28 నవం, 2012

గుప్తా ఫౌండేషన్
ఈ వ్యాసం పుట్టపర్తి వారికి గుప్తా ఫౌండేషన్ వారు 

అవార్డు ప్రదానం చేసినప్పుడు వచ్చినది
వారు దానిలో 
ఆస్థాన కవి పదవి వారికి ఇవ్వాలని 
ప్రతిపాదించారు
కానీ అది జరగనూ లేదు 
వారు దాటీపోయారు.

ఇటువంటి పేపర్ కటింగ్స్ 

శ్రీశైలం గారు ఇన్నాళ్ళు అతి భద్రంగా దాచి వుంచారు
వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతుంది
నిజమైన సాహిత్యాభిమాని అనాలంతే..


           సరస్వతీ పుత్రునికి అక్షర ప్రణామాలు 

ఆంధ్రప్రభ, మద్రాసు, మంగళవారం, 1990, జనవరి 30.
సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులకు 

నేడు ఏలూరులో 
గుప్తా ఫౌండేషన్ అవార్డు
ప్రదానం చేస్తున్న సందర్భంగా 
ప్రచురిస్తున్న ప్రత్యేక వ్యాసం. 
సరస్వతీపుత్ర బిరుదాంకితులు 
మహాకవి  పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులవారు ఆంధ్ర జగమెరిగిన బ్రాహ్మణులు 

ఆంధ్ర సాహితీ ప్రపంచంలో 

రాయలసీమ ఆది నుంచీ
ఉత్తమ శ్రేణికి చెందిన 
ఎందరో కవితల్లజులను గన్న ధన్యసీమ

రాళ్ళసీమ అని 

కొందరు కొన్ని కారణాల చెత 
వ్యవహరించవచ్చుగాని 
సాహిత్య విషయంలో మాత్రం 
అది ముత్యాల వజ్రాల సీమ 

మామూలు బాలకులు 

ఆటపాటలలో అనురక్తులై ఉండే 
పన్నెండేళ్ళ పసి ప్రాయంలోనే 
ఆయన రచించిన 
పెనుగొండ లక్ష్మి కావ్యం పేరెన్నికగన్నది 
తదాదిగా 
ఆయన బహుళ సంఖ్య లో 
నిర్విరామంగ సాహిత్య వ్యవసాయం చేసి 
అత్యుత్తమ కృతుల నెన్నింటినో పండించారు. 

అసలు రాయలసీమ గాలిలో 

అక్కడి నీళ్ళలో 
అక్కడి రాళ్ళలో 
కొండలలో.. బండలలో..
 సర్వే సర్వత్రా 
సాహిత్య సమీరం వీస్తూ ఉంటుందంటే 
అతిశయోక్తి కాదు 

నాడు తెలుగు సాహిత్య రంగలో 

అనితర ప్రఖ్యాతి సంపాదించిన మహా కవులు 
ఎలా తెలుగు కావ్య సరస్వతిని 
తమతమ అమూల్య కావ్యాభరణాలతో అలంకరించారో 

అదే విధంగా నేడు కూడా 

అనేకులు కవులు 
అధునాతన  ఆంధ్ర సాహిత్య సరస్వతిని 
వివిధ ప్రక్రియలలో 
ఆమూల్యాభరణాలతో అలంకరిస్తున్నారు 

ఎందరు ఇతర కవులు 

కవి శబ్దమాత్ర వాచ్యులు 
ఎక్కడెక్కడ 
అనేక కారణాలతో విజృంభిస్తున్నా 

ఎవరెవరిపేర్లు 

కావ్య గౌరవం కారణంగా కాక 
ఇతరేతర కారణాలతో 
మారుమ్రోగిపోతున్నా 
సీమ ప్రత్యేకత సీమదే.

శ్రీమాన్ పుట్టపర్తి పేరు 

ఆంధ్రదేశం అంతటా 
అత్యంత గౌరవాదరాలతో 
సాహిత్యాభిమానులు తలచుకొంటూ ఉంటారు 

రాజకీయ కారణాలు 

కూటముల కారణాలు 
సంఘాల కారణాలు 
ఏవి ఎన్ని విధాలుగా కవులను విడదీసినా 

పుట్టపర్తి వారిది మాత్రం 

అత్యంత భక్తితో గౌరవంతో 
తలచుకోవలసిన పేరు 

1914 వ సంవత్సరం జన్మించిన పుట్టపర్తి వారిది 

అనా దిగా విద్వద్వంశం 
పదునారవ శతాబ్దపు 
సాహితీ సమరాంగణ సార్వభౌముని మన్ననలందిన తిరుమల తాతాచార్యుల వారి సంతతికి చెందినవారు 

వీరి పూర్వులందరూ 

వారణాసిలో విద్య నభ్యసించి 
మహా సంస్కృత విద్వాంసులుగా 
పేరు పొందినవారు. 

ఆ కుదురుకు చెందిన పుట్టపర్తివారిలో 

ఆ విద్వల్లక్షణాలు
 ఆ పాండితీ గరిమ 
ఆ కవిత్వ వైభవం 
ఉండడంలో ఆశ్చర్యమేముంది ..?

పుట్టపర్తి వారిది 

అనన్య సామాన్యమైన మేధ. 
ఒకటి లేక రెండు 
మహా అయితే మూడు భాషలకు మించి 
పాండిత్యం అలా ఉంచి 
కనీస వ్యావహారిక పరిజ్ఞానం 
సంపాదించడమే సకృత్తు. 

అలాటిది 

పుట్టపర్తి వారు 
అక్షరాలా పధ్నాలుగు భారతీయ విదేశీ భాషలలో గణనీయమైన పాండిత్యం సంపాదించారంటే ఆశ్చర్యకరమైన విషయం

అన్ని రంగాలలో 

విపరీతమైన వేగం పెరిగిపోయిన ఈ యుగంలో 
ప్రతి కవి నామమాత్రుడు. 
విపరీతమైన తాపత్రయంతో 
తన పేరు రేడియోలో టీవీలో సినిమాలలో 
రకరకాల దిన వార మాస పక్ష పత్రికలలో మ్రోగిపోవాలన్నంత తపన తో 

అక్షర శక్తిని దుర్వినియోగంచేస్తూ ఉంటే 

పుట్టపర్తి వారు మాత్రం 
చేయగలిగిన సాహిత్య సృష్టిని చేసి 
ఏ మాత్రం ప్రలోభాలకు లోను కాకుండా 
ఒక యోగివలె 
ఋషి వలె 
మౌనంగా ఉన్నారు 

బహుశా 

తన చుట్టూ ప్రపంచంలో వేగంగా పతనమౌతున్న 
సాహిత్య విలువలను గమనిస్తూ 
మౌనంగా బాధపడుతూ ఉండవచ్చుకూడా. 

చెలరేగిపోతున్న వికృత ధోరణులను 

సగటు ప్రతిభ గలవారు చేసే 
అనవసర ఆర్భాటాన్ని అలజడినీ 
గమనిస్తూ ఉండవచ్చు 

ఈ సాహిత్య అరాచకత్వం 

ఆ తరంవారు సహించలేక 
బాధపడడం సహజం కూడా 

నూరుకు మించిన పుట్టపర్తివారి కృతులలో 

ఆయనకు అనన్య సామాన్యమైన 
అజరామరమైన కీర్తి ప్రతిష్టలార్జించి పెట్టిన 
కమనీయ కృతి శివతాండవం 

తెలుగులో సాహిత్యం పట్ల ప్రేమ ప్రీతి ఉన్న 

పాఠకులందరి అభిమానానికి పాత్రమైన 
ఉత్తమ శ్రేణి కావ్యం అది. 

ఇప్పటికి పదకొండు ముద్రణలు పొందినదంటే 

ప్రశస్తిని అర్థంచేసుకోవచ్చు. 
శివతాండవం విదేశీ భాష అయిన జర్మన్ లోకీ 
అఖిల దేశ భాష అయిన హిందీలోకి 
సమర్థంగా అనువదించబడి 
పేరు ప్రఖ్యాతులు గడించింది. 

హృషీకేశ్ కు చెందిన 

స్వామీ శివానంద సరస్వతి 
ఏ శుభముహూర్తంలో పుట్టపర్తివారిని 
సరస్వతీపుత్ర బిరుదంతో ఆశీర్వదించారోగానీ 

ఆ బిరుద నామంతో ఆయన లోక ప్రసిధ్ధులైనారు 

మూడు విశ్వవిద్యాలయాలు 
ఈ మహాకవిని డాక్టర్ బిరుదంతో గౌరవించి 
తమను తాము గౌరవించుకున్నాయి. 

అందరినీ అలరించే 

చిత్రమైన ఉదంతం ఒకటి ఉంది. 
ఆయన పన్నెండవ ఏట రచించిన 
పెనుగొండ లక్ష్మి అనే రచన 
విద్వాన్ పరీక్షకు పాఠ్యాంశంగా నిర్ణయించబడింది. 
ఆయన అదే పరీక్ష రాయడానికి 
తమ ఇరవైయవ యేట పరీక్షార్థిగా వెళ్ళారు. 

తెలంగాణ నా కోటి రతనాల వీణ 

అని నినదించిన మహాకవి దాశరధి మరణించారు అంతకుముందే 
గత రద్దుల ప్రభుత్వం 
ఉఛ్చనీచాలు పాటించకుండా 
ఆస్థానకవి 
ఆస్థాన గాయక పదవులను 
పొదుపు చర్య అనే మిష తోనూ 
ఆ పదవులు రాచరిక వ్యవస్థకు చిహ్నాలనే 
కుంటి సాకుతోనూ రద్దు చేసి 
ఒక మహా కవిని 
ఒక మహా సంగీత విద్వాంసుని  అవమానం చేసింది. 

ఇప్పుడు పరిస్థితులు మారాయి. 

కొత్త గాలి వీస్తున్నది. 
ఆ పదవులు పునరుధ్ధరించి 
సాహిత్య సంగీత రంగాలకు 
తమిళనాడులోనూ 
ఇతర రాష్ట్రాలవలె 
గౌరవం గుర్తింపు కలిగించడం అవసరం. 

ఆస్థానకవి పదవికి 

పుట్టపర్తి వారి పేరు ఉటంకించబడుతున్నది. 
నిజానికి మౌనితుల్యులైన 
ఈ మహాకవికంటే 
ఆ పదవికి గౌరవం తేగలవారు 
ఇతరులెందరోలేరు. 

ఇటీవల సీమ కు అన్ని రంగాలలోనూ 

అన్యాయం జరుగుతున్నదని 
తజ్ఞులు తలపోస్తున్నారు. 
పైన చెప్పినట్లు జరిగితే 
ఆనందించని వారుండరు. 
అలా జరుగుతుందని ఆశిద్దాం.

1989 వ సంవత్సరానికి 

గుప్తా ఫౌండేషన్  వారి 
ప్రతిష్టాత్మక సాహిత్య బహూకృతి 
ఈ నెల 30వ తేదీన 
అఖిలాంధ్రకూ సాహిత్య కేంద్రమైన హేలాపురి లో పుట్టపర్తివారికి ప్రదానం చేయబడుతున్నది. 

ఇది తెలుగు సాహిత్యాభిమానులెల్లరకూ 

అత్యంత ఆనందదాయకమైన విషయం 
ఇలా పుట్టపర్తి వారిని సన్మానించి 
గుప్తా ఫౌండేషన్ వారు 
తమ సాహిత్య బహుమతికి 
ఆదిలోనే ప్రతిష్టను సముపార్జించుకుంటున్నారు-రామసుబ్బయ్య.