23 ఆగ, 2012

మీ తండ్రిని మించి పోయావయ్యా..




నీకు ..
మీ స్కూల్ లోని 
తెలుగు అధ్యాపకుడంటే 
అమిత మైన అభిమానం.. 
ఆరాధన..
 

ఆయన వలననే ..
తెలుగు సాహిత్యం లోని 
సొబగులు దర్శించగలిగావ్..
 
అంతే కాదు..
ఆయనలో ఒక గొప్ప నటుడున్నాడు..!
ఆయన  వేసే పౌరాణిక నాటకాలలోని 

అభినయానికి నీవు ముగ్ధుడివి..
 

ఆ తరువాత ..
నీ జీవితం ఎటెటో పయనించింది..
చిన్ననాట 

నీకేర్పడిన ఆ సాహిత్యాభిరుచి..
నిన్ను ఊరికే ఉండనివ్వలేదు..
ఆపై కొంత నీ పరిశ్రమా..

సాహిత్య రంగంలో నీకో గుర్తింపు నిచ్చింది.
 

అయిందా..
ఇప్పుడు నీకు అరవై..
ఓ కలెక్టరు కొడుకు..
సంఘంలో మంచి స్థానం..
 

అప్పుడు హఠాత్తుగా ..
ఒక సాహితీ మేరువును నీవు దర్శించావ్..
అతని ప్రతిభకు గల పలు పార్శ్వాలు గమనించి అచ్చెరువొందావ్..

నీకో ఆశ్చర్య కర మైన విషయం తెలిసింది..
ఆ సాహితీ మేరువు ఎవరో కాదు..
 చిన్ననాటి నీ తెలుగు అధ్యాపకుని కొడుకే..
నీ పరిస్థితి ఏవిటీ..
 

ఆశ్చర్యం ఆనందం ఉద్వేగం
బాబోయ్..
నీవు  మా గురుపుత్రుని వా ..?
అదిగో ఆ తేజస్సు ..
ఆ మేధస్సు నీ అడ్రసును చెప్పకనే చెబుతోంది..
ఈ సంగీత నాట్య కళాభిరుచి 

మీ నాయన నుంచే నీకొచ్చిందోయ్..
మీ నాన్న ఎంత గొప్ప వాడనుకున్నావ్..
అబ్బా.. అబ్బా.. అబ్బా..
ఆరోజుల్లో ..

ఆయనను చూసి మేం పులకించి పోయే వాళ్ళం..
ఇదీ  నీ పరిస్థితి..
 

అవునా..
ఇక్కడ..
ఆ నీవు..
ఎవరో కాదు..
పైడి లక్ష్మయ్య గారు..
వారి గురువులు 

శ్రీమాన్ పుట్టపర్తి శ్రీనివాసా చార్యులు గారు.
అంటే మా అయ్యగారి తండ్రి ..
మాకు తాత
గారు..

మా తాత గారి వద్ద విద్య నభ్యసించిన 

పైడి లక్ష్మయ్య గారు..
వారి గురించి తలుచుకొని పొంగిపోతారు.
మా తాతగారు 

పౌరాణిక పాత్రలు అద్భుతంగా పోషించే వారట..
పాండిత్యం.. సరేసరి..
 

1975 లలో 
వారి ప్రేమ సాగరం 
అయ్యనూ మమ్మల్నీ ముంచెత్తింది..
అయ్యను గతంలోకి లాక్కెళ్ళింది..
చదవండి మరి.



మా గురు పుత్రులు
పైడి లక్ష్మయ్య


"భావస్థిరాణి జననాంతర సౌహృదాని"
 అని మహాకవి కాళిదాసోక్తి. 
పూర్వ జన్మ సంస్కార ఫలముచే 
నీ జన్మలో నాశ్చర్య హేతుకమగు మేధాశక్తి 
అనన్య సామాన్య భక్తి. 
అగణ్య గద్య పద్య కావ్య రచనాసక్తి. 
సరస సంగీత సాహిత్య కళాభిరక్తి 
యోగీంద్ర సమ్హిత ప్రాపంచిక వ్యామోహ విరక్తి 
తదితర దివ్య భావోచిత సుగుణమణులు. 

తమకు తామే మనుజునికి లభ్యమగునని 
విజ్ఞుల విశ్వాసము. 
'శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే' అని కదా గీతా వాక్యము. 

ఒక వ్యక్తి విద్వత్కుటుంబం నుంచీ గానీ 
విత్తాధిపతియైన శ్రీమంతుని గృహమునగాని 
జన్మించి సర్వానుకూల వాతావరణమున 
శ్రేయస్కరముగ పెరిగి..
పెద్దవాడో ..మహా కవియో..
లేక పండితుడో.. లేక ఆగర్భ శ్రీమంతుడో..
లేక రాచఠీవి గలిగిన పరిపాలనా దక్షుడో అగుట..
అతని పూర్వ పుణ్య ఫలమని చెప్పక తప్పదు.
 
దాన ధర్మాది గుణములు 
పాండితీ ప్రతిభ శూరత్వము 
సహజముగ అలవడు గుణములే గాని 
ఒకరు నేర్పించిన 
లేక చూచి నేర్చుకొనునట్టి విద్యలు కావు 
అనుట లోకవిదితము. 

పద్మశ్రీ డా.పుట్టపర్తి నారాయణాచార్యుల వారిని గాంచినపుడెల్లను..
వారికి గల 
కూలంకష ప్రజ్ఞ బహుముఖ వైదుష్యము రసజ్ఞత స్మరించి నపుడెల్లను ..
వారి  పితృపాదులగు..
శ్రీమాన్ శ్రీనివాసా చార్యులవారు 
నా మనమున జ్ఞప్తికి వచ్చుచుందురు.
 
పూజ్యులు 
పండితాగ్రేసరులు 
శ్రీమాన్ శ్రీనివాసాచార్యులు 
నాకు పదునాల్గవయేట 
అనంతపుర మండలమందలి 
కల్యాణదుర్గము మాధ్యమిక పాఠశాల లో 
తెనుగు పండితులుగా నుండి గురువర్యులైరి. 

ఆంధ్ర సారస్వతములో 
నొకింత పరిచయము పాండిత్యమూ 
నాకీనాడు  లభించిందన్న 
వారు ఆనాడు 
నా హృదయ క్షేత్రమున నాటిన 
సారస్వత బీజమే కారణమనదగును 

అది అంకురించి 
చిగిర్చి 
చిన్న మొలకయై 
యావల 
శ్రీ ప్రయాగ వెంకట రామ శాస్త్రులవారి 
వాత్సల్య దోహదముచే మ్రానై 
ఈనాడు కొన్ని దృశ్య కావ్య ఫలములీయగల్గినది.

శ్రీ శ్రీనివాసాచార్యుల వారు 
అనవద్య హృద్య విద్యా విశారదులు 
అతులిత కవితా చాతురీ ధురీణులు 
సరస సంగీత కళా కోవిదులు 
నటకావతంసులు 
ఆంధ్ర నాటక పితామహుని 
"పాదుకా పట్టాభిషేకము"నాటక ప్రదర్శన లో 
వారు గావించు చుండిన 
దశరధ పాత్రాభినయము 
ప్రేక్షకులను కంట తడి పెట్టించుచుండెను..
 
శ్రీరాముడరణ్య వాసమునకేగు తరి ..
వారి అభినయ చాతురి వలన 
సభ్యుల హృదయములు కరిగి 
కంటినీరై కారుచుండ 
చేతి గుడ్డలను తడుపుచుండుట 
నేను కనులార గాంచిన విషయము. 

అదే రీతి 
"చిత్రనళీయము"లో 
"కలి" వేషము ధరించి 
రౌద్ర భయానక రసములతో 
పాత్ర పోషణ గావించి ప్రశంస లందుకొనుచుండిరి.

మహాకవి రసికుడు 
పురాణేతిహాస పారంగతులగు పౌరాణికులు వారు. 
వారి పురాణ ప్రసంగము 
పండిత పామరుల నమితముగ ఆకర్షించుచుండెను. 

కమ్మని కవితా చమత్కృతి గల పద్యములతో 
సరస వచనా వైఖరితో 
సభలలో చక్కగ ఉపన్యసించి 
సభ్యులను ముగ్ధులను గావించెడివారు. 


అట్టి విద్వత్కవివరేణ్యుని 
నటకాగ్రేసరుని పుత్రరత్నంబగు 
సరస్వతీపుత్ర శ్రీమాన్ 
పుట్టపర్తి నారాయణాచార్యుల వారు 
దిట్టమైన కవి. 
పండిత 
విమర్శక 
వాక్ప్రతిభావతంసుడగుటలో వింతయేమున్నది...? 'పుత్రాదిచ్చేత్ పరాజయం' అని కదా 
కవి తల్లజుడగు భారవి సూక్తి...!!
 
"పువ్వు పుట్టినతోడనే పొసగు తావి..!" 
అన్న రీతి నారాయణాచార్యులవారికి 
పిన్ననాటనే సారస్వతాభిరుచి కలిగినది 
వారి మాతృదేవత కడ 
ఆంధ్ర గీర్వాణ భాషల అభ్యసింపమొదలిడెను. 

