27 ఏప్రి, 2014

అతిశూన్యం..


రాత్రి పది గంటల సమయం
వీధిలో కారు ఆగింది..
అందులోంచీ అయ్య మరికొందరు దిగారు..
అందరూ లోపలికి వచ్చారు
ఎక్కడో సన్మానం నుంచీ వస్తున్నారు అయ్య..

అయ్య ముఖమంతా సంతోషం .. 

రాధ యేదీ..
రాధా..
రాధా..
వచ్చింది
రా.. రా.. రా..
కుటుంబ సభ్యులందరూ హాలులో చేరారు
చిన్న రాధ చుట్టూ అందరూ
అయ్య రాధను ఎత్తుకున్నారు ముద్దు పెట్టారు
రాధ వయసు ఎనిమిదేండ్లు
దింపారు
ఊ.. ఇప్పుడు నీకు సన్మానం..
అంటూ పూలమాల వేసి..
శాలువా కప్పి ..
అయ్య చప్పట్లు కొ
ట్టి నారు.. సంతోషంగా నవ్వేనారు అందరూ..చప్పట్లు
ఊ.. యేమైనా మాట్లాడు..

'మీరు నాకు సన్మానం చేసినందుకు కృతజ్ఞ తలు..'
అంది సిగ్గుగా  రాధ..
అంతే..
మళ్ళీ నవ్వులు..
నవ్వులు..
నవ్వులు.
ఊరంతా అయ్యను సన్మానిస్తే నిండిన 

అయ్య హృదయం ఇలా ఆనందించింది..

26 ఏప్రి, 2014

గువ్వల చెన్నా ..


గుడికూలును - నూయి పూడును
వడినీళ్ళకు చెరువు తెగును
వనములు ఖిలమౌ
చెడనిది ‘పద్యం’ బొక్కటె
కుడియెడమల కీర్తిగన్న గువ్వల చెన్నా!!

కవి వాక్కు నిలిచినంతకాలం 
తనకీర్తి నిలవదని రాజులకు చక్కగ తెలుసు
అందుకే విజయ స్థంభాలను చెక్కించడం 
గుళ్ళు గోపురాలుకట్టించడం
విగ్రహాలను ప్రతిష్టించడం నగరాలు నిర్మించడం
వీనితో సంతృప్తి చెందక కవు లను దగ్గరతీస్తారు
 
భోజుని వంటి రాజు కలిగితే 
కాళిదాసు వంటి కవి అప్పుడే వుంటాడు అనడం తప్పు
కాళిదాసు వంటి కవి కలిగితేనే 
భోజుడు వుండడం
కవికృపను సంపాదించగలిగితే 
సామ్రాజ్జాధిపులైనా 
సామాన్యులైనా అమరత్వం పొందగలరు..
 
ప్రపంచ చరిత్రలో ఇందుకు తార్కాణాలు వందలూ వేలూ
ఇందులో పైధియాస్ కు సంబంధించిన గాధ 
బహు చక్కనిది
 
ప్రాచీన కాలంలో ఇతడు ఈజియానాకు చెందినవాడు
ఇస్థమియన్ పోటీలో జగజ్జెట్టీగా ఎన్నికై
తనను కీర్తిస్తూ ఒక పద్యం రాయడానికి 
ఎంత చెల్లించ వలసివుంటుందని అడగడానికి
తమ ఊరుకవి పిండార్ దగ్గరకు వెళ్ళాడు
 
తన కట్నం ఇప్పటి మనలెక్క ప్రకారం 
సుమారు మూడు వేల రూపాయలని చెప్పాడా కవి
'అబ్బో అంతే ..
అంత పెడితే నా కంచు విగ్రహాన్నే పోత పోయించుకోవచ్చు..' నని పైధియాన్ పెదవి విరిచాదు
 
'నిజమే కావచ్చు '
అని పిండార్ మందహాసం చేసి మిన్నకున్నాడు 
రాత్రి ఇంటిలో బాగా ఆలోచించుకున్న మీదట..
అడిగిన డబ్బు ఇచ్చి పద్యం రాయించుకోవటమే మంచిదని పైధియాన్ కు తోచింది
ఇప్పుడు
ఈజి
యానాలేదు  అందులో కంచువిగ్రహాలు లేవు
కానీ పద్యం మాత్రం నిలిచివుంది..
మనలో చాలామంది
అయితే మనమూ ఆపని చేద్దామనుకోవచ్చు

అయిదో పదో చేతిలో పెడితే 
పంచరత్నాలూ నవరత్నాలు దండిగా దొరుకుతాయి
అందుకు బాలకవులు ప్రౌఢ కవులు మధుర కవులు సరస కవులూ ఫుల్లుగా వున్నారు..
కానీ ఆ పిండార్ వంటి కవి దొరకాలికదా
ఇవి నా మాటలు కావు ..
నార్ల వారి సంపాదకీయంలోవి..

భట్టుమూర్తి రాయల కొలువులో ఒక దిగ్గజం
అతడు ఒక బెస్తవానిపై ఒక పద్యం కాదు
 శతకాన్నే వ్రాసినాడు
కారణం
వాడెంతో త్యాగ శీలి
వాడొక బెస్త వాడు చేపలమ్మితేనే వాణి పొట్టకు తిండి
అలాంటివాడేమి త్యాగం చేయగలడు
చేసినా ఎంత చేయగలడు..
 
తనకున్న దానిలోనే 
ఎంతో కొంత ఉదార బుధ్ధితో ఇస్తారు కొందరు
లక్షలు కోట్లు ఉన్నా 
దానం త్యాగం అనే పదాలే తెలియవు కొందరికి..
 
భట్టుమూరి బెస్తడి త్యాగాన్ని చవిచూశాడు
ఆశ్చర్య పడ్డాడు
వెంటనే అతని హృదయం ఉప్పొంగింది
వెంటనే కొన్ని పద్యాలు చెన్నడిపై దొర్లాయి అవి 'గువ్వలచెన్నా' అనే మకుటం కలవి
ఈ కథ పిల్లలకోసం పుట్టపర్తి వ్రాసిన
 రాయల నీతి కథలు లోనిది


 

 

16 ఏప్రి, 2014

పాత్రలేమంటాయి ..?

భాగవతంలో స్త్రీ పాత్రలెన్ని వున్నాయి
ఆ .. దేవకి..యశోద..గోపవనితలు..

కుబ్జ..సత్యభామ..
రుక్మిణి .. ప్రహ్లాదుని తల్లి లీలావతి..
 అబ్బో .. 

చాలా..  చాలా .. ఉన్నాయి.. 

దేవకి 'అన్నా..  అన్నా..  '
అని  పిలుస్తూ తిరిగే పిల్ల. 
ఆకాశవాణి 
 'నీ చెల్లెలి ఎనిమిదవ గర్భంలో జన్మించేవాడు 
నిన్ను చంపుతాడు '
అని చెప్తే చెల్లెలని కూడా చూడకుండా
 తీసుకెళ్ళి జైల్లో వేశాడు కంసుడు
 

అక్కడే ఎనిమిది మందినీ కని 
వారిని అన్న వధిస్తూ వుంటే కన్నీరు కార్చింది
కనీసం నిందించనైనా లేదు అన్నను
 

ఆఖరికి ఎనిమిదవ బిడ్డను చంపబోగా
'అన్నా..  ఇది ఆడపిల నీ మేన గోడలు.. వదులన్నా..'

అని ప్రాధేయపడింది
ఆ ఎనిమిదవ బిడ్డనా కాశానికి ఎగురవేయగానే 

'ఒరే..  నిన్ను చంపేవాడు ..
ఇంకో చోట పెరుగుతున్నాడ్రా..'
  అని మాయమైతే
 

కంసుడు
'అయ్యయ్యో చెల్లీ ..తప్పయిపోయింది..

 నిన్ను ఇన్ని రోజులూ ఇబ్బంది పెట్టాను..
 యేం చేయను ..?
నా ప్రాణమూ విలువైనదే కదా..
నన్ను క్షమించండి ..

మీరు మీ రాజ్జానికి పోయి హాయిగా వుండండి
 అని అంటే
 

'సరే'.. నంటూ 
భర్తతో కలిసి వెళ్ళిపోయింది
ఎంత సౌజన్య మూర్తి ..

ఇంక కృష్ణుని పెంచిన యశోద  

నందుని భార్య
తన ముద్దుల తనయుని పై వల్లమాలిన ప్రేమ
అబ్బ ..

కృష్ణుని ఎన్ని తిప్పలు పెట్టిందనుకున్నారు
రోలుకు వేసి కట్టింది, 

చెవి మెలి పెట్టింది,
మన్ను తిన్నావా ? ఏదీ నోరు చూపించమంది
 

పాలు వెన్న పెరుగూ దొంగతనం చేస్తున్నాడని 
అందరు ఆడవారు పిర్యాదు చేస్తే
'మా ఇంట్లో పాలు పెరుగూ లేవా?

 మీ ఇంట్లో దొంగతనం చేయలా..?
పొండమ్మా ..మా చెప్పొచ్చారు ..''
అని వాళ్ళని దబాయించింది.
 

కాళీయమర్దనం చేసినా .. 
బకాసుర సం హారం చేసినా..  
శకటాసుర భంజనం చేసినా.
నా బిడ్డకేమైతుందో .. 

అని గాభరా పడి దిష్టి తీసిందే కానీ..
ఇంతటి అతిలోకుడు తన బిడ్డడన్న 

స్పృహ ఆమెకు కలగలేదు
 


చుశారా..  యెన్ని వైవిధ్యాలో..
 

పుట్టపర్తి అంటారూ ..
పోతనామాత్యులకు వివిధ చిత్తవృత్తులు గల నాయకులను సృష్టించటం కంటే
నాయికలను సృష్టించమే ఇష్టమట..
 

అంగవర్ణనలు కాక ..
వారి చేష్టలు.. విలాసములు.. వర్ణించటం 
పోతన్న గారికి ప్రియమైనదట..
మరి మనమేం చేద్దాం..
చక్కగా విందాం..
సరేనా.. 








పోతనామాత్యులకు 
వివిధ చిత్తవృత్తులుగల నాయకులను సృష్టించుటకంటెను 
నాయికలను సృష్టించుట లో 
నెక్కువ యపేక్ష యున్నట్లున్నది

ఆతడు వర్ణించిన 
శకుంతల శర్మిష్ట దేవకి దేవయాని రోహిణి యశోద వీరందరు చిత్తవృత్తులలో 
కేవలము విభిన్నలైన వ్యక్తులు.

త మ కొక రెండుదాహరణములు 
మాత్రమే మనవి చేసు కొందును

ఊర్వశికి మిత్రావరుణుని శాపము గలిగెను. 
అందుచే నావిడకు మానవజన్మ మేర్పడినది

కాని యంతకు ముందే 
యూర్వశికి పురూరవునిపై నొక ప్రెమ కద్దు
కారణమేమనగా.. 
ఆతని శౌర్య సౌందర్య గంభీర్యాది  గుణములను 
నామె యింద్రుని సభలో నారదునిచే విన్నదట

ఊర్వశి భూలోకమునకు వచ్చి 
పురూరవుని ముందట నిలువబడినది
వాడిట్లున్నాడు.. 

''సరసిజాక్షు మృగేంద్ర మధ్యు విశాలవక్షు మహాభుజున్
సురుచిరానన చంద్రమండల శోభితున్, సుకుమారు నా
పురుష వర్యు పురూరవుం గని పూవుటం పరజోదుచే
దొరగు క్రొవ్విరి సూపులం మది దూల పోవగ భ్రాంతయై''

ఊర్వశి భ్రాంతయైనను 
ఆమె తన హృదయము నెరి గింపలేదు 
ఊరక నిలచియున్నదట.. 
ఇది స్త్రీ ధర్మమే.. 

పురూరవుడును ఊర్వశిని జూచెను.. 
వాడు 'దీని కరగ్రహణంబులేనిచో జీవనమేటికంచు.. ? మరు ని ముసముననే నిర్ణయించుకున్నాడట

ఎట్టకేలకు వాడే ప్రేమోదంతము నారంభించెను
పురూరవుడన్న మాటలివి.. 

'ఎక్కడ నుండి రాక మనకిద్దరకుం దగు నీకు దక్కితిన్
మ్రుక్కడి వచ్చెనే యలరు ముల్కులవాడ డిదంబు ద్రిప్పుచే
దిక్కు నెౠంగనీడు నను దేహము దేహము గేలు గేల నీ
చెక్కున చెక్కు మోపి తగు చెవ్యుల నన్ను విపన్ను గావవే''

ఊర్వశి మహా ప్రౌఢ.. 
వాడీ మాటలన్నంతనే 
'వీడు లఘు హృదయుడని..  
యర్థము సేసికొన్నది

ఈ భావము నామె బైట బెట్టినది గాదు
ఇంతలో గంధర్వులు వచ్చి 
పురూరవుని ప్రేమ విఘాతమును జేసినారు
ఆమె వాని కన్ను మర గి పోయినది

నాటనుండి పురూరవుడు వెర్రి వాడై 
ఊర్వశిని వెదుకుచున్నాడు 
ఒకసారి సరస్వతీ నదీ తీరమున నామె 
వాని కంట బడెను

వీనిని వదలి పోయినది మొదలు.. 
 ఊర్వశికి వీని గాలియే లేదు
'యోగ వియోగములకు మనసివ్వరాద'నునది 
యామె నేర్చుకున్న కామ శాస్త్ర వేదాంతము

పురూరవుడామె కడకేగి
దీనముగ యాచించినాడు 
అపుడూర్వశి తన మనస్సులో 
వీనిని గురించి యున్న 
నిజమైన భావమును బైటపెట్టినది
అది యిది.. 
మగువలకు నింత లొంగెదు

''మగవాడవె నీవు పశువు మాడ్కిన్ వగవన్
దగవే .మానుష పశువును
మృగములు గని రోయుగాక మేలని తినునే''

ఈతలపామెకీనాడు కలిగినది కాదు 
పురూరవుని జూచిన నాడే యేర్పడినది
ఆ భావమునింతవరకు దాచినది. 

ఆ తరువాత నా మె తన కుల ధర్మము 
నీరీతి వెల్లడించెను

''తలపుల్ చిచ్చులు మాటలుజ్జ్వల సుధాధారల్ విభుండైన పూ
విలుతున్ మెచ్చర యన్యులన్ వలతురే విశ్వాసమున్ లేదు క్రూ
రలు తోడన్ బతినైన చంపుదు రధర్మల్ నిర్దయల్ చంచలల్
వెలయాండ్రెక్కడ వారి వేడబములా వేదాంత సూక్తంబులే''

ఊర్వశీ పురూరవుల ప్రేమలో 
పురూరవుడు ప్రేమైకవశుడు. 
కడుంగడు దీనుడు గూడ.. 

ఆ దేవకాంత 
వానితో నెప్పుడును సేవ జేయించుకొన్నదే గాని
వాని కొకనాడైనను 
సేవ జేసినట్లు గానరాదు

ఇది యనుకూల పతిక
ప్రౌఢ నాయిక

దుష్యంతుడు వేటకు బోయెను 
ఆశ్రమమునందు 
శకుంతల యొక్కతియ యున్నది
ఆశ్రమమున బ్రవేశించిన 
దుష్యంతునకా మె కంటబడినది

''దట్టపు దురు ము .. 
మిఱు మిఱు చూడ్కులు .. 
నట్టాడు నడుము.. ''

దుష్యంతున కింకేమి గావలెను..?
వెంటనే యతడు 
తన మనస్సును బైట పెట్టినాడు

ఆమెకును 
దుష్యంతుని జూచిన వెంటనే మతివోయినది
ఇంతలో మన్మధుడొకడు నడుమ దూరెను 
వాడు 
గుసుమాస్త్రములతో నా బాలను గొట్టినాడట 
శకుంతల తాలిమి సెడి 
ఇట్లు బదులు వలికినది.. 

''అనివార్య ప్రభమున్ను మేనకయు విశ్వామిత్ర భూ భర్తమున్
గనిరా మేనక డించిపోయె నడవిన్ గణ్వుండు నన్నింతగా
మనిచెన్ సర్వము నామునీంద్రు డురుగున్ మద్భాగధేయంబునన్
నిను గంటిన్ పిదపన్ గృతార్థనగుదున్ నేడీ వనాంతంబునన్''
 

శకుంతల ముగ్ధ ..
భావగోపన మింకను .. 

ఆమెకు బాగుగ నలవాటైనదిగాదు
 

ఊర్వశి తాను పురూరవుని ప్రేమించితినని 
నోరార చెప్పనేలేదు .. 
శకుంతల చెప్పినది..
ఆ చెప్పుట..  

'కృతార్థనగుదున్.. '
అని ఎంతో నాజూకుగా నన్నది
 

సత్కులమున బుట్టిన కన్యక
 ఇంతకంటె మరి యేమనును.. ?
 

పోతనామాత్యులు సృష్టించిన దేవయాని 
మహా గర్వోద్యమస్థాని
'భూరికోపానలాకలితగ్లాని' కూడ
 

ఆమె దృష్టిలో 
శర్మిష్ట తండ్రి శుక్రాచార్యునకు దాసుడు
తన చీర కట్టుకున్న శర్మిష్టను 

'విహితములే .. కుక్కలజు హవిర్భాగంబుల్.. '
యని యామె ప్రశ్నించు చున్నది
 

శర్మిష్ట గూడ కోపమున తక్కువదిగాదు .. 
 కాని యాకోపము క్షణమాత్రము
శర్మిష్ట దేవయానికి దాసియైనది
 

దానికి కారణము తండ్రి యాజ్ఞ 
అపుడామె 'చలమింకేల పోనీలె మ్మ' ని 

తన్ను తాను సవరించుకొన్నదట
ఆ సవరింపు 

తన కార్యమును సాధించుకొనుటలో దీక్షయే
 

ఎడరువేచి 
ఒకానొక నాడు యయాతిని లోగొన్నది
దేవయానికాసంగతి తెలిసి 

క్రోధమూర్చిత యైనది
యయాతి భంగపడినాడు 

ఆమె విన్నదిగాదు
యయాతి యపరాధము 

శుక్రుని చెవులకు తాకనేతాకినది 
శర్మిష్ట క్షత్రియ కాంత
కుచితమైన భావగోపనముగల యువతి
దేవయానికి 

తోచిన భావము దాచికొను నలవాటులేదు

సాధారణ కవులు 

అంగిక శృంగారమును వర్ణించి తృప్తి చెందుదురు
ఇతడును స్త్రీల యంగములను వర్ణించును
 

కాని .. దానికన్నను..  
స్త్రీల చేష్టలు .. విలాసములు .. వర్ణించుట పోతనామాత్యులకు ప్రియమైన పధ్ధతి.

12 ఏప్రి, 2014

యోగరతో వా భోగరతోవా




నారాయణాచార్యులు ఈ యుగానికి మహా భక్త కవి 
తాను భక్తి సాహిత్యంతో తరించి పఠితలను తరింపజేసాడు
నారాయణాచార్యులు మనసాటి మానవుడే
లోపాలు లేని వాడు కాడు..
 

కానీ..
ఆ లోపాలను అరసి..
ఎప్పటికప్పుడు భక్త్యావేదనలో తపించి.. లోపాలను దహించుకుంటూ..
శ్యామ శబలం చేసిన బంగారు లాగ పరిశుధ్ధుడైనాడు.
తన రచనలతో లక్షలాది ప్రజలను తరింపజేశారు కనుక
ఉత్తమగతులు పొంది ఉంటారు
సందేహం లేదు..
 

శ్రీనాధుడు
"దివిజ కవి వరుగుండియల్ దిగ్గురనగ నరుగుచున్నాడు శ్రీనాధుడమరపురికి ''

అని చెప్పుకున్నాడు అవసానకాలంలో..
 

''ఒకనాడు కృష్ణదేవరాయ సుమ శేఖ
రంబైన యభయహస్తంబు మాది
ఒకనాడు గీర్దేవతా కమ్ర కంకణ
స్వనమైన మాధురీ ప్రతిభమాది
ఒకనాడు రమానుజ కుశాగ్ర బుధ్ధికే
చదువు నేర్చినది వంశమ్ము మాది
ఒకనాటి సకల శోభకు తానకంబైన
దండిపురంబు పెను   గొండమాది
దల్లి దండ్రుల మేధ విద్యా నిషధ్య
పాండితీ శోభ పదునాల్గు భాషలందు
బ్రదుకునకు బడిపంతులు భాగ్యములకు
చీడబట్టిన రాయలసీమ మాది..''
అని చెప్పుకున్నాడు..
 

ఇది స్వాతిశయం కాదు..
యధార్థం..
ఇంతటి వానిని పరలోకంలోనూ 'శ్రియః పతి' 

కరుణా కటాక్షంతో అనుగ్రహిస్తాడు.
-తిరుమల రామచంద్ర.

మార్చ్ 28 న పుట్టపర్తి శతజయంతి సందర్భంగా HMTV లో ప్రసారమైన కార్యక్రమం

మార్చ్ 28 న పుట్టపర్తి శతజయంతి సందర్భంగా HMTV లో ప్రసారమైన కార్యక్రమం

7 ఏప్రి, 2014

తతికాలమేతెంచె..ఓం, న, మో, నా, రా, య, ణా, య'




ప్రాచ్య లిఖిత గ్రంధాలయం, హైదరాబాదు వారు 
వెలికి తెచ్చిన పుట్టపర్తి అష్టాక్షరీ కృతుల గ్రంధ  రూపమిది
ప్రఖ్యాత సంగీత విద్వాంసులు కొమండూరి గారి ముందుమాట 

మనం తప్పక చదవాలి
 

గత రెండు మూడు నెలలుగా వారు 
ఈ కార్యంపైనే దృష్టి యావత్తూ కేంద్రీకరించి వున్నారు..
అట్లానే వారు వ్రాసిన పీఠిక ప్రతి పదమూ సంగీత తంత్రులను మధురంగా మీటుతూ మనకానందాన్ని కలిగిస్తాయి
 

కొమండూరి వారు పుట్టపర్తి వారితో 
ఎన్నో సంవత్సరాల అనుబంధాన్ని కలిగివున్నారు
ఒంటిమిట్ట వాసుదేవుడైన కోదండ రామస్వామి భక్తుడు 

ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామియందు 
అతిశయ అనురాగముండినది పుట్టపర్తికి.
'పుట్టపర్తికి గల నిరతిశయ నిశ్చల భక్తి 
సస్యములు పండి పైరగునని '
వాసుదాస స్వామి జోశ్యము చెప్పినారట..
''ఒకనాడు నారాయణుడు నీకగుపించునయ్యా..''
అని జోశ్యము చెప్పిరి
అంటారు.
 వాల్మీకి రామాయణాన్ని యథావాల్మీకంగా, పూర్వ కాండలతో సహా ఉత్తర కాండను కూడా కలిపి తెనిగించిన ఏకైక మహాకవి కీర్తి శేషులు వావిలికొలను సుబ్బారావు (వాసుదాసు) గారు


భగవత్ చరిత్రలెన్నో వుండగా 
రామాయణ రచనకే ఎందుకు పూనుకున్నావని అడిగినవారికి 
తనదైన శైలిలో జవాబిచ్చారు వాసుదాసుగారు. 

ఆంధ్ర పండితుడిగా పనిచేస్తున్న రోజుల్లోనే, `
భార్యా వియోగం కలగడంతో, 
వాసుదాసుగారు భక్తి-యోగ మార్గం పట్టారు. 

జీర్ణ దశలో వున్న ఒంటిమిట్ట రామాలయాన్ని సముద్ధరించాలన్న సంకల్పంతో, 
బిక్షాటనచేసి లభించిన ధనంతో 
ఆలయాన్ని అభివృద్ధి చేసారు.
జనన-మరణ రూపకమైన సంసార బంధం నుండి 
విముక్తి చేసేది రామ కథేనని, 
భగవత్ సాయుజ్యం పొందేందుకు 
రామాయణ రచన చేసానని అంటారాయన. 

పూర్వం కొందరు రాసారుకదా, 
మరల ఎందుకు రాస్తున్నావంటే, 
 "ఎవరి పుణ్యం వారిదే. 
ఒకరి పుణ్యం మరొకరిని రక్షించదు" 
అని జవాబిస్తూ, 
శ్రీరాముడి అనుగ్రహం కొరకు రామాయణాన్ని రచించి వాగ్రూపకైంకర్యం చేయదల్చానంటారు వాసుదాసుగారు.

ఎంతటి పుణ్య చరితులో కదా
ఒకే మార్గంలో పయనించే పథికులిద్దరూ..  

పుట్టపర్తీ వావికొలను..
ఈ ఆంధ్ర వాల్మీకి
ఒంటిమిట్టలోని ఒక గుట్టపై  ఒంటరిగా నివసిస్తూ వుండేవారు. మా అయ్య తరుచూ వారిని కలవటము. వారు మా ఇంటికి రావటమూ జరిగేది
 

మా అమ్మ మా ఇంటికి ఎవరు బంధువులు వచ్చినా రాండి అందరూ ఒంటిమిట్ట రాముని దర్శించుకుందాము అని
తనే ఖర్చు పెట్టి వారందరినీ తీసుకొని ఒంటిమిట్ట వెళ్ళేది.


అక్కడ వున్న కొలను అందులోని తామరలూ
అందులో తానాడటమూ నాగక్కయ్య అనుభవం.
 

ఇక కొమండూరు వారి వద్దకొద్దాం..
''కవి అష్టాక్షరీ విభుని అలంకరించిన ఆయుధాలను నుతించారు
కౌస్తుభము ఎద రహస్యమెరిగినదట..
పాంచజన్యము శంఖారావము చేత లోకమునకు విజయోత్సవ మిచ్చునదట..
నందకము సంసార మాయ ఖండితము..
హస్త చక్రము జ్వాల
పరమ పౌరుష కారమైన ఈ ఆయుధ శ్రేణిని 

కీర్తన ముఖంగా అభినుతి చేయుటయందు పుట్టపర్తి వారే ప్రధములట..
 

నందకాన్ని మలయమారుత రాగం లో
పీతాంబర ప్రస్థావన బిలహరి లోనూ
రక్షక చక్రమును మోహన లోనూ
ఇలా సాహిత్య గతుల అమరికకు అనుగుణంగా రాగ భావాలు అమర్చినారు
పుట్టపర్తి అన్వయించిన 82 నూతన రాగాలనూ వారు ఉటంకించారు.


చివరగా 
త్యాగరాజానంతర వాగ్గేయ సుధీమణులలో 
పుట్టపర్తి స్థానము 
ఈ రచనలను పరిశీలిస్తే అవగతమౌతుందంటూ
ఇట్టి మధుర రసాంచిత కీర్తనల వెలయించిన 

పుట్టపర్తి వాగ్గేయ చక్రవర్తి రచనలకు 
దేశాంతరమందున్న నాకు సంపాదకత్వ మొసంగినందుకు 
కృతజ్ఞత లంటారు..












 



  







3 ఏప్రి, 2014

1 ఏప్రి, 2014