15 జులై, 2012

నా స్మృతిమంటపంలో మహాకవి పుట్టపర్తి




        నా స్మృతిమంటపంలో మహాకవి పుట్టపర్తి

                                           వల్లంపాటి వెంకటసుబ్బయ్య




పుట్టపర్తి నారాయణాచార్యులు గారు 
నాకు గురువు కాదు.
కానీ వారికి నేను శిష్యుణ్ణి.
వారు నాకు ఏ గ్రంథాన్నీ
క్రమబద్ధంగాపాఠం చెప్పలేదు. 
వారి వద్ద “వసుచరిత్ర” 
పాఠం చెప్పించుకోవాలని
నేను చేసిన అనేక ప్రయత్నాలు ఫలించలేదు. 


కాని
30 సంవత్సరాల మా పరిచయంలో 
సాహిత్యాన్ని గురించి 
వారితో మాట్లాడినంత లోతుగా 
మరెవరితోనూ మాట్లాడలేదు.
సాహిత్యతత్వాన్ని గురించి 
వారివద్ద తెలుసుకున్నంతగా
మరెవరివద్దా తెలుసుకోలేదు. 
నాకు గురువు కాని గురువైన వారికీ, 
 వారికి శిష్యుడు కాన్ని శిష్యుడైన నాకూ మధ్య అనుబంధం చిత్రంగా ఉండేది. 


వారి కోపతాపాలూ, 
పాండిత్యం; 
నా అనుభవ రాహిత్యం, 
అజ్ఞానం 
మా అనుబంధానికి 
ఏనాడూ ప్రతిబంధకం కాలేదు. 
నా అజ్ఞానాన్ని కూడా 
తన మహాపాండిత్య ఛత్రచ్ఛాయలో
సేద తీర్చుకోవటానికి ఆహ్వానించిన 


దొడ్డమనసు వారిది.

వారి పేరు నేను తొలిసారిగా విన్నది
 1952లో – 
నేను పదవతరగతి విద్యార్థిగా ఉండగా..
 వారు రాసిన 
ప్రబంధనాయికలు” 
అన్న గ్రంథంలోని “సత్యాదేవి” 
అన్న వ్యాసం మాకు పాఠంగా ఉండేది. 


నాలో తెలుగుసాహిత్యం మీద 
ఆసక్తిని రగిలించిన మా తెలుగు పండితులు
గజేంద్రనాయుడు గారు 
ఆ వ్యాసాన్ని మాకు పాఠం చెప్పారు.


తాను ఎదుగుతూ 
విద్యార్థులు ఎదిగేలా పాఠం చెప్పేవారాయన.
వారే మాకు మొదటిసారిగా 
శ్రీశ్రీని కూడా పరిచయం చేశారు.


అప్పుడప్పుడే తనకు దొరికిన 
“మహాప్రస్థానం” ను క్లాసుకు తీసుకొచ్చి
 “ఇది కొత్తరకమైన కవిత్వం వినండిరా”, 
అంటూ గంటసేపు శ్రీశ్రీ కవిత్వాన్ని 
గొప్ప అనుకంపతో చదివారు. 


ఆ రోజున 
మాలో చాలామంది మనస్సుల్లో 
ఎన్నో కొత్త వాకిళ్ళు తెరుచుకున్నాయి.
ఎంతో కొత్త వెలుగు మాలో ప్రవేశించింది. 
పుట్టపర్తి వారి విషయంలోనూ
వారు అలాగే చేశారు.
“పురాణ కృష్ణుడెటులున్నను 
ప్రబంధ కృష్ణుడు మాత్రము
యువతీ పాంచాలుడే. 
నరకాసురునిపై దండెత్తినాడు కదా.
పదునారు వేల భార్యలను 
కప్పముగా తీసికొన్నాడట. 
రసికత ముందు ధర్మసమస్య గూడ 
కాబట్టలేదు అతనికి. 
వారు మాత్రము ఏరిపారవేసిన గవ్వలు కారు. నరకాసుర చక్రవర్తి గారు తెప్పించిన అచ్చరలు. 
నెల జవ్వనము పాలివోసి
నిగనిగలాడు సొగసుకత్తెలు. 
నరకాసురుని వంటి 
రాక్షసుని బారి నుండి తప్పి వచ్చిన వెనుక 
వారును స్వామి వారి కొలువున కొప్పుకున్నారు” 
-అని ప్రారంభమౌతుంది ఆ వ్యాసం. 


అంతవరకు
చిన్నయసూరి లాంటి వారి 
వచనాన్ని గురించి మాత్రమే తెలిసిన  మాకు 
పుట్టపర్తి వారి వచనం 
కొత్తగా, చురుగ్గా, తియ్యగా వినిపించింది.


మాట్లాడుతున్నట్టుగా ఉన్న వాక్య నిర్మాణం, 
చేంతాళ్ళ లాంటి సమాసాలు  లేకపోవటం, 
అక్కడక్కడా 
చమత్కారంగా ఇంగ్లీషు మాటలు
(రుక్మిణి ఇంటికొచ్చిన నారదుడు ’పిక్చరిస్కు’ గా ఉన్నాడట),
అన్నిటినీ మించి 
మొదటి నుంచి చివరి దాకా 
గలగలలాడే హాస్యం
 మమ్మల్ని మురిపింపజేశాయి. 


