26 జూన్, 2014

అహంకార పంచకం



నూటికో కోటికో ఒక్కరూ..


హృషీ కేశ్.. 
 నిర్మల మనసు తో తపోసాధన చేయటానికి 
అన్ని రకాలా అనువైన ప్రదేశం ..
అందుకే లక్షలాది మహర్షులు 
ఇక్కడే తపస్సు జపము యజ్ఞ  యాగాలు చేసి 
ఆత్మ  తత్త్వం తెలుసు కొ  ని 
బ్రహ్మ జ్ఞానం పొంది మోక్షం సంపాదించారు .

శ్రీ శంకర భగవత్పాదుల పవిత్ర పాద ముద్రలతో 
పునీత మైన క్షేత్రం
హృషీ కేశ్..
ఆమహాను భావులు నడిచి నడిపించి ప్రపంచానికి 
త రుణో   పాయం చూపిన పవిత్ర భూమి

అబ్దుల్ కలాం
హృషీకేశ్ లో..
గంగానదిలో స్నానం చేసి..
శివానందుల ఆశ్రమానికి వెళ్ళి 

స్వామివారి ఎదుట నిల్చున్నాడు
మనసంతా నిర్వేదం..
 

విమాన పైలెట్  గా  వెళ్ళాలని ప్రయత్నించాడు
ఊహూ..
సెలెక్టవలేదు..
తీవ్రమైన నిరాశ..
 

కటిక దరిద్ర జీవితం..
చదువుకోవాలనే ఆశ..
పైకెదగాలనే కోరిక..
ప్చ్ .. ఫలించలేదు..
 

విపరీతమైన బాధ..
ఎదురుగా శివానంద..
మంచుకొండల నడుమ..
వాటి ఎత్తంత.. ఉన్నతమైన ప్రశాంతమైన వదనం..
చల్లటి చూపులు
 

అబ్బ.. హాయిగా ఉంది..
గొప్ప సంతృప్తి..
 

నీపేరేమి..
శివానందులడిగారు..
అబ్దుల్ కలాం..
పేరు వినగానే.. భృకుటి ముడిపడలేదు..
శరీరంలో వింత ప్రకంపన లేదు
 

అదే ఆదరణ అదే ప్రశాంతత..
ఎందుకంటే 

వారు శరీరాలకు అతీతులు
ఆత్మోన్నతులు..
సత్యదర్శనం చేసిన వారు
అన్నిటికీ మించి దయా సముద్రులు..
 

ఈ శ్వరునిదయ ఎటువంటిదో 
వారి దయ అటువంటిది.. 
ఆయన సనాతన ధర్మానిని ప్రతినిధి..
 

నీ ముఖం చూస్తే.. 
ఏదో నైరాశ్యంలో ఉన్నట్లున్నావ్..
అన్నారు..
 

కష్టపడి మెడ్రాస్ లో 
ఐ ఐ టీ  ఏరోనాటి కల్ ఇంజనీరింగ్ చదివాను..
డెహ్రాడూన్ లో పైలట్  అవ్వాలని కల
కానీ కాలేక పోయాను..
మాట ఆగింది
యేదో నీటిపొర మాట కడ్డుతగిలింది..

నాకు ఉద్యోగం రాలేదు .. చాలా బాధగా ఉంది..
 

నీవు ఒకటి కావాలనుకున్నావ్
భగవంతుడు నిన్ను వేరొకటి చేయాలనుకున్నాడు..
నిన్నేం చేయాలో నిర్ణయం చేసి వుంచాడు..
దానికి తయారుగా వుంటే..

నీవు అవ్వాలనుకున్న దానికన్నా 
చాలా గొప్పవాడివే అవుతావు..
పరమేశ్వరుడు నిన్ను ఎందుకు ఎక్కడ ఉపయోగించుకోవాలనుకున్నాడో.. 

ఎక్కడ నిలబెడతాడో 
నీకు ఒకనాడు అర్థమవుతుంది..
 

అంతే..
కలాం లో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది..
జీవితంలో వెనుదిరిగి చూడలేదిక..


అది 1940 లు
ఒక యువకుడు.. ఆ శిఖరాల పైకి ఆవేశంగా వెళుతున్నాడు..
కళ్ళనుండీ ధారపాతంగా కన్నీరు..
అప్పటికి దాదాపు సంవత్సరం న్నరగా దేశం పట్టి తిరుగుతున్నాడు
ఎందరో సాధువులను సన్యాసులను కలుస్తూ.. పిచ్చివాడిలా ..
 

అతనిలోనూ తీవ్రమైన నిరాశ..
అతనిని పట్టే బంధాలు యేవీ ఉన్నట్లు లేదు..
 

అయ్యయ్యో శిఖరాన్ని చేరాడు..
కిందకు చూస్తే లోతైన లోయ..
దూకేస్తాడో యేమిటో..
ఎవరైనా కాపాడే వాళ్ళు లేరా..
 

అతను శిఖరం పై నిల్చుని ఆకాశం పైకి చూశాడు..
అక్కడినుంచీ అది చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తోంది..
 

అతనికి ఆ ఆకాశంలో
సిరికిం జెప్పడు..
శంఖ చక్ర యుగముం జేదోయి  సంధింపని 

ఆ శ్రీమన్నారాయణుడూ..
ఆయన వెనుక
సిరి..
 
లచ్చివెంట..
అవరోధ వ్రాతములూ .. 
పక్షీంద్రుడూ..
ధనుః కౌమోదకీ శంఖ చక్ర నికాయాలూ 
నారదుడూ.. 
వైకుంఠ పురంలో వుండే ఆబాల గోపాలమూ కనిపిస్తున్నాయి..
 

ఆ దేవుని తో యేవేవో మాట్టాడాడు..
దూ.. క.. బో.. యా.. డం.. తే...
 

స్టాప్..
అన్న పిలుపూ
భుజంపై పడ్డ చేయీ..
వెనుదిరిగి చూశాడా యువకుడు ..
 

అదురుతున్న ముక్కు పుటాలూ..
ఉక్రోషంతో ఎరుపెక్కిన కన్నులూ..
ఒక్క చూపుతో వాని నుదుటి రేఖలను చదివేశాడా వ్యక్తి..
పెదవులపై సన్నని చిరునవ్వు..
లీలగా.. హేలగా..
 

కం .. కం విత్ మీ..
చేయి పట్టుకు.. తీసుకు పోయాడు..
వెంట ఆవును అనుసరించిన దూడలా..
 

వెనుక నుంచీ
ఆ శంఖ చక్ర యుగమును చేదోయి సంధింపని శ్రీమన్నారాయణుడూ..
చిరునవ్వుతో చూశాడు..
వెడుతున్న వానివేపు..
ఆశ్రమానికి వెళ్ళారు ఇద్దరూ ..

ఆయన శివానంద సరస్వతి..
ఆ యువకుడు పుట్టపర్తి నారాయణాచార్యులు
స్వామి తెలుసుకున్న వివరాలు..
మంచి పండితుడు..
చాలా భాషలు తెలుసు ..
సంగీత నాట్యాలు బాగా వచ్చు
 

అంతేకాదు
కరడు గట్టిన సాధకుడు ..భక్తుడు..


తల్లి చిన్ననాడే గతించింది
తండ్రి రెండవ పెళ్ళి చేసుకున్నాడు
ఇతనికి పెళ్ళయింది
భార్యా పిల్లలు..
అక్షర లక్షలు గాయత్రి చేసాడు
అష్టాక్షరి కోట్లాదిగా చేసాడు..
యే ఆధ్యాత్మిక అనుభూతి కలుగలేదు
 

అందుకే తీవ్రమైన మనస్తాపం
అదెంత వరకూ పోయిందంటే
సంసారం విడచి
దేశం పట్టి తిరుగుతున్నాడు..
 

ఇల్లువిడచి.. తన ప్రాంతం విడచి.. 
ఒకే ప్రశ్నకు సమాధానం వెదకుతున్నాడు
అది యెవరి దగ్గరా దొరకలేదు..
 

వైరాగ్యాలు రెండట..
జిహాసా..
జిజ్ఞాసా..
జిహాసా అప్పుడప్పుడూ వచ్చి పొయ్యేది..
జిజ్ఞాసా..
ఒకసారి వస్తే..అది తనతో అతన్నీ పరమ పదానికి తీసుకువెడుతుంది..
 

ఆరునెలలు ఆశ్రమంలో ఉన్నాడు..
తన శిష్యులతో పాటే అన్ని పనులూ చేస్తూ..
త్యాగరాజ కీర్తనలు పాడతాడూ..
భాష తెలియకపోయినా..
ఆ మాధుర్యం పరమాద్భుతం..
పైగా అతనే దానికి అద్భుతమైన వివరణ ఇస్తాడు..

శివతాండవం యేం పాడతాడూ..యేం ఆడతాడూ..
ఆ పరమ శివుడే నా ఆశ్రమానికి వచ్చీఅడుతున్నాడా అనిపిస్తుంది..
వీడు సామాన్యుడు కాడు
ఈ కర్మ భూమిలో ఎందరో పవిత్రాత్మలు 

ఈవిధంగా మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తుతూ.. ఉంటారు..
వారికి దిశానిర్దేషనం చేయడం కేవలం లాంఛనమే..

నీవడిగే ప్రశ్నలు అనాదిగా ఋషులూ యోగులూ..
వేల వేల సంవత్సరాలుగా మధిస్తున్నారు..
వారికీ జవాబు దొరకలేదు..
 కాయ పులుపు వగరు
పండితే..
తియ్యగా మారిపోతుంది.
 

జీవితమూ అంతే..
అనుభూతి కావాలంటే జన్మ పండాలి..
పక్వానికి వస్తే 

దాని సువాసనలను నీవు దాచనేలేవు..
 

వెళ్ళు..
జీవితాన్ని తృప్తిగా అనుభవించు..
ఎన్నో మధురతలు నీకోసం వేచి చూస్తున్నాయి..
ఎన్నో విజయ కేతనాలు నీకు స్వాగతమిస్తున్నాయి..
 

ఆ ఘడియ వచ్చిందంటే..
నీవు అడగనక్కరలేదు..
ఆ పరమాత్మ నీ ఇంటి కాపలాదారుగా నిలబడతాడు
నీ సేవకుడుగా చామరం పడతాడు..
అంతటి ప్రేమను ఆయనా పంచడానికి ఎదురు చూస్తున్నాడు..
అందుకోవటానికి ఎదురుచూడు...
తలపై చేయివేసి ఆశీర్వదించాడు


వాని పాండిత్యానికీ గురు భక్తికీ.. 
ఇచ్చాడో వరం 
అదే  సరస్వతీ పుత్రా .. అన్న పిలుపు.. 
పోయిరమ్మన్నాడు..
దక్కిన మెప్పును హృదయమంతా మోస్తూ 
వెళ్ళాడు ఆనందంగా పుట్టపర్తి నారాయణాచార్యులు

సామాన్యులనుంచీ ఎంతటి మహాత్ములకీ 
జీవితంలో నిరాశ భంగపాటు ఎదురైనప్పుడు
తీవ్రమైన మనస్తాపానికి గురి కావడం సహజమే..
 

ఆ నిరాశలో కొట్టుకుంటున్నప్పుడు..
అతన్ని తిరిగి లేపేవి..
 సాంగత్యం
చదువుకున్న పుస్తకాలూ
నమ్మిన గురువులు..
పెరిగిన వాతావరణం..



మహాత్ముల పరిచయం ఎలా వుతుంది..??
ఉన్నతమైన మార్గంలో పయనించే వారి జాడను వెతుక్కుంటూ వారే వస్తారా..??
తగిన దిశా నిర్దేశం చేసి
ఆత్మ స్థైర్యం మనో బలం గుండెల్లో నింపి..
తిరిగి వాళ్ళు గమ్యంవైపు నడిచేలా చేసి వెళతారా..??

21 జూన్, 2014

మాతృశ్రీ జిళ్ళెళ్ళమూడి అమ్మతో సరస్వతీపుత్ర..

జిళ్ళెళ్ళమూడి అమ్మ ఒడిని చేరిన ఎందరో పెద్దవాళ్ళలో పుట్టపర్తి ఒకరు
ఆమె అందరికీ అమ్మే..
అమ్మను దర్శించిన క్షణాలను నేను నా బ్లాగ్ లో కొంతవరకూ వివరించాను
ఇప్పుడు రామమోహన రాయ్ గారు
తిరిగి ఒక దిన పత్రిక ద్వారా వెలువరించటం ఆనందాన్ని కలిగించింది
ఆక్షణాలను పంచుకున్న అదృష్టవంతులలో నేనూ ఒకదాన్నికావడం .. అమ్మ చేతి గొరుముద్దలు నేనూ తినడం నా పూర్వజన్మ సుకృతమే.. 


ఈ పేపర్ కటింగ్స్ అందించిన శ్రీ శైలం గారికి కృతజ్ఞతలు

సాహితీ సహృదయ శిఖామణి పిట్ దొరసానమ్మ


పుట్టపర్తికి ఆంగ్ల హృదయాలను పరిచయం చేసిన పిట్ దొరసాని గురించిన వివరాలివి..
ఇందులో పుట్టపర్తి ప్రస్థావన లేదుగాని
పుట్టపర్తిని తల్లిలా ఒడిచేర్చుకున్న పిట్ వ్యక్తిత్వం.. అర్థమవుతుంది.. ఈ పేపర్ కటింగ్ శ్రీ శైలం గారు నాకు అంద జేసారు .. వారికి కృతజ్ఞ తలు 




14 జూన్, 2014

అన్నమయ్యలోని విశిష్టాద్వైతం





అన్నమయ్య..
అన్నమాచార్యులు..
అన్నమయ్యంగార్..
ఇవీ ఆయన జీవితంలో మూడుదశలు..
ఆయన తరుచూ శాసనాల్లో 

అన్నమయ్య గానే కనబడతాడు
అన్నమయ్యంగార్ అని కూడా వొక్కొక్కచోట ప్రత్యక్షమవుతాడు
 

సాధారణంగా వైష్ణవులలో 
ఆచార్యులు అనే పరస్పరం పిలుచుకుంటారు
కొందరు రాను రాను నామాల సైజు ఎక్కువ చేస్తారు
దానితో కడుపు కూడా సహకరిస్తుంది
అప్పటినుంచీ అయ్యంగార్ అవుతారు
 

మరి అన్నమయ్యలో 
ఈ మానసిక పరిణామాలు నేను ఊహించలేను
కానీ
వాళ్ళూ వీళ్ళూ అయ్యంగార్ పేరు తగిలించుకుంటారు
ఆయన మొదలు నందవరీకుడు
తర్వాత విశిష్టాద్వైతం పుచ్చుకున్నాడు
శంఖచక్ర లాంఛనాలూ జరిగినాయి
 

ఆకాలంలో చాలామంది నందవరీకులు వైష్ణవులైనవారు వున్నారు
వారిలో ఎంతమందికి విశిష్టాద్వైతం అరిగిందో చెప్పలేము..
అన్నమయ్యలో మాత్రం
అది కుసుమితమై ఫలితమైంది..
 

చిన్ననాటినుంచే వేంకటేశ్వరునిపైన పదాలు పాడటానికి ఆరంభించినాడు
బాహ్య వైష్ణవానికన్నా
ఆంతరికమైన సంస్కారం 

ఆతనిలో బహుముఖాలుగా విజృంభించింది..
 

'నాలుగు మాటలు' పీఠిక నుంచీ, 28-6-86

12 జూన్, 2014

మా పెనుగొండ



పుట్టపర్తి నారాయణాచార్యులు ప్రసిధ్ధుడు
రాయలసీమ మట్టిని పెకలించుకుని పైకెదిగి 

వటవృక్షమై నిలచినవాడు
విజయనగర సామ్రాజ్జం పరిపాలన శాసనాలు 

తదితర ఎన్నో విషయాలు సాధికారంగా చెప్పగలవాడు
పధ్నాలుగు భాషలలో ఉద్దండుడు
నాట్య సంగీత సాహిత్యాల పారమెరిగినవాడు
ఆయనకు తను పుట్టిపెరిగిన  పెనుగొండ పై వల్లమాలిన మమత

ఆపెనుగొండపై 

పన్నెండేళ్ళ వయసులోనే కావ్యం వ్రాసి 
దానిపై తానే విద్యార్థియై పరీక్ష రాసి 
చరిత్ర సృష్టించిన వాడు

మరి ఆ పెనుగొండపై పుట్టపర్తి యేం చెబుతారు...
అందులో తన చిన్ననాటి స్మృతులను .. 

గత జన్మ స్మృతులలా .. 
ఎంతో జ్ఞాపకంగా ..
 

మొన్న మనం సినిమా చూస్తే..అదే అనిపించింది..
గత జన్మ స్మృతులు  

నిన్నా మొన్నటి విషయాల్లా 
గుర్తు రావటం ఒక వింత అని యెవరో అన్నారు..
 

ఒక జన్మే ఎందుకు గుర్తు రావాలి 
పది జన్మల బంధాలు గుర్తుకు రాకూడదా 
అని మరొకరి ప్రశ్న..

చంద్రబాబు విషయమే తీసుకోండి
ఒకసారి రాష్ట్రాన్ని అభివృధ్ధి చేశాడు.
ఎవరో తన్నుకు పోయారు..
మళ్ళీ రోడ్డున నిలబడిన రాష్ట్రాన్ని 

తన చాణక్య బుధ్ధితో నిర్మించాలి..
 

తర్వాతైనా జనాలు తనను గుర్తుపెట్టుకుంటారో లేదో అనుమానమే..
 

తెలుగు నేలతో ఉన్న బలీయమైన పూర్వకర్మే..  చంద్రబాబుతో అలా చేయిస్తున్నదట..
 

దొరికినంత దోచుకుందాం
రాష్ట్రమేమైపోతే మనకేం మనం బాగుంటే చాలు
మనపిల్లలు వారి పిల్లలూ..
సుఖంగా వుండాలి అనే రక్తం బాబులో లేదులా వుంది ..

ఈ నేలతో బలీయ బంధం ఉన్న ప్రాచీన జీవులు
దానిని తీర్చుకోడానికి 

తిరిగి తిరిగి ఇక్కడే జన్మ ఎత్తడమూ
ఆ కర్మ బంధంలోనే కొట్టుమిట్టాడటమూ 

అతీత జ్ఞానం..
 

కానీ మనం ..?
 కళ్ళెదుట కనిపించేది..
మన బుధ్ధికి అర్థమయ్యేదే  నమ్ముతాం..
కానిదంతా మోసం..
అజ్ఞానం కదూ..
 

అక్కడ వు న్న పలకల బావి నీరు
నీరు బంగా రు తిమ్మరాజు తాగాడట..
 

మా చిన్నతనంలో బుడ బుడక్కల వాళ్ళని వచ్చేవాళ్ళు 
పాపం అడుక్కుం టూ ..
భుజాన చిన్న తంబూర లాంటి దాని ధరించి 
తలపాగా పెద్ద జరీ జుబ్బా వేషంతో వస్తే..
 

మా అయ్య వారిని ఇంట్లోకి పిలిచి..
వారు చెప్పే కథలను ఏకాగ్రతతో విని 

చాలా సంతోషపడి
వాళ్ళకు పాతబట్టలు..
ఇంత అన్నం .. చేతికి కొంచెం డబ్బు 

ఇచ్చి పంపడం మాకు అనుభవం
 

రాయల గురించి చెప్పే ఎవరైనా
ఆయన్ను వలలో వేసుకున్న రంగసాని గురించి చెబుతారా..
ఆ రంగసానిదీ పెనుగొండేనట
దాని అన్న సవరం నారప్ప


హైస్కూల్ దగ్గర ఉన్న షేర్ ఖాన్ మసీదు
అందులోని స్థంభాల నైపుణ్యం పుట్టపర్తి వర్ణిస్తారూ..
 

ఒకదానిలో ఒక స్థంభమట..
ఆ స్థంభానికి ఒక కిటికీ అట..
ఆ కిటికీలో చేయిపెట్టి ఆ స్థంభాన్ని తిప్పవచ్చట..
ఇలాటివెన్నో మనం తెలుసుకుంటాం 

ఈ మా పెనుగొండ లో
మరి చదవండీ..












9 జూన్, 2014

గతించినది 'గ' చింతనం


చాలామంది 
ప్రముఖులను ఇంటర్వ్యూలు చేస్తుంటారు
మా అయ్య వైతే 

ప్రతి దిన వార పత్రికలలో చూసి చూసి 
మాకు కొత్తగా అనిపించేవి కావు
 

కానీ ఇది
అప్పటి రేడియో స్టేషన్ డైరెక్టర్ గా పని చేసిన 

అనంత పద్మనాభరావు గారుచేసినది
 అదీ మా అమ్మను
 

1975లో కేంద్ర సాహిత్య అకాడమీ 
మా అమ్మను ఉత్తమ రచయిత్రిగా సత్కరించింది  
 అది మా అమ్మ ఊహించనిది
మేమూ కూడా
 

మా అమ్మలో సంతోషమూ లేదూ 
విచారమూ లేదు


అందరూ 

మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికొచ్చామండీ
అంటే 

ఉత్సాహం చూపించి వీలైనంత సహకరిస్తారేమో
 

కానీ మా అమ్మ
అక్కడినుంచీ మెల్లగా తప్పుకొనే ప్రయత్నం చేసింది..


ఆనాటి సదస్సుకు వచ్చిన స్త్రీలలోకెల్లా 

కట్టూ బొట్టులలో సదాచార కుటుంబం నుంచీ పసుపుకాళ్ళతో
నవీన లోకానికంలోకి అడుగుపెట్టిన స్త్రీలా
కొంగుకప్పుకుని 

తొమ్మిది గజాల చీర మడిచార పోసి కట్టుకుని..
నుదుటన కుంకుమ దిద్దుకుని..
జారుముడి తో 

సభలో అందరూ నమస్కరించాలనుకొనే విధంగా..
 

అందుకే
ఆనాటి విలేక రి జి కృష్ణ
ఆనాటి సదస్సుకు వచ్చిన స్త్రీలలోకల్లా

కట్టు బొట్టు మాటా తీరుతెన్నులలో 
పురాతన సీమలనుంచీ 
నవీన లోకానికి వచ్చినట్లు కనపడ్డారు..
అని వ్యాఖ్యానించారు
 

నిజమే..
అమ్మ ఎక్కువగా తెల్ల జాకెట్లనే కుట్టించే
ది..
 ఎందుకంటే 
తెల్లవైతే అన్నిటికీ నప్పుతాయి అనేది..


కాదు కాదు.. 
తనే సూదీ దారం తో కుట్టేది 
ఆ కుట్టు ఎంత గట్టిగా ఉండేదంటే  
మిషన్ కుట్టంత .. 
మిషన్ లానే దగ్గర దగ్గరగా.. 

నాకు పావడాలు  జాకెట్లు అన్నీ అలానే కుట్టేది అమ్మ.. 
 
ఫోటో గ్రాఫర్లు అమ్మను ఫోటో తీయడానికి చుట్టుముడితే..
 బెజవాడ గోపాలరెడ్డిగారు 

నవ్య నవనీత సమానులు కాబట్టి
భర్తతో కలిపితీయండి
అని పురమాయించారట..
అంతే ఇరువురు కలసిన వ్యక్తిత్వం అన్నారు జి. కృష్ణ..



ఇంకో విషయం 
అందరిళ్ళలో నలుగురూ కలిసినపుడు
 కుటుంబ విషయాలు
వాళ్ళనీ వీళ్ళనీ అనుకరించటాలూ
లేకపోతే సాధించటాలూ..
కక్ష.. పగ సాధిపులూ స్వార్థం సంకుచితత్వం
ఇవే రక రకాలుగా దర్శనమిస్తుంటాయి
 

కానీ అమ్మా అయ్యల సంగమంలో 
సంగీత సాహిత్యాలు లేదా దైవిక విషయాలూ..
ఇప్పుడు చదువుతుంటే 

గతించినది 'గ' చింతనం అనిపిస్తుంది

                   విదుషీమణి కనకమ్మ గారు 
            డా . రేవూరి అనంత పద్మనాభ రావు


ఒకనాటి సాయంకాలం పుట్టపర్తి నారాయణాచార్యుల వారిని కలిసి మాట్లాడుదామని వెళ్ళాను వారింటికి..
 

భార్యాభర్తలిద్దరూ యేదో చర్చలో వున్నట్లుంది..
మధ్యంతరంగా ఆగిపోయింది వారి సంభాషణ..
 

యేమిటో చర్చిస్తున్నట్లున్నారు..  అన్నాను.
ఏమీలేదు..
అంటూ కనకమ్మగారు లోపలికి వెళ్ళబోయారు..
 

మిమ్మల్ని సాహిత్య సంబంధమైన 
కొన్ని ప్రశ్నలు వేయాలని వచ్చాను అన్నాను వారితో
 

మా అయ్యగారు రామాయణానికి ఆళ్వార్లు చేసిన వ్యాఖ్యానాన్ని గురించి చెబుతుంటే..
వింటున్నాను..
వారికి ప్రౌఢ రచనలంటే ప్రీతి
నాకు లాలిత్యమంటే మమత..
 

ఒకరీతిగా చూస్తే..
సాహిత్యపరంగా మేమిద్దరూ భినధృవాలం.. 

నేను వాల్మీకిని తరచూ మననం చేసుకుంటూంటే
 

ఆ శ్లోకంలో యేమున్నదని గొణుగుకుంటున్నావు..
అని వ్యాఖ్యానించేవారు.
అన్నారు కనకమ్మగారు..
 

అయితే మీకు కవితా గురువులు 
నారాయణాచార్యుల వారే అన్నమాట..
అన్నాను..
 

మా అయ్యగారి రచనలను ఎత్తివ్రాయడంలోనే 
నాకు కవితా వాసన అబ్బిం దని చెప్పాలి..
 

ఛందస్సు మొదలైన విషయాల్లో నేను అప్పకవీయం మొదలైన గ్రంధాలు చదివి తెలుసుకున్నాను..
నాకు వ్రాయాలనే ఆసకతి చాలా తక్కువ..
ఇతరులు వ్రాసినవి చదివి ఆనందిస్తే పోదా..?
అనే తత్త్వం నాది..
 

ప్రాచీనులు వ్రాసిన గ్రంధాలను అవగాహనం చేసుకొని ఆనందం పొందవచ్చని నా భావన
నాకు కీర్తి దాహం తక్కువ మహిళా సమాజాల పేరిట తిరిగే వాళ్ళను చూస్తే.. నాకు ఇష్టం వుండదు..
అంటూ ఇంకా యేదో చెప్పబోయారు..
 

ఒక్కమాట మీరు ప్రాచీనులన్నారు కదా.. బరి ప్రాచీన కవుల్లో మీకు నచ్చిన కవి యెవరు..
నాకు వాల్మీకి రామాయణం అంటే ప్రాణం 

మాటి మాటికీ వాల్మీకి శ్లోకాలు 
మననం చేసుకుంటూ ఉంటాను కూడా
 

కాళిదాసాది కవుల కవిత కూడా నాకు అంత 
ఆనందాన్ని కలిగించలేదు..
 

మావారు అనేక కావ్యాలు చదివి వినిపిస్తూ వుంటారు వాటిలో స్వారస్యం చెబుతూ వుంటారు
 

ఎన్ని చెప్పినా 
నాకు వాల్మీకి మీదికే మనసు వెళుతుంది
మావారు వ్యాసుని కవిత్వాన్ని నాకు పలుమార్లు చదివి వినిపించారు
 

ఆయన భాషలోనూ భావంలోనూ వాల్మీకి కంటే ప్రౌఢుడు అయినా నాకు వ్యాసుని వాసన అంటలేదు
 

ఇంతకు మీకు కవిత్వ వాసన ఎప్పుడు ఆరంభమైంది
 

అది మా పితృపైతామహంగా వస్తున్న వాసన 

మా పితామహులు గొప్ప తార్కికులు
ఆయన కాశి పండితులు
ఆయన నాకు అమరమూ శబ్దమంజరీ 

చిన్ననాడే నేర్పించారు 
కావ్య పాఠం కూడా చెప్పారు
 

పధ్నాలుగవయేట వివాహమైంది
అప్పటికి చెంపూ కావ్యాలు చదువుతున్నాను
చిన్న చిన్న శ్లోకాలు వ్రాసి 

మా తాతగారి చేత దిద్దించుకొనేదాన్ని
 

నాకు వివాహమవుతూనే ఆచార్యులవారు 
ప్రొద్దుటూరు పాఠశాలలో సంస్కృత పండితులుగా చేరారు 
అప్పుడు వారు చాలా మంది శిష్యులకు 
ఇంటి దగ్గర పాఠాలు చెపుతూ వుండేవారు
 

ఆయనకు కోపం ఎక్కువ 
ఒకసారి చెప్పిన విషయం మళ్ళీ ఇంకోమారు అడిగితే దూర్వాసులౌతారు
అందువలన శిష్యులకు నేనే చెబుతూ వుండేదాన్ని..
 

సాహిత్యం పైన మీకు అధికారం కలగడానికి 
ఇంకా ఏవైనా కారణాలున్నాయా..
 

కొంతకాలం మావారు నాకు సంగీతం కూడా నేర్పారు
సాహిత్య పరిశ్రమ ఎక్కువ అయిన కొద్దీ 

మా ఇద్దరికీ సంగీతం పైన ఆసక్తి తగ్గిపోయింది
మావారు వ్యాసాదులు డిక్టేట్ చేస్తూ వుండేవారు
మధ్యలో ప్రశ్నిస్తే వల్లమాలిన కోపం
 

ఏదైనా పదమో వాక్యమో అందుకోకపోతే వదిలేసేదాన్ని. వారు సరిచూసేటప్పుడు దాన్ని పూరించేవారు.
ఆయన వ్యాసాలన్నిటికీ లేఖకురాలిని నేనే..
అందువలన నాది శృత పాండిత్యం
ఆయనకు తోచినప్పుడు గంటల తరబడి 

అనేక విషయాలు చెబుతుంటారు
భోజన సమయం కూడా దాటిపోయేది
 

సంగీత సాహిత్యాలంటే మా ఇంటిల్లిపాదికీ చాపల్యం ఉందంటే గొప్పలు చెప్పుకోవటం కాదు..

మీ రచనా వ్యాసంగం గురించి కొంచెం చెబుతారా..
 

ప్రత్యేకంగా ఏదైనా మహాకావ్యం వ్రాయాలనే పిచ్చి 
నాకు లేదండీ 
కొన్ని కొన్ని పాత్రలమీద 
నాకు ప్రత్యేకమైన సానుభూతి వుంది 
ఊర్మిళ యశోధర కైకేయి సీత
ఇలాంటి పాత్రలు వీళ్ళను కథానాయికలుగా వ్రాద్దామనే అభిలాష మాత్రం ఉంది.
 

మా అందరినీ నిశ్చింతగా వుంచాలన్నదే నా తాపత్రయం.
ఆయన రచనలలో అప్రత్యక్షంగా నేను ఉన్నానులే అనిపిస్తుంది
సాంసారికమైన చింతనలు ఆయన చెవిదాకా రానీయకుండా చూసుకోవ డం నా ప్రధాన ధ్యేయం.
 

ఈమధ్య తారకనామ ముద్రతో 
స్త్రీలకు పనికివచ్చే పాటలు వ్రాసాను
స్స్వాంతస్సుఖాయ వ్రాసుకొన్నాను
అవి ప్రచురణ కావాలనే తహ తహ నాకు లేదు
 

నా రచనలు కావ్యద్వయి అని మేమిద్దరం కలిసి చాలానాళ్ళ క్రితం ప్రచురించాము
అప్పటినుంచీ ఇప్పటివరకూ రచనలే చేయలేదా అంటే చేస్తుంటాను
కానీ వ్రాసినదంతా బయటికి రావాలనే చాపల్యం లేదు
మా అయ్యగారికి చూపిస్తే వారు బాగున్నాయంటుంటారు
అంతటితో సరి..
 

రాజశేఖరుడనే సంస్కృత ఆలంకారికునికి 
అవంతీసుందరి అనే భార్య ఉండేది
రాజశేఖరుడు అవంతీసుందరిని సాహిత్యంలో ఉల్లేఖించేవాడు అప్పుడప్పుడూ
ఆమె రచనలేవీ మనకులభ్యం కావు కానీ ఆమె ఆలంకారికురాలై వుంటుంది
నేను కూడా అలానే గూఢంగా వుండాలని వాంఛిస్తున్నాను..

రెండేళ్ళ క్రితం ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కనకమ్మగారిని సత్కరించింది
ఆ సన్మాన సభలో వారు ప్రసంగించినతీరు  

సాహిత్యవేత్తల మెప్పు పొందింది
ఆచార్యుల వారి సహ ధర్మ చారిణిగా కాక 

స్వయం ప్రతిభ గల ప్రజ్ఞానిధి కనకమ్మ గారు..

7 జూన్, 2014

మహా భారత విమర్శనము

  


మహా భారతము
పంచమ వేదము గా పరిగణించబడే భారత ఇతిహాసము. 

 ఈ మహాకావ్యాన్ని వేదవ్యాసుడు చెప్పగా
 గణపతి రచించాడు. 
18 పర్వములతో, లక్ష శ్లోకములతో 
(74,000 పద్యములతో 
లేక సుమారు 18 లక్షల పదములతో)
 ప్రపంచము లోని అతి పెద్ద పద్య కావ్యములలో 
ఒకటిగా అలరారుచున్నది. 

సంస్కృతములో ఉన్న ఈ మహా కావ్యాన్ని, 
కవిత్రయము గా పేరు పొందిన 
నన్నయ, తిక్కన, ఎర్రన (ఎఱ్ఱాప్రగడ)లు 
తెలుగు లోకి అనువదించారు

 దీనిని ధర్మ తత్త్వజ్ఞులు ధర్మశాస్త్రమనీ, 
ఆధ్యాత్మవిదులు వేదాంతమనీ, 
నీతి విచక్షణులు నీతి శాస్త్రమనీ, 
కవులు మహాకావ్యమనీ అంటారు. 
లాక్షణికులు సర్వ లక్షణ సంగ్రహమనీ, 
ఐతిహాసికులు ఇతిహాసమనీ, 
పౌరాణికులు బహుపురాణ సముచ్ఛయమనీ కొనియాడుతారు

 ఇటువంటి మహా భారతానికి 
ఒక విమర్శనాన్ని పుట్టపర్తి వ్రాసారు
అందుకు ఆయన పలు భారతాలను స్పృశించారు
 

కొన్ని విషయాలు వారిని విస్మయపరిచాయి
కొన్ని ప్రతులలో కొన్ని శ్లోకాలు చూస్తే
మరికొన్ని ప్రతులలో మరిన్ని కొత్త శ్లోకాలు దర్శనమిచ్చాయి
 
అందువలన తన దగ్గరున్న ప్రతులను బట్టే వారు విమర్శనను కొనసాగించారు
''అన్ని ప్రతులను తెప్పించుకుని పరీక్షించు 
ఆర్థిక స్థొమత నాకు లేదు..
ఆయువు కూడా లేదు..'' 
అని అన్నారు వారు
 
''నాకే కాదు అన్ని ప్రతులనూ పరీక్షించడం 
మరెవరికీ సాధ్యం కాకపోవచ్చును ..
యేదో నా శక్తి కొలది ఉపాసించినాను ..
క్షమింపుడు ..''
అంటారు వినమ్రంగా పుట్టపర్తి

కొన్ని ప్రతులలో ద్రౌపతీ వస్త్రాపహరణ ఘట్టమే లేదట
''యీ నా విమర్శనములు 
సర్వసమ్మతములుగా వుండవలెనను 
పేరాశనాకులేదు..
 

 ఇందులో 
నా రాగ ద్వేషములు ప్రతిఫలించివుండవచ్చును
కొన్నింటిలో 
నా దృష్టి సంకుచితమీపోయి వుండవచ్చును
పాఠకులు నాయీ దౌర్భల్యములను 
సహృదయతతో క్షమింపవలె''నన్నారు
 
''శ్రీ ఆచార్యులవారు 
సంస్కృతం ఇంగ్లీష్ ఇతర భారతీయ భాషల లో వచ్చిన మహాభారత వ్యాఖ్యానాలు విమర్శలూ 
అన్నీ అవలోకనం చేసి 
యీ గ్రంధాన్ని రచించినట్లు తెలుస్తున్నది..
 
మహాభారత కాలం నాటి 
రాజకీయ సాంఘీక మత నైతిక పరిస్తితులను ప్రతిభావంతంగా యీ గ్రంధంలో సమీక్షించారు ఆచార్యులవారు
 
హిందూ ధర్మ ఉత్కృ ష్టతను తెలుసుకోదలచినవారు 
యీ గ్రంధాన్ని తప్పక చదవాలి ''
అన్నారు డాక్టర్ అక్కిరాజు రమాపతిరావ్ గారు








6 జూన్, 2014

చివరి కోరిక..

''అమ్మా మీ తోటలో నేను పనిచేస్తాను..
మీ చెట్లకు పాదులు పెడతాను ..
వాటికి నీళ్ళు మళ్ళిస్తాను..
నాకుయేమీ వద్దు..
ఇంత పప్పూ చారూ అన్నం చిన్న క్యారేజీలో పంపమ్మా..
హంపీ అంటే నాకు ప్రాణం..
అక్కడే ఊపిరి విడవాలన్న ఆశ..
ఆ మట్టిలో కలిసిపోవాలన్న తపన..''
ఇదీ పుట్టపర్తి చివరి కోరిక..
 

మా రెండవ అక్కయ్యతరులత ను అడిగారట..
 

మా అక్కయ్య
''యేమయ్యా.. నీకే తక్కువవుతుందా..
దానికి నువు పనిచేయాల్నా రాయ్యా ..''
అన్నా నని
కన్నీళ్ళతోతన  అనుభవాన్ని పంచుకుంది..