8 జన, 2016

అదేమైనా ..బ్రహ్మ విద్యా ..


మా అయ్య రచనలు పబ్లిషర్ లు వేశారంట
ఎన్నో సార్లు ప్రచురించి బాగా బాగుపడినారంట..
రాసినాయన షష్టి పంచె తోనే మిగిలాడట..
అయ్యో నా రచనలు ఇంత ప్రాచుర్యం పొందాయి..
పబ్లిషర్లు నన్ను దోచేశారు 
అని తెగ ఇదయిపోయారట..
తానే శక్తిని కూడగట్టుకుని 
తెలియని విద్య ప్రదర్శించారట..
ఏమైంది..
ఇంటినిండా పుస్తకాలు గుట్టలు.. గుట్టలు. 
రాసే జ్ఞానం ఉన్న ఆయనకు
అమ్ముకునే జ్ఞానం లేదే..
ఏమైంది..
చెదలు ఆ పుస్తకాలు తిని జ్ఞానాన్ని పొందాయి

అయ్య కష్టించి.. కష్టించి..
సమాచారాన్ని సేకరించారట..
ఎంత బాగా రాశారు స్వామీ..
అవునురా.. 
కానీ దీన్ని బయటికి ఎట్లా తెచ్చేదిరా..
స్వామీ..
పోనీ .. నీవు తీసుకుని.. నీ పేరిట వేసుకోపోప్పా..
ఏమైంది..
చూసి ఇస్తామనీ..
ఎత్తి రాసి ఇస్తామని తీసుకున్న చిత్తు ప్రతులు పరాక్రాంతమైపోయాయి
ఆ జ్ఞాని .. అజ్ఞాని లా 
మళ్ళీ నిస్సహాయంగా ..

అయ్యో స్వామీ..
మమ్మల్ని అజ్ఞానులంటావే..
చదువుకున్న వాడినని బిర్రు కదా నీకు

చదువుకోవటం మాకు కష్టం
కానీ 
బ్రతక నేర్వటం నీకు వచ్చా .. 
రాదుకదా..
తూచ్..
నిన్ను ఓడించామోచ్..
ఈ విద్యను నువ్వీ జన్మకు నేర్వలేవు..
హహ్హ హ్హా..

7 జన, 2016

క్షమయా ధరిత్రీ..

క్షమయా ధరిత్రీ..
పై మాటలో ఎంత అర్థముందో మా అమ్మను చూస్తే.. తెలుస్తుంది.. ఎవరి అమ్మలైనా అంతే కదా..
ఒకపక్క మా అయ్యకు 
ఇల్లు పిల్లలూ సంసారం అంటూ బంధాలు ఏమీ లేవు..
ఆయనకు విశ్వమే ఒక సంసారం
మామూలు భర్తతో సంసారంలో అడుగుపెట్టిన స్త్రీ జీవితమే కొన్ని సంవత్సరాలు అగమ్యగోచరం
దానికి తోడు కళాభిరుచి కలిగిన భర్త తో నడక 
ఇంకింత సంక్లిష్టం..
మరి.. జీవితమే తపస్సుగా నడిచేవానితో ..??
పరుగులు పరుగులే..
ఎప్పుడు ఏ ఉపద్రవాన్ని తెస్తారో నని 
మా అమ్మ బిక్కు బిక్కు మంటూండేది
''పెద్దవాళ్ళెవరైనా అంతే అనూరాధా.. 
వారు ఒక చట్రంలో బంధింపబడరు '
అంది మంగళగిరి ప్రమీలాదేవి..
ఆమె రచయిత్రి ప్రొఫెసర్ 
ఎన్నో పుస్తకాలు రాసింది

ఇక మా అమ్మ స్తితిని అర్థం చేసుకోలేని మా అక్కయ్యలు చీరల కనీ.. మర్యాదలకనీ పంతాలు పోయేవారు..
ఇంకా పిల్లల మైన మా నుంచీ కూడా
 లెక్కలేనన్ని అగ్ని పరీక్షలు ఎదుర్కొంది మా అమ్మ
'అమ్మను బాధ పెట్టకూడదు..'
 అనే ఇంగితం లేని వయసు కదా.. అది..
మనకు 'డింగు 'మని జ్ఞానోదయం అయ్యి
 కంటికి కడివెడుగా కన్నీళ్ళు కార్చే సరికల్లా 
వాళ్ళు ఉస్సూరుమని గోడెక్కేస్తుంటారు..

