భగవంతుని కోసం రాజ్యాన్నీ,
కుటుంబాన్నీ త్యజించే మీరా లాంటి భక్తులూ, భక్త్యావేశంలోకొడుకును నలగదొక్కే భక్తులూ
ఈనాటి సమాజంలో ఉండటంఅసాధ్యం”
అనేవారు వారి మిత్రులు.
“భక్తిని గురించి రామానుజుడు ఏమన్నాడో తెలుసునా?”
అని ప్రశ్నించేవారు పుట్టపర్తివారు.
“భక్తి నిరంతర ప్రేమ ప్రవాహమన్నాడు.
అంతేకాదు,
భగవంతుణ్ణిబుద్ధితో కాకుండా
హృదయంతో చూడడమే భక్తి.
అన్నం లేకుండా బతకగలను.
కానీ భగవంతుడు లేకుండా బతకలేను”
అనేవారు.
వారి హృదయాన్నిఅర్థం చేసుకోవటానికి
’పాద్యము’ చదవటం అవసరమని
నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను.
ఈ శతాబ్దానికి చెందిన
ఇతర సంప్రదాయ కవులతో పోల్చి చూచినప్పుడు,
పుట్టపర్తి వారి ప్రత్యేకత ఈ సంఘర్షణే.
ఇతర సంప్రదాయ కవులు
(నవ్య సంప్రదాయ కవులు – అన్నమాట నాకు అసహ్యం)
నిశ్చల నిశ్చితాలతో ప్రారంభించారు.
వాటిలోనే కొనసాగారు.
పుట్టపర్తివారునిశ్చల నిశ్చితాలను నమ్మలేదు.
అందుచేతనే
ఇతర సంప్రదాయకవుల్లో లేని అన్వేషణ
వారిలో కనిపిస్తుంది.
మనంతకు మనంఅన్వేషించుకుంటూ
గమ్యం చేరుకోవటానికి,
ఇతరులు నడిపిస్తే
నడిచి చేరుకోవటానికీ తేడా ఉందని
పుట్టపర్తి వారి కవిత్వం,
వచన రచనలూ చదివితే తప్ప అర్థం కాదు.
వారు మారటానికి చేసిన ప్రయత్నాలకు గుర్తుగా
రెండుసంఘటనలు చెబుతాను.
1985 లో నెహ్రూ కేరళలో
నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని అకారణంగా
కూలదోసిన రోజు
వారు మదనపల్లెలో ఉన్నారుట.
ఆ ఊళ్ళో ఉన్న
కాంగ్రెసేతరఅభ్యుదయ శక్తులంతా కలిసి
నిరసన సభ ఏర్పాటు చేస్తే
అందులోవారు ఉపన్యసించారట.
ఆ ఉపన్యాసాన్ని గురించి ఇప్పటికీ
ఈ ఊరి పెద్దలు చెప్పుకుంటూ ఉంటారు.
ఉపన్యాసంలోఅంత ఆగ్రహాన్ని
తామేనాడూ చూడలేదని వాళ్ళంటారు.
వారుకేరళ నుంచి తిరిగి వచ్చి
అప్పటికి చాలా కాలం కాలేదు.
వారు కేరళలో ఉండగా
చాలామంది వామపక్ష మేధావులతో,
రచయితలతో వారికి దగ్గర సంబంధాలుండేవి.
సంవత్సరం జ్ఞాపకం లేదు కానీ,
నంద్యాలలో జరిగిన రైతుమహాసభలో కూడా
వారు ఉపన్యసించారు.
ఆ ఉపన్యాసాన్నివిన్నవారు కూడా ముగ్ధులైపోయారు. దురదృష్టవశాత్తు
ఈ రెండు ఉపన్యాసాలను గురించీ
పెద్దలు చెప్పగా వినటమేకానీ,
నేరుగా వినే అదృష్టం నాకు లేకుండా పోయింది.
చెప్పవచ్చేదేమిటంటే
పుట్టపర్తి వారు తన్ను తాను మార్చుకోవటానికి
శక్తివంచన లేకుండా ప్రయత్నించారు.
కానీ మారలేకపోయారు.
“ఇందులో వారు సాధించిందేమిటి? చివరకు రామాయణం వద్దకే
వచ్చారు కదా?” అని కొందరు ప్రశ్నిస్తుంటారు. అది వారి రామాయణాన్ని
చదవకుండా అనే మాట. వారు తాను రామాయణాన్ని భక్తి కోసం
రాశానని అన్నా, వారు దాన్ని కవిత్వం కోసం రాశారని నా నమ్మకం.
తెలుగులో ఉన్న ఇతర రామాయణాలకూ, పుట్టపర్తి వారి
“జనప్రియ రామాయణం” కూ ఉన్న తేడా మౌలికంగా కవిత్వంలోనే
ఉందన్నది నా నిశ్చితమైన నమ్మకం. వాల్మీకికి దగ్గరగా ఉన్న
రామాయణం పుట్టపర్తి వారిది మాత్రమే!
పుట్టపర్తి వారితో కలిసి చాలా ప్రయాణాలు చేశాను. వారూ, నేనూ
కలిసి రమణాశ్రమం వెళ్ళాం. చలం గారిని చూశాం. ఆ కలయిక
ఇద్దరికీ నచ్చలేదని నా అనుమానం. “జనప్రియ రామాయణం”
లోని రామజనన ఘట్టాన్ని వారు చలం గారికి చదివి వినిపించారు.
“ఒక్క మాట కూడా నాకు అర్థం కాలేదు” అన్నారు చలం గారు.
“ఏం చేద్దాం ఎవడి స్థాయి వాడిది” అన్నారు పుట్టపర్తి వారు.
తిరుగు ప్రయాణంలో కూడా వారు దాన్ని గురించి మాట్లాడలేదు.
అందుచేత నేను అలాంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నాను.
నా మనసు మీద శాశ్వత ముద్ర వేసిన మరొక ప్రయాణాన్ని గురించి చెప్పి,
నా అనుభూతులను కొన్ని నా కోసం మిగుల్చుకుంటాను.
ఒకసారి ఇద్దరం కలిసి తిరుత్తణి వెళ్ళాం. తిరుత్తణి తమిళ ప్రాంతమే
అయినా తెలుగు సాహిత్యాభిరుచి బాగా ఉన్న పట్టణం. ఆ ఊళ్ళో
బూదూరు రామానుజులురెడ్డి గారని ఒకరు ఉండేవారు. వారిని
మేమంతా ’సరిహద్దు సిపాయి’ అని పిలిచేవాళ్ళం. వారు
ఉపాధ్యాయుడు, తెలుగువారి హక్కుల కోసం నిరంతరం పోరాడే
ఉద్యమకారుడు, కవి. ఆహ్వానం వారిదే. వారు సభను గొప్పగా
ఏర్పాటు చేశారు. చాలా పెద్ద హాలు. శ్రోతలతో కిటకిటలాడిపోతోంది.
స్వాగతోపన్యాసాలూ, ఆహ్వానాలూ అయ్యాక పుట్టపర్తి వారు లేచి నిలబడ్డారు.
“మీరు ఫలానా విషయాన్ని గురించి మాట్లాడమని చెప్పలేదు.
నేనూ అనుకొని రాలేదు. ఏం మాట్లాడమంటారు?” అన్నారు.
మొదటి వరసలో కూచున్న సుందరవదనులు నాయుడు గారు
లేచి నిలబడ్డారు. వారు ఆజానుబాహువు. భారీ విగ్రహం కూడా.
మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ అధ్యక్షులుగా పని చేసి, రాజకీయాల
నుంచి విరమించి, తిరుత్తణి సమీపంలోని స్వగ్రామంలో విశ్రాంతి జీవితాన్ని
గడుపుతున్నారు. తెలుగు, ఇంగ్లీషు, తమిళం బాగా చదువుకున్నవారు.
“అయ్యగారూ, మీకు చాలా భాషలు వచ్చు కదా. వాటిలో చాలా భాషల్ని
మేము ఎన్నడూ వినలేదు. మీ ఉపన్యాసాలు చాలా విన్నాం.
ఈ రోజు మీరు ఒక కొత్త రకమైన ఉపన్యాసం చెప్పాలని ప్రార్థిస్తున్నాను.
మీకొచ్చిన ఒక్కొక్క భాష నుంచీ ఒక పద్యాన్ని చెప్పి అందులోని
సౌందర్యాన్ని వివరించండి.” అన్నారు.
పుట్టపర్తి వారు ఒక నిముషం ఆలోచించి -
“అట్లనే కానీ అప్పా”, అని ప్రారంభించారు.
మూడు గంటల కంటే ఎక్కువ కాలం కొనసాగిన ఆ ఉపన్యాసాన్ని
గురించి ఏం చెప్పినా, ఎంత చెప్పినా ’గగనం గగనాకారం’ గానే ఉంటుంది.
అదొక పాండిత్య విశ్వరూప ప్రదర్శన. కవిత్వ సంవేదనకు పరాకాష్ఠ.
ఆ ఉపన్యాసంలో సంస్కృతం, తెలుగు, తమిళం, కన్నడం,
మలయాళం, మరాఠీ, హిందీ, ఉర్దూ, ప్రాకృతం, పైశాచీ, ఇంగ్లీషు,
రష్యన్ భాషలు వారి నాలుక మీద నాట్యం చేశాయి. సరస్వతీదేవిని ’
రసనాగ్ర నర్తకీ’ అని ఎందుకంటారో ఆ రోజు అర్థమైంది. భవభూతి,
కాళిదాసు, తిక్కన, కృష్ణదేవరాయలు, ఇలంగో అడిగళ్, కులశేఖర
ఆళ్వార్, పంప, బసవేశ్వరుడు, ఎజితుచ్చన్, వల్లత్తోల్, తులసీదాస్,
సూరదాస్, గాలిబ్, ఫిరాక్, పుష్పదంతుడు, షేక్స్పియర్, షెల్లీ, ఏట్స్
(ఇతణ్ణి పుట్టపర్తి వారు ఈట్స్ అని అంటుండేవారు), పుష్కిన్ వంటి
కవుల మనస్సుల్ని విప్పి చూపించారు. మూడు గంటల తరువాత
“మీకూ నాకూ ఓపికుంటే తెల్లవారే వరకూ చెప్పవచ్చు. కానీ
బాగా అలసిపోయినా – మీరు అనుమతిస్తే మానేస్తా” అన్నారు.
“ఇంకా కొన్ని భాషలు రాలేదు” అన్నారు
సుందరవదనులు నాయుడు గారు.
“ఇంకోసారి మీ ఊరు వచ్చినపుడు వస్తాయి” అని కూర్చున్నారు
పుట్టపర్తి వారు.
ఆ సభలో నన్ను అమితంగా ఆకర్షించింది వారు చదివిన ప్రాకృత
కవితల్లో ఒకటి. దాన్ని వారు చదువుతూ ఉంటే “శివతాండవం”ను
చదువుతూ ఉన్నట్టే అనిపించింది. “శివతాండవం” లోని ఛందస్సు
మీదా, లయ మీదా దాని ప్రభావం ఉందేమో అని కూడా అనిపించింది.
మరుసటి రోజు వారిని అడిగి చెప్పించుకొని ఆ కవితను రాసి పెట్టుకున్నాను.
ఆ కవి “జసరహచరిఉ” అన్న గ్రంథంలోనిదట. గ్రామాల్లో గ్రామదేవతల
(మారెమ్మ) జాతర జరిగినప్పుడు తాగి తందనాలాడే పోతుల రాజుల
ఆర్భాటాన్ని వర్ణిస్తుందీ కవిత.
జహిరసియ సింగాయ – ఉద్ధరియ కందాయి
భుయదండ ధక్కవియ – కోదండ దంచాయి
లంబంత మాయూర – పింఛోహణివ సణహి
మసిధా ఉమండణయి – పిత్తల విహూ సణయి
గడియద్ధ చలచీరి – యాయంధ జాలాయి
కరికథియ విప్పురియ – కత్తియక వాలాయి
పాయడియణి య గురన్ – వారూఢ లింగాయి
కులఘోస మయచమ్మ – పచ్చాయి మంగాయి
ముద్దా విశేశేణ – దూరంణ మంతాయ
పయఘఘ్ఘ రోలీహి – ఘనఘన ఘనంతాయి
కవకవ హంతాయి – పలియోర వేసాయి
ముక్కట్ట హాసాయి – ఝంపడియ కేశాయి
బలివిలిహ భేయాయి – కఉలాయి మిలియాయి
కీలంతి డడ్డరయి – అట్టంగ వలియాయి
జహికరడ పడహాయి – వజ్జంతి వజ్జాయి
ఇట్టాయి మిట్టాయి – పిజ్జంతి మజ్జాయి
మారీయి దేవియే – దేవాల యేతమ్మి
రెండు చేతులూ పైకెత్తి తాళం వేస్తూ
ఈ కవితను పుట్టపర్తి వారుచదువుతూ ఉంటే
సభ ఊగిపోయింది.
ఇవి పుట్టపర్తి వారికి సంబంధించిన
కొన్ని అనుభవాలూ, అనుభూతులూమాత్రమే. అన్నిటినీ చెప్పేసి
మనసును శూన్యం చేసుకోలేం కాట్టి
కొన్నిటిని ముఖ్యంగా
వారి సాహిత్య వ్యక్తిత్వానికి సంబంధించిన వాటిని మాత్రమే చెప్పాను.
“పుట్టపర్తి వారిలో
నీకు అన్నీ సుగుణాలే కనిపించాయా,
లోపాలూ బలహీనతలూ కనిపించలేదా?”
అన్నది పనికిమాలిన ప్రశ్న.
బలహీనతలు లేని వారు
హిమాలయాల్లో ఉంటారేమో కానీ
నిత్యజీవితంలో ఉండరు.
నిత్యజీవితమే వాస్తవిక జీవితం.
బలహీనత మానవత్వ లక్షణం,
మానవ లక్షణం.
ఎలాంటి బలహీనతలూ లేనివారంటే నాకు భయం.
నాకే కాదు
అలాంటి వారంటే తనకూ భయమేనని
పుట్టపర్తివారు “కామకోటి” పత్రికలో కాబోలు రాశారు.
నేను సాహితీ మిత్రులకు చెప్పే సలహా ఒకటే. సాహిత్యంలో
ఈస్థటిక్ వాల్యూకున్న ప్రాముఖ్యతనూ,
స్థానాన్నీ అర్థం చేసుకోవటం కోసం
“శివతాండవం” చదవమంటాను.
కవిత్వమంటే
పద్యకవిత్వంమాత్రమేనన్న భ్రాంతిలో ఉన్నవారిని
వారి “పండరీ భాగవతం”
“మేఘదూతం” చదవమంటాను.
“పండరీ భాగవతం” లోని
ద్విపద సౌందర్యాన్ని,
“మేఘదూతం” లోని
భామినీ షట్పదివయ్యారాన్నీ చూడమంటాను.
తెలుగులో, సంస్కృతంలో,
అవి రెండూ కలిగలిసిన బంగారపు తీగ లాంటి శైలిలో భావవ్యక్తీకరణను నేర్చుకోవటం కోసం
కవిత్వ ప్రసిద్ధమయిన
“జనప్రియ రామాయణం” ను చదవమంటాను.
పద్యాన్నిపునరుద్ధరించాలని
ఆరాటపడిపోతున్న వారిని
పద్యవిద్యకుపరాకాష్ఠయిన
“శ్రీనివాస ప్రబంధం” చదవమంటాను.
ప్రాచీన భారతీయ సమాజంలో
వ్యవస్థల పతనాన్ని అర్థం చేసుకోవటం కోసం
“మహాభారత విమర్శనం” చదవమంటాను.
మధ్యయుగాల సమాజాన్నీ,
రాజ్యతత్వాన్నీ పరిపాలనాయంత్రాంగాన్నీ
అర్థం చేసుకోవటం కోసం
“విజయనగర సామాజిక చరిత్ర”ను
చదవమంటాను.
వివరణా, విశ్లేషణా ప్రధానమైన
సాహిత్య విమర్శనతెలుసుకోవటం కోసం
వారి శతాధిక వ్యాసాలను చదవమంటాను.
వాటిని శ్రద్ధగా చదివి పనిలో పనిగా మంచి తెలుగు రాయటం నేర్చుకోమంటాను.
“భాగవత సుధాలహరి” చదివి
పాండిత్యమంటే ఏమిటో తెలుసుకోమంటాను.
చిట్టచివరిగా..
కలుపుతో పాటు ..
పైరును కూడా పీకి పారేసే అలవాటును
మానుకోవటం మంచిదంటాను.
(రచన మాసపత్రిక నవంబరు 2002 సంచిక నుండి పునఃప్రచురణ – ’రచన’ సౌజన్యంతో ..)