22 డిసెం, 2011

ముగ్ధ పూజ





"మనసు మెదలదు..గన్నులు గనవు.., పలుకు
బయలుదేరదు..ఉపచార వాక్యములకు..
ప్రభలు చల్లు నివాత దీపంబు నీవు...
మోహనంబైన యొక్క ముగ్ధ పూజ నాది.."

అయ్యది ఉష్ణ శరీరం ..
అయ్యకు తలపై దండిగా నూనె పెట్టి 
బాగా మర్దన చేయాలి..
భృంగామలక తైలం ..
అరి కాళ్ళకు .. 
అర చేతులకూ..
మొత్తం వళ్ళంతా బాగా మాలిష్ చేసేవాళ్ళం 
మా అక్క చెల్లెళ్ళందరం..
మొదట్లో అమ్మ చేసేదనుకుంటా..

ఓ నాలగైదు గంటలు నాని 
తరువాత స్నానం చేసేవారు అయ్య..
 
ఇలానే ఒకరోజు 
అయ్య తలనిండా నూనే పెట్టుకొని కుర్చీలో కూర్చున్నారు..
తులసీ రామాయణాన్ని చదువుతున్నారు..
అది పారాయణ కాదు 
కంఠస్ఠం చేయటం..

ఇంతలో  వీధిలో 
ఒక బిచ్చగాడు నిలబడ్డాడట
అయ్యను చూశాడు ..
నెత్తిమీద నూనె పెట్టుకొని..
స్నానం చేయకుండా..
 అలానేనా రామాయణాన్ని చదివేది..?


  వచ్చిన వాడు బిక్ష అడగకుండా..
ఇలా మాట్లాడేసరికి..
అయ్యకు కోపమొచ్చింది..
అసలే అయ్యకు విపరీతమైన కోపం 
 

వాడలా అడిగే సరికి 
అగ్గిమీద గుగ్గిలం అయిపోయారు..

 

వాడిని నీ అమ్మ కడుపు కాలా ..
ఏరిగితే  కడుక్కునేదానికి రాని నీవు.. ..
నాకు చెప్తావా.. ఫో రా.. ఫో .. 
అని శివతాండవం చేసారు..

 
ఏదో ..
ఒకటో.. రెండో గంటలు 
దేవుని ముందు కూర్చుని 
పూజ అయిందనిపించేవానికి నిబంధనలు గానీ..

ఇరవై నాలుగ్గంటలూ ..
ఆ రాముణ్ణీ.. 
ఆ కృష్ణుణ్ణీ ..
పట్టుకు పాకులాడే వానికి స్నానమేమిటీ..? పానమేమిటీ..?
అదీ అయ్య భావన..

ఏమైందని అమ్మ వచ్చి విచారించింది..
అయ్యకు ఎదురు చెప్పే సాహసం 
అమ్మకు ఎక్కడిది..?

 ఎందరో సాధు సంతులను ..
కలసి వారి తత్వాన్ని 
నిరంతరం మననం చేసే అయ్య..

వచ్చిన వాడు ..
ఏ సాధకుడో.. 
లేక సాక్షాత్తూ ఆ శ్రీ రామ చంద్రుడో..
లేక ఆయన సేవకుడు హనుమంతుడో..
అయ్య మనసులో .
.

అంతే..
చిన్న టవలు కట్టుకుని .. 
నూనె కారుతున్న ఆ అవతారం తోనే ..
పరుగు పరుగున వీధులన్నీ వెతికారు..
అతని కోసం..
ఇంట్లో పిల్లలూ .. 
శిష్యులూ .. 
బాణాల్లా కదిలారు..
రామచంద్రుని వెదకడానికి..
 
ఊహూ..
ఎ..ఖ్ఖడా ..కనపడలేదు..
ఇల్లిల్లూ అడుక్కునే వాడయితే 
నాలుగిళ్ళ అవతలో .. 
లేదా పక్క వీధిలోనో దొరకాలి..
కానీ ఇతనలా దొరక లేదే..
ఇతనే శ్రీ రామ చంద్రుడేమో..?                   
లేదు ..లేదు.. 
ఆంజనేయ స్వామి అయివుంటాడు..
 
ఇక పశ్చాత్తాపం ..
అంతులేని ఆత్మ పరిశీలన..
ఈ విధమైన దాగుడు మూతలు 
అయ్యకు దేవునికీ చాలాసార్లే జరిగాయి..

భగవంతుడూ .. 
భాగవతమూ.. 
భక్తుడూ ఒక్కటేరా.. 
అని తన శిష్యునికి భాగవత సారాన్ని వివరిస్తూ..
శ్రీనివాసా ..
అని ఆఖరిమాటగా కన్ను మూసిన అయ్యకు..

అయ్య జీవితపు ఆఖరి క్షణంలో 
జాలిపడి ఆ పరమాత్మ 
అయ్యకు సాక్షాత్కరించి 
పసిపిల్లాడిలా అక్కున చేర్చుకున్నాడని  
అనుకుందాం..

                                

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి