ఒంటరి తనం గెలిచిందా.. ఓడిందా.. ??
మరి మన ఋషులు వానప్రస్థం అంటూ
ఏకాంతంలోకి వెళ్ళిపోయేవారు కదా..
మిగిలిన ఒంటరితనాన్ని
ఆత్మ చింతనలో
తనను తాను వెతుక్కోవటంలో గడిపేవారు.
చూశారా మన హిందూత్వం గొప్పదనం..
ఇలాంటి ఒక క్షణం రాజు కైనా పేదకైనా
తప్పక సంభవిస్తుంది.
ఇలాంటి మార్గమే తెలియని పాశ్చాత్యులు
అంతులేని భోగలాలసత లో మునిగి తేలి చివరికి ఆధ్యాత్మికత కోసం
ప్రశాంతమైన ఆ స్థితి కోసం భారత దేశపు సాధువుల పాదాలపై వాలుతున్నారు.
ఏ ఒక్క బంధమూ శాశ్వతం కాదు..
జీవితంలోని ఒక స్థితి మాత్రమే..
అది దాటుకుని మహా మహా రాజులు సైతం
తమ రాజ్యాన్ని వైభవాన్ని తృటిలో త్యజించి
ఏ వసతులూలేని ఏకాంత వాసానికి తరలి వెళ్ళే వారు.
ఋషులు .. దార్శనికులు..
ఇందుకు తగ్గ మార్గ నిర్దేశనం ముందుగానే చేశారు.
ఆ మార్గాన్ని అర్థం చేసుకొని అమలు పరచటమే
మనం చేయవలసింది.
బ్రహ్మచర్యం.. గా ర్హస్థ్యం.. వానప్రస్థం.. సన్యాసం..
ఈ నాలుగింటిని శిఖరాగ్రం చేరుకోడానికి
మేడమెట్లలా ఉపయోగించుకోవాలి..
నేనెవరు అన్న అలోచన విరాట్ స్వరూపం ధరించేది అప్పుడే..
ఏ కుటుంబ బంధమూ శాశ్వతం కాదు.
వారి వారి సంసారాలు పెరిగినకొద్దీ
మనకు ప్రాముఖ్యం తగ్గిపోతుంది.
దాన్ని పాజిటివ్ గా స్వీకరించి
అడిగి నప్పుడు మాత్రమే సలహాలు ఇస్తూ
సాగిపోవాలి ..
సినీ నటుడు రంగనాధ్ ఆత్మహత్య చేసుకున్నారు
ఉరి వేసుకుని
పిల్లల జీవితాలు ఎవరివి వారివయ్యాయి
భార్య వెళ్ళిపోయింది
సంపాదించిన డబ్బు ఆమె రోగం బారిన పడి కర్పూరమైపోయింది
మిగిలినవి గతం దాని తాలుకు జ్ఞాపకాలు
అయినా రంగనాధ్ ఎంతో గొప్పవాడు
అందమైన ఆడపిల్లలు ఎంతో సన్నిహితంగా మెలిగే వాతావరణంలో కూడా
తనను తాను కోల్పోకుండా మిగిలాడు
ధనం తెచ్చే చెత్త అలవాట్ల వలలో జారి పడిపోకుండా తనను తాను రక్షించుకున్నాడు
మంచంలోపడిన తోడును
అసహ్యించుకోకుండా .. వదిలేయకుండా..
ఎన్నో సంవత్సరాలు ఆమె బ్రతకటం కోసం తపించాడు
అయన ఆలోచనలు ఎంతో గట్టివి
అతను రాసిన కవిత చూడండి
ఎవరు దేవుడు
ఎవరు బండ
అదేదో ఊరినుంచీ మహాశక్తి వచ్చాడు
మరేదో ఊరినుండీపెద్ద బండ తెచ్చాడు
ఆరడుగులు కొలత బెట్టి బండను ఖండించాడు
మిగిలిన మూడడుగుల ముక్కను పక్కకు తోసేశాడు
ఆరడుగుల బండేమో విగ్రహమై వెలిసింది
మూడడుగుల బండ ముక్క చాకి రేవు చేరింది..
కంపు కంపు మనసులన్ని దేవుని ఎదుట నిలిచాయి
కంపు గొట్టే బట్టలన్నీ బండ చుట్టూ చేరాయి
గోతెమ్మ కోర్కెల గొంతులన్నీ తీర్థంతో తడిశాయి
మురికి మరకల బట్టలన్నీ నీళ్ళల్లో మునిగాయి
అర్థం గాని స్తోత్రాలతో పూజారి భక్తి శ్రధ్ధలు
చాకలి నోటి వెంట ఇస్సు ఇస్సు శబ్దాలు
శఠగోపం పవిత్రంగా ప్రతి తలను తాకుతోంది
పవిత్రతకై ప్రతిబట్టా బండను బాదుతోంది
కడకు, గుడినుండి మనసులన్నె కంపుతోనె వెళ్ళాయి
రేవునుండి బట్టలన్ని ఇంపుగా వెళ్ళాయి
గుడిలోని దేవుడా
రేవులోని బండా..
బండ దేవుడా కాదా అన్నది
మన పరిపక్వతపై ఆధారపడివుంటుంది..
బండ లో దైవాన్ని చూస్తూ
గురి నిలపడం కోసమే
బండ దైవమయ్యింది
అక్కడితో మన ఆధ్యాత్మికత ఆగిపోలేదు..
ప్రతి ఒక్కరిలోను దైవాన్ని చూడమని చెప్పింది
భగవంతుడిచ్చిన జీవితాన్ని చివరివరకు
సార్థకంగా జీవించమని చెప్పింది..
బండపై తమ మురికిని వదిలించుకోవడానికి
బట్టలు తలలు బాదుకున్నట్టు
మనసులోని మురికిని వదిల గొట్టుకోడానికి
గుడిలోని బండ ఎదుట సాష్టాంగ పడటమే దాని అర్థం
రామకృష్ణుల వంటి వారు
రోజూ పొద్దుటే లేచి నా జీవితంలో ఒక రోజు వృధా అయిపోయింది
అమ్మ దర్శనం కాలేదు అని తలలు బాదుకుని ఏడ్చారు..
ఒకసారి ఏదో షూటింగ్ లో రంగనాధ్ గారిని చూశాను
మా ఊరివాడైన మల్లికార్జున్ పరిచయం చేశాడు..
ఆయనను నేనెంత ఆశ్చర్యంగా చూశానో
ఆయనా నన్నంత ఆశ్చర్యంగా చూశారు..
ఇంత మంచి మనసున్న రంగనాధ్
ఎవరో ఒక గురువును ఎంచుకుని ఆ మార్గంలో అడుగులేసి వుంటే బాగుండేదేమో..