ఇరవయోశతాబ్ది తెలుగు సాహిత్య విమర్శకు
నిస్సందేహంగా అద్భుతమైన కానుకలు
అందించిన వల్లంపాటి వెంకటసుబ్బయ్య గురించి
రాయవలసినదీ విశ్లేషించవలసినదీ ఎంతో ఉందనీ,
అదంతా ఒక చిన్న సంస్మరణ వ్యాసంలో సాధ్యంకాదనీ
తెలిసినా ఇరవై ఏళ్ల పరిచయం, కనీసం పది
సంవత్సరాల సాన్నిహిత్యం, చివరి రెండు నెలల
ఆత్మీయతలతో అందుకు పూనుకుంటున్నాను.
వల్లంపాటి వెంకటసుబ్బయ్యగారితో ఇరవై ఏళ్ల
పరిచయం. ఆయన రచనలు అంతకు ముం
దునుంచే చదువుతున్నప్పటికీ, ముఖ్యంగా
1980లో ‘అభ్యుదయ’ ప్రచురించిన సాహిత్య
విమర్శ ప్రత్యేక సంచికలో ఆయన వ్యాసం నాటి
నుంచీ ఆయన మీద అభిమానం ఉన్నప్పటికీ,
1987-1988ల్లో తిరుపతిలో జరిగిన విరసం
సభల్లోనో, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయ
తెలుగుశాఖ నిర్వహించిన సదస్సులోనో
ఆయనతో ముఖపరిచయం జరిగింది. ఆసక్తి
కలిగితే, మాట్లాడుకోవలసిన విషయాలుంటే,
సంభాషణ ముందుకుసాగితే వయసులో తేడా
ఎంతమాత్రమూ గమనం లోకి రాకుండా లోతు
గానూ విస్తారంగానూ అభిమానంతోనూ మాట్లాడే
స్వభావం ఆయనది. అలా తొలి పరిచయంలోనే
నామీద చాల ఆప్యాయత కనబరిచారాయన.
ఆ తర్వాత నేను బెంగళూరులో ఉద్యోగం
చేస్తున్నప్పుడు 1992 – 95 మధ్య ఆయన
తరచుగా బెంగళూరు రావడం, రాయుడు
గారింట్లో బాబయ్యగారితో, రజనీకాంత్ గారితో
కలిసి ఆయనను కలవడం, సాహిత్య, రాజకీయ,
సామాజిక విషయాలు కలబోసుకోవడం జరుగుతూ
ఉండేది. అటువంటి రోజుల్లోనే ఆయన నోటివెంట
గాంభీర్యం, రౌద్రం, కరుణ కలగలిసి పుట్టపర్తి
నారాయణాచార్యుల ‘శివతాండవం’ విన్నాను.
ఆరోజుల్లోనే కథ’92 ఆవిష్కరణ సభలో ఆయనతో
పాటు కలిసి పాల్గొన్నాను. అప్పటినుంచి అడపా
దడపా ఉత్తరాలు రాసుకోవడం, హైదరాబాదు
ద్వారకా లోనో, ఎక్కడయినా సభల్లోనో
కలుసుకున్నప్పుడు మాట్లాడుకోవడం సాగుతుండేది.
ఆయనకు కేన్సర్ అని వైద్యులు నిర్ధారించారని
తెలియగానే బెంగళూరులో ఉన్న ఆయనతో ఫోన్లో
మాట్లాడాను. ఆ తర్వాత హైదరాబాదులోని గ్లోబల్
ఆస్పత్రిలోనూ, మదనపల్లిలోనూ, బెంగళూరులోనూ
ఆయనతో ఆయన ఆరోగ్యం గురించి సంభాషణలు
ఎక్కువగానే జరిగాయి.
హైదరాబాదు గ్లోబల్ ఆస్పత్రిలో ఆయన తన గురువు
పుట్టపర్తి నారాయణాచార్యుల గురించి ఎప్పుడో ‘రచన’లో
రాసిన వ్యాసం ఫొటోకాపీ ఇచ్చారు. అది చదివి
లోలోతులనుంచి కదిలిపోయి, కళ్లనీళ్లతో ఆయనకు
ఫోన్ చేసి, ఏ సాహిత్యకారుడి గురించయినా ఎవరయినా
సంస్మరణవ్యాసం అంటే అట్లా రాయాలని అంటుంటే
అప్పుడు కూడ తన గురువు ఘనత గురించేతప్ప
తన రచనమీద ప్రశంస గురించి మాట్లాడని
వినయశీలి ఆయన. ఆ మాటల మధ్యలో
నారాయణాచార్యులవారి ‘మహాభారత విమర్శనము’
గురించి ప్రస్తావన వస్తే నేనది చదవలేదని విని,
మదనపల్లి వెళ్లగానే, అంత అనారోగ్యంలో ఉండి
కూడ నాకు ఆ సంపుటాలు రెండూ పంపించిన
పుస్తకప్రేమికుడాయన. చివరి వరకూ కూడ ఆశతో,
కాన్సర్ ను జయించవచ్చునన్న నమ్మకంతో
ఆయన మాట్లాడుతుంటే చేదునిజం తెలుస్తున్నప్పటికీ
ఆయన మాటలు నిజమయితే బాగుండునన్న కోరిక కలిగేది.
ఆయన గురించీ, ఆయన స్వభావం గురించీ, ఆయన
సాహిత్యవిమర్శ గురించీ విశ్లేషణను ఆయన నాకు రాసిన
ఉత్తరాలలోనుంచి కొన్ని భాగాలను ఉటంకించడం
ద్వారా ప్రారంభిస్తాను. అవి నాకు ఆయన రాసిన
వ్యక్తిగత ఉత్తరాలు కావడం వల్ల వాటిని బయట
పెట్టడం ఆయనకు ఇష్టం ఉండేదో కాదో తెలియదు,
కాని అవి ఆయన వ్యక్తిత్వంలోని ఉదాత్తతను
తెలపడానికే గనుక, అవి ఆయన సామాజిక
సాహిత్యవిమర్శాపద్ధతికి అద్దం పడతాయిగనుక
ఆ స్వాతంత్ర్యం తీసుకుంటున్నాను.
మదనపల్లిలో దొరకని ఏదో ఒక పుస్తకం పంపించమని
ఆయన 1998 సెప్టెంబర్ లో నన్ను అడిగారు. సరిగ్గా
అప్పుడే ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో
ఆయన పుస్తకం ‘వల్లంపాటి సాహిత్యవ్యాసాలు’ పై
నేను రాసిన సమీక్ష అచ్చయింది. ఆ పుస్తకంలో
లోపాలని నేను అనుకున్నవాటి గురించి కొంత
నిర్మొహమాటంగానే రాశాను గనుక ఆయన ఏమన్నా
నొచ్చుకున్నారేమోనని అనిపించింది.
ఆయన అడిగిన పుస్తకం పంపుతూ, సమీక్షమీద
ఆయన ఏమనుకుంటున్నారో కూడ అడిగాను.
దానికి జవాబుగా ఆయన 29.9.98 న రాసిన
ఉత్తరం ఆయన సహృదయతకు, కొత్తవిషయాలు
నేర్చుకోవడంలో ఆయనకు ఉండిన ఆసక్తికి అద్దం
పడుతుంది.
“మతాలూ, కులాలూ, అభిప్రాయభేదాలూ
స్నేహానికి అడ్డురాకూడదన్నదే మొదటినుంచీ
నా అభిప్రాయం. మన పైతరం వాళ్ళలో
అలాంటి ఆత్మీయతలుండేవి. ఈనాడవి
క్రమక్రమంగా నశించిపోతున్నాయి. ఈ
శిథిలాలమధ్య నిలబడి చుట్టూ చూస్తూ
ఉంటే ఏడుపొస్తుంది” అంటూ ఆయన
ఉత్తరం మొదలయింది.
“జీవితం, సాహిత్యం, సాహిత్య విమర్శా
సమబాహు త్రిభుజంలోని మూడు భుజాలు’
అన్న వాక్యంలో – నా మనసులో లేకపోయినా
– మీరు చూపించిన మిసండర్ స్టాండింగ్
ఉన్నమాట నిజమే. దాన్ని మరో ముద్రణలో (?)
సరిదిద్దుతాను. కట్టమంచిని నేను ‘రాయలసీమలో
పుట్టిన విమర్శకుడు’ అన్న అర్థంలోనే రిఫర్ చేశాను.
కట్టమంచి, రాళ్ళపల్లి, కవిత్వవేది, పుట్టపర్తి,
రారా, సుదర్శనం మొదలైన విమర్శకులు
ఇక్కడినుంచే వచ్చారు. అందుచేత సీమలో
సాహిత్యవిమర్శ ఒక్కటే బలంగా కొనసాగుతూ
వచ్చిందన్నాను. ది రిఫరెన్స్ ఈస్ మియర్లీ జాగ్రఫికల్.”
“….సింగమనేని వ్యాసం (రాయలసీమలో
కథాసాహిత్యం) చదివారా? అందులో ఆయన
రాయలసీమ కథారచయితలందరూ – వల్లంపాటి
తప్ప – అబ్రాహ్మణులేననీ, దాన్ని గురించి
పరిశోధన జరగాలనీ రాశాడు. నాలాంటి
బ్రాహ్మలకంటే శూద్ర బ్రాహ్మణులు ఎక్కువ
ప్రమాదకరంగదా? నేనెప్పుడైనా బ్రాహ్మణత్వాన్ని
సమర్థించి ఉంటే ఆయన ఆ మాట అనటంలో
సామంజస్యం ఉండేది. బ్రాహ్మణత్వాన్ని
వ్యతిరేకించింది నేనా, అతనా? ఇలా ఉన్నాయి
మార్క్సిస్టులమని చెప్పుకునేవారి సంస్కారాలు.
ఇలాంటివి చూసినప్పుడు మనుషులమీదనే
నమ్మకం పోతుంది. మనం చాలా శ్రమ
పడితేకానీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేము…”
అంటూ ఆయన ఉత్తరం సాగింది.
ఉత్తరం ముగించినతర్వాత తాజాకలం రాస్తూ
“నేనెక్కడో మిన్నులు పడ్డచోట ఉన్నాను.
నేను తప్పకుండా చదవాల్సిన పుస్తకం మీ
దృష్టికొస్తే నాకు తెలియజేయండి. సంపాదించి
చదువుకుంటాను” అని రాశారు.
ఈ ఉత్తరంలో వల్లంపాటి ప్రస్తావించిన నాలుగు
అంశాల – మానవసంబంధాలు, తనపై విమర్శకు
స్పందన, సాహిత్యరంగంలో తాను తప్పుడు
ధోరణులనుకున్నవాటిపట్ల వైఖరి, కొత్తభావాల
గురించి తెలుసుకోవాలనే కుతూహలం –
ఆధారంగా ఆయన వ్యక్తిత్వం గురించీ,
విమర్శాపద్ధతి గురించీ కొన్ని నిర్ధారణలకు
రావచ్చుననుకుంటాను.
కుల, మత, అభిప్రాయ భేదాలు స్నేహానికి
అడ్డురాగూడదన్న ఆదర్శం దాదాపు
అందరూ ప్రకటిస్తుంటారు గాని ఆచరించేవాళ్లు
తక్కువ. వల్లంపాటికి ఉన్న స్నేహబృందాన్ని
చూస్తే ఆ ఆదర్శాన్ని ఆయన ఎంత లోతుగా
తన నిత్యజీవితాచరణలో అంతర్లీనం చేసుకున్నారో
అర్థమవుతుంది. అభిప్రాయాలను దాచుకోవడానికిగాని,
ముసుగులు కప్పి చెప్పడానికిగాని, సత్యం
అప్రియమయినదయినప్పుడు చెప్పకుండా
ఉండడానికిగాని ఆయన ఎప్పుడూ ప్రయత్నించలేదు.
కొన్ని సందర్భాలలో ఆయన అటువంటి అప్రియ
సత్యాలు చెప్పినప్పుడు అవి కొందరిలో నొప్పినికూడ
కలిగించి ఉండవచ్చు. కాని అలా నొప్పించినవారితో
కూడ మరుక్షణమే కలగలిసిపోయి, స్నేహపూర్వకమైన
సంభాషణ నెరపగల తత్వం ఆయనది. కనీసం
రెండు సందర్భాలలో నేను ఆయన నుంచి
అటువంటి ప్రవర్తన చూశాను. కీసరలో జరిగిన కథా
రచయితల, విమర్శకుల సమావేశంలో ఆయన
మాండలికం గురించి, ప్రామాణిక భాష గురించి
ప్రకటించిన అభిప్రాయాలతో కె శ్రీనివాస్, నేను,
మరికొందరం చాల తీవ్రంగా విభేదించాము. విరసం
నవలావిమర్శ సమావేశంలో ఆయన రచయితలు
విమర్శను తీసుకోవడానికి సిద్ధంగాలేరని
వ్యాఖ్యానించి కొందరు రచయితలకు కోపం తెప్పించారు.
కాని ఈ రెండు సందర్భాలలోనూ కూడ అభిప్రాయ
భేదం వేరు, స్నేహ సంబంధాలు వేరు అనే అభిప్రాయం
ఆయనకు పైపై ఆదర్శం కాదని, అది ఒక
చైతన్యయుతమైన వైఖరి అని తేటతెల్లమైంది.
ఆ అభిప్రాయానికి కూడ ఆయనకు చరిత్రలో
మూలాలు కనిపించాయి. మన పైతరం వారిలో
అటువంటి ఆత్మీయ వైఖరి ఉండేదని, దాన్ని
మనం పోగొట్టుకుంటున్నామని, అలా ఏర్పడుతున్న
శిథిలాలను చూసి భావుకుడైన ఆలోచనాశీలి
విచారించవలసి ఉన్నదని ఆయన అనుకున్నారు,
ఇతరులకు చెప్పడానికి ప్రయత్నించారు.
ఇక తన రచనలమీద వచ్చిన విమర్శలకు
ఆయన స్పందించిన తీరు అపురూపమైనది.
ఇప్పుడు చాలమంది ఆలోచనాపరులలో
కనిపించకుండాపోతున్నది. ఎంత సమంజసమైన
విమర్శనయినా, చిన్నమెత్తు విమర్శనయినా
సహించలేని, ఆ విమర్శ చేసినవారిమీద కత్తికట్టే
ఒక ధోరణి తెలుగు ఆలోచనాపరులలో
ఇటీవల ప్రబలుతున్నది. వల్లంపాటి లోపల
నొచ్చుకునేవారేమో తెలియదుగాని
(ఈ ఉత్తరంలోనే ప్రస్తావించిన సింగమనేని
విమర్శ మీద ఆయన నొచ్చుకున్నట్టే
కనబడుతున్నది, కాని అది అసమంజసమైన
విమర్శ గనుక అటువంటి ప్రతిస్పందనను
అర్థంచేసుకోవచ్చు) ఆయన నొచ్చుకున్నారని
బయటికి తెలిసేదికాదు. విమర్శలను హుందాగా,
సహృదయంతో తీసుకునేవారు.
“జీవితము, సాహిత్యము, సాహిత్యవిమర్శ
సమబాహు త్రిభుజంలోని భుజాలవంటివి.
ఈ మూడు ఒకదాన్ని విడిచి మరొకటి నిలువలేవు.
ప్రతిపత్తి దృష్టితో చూచినపుడు వీటిమధ్యన ఎక్కువ
తక్కువలు కూడా లేవు’ అంటారు వల్లంపాటి
‘ఆధునిక సాహిత్య విమర్శా పద్ధతులు’ వ్యాసంలో.
1980లోరాసిన ఈవ్యాసం ఇప్పటికి రెండుచోట్ల
ప్రచురితమైంది. మూడోసారి పుస్తకరూపంలోకి
వస్తున్నప్పుడైనా ఇందులో పొరపాటు అవగాహన
ఉందని వల్లంపాటి గుర్తించలేదా? పైగా, ఆయనే
సమాజానికీ, సాహిత్యానికీ, సాహిత్య విమర్శకూ
ఉన్న సంబంధాన్ని సరిగానే గుర్తించారని ఇతర
వ్యాసాలూ, ‘సాహిత్యవిమర్శ వ్యాఖ్యానానికి వ్యాఖ్యానం.
సాహిత్యం జీవితాన్ని వ్యాఖ్యానిస్తే, సాహిత్య విమర్శ
సాహిత్యాన్ని వ్యాఖ్యానిస్తుంది’ అని చేసిన
సూత్రీకరణలూ రుజువుచేస్తున్నాయి” అని
నేను చేసిన విమర్శ (ఆంధ్రజ్యోతి, ఆదివారం
అనుబంధం, సెప్టెంబర్ 13, 1998) మీద
ఆయన “నా మనసులో లేకపోయినా, మీరు
చూపిన మిసండర్ స్టాండింగ్ ఉన్నమాట నిజమే”
అని ఒప్పుకుంటూ మలిముద్రణలలో దాన్ని
మార్చుకుంటానన్నారు. 2002లో అచ్చయిన
‘విమర్శాశిల్పం’ పుస్తకంలో “వీటిని సమబాహు
త్రిభుజంతో పోల్చటమూ, ప్రతిపత్తి దృష్టితో
చూచినప్పుడు ఇవిమూడూ సమానమని
అనటమూ పొరపాటు” అని దిద్దుకున్నారు.
‘రాయలసీమ జీవితంలోని ప్రత్యేక లక్షణాలను
రాయలసీమ భాషలో చిత్రించడమే రాయలసీమ
సాహిత్యం’ అని ఒక సరైన నిర్వచనం ఇస్తూనే
‘సాహిత్యవిమర్శలో రాయలసీమ అగ్రగామిగా
నిలబడగలిగింది’ అని అనడంలో వైరుధ్యంలేదా
అని నేనడిగిన ప్రశ్నకు, బాధ్యతగా జవాబు
చెపుతూ అక్కడ కేవలం భౌగోళిక అర్థంలో
మాత్రమే ఆ ప్రస్తావన తెచ్చానని అన్నారు.
ఇక సింగమనేని వ్యాఖ్య గురించి ఆయన వ్యక్తంచేసిన
అభిప్రాయాలు బహుశా గత ఒకటిరెండు దశాబ్దాలుగా
చాలమంది ఆలోచనాపరులలో ఉన్న విచారానికి
అద్దం పడతాయి. మన సమాజంలో ఏ ఒక్కరూ
తాము ఏ కులంలో పుట్టాలో నిర్ణయించుకుని
పుట్టలేదు. ఒక అగ్రకులం అనబడే దానిలో
పుట్టిన వాళ్లకు ఆస్తిలో, చదువులో, ఉద్యోగాలలో,
అధికారంలో, వ్యక్తీకరణలో తమ పూర్వీకులనుంచి,
సామాజికస్థితి నుంచి అందిన అదనపు సౌకర్యాలు
ఉండవచ్చు. అందువల్ల ఆభిజాత్యం,
ఆధిక్యతాభావం కూడ ఉండవచ్చు. అట్లాగే
సామాజిక నిచ్చెనలో కిందికులాలనబడే
వాటిలో పుట్టినవాళ్లకు ఆ సౌకర్యాలు అందకపోయి
ఉండవచ్చు. ఆత్మన్యూనతాభావం కూడ ఉండవచ్చు.
అయితే పుట్టుకవల్ల వచ్చిన ఈ స్థితిని సమర్థించడమో,
దాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నించడమో,
ఆ భావజాలాన్ని నిలబెట్టడమో తప్పుగాని,
ఆ కులంలో పుట్టడమే తప్పుకాదు. పుట్టుకను
బట్టి మనిషి అస్తిత్వాన్ని నిర్ణయించి, నిందించడమో,
గౌరవించడమో మనువు చేశాడు. అలా కాకుండా,
ఆ పుట్టుక సమాజంలో ఇస్తున్న గౌరవాన్నీ
అవమానాన్నీ గుర్తిస్తూ, ఆ పుట్టుకకు ఉండగల
అవకాశాన్ని అంగీకరిస్తూ, ఆ మనిషి వ్యక్తిగతంగా
ఏ ఆచరణలో ఉన్నాడో, పుట్టుకవల్ల వచ్చిన
అవకాశాల్ని తిరస్కరిస్తున్నాడో లేదో గుర్తించి దాన్ని
బట్టి మనిషిని అంచనా వేయడం జరగాలి.
ఒక మనిషి స్థానం ఏమిటో నిర్ధారించేటప్పుడు పుట్టుకనూ,
పెంపకాన్నీ, సమీపవృత్తంలోని సామాజిక
సంబంధాలనూ విస్మరించకుండానే, ఆ మనిషి
ఆలోచనలనూ, ఆచరణనూ, ప్రాతినిధ్యం వహించే
విలువలనూ పరిగణన లోకి తీసుకోవలసి ఉంటుంది.
Be the first to like this post.