పుట్టపర్తి వారు ’శివతాండవం”
అన్న కావ్యాన్ని కూడా రాశారని 
మా ఉపాధ్యాయుడు గారు చెప్పారు.
అప్పటికి వారు కూడా ఈ కావ్యాన్ని చూడలేదట.
“శివతాండవం” నాకు లభించటానికి 
మరో ఐదు సంవత్సరాలు
కాబోలు పట్టింది. 
చిత్తూరు కేంద్రగ్రంథాలయం లో 
“భారతి” పాత సంచికలు తిరగేస్తుంటే 
అకస్మాత్తుగా “శివతాండవం” కనిపించింది.


దాన్ని కాపీ చేసుకుని చదివి 
పులకించి పోయాను.
”శివతాండవం”
 అచ్చు పుస్తకం కోసం 
ఎంత ప్రయత్నించినా దొరకలేదు. 


దాదాపు అదే కాలంలోనే 
నేను కథలు రాయటం కూడా ప్రారంభించాను. 
రాసిన ప్రతి కథా 
“ఆంధ్రప్రభ” లోనో,
”ఆంధ్రపత్రిక” లోనో అచ్చయ్యింది.


 1960 లోనే కాబోలు 
కె.సుబ్బయ్య గారితో నాకు పరిచయం కలిగింది.
 వారు ఆక్రితం సంవత్సరమే 
“తెలుగు సంక్రాంతి” అన్న
 పత్రికను ప్రొద్దుటూరు నుంచీ ప్రారంభించారు. 


రచయితల్నికలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో 
వారు పర్యటనకు బయలుదేరారు.
కుప్పంకెళ్ళి 
అక్కడ కోర్టులో నాజర్ గా పనిచేస్తున్న
బి.నాదముని రాజు గారిని కలిసి, 
చిత్తూరికి వచ్చారు.
”ప్రబంధ నాయికలు”,
“శివతాండవం” 
దొరక్కపోవడాన్ని గురించీ, 
పుట్టపర్తి వారంటే నాకు కలిగిన 
అభిమానాన్ని గురించీ వారితో చెప్పుకున్నాను.


సుబ్బయ్య గారు చాలా మురిసిపోయారు.
“పుట్టపర్తిగారు ’శివతాండవం’
చదివితే నువ్వు విన్నావా?” అని అడిగారు.
వారిని అంతవరకూ చూడనే లేదన్నాను.
“అట్లయితే వారిని
మీ స్కూలుకు పిలిపించకూడదూ?” అన్నారు.
వారిని ఎలా పిలిపించాలో నాకు తెలియదన్నాను.

మీ స్కూలుకు పిలిపించకూడదూ?” అన్నారు.
వారిని ఎలా పిలిపించాలో నాకు తెలియదన్నాను.
కానీ 
బస్ లోంచి దిగుతున్న పుట్టపర్తివారిని గుర్తుపట్టలేకపోయాను.
“ఒరేయ్, నువ్వేనా వెంకటసుబ్బయ్య” 
అన్నారు నన్ను చూసి.
 నేనేనని ముందుకెళ్ళాను.

చేతిలో ఏదో సంస్కృతగ్రంథం – 
వారే పుట్టపర్తి; (బలిష్టమైన విగ్రహం,
మూడు నాలుగు రోజుల గడ్డం,
గూడకట్టు పంచె, పైకి ఎగదువ్విన క్రాఫింగు)

నా గుండె రెపరెపలాడిపోయింది. 
వారి చేతిలోంచి సంచీలందుకున్నాను.


వారు దిగివచ్చి నా భుజం మీద చేయి వేసి -
 “ముందు మంచి కాఫీ తాగుదాం” అన్నారు.

బస్టాండు ఎదుటే ఉన్న 
’మెడ్రాస్ కేఫ్” లోకి వెళ్ళాం. 
వారే రెండు కాఫీలు తెమ్మన్నారు.
కాఫీ తాగి తాజ్ మహల్ బీడీ వెలిగించారు.


వారు బీడీ వెలిగించడం నాకు ఎందుచేతనో 
చాలా చిత్రమనిపించింది.
అంతటి మహాకవీ, 
మేధావి, 
పండితుడూ, 
ముఖ్యంగా
సంస్కృతపండితుడూ, 
బీడీ కాల్చటం 
ఏదో పడమటికొండల్లో  పొద్దుపొడుపులాగా 
విచిత్రంగా కనిపించింది.
వారు మాట్లాడకుండా బీడీ పూర్తి చేసి 
సర్వర్ ను పిల్చి మరో కాఫీ తెమ్మన్నారు. 


నా వైపు తిరిగి 
“కాఫీ బాగుంది. నువ్వూ తాగరా” అన్నారు.
 ఇంతలో సర్వర్ కాఫీ తెచ్చాడు. 
నా సంగతి మర్చిపోయి కాఫీ వారొక్కరే తాగేశారు. 
మరో బీడీ వెలిగించి, 
ఏదో జ్ఞాపకం వచ్చినట్టుగా సంచీ తెరచి, 
ఒక చిన్న పుస్తకం తీసి నాకిస్తూ, 
“ఇదో సుబ్బయ్య నీకిమ్మన్నాడు” అన్నాడు.
అందుకొని చూద్దును గదా – 
అది “శివతాండవం”. 
అలా వచ్చింది
నా చేతికి “శివతాండవం”. 
ఆరోజు సాయంకాలం అరగొండ  పాఠశాలలో 
జరిగిన సభలో 
వారు “శివతాండవం” గానం చేశారు.


అది విన్న ఆనందాన్ని వర్ణించటానికి 
మాటలు చాలవు. 
ఆ కాలంలో పుట్టపర్తి వారు 
“శివతాండవం” ను గానం చేస్తే వినని వారు
 గొప్ప దురదృష్టవంతులు. 
వారి స్వహస్తాల నుంచీ అందుకున్న పుస్తకం,
అదే రోజు వారి గానం 
నా మనసులో శాశ్వతంగా నిలిచిపోయాయి.


“శివతాండవం” మీద నాకున్న అభిమానాన్ని 
కొందరు మార్క్సిస్టు మిత్రులు 
అపహాస్యం చేశారు.
కొద్దిగా బాధ కలిగింది. 


ఆ తరువాత  కొంతకాలానికి 
కొడవటిగంటి కుటుంబరావు గారికి శాస్త్రీయసంగీతమంటే
ఉన్న గాఢమైన అభిమానం కూడా 
అపహాస్యం పాలౌతోందని తెలిసింది.
అప్పుడు అర్థమైంది. 
బాధపడటంలో అర్థం లేదని, 


విశ్వనాథ
 “తెలుగు ఋతువులు“,
పుట్టపర్తి “శివతాండవం“, 
శ్రీశ్రీ “మహాప్రస్థానం“,
కృష్ణశాస్త్రి “కృష్ణపక్షం”, 
విద్వాన్ విశ్వం “పెన్నేటి పాట” 
నా ఆధునిక  పంచకావ్యాలు, 


నా అభిరుచిలో వైపరీత్యం ఏదైనా ఉంది అంటే
అది మానవప్రకృతిలోనే ఉందని నా నమ్మకం.
మరుసటిరోజు చిత్తూరు బస్ స్టాండులో 
అప్యాయంగా నా భుజం  మీద చేయి వేస్తూ 
“సుబ్బయ్య నానా బలవంతం చెయ్యకుండా
ఉంటే వచ్చేవాణ్ణి కాదురా, 
వళ్ళు బాగాలేదు” అన్నారు.


“ఏమీ?” అన్నాను

“ఈ మధ్య బిడ్డకు పెండ్లి చేసినా.
మరుసటి రోజు వాన్లో అందరం కడపకు 
తిరిగి వస్తా ఉన్నాం. 
నేను ఫ్రంట్ సీట్లో ఉన్నా.
రెండు రోజులుగా నిద్రలేకపోవడం వల్ల నిద్రపట్టింది.
ఆ వెధవ వాన్ కు డోర్ సరిగ్గా లేదు. 
అది ఓపెన్ అయిపోయింది. 
వేగంగా  పోతా ఉన్న వాన్ లో నుంచీ 
కింద పడిపోయినా. 
వెనక నుంచీ వాహనాలేవీ రావటం లేదు 
కాబట్టి ప్రాణం దక్కింది. 
దెబ్బలు  మాత్రం బాగానే తగిల్నాయి.” 
అని తన మోకాళ్ళు చూపించారు.
మానుతున్న గాయాలు నల్లగా కనిపించాయి.

ఇంతలో బస్సు వచ్చింది.
సీటు సంపాదించి కూర్చోబెట్టాను

“కడపకు రారా” అన్నారు,
ఆప్యాయమైన చిరునవ్వుతో.
బస్సు కదిలింది.

దాదాపు పదహారు గంటలు 
ధగద్ధగాయమైన ప్రతిభ సాన్నిధ్యంలో 
గడిపిన అనుభవాన్ని 
గుండెలనిండా నింపుకుంటూ 
అలా నిలబడిపోయాను.
 ఆ పదహారు గంటల్లో 
వారు అనేకవిషయాలు చెప్పారు.
శ్రద్ధ గా చదువుకోమన్నారు. 
ఇంగ్లీషు బాగా నేర్చుకోమన్నారు.
పద్యాలు రాయటం మానేసి 
నవలలు కథలు రాయమన్నారు                          


                               ***

అలా ప్రారంభమైన మా పరిచయం 
మూడు దశాబ్దాలు 
అవిచ్ఛిన్నంగా కొనసాగింది. 


ఆ కాలంలో 
ఎన్నిసార్లు కలుసుకున్నామో చెప్పలేను.
వారు మా ప్రాంతాలకు వస్తే 
నాకు ముందుగా ఉత్తరం రాసేవారు.


లేదా
 వారిని ఆహ్వానించిన వారితో 
తాను వస్తున్నట్లుగా నాకుతెలియజేయమనేవారు.
నేను ఆ ఊరికి వెళ్ళేవాణ్ణి.
వారితో కలిసి ఉండేవాణ్ణి.
వారిని కడప బస్సు ఎక్కించి నేను 
మా ఊరు చేరుకునే వాణ్ణి
.
వారు చిత్తూరికి వచ్చినా, 
మదనపల్లికి వచ్చినా 
మా ఇంట్లోనే ఉండేవారు
నేను తరచుగా కడపకు వెళ్ళేవాణ్ణి. 
మేమిద్దరం కలిసి ఉంటే,
నేను ప్రశ్నలు వేయటం,
వారు జవాబులు చెప్పటంగా
మా సంభాషణ కొనసాగేది. 


వారితో కలిసి వేలూరు, తిరుత్తణి,
ఘటికాచలం,రమణాశ్రమం వెళ్ళాను.
తమిళ గ్రంథాలు కొనుక్కోడానికి
ఒకసారి మద్రాసు కూడా వెళ్ళాం.
వారు బస్సుల్లో కూడా చదువుకునేవారు.


సాధారణంగా మాట్లాడేవారు కారు. 
బస్సు దిగి మిత్రుల ఇంట్లోనో,అరుదుగా
హోటల్లోనో సర్దుకున్న తరువాత 
సర్దాగా ఉండేవారు.
ఉత్సాహంగా ఉంటే తాను రాస్తున్న 
“రామాయణం” నుంచో,
”శ్రీనివాస ప్రబంధం”
 నుంచో కొన్ని ఘట్టాలు చదివి వినిపించేవారు.


వారు కవిత చదివి వినిపిస్తున్నప్పుడు 
వై.సి.వి.రెడ్డి గారుంటే చాలా హుషారుగా ఉండేది.
ఆయన వారి కావ్యగానానికి అడ్డుతగిలి, ఆపి, వ్యాఖ్యానం చేసేవారు.


ఇతరులు ఆ పని చేస్తే 
పుట్టపర్తి వారు సహించేవారు కాదు.
కానీ
 వై.సి.వి.రెడ్డి గారు చేస్తే ఆనందించేవారు.
వారిద్దరి మధ్యా 
ఒకవిచిత్రమైన ప్రేమానుబంధం ఉండేది.
ఒకర్నొకరు అభిమానించుకోవటంలో 
తమ విశ్వాసాల సరిహద్దుల్ని దాటివచ్చేవారు.
 వై.సి.వి తన కమ్యూనిజం
విశ్వాసాల సరిహద్దుల్ని దాటి వచ్చి 
పుట్టపర్తి వారి భక్తిని ఆప్యాయంగా
 కౌగిలించుకునేవాడు. 


ఒక్క వై.సి.వి కి మాత్రమే కాదు, 
పుట్టపర్తి వారి విషయంలో 
అలాంటి సహనం 
గజ్జల మల్లారెడ్డికి,  
రాచమల్లు రామచంద్రారెడ్డి
 (రా.రా) కీ కూడా ఉండేది.


అంతమాత్రం చేత వాళ్ళు 
పుట్టపర్తి వారి భావజాలాన్ని ఆమోదించేవారని కాదు. వారిని తీవ్రంగా
విమర్శించేవారు, 
చెప్పదలుచుకున్న విషయాలను 
దాపరికాలూ,
మొహమాటాలూ లేకుండా 
వారి మొహం మీదే చెప్పేవారు.


తీవ్రమైన అభిప్రాయభేదాలు వారిమధ్య ప్రేమానుబంధాలకు ఏనాడూ అడ్డుకాలేదు.
 1961 లో కాబోలు 
మేఘదూతం” మీద వ్యాసం రాయటానికి
అనుమతి కోరుతూ ఉత్తరం రాశాను. 
“మనవైపు నుండీ మంచి
సమీక్షావ్యాసాలు రావటంలేదు. 
“మేఘదూతం” మీద నువ్వు వ్యాసం రాయి.
నువ్వు బాగా రాయగలవు.” 
అని ప్రోత్సహిస్తూ జవాబు రాశారు. 


నెలరోజులు కష్టపడి వ్యాసం రాశాను.
అది దాదాపు వెంటనే 
“విశాలాంధ్ర” లో అచ్చయ్యింది.
అందులోని
అభ్యుదయాంశనూ, 
ఛందోవైవిధ్యాన్నీ,
గొప్ప కవితాశక్తిని
గౌరవిస్తూనే 
ఆ కావ్యంలో “romantic vulgarity” 
ఉందని రాశాను.


నాకు తోచింది రాసేశాను.
కానీ అలా రాయచ్చా, రాయకూడదా
అని ఆలోచించలేదు. 
ఆ వ్యాసం అచ్చయిన రెండు మూడు నెలలకు 
పుట్టపర్తి వారు చిత్తూరికొచ్చారు.
 ఆ వ్యాసం ఎలాగుందని 
చాల సంబరంగా అడిగాను. 
“బాగుంది.
 నువ్వు ఆ కావ్యంలో romantic vulgarity ఉందన్నావు. 
రెండుమూడు చోట్ల ఉన్నమాట నిజమే. 
మనం చాలా శతాబ్దాలుగా
 శృంగార భావాలను, 
పదాడంబరాన్ని 
కవిత్వంగా పొరబడుతూ వచ్చాం.


శృంగార భావాలు కొంచెం దిగజారితే 
“romantic vulgarity” అవుతాయి.
కవిత్వం 
ఎన్నో ఇతర రకాలుగా ఉండవచ్చునన్న సత్యాన్ని
మనలో చాలామంది గుర్తించలేకపోయారు. 
ఇది ప్రధానంగా
ప్రబంధ సంప్రదాయం. 
దాన్నుంచి బయటపడడం చాలా కష్టం –


మరీ ముఖ్యంగా 
ఆ సంప్రదాయంలో రాస్తున్నప్పుడు”
 అన్నారు.
వారి సహిష్ణుతకూ, 
సహృదయతకూ నమస్కారం చేసుకున్నాను

“నువ్వు ఆయన్న ఏమనుకుంటాడో, 
ఈ యప్ప ఏమనుకుంటాడో
అని ఆలోచించవద్దు. 
నీకు సత్యమనిపించింది రాసెయ్”, అన్నారుమళ్ళీ.


వారు ఆనాడిచ్చిన సలహాను 
నేనీనాటికీ పాటిస్తున్నాను.

1962 లో 
నేను రాసిన “ఇంద్రధనుస్సు” నవలకు 
ఆంధ్రప్రభ పోటీల్లో
 రెండవ బహుమతి వచ్చింది.
అది ధారావాహికంగా రావటం
 పూర్తి కాగానే పుస్తకంగా వచ్చింది. 


పుస్తకాలు అందిన రోజే
పుట్టపర్తి వారికో కాపీ పంపుకున్నాను. 
పది రోజుల్లోగా,
“నీవుపంపిన పుస్తకాన్ని చదివాను. 
మిత్రుల చేత చదివించాను” 
అని ప్రారంభించి
ఎంతో ప్రోత్సాహకరంగా ఉత్తరం రాశారు. 


తరువాత కొన్నాళ్ళకు
కలిసినప్పుడు ఆల్డస్ హక్స్ లీ రాసిన, 
point counter point
చదివావా?” 
అని అడిగారు.
లేదన్నాను. 
నువ్వు మంచి నవలలు
రాయాలంటే ఆ నవలను తప్పకుండా చదువు. 
స్త్రీ పురుషసంబంధాలలోని హిపోక్రసీని 
అంత గొప్పగా చిత్రించిన నవలమరొకటి లేదు” అన్నారు. 
వారికా నవలంటే చాలా ఇష్టమనీ,
దాన్ని వారు అనేకమార్లు చదివారని 
తరువాతి కాలంలో తెలుసుకున్నాను.


వారి చదువును గురించి, 
పాండిత్యాన్ని గురించీ చెప్పటానికి
నా చదువూ, పాండిత్యమూ సరిపోవు. 
వారి విజ్ఞాన దాహానికి హద్దులేదు. 


ఏ భాషలో ఏముందో, 
అది రాకపోతే 
మనకు ఏం తెలియకుండా పోతుందో అన్నట్టుగా భాషలు నేర్చుకునేవారు, 
చదువుకునేవారు.
వారికో చిత్రమైన అలవాటు ఉండేది. 
అచ్చుపుస్తకాన్ని చూస్తే వారికి
ఆత్మీయత అంతగా కుదిరేది కాదు.
తాను మళ్ళీ మళ్ళీ చదవాలనుకున్నపుస్తకాల్ని 
తానే స్వయంగా కాపీ చేసుకునేవారు. 


ఆ పుస్తకం మీద
ఎర్రసిరాతో అర్థాలూ, 
వ్యాఖ్యలూ రాసుకునేవారు. 


అలా వారు కాపీ
చేసుకున్న కొన్ని షేక్స్పియర్ నాటకాలూ, 
ఇతర గ్రంథాలూ 
ఇప్పుడు 
బ్రౌన్ మెమోరియల్ గ్రంథాలయం (కడప) లో ఉన్నాయి. వాటినిచూస్తే 
పుట్టపర్తివారి పాండిత్యం వెనక ఉన్న శ్రమ 
ఎంతటిదో అర్థమవుతుంది.


ఇరవయ్యవ శతాబ్దపు కవుల్లో 
పుట్టపర్తివారిని సుదూరంగా పోలిన
పండితుడు కూడా లేడన్నది నా దృఢవిశ్వాసం.
 వై.సి.వి రెడ్డి వారిని గురించి 
“కవిత్వం రాసేదానికి 
ఇంత చదువుకోవాల్సిన అవసరం లేదప్పా” 
అనేవారు.

వారికి చదువు ఎంత తీవ్రమైన వ్యసనమో 
సూచించటం కోసం ఒక సంఘటన చెబుతాను. 1985-86 ప్రాంతంలో 
ఒక రేడియో ప్రోగ్రాంరికార్డింగు ఉండి 
కడపకు వెళ్ళాను. 


ఆకాశవాణి కేంద్రంలో అనుకోకుండా 
శతావధాని నరాల రామారెడ్డి కలిశారు. 
కాస్సేపు కబుర్లు చెప్పుకుని,
భోజనం చేసి, 
రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో 
పుట్టపర్తివారింటికి వెళ్ళాం.


కనకమ్మ గారు ఎదురుపడి 
ఆప్యాయంగా ఆహ్వానించి,
 “అయ్యగారు మిద్దెమీదున్నారు, వెళ్ళండి”
 అన్నారు. 


ఇద్దరం మేడ మీదికి వెళ్ళాం, 
పుట్టపర్తి వారు తన మామూలు పద్ధతిలో 
కరణం డెస్కు ముందు కూచొని 
ఏదో వల్లె వేస్తున్నట్లు కనిపించారు.
“ఒరే దొంగవెధవలిద్దరూ ఎక్కడ కలిసినార్రా?”
 అని ఆహ్వానించారు.
చెప్పాం. 
క్షేమసమాచారాల పలకరింపులైపోయాక -

“ఇదేదో చాలా పెద్ద పుస్తకం పట్టారే” అన్నాను 
డెస్కు మీదున్న బండ లాంటి 
పాత సంస్కృత గ్రంథాన్ని చూపుతూ
 పుట్టపర్తివారు 
ఆ గ్రంథాన్ని ఆప్యాయంగా తాకుతూ అన్నారు.

“ఒరే ఈ మధ్య ఒక సంగతి జరిగిందిరా. 
బళ్ళారి వాళ్ళు పిలిచినారు.
వెళ్ళినా.
 ’ఆముక్తమాల్యద’ను గురించి, 
ముఖ్యంగా అందులోని వైష్ణవ తత్వాన్ని గురించి, బాగానే మాట్లాడినా. 
సభ తరువాత ఒకతను కలిసినాడు. 
అతడు నాకంటే పెద్దవాడు. 
అతడు 
“మీ ఉపన్యాసం వింటే 
మీరు అద్వైతమూ, విశిష్టాద్వైతమూ 
బాగా చదువుకున్నారే కానీ 
ద్వైతాన్ని అంత శ్రద్ధగా చదువుకోలేదని తెలిసింది. మీరు ద్వైతాన్ని బాగా చదువుకొని ఉంటే 
మీ ఉపన్యాసం మరొక రకంగా ఉండేది.”, 
అన్నాడు.


నిజమే. 
నేను ద్వైత వేదాంతాన్ని 
అంత శ్రద్ధగా అధ్యయనం చేయలేదు.
చాలా సిగ్గనిపించింది. 
ఈ పుస్తకం పేరు “ద్వైత పారిజాతం” 
దీన్నికర్ణాటకలో ఒక మఠం నుంచి తెప్పించి 
చదువుతూ ఉన్నా. 
మరో రెండునెలల్లో పూర్తయిపోతుంది.”
పుట్టపర్తి వారి దృష్టిలో 
“చదవటం” అంటే ఏమిటో 
చాలామందికితెలియదు.
 వారు “ద్వైత పారిజాతం”ను 
ఎలా చదువుతూ ఉన్నారోచూస్తే 
వారి చదవటం కొద్దిగా అర్థమౌతుంది. 
మొదట మూలంలో నాగరలిపిలో ఉన్న శ్లోకాన్ని తెలుగు లిపిలో కాపీ చేసుకోవడం,
తరువాత సంస్కృత వ్యాఖ్యను చదివి, 
అర్థం చేసుకొని, 
అందులోని ప్రధానాంశాలను 
తెలుగులో తన నోట్ బుక్ లో రాసుకోవటం,
 ఆ తరువాత ఆ శ్లోకాన్ని కంఠస్థం చేయటం, 
అంతకు ముందు కంఠస్థం చేసుకున్న శ్లోకాలతో
 దాన్ని కలిపి మననం చేసుకోవటం,
 మరో శ్లోకానికి వెళ్ళటం. 
వారు సంస్కృత మహాకవుల్ని చదివినా
 షేక్స్పియర్ నాటకాలను చదివినా 
“పారడైస్ లాస్ట్” ను చదివినా
ఇలాగే “చదివారు”. 


చదవటమంటే ఆ గ్రంథాన్ని ఆమూలచూడంగా
తన స్మృతిపేటికలో భద్రపరచుకోవటం. 
పిలిచినప్పుడు పలికేలా ఉంచుకోవటం.
 “ఆయనెవరో మీరు ద్వైతవేదాంతం 
బాగా చదువుకోలేదంటే దానిమీద పడిపోయారు. 
ఇలా మీ విలువైన కాలాన్ని వృథా చేస్తున్నారు.
 మీ సొంత సాహిత్య కృషిని కూడా మానేశారు. 
ఇదేం పద్ధతి? 
నేను మీకింకేదో రాదంటాను. 
మీ చదువూ, రాతా మానేసి 
దాన్నినేర్చుకుంటూ కూర్చుంటారా?” 
అన్నాను.
“ఏం రాదంటావూ?” అన్నారు.

“న్యూక్లియర్ ఫిజిక్స్ రాదంటాను. దాన్ని నేర్చుకుంటారా?” అన్నాను.
రామారెడ్డి హాయిగా నవ్వారు.

పుట్టపర్తి వారు గంభీరంగా మారిపోయారు. 
ఒకటి రెండు నిముషాలు నిశ్శబ్దంగా ఉండిపోయి..

“నేను చేస్తున్న సాహిత్య కృషికి 
నువ్వు చెప్పిన న్యూక్లియర్ ఫిజిక్స్
 అవసరమని నిరూపించరా. 
అది తెలిసినవాణ్ణి ఆశ్రయించి 
దాన్నినేర్చుకుంటాను.” 
అన్నారు. నేనూ, రామారెడ్డి అవాక్కయిపోయాం.

ఆరోజు గురువుగారు మాకు సాక్షాత్కరించారు అనుకున్నాం.
 ఆ తరువాత 
“చూడరా సుబ్బయ్యా, మీది సిగ్గూ ఎగ్గూ లేని తరం.
మీకు చదువరంటే గౌరవం లేదు. 
ముఖ్యంగా ఆత్మగౌరవం లేదు.
మా తరం వేరు.
ఎవరైనా నారాయణాచార్లు కవి కాదంటే 
నేనుబాధపడను. 
కోపం చేసుకోను. 
నేను రాసే కవిత్వం ఆయనకునచ్చలేదేమోలే అనుకుంటాను. 
కానీ నాకు చదువు తక్కువంటేమాత్రం భరించలేను. నిజంగా తక్కువే ఐతే చదువుకుంటాను.
చదువుకు వయస్సు అడ్డు రాకూడదు.” అన్నారు.

నిజమే, 
చదువు క్రమక్రమంగా విశాలమైపోతున్న ఈ కాలంలో
సాహిత్యకారులకు 
చదువు పట్ల ఉండవలసిన వినయం ఉండడంలేదు. అందుకే కాబోలు 
పుట్టపర్తి వారు తన “శ్రీనివాస ప్రబంధం”లో
’అల్పము నేర్చి వాఙ్మయ మహాంబుధి గ్రోలినయట్లు క్రంతలన్
 జల్పములాడు.. వంచనాశిల్పుల్ని’ గురించి 
ప్రత్యేకంగా పేర్కొన్నారు.


వారు చాలా తరచుగా, 
చదువుకున్న ప్రతివాడూ రాయాలన్న
 సిద్ధాంతం ఎక్కడా లేదని చెబుతుండేవారు. 
తన వంశాన్ని గురించి
చెప్పినప్పుడు కూడా 
వారు పాండిత్యానికే పెద్దపీట వేశారు -

నా తల్లి భక్తిసాన్నాయ్య జీవిత, సంస్కృతాంధ్రభాషావచనాభిరామ
 నా తండ్రి రసజగన్నాథుండు, 
నా దృష్టి నఖిలేశ్వరునకు రూపాంతరమ్ము
మద్భార్య వాల్మీకిమాకందమాధుర్యరచనావిశేషవిశ్రాంతహృదయ
వైష్ణవాగమసమభ్యాససౌగంధ్యనిష్ఠాదృష్ణులుభయవంశముల వారు
అని సగర్వంగా చెప్పుకున్నారు. 


మరొక సందర్భంలో..

“ఒకనాడు గీర్దేవతాకమ్రకంకణ స్వనమైన మాధురీ ప్రతిభ మాది.
ఒకనాడు రామానుజ కుశాగ్రబుద్ధిచే చదువు నేర్చినది వంశమ్ము
మాది” అని కూడా సగర్వంగా చెప్పుకున్నారు. 


వారి చదువును గురించి చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయి. 
ఇప్పటికి ఈ ఒక్క ఉదాహరణతో సంతృప్తి పడి 
కాస్త వెనక్కు వెళ్తాను.
1963లో కాబోలు 
గుంటూరు శేషేంద్రశర్మ గారు 
చిత్తూరికి మునిసిపల్కమీషనర్ గా వచ్చారు. 
అప్పుడు నేను 
చిత్తూరులోని హయ్యర్ సెకండరీస్కూల్లో 
అసిస్టెంట్ గా పని చేస్తున్నాను. 


శేషేంద్ర చిత్తూరికి రావటానికిపూర్వమే
 “ఋతుఘోష” పూర్తి చేశారు. 
ఆ కావ్యం నాకు చెప్పలేనంతగానచ్చింది. 


ఒకరోజు సాయంకాలం 
శేషేంద్రా.. నేనూ ..
మునిసిపల్ఆఫీసులోనే మేనేజరుగా పనిచేస్తున్న రచయిత ముత్తరాజు సుబ్బారావుగారూ 
నండూరి  పార్థసారథి గారూ 
కూచుని కబుర్లు చెప్పుకుంటున్నాం.


“ఋతుఘోష” కు 
ఎవరో గూడూరు మిత్రుడు 
ప్రచురణ ఖర్చు భరిస్తానన్నాడనీ,
 పీఠిక రాయిస్తే బావుంటుందా 
అని ప్రశ్నించారుశేషేంద్ర. 


