10 మే, 2017

రాయల రాజభక్తి

krishnadevaraya childhood కోసం చిత్ర ఫలితం
రాజులకాలంలో 
రాజు కొడుకే మళ్ళీ పాలనాధికారాలు చేపట్టేవాడు..
చిన్నప్పటినుంచే గుర్రం స్వారీ.. ఖడ్గ చాలనం వంటి ఎన్నో విద్యలు నేర్పించేవారు
తండ్రిని చూసే పాలనాదక్షత రాజకీయపుటెత్తుగడలు ప్రజాపాలన మొదలైనవి ఫాలో అయిపోయ్యేవాళ్ళు

మరిప్పుడు ప్రజాస్వామ్యం
అయిదేళ్ళకోపారి ఎన్నికలు..
ప్రజలెన్నుకున్నవాడే నేత...
కానీ మనకలా అనిపిస్తుందా ..
కె సీ ఆర్ కొడుకే కాబోయే ముఖ్యమంత్రి..
చంద్రబాబు బాబే మనకు కాబోయే మరో బాబు..
పధ్ధతి మారింది కానీ అంతా సేం టు సేం..

 ప్రతిపక్షాన్ని ఎదుర్కొనడం తొక్కిపెట్టటం..రిగ్గింగ్ రెండుసంవత్సరాలముందే రాబోయే ఎన్నికలకు జనాల నెలా బుట్టలో పడేసుకోవాలి 
అనే అంశాలమీద తర్ఫీదునిప్పిస్తున్నారు..

మన సాహితీ సమరాంగణ సార్వభౌముడు రాయలవారు తన ఇరవయ్యవయేట రాజ్జాధికారాన్ని చేపట్టి
అంధ్ర భోజునిగా
కన్నడ రాజ్య రమా రమణునిగా
కీర్తించబడి..
గొప్ప రాజనీతిజ్ఞునిగా..సైనికాధికారి భుజబల సంపన్నుడు ఆర్థికవేత్త వ్యూహ నిపుణుడు..పట్టినపట్టు విడువనివాడు
అంతే కాదు
కవిపోషకుడు.. సాహితీ సమరాంగణ సార్వభౌముడు గా నుతింపబడ్డాడు..
మరి ఈయన తన వారసుణ్ణి తన తర్వాత రాజుగా చూసుకున్నాడా..
ఇందులో కొన్ని సందేహాలు
మనచరిత్ర అంతా యే పోర్చుగీసు వాడో.. 
లేకపోతే మనల్ని పాలించి పోయిన బ్రిటిషు వాడో చెబితే తెలుసుకోవలసిన దుస్థితి..

వాళ్ళలో ఒకడైన న్యూనిజ్ 
మన రాయల పాలనా వైభవాన్ని పరాయి దేశస్తుడైనా కళ్ళకు కట్టినట్టు చూపించాడు


1346 లోని యొక శాసనమిట్లున్నది..
'' మహామండలేశ్వర భాషగె రాయరగండ హిందూసురత్రాణ, శ్రీవీర అరియప్ప వడయరు బుక్కప్ప వడయరు రాజ్యపాలన్ చేస్తుండంగాను..''

తమిళములోనే మరియొకటి యిట్టిదే గలదు..
హరియప్ప బుక్కణ్ణ లిర్వురును జేరి 
తెక్కల్ నాడు లోని జనులకిచ్చిన యాజ్ఞాపత్రమది..

1386 లో గూడ 
హరిహర బుక్కల సమిష్టి పాలనము దెల్పు శాసనము గద్దు..
దేవరాయల సుతుడైన విజయ రాయుడును 
దండ్రి కాలముననే సహాయ సం రక్షకుడుగ నున్నట్లు శాసనములున్నవి..

అట్లే..
విజయరాయసుతుడైన రెండవ దేవరాయుడు గూడ
ఇతడు వీర విజయ రాయల సహాయ సమ్రక్షకుడుగ పనిజేసెను..

విరూపాక్ష రాయలును దన కుమారునితో గలసి రాజ్యపాలన మొనర్చినట్లు శాసనాధారములుగలవు..

ఇంతలో సాళువ నరసిమ్హుడు సిమ్హాసనము నాక్రమించెను..

కృష్ణదేవరాయలుగూడ దన కుమారుడైన తిరుమలునితో జేరి సమిష్టి పాలన మొనర్చెనేమో..
ఈ విషయమును ధ్రువపరచు 
1524 లోని యొక దాన శాసనము గలదు..

దానివిషయమిది.
'' తిమ్మరుసు 
గృష్ణదేవరాయల కాయురారోగ్యములు బ్రాప్తించుటకై.. గొన్ని పల్లెలపైని సుంకమును
 'మాగడీ లోని తిరువేంకటేశ్వరునకు సమర్పించెను..
ఈ సుంకములా దేవుని భూషణసేవకు..

తిమ్మణ్ణ ధన్నాయకుడను మరియొక యుద్యోగి తిరుమల రాయని నిరంతరాభివృధ్ధికి  
మరికొన్ని సుంకముల నా దేవునికే యొసగెను..

కృష్ణ దేవరాయడు దన కొడుకుతో జేరి పరిపాలనమును కొన్ని దినములు సాగించెనని
న్యూనిజ్ వ్రాతగూడ నున్నది..
పైశాసనమావ్రాతకు దోడ్పాటు..

కృష్ణదేవరాయల కుమారునిపేరేమో 
న్యూనిజ్ వ్రాయలేదు ..
తురుష్కులపై విజయమును సాధించిన తరువాత రాయలేమి చేసెనో యాతడిట్లు దెలిపెను.

'వృధ్ధాప్యమున దాను విశ్రాంతి గైకొనవలెనని 
రాయల యాశ.
తన యనంతరము
 గుమారుడు సిం హాసనము నెక్కి పరిపాలింపవలెనని వేరొక యాకాంక్ష.

ఈ రెండు కోరికలను సాధించికొనుటకు 
బూర్వ రంగమున దాను బ్రతికియుండగనే 
వానిని రాజుగ నొనర్చుటకు రాయలు సంకల్పించెను
అప్పటికి గుమారుని వయస్సు 
ఆరు సంవత్సరములు మాత్రమే..

తన యనంతరము పరిస్తితులెట్లుండునో యని యనుమానించి రాయలు గుమారునకు బట్టాభిషేకమొనర్చెను..
తన యధికారములన్నియు వానికి గట్టబెట్టినాడు..
సిం హాసనము నప్పగించెను..

తాను మహాప్రధానియైనాడు..
తిమ్మరుసు మహామంత్రికి సలహాదారుడు..

కృష్ణరాయల రాజభక్తి యెంతవరకు వచ్చెననగా..
సిం హాసనాధిష్టుడైన కుమారుని యెదుట 
నాతడే మోకరిల్లుచుండెనట..
పట్టాభిషేకమహోత్సవములు 
సుమారెనిమిదినెలలు సాగినవి..
ఈ వేడుకలలోనే .. 
చిన్నరాజుకు జబ్బువచ్చి మరణించెను..''

అదే న్యూనిజ్ మరియొక చోట 
''కృష్ణరాయ సుతుని వయస్సు పదునెనిమిది నెలలు మాత్రమే నన్నాడు అతని వ్రాతలలోననేక చోటులనిట్టి వ్యాఘాతములు దగులుచుండెను..''
అదీ సంగతి .. 
 రాచరికపు రాజకీయాలు .. 
సొంత తమ్ములు... సవితి తమ్ములు.. 
చిన్నాయన  పెదనాయన పిల్లలు.. 
చంపడాలు బందీలుగా చేసి మగ్గబెట్టడాలు .. 
ఎన్ని పన్నాగాలో.. 
అందులోనూ 

వారసులను కాపాడే రాజభక్తులు 
వేరేచోట పెంచి పెద్ద చేసి .. 
ఆఖరికి పుట్టుమచ్చలాంటి ఋజువు లు చూపి రాజును చేసేయడాలు  .. 
అన్నీ మనం సినిమాలలో చూసేసాం .. 
ఆ పసివానిముందు మోకరిల్లిన 
రాయల రాజభక్తి మన కట్టప్పనుపోలి లేదూ.. 


11 ఏప్రి, 2017

'రాస్కోరా సాంబా,,'


ఇంటికో వుద్యోగం .. పేదలకు ఇళ్ళు..
ఇరవైనా లుగ్గంటలూ విద్యుత్తూ..
వాగ్దానాల వరాలు ఎన్నికల సమయంలో నాయకుల నోట్లో పొంగి పొర్లుతుంటాయి
అందులో నెరవేరేవెన్నో ఎవ్వరికీ తెలియదు 
ఆఖరికి వాళ్ళకు కూడా
ఒక్కొక్క నాయకుడి ఆస్తులు మాత్రం అనూహ్యంగా పెరిగి పోతుంటాయి
పేదలు పేదలే ఎప్పటికైనా..