6 జన, 2016

రామాయణం నిత్య దాహం



పాత్రలను ప్రవేశపెట్టటంలో గూడా వాల్మీకి గొప్ప చాతుర్యాన్ని చూపుతాడు..
శ్రీరామునికి పట్టాభిషేకం నిర్ణీతమైపోయింది..
అయోధ్యలో అలంకరణలు ఆరంభమైనాయి
అవన్నీ ఒక రాత్రిలో జరిగిన పనులు

మంధర కైకేయి దాసి
ఆమె పుట్టింటినుంచీవెంట వచ్చింది

ఆవిడ ఎందుకో బుధ్ధి పుట్టి.. 
చంద్ర సంకాశమైనప్రాసాదాన్ని అ ధి రో హిం చిం ది ..
అయోధ్యా నగర వీధులన్నీ ధగ ధగ లాడిపోతున్నాయి
హఠాత్తుగా యేమిటీ వేడుక 
మెకు చాలా ఆశ్చర్యం కలిగింది..

కౌసల్య దాసి ..
రాఘవునికి జ రిగేపట్టాభిషేకాన్నిగూర్చిసమాచారాన్నందిస్తుంది
'రేపుపుష్యమీ నక్షత్రంలో.. 
రాముడు యువరాజౌతాడన్నది'
ఈ మాటతో మంధర హృదయంలో నిప్పుపడ్డది..

వెంటనే సర సరా ప్రాసాదం దిగివచ్చింది..
ఆ సందర్భంలో వాల్మీకి ఒక మాట అంటాడు..'
'విదీర్యమాణా హర్షేణ..'

కౌసల్య దాసి సంతోషంతో పగలబడిపోతున్నదనుట
ఇక్కడ మంధరను గూర్చి 
అంతకు ముందు మనకేమీ తెలియదు
శాంత గంభీరమైన మహా  సముద్రంలో 
హఠాత్తుగా ఒక పెద్ద తిమింగలంలేచినట్లు 
మంధర లేచింది..
ఇతర కవి ఎవరైనా అయివుంటే 
మంధరను గూర్చిన సోది అంతా మనకు చెప్పి
తర్వాత మంధరను ప్రవేశ పెట్టి వుండేవాడు..''

శ్రీమద్వాల్మీకి ప్రణీత శ్రీమద్రామాయణ ము
అ యోధ్యాకాండము మొదటి సంపుటము
వ్యాఖ్యాత ; ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడు
శ్రీమద్రామాయ ణదర్శనము
ముందుమాట పుట్టపర్తి

29 డిసెం, 2015

శ్రీనివాస ప్రబంధం -2

శ్రీనివాస ప్రబంధం -2 
రచన సరస్వతీపుత్ర డా.పుట్టపర్తి నారాయణాచార్యులు
దీన్ని నాకందించిన చి.E.N.V.రవికి కృతజ్ఞతలతో..
పుట్టపర్తి ప్రియపుత్రిక పుట్టపర్తి అనూరాధ.



28 డిసెం, 2015

చలి .. లీలలు

వ్యాఖ్యను జోడించు

అమ్మ అయ్య మా మూడో బావ మురళీధర్ మా మూడో అక్కయ్య తులజ (ఈమె మా అయ్య సగం పుస్తకాలకుకుడి భుజం)  , కుర్చీల సందులో నేను,  మా సుబ్రహ్మణ్యం అన్నయ్య (అమ్మ శిష్యుడు+ కొడుకు) ,మా నాగ ,
పైకి పొతే పెద్దక్కయ్య, రెండో అక్కయ్య మధ్యలో మా అన్నయ్య అరవిందు, మా  పెద్ద బావ చిన్న బావ 
చలి పెరిగింది.. 
ఎక్కడ చూసినా దగ్గులూ జ్వరాలు
మేము నార్త్ లో వున్నప్పుడు 
జీరోల్లోకి పోయే చలికి చచ్చేదాన్ని
చలికి భయపడి హైదరాబాద్ కొస్తే 
 నా వెనకే వచ్చిందదీ..
కడపలో ఒకపొద్దన్నా స్వెట్టర్ వేసుకొని ఎరుగుదుమా..
హాయిగా చలికాలమైనా వానకాలమైనా ఎండకాలమైనా
మాకు ఒకటే వెదర్ ఎండలు.. వేడి
వెరీ ప్లెజంట్ కదా..
 I Love my cuddapah

మా అయ్యది ఉష్ణ శరీరం
 మా మిద్దిపైన బయలులో మంచమేసి 
పరుపు తెరా కడితే..
హాయిగా అడ్డపంచె అవతల పారేసి 
పసివాడిలా పండుకుంటారు..
అవతల ఇవతల మిద్దెల వాళ్ళు అలవాటు పడిపోయారు
'ఏమిటికి .. ఈ స్వామి ఇట్లా' అనే వాండ్లు లేరు
అయ్య ఉష్ణ శరీరానికి .. కడప ఎండలు ..
what a combination..

ఇక అయ్యకు జలుబు .. కాదు కాదు.. 
అయ్య మాటలో పడిశం పడితే .. 
అంతే సంగతులు.. 
వెంటనే మా అమ్మ మందుల సముదాయాలతో రెడీగా వుంటుంది
ఇంగ్లీషు ..ఆయుర్వేదం.. ఇంటివైద్యం..
(మా అత్తగారూ అంతే.. భలే ఓపికస్తురాలు
ఆరుగురినికన్నతల్లి మరి ఓపిక లేకుండా ఎలా వుంటుంది..
అసలు ఆడవాళ్ళకే అందరి భారాలను మోసే శక్తి ఎలా ఇచ్చాడో ఆ దేవుడు..)

పీల్చేవి.. నాకేవి.. లోపలికేసుకొనేవి పైన ధరించేవి..
ఓయమ్మ  .. 
మిరియాలు దంచి తమలపాకులో పెట్టి ఇచ్చేది
అయ్య బుగ్గన పెట్టుకుని రసం పీల్చేవారు
మిరియాల కాషాయం వుండ నే వుంది .. 

ఇంక ఆవిరి వైద్యం.. 
ఒక పెద్ద గిన్నె నిండా నీళ్ళు బాగా తెర్ల నివ్వాలి
ఇంకో పక్క ఇటుకలు ఎర్రగా కాల్చాలి
రెండూ రెడీ కాగానే అమ్మ అయ్యను 'రాండి' అని పిలుస్తుంది
అప్పుడు అయ్య వచ్చి భోజనాల గదిలో చాపపై కూర్చుంటారు
వేడినీళ్ళు తెచ్చి ముందు పెడుతుంది అమ్మ
రెండు మూడు దుప్పట్లు కలిపి అయ్య వీపు వెనక రెడీగా వుంచేది .. 
నేను చిన్నదాన్ని.. 
అయ్యను ఆసక్తిగా గమనించేదాన్ని 
నాలుగో తరగతి 
ఇంటర్ కొచ్చే సరికల్లా ఆ వైభోగం అంతా అయిపోయింది లెండి
అమ్మ పైకెళ్ళిపోయింది..

అప్పుడు వేడి వేడి ఇటుకఒకటి తెచ్చి 
వేడి నీళ్ళలో వేస్తుంది
నీళ్ళు 'సుయ్.. ' మంటూ పొంగుతాయి
అంతకుముందే నీళ్ళల్లో వేసిన అమృతాంజనం వాసన గుప్పుమంటుంది

వెంటనే అయ్య దుప్పటి కప్పుకొని ఆ ఆవిరిని రెండు నిమిషాలు పీలుస్తారు.
మళ్ళీ ఇంకో ఇటుక..
ఒక స్వెట్టరూ మంకీ క్యాపు ఎప్పుడూ తయారుగా వుండేవి
మంకీ క్యాపు లోని మా అయ్య ముఖం 
ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టుం ది 
ఇట్లా అయ్యకు పడిశం తగ్గేసరికి 
అమ్మ ఉపిరి పీల్చుకుంటుంది 
అసలు ఇంట్లో ఆడవాళ్లు వున్నారనే కదా 
ఈ మగవాళ్ళ  ధైర్యం .. 
ఆ .. 

మీలో ఎవరు కోటీశ్వరుడు..


23 డిసెం, 2015

అరణ్య రోదన





పుట్టపర్తి విజ్ఞాన సంపన్నులు ..  
అనేక భాషలు నేర్చా రు .. 
అనేక పుస్తకాలూ వ్రాసారు  .. 
అంతేకాదు 
ఎంత రాసారో అంతకు వంద వంతులు చదివారు .. 
ఆకాలంలో కేవలం పుస్తకాలు కొనటా నికే 
మద్రాసు వెళ్లేవార ట .. 

బస్సులో పుస్తకం చదువుతూ చదువుతూ 
జేబులో డబ్బు ఏ దొంగ తీసినా తెలియనంత మమేకమై 
పోయేంత పుస్తక ప్రియులు .. 

మా అమ్మ ఒక బనియన్ కుట్టింది . 
ముందు జేబు వుండేలా .. 
దాన్ని దొంగల బనియను అనేవాళ్ళం .. 

NTR గార్డెన్స్ లో బుక్ ఫెయిర్  జరుగుతూంది. 
మా అయ్య పుస్తకాలు అక్కడ వెలిసాయి. 
చాలా మంది సందర్శిస్తున్నారు.
 భావాలు పంచుకుంటున్నారు. 

ఈ సందర్భంగా 
కడప జిల్లా రచయితల సంఘం సమావేశాల్లో అధ్యక్షోపన్యాసం ఇస్తూ.. పుట్టపర్తి ఇచ్చిన సందేశం. 

ఈనాడు హైదరాబాద్ లో 
బుక్ ఫెయిర్ జరుగుతున్న సందర్భంలో 
ఆనాటి వారి భావాలను పొందుపరుస్తున్నాను.

ఆశ్చర్యమేమంటే .. 
ఆనాటి వారి భావాలు ఈనాటికీ  వర్తిస్తుండటం..
అంతేకాదు.. 
ఈనాటికీ అవి అత్యంతావశ్యమకమై వుండటం

ఎందుకంటే పరిస్థితులు 
ఆనాటికంటె ఈనాడు సాంఘీకంగా రాజకీయంగా 
దిగజారి ఉన్నాయి కాబట్టి..

చదవండి..


''ఆంగ్లము నుండి మనము ఇంకను అనేక పుస్తకము లను భాషాంతీకరించుకోవలసి వున్నది. 
ఇప్పటికిని కాల్డ్ వెల్ రచనలు కుడా పూర్తిగా తెలుగులోకి రాలేదు. 
ఏ విజ్ఞానము కావలసియున్నను 
మనము ఇంగ్లీషులోనికి పోవలసినదే.. 
హిందీ యభివృధ్ధి కూడనంతంతయే యున్నది. 

మన దేశంలో అనేక భాషలున్నవి. 
మనకు దగ్గరగానున్న భాషలు ఒక్కదానినైనను నేర్చుకొనుటమంచిది. 
అప్పుడీ భాషా భేషజములెన్నియో తగ్గును. 

''నీవు చెప్పిన సలహాలన్నియు బాగుగనే యున్నవి. 
ఈ పనులు చేయుటకు ధనమెక్కడనుంచి వచ్చును ? ''

ప్రశ్న బాగుగనే ఉన్నది.. 
ఉత్తరము గూడ సులభమే.
 ప్రభుత్వమునకు తక్కిన పనులకు ధనమెక్కడినుంచి వచ్చునో ఇదియును అక్కడనుండియే రావలయును. ఉన్నధనమంతయు దీనికే దోచిపెట్టమని 
నేను చెప్పుటలేదు. 
పెట్టగూడదు గూడ. 

కాని ఇదియు కూడ చేయవలసిన పనియేయని ప్రభుత్వము యొక్క దివ్య చిత్తమునకు వచ్చిన చాలును. ఎలక్షన్లకు కోట్ల కొలది వెచ్చించి 
ప్రజలకు ఎన్ని దురభ్యాసములు నేర్పుచున్నారో మీరెరుగనిది కాదు. 

ఈ సందర్భములో రాజకీయవాదులకు 
ఒక చిన్న సలహా.. 
వారు విందురో విన రో.. నాకు తెలియదు.. 
కాని మనము చెప్పవలెను గదా.. 
వారు కొంత చదువుకొనిన బాగుగా నుండునని 
నా విన్నపము. 
కళాకారులను మనుష్యులుగా గుర్తింపవలెనని నా విన్నపము. కాలమున నిలుచునవి రాజకీయములు కావు. విజ్ఞానమే..! కళలే.. !


పూర్వమిట్లుండలేదు. 
ఆనాడు రాజులూ రౌతులూ 
తమకున్నంతలో కళలనెంతయో పోషించినారు. రెడ్డిరాజులు సాహిత్యాదులకు చేసినసేవ సామాన్యమైనది కాదు. 
ప్రభుత్వమే గాదు ప్రజలు గూడ 
విజ్ఞాన విషయమై తమ ధనమును 
కొంత ఖర్చు పెట్టవలసియున్నది. 

వెర్రి వేడుకలకు .. త్రాగుడు మొదలగు దురభ్యాసములకు లెక్కలేనంత ఖర్చు పెట్టెదరు. 
సాహిత్యజ్ఞునకు కళాకారునకు ఒక బొట్టునివ్వరు. 

పూర్వమెన్ని విద్యలనో ప్రజలు పోషించినారు. 
తోలు బొమ్మలవాండ్లు, పగటివేషగాండ్లు. 
బుడు బుడక్కలవాండ్లు, బయలు నాటకం వారు నట్టుకాండ్రు, వీరందరూ ప్రజాభిమానులపై బ్రతికినవారు. 

పొరుగున నున్న రష్యా.. 
ఏ చిన్న కళనైనను చావనివ్వక రక్షించుకొనుచున్నది. ఆయా కళలలో పరిశోధనా భాగములే యేర్పరచినారు. మనకా దృష్టిలేదు. 
ఇది నేను ప్రజలకు ప్రభుత్వమునకు కూడ ఇచ్చు సలహా మహాజనులారా .. 
ఇవి నాకున్న భావములు .. 
వానిని మీముందుంచినాను. 
ఆ భావములు మీకు సరిపోకపోవచ్చు. 

మీరు వివేకవంతులు 
ఆలోచించుకొనగలిగినవారు .. 
నాకు మీరే ప్రమాణము.. ''