కల డంభోధి
గలండు గాలి
గల డాకాశంబునం గుంభినిన్
గల డ గ్నిన్
దిశలం
బగళ్ళ
నిశలన్
ఖద్యోత చంద్రాత్మలన్
గల డోంకారమునం ద్రిమూర్తుల ద్రిలింగ
వ్యక్తులం దంతటన్
గల డీశుండు గలండు దండ్రి !
వెదకంగా నేల యీ యా యెడన్.
అని ప్రహ్లాదుడు
హరి ఎక్కడెక్కడున్నాడో చెప్పాడు
నిజమే హరిని కొలిచేవారికి విగ్రహంలోనే కాక
ప్రతి ఫ్రేం లోనూ పరమాత్మ గోచరమవటంలో వింతేముంది
నిరంతరం అతని చింతనలో చేరువలో బ్రతికేవారికి
అలా కనిపించటంలో ఆశ్చర్యంలేదు
ప్రపంచం కనిపిస్తేనే వింత..
పుట్టుకతో గొప్ప హరిభక్తిని పొందిన ప్రహ్లాదుడు
తన నైజాన్ని మనకెలా వివరించగలడు
చిత్తాన్ని ఎలా అర్థంచేయించగలడు
మనకీ ప్రపంచమెంత నిజమో
అతనికి హరి అంత నిజం
కానీ ప్రహ్లాదుడు తన కొడుకులా మె లగి
రాక్షస రాజ్జాన్ని యేలాలని హిరణ్య కశిపుని కోరిక..
అందుకే..
ప్రహ్లాదుడు హరికై ఎంత వెంపర్లాడాడో
హిరణ్య కశిపుడూ తన కొడుకును
భౌతికంలోకి లాగడానికి అంతగానూ ప్రయత్నించాడు..
మనం పిల్లలు మాటవినకపోతే
గోడకుర్చీ వేయిస్తాం
అరచేయి చాపమని బెత్తంతో కొడతాం
పిల్లవాడి అరచేతులు వాతలు పడతాయి
వాడి కళ్ళలోంచీ నీళ్ళు ప్రవహిస్తాయి..
అంతే మన హృదయం ద్రవించి పోతుంది..
వాణ్ణి వెంటనే గుండెకు హత్తుకుని..
ఎందుకు నాన్నాచెప్పిన మాటవినవు..
అల్లరి చిల్లరిగా తిరగకురా..
బుధ్ధిగా చదువుకోరా అంటే వినవు.
అని మనం అన్నట్టుగా..
హిరణ్య కశిపుడూ ప్రహ్లాదుని శిక్షించాడు
ఎలా..
రాక్షస జన్మ కాబట్టి
శిక్షలూ అంత భయంకరంగానూ వుంటాయి..
ఏనుగులతో తొక్కించడం
మంటల్లో వేయించటం
పాములతో కరిపించటం..
నిజానికి అవి చేయించటం
హిరణ్య కశిపుని ఉద్దేశం కాదు
అక్కడిదాకా వెళ్ళాక
ఆ యేనుగులనూ పాములనూ చూసి భయపడనాన్నా ఇక నీవు చెప్పినట్లు వింటా నాన్నా
నన్ను పాములతో కరిపించవద్దు నాన్నా
అంటాడని అతని ఊహ..
చక్రిచింత లేని జన్మంబు జన్మమే?
తరళ సలిల బుద్భుదంబు గాక
విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుడే?
పాదయుగము తోడి పశువు గాక.
అంటూ రా నన్ను తొక్కు
నన్ను కరువు..
ఓ అగ్నీ నన్ను కాల్చేయ్
అని చేతులు జోడించి హరి ధ్యానం చేస్తూ
నిశ్చలంగా నిలబడ్డాడు..
హిరణ్య కశిపుడూ కుర్రాణ్ణి చదువులో వేశాడు
అక్కడా ఆ హరి ధ్యానమే..
పైగా అక్కడి రాక్షస బాలురకూ హరి భక్తిని నేరిపి వాళ్ళనీ చెడగొడుతున్నాడు..
'యేదీ చేతులు జోడించి
కళ్ళు మూసి
మనసునేకాగ్రం చేసి..
యీ నారాయణ మంత్రమనండీ..'
అన్నాడు..
పిల్లలందరూ
'ఓం నమో నారాయణాయ..'
అని అరుస్తూ మత్తెక్కి పోతున్నారు..
వెంటనే రాక్షస గురువులు చూసి
గుండెలు బాదుకొని
మళ్ళీ హిరణ్య కశిపుని దగ్గరికి తీసుకెళ్ళారు..
'ప్రభూ తమ చిరంజీవి..
చేస్తున్న నిర్వాకమిదీ అని.. '
'ఎందుకురా చదువుకోవూ
పక్కవాళ్ళనీ చెడగొడుతున్నావు 'అంటే
'అంబుజొదర దివ్య పాదారవింద
చింతనామృత పానవిశేష మత్త
చిత్త మేరీతి నితరంబు జేరనేర్చు
వినుతగుణశీల! మాటలు వేయునేల? '
'యేరా యెప్పుడు చూసినా హరీ హరీ
అంటావూ యెక్కడరా నీ హరి
రమ్మను ..
