29 జన, 2012



నాకు స్ఫూర్తి నిచ్చిన సంఘటనలు..
మా ఇంట్లోనే వుండేవి...
నన్ను కన్నతల్లి..
లక్ష్మీ దేవి ఆమె పేరు. 
నేను అనంతపురానికి ఏడు మైళ్ళ దూరంలో ఉండే.. 
చియ్యేడు..
అనే ఊర్లో పుట్టినాను. 
మా మాతా మహులంతా కూడా కాశీ పండితులు. 

మా పెద్ద తాత గారు కొండమాచార్యులవారు. 
వివాహానికి ముందే ..
మా తల్లి ఆయన కాశీ పండితులైనందువల్ల..
ఆయన దగ్గర సంస్కృతం చక్కగ నేర్చుకుంది. 
మంచి పాండిత్యం కూడా ఉండేదామెకు. 
కానీ నాకు ఐదవ సంవత్సరంలోనే ..
మా తల్లి చనిపోయింది. 

మా నాన్న గారు మైసూరులో..
కృష్ణ బ్రహ్మతంత్ర పరకాల స్వామి దగ్గర..
సంస్కృతం చదువుకున్నారు. 

అప్పట్లో వారితో పాటు చదువుకున్న వారు..
రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు ..
రాళ్ళపల్లి గోపాల కృష్ణ శర్మ గారు..
మరికొందరు.. ఉండే వారు.
మా అమ్మ మరణించిన సుమారు పదునాలుగేండ్లకు..
మా తండ్రిగారు రెండవ వివాహం చేసుకున్నారు. 
ఆమెది మైసూరు..
సంగీతంలో చక్కటి సాధన చేసిన మనిషామె.

మా నాయన పరమ సాహిత్యప్రియులు. 
ఆయనది చాలా రసికమైన జీవితం 
మా ఇంట్లో ..
నిరంతరమూ సాహితీ చర్చలు జరుగుతూ ఉండేవి. 
వాటినన్నిటినీ కూడా చాలా శ్రధ్ధగా గమనిస్తూ ఉండేవాడిని. 

పైగా చిన్నప్పుడు నాకు ..
సంస్కృతమూ ..
తెలుగూ ..
తెలుగు ప్రబంధాలూ..
మా నాన్నగారే చెప్పారు..

ఈ రీతిగా ..
ఆయన సాహితీ జీవితం..
మా ఇంట్లో నిరంతరమూ జరుగుతూ ఉండేటటువంటి సాహిత్య సంగీత గోష్టులూ..
ఇవన్నీ నాకు బ్రహ్మండంగా స్ఫోరకాలైనాయి ..
చిన్నప్పుడు..
అప్పుడు నేను థర్డ్ ఫారం చదువుతూ ఉండేవాడిని.

నాకు ఒక చెక్క పెట్టె ఉండేది. ..
ఆ పెట్టెకు పక్కలో కూచొని ..
అల కవితా లోకమునకు ..
అనే కంద పద్యం మొదలు పెట్టినాను. 
మా నాయనగారు కాఫీ తాగి.. గడ్డకొచ్చి ..
నేను ఏదో మూడీగా..
ఆ లోచిస్తూ ఉండడం ..
గమనించారు. 
దూరం నుంచీ దగ్గరకొచ్చి..
ఏం రాస్తున్నావు ..?
అని ఆ పేపరు తీసుకున్నారు. 
అల కవితాలోకమునకు..
అని ఫస్ట్ లైన్ రాసినాను..
చాతకాని వాడివి..
పద్యం ఎందుకు ఆరంబించావురా ..
అని ..
కలిమికి వైరంబదేమి కలిగెను చెపుడా ..
కలికాల మహిమ ..
సద్గుణ కవికుల నృప సింహములకు  కనకుండుటయే రాసుకో  ..
అన్నారు..

ఇట్లా.. 
ఆయన ఆసువు మహా సులభంగా చెప్పేవాడు. 

కాఫీ తాగేవాడు. ..
సురలోకంబున కమృతము..
నరలోకమ్మునకు కాఫి..
..........
ఎరుగక కాఫీని తిట్టుటే ..మది నేర్పో ..
ఇట్లా.. 
(నవ్వు..)
మాట్లాడితే పద్యం చెప్పేటటువంటి ధోరణి ..
ఆయనకు ఉండేది. 

ఇది ఆయనపై తిక్కన కవితా ప్రభావమని..
నేను అనుకుంటాను. 
వీళ్ళంతా తిక్కన భక్తులు...
కట్టమంచి రామలింగా రెడ్డి ..
రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ..
మా నాయనా ..

ఇలా..
మా నాయన గారికి ..
దాదాపు..
పదహైదు పర్వాలు నోటికి వచ్చు ..
అందువల్ల ..
ఆ ఆశు కవితా ధోరణి ..

తిక్కన ప్రభావం వల్ల ..
ఆ ఆశుకవితా ధోరణి అలవాటు పడిందేమో నని..
నా ఊహ ..
ఇట్లా ప్రతిదినమూ ..అడుగడుగునా..
మా ఇంట్లో ..                                  
ఈ సాహిత్య గోష్టులు ..
సంగీత గోష్టులూ..
జరుగుతూనే ఉండేవి ..
స్కూలుకు పోవడానికి పదిగంటల వరకూ..
రోజూ ఇదే చర్చ ..
ఇదంతా చాలా నిశితంగా గమనించేవాణ్ణి నేను. 

సాయంకాలం స్కూల్ నుంచీ వస్తూనే..
మళ్ళీ పదిమందీ చేరడమూ..
మళ్ళీ ఇదే చర్చ. 
నేను రాసే ప్రతి పద్యమూ కూడా ..
ఆయన నాకు తెలీకుండా చూస్తూ ఉండేవాడు.
అయినా..
ఆయన నా గూర్చి ఒక గొప్ప మాట చెప్పలేదు. 

నేను పెద్ద వాణ్ణయిన తరువాత గూడా..
నేనెక్కడైనా ఉపన్యాసాలిస్తూ ఉంటే..
ఆయన నాకు కనబడకుండా..
నలుగురిలో..
ఎక్కడో ..
అప్రత్యక్ష్యంగా ..
వినిపోతూ ఉండేవాడు. 


ఎవరైనా ఏం స్వామీ..
మీ కొడుకును గురించి ..ఒక్క మాట చెప్పరే?
అంటే ..
తండ్రి కొడుకు గురించి గొప్ప మాట చెప్పటం..
వాడికి ఆయుష్కరం కాదప్పా..!
అని చెప్పేటటువంటి వాడాయన..
అందువల్ల ..
నాకు సాహిత్యంలో ప్రవేశించడానికి..
ప్రబోధకమైన శక్తి మా నాయన. 
వాతావరణం మా ఇంట్లోనే ఏర్పడింది.
పైగా ..
నన్ను కన్నతల్లి ..
మా నాయన..
ఇద్దరూ కవిత్వంలోనే మాట్లాడుకోవడమూ ..
పద్యాలూ..                                      
శ్లోకాలలో ..
జాబులు రాసుకోవడమూ ..
కూడా చేసే వారు. 
నన్ను గురించి ..
మా అమ్మ ఒక పద్యం జాబులో రాసింది.

నీలాల కనులలో..
నిల్వ నుత్సాహంబు..
బుడి..బుడి..నడల..
నల్లెడల బాకు..
పట్టుకొమ్మని..
వెంటబడి పట్టబోవంగ..
యెత్తుకొమ్మని ..
చేతులెత్తు పైకి..
కురులు ఫాలస్థలంబున గునిసియాడ..
కాళ్ళ గజ్జెలు ఘల్లు ఘల్లు మనగ..
తాను నర్తించు..
ధయి..ధయ్యి..ధయ్యి..మనుచు..
చిన్న పాపడు సుఖముగనున్నవాడు..

27 జన, 2012

 
ఏ రచయిత అయినా ..
తన కాలానికి సంబంధించిన సమస్యలకే..
ప్రతిస్పందించి రచన చేస్తాడు కదా ..!
అటువంటప్పుడు..
ఆ రచనకి శాశ్వత కాలం నిలిచే శక్తి ఎలా వస్తుంది. 

జరిగే ప్రతి సన్నివేశానికీ ..
కవి హృదయం స్పందిస్తుంది. 
సందేహం లేదు ..


కానీ ..
ప్రతి స్పందనకూ ..
కావ్యత్వం యిస్తే ..
వాని స్పందన..
మనసులో ఎంతకాలం పని చేసిందో..
అంత కాలమే..
ఆ కావ్యానికి కూడా ఆయుష్షు వుంటుంది. 

కలిగిన ప్రతీ స్పందనను ..
రాయడం విజ్ఞతకు లక్షణం కాదు.
అందుకే అనుభవం కావాలంటారు. 
వయస్సు కొంత ముదరవలె ..
అప్పుడప్పుడూ..
చేకూర్చుకున్న సంస్కారం ..
ఒక పరిణతమైన స్థితికి వస్తుంది.
ఆ స్తితిలో రచన చేయ వలె ..

సమకాలిక సంఘటనే కావలసిన అక్కరలేదు. 
పూర్వకాల సంఘటన అయినా తీసుకోవచ్చు.
ఏది తీసుకున్నా ..
అందులో తన సంస్కారం చోటుచేసుకుంటుంది. 
ఈ విషయం ఇంకా విస్తరిస్తే పెద్దగా చెప్పవచ్చు. 

ఒక చిన్న ఉదాహరణ చెప్తాను...
మళయాళం లో భాగవతం..
"ఎళుత్తచ్చన్" వ్రాసినాడు. 
అందులో కృష్ణుడు ఏడ్చినప్పుడల్లా..
యశోద అరటి పండు ఇస్తుందట..
కారణం ..
వాళ్ళ దేశాచారమది...

ఇలాంటివి ఎన్నో ఉంటాయి..
కలిగిన ప్రతి భావననూ ..
కాగితం మీద పెట్టడం ..
అదంతా ప్రింటు కివ్వడం..
చాలా అనాగరికమైన అలవాటు.
ఒక కవి పరిణతుడు కావడానికి ముందు...
ఎన్నో వ్రాసి చించి వేయాలి.

నేను ఎన్నో సార్లు ..
నా రచనలు అనేకం చించివేసాను. 
రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు కావ్యాలే చించి వేసారు. 
రాసిందంతా ప్రెస్సుకు పోవాలనే..
నేటి యువకుల్లో కనిపించే దురాశ.
 
ఇప్పటి కవిత్వం దుస్థితిలో ఉందని ..
సాహితీ విలువలు పడిపోతున్నాయని..
చాలా మంది అంటున్నారు..
నిన్నటి మహా రచయితలు కూడా..
నేటి సాహిత్యం పై సదభిప్రాయాన్ని చెప్పటం లేదు. 
ఈ విధంగా ..
సమకాలీన సాహిత్యాన్ని యోగ్యంగా లేదనడం ..
కొన్ని దశాబ్దాలుగా కూడా వుంది. 
ఇదంతా చేమకూర వేంకట కవి చెప్పినట్టు..
ఏ గతి రచియించిరేని..
సమకాలము వారలు మెచ్చరే కదా..
అని అనుకోవచ్చా..
 
ఈనాడు వచ్చేదంతా ..
మంచి సాహిత్యం కిందకి చేరడం లేదనే మాట..
వివేకంతో కూడినదే ..
రాసే వాళ్ళకే విసుగైపోతున్నదన్నమాట.. 
ఇది ఒక శుభ పరిణామం..
ప్రమాణాలు పడిపోతున్నాయనే రొద కూడా..
వాళ్లలోనుంచే ఆరంభమౌతోంది..!

కానీ ..
వాళ్ళ దృష్టిలో ..
ప్రమాణాలనేవి ఏవో సరిగా చెప్పడం లేదు 
అక్కడే మళ్ళీ అస్పష్టత వుంది. 
వారనుకునే ప్రమాణాలు ఏవో..
కొంత విడదీసి చెబితే..
మా బొంట్లకు బాగుంటుంది. 

ఎంతసేపు చెప్పినా..
భాష ..
భావం ..
రెండే ప్రధాన వస్తువులు..

మరి భాష పడిపోయిందా..?
భావం పడిపోయిందా..?
వాళ్ళే తేల్చి చెప్పాలి. 
నా దృష్టిలో రెండూ పడిపపోయినాయి..

కొన్ని చిన్న కథలు..
నవలలు మాత్రం..
మంచివి వస్తున్నాయనిపిస్తోంది.
 
మీకు కోపం వస్తుందేమో..
నవలా సాహిత్యం ..
కన్నడంలో ..
తమిళంలో ..
బాగా వస్తొందనే అభిప్రాయం నాకుంది. 
ఇక కవిత్వ మంటారా.. 
ప్రతి భాష లోనూ ఇంతే అయిపోతొంది. 

ప్రతి భాషలోనూ ..
రాజకీయాల ప్రభావం ..
ఎంతవరకూ విసంకటంగా సాగుతుందో..
అంతవరకూ..
ఈ దుస్తితి తప్పదు.

వాల్మీకికి ముందు..
కావ్య రచన లేదంటారు కదా.. 
అటువంటప్పుడు ..
ప్రధమ రచన అయిన ఆదికవి వాల్మీకి రామాయణం ఇంతవరకూ కూడా..
స్థిరంగా నిలిచి వుండడానికి కారణం ఏమిటి..?
ఆ విధంగా సమగ్ర రచన చేసే శక్తి ..
వాల్మీకికి ఎలా సంక్రమించింది..?

ప్రాచీనులతో మనకు చిక్కే లేదు.. 
సరస్వతీదేవి ఆవిర్భావమే..
వాల్మీకితో ఆరంభమయ్యిందంటారు కదా..!
ఆ  ఆవిర్భావమే ..
సర్వాంగ సుందరంగా జరిగింది. 

కేవలం లౌక్య దృష్టితో ఆలోచిస్తే ..
నాకు తోచే అభిప్రాయమిది ..

సామవేదం కేవలం గానాత్మకం..
అధర్వణం ప్రయోగాత్మకం..
ఋగ్వేదం శృత్యాత్మకం..
వీటి అధ్యయనం వాల్మీకికి వుంది. 
కనుక రామాయణ రచన ..
సమగ్రంగా జరిగి వుంటుందని నా ఊహ..

ఇది నా ఊహ మాత్రమే సుమండీ..

కానీ ఒకటి నిజం ..
వాల్మీకి వలె ..
సర్వాంగ సుందరమైన రచన..
మరొక్కనికి చేయడం అసాధ్యం 

మరి ..
ఆయన సంస్కారమేమిటో ..?
ఆయన చదువేమిటో ..?
మనం గ్రహించలేం..
 
కొన్ని కొన్ని చోట్ల..
ఋగ్వేదంలో..
మనకు మంచి కవిత్వం దొరుకుతుంది. 
నా చిన్నప్పుడు ఋగ్వేదంలో..
కొన్ని ఘట్టాలు చదివి ఆశ్చర్య చకితుణ్ణి అయ్యాను. 
ఉషస్సూక్తులు మొదలైనవి...

అప్పుడే తెనిగించే సాహసానికి పూనుకున్నాను. 
తర్వాత ఎందుకో..
ఆ ప్రయత్నం నిలిచి పోయింది.
 
కడుపులో చల్ల కదలకుండా వున్న కాలంలో..
పురాణాలు ప్రబంధాలు రాశారు ..
అని ప్రాచీన సాహిత్యాన్ని ఎత్తి చూపే వారికి..
మీ సమాధానం ఏమిటి..?
అంతకు మించిన గొప్ప విలువలు..
నేటి రచనలు ప్రతిబింబిస్తున్నాయా..?

ఆనాటి వాళ్ళు కడుపులో చల్ల కదలకుండా ఉండడానికి కారణం ..
ఆనాటి రాజకీయాలు..
అంతే కాకుండా ..
అప్పటి వాళ్ళంతా కడుపులో చల్ల కదలని వాళ్ళే అనుకోవడం మన మూర్ఖత్వం. 
ఫ్యూడలిజం..
పెట్టుబడిదారీ సమాజం..
ఆనాటి నుంచీ ఇప్పటి వరకూ అనుభవిస్తూండేదే.
ముఖ్యంగా ..
నేటి మన జీవితంలో జీవశక్తి నశించింది..
జిజ్ఞాస పోయింది..
సుఖాన్ని కూడా చక్కగా అనుభవించలేని పరిస్తితికి వచ్చినాము ..
మన దౌర్భల్యానికి సిగ్గు పడకుండా..
వాళ్ళని నిందించడం..
"అబధ్ధం పఠత్వా కుతోద్యం కరోతి"
అన్నట్టు ఉంటుంది. 

కడుపులో చల్ల కదలక కాదు..
  చల్లే లేకుండా..
గొప్ప వాళ్ళైన వాళ్ళను..
ఎంతమందినో నేను చూసినాను.
ఇవన్నీ కూడా ..
ఆడలేక ..మద్దెల పైన మొత్తుకునే మాటలు..
ఇటువంటి వాని పైన నాకు సానుభూతి లేదు...
 
ఇలా ..
ఎంతో వివరంగా..
సునిశిత మేధాశక్తి ఉట్టి పడేలా..
నిష్కర్షగా ..
ఎన్నో సాహితీ విషయాలను వివరించారు. 
తెలుగు జాతి ఏనాటికీ మరువలేని మహా కవి..
శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు...

ఆ సరస్వతీ పుత్రుని మాటలు.. 
అపూర్వ మేధా సంపత్తిని ప్రకాశింపజేసే..
మాణిక్యాల మూటలు..
ఆ విలువైన మాటల్ని ..
పాఠకులకు అందజేయాలని..
ఆయన దగ్గర సెలవు తీసుకుని..
బయలుదేరింది స్వాతి.
 
స్వాతి మాస పత్రిక అయ్యతో జరిపిన ఇంటర్వ్యూ లోని కొన్ని ఇవి...

26 జన, 2012

హరికథలు









మీరు హరికథలు చెప్పేవారని విన్నాము..
సాహిత్యంలో హరికథల గురించి..
మీ అభిప్రాయాన్ని వివరించండి...
 
మరొక్క విషయం ..
మీరు తాత్విక చింతనతో ఉండి..
ప్రొద్దుటూరిలో..
ఆశ్రమం ఏర్పాటు చేసుకొని..
ఉండేవారని వినడం జరిగింది. 



మీ అనుభవంలో ..
ఈ తత్వానందం ..
రసానందానికి..
సామ్యం గానీ.. సమన్వయం గానీ ..
ఏమైనా కుదిరిందా..
 
చాలా సంవత్సరాలు హరికథలు చెప్పేవాణ్ణి ..
నా హరికథలకు పెద్ద పేరుండేది..
చిన్నప్పట్నుంచీ ..
చెప్పినానుకదా..
సంగీతం లోనూ ..
నాట్యములోనూ ..
ఎక్కువగా కృషి చేసిన దానివలన ..
నా హరికధ కాలక్షేపాలలో..
నాకెక్కువగా పనికి వచ్చేవి..



ఈ ఊర్లో కూడా ..
ఆ V.V .శేషాచార్లు ఉండినప్పుడు..
ఒకట్రెండుసార్లు హరికథలు ఏర్పాటు చేసినారు.

అప్పుడు నేను ప్రొద్దుటూరులో పనిచేస్తూ ఉంటిని..






హరికథ కూడా ఒక సాహిత్య ప్రక్రియే.. 
ఆదిభట్ల నారాయణదాసు ఉండినాడు..
చాలా గొప్ప పండితుడాతడు..
సంగీతంలో ..
సాహిత్యంలోనూ..
చాలా గొప్ప వాడు. 

 




 
ఒక్కో మనిషీ ..
ఒక్కో కళకు..
అట్లా పుడతాడేఅమో ..అనిపిస్తుంది. 

బ్రహ్మాండమైన కంఠం ..
పూర్వకాలంలో..
ఆయనకు వెయ్యిన్నూటపదహార్లిచ్చేవారు..
మైసూరు సంస్థానంలో ..
అక్కడి పండితులల్తో నమానంగా తులతూగి..
గొప్ప మర్యాదలు కూడా పొందినాడు.
 


హరికథలు సాహిత్యంలో ఒక భాగమా ..?
అంటే అన్నీ భాగాలే ..
కానీ ..
శక్తిని బట్టీ ..
వాని వాని వ్యుత్పత్తిని బట్టీ..
ప్రతిభను బట్టీ ..
వెల్లడించుకుంటూ పోతాడు.. 
వైయక్తికంగా ..
అది వాడి వ్యక్తిత్వం పైన ఆధారపడి ఉంటుంది. 

ప్రతిది కూడా..
సాహిత్యంలో భాగంగా చేసుకోవడానికి అవకాశం ఉన్నది.
 


ఆశ్రమ జీవితం కొంత ఉన్నది. 
కానీ నేనందులో కృతకృత్యుణ్ణి కాలేదు..
అటు తరువాత ..
నేను హిమాలయాలకు పోవటం తటస్థ పడింది..



కానీ ..
ఖుస్రో
ఈ కష్టాలు..
నా జీవితంలో నాకు..
మనుష్యత్వాన్ని నేర్పినాయేమో ..
అని అనిపిస్తుంది. 
ఖుస్రో అని ఒక కవి ఉన్నాడు. 
ఉర్దూలో ..
వాడోటి తమాషాగా అంటాడు. 
దేవుడు కావడం సులభమే..
మనిషి కావడం కష్టం అని.. 

అందువల్ల..
అప్పుడు నేననుభవించిన కష్టాలు..
తిండి లేక నేను బాధపడినటువంటి సన్నివేశాలు..
నేను పొందినటువంటి అవమానాలు..
ఇవన్నీ..
నాలో మనుష్యత్వం పెరగడానికి..
నా అహంకార కక్ష్య తగ్గడానికి..
కారణాలైనాయేమో ..
అవన్నీ లేకపోతే ..
నాలో మనుష్యత్వం బాగా పక్వం అయ్యేది కాదేమో..
నన్న సందేహం నా కిప్పటికీ ఉన్నది.



అందువల్ల ..
ఇబ్బందులూ..
కష్టాలూ..
నాకన్నీ మేలే చేసినాయి.

23 జన, 2012



ప్రజలకందరికీ అర్థమవ్వాలని ఆరంభించిన..
ప్రజాకవిత్వంలో ..
ప్రస్తుతం వస్తున్న కొత్త పోకడలు..
పూర్తి అస్పష్టంగా..
అర్థంగాని రీతిలో ఉంటున్నాయని..
ఓ విమర్శ వుంది. 
ప్రాచీన కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి..
ఓ వ్యాకరణమనో ..
చందశ్శాస్త్రమనో ..
పధ్ధతులున్నాయి..

కానీ ..
నేటి కవిత్వం అర్థం కావడానికి..
ఓ విధానం అంటూ లేదు ..
మరి..
ఈ అస్పష్ట కవిత్వం వల్ల..
ప్రయోజనం ఏమైనా వుందా..?
 
ప్రజాకవిత్వమనే మాట..
సామాజిక స్పృహకు పుట్టిన మరొక కొమ్మ.
కవిత్వమని ఎప్పుడన్నామో ..
అప్పుడే దాని ఫీల్డ్ పరిమితమని అర్థమౌతుంది. 

గిరిజనులకు ..
హరిజనులకు ..
తండాలకు ..
చెంచులకు..
అందరికీ ప్రజా కవిత్వం అర్థం కాదు కదా.. 

కనుక ..
అందరికీ కవిత్వం అర్హమౌతుందనుకోవడం..
ఒక పిచ్చి విశ్వాసం..
పైగా ..
నాకు ఎక్కువ బాధ కలిగించే విషయం ఏమిటంటే ..
ఈ సభల్లో కవిత్వాలు చదవడం..
అనధికారులంతా చప్పట్లు కొడితే..
తన జన్మ కృతార్థమయ్యిందని కవి అనుకోవడం..

నేను సభల్లో ఎక్కువగా కవిత్వం చదవను. 
కవిత్వం ఏకాంతంగా చదువుకుని..
మనసులో భావింపవలసిన పదార్థం. 
దానిని సంతలో పెట్టడం నాకిష్టం లేదు. 
పైగా శ్రోతలు తన వైపుకు అభివృధ్ధి చెందాలని..
రచయిత ప్రయత్నించాలి గానీ ..
వారి స్థాయిని దిగజార్చాలని ప్రయత్నించగూడదు.
 
ఇక కవిత్వంలో అస్పష్టత గురించి..
ఈ రోగాలన్నీ మొదట పాశ్చాత్య దేశాల్లో మొదలౌతాయి. దాన్ని వాళ్ళు ముద్దుగా సింబాలిజం ..
మిల్టన్ ..
అని పిలుచుకుంటారు.

TS ఇలియట్ కూడా..
సింబాలిజం కు చెందిన కవే ..
కానీ ..
అతని పైన భారతీయ అధ్యాత్మిక ప్రభావం వుంది. 
అతడు కొంతవరకు అర్థమౌతాడు. 

 తర్వాత ..
C .డెలిగీస్ ..
W. D. ఆడం 
ఇంకా ..
TS ఇలియట్ 
ఫ్రాయిడ్ ..
అనుయాయులు మరికొందరు ..
రంగంలోకి వచ్చారు 

ఈ నడుమ ..
ఇంగ్లీష్ కవిత్వం చదువుతూ వుంటే ..
మనకు తెలియని పదం ఒకటీ వుండదు. 

కానీ..
వాడేమి చెప్తున్నాడనేది అర్థం కాదు. 
ఈ రోగమే ..
తెలుగుకు పట్టుకుంది. 

ఈ తెగకు చెందినవే ..
క్యూబిజం ..
డాడాయిజం ..
మొదలైన కేకలన్నీ. ..
అవి పాశ్చాత్య దేశాల్లోనే..
ఇప్పుడిప్పుడే చచ్చిపోతున్నాయి..
మన దేశంలో చచ్చిపోవడానికి ..
ఇంకొంచం సమయం పడుతుంది. 

క్యూబిజం అనేది..
చిత్రలేఖనం నుంచీ తీసుకున్న సిధ్ధాంతం..
డాడాయిజం .. 
రెండు యుధ్ధాల తర్వాత.. 
ఆదర్శాలన్నిటినీ గేలి చేయడమే..
ప్రధానంగా పెట్టుకున్నది. 

అసలు వాళ్ళ మనసుల్లోనే ..
షెల్లీ
తాత్కాలిక ప్రయోజనాలు పెట్టుకున్నారు.
 
ప్రాచీన కవిత్వం ఎందుకు అర్థం కాదు...?

ఒక పదం అర్థం కాకపోతే డిక్షనరీ చూసుకుంటాం...
నేను ఫారిన్ లాంగ్వేజెస్ రేడియో వినేవాణ్ణి. 

మిల్టన్ ..
షెల్లీ ..
కీట్స్ ..
మొదలైన వాళ్ళలో ఈ అస్పష్టత వున్నదా..?
లేదు కదా ..?

కీట్స్
దీనికి వాళ్ళు యేవేవో కారణాలు చెప్తారు. 
ఇటువంటి వాటన్నిటికీ ఆయుష్షు వుండదు. తెలుగులోనూ ..


ఇదే పధ్ధతి అయిపోయింది. 
ఒకడు వ్రాసినది.. ఇంకొకడు చదవడు. .
కారణం ..
పరస్పర గౌరవాలు లేవు...
ఎందుకు లేవు...?
ఇద్దరికీ ఏమీ రాదు కనుక ..

కానీ ..
నాకు భవిష్యత్తు పైన నమ్మకం వుంది. 
ఇది ఇలాగే చాలా కాలం కొనసాగుతుందని అనుకోను.
నాకు అనేక మంది ..
పీఠిక రాయమని ..
పుస్తకాలు పంపుతుంటారు. 
నేను రాయను ..
కాకపోతే వాళ్ళు "పొగరుబోతు.."
అని ఓ బిరుదు ఇచ్చుకుంటారు. ..
ఇచ్చుకోనీ ..

మా తట్టు ఒక సామేత వుంది. ..
"కట్టె తిప్పే వాని శక్తి ..
కట్టె నేలకు కొట్టడంలోనే" తెలిసిపోతుందట..

అలాగే మొదటి పేజీలోనే ..
అయ్యగారి సత్తా తెలిసిపోతుంది. 
ఇంక నేనేం రాయను. ..?

అభ్యుదయ కవుల్లో ..
అదందరూ వ్యర్థులని ..
నేనడం లేదు. 
కొందరు బాగా రాసే వాళ్ళున్నారు. 
వాళ్ళు నిలిస్తే నిలవ్వచ్చు.
తక్కిన వాళ్ళంతా షరా..

22 జన, 2012

 
 
సామాజిక స్పృహ ..
ఈ మాటను ఏ మహానుభావుడు..
వాడుకలోకి తెచ్చినాడో కానీ.. 
అప్పటినుండీ ..
ఈ మాట.. స్వైర విహారం చేస్తూ ఉంది..
 
వాళ్ళకు తోచిందంతా వ్రాసి..
సామజిక స్పృహ తెర వెనుక ..
ఎందరో అనక్ష రాక్షసులు ..
సారీ ..
 
అనక్ష  రాశ్యులు..
అల్పాక్ష రాశ్యులు ..
యధేచ్చా విహారం చేస్తూ ఉన్నారు..
 
సాహిత్యం లోకి రాజకీయాలు చొచ్చుకొని వచ్చి..
ప్రతిభ లేని వారికి ..
కల్పవృక్షంలా తయారయ్యింది..
 
ప్రతి ఒక్కడూ ..
ఏదో ఒక రాజకీయ గొడుగు కింద దూరటమూ ..
ఇదంతా కవిత్వమని ప్రజల నెత్తిన రుద్దటమూ.
ఆధునిక కవిత్వమంటే.. 
రాజకీయ కవిత్వమే.
 
 శ్రీ శ్రీ తర్వాత..
ప్రస్థుతం తెలుగు సాహిత్యంలో..
అంతటి ఉత్కృష్ట భావాలు చెప్పేవారు లేకపోవటంతో..
ఆ స్థానం ఖాళీగా ఉందనేది నిజమా..?

నిజమే ..
కానీ ..
ఎందుకు ఎవరూ రాలేదు ..?
దానిక్కారణం సిన్సియారిటీ లేకపోవడమే..

కొందరు మన దేశానికి ..
మన సభ్యతకు దూరంగా ఉండే ..
విదేశీ భావలను జొప్పించి ..
మెస్మరిజం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. 

కానీ ..
అవి నిలవవు..
ఎందుకంటే ..
ఆ భావం ..మన హృదయాల నుంచీ పుట్టింది కాదు 

తిలక్
శ్రీ శ్రీ కవిత్వం చూసామంటే ..
ఇటువంటివి కనపడవు
ఉదా ..
రాబందుల రెక్కల చప్పుడు ..
పొగ గొట్టపు భూంకారం ..
అరణ్యమున హరీంద్ర గర్జన..
అన్నాడు.

ఇందులో ప్రతి భావం ..
మనం అనుభవించిందే.. 
చూసిందే.. 
అందుకే ..
మనసుకు సంపూర్తిగా హత్తుకుపోతుంది..

అధునాతనుల్లో ..
ఒక్క తిలక్ మాత్రం ..
అతని త్రోవలో ..
అతను పరిణతుడుగా నాకు తోస్తాడు..
కానీ పధ్ధతి వేరు.


చందస్సు అంటే ..
గణ యతి ప్రాసలతో ..
కూడుకున్నదేనా ..?
లేక మరేమైనా అర్థం వుందా..?
కవిత్వానికి చందస్సు ఎంతవరకు అవసరం..?


చందస్సు అంటే నా దృష్టిలో ..
ఒక లయ ..
తర్వాత ఎన్నో రీతులుగా ..
దానికి కొమ్మలు రెమ్మలు పుట్టినాయి 
లా కంటే భిన్నమైనదిగా చందస్సు నాకు తోచదు. 
యతి ..ప్రాస ..
అన్ని కూడా ..
శ్రవణ సుఖానికి ఏర్పడ్డవి. ..

తర్వాత శాస్త్రకారులు ప్రవేశించి ..
ఏవేవో వింత వింత పోకడలు పోయినారు.

చందస్సులు ఎన్నని ..?
నువ్వు ఏది రాసినా..
అటో మాటిక్ గా .. 
ఏదో ఒక చందస్సులోకి వస్తుంది
దానికి పేరు పెట్టకపోవచ్చు ..
అది వేరే మాట ..

చందస్సు ప్రస్తారం చేస్తూ పోతే..
అనేక చందస్సులు ఏర్పడతాయి..

వాటినన్నిటినీ నువ్వు వాడకపోవచ్చు..
పేర్లు కూడా లేకపోవచ్చు. ..
సంగీతం కూడా అంతే ..
అనంతావై రాగాః...
అంటారు ..
రాగాలు ఎన్ని..?
అనంతం వాడుకలో వుండేవి ఏ కొన్నో ..

చందస్సులు కూడా అంతే..
చందస్సుకు లయ ప్రాణం..
కనుక..
ఆ లయ ఏ రీతిగా నడచినా ..
ఏదో ఒక చందస్సు అవుతుంది.
శ్రీ శ్రీ చందస్సుల నడుము విరగ్గొడతా అన్నాడే కానీ..
అతడు రాసినదంతా ఏదో ఒక చందస్సులోనిదే.. 


చందో బందో బస్తులన్నీ చట్ ఫట్మని తెంచి ..
అని అన్న శ్రీ శ్రీ రచనలో ..
యతి లేదూ..?
లయ లేదూ..?
స్పష్తంగా దీన్లోనే చందస్సు కనిపిస్తోంది..