2 ఏప్రి, 2012

పుట్టపర్తి నారాయణాచార్యుల వారు ‘దయయు సత్యంబు లోనుగా దలపడేని’



అనువాదం ఎప్పుడూ కత్తిమీద సాములాంటిదే.
అందుకనే అనువాదం అందంగా ఉంటే ..
మూలానికి భిన్నంగా సాగి ఉండవచ్చు. 
మూలాన్ని అనుసరించి సాగితే..
అది అంత అందంగా లేకపోవచ్చు - అంటారు. 
దీన్నే ఆంగ్లంలో ''ట్రాన్స్లేషన్ ఇఫ్ బ్యూటిఫుల్ ...
అనువాదమొక కళ..
మరొక భాష లోని ఒక ప్రసిధ్ధ పుస్తకాన్ని.. అనువదించాలంటే ..
అనువాదకుడు..
రెండు భాషలలోనూ నిష్ణాతుడై వుండాలి.
ఆ పుస్తకాన్ని..
ఆమూలాగ్రంగా జీర్ణించుకునిఉండాలి
అంతేకాదు ఎవరి కవిత్వాన్ని మనం అనువదించదలచుకున్నామో..
 దాని పట్ల మనకు ప్రేమ ఉండాలి ..
ఎందువలన ఆ కావ్య సౌందర్యం భాసిల్లిందన్న
 ఆ ఆత్మను అర్థం చేసుకోవాలి.
భర్తృహరికి చాలా అనువాదాలొచ్చినా ..
ఏనుగు లక్ష్మణ కవి ..
ఎందుకు అందరినీ మించాడంటే ఛందస్సు ఎంపికలో సజీవభాషను అనుసరించటం వల్లే
"ఒక రహస్య కళ అనువాదం" వ్యాసం వ్రాసిన ..

శ్రీ సౌభాగ్య గారు..
అనువాదం ఒక ప్రేమ వ్యవహారం..
అంటున్నారు..


తమ భాగవత ఉపన్యాసాల్లో
ఈ పద్యం గురించి చెబుతూ
మూలంలో ‘దయయు సత్యంబు లోనుగా దలపడేని’ అన్న మాటలు లేవని
అవి పోతనగారు చెప్పినవని చూపించారు.
మూల భావానికి మరింత అందగించే పోతనగారు
ఆ మాటల్ని అదనంగా చేర్చారు.

అవి వ్యాసుడివి కావు,
పోతనగారి ‘లక్షణాలు’ అన్నారు పుట్టపర్తి నారాయణాచార్యులవారు.


సౌభాగ్య వీరి కలం పేరు..
మీ వ్యాసాన్ని నా బ్లాగులో వేసుకుంటానండీ ..

అని వారిని అడిగితే ..
తప్పకుండానమ్మా అని అంటూ..
 పుట్టపర్తి వారు ..
విశ్వనాధ వారిపై వ్రాసిన వ్యాసం చదివి..
 చాలా కదిలి పోయానమ్మా 
తరువాత ..
అయ్యగారిమీద విస్తృత పరిశోధన చేయాలనుకున్నాను అన్నారు.
వీరు ఆంధ్ర భూమి డెయిలీ లో శీర్షికలు నిర్వహిస్తున్నారు..
 





               ఒక రహస్య కళ కవిత్వ అనువాదం





కవిత్వాన్ని అనువదించడం కష్టం.
 కవిత్వాన్ని అనువదించడం సులభం.
ఎవరి కవిత్వాన్ని ..
మనం అనువదించదలుచుకున్నామో
దానిపట్ల మనకు ప్రేమ లేకుంటే
 దాన్ని అనువదించడం కష్టం.


మనకు ఇష్టమైన కవిత్వాన్ని 
అనువదించడం సులభం.
దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం దాకా
పాశ్చాత్య ప్రపంచానికి గ్రీకు, లాటిన్,
మన దేశానికి సంస్కృతం 
తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సిన భాషలుండేవి.


 సాహిత్య,వైజ్ఞానిక విషయాలు..
 వాటిల్లోనే ఉండేవి.
 ఆ క్రమంలో
వాటిలోని గొప్ప సాహిత్యాన్ని స్థానిక భాషల్లోకి అనువదించడం ప్రారంభమైంది.


ప్రపంచ సాహిత్య పరస్పర వినిమయం ప్రారంభమైంది.
సంస్కృత భాషలో మనకు సుసంపన్నమైన సాహిత్యముంది.
దాన్ని వెయ్యేళ్ల క్రితమే మన స్థానిక భాషల్లోకి అనువదించడం ఆరంభమైంది.
మహాభారతాన్ని నన్నయ, తిక్కన, ఎర్రన తెలుగులో అనువదించారు.
అనువాదాల గురించి 
పండితులు రకరకాలుగా చెప్పారు.
మాతృకని అనుసరించి చేసింది, 
మక్కికి మక్కీగా చేసేది, స్వతంత్రంగా చేసేది.
ఇట్లా విభిన్న రీతుల్లో అనువాదాలు సాగాయి.


మన కవిత్రయ అనువాదాలు స్వతంత్రమైనదే.
అంతస్సారాన్ని దృష్టిలో పెట్టుకుకుని స్వేచ్ఛగా చేసిన అనువాదాలే.
అందుకనే వాళ్లని మహాకవులన్నామే కానీ అనువాదకులు అనలేదు.


రాజరాజ నరేంద్రుడు నన్నయని పిలిచి
‘జననుత’ కృష్ణ ద్వైపాయనముని వృషాభాహిత మహాభారత బద్ధ నిరూరితార్ధ మేర్పడ తెనుగున రచింపుమధిక ధీయుక్తి మెయిన్’
-అన్నాడట.


వ్యాసమహర్షి దేన్ని ఉద్దేశించాడో
దాన్ని అందరికీ తెలిసేలా
 మీ మేధస్సును ఉపయోగించి
భారతాన్ని తెలుగు చేయమన్నాడు.


ఆదిలోనే మన ఆదికవి 
ఆ స్వాతంత్య్రాన్ని తీసుకున్నాడు.
 అనువాదంలో ఏది స్వీకరించాలో 
ఏది వదిలిపెట్టాలో 
తనకు నచ్చిన రీతిలో చేశాడు.


 తిక్కన, ఎర్రనలు కూడా
 అదే మార్గాన్ని అనుసరించారు
 అందుకనే భారతం 
మనకు ప్రామాణిక గ్రంథమైంది.
అదే రామాయణం 
ఎంతోమంది అనువదించినా
అవేవీ భారతమంత బలీయంగా 
సాహిత్య జీవితాన్ని, సామాజిక జీవితాన్ని 
ప్రభావితం చేయలేదు.


అంటే 
అనువాదంలో కూడా 
వ్యక్తిగతమైన ప్రతిభ అన్నది 
ఒక బలీయమైన అంశమని తెలుస్తుంది.


పోతన భాగవతం 
తెలుగు ప్రజల్ని ఈనాటికీ ఆకట్టుకుంటోంది.
ఆయనది కూడా స్వేచ్ఛానువాదమే.
ఎంతగా అంటే 
భాగవమతమన్నది తెలుగు వాళ్లదే 
అన్నంత భాషా మాధుర్యాన్ని
ఆయన మనమీద వర్షించాడు.


చేతులారంగ శివుని పూజింపడేని
నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని
దయయు సత్యంబు లోనుగా దలపడేని
కలుగ నేటికి తల్లుల కడుపు చేటు
-ఇది సుప్రసిద్ధమైన పోతనగారి పద్యం.


