23 ఆగ, 2012

మీ తండ్రిని మించి పోయావయ్యా..
నీకు ..
మీ స్కూల్ లోని 
తెలుగు అధ్యాపకుడంటే 
అమిత మైన అభిమానం.. 
ఆరాధన..
 

ఆయన వలననే ..
తెలుగు సాహిత్యం లోని 
సొబగులు దర్శించగలిగావ్..
 
అంతే కాదు..
ఆయనలో ఒక గొప్ప నటుడున్నాడు..!
ఆయన  వేసే పౌరాణిక నాటకాలలోని 

అభినయానికి నీవు ముగ్ధుడివి..
 

ఆ తరువాత ..
నీ జీవితం ఎటెటో పయనించింది..
చిన్ననాట 

నీకేర్పడిన ఆ సాహిత్యాభిరుచి..
నిన్ను ఊరికే ఉండనివ్వలేదు..
ఆపై కొంత నీ పరిశ్రమా..

సాహిత్య రంగంలో నీకో గుర్తింపు నిచ్చింది.
 

అయిందా..
ఇప్పుడు నీకు అరవై..
ఓ కలెక్టరు కొడుకు..
సంఘంలో మంచి స్థానం..
 

అప్పుడు హఠాత్తుగా ..
ఒక సాహితీ మేరువును నీవు దర్శించావ్..
అతని ప్రతిభకు గల పలు పార్శ్వాలు గమనించి అచ్చెరువొందావ్..

నీకో ఆశ్చర్య కర మైన విషయం తెలిసింది..
ఆ సాహితీ మేరువు ఎవరో కాదు..
 చిన్ననాటి నీ తెలుగు అధ్యాపకుని కొడుకే..
నీ పరిస్థితి ఏవిటీ..
 

ఆశ్చర్యం ఆనందం ఉద్వేగం
బాబోయ్..
నీవు  మా గురుపుత్రుని వా ..?
అదిగో ఆ తేజస్సు ..
ఆ మేధస్సు నీ అడ్రసును చెప్పకనే చెబుతోంది..
ఈ సంగీత నాట్య కళాభిరుచి 

మీ నాయన నుంచే నీకొచ్చిందోయ్..
మీ నాన్న ఎంత గొప్ప వాడనుకున్నావ్..
అబ్బా.. అబ్బా.. అబ్బా..
ఆరోజుల్లో ..

ఆయనను చూసి మేం పులకించి పోయే వాళ్ళం..
ఇదీ  నీ పరిస్థితి..
 

అవునా..
ఇక్కడ..
ఆ నీవు..
ఎవరో కాదు..
పైడి లక్ష్మయ్య గారు..
వారి గురువులు 

శ్రీమాన్ పుట్టపర్తి శ్రీనివాసా చార్యులు గారు.
అంటే మా అయ్యగారి తండ్రి ..
మాకు తాత
గారు..

మా తాత గారి వద్ద విద్య నభ్యసించిన 

పైడి లక్ష్మయ్య గారు..
వారి గురించి తలుచుకొని పొంగిపోతారు.
మా తాతగారు 

పౌరాణిక పాత్రలు అద్భుతంగా పోషించే వారట..
పాండిత్యం.. సరేసరి..
 

1975 లలో 
వారి ప్రేమ సాగరం 
అయ్యనూ మమ్మల్నీ ముంచెత్తింది..
అయ్యను గతంలోకి లాక్కెళ్ళింది..
చదవండి మరి.మా గురు పుత్రులు
పైడి లక్ష్మయ్య


"భావస్థిరాణి జననాంతర సౌహృదాని"
 అని మహాకవి కాళిదాసోక్తి. 
పూర్వ జన్మ సంస్కార ఫలముచే 
నీ జన్మలో నాశ్చర్య హేతుకమగు మేధాశక్తి 
అనన్య సామాన్య భక్తి. 
అగణ్య గద్య పద్య కావ్య రచనాసక్తి. 
సరస సంగీత సాహిత్య కళాభిరక్తి 
యోగీంద్ర సమ్హిత ప్రాపంచిక వ్యామోహ విరక్తి 
తదితర దివ్య భావోచిత సుగుణమణులు. 

తమకు తామే మనుజునికి లభ్యమగునని 
విజ్ఞుల విశ్వాసము. 
'శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే' అని కదా గీతా వాక్యము. 

ఒక వ్యక్తి విద్వత్కుటుంబం నుంచీ గానీ 
విత్తాధిపతియైన శ్రీమంతుని గృహమునగాని 
జన్మించి సర్వానుకూల వాతావరణమున 
శ్రేయస్కరముగ పెరిగి..
పెద్దవాడో ..మహా కవియో..
లేక పండితుడో.. లేక ఆగర్భ శ్రీమంతుడో..
లేక రాచఠీవి గలిగిన పరిపాలనా దక్షుడో అగుట..
అతని పూర్వ పుణ్య ఫలమని చెప్పక తప్పదు.
 
దాన ధర్మాది గుణములు 
పాండితీ ప్రతిభ శూరత్వము 
సహజముగ అలవడు గుణములే గాని 
ఒకరు నేర్పించిన 
లేక చూచి నేర్చుకొనునట్టి విద్యలు కావు 
అనుట లోకవిదితము. 

పద్మశ్రీ డా.పుట్టపర్తి నారాయణాచార్యుల వారిని గాంచినపుడెల్లను..
వారికి గల 
కూలంకష ప్రజ్ఞ బహుముఖ వైదుష్యము రసజ్ఞత స్మరించి నపుడెల్లను ..
వారి  పితృపాదులగు..
శ్రీమాన్ శ్రీనివాసా చార్యులవారు 
నా మనమున జ్ఞప్తికి వచ్చుచుందురు.
 
పూజ్యులు 
పండితాగ్రేసరులు 
శ్రీమాన్ శ్రీనివాసాచార్యులు 
నాకు పదునాల్గవయేట 
అనంతపుర మండలమందలి 
కల్యాణదుర్గము మాధ్యమిక పాఠశాల లో 
తెనుగు పండితులుగా నుండి గురువర్యులైరి. 

ఆంధ్ర సారస్వతములో 
నొకింత పరిచయము పాండిత్యమూ 
నాకీనాడు  లభించిందన్న 
వారు ఆనాడు 
నా హృదయ క్షేత్రమున నాటిన 
సారస్వత బీజమే కారణమనదగును 

అది అంకురించి 
చిగిర్చి 
చిన్న మొలకయై 
యావల 
శ్రీ ప్రయాగ వెంకట రామ శాస్త్రులవారి 
వాత్సల్య దోహదముచే మ్రానై 
ఈనాడు కొన్ని దృశ్య కావ్య ఫలములీయగల్గినది.

శ్రీ శ్రీనివాసాచార్యుల వారు 
అనవద్య హృద్య విద్యా విశారదులు 
అతులిత కవితా చాతురీ ధురీణులు 
సరస సంగీత కళా కోవిదులు 
నటకావతంసులు 
ఆంధ్ర నాటక పితామహుని 
"పాదుకా పట్టాభిషేకము"నాటక ప్రదర్శన లో 
వారు గావించు చుండిన 
దశరధ పాత్రాభినయము 
ప్రేక్షకులను కంట తడి పెట్టించుచుండెను..
 
శ్రీరాముడరణ్య వాసమునకేగు తరి ..
వారి అభినయ చాతురి వలన 
సభ్యుల హృదయములు కరిగి 
కంటినీరై కారుచుండ 
చేతి గుడ్డలను తడుపుచుండుట 
నేను కనులార గాంచిన విషయము. 

అదే రీతి 
"చిత్రనళీయము"లో 
"కలి" వేషము ధరించి 
రౌద్ర భయానక రసములతో 
పాత్ర పోషణ గావించి ప్రశంస లందుకొనుచుండిరి.

మహాకవి రసికుడు 
పురాణేతిహాస పారంగతులగు పౌరాణికులు వారు. 
వారి పురాణ ప్రసంగము 
పండిత పామరుల నమితముగ ఆకర్షించుచుండెను. 

కమ్మని కవితా చమత్కృతి గల పద్యములతో 
సరస వచనా వైఖరితో 
సభలలో చక్కగ ఉపన్యసించి 
సభ్యులను ముగ్ధులను గావించెడివారు. 


అట్టి విద్వత్కవివరేణ్యుని 
నటకాగ్రేసరుని పుత్రరత్నంబగు 
సరస్వతీపుత్ర శ్రీమాన్ 
పుట్టపర్తి నారాయణాచార్యుల వారు 
దిట్టమైన కవి. 
పండిత 
విమర్శక 
వాక్ప్రతిభావతంసుడగుటలో వింతయేమున్నది...? 'పుత్రాదిచ్చేత్ పరాజయం' అని కదా 
కవి తల్లజుడగు భారవి సూక్తి...!!
 
"పువ్వు పుట్టినతోడనే పొసగు తావి..!" 
అన్న రీతి నారాయణాచార్యులవారికి 
పిన్ననాటనే సారస్వతాభిరుచి కలిగినది 
వారి మాతృదేవత కడ 
ఆంధ్ర గీర్వాణ భాషల అభ్యసింపమొదలిడెను. 

ఇంతలో దురదృష్టవశమున 
మాతృవియోగము కలిగెను. 

కాని 
ఆనాడు పెనుగొండ సబ్ కలెక్టరుగ నుండిన 
శ్రీ పిట్ గారి సతీమణి పి ట్  దొరసాని 
ఆ బాలుని కుశాగ్రబుధ్ధికి అచ్చెరువొంది 
అనురాగముతో తనయొద్ద ఉంచుకొని 
ఆంగ్లేయభాష నేర్పించమొదలిడెను. 

ఆ బాలుడు 
షేక్స్పియర్ నాటకములను చదివి 
కంఠస్థము చేయుటయేగాక 
మిల్టన్ కావ్యములను కబళించి 
కొంత ఆంగ్లభాషాపాండిత్యము గడించెను. 

ఇది 
ఆ బాలుని జీవితములో 
నొక అద్భుత సంఘటన 
పదునాల్గవ యేటనే
కమ్మని కవితలల్లుట నేర్చుకొని 
మహోన్నత భావావేశముతో 
"పెనుగొండ లక్ష్మి"
 యను ఖండకావ్యమును రచించెను. 

ఆచార్యులవారు 
విద్వాన్ పరీక్షకు కూర్చున్నప్పుడు ఈ కావ్యము 
పఠనీయ గ్రంధముగా నిర్ణయింపబడినదనగా యాగ్రంధముయొక్క కవిత్వ పటిమ
ఎంతటిదో ఊహింపదగును.
 
తిరుపతి ప్రాచ్యభాషా కళాశాలయందు..
 విద్వాన్ పరీక్ష చదువుచు 
సంగీత సాహిత్య నాట్య కళల నభ్యసించెను 

ఆవల 
హిందీ.. మరాఠీ ..మళయాళ.. తమిళ.. మాదిగ.. బహుభాషలలో ప్రావీణ్యత గడించెను. 

భారత దేశమంతయూ పర్యటించి ..
హృషీకేశము చేరి..
 అచటి శివానందాశ్రమమున ..
ఆ యతీశ్వరులచే "సరస్వతీ పుత్ర" బిరుదము పొందెను. 

అరవిందాశ్రమమున 
ఫ్రెంచి ..గ్రీక్ ..లాటిన్..
భాషల పరిచయము సంపాదించెనని  
తెలియుచున్నది. 

దాదాపు 
నూటికి పైబడి గ్రంధములను 
వీరు రచించినట్లు తెలియుచున్నది. 
పాల్కురికి సోమనాధుని పండితారాధ్య చరిత్రమునుబోలి వీరు రచించిన 
"పండరీ భాగవతమ"ను ద్విపద కావ్యము అద్వితీయముగ రాజిల్లి 
వీరి కవితా ప్రతిభను 
ధారా శుధ్ధినీ 
భక్తి ప్రపత్తినీ 
చాటుచున్నది 

వీరు రచించి 
పలుతావుల గానం చేయుచున్న 
శివతాండవం 
వీరి సరస సంగీత సాహిత్య కళాభిజ్ఞతకు తార్కాణము. 

మరాఠీ భాషలో 
డా.కోశాంబిగారి భగవాన్ బుధ్ధ చరిత్రను 
తెలుగులో అనువదించుటయు 
గోపీచంద్ గారి రచనలను 
విశ్వనాధ వారి ఏకవీర నవలను 
మళయాళమున కనువదించుట 
వీరి మరాఠీ మళయాళ తెలుగు భాషలలో గల వైదుష్యమును చాటుచున్నది. 

వీరి మేఘదూత కావ్యము 
కవికుల గురువగు 
కాళిదాసు "మేఘదూతము"నకు దీటైనదని 
డా . దివాకర్ల వేంకటావధాని గారి  అభిప్రాయము. 

వీరు వీరి సతీమణి కనకమ్మ గారు కలిసి రచించిన "అగ్నివీణ" అను కవితా సంపుటి 
వీరి అర్ధాంగి యొక్క వైదుష్యమును తెలుపుచున్నది.
 
వివిధ భాషాభిజ్ఞులై 
వైష్ణవుడుగానుననూ
 శైవమును నిరసింపక 
సమతా భావము గాంచుచూ 
బహు గ్రంధ రచనా క్రియచే 
"మహాకవియని"  "వక్త" యని పేరు గొ ని 
రాయల సీమలో జనించిన 
రత్న రాజమై విరాజిల్లుట 
రాయలసీమకే కాదు 
ఆంధ్ర దేశమునకే కాదు 
భరత ఖండానికే 
ఒక శోభ గూర్చెడిదనదగును 
ఇది మనకెల్లరికి గర్వకారణము..!!

సరస్వతీపుత్ర పద్మశ్రీ డా. పుట్టపర్తి ని 
సన్మానించుటతో 
కవిలోకమునే 
సన్మానించినట్లు భావింపనగును..

వీరిని 
శ్రీ వేంకటాద్రి నిలయుడగు శ్రీనివాసుడు 
ఆయురారోగ్య భాగ్యములొసగి 
చిరకాలము వర్ధిల్లజేసి 
మరికొన్ని జ్ఞానప్రబోధములు 
లోకోపకారములగు సత్కావ్యముల రచింపజేయుగాక.!!