ఇంతలో దురదృష్టవశమున 
మాతృవియోగము కలిగెను. 

కాని 
ఆనాడు పెనుగొండ సబ్ కలెక్టరుగ నుండిన 
శ్రీ పిట్ గారి సతీమణి పి ట్  దొరసాని 
ఆ బాలుని కుశాగ్రబుధ్ధికి అచ్చెరువొంది 
అనురాగముతో తనయొద్ద ఉంచుకొని 
ఆంగ్లేయభాష నేర్పించమొదలిడెను. 

ఆ బాలుడు 
షేక్స్పియర్ నాటకములను చదివి 
కంఠస్థము చేయుటయేగాక 
మిల్టన్ కావ్యములను కబళించి 
కొంత ఆంగ్లభాషాపాండిత్యము గడించెను. 

ఇది 
ఆ బాలుని జీవితములో 
నొక అద్భుత సంఘటన 
పదునాల్గవ యేటనే
కమ్మని కవితలల్లుట నేర్చుకొని 
మహోన్నత భావావేశముతో 
"పెనుగొండ లక్ష్మి"
 యను ఖండకావ్యమును రచించెను. 

ఆచార్యులవారు 
విద్వాన్ పరీక్షకు కూర్చున్నప్పుడు ఈ కావ్యము 
పఠనీయ గ్రంధముగా నిర్ణయింపబడినదనగా యాగ్రంధముయొక్క కవిత్వ పటిమ
ఎంతటిదో ఊహింపదగును.
 
తిరుపతి ప్రాచ్యభాషా కళాశాలయందు..
 విద్వాన్ పరీక్ష చదువుచు 
సంగీత సాహిత్య నాట్య కళల నభ్యసించెను 

ఆవల 
హిందీ.. మరాఠీ ..మళయాళ.. తమిళ.. మాదిగ.. బహుభాషలలో ప్రావీణ్యత గడించెను. 

భారత దేశమంతయూ పర్యటించి ..
హృషీకేశము చేరి..
 అచటి శివానందాశ్రమమున ..
ఆ యతీశ్వరులచే "సరస్వతీ పుత్ర" బిరుదము పొందెను. 

అరవిందాశ్రమమున 
ఫ్రెంచి ..గ్రీక్ ..లాటిన్..
భాషల పరిచయము సంపాదించెనని  
తెలియుచున్నది. 

దాదాపు 
నూటికి పైబడి గ్రంధములను 
వీరు రచించినట్లు తెలియుచున్నది. 
పాల్కురికి సోమనాధుని పండితారాధ్య చరిత్రమునుబోలి వీరు రచించిన 
"పండరీ భాగవతమ"ను ద్విపద కావ్యము అద్వితీయముగ రాజిల్లి 
వీరి కవితా ప్రతిభను 
ధారా శుధ్ధినీ 
భక్తి ప్రపత్తినీ 
చాటుచున్నది 

వీరు రచించి 
పలుతావుల గానం చేయుచున్న 
శివతాండవం 
వీరి సరస సంగీత సాహిత్య కళాభిజ్ఞతకు తార్కాణము. 

మరాఠీ భాషలో 
డా.కోశాంబిగారి భగవాన్ బుధ్ధ చరిత్రను 
తెలుగులో అనువదించుటయు 
గోపీచంద్ గారి రచనలను 
విశ్వనాధ వారి ఏకవీర నవలను 
మళయాళమున కనువదించుట 
వీరి మరాఠీ మళయాళ తెలుగు భాషలలో గల వైదుష్యమును చాటుచున్నది. 

వీరి మేఘదూత కావ్యము 
కవికుల గురువగు 
కాళిదాసు "మేఘదూతము"నకు దీటైనదని 
డా . దివాకర్ల వేంకటావధాని గారి  అభిప్రాయము. 

వీరు వీరి సతీమణి కనకమ్మ గారు కలిసి రచించిన "అగ్నివీణ" అను కవితా సంపుటి 
వీరి అర్ధాంగి యొక్క వైదుష్యమును తెలుపుచున్నది.
 
వివిధ భాషాభిజ్ఞులై 
వైష్ణవుడుగానుననూ
 శైవమును నిరసింపక 
సమతా భావము గాంచుచూ 
బహు గ్రంధ రచనా క్రియచే 
"మహాకవియని"  "వక్త" యని పేరు గొ ని 
రాయల సీమలో జనించిన 
రత్న రాజమై విరాజిల్లుట 
రాయలసీమకే కాదు 
ఆంధ్ర దేశమునకే కాదు 
భరత ఖండానికే 
ఒక శోభ గూర్చెడిదనదగును 
ఇది మనకెల్లరికి గర్వకారణము..!!

సరస్వతీపుత్ర పద్మశ్రీ డా. పుట్టపర్తి ని 
సన్మానించుటతో 
కవిలోకమునే 
సన్మానించినట్లు భావింపనగును..

వీరిని 
శ్రీ వేంకటాద్రి నిలయుడగు శ్రీనివాసుడు 
ఆయురారోగ్య భాగ్యములొసగి 
చిరకాలము వర్ధిల్లజేసి 
మరికొన్ని జ్ఞానప్రబోధములు 
లోకోపకారములగు సత్కావ్యముల రచింపజేయుగాక.!!

20 ఆగ, 2012

రవీంద్ర కవీంద్రుడా విను విను..




భావములో కలిగే ఒక పొంగు..
"భావములోనా బాహ్యమునందును.."
పాలకుండే లక్షణం పొంగు..
పొయ్యి పై పెట్టగానే పొంగుతుంది..

ఈశ్వరుని తలంపు రాగానే..
 ఇక్కడ ..ఓ ..పొంగు రావాలి..
 ఆ పొంగు తత్వ విచారణ తో వస్తుంది..!!

అది ఇదిలా లేదూ ..??




                      pluck this little flower

Pluck this little flower and take it, 
delay not! 
and drop into the dust..
I may not find a place in thy garland, 
but.. honour it  
with a touch of pain  from thy hand  
and pluck it.  
I fear lest the day end  
before I am aware, 
and the time of offering go by. 
Though its colour be not deep  
and its smell be faint,  
use this flower in thy service  
and pluck it while there is time.

                             

  ప్రార్థన.. 
పుట్టపర్తి వారి స్వేఛ్చా నువాదం  

గిల్లుకోవోయి .. మెల మెల్లగా చేయి జాచి ..!!
 
ఒరిగిపోతుందేమొ .. సురిగి పోతుందేమో...
పెరటి మంటలొరాలి..  పెటిలిపోతుందేమో..
కనులు విప్పని..  క్రొత్త కారు నవ్వుల పంట..!!
 
గిల్లుకోవోయి..  మెలమెల్లగా చెయిజాచి..!!
 
తావి లేదంటావు.. తొలిప్రాయమంటావు..
రేకుల్లొ ఒక వింత రంగు లేదంటావు..
రంగు రాజ్జాల కేమీ గాని ..నీకయ్యె
కుంగిపోతున్నాది.. కొదవడ్డ మనసుతో..
 
గిల్లుకోవోయి.. మెల మెల్లగా చేయి జాచి..!!
 
కోరలేదది.. నీదు హారమ్ములో  చోటు..
కురులలో జెక్కుమని సారెయడుగుటలేదు..
ధారబోసిన దాత్మ జీవంబు నీ సుధా..
ధార లొలికెడు.. ఒక్క మృదుకరస్పర్శకే..
 
గిల్లుకోవోయి.. మెలమెల్లగా చేయి జాచి..!!


18 ఆగ, 2012

పొత్తూరు వెంకటే శ్వర రావు గారూ అసలు విషయం చెప్పారండీ..

 







తన కవితా ప్రతిభకు 
విద్వత్తుకు మూలమని 
ఆయన విశ్వసించిన 
అష్టాక్షరి మంత్రోపాసన..
ఐహిక సంపదలను సంపాధించ లేక పోయింది.. 

ఆముష్మికమైన తన ముల్లెను మూటగట్టుకుని
ఆయన లోకాంతరాలకు వెళ్ళిపోయారు...
...............
...............

ఆముష్మిక మైన ముల్లె....
ఎంత మంచి మాట..!!

ఇది నిజంగా ..
లోకానికి అర్థమవుతుందా..????
రోజూ అష్టాక్షరి ఒక్క లక్ష చేయ గల శక్తి 
ఎవరిలోనైనా ఉందా..??

ఆనాడు త్యాగరాజు చేసారు..


ఈనాడు పుట్టపర్తి..

ద గ్రేట్ పుట్టపర్తి ..


మొదట కామియై..
తరువాత మోక్ష గామియైన పుండరీకుడనే 
మహా భక్తునికి..
పండరి నాధుడు దర్శనమిచ్చాడు..

నవ్యతరమైన యొక గాన స్రవంతి 
ఒకడు తలయూచు ..మరియొకడోసరించు..
వీణదే దోషమా ..?లేక వినెడి వారి 
తప్పిదమా ..? కాదు..భావ భేదములె సుమ్ము.!!

షాజీ..
పారశీక ప్రభావం వలన వ్రాసిన సాహిత్యం..
ఇందులో..
జహంగీర్ నూర్జహాన్ ల పాత్ర పోషణ అధ్భుతం..





12 ఆగ, 2012

చిననాటి మిత్రుడా..మననేస్తానికి మొదలెపుడు..?-విద్వాన్ విశ్వం..



విద్వాన్ విశ్వం..
ఆంధ్ర ప్రభ సంపాదకుడు
అసభ్యతలకు దూరంగా
అతి పవిత్రంగా..
తెలుగు వెలుగులను చూపే దివిటీ గా
ఆంధ్ర ప్రభ ప్రభలు..
జగమంతా విస్తరింపజేసాడు..
తన సారధ్యంలో ..

అసలు పేరు మీసర గండ విశ్వం..
1952 లలో..
ఆంధ్ర ప్రభలోని ..
మాణిక్య వీణా నిక్వణానికి పరవశించని
సాహితీ పిపాసి లేడు..
ఆ కాలంలో భారతి ఒక విలువైన పత్రిక
అందులో తమ రచనలు అచ్చవాలనే 
అందరి  కలలు ..

అలాంటి "భారతి" విశ్వం గారితో రచనలు 
అడిగి చేయించుకొనేదని ప్త్రతీతి..
పుట్టపర్తి వారిగురించీ ఎంతో వ్రాసారు విశ్వం గారు
ఇద్దరి మధ్యా ఎనలేని ప్రేమ.. మైత్రి..
అయ్య షష్టిపూర్తి సందర్భంగా వెలువడిన 
"సాహితీ విస్మేరం"లో ..
విశ్వం తన స్నేహితుని 
ఇలా అభినందించాడు.. 




                 మరో  అరువది తిరగనీ..
 
చిననాటి మిత్రుడా..
కలమున కంఠమ్మునను
కప్రపుం బలుకులు
దాచినవాడా.. చినవాడా..!!
మన నెయ్యపు తీయదనము
మఱువని వాడా..!!
 
అరువది గడచిన నేమీ..?
పరువము సన్నగిలనట్టి..
ప్రాయమువాడా..!
సరి.. సరి.. మరియొక యరువది
తిరుగుటకై సత్త్వమింత
తిరమగు గాతన్..!!
 
ఆనాటి జ్ఞాపకాలవి..
ఈనాటికి ముస
రి.. ముసరి..
ఇటునటులాయెన్..
ఏనాటి మాట..
మననేస్తానికి మొదలెపుడు..?
రాదు జ్ఞాపకమునకున్..
 
నన్ను "ఒరే.." అనుచుందువు ..
నిన్ను "ఒరే.." అందునేను..
నీ నా చెలిమిన్..
కన్నాకుగ కాపాడు
గదన్నా కాలమ్మె..
దాని కాద్యంతములా..?
 
మనకు గలమేమొ..
తుల్య భావములు కొన్ని..
మన మనో ధర్మములు సమమ్మే నేమొ..!!
కాక యుండిన నీ మైత్రి..
కదలకుండ..
నిన్ని ఏళ్ళెట్టు లుండు..??
నా నీ తపస్సు..

విద్వాన్ విశ్వం..

10 ఆగ, 2012

పుట్టపర్తి వారిపై చంద్ర శేఖర పరమాచార్యుల వారి పితృవాత్సల్యం






చంద్ర శేఖర పరమాచార్యుల వారికి 
పుట్టపర్తి వారిపట్ల అపారమైన ప్రేమ..
ఎప్పుడో ..
పుట్టపర్తి వారి తొమ్మిదేళ్ళ ప్రాయంలో..
 ఒకసారి వీరిద్దరు కలవడం జరిగింది..!
తమ ఊరికి దయచేసిన పరమాచార్యులను 
తండ్రి వెంట వెళ్లి దర్శించారు పుట్టపర్తి 

ఆనాటి ఆ బాలకుణ్ణి .. 

వీడు మహాప్రాజ్ఞుడౌతాడని ..
ఆనాడే వారు ఆశీర్వదించి చెప్పారట..
జరగలేదా..?


మళ్ళీ ..
నీ నలభయ్యయిదవయేట ..
ఆర్థికంగా నష్టపోతావన్నదీ వారే..
అక్షరాలా జరిగిందది..


చివరిది.. 
ఇంకా విచిత్రం..
 ''చివరి దశలో 
నీకు కృష్ణ దర్శనమవుతుందన్నది..!!''


అదీ  జరిగి..
మాయదారి కలికాలంలోనూ  భక్తపుంగవులుంటారనీ ..
వారికి పరమాత్మ సాక్షాత్కరిస్తాడనీ 
నిరూపించింది వారి ఆశీర్వాదం..



గురువులు వేసే ప్రశ్నలు 
చమత్కారంగా వుంటాయి
అందులో అవి పరంపరగా వస్తే ..
అందులో కూడా ఏదో రహస్యముంటుంది. 
ఒక ప్రశ్న వేస్తేనే ప్రమాదం
జవాబు చెప్పడం తేలికగా వుండదు.

ఒకసారి ఒకాయన దగ్గరకెళ్ళాను 
మహాపురుషుడతను
సభలో వుంటే ఎవరో వెళ్ళి చెప్పారు. 
రామాయణం చెప్పాడండీ 
భాగవతం చెప్పాడండీ 
ఇంద్రుడండీ చంద్రుడండీ..అని
యేవిటి చెప్పడం 
ఇంట్లో పుస్తకం చూసుకొచ్చి 
నాలుగు మాటలు చెప్పటమూ గొప్పేనా..
కానీ ఇదొక ప్రారబ్ధం..
రమ్మని సైగ చేసారు
మిమ్మల్నే అన్నారు.
ఆయనతో పరిచయమే లేదు..
నన్నెందుకు ఇలుస్తారు..
వెళ్ళాను రూములోకి
వెళ్ళగానే తలుపు వేసారు
గురువు వేసే ప్రశ్న సామాన్యం కాదు 
వెయ్యి టన్నుల బరువుంటుంది.
మీరెవరు..
అన్నారు
నేనేం జవాబు చెప్పను.
ఎవరో అయితే నేను ఫలానా అండీ 
నా ఉద్యోగం ఇదీ అనేవారు
కానీ నా ఉద్యోగానికీ పీఠాధిపతికీ యేం సంబంధం.
 నేనేం చెప్పాలి
విచిత్రం ఏంటంటే
నాకేం చెప్పాలో తెలీలేదు 
ఇన్ని ఉపన్యాసాలూ చెప్పేవానికి
మీరెవరంటే యేం చెప్తాం
నేను ఇంద్రియములు కాను 
మనస్సును కాను 
బుధ్ధిని కాను
శివానంద రూప శివోహం శివోహం 
అంటే నేర్చుకున్న నాలుగు ముక్కలూ
ఆహా అంతటి వాడివా
అని పరీక్ష పెడితే 
లేని పోని గొడవ 
అని వెయ్యి ఆలోచన లొచ్చి 
నిశ్శబ్దంగా నిలబడ్డాను.
నీ పేరేంటి అన్నారు
చెప్పాను
అది నీ పేరా నీ శరీరం పేరా..
ఆయన ఏ స్థాయిలో మాట్లాడుతున్నారో చూడండీ..
మూడో నంబరు ప్రమాద సూచిక పడిపోయింది.
నోరువిప్పి మాట్లాడేటప్పుడు జాగ్రత్త.
యోగ్యుడవని పిలిచాం 
జాగ్రత్తగా మాట్లాడాలి సుమా
భగవంతుని దయవలన 
వారి ఆశీస్సులతో బయటపడ్డాం 
అంతవరకూ చాలు.
శంకరాచార్యుల వారు 
భజగోవిందంలో కాశీలో ఒక బ్రాహ్మణుడిని 
అడ్డం పెట్టుకుని ఒక ప్రశ్న వేసారు..

కాతే కాన్తా కస్తే పుత్రః
సంసారోయమతీవ విచిత్రః .
కస్య త్వం కః కుత ఆయాతః
తత్త్వం చిన్తయ తదిహ భ్రాతః

నువ్వెవరు..?
మీ ఆవిడెవరు..?
మీ పిల్లలెవరు..?
నువ్వెక్కడినుంచొచ్చావ్..?
ఒకసారి కూచుని ఆలోచన చెయ్

అయిపోయిందంతే 
భయమేస్తుంది..
ఆఖరికి నేనెవరండీ 
అని ఎవరినో అడగడానికెళ్ళాలి..
ఒక మహానుభావుని అనుభవమిది ..

అల్లా వుంటాయి గురువుల ప్రశ్నలు..


వాగర్థా వివ సంపృక్తౌ 
వాగర్థ ప్రతిపత్తయే 
జగతః పితరౌ వందే 
పార్వతీ పరమేశ్వరౌ..

