29 జన, 2012



నాకు స్ఫూర్తి నిచ్చిన సంఘటనలు..
మా ఇంట్లోనే వుండేవి...
నన్ను కన్నతల్లి..
లక్ష్మీ దేవి ఆమె పేరు. 
నేను అనంతపురానికి ఏడు మైళ్ళ దూరంలో ఉండే.. 
చియ్యేడు..
అనే ఊర్లో పుట్టినాను. 
మా మాతా మహులంతా కూడా కాశీ పండితులు. 

మా పెద్ద తాత గారు కొండమాచార్యులవారు. 
వివాహానికి ముందే ..
మా తల్లి ఆయన కాశీ పండితులైనందువల్ల..
ఆయన దగ్గర సంస్కృతం చక్కగ నేర్చుకుంది. 
మంచి పాండిత్యం కూడా ఉండేదామెకు. 
కానీ నాకు ఐదవ సంవత్సరంలోనే ..
మా తల్లి చనిపోయింది. 

మా నాన్న గారు మైసూరులో..
కృష్ణ బ్రహ్మతంత్ర పరకాల స్వామి దగ్గర..
సంస్కృతం చదువుకున్నారు. 

అప్పట్లో వారితో పాటు చదువుకున్న వారు..
రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ గారు ..
రాళ్ళపల్లి గోపాల కృష్ణ శర్మ గారు..
మరికొందరు.. ఉండే వారు.
మా అమ్మ మరణించిన సుమారు పదునాలుగేండ్లకు..
మా తండ్రిగారు రెండవ వివాహం చేసుకున్నారు. 
ఆమెది మైసూరు..
సంగీతంలో చక్కటి సాధన చేసిన మనిషామె.

మా నాయన పరమ సాహిత్యప్రియులు. 
ఆయనది చాలా రసికమైన జీవితం 
మా ఇంట్లో ..
నిరంతరమూ సాహితీ చర్చలు జరుగుతూ ఉండేవి. 
వాటినన్నిటినీ కూడా చాలా శ్రధ్ధగా గమనిస్తూ ఉండేవాడిని. 

పైగా చిన్నప్పుడు నాకు ..
సంస్కృతమూ ..
తెలుగూ ..
తెలుగు ప్రబంధాలూ..
మా నాన్నగారే చెప్పారు..

ఈ రీతిగా ..
ఆయన సాహితీ జీవితం..
మా ఇంట్లో నిరంతరమూ జరుగుతూ ఉండేటటువంటి సాహిత్య సంగీత గోష్టులూ..
ఇవన్నీ నాకు బ్రహ్మండంగా స్ఫోరకాలైనాయి ..
చిన్నప్పుడు..
అప్పుడు నేను థర్డ్ ఫారం చదువుతూ ఉండేవాడిని.

నాకు ఒక చెక్క పెట్టె ఉండేది. ..
ఆ పెట్టెకు పక్కలో కూచొని ..
అల కవితా లోకమునకు ..
అనే కంద పద్యం మొదలు పెట్టినాను. 
మా నాయనగారు కాఫీ తాగి.. గడ్డకొచ్చి ..
నేను ఏదో మూడీగా..
ఆ లోచిస్తూ ఉండడం ..
గమనించారు. 
దూరం నుంచీ దగ్గరకొచ్చి..
ఏం రాస్తున్నావు ..?
అని ఆ పేపరు తీసుకున్నారు. 
అల కవితాలోకమునకు..
అని ఫస్ట్ లైన్ రాసినాను..
చాతకాని వాడివి..
పద్యం ఎందుకు ఆరంబించావురా ..
అని ..
కలిమికి వైరంబదేమి కలిగెను చెపుడా ..
కలికాల మహిమ ..
సద్గుణ కవికుల నృప సింహములకు  కనకుండుటయే రాసుకో  ..
అన్నారు..

ఇట్లా.. 
ఆయన ఆసువు మహా సులభంగా చెప్పేవాడు. 

కాఫీ తాగేవాడు. ..
సురలోకంబున కమృతము..
నరలోకమ్మునకు కాఫి..
..........
ఎరుగక కాఫీని తిట్టుటే ..మది నేర్పో ..
ఇట్లా.. 
(నవ్వు..)
మాట్లాడితే పద్యం చెప్పేటటువంటి ధోరణి ..
ఆయనకు ఉండేది. 

ఇది ఆయనపై తిక్కన కవితా ప్రభావమని..
నేను అనుకుంటాను. 
వీళ్ళంతా తిక్కన భక్తులు...
కట్టమంచి రామలింగా రెడ్డి ..
రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ..
మా నాయనా ..

ఇలా..
మా నాయన గారికి ..
దాదాపు..
పదహైదు పర్వాలు నోటికి వచ్చు ..
అందువల్ల ..
ఆ ఆశు కవితా ధోరణి ..

తిక్కన ప్రభావం వల్ల ..
ఆ ఆశుకవితా ధోరణి అలవాటు పడిందేమో నని..
నా ఊహ ..
ఇట్లా ప్రతిదినమూ ..అడుగడుగునా..
మా ఇంట్లో ..                                  
ఈ సాహిత్య గోష్టులు ..
సంగీత గోష్టులూ..
జరుగుతూనే ఉండేవి ..
స్కూలుకు పోవడానికి పదిగంటల వరకూ..
రోజూ ఇదే చర్చ ..
ఇదంతా చాలా నిశితంగా గమనించేవాణ్ణి నేను. 

సాయంకాలం స్కూల్ నుంచీ వస్తూనే..
మళ్ళీ పదిమందీ చేరడమూ..
మళ్ళీ ఇదే చర్చ. 
నేను రాసే ప్రతి పద్యమూ కూడా ..
ఆయన నాకు తెలీకుండా చూస్తూ ఉండేవాడు.
అయినా..
ఆయన నా గూర్చి ఒక గొప్ప మాట చెప్పలేదు. 

నేను పెద్ద వాణ్ణయిన తరువాత గూడా..
నేనెక్కడైనా ఉపన్యాసాలిస్తూ ఉంటే..
ఆయన నాకు కనబడకుండా..
నలుగురిలో..
ఎక్కడో ..
అప్రత్యక్ష్యంగా ..
వినిపోతూ ఉండేవాడు. 


ఎవరైనా ఏం స్వామీ..
మీ కొడుకును గురించి ..ఒక్క మాట చెప్పరే?
అంటే ..
తండ్రి కొడుకు గురించి గొప్ప మాట చెప్పటం..
వాడికి ఆయుష్కరం కాదప్పా..!
అని చెప్పేటటువంటి వాడాయన..
అందువల్ల ..
నాకు సాహిత్యంలో ప్రవేశించడానికి..
ప్రబోధకమైన శక్తి మా నాయన. 
వాతావరణం మా ఇంట్లోనే ఏర్పడింది.
పైగా ..
నన్ను కన్నతల్లి ..
మా నాయన..
ఇద్దరూ కవిత్వంలోనే మాట్లాడుకోవడమూ ..
పద్యాలూ..                                      
శ్లోకాలలో ..
జాబులు రాసుకోవడమూ ..
కూడా చేసే వారు. 
నన్ను గురించి ..
మా అమ్మ ఒక పద్యం జాబులో రాసింది.

నీలాల కనులలో..
నిల్వ నుత్సాహంబు..
బుడి..బుడి..నడల..
నల్లెడల బాకు..
పట్టుకొమ్మని..
వెంటబడి పట్టబోవంగ..
యెత్తుకొమ్మని ..
చేతులెత్తు పైకి..
కురులు ఫాలస్థలంబున గునిసియాడ..
కాళ్ళ గజ్జెలు ఘల్లు ఘల్లు మనగ..
తాను నర్తించు..
ధయి..ధయ్యి..ధయ్యి..మనుచు..
చిన్న పాపడు సుఖముగనున్నవాడు..

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి