27 ఏప్రి, 2016

పెద్దన్న రచనా స్వరూపం




పరవశదైన్యమాడుకొను ప్రౌఢల గానదు, ఘర్మ వారిచే
గరగి స్రవించు చిత్రకముగన దనామృత వీటి పాటలా
ధరమున సున్నమంటిన విధంబును గానదు, నవ్వుటాల కా
భరణము గొన్న, గానదొక బాల నృపాలుని జూచి, నివ్వెరన్

స్వరోచి మనోరమ వీరి కల్యాణాన్ని వర్ణిస్తున్నాడు పెద్దన. విడిది ఇంటినుంచీ కల్యాణమంటపానికి 
స్వరోచి లేఖ స్వామి చౌదంతిపై కూర్చొని 
మెరవణిగా పోతున్నాడు

అప్పుడు గంధర్వ నగరంలోని స్త్రీలు 
పెండ్లి కుమారుణ్ణి చూడడానికి మేడలెక్కినారు. 
ఈ వివిధ నాయికలను పెద్దన్నగారు 
పది పద్యాలలో చెబుతున్నారు. 

అందులో 
ఒక ముగ్ధ నృపాలుణ్ణి చూసింది.
ఆ సౌందర్యం 
ఆమెను ఆశ్చర్య సముద్రంలో ముంచివేసింది
తదేకంగా ఆవిడ రాకుమారుణ్ణి చూస్తూ వుంది
ఆమె మనసూ పారవశ్యంతో బాహ్య స్మృతిలో లేనేలేదు
ఆమె ఆ చిత్తవృత్తిని వర్ణిస్తున్నాడు కవి

ఆమెతో బాటు చూస్తున్న ప్రౌఢ కాంతలు ఆమె పారవశ్యాన్ని గమనించి మేలమాడుకున్నారు
స్వేదోదయమైంది
తిలకం కరిగి పోతూంది
తాంబూలపు పెదవిపై సున్నం అంటింది
ఆమె స్పృహలోనే లేదు
ఆమెను ఆటపట్టించడానికి ఆమె ఆభరణాన్ని మెల్లగా తీసుకున్నారు
ఆమెకు తోచనేలేదు
ఈ పద్యాన్ని నాకు పాఠం చెబుతూ మా నాన్నగారు దీంట్లో నీకు విశేషం యేమీ కనిపించడంలేదా
అని అడిగారు
ఏముంది పద్యం బాగుంది
పెద్దన్న శైలి శిరీష కోమలం కదా అన్నాను
వారు నవ్వి
అంతమాత్రమే కాదు 
పెద్దన్న గారు తమ రచనా స్వరూపాన్ని తామే 
ఈ పద్యంలో  వివరిస్తున్నారు
అన్నారు
నిజమే ఈ పద్యాన్ని మనసులో పెట్టుకుని 
మనుచరిత్రను చదివినప్పుడు
వారి రచన అనే క చోట్ల ఈ ముగ్ధాలక్షణానికి వ్యాఖ్యానప్రాయంగా వుంటుంది
-మహాకవి పుట్టపర్తి

19 ఏప్రి, 2016

ఏ తీరుగ మము దయజూసెదవొ . .




కానీ సంపాదించని వాడైనా కోట్లు గడించే వాడైనా
ఏవేవో లోపాలు పెళ్ళాలకు కనిపిస్తాయ్
చీరలు కొనిపెట్టలేదని పేదవాడిపెళ్ళాం ఏడిస్తే
కట్టిన చీర గురించీ తన అందం గురించీ కాంప్లిమెంట్ ఇవ్వలేదని ఈవిడేడుస్తుంటుంది
వాడికి పనిలేదు
వీడికి టైం లేదు..

అన్నీ అమర్చే పెళ్ళామైనా తప్పులకోసం భూతద్దం పట్టుకుంటాడు ఒక  మగడు
అసలు గొడవ పడని ఆలుమగలు వుండరేమో
మా ఇంట్లో గొడవలకు రాముడు కృష్ణుడు కారణం అవుతుంటారు
అమ్మకు రామాయణం
అయ్యకు భాగవతం
చూశారా ఆలుమగల మధ్య అవతారపురుషుల లీలలు
ఇంట్లో అన్నీ చూసుకుని అందరి అవసరాలు తీర్చి 
అయ్య రాతకోత లలో ఒక చేయి వేసి 
అమ్మ పారాయణం కూడా చేసుకుంటే
కోపం ముక్కుమీద నాట్యమాడే అయ్యకు 
అమ్మ పై మాట మాటకూ కోపం..
మా అయ్య కోపం  తాటాకు మంట అయితే .. 
అమ్మఎప్పుడూ శాంతంగా చిరునవ్వుతో వుండేది .. 

ఇలా ఒకసారి యేదో విషయానికి
అయ్య కోపంతో 
'వాడు కాదే రాముడు .. వీడు .. '
అని బిగ్గరగా అరుస్తూ.. విసురుగా బయటికి వెళ్ళి 
అప్పుడే వీధిలో బిక్షం అడుక్కుంటూ వచ్చి 
మా ఇంటి ముందు నిలబడిన ఒక బిచ్చగాడిని భుజం పట్టి తీసుకొచ్చి .. 
ఇంట్లో పీటవేసి వెండి తట్టలో దేవుని కోసంచేసిన ప్రసాదాన్ని
ఇతర పదార్థాలను వేసి తినిపించి శాంతించారు..


15 ఏప్రి, 2016

నీలి రాగం

                          శివధనుర్భంగం ..
జనకుడు శివధనుస్సునుగూర్చి పెద్దగా చెబుతాడు. విశ్వామిత్రుడు అదంతా విని ..
కేవలం అతి సామాన్య విషయంగానే ..
''వత్స రామా ధనుః పశ్యా' అంటాడు . 

రాముడు కొంచెం చేతితో తాకుతానంటాడు. 
జనకుడూ విశ్వామిత్రుడూ కానిమ్మంటారు . 
రాముడు ధనుస్సునెత్తి ఎక్కుఎట్టటానికి ప్రయత్నిస్తే..
 అది మధ్యలో విరుగుతుంది. 

ఈ సందర్భంలో వాల్మీకి రెండే శ్లోకాలు వ్రాస్తాడు. 
వాటిలో పెద్ద సమ్రంభం ఏమీ లేదు. 
అతి సామాన్య విషయంగా చెబుతాడు.
 ఆ శ్లోకాలివీ..

''తస్య శబ్దో మహానాసీత్ నిర్ఘాతసమనిస్వనః
భూమికంపశ్చ సుమహాన్ , పర్వతస్యేవ దీర్యతః''

నిపేతుశ్చ నరాస్సర్వే తేన శబ్దేన మోహితాః
వర్జయిత్వా మునివరం, రాజానాం తౌ చ రాఘవౌ''

ఇతర కవులిచట 
భయంకరమైన శాబ్దిక కోలాహలం చేసినారు. 
వాల్మీకికి రాముని జీవితంలో శివధనుర్భంగం
 అతి సామన్య విషయంగానే తోచింది..

సీతారాముల శృగారాన్ని కూడా 
ఆయన అట్లే చలా హుందాగా చెబుతాడు. 
సీతాదేవి రామునికి పరమ ప్రియురాలు.. 
ఎందువల్ల ? 
''దారాః పితృకృతా ఇతీ'
ఈ పెళ్ళి తల్లిదండ్రులు చేసినారు.. 
అదే కారణం. 

వాళ్ళ మధ్య ప్రేమ .. 
దినదినానికీ ఎదుగుగుతూ వచ్చింది.
 ''గుణా ద్రూపగుణాచ్చాపీ'
రూపంతో .. 
పరస్పరం వున్న సద్గుణాలతో పెరుగుతూ వచ్చిందట. 

రాముని మనస్సులో సీతకంటే ద్విగుణంగా 
సీతాదేవి మనస్సులో రాముడు పారాడినాడు. 
వాళ్ళప్రేమ ఎప్పుడూ హృదయాలతోనే మాట్లాడేది. 
ఏ సమయంలో రాముడేమి తలుస్తాడో సీత కెరుక.
 అట్లే రామునికి కూడా. 
ఇంత గంభీరంగా వుంటుంది. 

వాళ్ళ వర్తన .. వాళ్ళ ప్రేమ.. 
ఒక్కసారి బయటికి రేఖామాత్రంగా కన పడుతుంది. 

అరణ్యాలకు పోవడానికి ముందు 
కైక రామలక్ష్మణులకు సీతకు నారచీరలిస్తుంది . 
రాముడు కట్టుకున్నాడు. 
సీతాదేవికి ఆ చీర కట్టుకోవడం తెలియదు. 
ఆమె ఎన్నడు కట్టుకుంది గనుక..?? 

ఆమె ఎడమ చేతితో పై కొంగు పట్టుకుని 
కుడిచేతితో చీర అంచును పట్టుకుని 
రాముని వైపు సాభిప్రాయంగా చూచింది. 
అప్పుడు రాముడు వచ్చి తన చేత్తో ఆ చీరను కడతాడు. 

ఈ సన్నివేశం చదివినప్పుడు 
మనకు శరీరం ఝల్లుమంటుంది.
అందుకే సీతారాముల ప్రేమను ఆలంకారికులు 
'నీలిరాగ' మన్నారు . 

ఈరీతిగా ప్రతి   సన్నివేశంలోను.. 
ప్రతివర్ణనలోను.. 
వాల్మీకి సంయమన  శక్తి  ప్రత్యక్షమవుతుంది.
ఇలా చెప్పడం మానవమాత్రులతో అయ్యేది కాదు

9 ఏప్రి, 2016