పుట్టపర్తి నారాయణాచార్యుల వారు
తమ భాగవత ఉపన్యాసాల్లో
 ఈ పద్యం గురించి చెబుతూ
 మూలంలో ‘దయయు సత్యంబు లోనుగా దలపడేని’ అన్న మాటలు లేవని
 అవి పోతనగారు చెప్పినవని చూపించారు.
మూల భావానికి మరింత అందగించే పోతనగారు
 ఆ మాటల్ని అదనంగా చేర్చారు.

అవి వ్యాసుడివి కావు,
పోతనగారి ‘లక్షణాలు’ అన్నారు పుట్టపర్తి నారాయణాచార్యులవారు.


                               * * *


అనువాదంలో స్వీయ ముద్ర ఉన్నప్పడే 
అది రాణిస్తుంది.
అనువాదం చేసేటప్పుడు
మూల భాషలోని సౌందర్యాన్ని 
కోల్పోవడం జరుగుతుంది.
అంటే ఆ భాషను వదిలి 
ఇంకో భాషలోకి ఆ భావాన్ని తీసుకొస్తున్నాం.
 అప్పుడు ఆ భాషకు అనుగుణంగా 
ఆ భాషలోకి భావాన్ని ఒదిగించాలి.


అక్కడే 
అనువదించే వ్యక్తి నైపుణ్యం ఉంటుంది.
కవిత్వాన్ని అనువదించడం 
అంత సులభం కాదు.
తన ఇష్టంతో ట్యూన్ చేయగలిగనిపుడే అది సాధ్యం.
కవిత్వం ఎప్పుడూ..
 అనుభూతి ప్రధానంగా ఉంటుంది.
అభిప్రాయాల్ని అనువదించడం సులభం.
అనుభూతిని అనువదించడం కష్టం.


ఎదుటి కవి భావాల్ని మనం సొంతం చేసుకోవాలి.
అంటే వాటికి మనం లొంగిపోవాలి.
అప్పుడే అవి మన సొంతమవుతాయి.
ఇదొక రసాయనం,
అవ్యక్త ప్రక్రియ.
ఆ కారణంగానే స్వంత రచనల లాంటివే.


అటువంటి స్వతంత్రానువాదాలు 
ఏ భాషలోనైనా కొన్ని మాత్రమే ఉంటాయి.


ప్రతి భాషకు ఒక నిర్మాణముంటుంది.
ఒక సంగీత ముంటుంది.
అనువాదంలో ఆ లక్షణం పోతుంది.


ఉర్ద్దూ భాష సున్నితత్వం,
పర్షియన్ భాష సౌకుమార్యం 
అనువాదంలో ఒదిగించలేం.
ఆ భావాలకు కొన్ని అలంకారాల్ని అద్దితే తప్ప 
అవి రాణించవు.


                                 * * *


భారతానువాదంలాగే
 భర్తృహరి సుభాషితానువాదం కూడా 
తెలుగులో సుప్రసిద్ధమైంది.
భారతాన్ని ఎందరో అనువదించినా
 కవిత్రయానువాదం అద్వితీయమైంది.
రామాయణాన్ని ఎందరో అనువదించినా,
అనుసృజించినా అద్వితీయమని చెప్పుకోదగిన రామాయణం తెలుగులో రాలేదు.


కానీ..
భర్తృహరి సుభాషితాల్ని
ఏనుగు లక్ష్మణకవి అనువదించారు.
మూల విధేయంతోపాటు ..
కవి వౌలిక ప్రతిభ కూడా ..
మనల్ని దిగ్భ్రమకు లోనుచేస్తుంది.


అవి ఇతర కవులు చేసిన అనువాదాల్లో 
పోల్చినపుడే మనకు తెలిసి వస్తాయి.


మొదట ఒక భర్తృహరి శ్లోకం తీసుకుందాం.
కేయూరాణి నభూషయన్తి పురుషం హారాన చన్ద్రోజ్వలా
నస్నానం నవిలేపనం నకుసుమం నాలంకృతా మూర్ధజా
వాణ్యేక నమలం కరోతి పురుషం యు సంస్కృతా ధార్యతే
క్షీయనే్త ఖిల భూషణాన్ని సతతం వాగ్భూషణం భూషణమ్


భావం: పురుషునకు భుజకీర్తులు, సూర్యహారాలు మొదలగు సొమ్ములుకానీ, స్నానము, చందనపు పూసుకొనుట, పూలు ముడుచుకునుట, కురుల ను దువ్వుకొనుట మొదలగువాటిలో నేదియు కాని అలంకారము నియ్యజాలదు. 
సంస్కారము గల వాక్కు ఒకటియే అలంకారము కలగచేయును. 
సువర్ణ మయాది భూషణములన్నియు నశించును. వాగ్భూషణ మొక్కటే నశించని భూషణము.


ఈ భర్తృహరి శ్లోకాన్ని అనువదించి
ముగ్గురు కవులు వారి వారి పద్ధతుల్లో అనువదించారు.


కమనీయంబగు విద్యాభంగి తామ శృంగరంబు కల్పింప లే
వమలేందుద్యుతలైన హారముల కేశాలంక్రియల్మజ్జనం
బు మనోజ్ఞాంగద చందనాదు లఖిలంబున్బోవు, పోదెందు, వా
క్య మయం బౌతొడ వేరికిన్ సురభిమలాన్నీతి వాచస్పతీ!
-ఎలకూచిబాల సరస్వతి, మల్లభూపాలీయం


జలకము గంధమున్ కుసుమ చారు శిరోజములున్ భజంగదం
బులు శశి గౌర హార ముఖ భూషలు మర్త్యునలంకరింప లే
వర నలంకరించు విమలాంచిత సంస్కృత వాణి యొక్కటే
బొలుపరు సొమ్ములెల్ల చెడిపోవదు వాక్కను భూషణం బిలన్
-పుష్పగిరి తిమ్మన


భూషలు గావు మర్త్యులకు భూరి మయాంగద తార హారముల్
భూషిత కేశ పాశ మృదుపుష్ప సుగంధీ జలాభిషేకముల్
భూషలు గావు పురుషుని భూషితు చేయు పవిత్ర వాణి వా
గ్భూషణమే సుభాషణము భూషణముల్ నశియించు నన్నియున్
-ఏనుగు లక్ష్మణ కవి


పై ముగ్గురు కవులు మూల విధేయంగానే భర్తృహరిని ఆంధ్రీకరించారు.
ముగ్గురూ ప్రతిభావంతులే.
 కానీ ఏనుగు లక్ష్మణకవి అనువాదమే ఆంధ్రదేశంలో సుప్రసిద్ధమైంది.
 ఎప్పటినుంచో ఏనుగులక్ష్మణ కవి పద్యాలే పాఠ్యాంశాలుగా ఉన్నాయి.
లక్ష్మణకవి పద్యాలు నోటికి రాని తెలుగు అధ్యాపకులు ఉండరు.
ఏమిటి దానికి కారణం?
ఆయన ప్రతిభ ఇతరుల కన్నా ఎట్లా వేరయింది?
ఆయనలో ఉన్న ఆకర్షణ శక్తి ఏమిటి?
భావుకత్వంతో, ఉద్వేగ స్థాయిలో భాషా బలంలో ఆయన భర్తృహరితో సమానమైన వాడు.
 తక్కిన ఇద్దరు కవుల్లో సౌమ్యత, నమ్రత కనిపిస్తాయి.
 లక్ష్మణకవిలో అవి లేవని కాదు.
భర్తృహరిలో పరకాయ ప్రవేశం చేసినట్టు పరవశంగా అనుసృజించాడు లక్ష్మణ కవి.
తక్కిన ఇద్దరు జాగ్రత్తగా నెమ్మదిగా యథా మాతృక రీతిలో అనువదించారు.
తెలుగు భాషను చక్కగా మలిచారు.
 ఉత్సాహ భరితమైన శైలి తక్కువ ఇతర కవుల్లో కనిపించదు.
భర్తృహరి భావాలతో.., 
భాషతో అవిభాజ్య సంబంధం వున్నంతగా..
లక్ష్మణకవి అనువాదం ఉంటుంది.
భావం, భాష, ఆత్మతత్వం వీటన్నిటి సమ్మేళనం కలిగి నపుడు అనువాదం ఆత్మీయంగా ఉంటుంది.
అపూర్వంగా ఉంటుంది. అద్వితీయంగా ఉంటుంది.




                                                                    * * *


అనువాదం ఒక గంభీరమైన విషయం.
అనువాదం ఒక ప్రేమ వ్యవహారం.
ఒక నిజాయితీతో కూడుకున్న ఒప్పందం.
వైరుధ్యాల్ని అధిగమించి చేసుకున్న అంగీకారం
ప్రతి అనువాదకుడు ఈ అంతర్జాతీయ ఆధ్యాత్మిక వినిమయంలో
 సంధాయకుడిగా పరిగణింప దగినవాడు.
అనువాదాలలో లోపాల గురించి ..
ఎవ్వరేం చెప్పినా..
అది ప్రపంచ సామరస్య సాధకమైన వృత్తి.


తెలుగు భాషలో ప్రాచీనకవుల్ని మినహాయిస్తే
ప్రతిభావంతులైన అనువాదకులు
మనకు కనిపించరు.
 సంస్కృత పంచ కావ్యాలు, 
సుప్రసిద్ధ సంస్కృత నాటకాలు 
వచనంలో అనువదించిన వాళ్లున్నారు.
ఆ కవిత్వ బలాన్ని తెలుగులోకి తెచ్చిన వాళ్లు కనిపించరు.
పాశ్చాత్య కవుల గురించి మనకు తెలుసు.
కీట్సు, షెల్లి, బైరన్, షేక్‌స్పియర్ వగైరాలు ఇంగ్లీషు కవులు.
రింబో, బోదలేర్, వర్లేన్ వంటి ఫ్రెంచి కవులు.
అందరూ వాళ్లని గొప్ప కవులు అంటున్నారని 
మనమూ వాళ్లని గొప్ప కవులంటాం.
వాళ్ల కవిత్వాన్ని కొద్ది కొద్దిగా..
అనువదించినవాళ్లున్నారు.


ప్రామాణికంగా దాచుకోదగినంతగా..
వాళ్ల కవిత్వాన్ని ఎవరూ అనువదించలేదు.


వాళ్లదాకా ఎందుకు..?
మన విశ్వకవి రవీంద్రుని గీతాంజలిని..
లెక్క లేనంతమంది అనువదించారు.
కానీ ..
దాని అంతరాత్మని మనకు అందించిన అనువాదం ఇప్పటిదాకా లేదు.
 పాశ్చాత్య కవిత్వాన్ని మనం ఆంగ్ల భాష ద్వారానే అనువదించుకుంటాం.
యూరోపియన్ భాషల్లోని కవిత్వం మొదట ఆంగ్లంలోకి వస్తుంది.
దాన్ని మనం తెలుగు చేస్తాం.


ఇంగ్లీషులోకి అనువదించిన వ్యక్తి ప్రతిభను బట్టి కవిత గొప్పదనం తెలియాలి.
దానిపట్ల ప్రేమవున్న తెలుగు కవి, ప్రతిభను బట్టి అది మనకు అందుతుంది.
ఇంగ్లీషులో రాసిన కవుల కవిత్వమే సాధికారికంగా మనకు అందలేదు
ఇక ఇంగ్లీషు అనువాదాలనుంచీ ..
తెలుగులోకి వచ్చినవి తెలిపోవడమే కనిపిస్తుంది.

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి