24 మార్చి, 2012

పుట్టపర్తి నారాయణాచార్యుల చేతి వ్రాత కథ..





అయ్య చేతి వ్రాతను గురించి..
చెప్పాలనుకున్నాను..
అయ్య మనలాగా..
బొటన వేలూ.. 
చూపుడు వేలూ.. 
మధ్య వేలూ ..
మూడింటితో ..
పెన్నుని పట్టుకుని వ్రాయలేరు..

చూపుడు వేలి పైకి లేపి ఉంచేవారు..
బొటన వేలూ ..
మధ్య వేలూ ..
క్రింది అనామిక..
చిటికెన వేలూ.. 
పెన్నుని పట్టుకొనేవి..
అలా ఎందుకో తెలియదు..

పెన్ను లంటే ..
మన పెన్నులు కాదు..
కలాలు..
ఇప్పుడు దొరుకుతాయో లేదో తెలియదు..
ఆ కలం పట్టుకుని..
సిరా బుడ్డీ కరణం బల్లపై పెట్టు కుని ..
ఆ బుడ్డీ కదలకుండా ..
అమ్మ అటొక చిన్న చెక్కా ..
ఇటొక చిన్న చెక్కా ..కొట్టించింది..

అలా..
బుడ్డీ లో కలాన్ని అద్దుకుంటూ..
 కలంతో వ్రాసే వారు..
రాసే టప్పుడు..
చేయి చిన్నగా వణుకుతూ ఉండేది..
తదేకంగా ..
అతి దగ్గరగా ..
పేపరును చూస్తూ వ్రాసేవారు అయ్య.

అయ్య తెల్ల కాగితాలను కూడా..
చాలా జాగ్రత్తగా ఉపయోగించే వారు..
ఉపన్యాసాలకు వెళ్ళేటప్పుడు..
పేపరును నాలుగు భాగాలు చేసి ..
అందులో ముఖ్యాంశాలను నోట్ చేసుకొనేవారు..
దాని
ని ట్యాగుతో గట్టిగా ముడి వేసి..
 జుబ్బా  జేబులో పెట్టుకొనేవారు..

అయ్య వ్రా త విధానం..గురించి 
వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు..
ఎంతో చక్కగా రాసారు..
ఆయన్ని..
మా ఇంటికి వస్తూ పోతూ ఉండగా చూస్తూ ఉంటిని ..

కానీ..
అయ్యకు వారికీ ఇంతటి అనుబంధం ఉందని..
వారి వ్యాసం చదివాకే అర్థమైంది..
ఇవన్నీ..
గతజన్మ ఋణానుబంధాలు అంటారు అయ్య.. 

రాధా.. 
పైకి పోయి ..
ఎర్ర రంగు బుక్కు పొడుగ్గ వుంటుంది..
తీసుకు రాపో..
అని చెప్పే వారు కింద కూచుని వున్నప్పుడు..
నేను రయ్యిన పరుగెత్తి..
గవాక్షి లోంచీ..
ఆ పుస్తకాన్ని అయ్యకు చూపించేదాన్ని..
అయ్యా ఇదేనా అని..
అది కాదు ..
ఇంకోటి దాని పక్కనే వుంటుంది చూడు..

వెంటనే దాన్ని తెచ్చి ఇవ్వడం ..

నేను పెరిగే కొద్దీ ..
అయ్య సుందరకాండ ..
నాకు పాఠం చెప్పినారు..
షేక్స్ పియర్..,
ఠాగూర్..
గీతాంజలి..,
మిల్టన్..,                                  
సౌందర్య లహరి..
నెహ్రూ ఇందిరకు వ్రాసిన ఉత్తరాలు..
అరవిందో ఊర్వశి..
ఇంకా..
ఇంకా ..
ఎన్నో స్తోత్రాలు ..
శ్రీ సూక్తం.. పురుషసూక్తం చెప్పించారు..



బ్లూ ..రెడ్.. గ్రీన్..
ఇంకు బాటిల్సు తయారుగా ఉండేవి..
అమ్మ ..
అయ్య ఇంకు బాటిల్సు ..
కలాలూ.. వానికి రక రకాల నిబ్బులూ..
మొదలుకొని ..
అయ్య తాజమహలు బీడీ కట్టలూ..
 అగ్గి పెట్టెలూ ..
తెల్ల కాగితాలూ..
ట్యాగులూ ..
మొదలైనవి తెప్పించి వుంచేది..
 
బ్లూ ఇంకుతో..
వణుకుతున్న చేతులతో ..
వ్రాసుకుని ..
కొన్నింటిని ..రెడ్ అండర్ లైన్లూ..
గ్రీన్ అంర్ లైన్లూ..చేసుకొనేవారు..

ద్వైత పారిజాతాన్ని..
అయ్య వ్రాసుకున్న పధ్ధతిని..
వల్లంపాటిగారు వివరించిన పధ్ధతిని చదివి..
ఒడలు జలదరించింది..

లావుపాటి ..
దాదాపు ..
అయిదు వందల పేజీలు.. వెయ్యి పేజీలు..
ఎన్నో వుండేవి..
 ఆ  పుస్తకాలలో ..
అయ్య శారీరక.. మానసిక ..
తపన  ఎంత దాగి వుందో ..
ఇప్పుడు వాటిని ..
ఒక్కసారి స్పృశించినా చాలు..
మనకు ..
అయ్య ఆశీర్వచనాలు అందుతాయని అనిపిస్తుంది..
 
ఆముక్త మాల్యదను గురించి మాట్లాడమని..
బళ్ళారి వాళ్ళు పిలిచారట..
అందులో ..
వైష్ణవ తత్వాన్ని గురించి ..
అయ్య చక్కగా మాట్లాడారు..
 
అయితే ..
సభ తరువాత..
ఒకతను అయ్యను కలిసాడు..
మీ ఉపన్యాసం వింటే..
మీరు అద్వైతమూ ..విశిష్టాద్వైతమూ  ..
బాగా చదువుకున్నారే కానీ ..
ద్వైతాన్ని ..
అంత శ్రధ్ధగా చదువుకోలేదని తెలిసింది..
 
మీరు ద్వైతాన్ని బాగా చదువుకొని వుంటే..
మీ ఉపన్యాసం ఇంకో విధంగా ఉండేది..
అన్నాడట..
 
ఆయన ..
అయ్య కంటే వయసులో పెద్ద వాడు
అయ్యకు కోపం రాలేదు..
"నన్ను విమర్శిస్తావా..?" 

అని చిరాకు పడలేదు.
సిగ్గు పడ్డారట..
 
నిజమే..
నేను ద్వైత సిధ్ధాంతాన్ని..
శ్రధ్ధగా అధ్యయనం చేయలేదు.. 
అని ..
కర్నాటక లోని ఒక మఠం నుంచీ ..
ఆ ద్వైత పారిజాతాన్ని తెప్పించి చదవసాగారు..


ఈ అనుభవాన్ని..
వల్లంపాటి గారి మాటల్లోనే ..
చదవండి.. 
వారికి ..
చదువు ఎంత తీవ్రమైన వ్యసనమో 
సూచించటం కోసం ఒక సంఘటన చెబుతాను.
వారి చదువును గురించి.., 
పాండిత్యాన్ని గురించీ ..
చెప్పటానికి నా చదువూ.., 
పాండిత్యమూ ..సరిపోవు. 

వారి విజ్ఞాన దాహానికి హద్దు లేదు. 
ఏ భాషలో ఏముందో..??
అది రాకపోతే ..
మనకు ఏం తెలియకుండా పోతుందో ..??
అన్నట్టుగా ..
భాషలు నేర్చుకునేవారు, 
చదువుకునేవారు. 


వారికో చిత్రమైన అలవాటు ఉండేది. 
అచ్చుపుస్తకాన్ని చూస్తే ..
వారికి ఆత్మీయత అంతగా కుదిరేది కాదు.
తాను మళ్ళీ ..మళ్ళీ..
చదవాలనుకున్న పుస్తకాల్ని..
తానే స్వయంగా కాపీ చేసుకునేవారు. 
ఆ పుస్తకం మీద ఎర్రసిరాతో ..
అర్థాలూ, వ్యాఖ్యలూ రాసుకునేవారు.
.
 అలా వారు కాపీ చేసుకున్న..
 కొన్ని షేక్స్పియర్ నాటకాలూ.., 
ఇతర గ్రంథాలూ..
ఇప్పుడు బ్రౌన్ మెమోరియల్ గ్రంథాలయం..
(కడప) లో ఉన్నాయి. 
వాటిని చూస్తే ..
పుట్టపర్తివారి ..
పాండిత్యం వెనక ఉన్న శ్రమ ఎంతటిదో అర్థమవుతుంది. 


ఇరవయ్యవ శతాబ్దపు కవుల్లో..
 పుట్టపర్తివారిని ..
సుదూరంగా పోలిన పండితుడు కూడా లేడన్నది..
 నా దృఢవిశ్వాసం.

వై.సి.వి రెడ్డి వారిని గురించి..
 “కవిత్వం రాసేదానికి ..
ఇంత చదువుకోవాల్సిన అవసరం లేదప్పా..” 
అనేవారు.


1975-76 ప్రాంతంలో..
 ఒక రేడియో ప్రోగ్రాం రికార్డింగు ఉండి..
కడపకు వెళ్ళాను...
 ఆకాశవాణి కేంద్రంలో అనుకోకుండా..
శతావధాని నరాల రామారెడ్డి కలిశారు. 
కాస్సేపు కబుర్లు చెప్పుకుని..,  
భోజనం చేసి,
రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో..
 పుట్టపర్తివారింటికి వెళ్ళాం..
కనకమ్మ గారు ఎదురుపడి ..
ఆప్యాయంగా ఆహ్వానించి.., 
“అయ్యగారు మిద్దెమీదున్నారు, వెళ్ళండి” 
అన్నారు. 

ఇద్దరం మేడ మీదికి వెళ్ళాం.., 
పుట్టపర్తి వారు..
తన మామూలు పద్ధతిలో..
కరణం డెస్కు ముందు కూచొని..
ఏదో వల్లె వేస్తున్నట్లు కనిపించారు.
“ఒరే దొంగవెధవలిద్దరూ ఎక్కడ కలిసినార్రా?” 
అని ఆహ్వానించారు. 
చెప్పాం. 
క్షేమసమాచారాల పలకరింపులైపోయాక -


“ఇదేదో చాలా పెద్ద పుస్తకం పట్టారే..” 
అన్నాను 
డెస్కు మీదున్న ..
బండ లాంటి ..
పాత సంస్కృత గ్రంథాన్ని చూపుతూ.



పుట్టపర్తివారు
 ఆ గ్రంథాన్ని ఆప్యాయంగా తాకుతూ అన్నారు.
“ఒరే ఈ మధ్య ఒక సంగతి జరిగిందిరా. 
బళ్ళారి వాళ్ళు పిలిచినారు... 

వెళ్ళినా...
’ఆముక్తమాల్యద’ను గురించి.., 
ముఖ్యంగా..
 అందులోని వైష్ణవ తత్వాన్ని గురించి, 
బాగానే మాట్లాడినా...
సభ తరువాత..
ఒకతను కలిసినాడు. 
అతడు నాకంటే పెద్దవాడు..
అతడు ..
“మీ ఉపన్యాసం వింటే మీరు అద్వైతమూ,
 విశిష్టాద్వైతమూ..
బాగా చదువుకున్నారే కానీ..
ద్వైతాన్ని అంత శ్రద్ధగా చదువుకోలేదని తెలిసింది. 
మీరు ద్వైతాన్ని బాగా చదువుకొని ఉంటే ..
మీ ఉపన్యాసం మరొక రకంగా ఉండేది.”, 
అన్నాడు. 

నిజమే...
నేను ద్వైత వేదాంతాన్ని..
అంత శ్రద్ధగా అధ్యయనం చేయలేదు. ..
చాలా సిగ్గనిపించింది... 

ఈ పుస్తకం పేరు “ద్వైత పారిజాతం”
 దీన్ని కర్ణాటకలో...
 ఒక మఠం నుంచి..
 తెప్పించి చదువుతూ ఉన్నా.
 మరో రెండు నెలల్లో పూర్తయిపోతుంది.”

పుట్టపర్తి వారి దృష్టిలో..
 “చదవటం”..
అంటే ఏమిటో..
చాలామందికి తెలియదు.. 
వారు “ద్వైత పారిజాతం”ను ..
ఎలా చదువుతూ ఉన్నారో చూస్తే ..
వారి చదవటం కొద్దిగా అర్థమౌతుంది. 

మొదట మూలంలో ..
నాగరలిపిలో ఉన్న శ్లోకాన్ని ..
తెలుగు లిపిలో కాపీ చేసుకోవడం.., 
తరువాత సంస్కృత వ్యాఖ్యను చదివి.., 
అర్థం చేసుకొని.., 
అందులోని ప్రధానాంశాలను..
తెలుగులో తన నోట్ బుక్ లో రాసుకోవటం, 
ఆ తరువాత ఆ శ్లోకాన్ని కంఠస్థం చేయటం, 

అంతకు ముందు..
కంఠస్థం చేసుకున్న శ్లోకాలతో దాన్ని కలిపి 
మననం చేసుకోవటం.., 
మరో శ్లోకానికి వెళ్ళటం...
వారు సంస్కృత మహాకవుల్ని చదివినా..
షేక్స్పియర్ నాటకాలను చదివినా ..
“పారడైస్ లాస్ట్” ను చదివినా..
 ఇలాగే “చదివారు”. 

చదవటమంటే..
ఆ గ్రంథాన్ని ఆమూలచూడంగా..
తన స్మృతిపేటికలో భద్రపరచుకోవటం..
పిలిచినప్పుడు పలికేలా ఉంచుకోవటం..

“ఆయనెవరో..
 మీరు ద్వైతవేదాంతం బాగా చదువుకోలేదంటే..
 దాని మీద పడిపోయారు...
 ఇలా మీ విలువైన కాలాన్ని వృథా చేస్తున్నారు..



మీ సొంత సాహిత్య కృషిని కూడా మానేశారు... 
ఇదేం పద్ధతి..? 
నేను మీకింకేదో రాదంటాను...
మీ చదువూ.., రాతా ..,
మానేసి దాన్ని నేర్చుకుంటూ కూర్చుంటారా?” 
అన్నాను.
“ఏం రాదంటావూ?” అన్నారు.
“న్యూక్లియర్ ఫిజిక్స్ రాదంటాను. 
దాన్ని నేర్చుకుంటారా?” అన్నాను.
రామారెడ్డి హాయిగా నవ్వారు.



పుట్టపర్తి వారు..
గంభీరంగా మారిపోయారు. 
ఒకటి ..
రెండు ..
నిముషాలు నిశ్శబ్దంగా ఉండిపోయి..
“నేను చేస్తున్న సాహిత్య కృషికి
 నువ్వు చెప్పిన న్యూక్లియర్ ఫిజిక్స్ 
 అవసరమని నిరూపించరా...
అది తెలిసినవాణ్ణి ఆశ్రయించి ..
దాన్ని నేర్చుకుంటాను.” 
అన్నారు. 
నేనూ.., 
రామారెడ్డి.. అవాక్కయిపోయాం.
గుండె ఝల్లు మంది కదూ..??

ఇవన్నీ 
గతజన్మ ఋణానుబంధాలు 
అంటారు అయ్య..
అయ్యను..
అంత ప్రాణప్రదంగా ప్రేమించడానికి 
అయ్య వారికేం ఇచ్చే వారు..??
 
గుర్రప్ప అని..

ఒక కాంపౌండెర్..
ఆయనే మాకు ఆస్థాన వైద్యుడు..
పొద్దునా ..సాయంత్రం..
ఇంటికి వచ్చి..
అయ్య ఉంటే అయ్య కో..అమ్మ కో ..
నమస్కారం చేసుకొని పోయేవాడు..
 
ఇంట్లో ఎవరికి యే జబ్బు వచ్చినా 
గుర్రప్ప రావలసిందే..
చేతిలో కాసులు పడంది
 ఎవరైనా ఏ పనైనా చేస్తారా..??
అమ్మ ఆయన కేం ఇచ్చేది..??
పండో ఫలమో..
అంతే..
అర్థరాత్రీ ..
అపరాత్రీ.. 
ఎప్పుడు పిలిస్తే అప్పుడు..
అతని కిట్టేసుకుని ..
తన సైకిలులో సొంత కొడుకులా పరుగెత్తి వచ్చేవాడు..
ముఖాన ఇంత విసుగు గానీ ..
చిరాకు గానీ..
అబ్బే..
లేనే లేదు..
వీరికి సేవ చేయటం నా ధర్మం అన్నట్లు..
యేదో మంత్ర బధ్ధుడిలా..


అమ్మ చనిపోయే వరకూ..
అతను పక్కనే వున్నాడు.
అతను దగ్గరే ఉన్నాడు..
ఎందుకు..??
ఈ జన్మకు సంబంధించి నంత వరకూ ఆలో చిస్తే ..
యేదో గురుత్వం..
కాస్త విశాలంగా ఆలోచిస్తే..
గత జన్మ ఋణానుబంధం..
కాదంటారా..?

21 మార్చి, 2012

పుట్టపర్తి నారాయణాచార్యులు జిళ్ళెళ్ళమూడి అమ్మ

ఒకసారి..
ఒకసారేమిటి ..
తరువాత చాలాసార్లు..
అమ్మ అయ్య నేను..
జిళ్ళెళ్ళమూడి వెళ్ళాం..
అప్పుడు నాకు పది పన్నెండేళ్ళుంటాయేమో..
 
చివరిదాన్నీ ..
చిన్నదాన్నీ ..
అవటం వలన..
అమ్మ అయ్య ఎక్కడికి వెళ్ళినా ..
వెనుక నేనుండ వలసిందే..
 
అలానే ..
నాలుగేళ్ళనుంచే ..
పండరి ..తులజాపూర్ ..షిరిడీ..
చాలా పుణ్య క్షేత్రాలు చూసాను..
కానీ చిన్నతనం వలన..
ఆ మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాను..
 
కానీ..
నాకు పూర్వ జన్మ పుణ్యం ఉండటం వల్లనే ..
అంతటి అయ్య అమ్మ ల..
ముద్దు మురిపాలనూ పొందే అవకాశం..
దొరికిందని నమ్ముతున్నాను...
 
అలానే ..
అమ్మ అయ్య లకు చివరి రోజులలో..
 సేవ చేసే అవకాశం కూడా..
 మహద్భాగ్యంగా లభించింది...
 
నా పదిహేడేళ్ళ వయసులో..
అమ్మ పెరాలిసిస్ వస్తే ..
 దాదాపు సంవత్సరం సంవత్సరమ్న్నర..
 అమ్మ మల మూత్రాలు శుభ్రం చేయడం..
 స్నానం చేయించటం ..
అన్నం నోట్లో పెట్టటం ..
అమ్మ పక్కనే పడుకోవటం జరిగింది..
 
చిన్న వయసులో..
అంతటి గొప్ప అదృష్టం పొందటం కూడా..
నా పూర్వ జన్మ సుకృతం గానే ..
నేను భావిస్తాను..!
 
ఇక కథలోకి వస్తే..
అయిదుగురు ఆడపిల్లలు..
 అందులో ముగ్గురికి పెళ్ళయింది..
మనుమలు మనుమరాళ్ళు..
ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు..
 
అద్దె ఇల్లు..
ఇంతవరకూ..
ఒక చిన్న సొంత ఇల్లు కొనలేదు..
కొనడానికి దాయడమేదీ..??
ఒక చీటీ లేదు..
ఒక ఎల్ ఐ సీ లేదు..
ఒక బ్యాంక్ సేవింగ్స్ లేదు..
పిల్ల పెళ్ళి చేయాలా..??
అయ్య
రాఘవేంద్ర స్వామి స్తోత్రం నూటా ఎనిమిది సార్లు..
ఏ తెల్లవారి రెండు కో లేచి చేస్తారు..
ఏదో విధంగా డబ్బు సమకూరుతుంది..
అమ్మాయి పెళ్ళయి..
ఇంటి నుంచీ వెళ్ళి పోతుంది..
 
మహా పురుషులు..
యేమి చెప్పుకోవలసి వచ్చినా..
పరమాత్మతోనే చెప్పుకుంటారు...
వారి నిత్య మానసిక సంబంధం..
పరమాత్మ తోనే..
దుఃఖం వచ్చిందా..??
పరమాత్మతో..
సుఖం వచ్చిందా.. ?
పరమాత్మతో..
పిల్ల పెళ్ళి చేయాలా .??
పరమాత్మతో..
అంతే కానీ ..
యే అప్పుల వాడి దగ్గరికో కాదు..
 
కొంతమంది ..
సంసారంలో ఉండి సన్యాసులుగా జీవించారు..!!
కొంతమంది..
కొంతమంది సంసారంలో ఉండి ..
అపార ఐశ్వర్యం ఉండీ..
వానితో సంగం లేక జీవించారు..!!
మరికొంత మంది..
సంసారంలోనే ఉండి..
జ్ఞానులుగా జీవించారు..!!

ఒకసారి..
శంకర భగవత్పాదుల వద్దకు..
 బీద దంపతులు వచ్చారు..
"భగవన్ ..!
అమ్మాయి పెళ్ళి చేయాలి..
బీదవారం..
అందుకు పద్దెనిమిది బంగారు కాసులు అవసరమవుతాయి..
తమరు దయచేస్తారని ఆశతో వచ్చాం.."
 
భగవన్ బదులు పలుకలేదు..
"భగవన్ తమరు మహా శక్తి సంపన్నులు ..
సహాయం చేయండి.."
భగవన్ నుంచీ బదులు లేదు..
కాసేపయ్యాక..
"భగవన్ మేము వెళ్ళి వస్తాం.."
ఇంతలో ..
ఆశ్చర్యకరంగా..
"భగవన్ ..
తమకు ..
ఈ పద్దెనిమిది బంగారు కాసులూ..
సమర్పించుకుందామని వచ్చాం..
స్వీకరించండి.."
ఓ సంపన్న కుటుంబం ..
ఆచార్యులవారి పాదాల వద్ద ఆ కాసులను ఉంచారు..
శంకరాచార్యుల వారు ..
ఆ కాసులను..
ఆ బీద దంపతుల వేపుకు..
తమ సత్య దండంతో తోశారు..

ఆ బీద దంపతుల విజ్ఞాపనను..
కామాక్షి అమ్మవారికి నివేదించారు ..
వెంటనే ఫలితం వచ్చింది..
అంతే..
అంతటి మహిమా సమన్వితులు ..
నడిచేదైవం..!!

కడపలో అప్పటికే ..
నాలగైదు ఇళ్ళు మారారు..
ఇంటెడు సామాను..
అది కాక అయ్య పుస్తక భాండాగారం..
ఎద్దుల బళ్ళు ఉపయోగించేవారు అమ్మ. 
సామాను తరలించడానికి..
ఎద్దుల బండితో పాటూ ఇంటెడు సామానూ అయ్యేదాకా అన్నిసార్లూ అమ్మ తిరిగేది..
అబ్బ..
అమ్మ ఎంత కష్ట పడేదో..
అయ్య యేమీ పట్టించుకునే వారు కాదు..
 
అమ్మ కూడా ..
అయ్యకు ఆపనీ ఈ పనీ చెప్పి..
చులకన చేసేది కాదు..
అయ్యంటే ..
ఎంత భక్తో..
ఎంత గౌరవమో..
కొండమీది దేవునికి మల్లెనే అమ్మ అయ్యను చూసుకుంది..
ఎంత శ్రమ అయినా..
అది శారీరకమైనా..
మానసికమైనా ..అమ్మే భరించింది..
 
తెల్లటి శరీరం ..
జారుముడి..
నుదుట కుంకుమ బొట్టు..
మా అమ్మ పార్వతీ దేవే..
నాకు మా అమ్మ కళ్ళలో మెదలి..
కన్నుల నీరు కారిపోతోందండీ..
 
అలా ..
ఆలా..
ఆలూరు రాధాకృష్ణ వాళ్ళ ఇల్లు ఖాళీ చేసి..
ఇందిరమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం..
నేను అప్పుడు నాలుగో తరగతి..
కొద్ది రోజులయ్యాయో లేదో..
ఇందిరమ్మ ఇల్లమ్ముతానంది..
ఇరవై అయిదువేలట..
 
అమ్మ అనుకుంది..
ఇక లాభం లేదు..
ఈ అద్దె ఇళ్ళ బాధ భరించలేం..
ఎలాగైనా ఒక సొంత ఇల్లు కొనాలి ..
అయ్యకు చెప్పింది..
 
అయ్య ఆలోచనలోపడ్డారు.
కొనడానికి డబ్బేదీ..??
మళ్ళీ ఏ దైవమో దొరకడా.. ??
మాకు మళ్ళీ తిరిగి ఇవ్వక్కరలేని అప్పుల వాడు..
 
అయ్య అప్పుడు ఏ పూజ చేసారో ..
నాకు గుర్తు లేదు..
కానీ..
అప్పుడే ఎవరిద్వారానో ..
జిళ్ళెళ్ళమూడి అమ్మ పరిచయమైంది..

అబ్బా..
అమ్మంటే..
అమ్మే..
జిళ్ళెళ్ళమూడి అమ్మ..
తెల్లని విగ్రహం..
కనుబొమ్మల నడుమ పెద్దదైన బొట్టూ..
ముక్కుకి బులాకీయా ..
అదేనేమో ..తళ తళ మెరుస్తూ..
ముఖంలో ప్రశాంతత..
పెదవులపై చిరునవ్వూ..
ఇవి చాలవూ అమ్మకు..
 
బాపట్ల వెళ్ళాం.. అయ్యకు సన్మానం.
అక్కడినుంచీ ..
ఎవరో కారు అరేంజ్ చేసారు..
జిళ్ళెళ్ళమూడి చేరాం..
 
చిన్న గ్రామం..
అమ్మ దర్శనానికి తీసుకు వెళ్ళారు..
సిమ్హాసనంపై అమ్మ కూర్చుంది..
కాళ్ళు పెట్టు కోవడాఅనికి ఇంకో పీటలాంటిది..
అమ్మ పాదాలు చిన్నవి చిన్న చిన్న వేళ్ళు..
అందమైన మెట్టెలు..
అందరం నమస్కరించాం..
అమ్మ ప్రేమగా తల నిమిరింది..
బుగ్గలు నిమిరింది..
కళ్ళ నీరు తుడిచింది..

ఇక మనలోని పసివాడు బయటికి వస్తాడు ..
వాడినాపటం ఎవరివల్లాకాదు..
మనకు భగవంతుని దగ్గర దొరికేది కూడా ఇదే.. 
ఓదార్పు..
యే సమస్యకూ పరిష్కారం ఉండదు..
కాలమే చక్కని పరిష్కారం..

 
అయ్య ధారాపాతంగా ఏడ్చారు..
అంతటి పండితుడూ..
విద్యాహంకారి..
అష్టాక్షరీ మంత్ర సాధకుడూ..
వెక్కి వెక్కి యేడ్చారు..
 
ఎప్పుడో అయిదేళ్ళప్పుడు..
చేజార్చుకున్న అమ్మ ఒడి..
అమ్మ ప్రేమ..
అమ్మ లాలన..
అమ్మ..
నిన్ను పోగొట్టుకుని నేను తపించానమ్మా..

అమ్మా..
నీవు నన్నొదిలి ఎక్కడికి పోయావ్..
అమ్మా..
అమ్మా..
నీవు లేవు..
నీ ప్రేమ లేదు..
నాలో అగ్ని..
బడబాగ్ని..
దావానలం..
పుట్టింది..
 
అది నీవు కావాలనే కోరిక..
నిన్ను చేరాలనే దాహం..
సరస్వతియే నన్నావహించిందో ..యేమో..
అమ్మవై నీవే కటాక్షించావేమో ..
పుస్తకాలన్నీ చదివేసానమ్మా..
సంగీత సాహిత్యాలన్నీ ..
అణువణువూ వెతికానమ్మా..
నీకోసం..
నాకు వేనిలోనూ నీవు పూర్తిగా దొరకలేదు..
మంత్ర సాధన మంత్ర సాధన ..
అక్కడా నాకు ఆర్తే..
 

నీ ఒడి నాకు ఎప్పుడూ కావాలి..
నీవు నా దగ్గరే ఉండాలి..
నన్ను ఒదిలి ఎక్కడికీ వెళ్ళిపోకూడదు..

అమ్మ వింది..
కళ్ళలో జాలి కురిపించింది.
ఏడవకు నాన్నా..
నేను నిన్నొదిలి ఎక్కడికి వెళ్ళాన్రా..
నేను నిన్నొదిలి ఎక్కడికి వెళ్ళన్రా..

ఇంతలో ..
వెండి పళ్ళెం పేద్దది వచ్చింది..
అన్నం వడ్డించారు..
పప్పు వేసారు..
అమ్మ చారెడు నెయ్యి పోసింది..
నిజ్జంగా చారెడు నెయ్యే..
అమ్మ నెమ్మదిగా కలిపింది..
బంగారు ఉంగరాలు ..చిన్న చేతులు..
అన్నాన్ని కలిపాయి..
 
తరువాత..
చిన్న చిన్న ముద్దలు చేసి ..
అందరికీ అమ్మ ముద్దలు తినిపించింది..
అయ్యకొక ముద్దా..
నా కొక ముద్దా..
అమ్మ కొక ముద్దా..
 
అమ్మంటే మరిచిపోయాను..
నిత్య రామాయణ పారాయణలో ధన్యమైన ..
మా బంగారు అమ్మ.. 
ఆ అమ్మ ముందు ..
ఒక శక్తి స్వరూపం ..
మరొక శక్తి స్వరూపం ముందు..
ఆ క్షణాలు ..
నిజంగా ఎంత మధుర మైనవండీ..!!
 
అక్కడ ఉండీ ..
పాలు పంచుకున్న నేను ..
ఎంత అదృష్టవంతురాలినో..
 
అమ్మ చేతి గోరుముద్దలు..
అందరం సంతోషంగా తిన్నాం..

ఇల్లు కొనుక్కొవాలి సహాయం చెయ్యమ్మా..
అని అడగాలనుకున్న అయ్య
పునరావృత్తి రహిత నిజ శివ సాయుజ్య స్థితినివ్వమ్మా..
అని అడిగారు..
వింత కదూ..


అదేమి చిత్రమో ..
వెంట వెంట సభలు ..
వెంట వెంట సన్మానాలు..
అక్కడక్కడే ఏర్పాటయ్యాయి..
మాక్కావలసిన ..
ఇరవై అయిదు వేలూ సమకూరాయి..

చలంగా ప్రసిధ్ధుడైన గుడిపాటి వెంకటా చలం ..
సుప్రసిధ్ధ తెలుగు రచయిత ..
వేదాంతి ..
సంఘసంస్కర్త హేతువాది...!!


స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలకు ..
స్పందించి ..
హేతువాద దిశగా నడచి నడచి డస్సి పోయి..
చివరకు ..
అమ్మ ఒడిలో సేదతీరారు..
ఆస్తిక వాదులకు అమ్మ ఒడి ఉంది..
నాస్తిక వాదులకు ఒయాసిస్సు తప్ప యేముందీ..
 
ఎందుకండీ అరుణాచలం వెళ్ళారు 
అంటే పింగళి నాగేంద్ర గారు..
శాంతి కోసం అన్నారట..
యేం హేతువాద రహదారుల్లో శాంతి దొరకలేదా..


పై అభిప్రాయాలు గలిగిన చలం
 చివరికి రమణుల అభయ హస్తం లో విశ్రమించారు..
చిట్ట చివరికి ..
తనకు తానుగా 
తనలో తానుగా మిగిలినప్పుడు..
ఒటరితనం ముందు నిలవగలిగే శక్తి 
ఒక్క ఆధ్యాత్మికతకే వుంది..
దీనికి ఎవరు యే పేరుపెట్టుకున్నా సరే..



పుట్టపర్తి వారితో కలిసి..
చాలా ప్రయాణాలు చేశాను. 
వారూ, నేనూ కలిసి రమణాశ్రమం వెళ్ళాం. 
చలం గారిని చూశాం. 
ఆ కలయిక 
ఇద్దరికీ నచ్చలేదని నా అనుమానం. 
“జనప్రియ రామాయణం” లోని 
రామజనన ఘట్టాన్ని వారు
చలం గారికి చదివి వినిపించారు.
ఇక్కడ ఒక్కమాట..
రామ జనన ఘట్టం అత్యద్భుతంగా వుంటుంది..
కానీ..
“ఒక్క మాట కూడా నాకు అర్థం కాలేదు” 
అన్నారు చలం గారు.
“ఏం చేద్దాం ఎవడి స్థాయి వాడిది” 
అన్నారు పుట్టపర్తి వారు.


  అంటూ తన అనుభవాన్ని చెప్పుకున్నారు వల్లంపాటి వెంకట సుబ్బయ్యగారు.



ఈశ్వరుణ్ణి చూసినవారు లేరు. 
ఆఖరికి ..
చూశామన్నవారు గూడా లేరు..
ఈశ్వరుణ్ణి చూడలేదు..
 అనేవారూ లేరు.-- (ఆత్మకథ 124 పుట నుండి)
 
ఈశ్వరుడు ఉన్నట్టు రూఢీగా తెలిస్తే..
నమ్మనా? 
అంతవరకు ..
ఈశ్వరుడు లేనట్టూ రూఢీ లేదు మరి!
ఉంటే నమ్మడానికి నాకేం అభ్యంతరం? --(స్తీ 14వ పుట)
అన్న చలం..
రమణుల పాద దాసుడై ఆధ్యాత్మికోన్నతి కోసం చకోరపక్షిలా ఎదురుచూశాడు..

తోవలో ..
భగవాన్ కోసం ..
పళ్ళు కొనమంటే కొననన్నాను. 
ఆయనకి సాష్టాంగ పడమంటే పడనన్నాను. 
భగవాన్ ముందు..
 నిశ్చబ్దంగా కూచున్న ప్రజలలో కూచోడం ..
నాకు బాధగా వుంది. 
వొచ్చినప్పటినించి ..
ఎప్పుడు పోదామా..
అని దీక్షితులు గారిని వేధిస్తున్నాను. 
ఆశ్రమంలో మనుష్యుల్ని చూసిన కోద్దీ..
అసహ్యం పుడుతోంది. 
'యీ మహర్షి ఏదో దివ్య పురుషుడంటారు మీరు. మనుషుల్నే మారుస్తాడన్నారు. 
ఇన్నేళ్ళమట్టి ఆయనని అంటిపెట్టుకొని వున్న
 వీళ్ళ మొహాలిట్లా వున్నాయేమిటి.. ?'

ఆ రోజు ..
భగవాన్ కొండమీదికి వెళ్ళి..
 తిరిగి హాలులోకి. మా గుంపు వెనకనించి ..
భగవాన్ వొస్తున్నారు. 
అందరూ పక్కకి తప్పుకొంటున్నారు.
 నేనే కదలలేదు.., 
'చోటు వుంది, పక్కకి తప్పుకుపోతారులే ఆయన ' అనుకుని. 
భగవాన్ సమీపించేటప్పటికి ..
దీక్షితులుగారు నన్ను పక్కకి లాగేశారు. 
భగవాన్ ..
నన్ను దాటి వెళ్ళి చప్పున ఆగి, 
వెనక్కి తిరిగి ..
నన్ను ఓ గొప్ప చిరునవ్వుతో ..
ఓ నిమిషం చూసి వెళ్ళిపోయినారు. 
ఆ నిమిషాన నాకేమనిపించలేదు గాని, 
ఇప్పుడు తలుచుకుంటే, 
ఆ నిమిషం నించే ..
నన్ను జయించేసుకున్నారు భగవాన్
అనిపిస్తుంది...    
అని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు.

ఇంకా..
పాత భక్తులూ.., 
ఘరానా వాళ్ళూ ..
భగవాన్ కి దగ్గిరగా కూచునేవారు..
 నేను చిట్ట చివర కూచుని..
 ఆయన కళ్లలోకే చూస్తో వుండేవాడిని...
 ఒకసారి భగవాన్..
 తన దగ్గిర వున్నవాళ్ళని అడిగారు.., 
అందరూ లేచిపోయినా ..
కదలక కూచున్న నన్ను చూపి..,


ఎందుకు ..
అన్ని గంటలూ అట్లా కూచుంటాడు ' అని.
వాళ్ళేదో అన్నారు. 
అది నా కర్థం కాలేదు..
నాకేం కావాలి? 
ఆధ్యాత్మికోన్నతి...
ఆ సంగతి భగవాన్ కి తెలీదా ? 

ఇప్పుడు తెలుస్తోంది..
భగవాన్ ప్రశ్నకి అర్థం.
'నన్ను చూస్తో కూచుంటే ఏమొస్తుంది? 
తనకి తాను సాధించుకోవాలి కాని.. '
అనే స్థితికి వచ్చారు..


యేమైతేనేం ..
మేము..
 
సంతోషంగా ఇంటికి వచ్చాం..
ఆనందంగా ఆ ఇల్లు కొనుక్కున్నాం..
ఆ ఇంట్లో..
అమ్మ రామాయణ పారాయణ లెన్నో చేసింది..
అయ్యకు మరెన్నో గౌరవాలు జరిగాయి..
ఎన్నో శుభాలు జరిగాయి..
అంతటి మంత్ర పూతమైన..
ఆ ఇల్లు పర్యాటక స్థలంగా చేసి ..
ప్రభుత్వం అభివృధ్ధి పరిస్తే బాగుంటుంది..
కదూ..








 

19 మార్చి, 2012

పుట్టపర్తి నారాయణాచార్యుల తత్వం రమణ తత్వమేనా..??




 ఇది..
శ్రీనివాస ప్రబంధం పీఠిక..
దీనిలో అయ్య ..
ప్రతి పనిలో..
తన ఉపేక్షా భావానికి చింతిల్లినారు..

ఢిల్లీ లోనే అయ్య ఉండినట్లయితే ..
జ్ఞాన పీఠమేం ఖర్మ ..
నోబల్ బహుమానమూ ..
అయ్య ఒడిలో వచ్చి చేరేది..

కడప లాంటి చీకటి ఖండంలో ..
బండ హృదయాల నడుమ ..
అయ్య తన రచనా వ్యాసంగానికి ..
ఉపాసనా జీవనానికీ..
అది ఒక రహస్య మయ స్థావరంగా ..
ఎంచుకున్నారేమో..

ఈ జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా..
యేమి నోము నోచె ఈ యశోద..

పరీక్షిత్తు భాగవతం చెబుతుంటే..
లీలాశుకుడు ప్రశ్నించాడట..

అలా..
ఒక పరమ పురుషుడు ..
అక్కడ నడయాడటానికి..
రాయలసీమ లోని రాళ్ళూ.. 
పుణ్యం చేశాయేమో..!!

గిరిధారిలాల్ అరవింద ఆశ్రమవాసి. 
ఒకసారి ..
అతడు రమణమహర్షి దగ్గరకు వచ్చి  ..
పురాణాలు..
ప్రతి యుగం ఇంతకాలం ఉంటుందని ..
ఎందుకు చెప్తాయి..??
అని ..
తన సందేహాన్ని బయటపెట్టాడు గిరిధారి. 

దానికి సమాధానంగా మహర్షి..
‘‘ఒక్కొక్క యుగం..
ఇంతకాలం ఉంటుందని చెప్పడంలో ఉద్దేశం... 
మనిషికి ఉన్న వందేళ్ల జీవితం ..
ఎంత స్వల్పమైనదో తెలుపడమే..."

కాబట్టి..
మనిషి జగత్తులో..
తన స్థానమేమిటో తెలుసుకుని..
తన ప్రాముఖ్యాన్ని..
గొప్పగా భావించకుండా ఉండాలి

మనకు అశాంతిగా అనిపించినప్పుడు ..
పర్వతాలను..
నదులను.., 
నక్షత్రాలను.., 
చంద్రుడిని ..,
చూస్తే శాంతి లభిస్తుంది..
అలాగే ..
ఎంతో దూరంలో ఉన్న,,
గ్రహాల చుట్టూ మన ఆలోచనలను పోనిస్తే ..
‘ఇంత విశాలమైన ఖగోళంలో భూమి ఎంత? 
ఆ భూమి మీద మనమెంత..?
 అన్న భావన ..
ఎవరిలోనైనా ఇట్టే కలుగుతుంది...
అప్పుడు ..
మనిషి ..
తన సంపదలు.., 
పేరుప్రతిష్ఠలను ..
చూసుకుని గర్వపడడానికి.., 
తన కష్టనష్టాలకు కుంగిపోవడానికి ..
అవకాశం ఉండదు... 
అన్నారు రమణులు..
 
రమణులంటే అయ్యకు ప్రాణం..
అందుకే ప్రతిదానిలోనూ ఉపేక్ష..

అనేక మార్గాల్లో..
కీర్తిని కొనుక్కొనే వారిపట్ల అసహ్యం చూపారు..అయ్య
ఇటువంటి వాళ్ళకు..
యేమి రాస్తే యేముందిలే అనే నిర్వేదం..కూడా..

ఇది వ్రాసే సమయంలోనే అమ్మకు అనారోగ్యం..
మాటి మాటికీ ఫిట్సు..
తడవ తడవకూ..
డబ్బులకు  చేయి తడుముకోవలసిన పరిస్థితి..

ఈనాటికి ..
శ్రీనివాస ప్రబంధము..
మొదటి భాగము పూర్తయినది..
ఇంకా రెండవ భాగం ప్రింట్ కావలసి వుంది...

ఈ నడుమ ..
ప్రభుత్వము గ్రంధ ప్రచురణలకు..
సహాయము నిలిపివేసినదని విన్నాను..

మరి ..
ఉత్తరార్థం..
యెప్పుడు గడ్డకు వస్తుందో చెప్పలేను..
అన్నీ ..
ఆ పరమేశ్వరుని దివ్య చిత్తానికి వచ్చినప్పుడే..
వచ్చినట్లే జరుగుతాయి ..
ఈ ప్రబంధం రచన ప్రారంభించి ..
సుమారు ముఫై యేండ్లకు పైగా అయింది... 

ఏ గ్రంధం గానీ ..
మొదలు పెట్టి..
దీక్ష గా ముగించే అలవాటు నాకు లేదు..
కొన్ని సంవత్సరాలు కూడా..
ఆ వైపు చూడకుండా వుండడం కద్దు..

ఈ ఒక్క విషయంలో కాదు..
ప్రతి పనిలోనూ...
నా ప్రవృత్తి ఇంతే ..
ప్రతిపనిలోనూ..
విపరీతమైన ఉపేక్షాభావం. 
తీరా నెత్తిపైకి వచ్చినప్పుడే..
కార్యానికి పూనుకోవడం..

ఈ ఉపేక్షా భావంతో ..
యేన్ని విషయాల్లోనో నష్టపడినాను ..
కానీ ఈ జీవి ప్రవృత్తి అంతే...!!

1939 నుండీ ..
నేను రేడియోలో ఇచ్చిన రచనలు కోకొల్లలు. 
అయినా ..
యే ఒక్కటీ నాదగ్గర లేదు.
దాని ప్రసక్తి తీరుతూనే ..
యెక్కడ పారేస్తానో నాకే తెలియదు...

పైగా..
యేవేవో భావాలు ..
నా జీవితంలో యేంతో మందిని..
హెమవత్శిఖరాల వంటి వారిని చూచినాను...
వారు పేరూ ప్రఖ్యాతీ లేకుండా పోయినారు...!!
మనదేముందిలే అనే భావం. 
నన్నెప్పుడూ పీడిస్తూ వుంటుంది..

పైగా ..
లోన లొటారంగా..
కీర్తిని అనేక మార్గాల్లో..
కొనుక్కునే వాళ్ళను చూచి అసహ్యం 
వీళ్ళకు యేమి రాస్తే యేముందిలే 
అనే భావం ఇంకా యెన్నో..

16 మార్చి, 2012

రామాయణం నేనెందుకు రాసానంటే..??పుట్టపర్తి నారాయణాచార్యులు




రామ నామం ..
ఇప్పటికీ మనల్ని ఎలా ఉధ్ధరిస్తుందీ..??
తెలిసి కానీ..
తెలియక కానీ ..
ఒక్కసారి రామా అన్నారా ..??
లోపల ఉన్న పాప రాశి దగ్ధమైపోతుంది..

మ అమృత బీజం ..
మ అన్నప్పుడు..
 పెదవులు మూసుకుంటాయి ...
ఇంక పాపరాశి లోపలికి ప్రవేశించలేదు..

ర అగ్ని బీజం
" ఓం నమో నారాయణాయ.."
అనే అష్టాక్షరీ మహా మంత్రం లోని ప్రధాన బీజాక్షరం..
మ  పంచాక్షరీ మహా మంత్రం లోనిది..

రెండూ.. రెండు ..అధ్భుతమైన బీజాక్షరాలు..
శివ కేశవులని రెండులేవు ..
ఉన్నదొక్కటే పరబ్రహ్మ స్వరూపం.

ఎలా చూస్తే ..
అలా కనిపిస్తుంది..
ద్భావం ..తద్భవతి..!!

ఒక సారి ..
బ్రహ్మ స్వరూపం అర్థమైందనుకోండీ..
ఏమవుతుంది..??
అపారమైన ఆనందం కలుగుతుంది..

వాల్మీకి 24000శ్లోకాలలో..
 రామాయణాన్ని పూర్తి చేసారు ..
గాయత్రీమహా మంత్రం లోని..
ప్రతి వెయ్యి శ్లోకాలు..
ఒక్కొక్క బీజాక్షరానికి వ్యాఖ్యానం .
గాయత్రి మంత్రానికి ఒక ప్రత్యేకత ఉంది.
మిగిలిన మంత్రాలలో ..
ఒక బీజాక్షరం ఉంటుంది.

ఆ బీజాక్షరానికి..
ఒక ఋషి. 
ఒక దైవము.
గాయత్రీ మంత్రం అలా కాదు ..

24 అక్షరాలూ  బీజాక్షరాలే...
24 మంది ఋషులు.
అందుకనే ..
24000 శ్లోకాలలో రామాయణం వచ్చింది.


తులసీరామాయణాన్ని ..
పదమూడు సంవత్సరాలు..
దేక నిష్టతో పారాయణ చేసారు అయ్య..
 

పుణ్యక్షేత్రాలకు బస్సులో వెళ్ళి ..
దారి లో ..

ఎదురైన సాధువులను..
మొక్కుకుంటూ వెళ్ళటమే తప్ప...
 

ఎవరైనా ..
జేబులో పైసా లేకుండా..
సాధు సంతులను వెతుక్కుంటూ వెళ్ళ గలరా..
అదీ ఎందుకు ..??
ఎన్నో కోట్లు జపం చేసినా..

అధ్యాత్మిక మైన అనుభూతులు కలుగలేదని..
అది ఎన్ని సార్లు..

మళ్ళీ ..మళ్ళీ ..విన్నా..
మళ్ళీ ..కొత్త గానే వుంటుంది..!!

అయ్య అలా వెళ్ళారు..

పూర్తి ఇండియా అంతా తిరిగారు..
హిమాలయాలలో..
శివానంద సరస్వతులవారిని కలుసుకోవటం..
ఒక అపురూప మైన అనుభవం..!!

అసలు రామాణం రాసే ఉద్దేశం.. 
నాకెందుకేర్పడిందంటే..
నలభై ఎనిమిదీ ..
నలభై తొమ్మిదీ ..
అప్పుడు కొన్ని కోట్లు ..
జపం చేసుకున్న తరువాత కూడా 
నాకేమీ ఎక్స్ పీరియన్స్ కలగకపోవడంతో ..
నాకు జీవితంపై విరక్తి పుట్టి ..
సాధువులనూ ..
సన్యాసులనూ ..
వెతుక్కుంటూ ఇండియా అంతా తిరిగినాను.

ఆ ఊపులో ..
నేను హిమాలయాలలో..
కొంత కాలం ఉండడమూ..
శివానంద సరస్వతుల యొక్క అనుగ్రహమూ ..
నాపైన ప్రసరించడమూ జరిగింది. 
వారే ఇచ్చింది సరస్వతీ పుత్ర అన్న బిరుదు.

అంతకు ముందు ..
ఎప్పుడు ఎవరు బిరుదులిచ్చినా..
పెట్టుకొనే అలవాటు నాకు లేదు..
చాలా మంది..ఇచ్చినారు..
ఆ ప్రొద్దుటూరులో అభినవ కాళిదాసన్నారు 
నాచన సోముడన్నారు.
చాలా ..
ఆ గద్వాలలో ..
చాలా చిన్న వయసులోనే అభినవ పోతన.. అన్నారు. 

ఒక రూపాయ్ ఇస్తే ..
అపధ్ధం చెబుతాను నేను.. 
ఇటువంటివాణ్ణి ..
అభినవ పోతన.. అని ఎందుకంటావు..??
అని నమస్కారం పెట్టి వచ్చేసినాను. 
తరువాత బాపట్ల లో 
కవి సార్వభౌమ అని బిరుదు ఇచ్చినారు.
 వెనక్కే ఇచ్చేసినాను..

అయ్యా నేను బీదవాణ్ణి...
నాకు డబ్బు లేక ..మీ ఊరికి వచ్చినాను..
వెయ్యి రూపాయలు ఇచ్చినారు...
ఇంకో నూట పదహార్లు కలిపి ఇవ్వండి 
సంతోషపడతాను. 
కవి సార్వ భౌమ బిరుదు మీరే వెనక్కి తీసుకోండి..
 
సాధారణంగా..
ఎక్కడ బిరుదులిచ్చినప్పటికిన్నీ గూడా ..
ఒప్పుకునే మనస్తత్వం నాకు లేదు..
 నాకెందుకయ్యా.. కొత్త బిరుదు...
నేను పుట్టపర్తి నారాయణాచార్యులు ..
అంతే..

నేను అభినవ కాళిదాసూ కాదూ..
ఎవడూ కాదు.. 
కానీ ఆ శివానంద సరస్వతి ఇచ్చిన 
బిరుదు మాత్రం ఉంది. 
మరి వారు నిర్భంధించినారు. 

నేను కైలాసంలో ..
ప్రాణత్యాగం చేయవలెనని ..పోతూ ఉండినాను.
 ఆ గంగ ఒడ్డున శివానందులు 
అక్కడ ఉన్నారని నాకు తెలియదు. 
ఆయన పుస్తకాలు చదివినాను ..

నేనా గంగ ఒడ్డున నడిచి వెళ్ళే సన్నివేశం..
ఆయన ధ్యాన మందిరం ముంచీ ..
గడ్డకు వచ్చే సన్నివేశం ..
రెండూ ఒకేసారి జరిగాయి...!!
who are you..?
where are you going  ..?

అని ఆయన నన్నడిగినారు.

సరే..
నా కథ నేను చెప్పినాను..
లోపలికి పోదాం రమ్మన్నాడు.
కొంతకాలం తన దగ్గర ఉంచుకున్నాడు. ..
ఆయన అన్ని విద్యల లోనూ పరీక్షించినాడు...

అంటే ..
భాగవతమన్నాడు..
సంస్కృతమన్నాడు. ..
ఇతర భాషల్లో ..అన్నాడు..
సంగీతమన్నాడు..
నాట్యం వచ్చునా ..??
అన్నాడు ..
అన్నీ అడిగినాడు.. 
కొంతకాలం వారితో ఉన్నాను నేను
ఆయన సరస్వతీ పుత్ర అనే బిరుదిచ్చి..

నాయనా..
దీన్ని నువ్వు వాడుకోవలె ..
నామీద ఉన్న గౌరవంతో ..
 అని అన్నాడు. 
నువ్వు వెనక్కి పో ..
నీకింకా కొంత కర్మ శేషమున్నది...
 అంతా తృప్తిగా అనుభవించు ..
నువ్వు దేనికీ భయపడవద్దు. !!
నీది ఉత్తమమైన జన్మ. 
అని చెప్పి ఆయన వెనక్కు పంపించినాడు.
ఆయన పుస్తకాలన్నీ ఇచ్చి...
 
ఒకసారి ..
కాశీ నుంచీ ..లక్నోకు పోతూ ఉన్నాను. 
మన దగ్గరేముందీ.. 
టికెట్టా ..??బకెట్టా ..?
షష్టి పంచె కట్టుకోని పోతున్నాను. 
లోపలంతా జనం దిక్కులేనంతమంది ఉన్నారు. 
ఆ కడ్డీలు పట్టుకుని నిలబడున్నారు. 
పోతూ ఉంది ట్రెయిన్..

ఆ లోపల్నుంచీ.. ఎవరో ..
తులసీ రామాయణంలో ఒక లైన్ చెప్పినారు. అప్పుడారంభించినాను..
 
బిను సత్ సంగ వివేకనహోయీ--
రామకృపా బిను సులభనసోయీ..
సత్సంగతి ముదమంగలమూలా--
సోయి పరసిధ్ధి సత్ సాధన ఫూలా..
సరసు తరహి సత్ సంగతిపాయీ--
పారస పరసి కుధాత్ సుఖాయీ
బిదిబస సంగ సంగతి పరహీ--
ఫణమని సమ నిజగున్ అనుసరహీ..
అని అందుకున్నాను...
 
కౌన్ హై బాహర్ మహరాజ్..
అందర్ ఆయియే..
అందర్ ఆయియే ..మహరాజ్..
అన్నారెవరో..

ఒక బెంచీ నాకు ఖాళీ చేసి ఇచ్చినారు. 
తరువాత ..
పండ్లు పాలు ఇచ్చినారు...

ఆప్ ఇధర్ జానా హై ..అన్నారు ..
హమే తో హరిద్వార్ జానా హై..
 అన్నాను. .

టికెట్ హై ఆప్ కే పాస్ ..??
అన్నారు ..

హం బైరాగి ..అన్నాను. ..
అప్పుడు లక్నో నుంచీ టికెట్ తీసిచ్చినారు...!!

తరువాత ..
హరిద్వార్ వరకూ ..
కు రాజభోగం జరిగిందనమాట.. ..
నవ్వు.. 

ఓహో ..
తులసీ రామాయణమంటే..
ఉత్తర భారతంలో ..
అంత గౌరవముందన్నమాట..!!


ఇటువంటిది ..
తెలుగులో ఒకటి వస్తే బాగుంటుంది కదా.. !!
అనేటటువంటి సంకల్పం..
అప్పుడే పుట్టింది నాక

దువల్ల 
నేను రాసిన ..
జనప్రియ రామాయణం పైన..
తులసీ రామాయణం ఇన్ ఫ్లుయన్స్ ..
 ఒక్కటే కాదు... 
ఏకనాధ భాగవతం ఇన్ ఫ్లుయెన్స్ ఉన్నదీ ..
కబీరు సూక్తులూ ప్రతిఫలించినాయి. 
కంబ రామాయణం ఇన్ ఫ్లుయెన్స్  ఉన్నది..!!