అని కవి కుల గురువు 
కాళిదాసు వర్ణను అనుసరించి 
ఈ శివతాండవ కావ్యంలో 
ఆచార్యుల వారు అర్థ నారీశ్వర తత్వాన్ని 
చక్కగా ఆవిష్కరించారు. 
అందుకే కంచి పరమాచార్యులు 
శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర పరమాచార్యుల వారు 
తమ నిత్య పారాయణలో భాగంగా 
శివతాండవం ను గ్రహించారు. 
ఎంతటి అదృష్టం ఆచార్యుల వారికి 
ఎంతటి గౌరవం కావ్యానికి కలిగిందో 
వింటేనే ఒళ్ళు పులకరిస్తుంది..

"సరసభారతి" గబ్బిట దుర్గా ప్రసాద్..


                           శ్రీ పుట్టపర్తి వా రితో 
            శ్రీ కంచి కామకోటి స్వామి విద్వద్గోష్టి..

ప్రొద్దుటూరులో ..
వైకుంఠ ఏకాదశి నాడు ..
(తే.23.121966) 
శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు ..
జగద్గురు శ్రీ చంద్రశేఖర పరమాచార్యుల వారికి
 శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులకూ ..
జరిగిన గోష్టిలోని విశేషాలను 
ఈ క్రింద ప్రకటిస్తున్నాము.
ఎడిటర్
ఆంధ్రప్రభ దినపత్రిక 12.1.1967

ఆనాడు ..
జగద్గురువులు ఉపన్యాసానంతరం 
పుట్టపర్తి వారిని 
తమ సన్నిధానానికి రావలసిందిగా కోరారు.
అప్పుడు ..
స్వామి వారికీ పుట్టపర్తి వారికీ 
అనేక విషయాలమీద చర్చలు జరిగినవి.

శ్రీవారు :   ప్రాకృత భాషలో నీవు చక్కగా 
                పరిశ్రమ చేసినావని విన్నాము.

పుట్టపర్తి :  తమ ఆశీర్వాదము వలన 
                 కొంత వరకు నిజమే..
                 బౌధ్ధ జైనమతముల పై శ్రధ్ధతో 
                 ప్రాకృత భాషలనవలోకింపవలసివచ్చెను 
                 పరిశ్రమ క్రమక్రమముగా 
                 ప్రత్యేక అభిరుచిగా మారినది.

శ్రీవారు :   బౌధ్ధ మతస్థులు  సంస్కృతమునంతగా
 
               గౌరవించరనుకొంటాము..                  

పుట్టపర్తి : చిత్తము 
                తమకు తెలియని విషయము లేదు 
                మీరేదోనన్నొక పదార్థముగా భావించి  
                ప్రశ్నించుచున్నారు. 
                సంస్కృతము దేవ భాషయని 
                 మనయందరి అభిప్రాయము..
                 దేవతలు 
                 అర్ధమాగధీ భాషలోమాట్లాడుదురని 
                 వారా భాషను శిఖరాగ్రములకెత్తినారు.

శ్రీవారు :    గాధాసప్తశతిని సంకలనము 

                చేసినది  హాలుడేకదా..             

పుట్టపర్తి : చిత్తము ..
                హాలుని కాలమున 
                ననేకమంది స్త్రీలు కూడ  
                గాధలను రచించుచుండిరి. 
                హాలుడు సంకలిత మొనర్చిన వానిలోను 
                సుమారు ఇరువది ముప్పది మంది 
                 స్త్రీల పేరులు వచ్చును. 
               ఆనాటి రమణీయ జీవితములను గురించి                    వారెన్నియో గాధలనల్లినారు.

శ్రీవారు :  కుంతల దేశమేదని నీ యభిప్రాయయు 
             (ఈ ప్రశ్న వేయుచు శ్రీవారు నవ్వినారు)

పుట్టపర్తి :  తమకు 

                తెలిసియే  అడుగుచున్నారు.                  
                కుంతల దేశమనగా 
               మన హంపీ ప్రాంతమే 
               కొంత మహారాష్ట్ర దేశమున గలసి యున్నది 
               ఆంధ్ర దేశమందలి రెడ్లు 
                మహారాష్ట్రులేమోనని నాయనుమానము...                 శాసనములలో క్రమముగా ..
                రాష్ట్ర కూట రట్ట రట్ట-రడ్డి రెడ్డి 
                ఇత్యాది ప్రయోగములు కనపడుచున్నవి.

శ్రీవారు.. : నీవు భాషా శాస్త్రమును 
               ఎందుకు అభ్యసించితివి.

పుట్టపర్తి : తిరువాంకూరులోని యుద్యోగమునకు 
                అది కావలసి వచ్చెను.

శ్రీవారు :  తమిళములో "జ్ఞ"
               అను అక్షరము శాసనములలో 
               ఎ న్ని రూపములెత్తినది

పుట్టపర్తి  : తమిళములోని "జ్ఞ" కారము 
                తెలుగులో "ళ-ర-డ" గా మారినట్లు 
                 కనబడుచున్నది. 
                 చోజ్ఞ శబ్దము 
                 తెనుగు శాసనములలో 
                 క్రమముగా చోళ, చోర , చోడ 
                 ఇత్యాది రూపములలో నున్నది 
                 తెనుగు చోడులు 
                 రేనాటి చోడులు మున్నటివారు.
శ్రీవారు :    నీ యగస్తీశ్వర సుప్రభాతములోని 
               "శేషశైల శిఖరాద్రివాసినః" 
                 అను శ్లోకము చెప్పుము

పుట్టపర్తి : "శేషశైల శిఖరాధివాసినః
                  కింకరాః పర్మవైష్ణవాపయం
                  తత్తధాపి శశిఖండశేఖరే
                  శాంకరే మహసిలీయతే మనః"

శ్రీవారు :    ఈ శ్లోకము చాల బాగున్నది ..
                 లీలాశుకుడుగూడనిట్లే
                 చెప్పుకున్నాడు.           
                 అతడు ద్వైతియై కృష్ణునుపాసించెను. 
                 నీవు వైష్ణవుడవై శివభక్తిని చేపట్టితివి. 
                 మీ మనస్తత్వములు చిత్రముగా వున్నవి.

పుట్టపర్తి : (నవ్వుతూ) 
               నేడు దైవము నందలి విశ్వాసమే 
                సన్నగిల్లి పోవుచున్నది. 
                ఈ స్థితిలో మరలా ..
                 అవాంతర భేదములతో బాధపడుట 
                 మంచిది కాదని నా విశ్వాసము  
                 మీ వంటి అవతార పురుషుల 
                 ఆదేశము కూడా అదే కదా..!!

శ్రీవారు :   నీవెన్ని భాషలలో పరిశ్రమ చేసితివి ?

పుట్టపర్తి :  పరిశ్రమమేమున్నది...? 
                తమ దయ వలన చదువుకున్నానంతే..
               పదునాలుగు భాషలలోనికి తొంగిచూచినాను.
               ఈ పరిశ్రమ వలన ..
               నేను సంపాదించినది అశాంతి మాత్రమే. 
               మేధస్సు బహు ముఖములుగా వ్యాపించి 
               లక్ష్యసిధ్ధి తప్పిపోవును.

శ్రీవారు :   నిజము .. నిజము.. 
                సంస్కృతములోని "య"కారమునకు 
               ప్రాకృతములో "జ" కారము వచ్చును కదా 
               ఈ సంప్రదాయము 
               వేదములలోనే వున్నది.      
               వేదములను వివిధ ప్రాంతముల వారు 
               వివిధముగా నుచ్చరింతురు. 
               అందుకే భిన్నాభిన్నముగా 
               ప్రాతిశాఖ్యలు పుట్టినవి.

పుట్టపర్తి : యేమో ..
               ఈ విషయము నా తలకు మించినది. 
               వైదిక విద్యలో నాకంత ప్రవేశము లేదు. 
               నాది మిడి మిడి జ్ఞానము. 
               ఏ విషయము నైన 
              నిర్ధారించి చెప్పగల మహాపురుషులు మీరు..

శ్రీవారు : నీ పరిశ్రమకు సంతోషపడినాము. 
             నీ యాధ్యాత్మిక దృష్టి గూర్చి..
             చాలా చోటుల విన్నాము..!!
             మేము భావించి..
             సత్యము తెలుసుకున్నాము..!
             నీ పై మా సంపూర్ణ అనుగ్రహమున్నది..
 
మరియు అనేక విషయములపై..
శ్రీవారికి పుట్టపర్తి వారికీ సంభాషణ జరిగినది. 
సామాజిక ..
నీతి ..
సామ్య వాదము కూడ..
చర్చలలో వచ్చినది. 

కామకోటి పీఠాధిపతులు 
పుట్టపర్తి వారిని మనసారా దీవించారు. 

అనంతరం 
పుట్టపర్తి వారికి సన్మానం జరిగింది. 
స్వామివారిచే 
పట్టు పీతాంబరము బహూకరింపబడింది.
శ్రీవారు 
నటరాజు నలంకరించుచుండిన శేష వస్త్రమది. 
ఆ శేషవస్త్రమొసగుట 
పెద్ద యనుగ్రహముగ 
విజ్ఞులు భావించుచున్నారు.
 
12.1.1967 ఆంధ్ర ప్రభ దినపత్రిక