చూస్తాను'
హరి ఇక్కడున్నాడూ అనిచెప్పటానికి
హరి ఎక్కడ లేడు నాన్నా..
నాలోను మీలోనూ ఉన్నవాడు హరి కాడా..
అని హిరణ్య కశిపునికీ బదులి చ్చా డు ..
కోపం అవధులు దాటింది..
తననుంచీ తన కొడుకును దూరంచేస్తున్న
ఆ హరిని చూడాలనుకున్నాడు
పైగా తమ రాక్షస జాతికి ఆ నారాయణుడు చేస్తున్న ద్రోహం నరాలనుడికిస్తోంది..
నిలువెల్లా కంపిస్తూ..
ఆ హరిని రమ్మను యీ రోజు అటో ఇటో తేలిపోవాలి
వాడు రాక్షస జాతికి చేస్తున్న అన్యాయాలు చాలక
నాకొడుకునూ లోబరుచుకుంటాడా..
ఆహరిని వదలనివ్వాళ.. అంటూ విపరీతమైన కోపంతో ..
చెప్పు ఇందులో ఉన్నాడా..
అందులో ఉన్నాడా
యీ స్థంభంలో ఉన్నాడా..
చెప్పరా చెప్పు..
అని గదనెత్తి స్థంభాన్ని దెబ్బ కొట్టాడు
అంతే..
హరి ఉగ్ర నారసిం హునిగా ఉద్భవించి..
హిరణ్య కశిపుని చీల్చి చెండాడి
పేగులు నరాలు మెడను ధరించి ..
ఇంకా ఆగ్రహం తీరక..
ఊగిపోతున్న నారాయణుని శాంతింపజేయటానికి
పరమ శివుడు సమస్త దేవతలూ
తరలి వచ్చి స్తుతించారు..
హిరణ్యకశపున్ని సంహరించిన
నరసింహస్వామి బలాన్ని చూసి దేవతలు
‘ఆహాబల’ అన్న ప్రదేశం
ఇప్పుడు అహోబిలంగా మారింది.
కృత యుగంలో స్వామి
ఇక్కడ అవతారం ఎత్తాడని చెబుతారు.
నరసింహ స్వామిని
త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు,
ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు దర్శించుకున్నారని
చరిత్ర చెబుతోంది.
కలియుగంలో వెంకటేశ్వరస్వామి కూడా
స్వామివారిని దర్శించుకున్నట్లు
చారిత్రక సాక్ష్యా లున్నాయి.
అటువంటి మహిమాన్వితమైన అహోబిల క్షేత్రంలో
దర్శనానికై భక్తులు క్యూలో నిలబడ్డారు
నెమ్మదిగా క్యూ ముందుకు కదులుతూంది
అహోబిల నారసిం హుని దర్శనం కోసం
క్యూలో నిలబడ్డారు పుట్టపర్తి కూ డా
వారి కప్పుడు నలభై సంవత్సరాలు ఉండవచ్చు
నిరంతరం నారాయణ చింతనలో మసలి ఇపోతున్న పుట్టపర్తికి కావలసిందేమిటి
చదువా
కీర్తా
ధనమా..
లేక
ప్రహ్లాదుని ఆదరించిన హరి ఒడా..
యెవరో పుట్టపర్తిని చూసి
'నీవు పుట్టపర్తి శ్రీనివాసాచార్యుల కుమారుడివి కదూ.. '' అని అడిగారు
అవును..
''ఎంత గొప్పదయ్యా మీ వంశం ,,
శ్రీకృష్ణ దేవ రాయల గురు పాదు లైన
శ్రీ తిరుమల తాతాచార్యుల గారి వంశం … . ''
అంటూ ఆయన
పుట్టపర్తి వంశాన్నీ
తండ్రి తాతలనూ కాసేపు పొగడి నిష్క్రమించాడు..
కృష్ణదేవరాయల రాజగురువు
తిరుమల తాతాచార్యుల వంశం వారిది.
తాతాచార్యులు గొప్ప శాస్త్ర పండితుడు.
'మాది తిరుమల తాతాచార్యుల వం శం రా .. '
అని అన్నప్పుడల్లా
పుట్టపర్తి ముఖం లో.. కళ్ళలో ..
ఒక విం తైన కాంతి..
సాహితీ సమరాంగణ సార్వభౌముని కొలువు కూటాన సార్వభౌముని గురువుగా
రాయల కంటే ఎత్తైన పీఠాన్ని అధిరోహిస్తూ
ఉన్నతోన్నత గౌరవాన్ని అందుకునే
తాతాచార్యులవారి ఆజ్ఞ శిలాశాసనంగా జరిగేది..
పుట్టపర్తి మనసులో సన్నని బాధ
అంతటి గొప్పవంశంలో నావంటి నీచుడు..
హోటల్లో తినే అప్రాచ్యుడు పుట్టాడే అని..
(జీవితం అనుభవాలు లత మాసపత్రిక నుంచీ )
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి