సాహిత్య కారుడు..
సాహిత్య సృష్టి చేయటంలో
వస్తువు చూట్టే తిరుగుతూ
భూతకాలంలోనో భవిషత్ లోనో ఉండిపోతారు
దానిలో ప్రవహించే వివిధ రకాల
రసావిష్కరణలో లీనమైపోతాడు
చర్మ చక్షువుకు అతీతమైన
విషయాలను చూడగలుగుతాడు.
చూసిన విషయాలను సమర్థంగా వివరించడానికి వర్ణనాశక్తీ ప్రతిభావంతంగా వుండాలి
అంత కష్టపడి తయారుచేసిన కల్పనలో
తనకు బాధ్యతా అంతే వుంటుంది
తను రాసినది పదిమంది వికాసనానికి
తోడ్పడకపోతే పో యె
చెరచకుండా వుంటే చాలు
తప్పటడుగులకు అవకాశమిచ్చేది కాకూడదు..
సరే ..
ఒక కథో కావ్యమో తయారయింది.
రచయితకు తన రచనను తలుచుకుంటే ఆనందం
ఎవరైనా బాగుందంటే చెప్పలేని పొంగు
ఇలా ..
చదివిన వాళ్ళల్లో కూడా రక రకాల భావోద్వేగాలు
వివిధ స్థాయిలలో కలుగుతాయి
ఒకడు బాగుందంటే..
ఇంకోడు ఏం బాగుందంటాడు..
మరొకడు భూతద్దాలు పెట్టుకుని
తప్పులు వెదుకుతాడు..
ఇంకోడు శాస్త్రబధ్ధంగా దాన్ని విశ్లేషించడానికి దిగుతాడు..
ఇలా
ఒక కవి బ్రతుకు నలుగురి నోళ్ళల్లో
నలిగి నలిగి బిక్కమొగమేస్తుంది.
కాస్త గట్టివాడైతే
విమర్శను పాజిటివ్ గా తీసుకొని
ఒక వేళ తిట్టినా స్పోర్టివ్ గా తీసుకొని
మళ్ళీ కలం పడతాడు
చేసిన తప్పులను ఒకసారి సరి చూసుకొని
మళ్ళీ అలాంటితప్పు జరగకుండా జాగ్రత్తపడతాడు
విమర్శకుడు
సృష్టికర్త కంటే హుషారుగా వుండాలి
కర్త చెప్పిన విషయం పై
అతని కంటే ఎక్కువ అవగాహన వుండాలి
విశ్లేషించటంలో
ఒక ప్రత్యేకమైన దృష్టీ నేర్పూ
వ్యక్తీకరణా వుండాలి.
"విమర్శకుడుగా పుట్టపర్తి"
అంటూ జి వి సుభ్రమణ్యం గారు
వారిలోని ఒక విశిష్టమైన కోణాన్ని
మనకు చూపబోతున్నారు.
మా అయ్యగారి వద్దకు
చాలామంది ముందు మాట వ్రాయమని వచ్చేవారు.
సాధారణంగా ఒప్పుకొనేవారు కాదు..
ఆయన స్థాయికి అవి అందేవి కాదు మరి..
కొన్నింటిని స్నేహ పూర్వకంగానో
మొహమాటంకొద్దీ వ్రాసినా
వారి కలం అందులోని మంచి చెడుగులలోకి
తీక్ష్ణదృష్టిని ప్రసరించడానికి జంకేది కాదు.
వాటి ని అందుకున్నవారు
విమర్శించినా అదేదో మహద్భాగ్యమన్నట్లు ఆనందపడేవారు.
అయ్య గారి పీఠికతో
వారి పుస్తకానికి ఎంతో విలువ వచ్చేది మరి.
అందుకే
"జలపాతస్నానం చేసిన ఒక క్రొత్తదనం
చదువరులకు అనుభూతమయ్యేది.."
అంటారు సుభ్రమణ్యంగారు.
ఆచార్యులవారు
"ఈ శతాబ్ది సాహిత్య విమర్శకు
త్రివిక్రమ పరాక్రమాన్ని ప్రదర్శించిన పండితులు.."
అంటారు కూడా..
పుట్టపర్తి ప్రశంసిస్తే
మల్లినాధ సూరి వ్యాఖ్యానిస్తున్నట్లు వుంటుందట..
విలువలెరిగిన వివేకం
విజ్ఞతతో జీవిస్తున్నట్లుంటుందట..
చదవండి
చదవండి..
విమర్శ కుడు గా పుట్టపర్తి
డా .జి .వి. సుబ్రహ్మణ్యం
"అగ్ని శిఖల కన్నను జ్యోతిస్సు గల దీతని
మనః ప్రవృత్తి
వేయి కత్తి పోటుల కన్నను
వాడియైనది మాట.
సహృదయతతో నింపివేయవలయునని ఈతని ఆశ. ప్రపంచమునకు తానొసగుదానికన్న ..
వేయిరెట్లధికముగ గోరువాడు..
ఆత్మనిశ్చయమెక్కువ ..
ధీరత చలించరానిది..
లేకున్న
విశాలమగు ప్రపంచమును ధిక్కరించి 'యేనామకేచిదిహనః ప్రధయం త్వవజ్ఞాం జానంతి తేకిమపితాన్ ప్రతినైషయత్నః'
అని ధైర్యముగా నిలిచి చెప్పుకొను గుండెలెవరికున్నవి..?
ఇంతేకాదు
ఉత్తర రామ చరిత్రలో
"వక్తవ్యమేవ వక్తవ్యం కుతోహ్యవచనీయతా - యధాస్త్రీణాం తధావాచాం సాధుత్వే దుర్జనోజనః"
"నటీ అతి దుర్జన ఇతి వక్తవ్యం "
అని పలికించి
తనకు ప్రపంచముపై గల యేవగింతను
కుండలతో గ్రుమ్మరించినాడు.."
భవభూతి- నాటక కర్త - శ్రీ పుట్టపర్తి
"The critic's duty is
to keep communication open
between reader and writer
the present and past
and also to indicate what of the past needs
most attention in our time
to keep in fact the classics before our eyes
A related duty is
to discriminate
among the masses of the books
being produced at the present moment
in order to endure that
the best works get a fair hearing.
To do all this requires
a highly developed sense of valus"
- Philip Hossbaum (Essentials of Literary Criticism)
విమర్శ ..విమర్శకుడు..
అనుకోగానే పై ఫిలిప్ హాబ్స్ బాం మాటలు
నా మనసులో తళుక్కుమని మెరుస్తాయి..
సరస్వతీపుత్ర
శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల వారిని
సాహితీ విమర్శకులుగా సమీక్షించేటప్పుడు ..
ముందుగా ఈ ప్రమాణాన్ని ముందుంచుకున్నాను.
ఆచార్యులవారు ..
పధ్నాలుగు భాషా సాహిత్యాలలో ప్రజ్ఞా ధురీణులు
ఆయా భాషా సాహిత్యాలలో
గతంలోనూ వర్తమానంలోను
ప్రవర్తిల్లిన సాహితీ ధోరణులూ..
ప్రక్రియలూ.. కవితాశైలులూ..
కవుల సాహితీ వ్యక్తిత్వాలూ.. చారిత్రక విశెషాలూ..
కళా మార్మిక శిల్పాలూ ..
వారికి కరతలామలకాలుగా ఉండేవి.
ఆ అనంత పరిజ్ఞానం
తులనాత్మక అనుశీలన విధానాన్ని
తెలుగులో వెలుగు రేఖలు చిమ్మటానికి
పుష్కలంగా తోడ్పడేది.
అందువలన ఆచార్యుల వారు
ఏ అంశం మీద మాట్లాడుతున్నా..వ్రాస్తున్నా..
భారతీయ భాషా సాహిత్య విజ్ఞాన సర్వస్వం
ఆ అంశంలో ప్రతిఫలిస్తున్నట్లు ప్రత్యక్షమౌతుంది.
అంతకు ముందు
సాహితీ వి మ ర్శకులు దర్శించని
ఎన్నో దృక్కోణాలు
వారి అనుశీలనలో ప్రత్యక్షమయ్యేవి.
పరంపరగా గతానుగతికంగా
విద్వాంసుల మెదళ్ళలో
గూళ్ళు కట్టుకున్న చాందస భావాలను
వారి విమర్శలు బూజు దులుపుతున్నట్లుండేవి.
ఒక జలపాత స్నానం చేసిన ఒక క్రొత్తదనం
శ్రోతలకు అనుభూతమయ్యేది.
విశే షమేమంటే
గతాన్ని ఈనాటి వర్తమానానికి అనువుగా వ్యాఖ్యానిస్తున్నట్లు తోచేది.
విమర్శకుడు ..
సాహిత్యం వెంట నడుస్తున్నాడా..?
సాహిత్యాన్ని విలువ కడుతున్నాడా..?
సాహిత్య సృష్టి కి ప్రమాణాలను కల్పిస్తున్నాడా ..?
అని మూడురకాలుగా లోకం గమనిస్తూ ఉంటుంది.
ఈ మూడింటిలో
మొదటిరకం వారిని 'సమీక్షకులని' పిలుస్తుంది.
రెండవ రకం వారిని 'అనుశీలకులని' వివేచిస్తుంది.
మూడవరకంవారిని 'ప్రామాణికులని' గౌరవిస్తుంది.
ఈ మూడంశలూ ఒకరిలోనే చూడగలిగితే
ఆ విమర్శకుణ్ణి త్రివిక్రమునిలా ఆరాధిస్తుంది.
ఆచార్యులవారు
ఈ శతాబ్ది సాహిత్య విమర్శకు
త్రివిక్రమ పరాక్రమాన్ని ప్రదర్శించిన పండితులు.
వారు
ఈ యుగంలో చదవవలసిన
క్లాసిక్స్ ను గురించి చెప్పారు
మహాభాతోపన్యాసాలు చదివినా
భాగవతోపన్యాసాలు చదివినా
రంగనాధ రామాయణం
వసుచరిత్ర
పాండురంగ మహాత్యం మొదలైన గ్రంధాలమీద
వ్రాస్తే.. ఉపన్యసిస్తే..
వారే దానికి సమర్థులని
సమకాలీన లోకం అనుకుంటూ ఉండేది.
వచన కవిత్వం పరుగు తీస్తున్న కాలంలో
పదసాహిత్యాన్ని గురించి
సంగీత సాహిత్య శిల్ప రహస్యాలను గురించి పదసాహిత్యంపై
ఇతర భాషా సాహిత్యాల ప్రభావాలను గురించి సాధికారికంగా సంభాషించి
విజ్ఞాననిధిగా చెలామణి అయ్యేవారు.
నన్నయ్య గారికి తోడ్పడిన నారాయణభట్టు
ఎలా ఉండేవాడో తెలుగు వారికి తెలియదు
కాని ఈ శతాబ్దిలో
నారాయణాచార్యుల వారి రూపంలో
వారు అవతరించారా ఆధునికంగా అనిపిస్తుంది.
వారి వాజ్మయ వారధిని తలచుకొంటే
ఈ తరం దృష్టిని క్లాసిక్స్ వైపు మళ్ళించిన
మహా విమర్శకులు వారు.
అవి ఎందుకు క్లాసిక్స్ అయ్యాయో
సాధికారికంగా నిరూపించి చెప్పిన
ఆదర్శ విమర్శకులు వారు.
తెలుగులో నారాయణాచార్యుల వారిది
ఒక సాహిత్య పీఠం
విశ్వనాధ వారికి లాగానే
వారికీ శిష్య వాహిని ఉన్నది.
శిష్యులుండటం విమర్శక లక్షణం కాకపోవచ్చును
కాని ఆయనదైన ఒక బాణీని
తమ రచనలలో ప్రతిఫలింపచేసుకొనే
ప్రతిభామూర్తులైన యువతరం ఒకటి ఉండటం విమర్శకాచార్య లక్షణం
అందులో
విశ్వనాధకూ పుట్టపర్తి వారికీ పోలికలున్నాయి
ఇద్దరూ సమకాలీన కవులను ప్రోత్సహించారు
వారి రచనలకు పీఠికలు వ్రాశారు.
దరిచేర్చి తప్పొప్పులు చెప్పి
వ్యక్తిత్వాలను ప్రసాదించారు.
తమకు దగ్గరివారెవరైనా ..
తమ సాహితీ ప్రమాణాలకు
వారి రచనలు అందక పోతే
నిర్దాక్షిణ్యంగా వానిని విమర్శించారు.
అందులో పుట్టపర్తి వారు సర్వస్వతంత్రులు
వారి దృష్టికి ఆధునికులెంతో ప్రాచీనులూ అంతే
అవసరం వస్తే నారాయణాచార్యులవారు
విమర్శ నా స్త్రా లను సం ధించారు.
అవి శ్రీనాధునికి తగిలాయి.
ప్రబంధకవులకు తగిలాయి.
దెబ్బకొట్టి మన చేత తలలూపించే ప్రజ్ఞ
వారికి పుట్టుకతో వచ్చిన తెలివి.
నారాయణాచార్యులు ప్రశంసిస్తుంటే
మల్లినాధసూరి వ్యాఖ్యానిస్తున్నట్లుండేది.
విమర్శిస్తూంటే
విద్వత్తు విరుచుకు పడుతున్నట్లుటుంది.
విమర్శించినా
మహాకవిని
మహాకవిత్వాన్నీ
కించపరిచేవారు కాదు
అనౌచిత్యం ఉంటే వినేవాడు ఔనన్నట్లు
తర్కబధ్ధంగా తులనాత్మక శోధనం ద్వారా వ్యక్తం చేసేవారు
ఆయన విమర్శిస్తున్నప్పుడు
విలువలెరిగిన వివేకం
వి జ్ఞ త తో జీవిస్తున్నట్లుండేది
ఇలా పుట్టపర్తి వారి విమర్శక వ్యక్తిత్వం
'ఫిలిప్ హాబ్స్ బాం' మాటలకు
మంచి ఉదాహరణంగా మనకు తోస్తుంది.
పుట్టపర్తి వారు
తమ వ్యాస సంపుటికి
పరిచయ వాక్యాలు వ్రాసుకొంటూ..
తమ విమర్శక స్వభావాన్ని తెలియ చెప్పారు
" విమర్శ ఉంటే ..
దానికి ప్రతి విమర్శన యెప్పుడు ఉంటుందన్న మాట..!! ఉండవలెను కూడ ..!!
కనుక ..
ఇంతకు తన విమర్శనలతో
విమర్శకుడు చేయగలిగినదంతా
తన తోడివారికి ఒక సూక్ష్మదృష్టిని కలిగించి
వారిలో దాగియుండే
విమర్శనా శక్తిని రెచ్చగొట్టడమే ..
నా యీ రచనలు అన్నీ
అందరికీ బాగుండవలెనని నేను కోరను
అట్లుండటము అసంభవము కూడ.
అసలు రచయితకే కొంతకాలమైన తరువాత
తన రచనలలోని కొన్ని సరిపడనివి ఉండును.
అట్టిచో ..
ఇతరుల విషయమున చెప్పవలసినది లేదు
ఇంతకును నా విమర్శనలు
'నేను ఆయా గ్రంధములను ఎట్టి దృష్టితో చదివినాను..?'
అనే విషయమును మాత్రమే
పాఠకులకెరిగించును.."
ఈ మాటలు చదువుతుంటే
పుట్టపర్తి వారి విమర్శక వ్యక్తిత్వం
కొట్టవచ్చినట్లు కనబడుతుంది.
వారు వాజ్మ యాన్ని దర్శించిన దృక్పధం
వారి విమర్శ అద్దం పడుతుంది
ఇంగ్లీషులో ప్రామాణిక అభిరుచి విమర్శకులు
నడిచే దొడ్డ బాట ఇది.
ఇది వైయక్తికమైన అభిమాన ద్వేషాలను
వ్యక్తం చేసే విమర్శకాదు
ఒక కవి దర్శన్నాన్ని
ఒక విమర్శక దర్శనం ఢీ కొంటున్నట్లుంటుంది.
అది విమర్శలో వేడిని.. వాడిని.. సృష్టిస్తుంది.
కొందరు విమర్శకులు
వ్యాసాలను వర్ణిస్తున్నట్లు వ్రాస్తారు
కొందరు వ్యాఖ్యానిస్తున్నట్లు వ్రాస్తారు.
మరికొందరు సమన్వయిస్తున్నట్లు వ్రాస్తారు.
ఇంకొందరు విశ్లేషిస్తున్నట్లు వ్రాస్తారు.
మరి కొందరు
ఎదుత వారిని ప్రేరేపిస్తున్నట్లు వ్రాస్తారు.
కొన్ని నిప్పురవ్వల్లాంటి కొగ్రొత్త విశేషాలను
దేశం మీద గ్రుమ్మరిస్తారు
ఇలా ఎన్నో రకాలు
పుట్టపర్తి వారు రెచ్చగొట్టే విమర్శలు చేసేవారు.
వారి విమర్శ ఆలోచించే విస్ఫులింగాలను సహృదయులకందిస్తుంది.
వారి విమర్శ
ఆనందం కోసం గాని
ఆహ్లాదం కోసం గాని చదువుకోం
ఒక క్రొత్త చూపు కోసం
వానిని చదువుకొంటాం
నిద్రపోయే జాతిని మేల్కొలుపుతున్నట్లు
విమర్శ చేయటం పుట్టపర్తి వారికే సరిపోయింది..!!
"ఒక మహావ్యక్తి
అనేక ప్రక్రియలలో అత్యుత్తమ రచనలు చేసినప్పుడు వారిని ఏ విధంగా సంబోధించాలి ..?"
అనే అనుమానం మనకు సామాన్యంగా కలుగుతుంది.
నారాయణాచార్యులవారు..
మహాకవి ..
భాషావేత్త ..
విమర్శకుడు..
వ్యాఖ్యాత ..
పరిశోధకుడు ..
అధ్యాపకుడు ..
వాదకుశలుడు ..
మహావక్త ..
సంగీత మర్మజ్ఞుడు..
పదకర్త ..
సంగీత కళానిధి ..
భక్తుడు..
ఇలా ఎన్నో కిరణాలున్న ప్రజ్ఞా ప్రభాకరులు
వీటన్నిటిలో మొదట లెక్కింపదగినది
వారి కవితా శక్తియే
మిగిలినవి దానికి దీటైనవని చెప్పలేము గాని
వన్నె తెచ్చేవి.
ఇంగ్లీషు సాహిత్య చరిత్రలో
ఆధునిక యుగారంభ దశలో
కవులే విమర్శకులుగా రాణించిన యుగాలున్నాయి.
మన తెలుగు సాహిత్యంలోనూ
అటువంటి అవకాశాలు ఏర్పడ్డాయి.
అయితే కొందరు కవులైన దానికంటే
విమర్శకులుగా ఎక్కువ రాణించారు.
ఉదాహరణకు..
కట్టమంచి రామలింగా రెడ్డి గారిని
రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారిని
పింగళి లక్ష్మీకాంతం గానినీ
ఆ కోవలోని వారుగ చెప్పవచ్చు.
విమర్శకులైనా
కవులుగా ఎక్కువగా తెలుగువారి చేత
స్మరింపబడే వారి సంఖ్య ఇందులో మిన్న.
విశ్వనాధ
దువ్వూరి
గురజాడ మొదలైన వారు
ఈ కోవలోని వారు
పుట్టపర్తి వారు కూడా
ఈ వరుసలో తమ ఎత్తును గుర్తు చేస్తూ
మన మనసుల్లో చిరకాలం నిలిచి ఉంటారు.
పుట్టపర్తి వారికి కవిత్వంలో లాగానే
విమర్శలో కూడా ఒక బాణీ వుంది.
ఒక చేవ ఉంది.
ఒక పలుకుబడి ఉంది.
ఒక శైలి ఉంది.
ఒక అభివ్యక్తి ఉంది.
ఒక ఆవిష్కృతి ఉంది.
అన్నింటికంటే మించి ఒక ఆకర్షణ ఉంది.
నారాయణాచార్యుల వారు
మధురంగా విమర్శను వెలయిస్తారు.
వారి విమర్శలో
స్త్రైణమైన అభినయం కంటే
పౌరుషమైన పరాక్రమం
ప్రకటితమౌతూ ఉంటుంది.
సరస్వతీ పుత్రుల సాహిత్య విమర్శ
తెలుగులో సరసత్వంతో కూడుకొన్న శాస్త్ర చర్చ
"ఒకడు ' నాచన సోముడ" అన్నట్లు
నారాయణాచార్యులు కూడా ఒక్కడు..