పొద్దున్నే పేపరు తెరిచినా టీవీ ఆన్ చేసినా 
ఒకటే వార్తల వరద..
అలంకానిపల్లె నుంచీ అమెరికా దాకా ఎక్కడ చీమ చిటుక్కుమన్నా మరునిమిషంలో 
అది breaking news
ఇవేవీ లేనికాలం ఎలా వుండేది..

బాహుబలి ..గౌతమిపుత్ర.. 
వీటివలన మళ్ళీ జనాల్లో ఆ గుర్రాలు ఆ డేరాలు ఆ యుధ్ధాలు మళ్ళీ గుర్తొచ్చాయి..

రాజు గుర్రం పై ఏ ఊరెళ్ళినా .. 
వెనకే వందమంది పరివారం
వాళ్ళలో  లేఖకులొకరు
రాజెక్కడికి పోయినా పుస్తకా లకెక్కించడమే వారిపని
మంతనాలు..  రాజకీయాలు ..దానాలు.. హెచ్చరికలు 
ఓహ్ ..
ఒకటేమిటి
లేఖకుడు అన్నీ ఎక్కించేవాడు రికార్డుల్లోకి 
'రాస్కోరా సాంబా,,' అంతే
రాజు కార్యక్రమాలన్నీ వారి డైరీల్లో నిక్షిపమై వుండేవి..
ప్రజలు రాజు దైవంశ సంభూతుడని నమ్మినా 
రాజు తోచినట్లు ప్రవర్తించేది వారు కాదట .. 
అందుకు కారణం . 
నైతిక ఆధ్యాత్మిక శక్తులు .. 
ఇప్పుడు లేనివే అవి.. 
పుట్టపర్తి విజయనగర సామాజిక చరిత్ర లో విషయాలివన్నీ .. 




''చక్రవర్తికి కూడ ప్రత్యేక విలేఖరులుందురు..

ఊరు వదలినప్పుడు చక్రవర్తి వీరిని వెంట బెట్టుకొని పోవును..
రాజేదేన మాటాడును..
వారు వెంటనే దస్త్రములకెక్కింతురు.. 
ఎవరెవరిని జూచినది
యే విషయముల చర్చించినది..
యే నిర్ణయమునకు వచ్చినది
సమస్తమును వారు వ్రాసి పెట్టుదురు..
ప్రభువిచ్చిన దానములను గూడ వారు గుర్తువేతురు..
వీరికా రాజ్యమున గొప్ప గౌరవము..
ప్రసక్తి వచ్చినపుడు వారు దమవ్రాతలలోనుండి ప్రభువునకు విషయములందింతురు..
ఏ యాజ్ఞ కాని ..
రా జు వ్రాసి యివ్వడు..
దానము గూడనంతే..
అతనిది మాట.. 
వీరిది వ్రాత..
మరి ప్రతిగ్రహీతకు గుర్తేమి..?? 
చక్రవర్తి యుంగరమునకు బ్రతికృతులు కొన్ని మహాప్రధాని కడనుండును..
నాతడొకదానిని లక్కపై ముద్రించి దానము గ్రహించిన వారి కొసగును..
అతనికంతే గురుతు..
దాన వివరములు పొత్తములలో నుండును..
మహామంత్రి రాజుమొహరుల నాధికర పత్రములపై వాడును.''

8 ఏప్రి, 2017

భగవంతుడెవనిపై మైత్రి పాటించునో..

భగవంతుడెవనిపైమైత్రి పాటించు
సత్కృపానిరతి  బ్రసన్నండగుచు 
నతనికి దమయంత ననుకూలమైయుండు 
సర్వభూతంబులు సమతబేర్చి
మహిదలపోయ నిమ్న ప్రదేశములకు
ననయంబుజేరు తోయముల పగిది..

భగవంతునిదయకు పాత్రమైన వాని దగ్గరికి అందరూ తమంతతామే అనుకూలభావంతో పల్లానికి పారే నీటి వలె చేరుకుంటారు.
(ధృవోపాఖ్యానము)


6 ఏప్రి, 2017

తడివోవని పూలసెజ్జ..

శ్రీరామ నవమి.. అమ్మకు చాలా ప్రియమైన పండుగ..అసలు అమ్మ ఆరాధ్య దైవం శ్రీరాముడే! (అయ్య అష్టాక్షరీ ఉపాసకులు) అమ్మ పాటల్లో యెక్కువ శ్రీరామాంకితాలే!మా అమ్మగారి భావాలన్నీ, కోమల భావ భరితాలు..., లలిత పద బంధ సౌరభ సమంచితాలు....మీరూ చదివి, విని అనుభూతిస్తారని నా ఆశ.  వాటిలో యీ పాట, యెక్కువ ప్రజాదరణ పొందింది ఆకాశవాణి ద్వారా!  (శ్రీరామ నవమి శుభ తరుణాన, మా అమ్మ పవిత్ర స్మృతిలో..మా మూడో అక్కయ్య. డా.పుట్టపర్తి తులజాదేవి, .నా చెల్లెలు శ్రీమతి పుట్టపర్తి అనూరాధ తో కలిసి యీ పాట మీకోసం)

రాముని సేవించెనూ, ప్రేమమ్మున సకల ప్రకృతి
 రాముని సేవించెనూ...

అడవుల త్రోవల జనగా, అడుగులు కందెడునోయని,
తడివోవని పూల సెజ్జ అడుగడుగున పరచిలతలు..

రాముని..

తోయజ మకరంద ధునీ తోయంబుల మెల్లగా,
తోయజాంబకుని  మృదుపద తోయంబుల కడిగి నదులు..

శ్రీ రాముని...

తారక రాముడు రాముడు కారడవుల పయనించగ,
పోరాములు మాని ప్రకృతి గారాములు నెరపీ...
శ్రీ రాముని...

రచన : శ్రీమతి పుట్టపర్తి కనకమ్మగారు
సంగీతం డా.మాడభూషి చిత్తరంజన్ గారు
భక్తి రంజనికోసం ఆకాశవాణి విజయవాడలో
ముందుగా గానం చేసినది: శ్రీ డీ.వీ.మోహన కృష్ణ (బాలమురళిగారి ప్రియ శిష్యుడు) బృందం
ఇప్పుడు వినయపూర్వక సమర్పణ : నాగపద్మిని

4 ఏప్రి, 2017

సిద్ధులో..సాధ్యులో..చెప్పరయ్య..


ఎవ్వరు మీరయ్య..యీ భవ్య రూపముల్ ,
గన్నుల కద్భుత క్రమమొనర్చె..,
దివిజులో ..భువిజులో ..దేవతా ప్రవరులో ..,
సిద్ధులో.. సాధ్యులో.. చెప్పరయ
(అజామీళోపొఖ్యానము)


మాఅమ్మ పుట్టపర్తి కనకవల్లి ఎన్నో కృతులు రచించారు..
అంతేకాదు అద్భుతమైన సంగీతపరిజ్ఞానం కలిగివుండడంతో
వానికిరాగాలుకూర్చడం..తానేపాడటం..
మాఅక్కచెల్లెళ్ళం..
మాఇంటికి వచ్చే శిష్యులు..
ఇరుగు పొరుగు వాళ్ళు..
అందరూ సంతోషంగా నేర్చుకొనేవారు..
మాఇంట్లో మాఅమ్మ రామాయణ పారాయణం చేసేది..
శనివారం పట్టాభిషేకం..
అందరూ అమ్మ పారాయణంఅయిందా..అయిందా అని మూడు నాలుగు తిరిగేవాళ్ళు పొద్దున్నుంచీ..
మద్యాహ్నం పన్నెండు పన్నెండున్నర అప్పుడు పట్టాభిషేకం మొదలవుతుంది.. కన్నుల పండుగగా..మూడువరకూ..
ఆరామయ్యపట్టాభిషేకం నిజంగా ఇలానే అయోధ్యలో జరిగిందా అన్నంత ఆనందంగా
మాఇంట్లో జరిగేది
అందరూ అమ్మ పాటలు..అయ్య పాటలు..
ఇంకా త్యాగయ్య అన్నమయ్య ..పాటలూ పాడి పాడి అందరూ ఆనందించేవారు..
మాఅమ్మ చేతి పులిహోర ప్రసాదం అందరికీ పంచిపెట్టే వాళ్ళం..
అప్పుడు మాకు ప్రతిశనివారం రామనవమే..