రకటిస్తారు 
అని అంటారు
 
ఇదే మాట 
విశ్వనాధ సత్యనారాయణగారు కూడ
మొదట చదవండి 
నచ్చకపోతే పారేయండి
అని అంటారొకచోట
 
అసలు కవిత్వానికి 
లయ ప్రధాన మంటారు పుట్టపర్తి 
ఇ రూపం అయినా సరే 
లయ అనేది లేకుండా 
కవిత్వం జీవించదనీ 
మానవ సృష్టిలోనే శరీర వ్యవస్థ లయ వుందనీ 
మనిషి ప్రతి కదలికలో లయ వుందనీ 
లయ లేకుండా 
మానవ సంబంధమైన కావ్యం 
ఇదీ లేదని 
నారాయణాచార్యులవారు 
పద్య కవిత్వానికి భవిష్యత్తు గూర్చి 
అభిప్రాయమిచ్చారు.
 
పుట్టపర్తి కవితాదృష్టి విశాలమైనది. 
సంప్రదాయ కవిత్వంపైన మక్కువ ఉంది. 
నవీన పధ్ధతులను 
ఆధునిక భావాలను 
రెండు చేతులా ఆహ్వానిస్తారాయన 
లయబధ్ధమైన గేయ కవిత్వాన్నీ 
మాత్రాచందస్సును ఆయన ఆదరిస్తారు.
మంచి వచన రచన ఆయన ప్రాణం.
కవితలో సమర్థవంతములైన 
అన్ని ప్రక్రియలూ శ్రీమాన్ పుట్టపర్తికి ఇష్టమే.