మిత్రులంతా
తప్పకుండా పీఠిక ఉండాల్సిందేనన్నారు. 
ఎవరు రాస్తే బావుంటుందన్న సమస్య వచ్చింది. 
నేను పుట్టపర్తివారి పేరు సూచించాను.

“వారితో నాకు పరిచయం లేదు, రాస్తారా?” 
అన్న సందేహాన్ని వెలిబుచ్చారు శేషేంద్ర.
 నేను రాయిస్తానని బాధ్యత స్వీకరించాను.

శేషేంద్ర ఆ కావ్యాన్ని అందంగా ఫేర్ కాపీ చేయించి, ఛార్జీలకుడబ్బులిచ్చి 
కడపకు వెళ్ళి రమ్మన్నారు.
“Let us try our luck” అన్నారు శేషేంద్ర.

“ఋతుఘోష” ను చదువుకుంటూ 
నేను కడప చేరేసరికి ఉదయం పది గంటలైంది. 
పుట్టపర్తి వారు ఇంట్లో లేరు. 
అమ్మగారితో మాట్లాడుతూ కూచున్నాను. 
కొన్నాళ్ళ క్రితం వారి అమ్మాయి తులజ 
తన స్నేహితురాళ్ళతో పాటు చిత్తూరికి రావటం, వాళ్ళను నేను 
సుగర్ ఫ్యాక్టరీకి తీసుకువెళ్ళి చూపించడం 
మొదలైన విషయాలు ప్రస్తావించుకుంటున్నాం. 


ఇంతలో పుట్టపర్తి వారొచ్చారు.

“ఎప్పుడొచ్చినావురా?” 
అంటూ ఆప్యాయంగా పలకరించారు.

పలకరింపులూ, క్షేమసమాచారాలూ అయ్యాక, 
మెల్లగా వినయంగావచ్చిన పని చెప్పాను.


వారికి తక్షణం కోపం వచ్చింది.
 “రాయను పోరా” అన్నారు.

శేషేంద్ర మంచి కవనీ, 
మంచి స్నేహితుడనీ 
మీరంటే చాలా అభిమానం ఉన్నవాడనీ చెప్పాను.

“వాడు మంచి కవో, మహాకవో నాకు అక్కర్లేదు. 
నేను రాయనంటే రాయను” 
అని గట్టిగా చెప్పారు.
 “ఎందుకూ?” అని అడిగాను.

“ఆ ఉత్తరాదోడికి నేనెందుకు రాయవల?”
 అన్నారు చాలా కోపంగా.

ఉత్తరాదోడంటే కోస్తా జిల్లాల వాడని అర్థం. 
పుట్టపర్తి వారికి కోస్తా జిల్లాలలో 
సాధారణంగా కనిపించే డబ్బు పొగరన్నా,
సాంస్కృతిక ఆధిక్యతా భావమన్నా, 
ప్రాంతీయ తత్వమన్నా చాలా అసహ్యం. 


కోస్తా జిల్లాల వారు 
తన ప్రతిభను గుర్తించలేదన్నభావం 
వారి అంతరాంతరాల్లో ఉండేది. 
కోస్తా జిల్లాల్లో 
తానునిరాదరణను మాత్రమే కాకుండా, 
అపహాస్యాన్ని, అవమానాన్నీ
కూడా రుచి చూసినట్టుగా వారు పదే పదే చెప్పేవారు.


శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు 
తనతో ఎంత అవమానకరంగా ప్రవర్తించారో చెప్పేవారు. “మీ ప్రాంతం వాళ్ళు సంస్కృతం
కూడా చదువుకుంటారా?” 
అని వారు హేళన చేస్తే తాను తిరగబడి 
తెలుగులో, సంస్కృతంలో ఆశువుగా 
పద్యాలూ, శ్లోకాలు చెప్పి 
వారిని ఎలా ఎదుర్కొన్నదీ చెప్పేవారు


 ఆ సందర్భంలో వారు 
గోదావరి మీద ఆరోపించి చెప్పిన
 ఒక పద్యం మాత్రం నాకు గుర్తుండిపోయింది.
హేరాళంబిదె నాదు భాగ్యమని నీ వెంతో ఘోషింతు, నీ
వారింజూచితి లెమ్ము, చెప్పకుము గొప్పల్ లిప్సగా గౌతమీ
ధారావర్ధిత గోస్తనీ రస సముద్యుత్తుంగ భద్రానదీ
స్వారస్యంబుల ముందు తావన్ పయః పానంబు శోభించునే
మరొక సందర్భంలో 
విజయవాడలో ననుకుంటాను 
వారినెవరో “విద్వాంసుడు”, 
“మీరు మాట్లాడేది తెలుగేనా?” అని అడిగాడు.
అందుకు పుట్టపర్తి వారు 
“తెలుగంటే మాదే, మీది కాదు. 
అంతేకాదు,సాహిత్యమంతా కూడా దాదాపు మాదే. ఒక్క నన్నయ భట్టు తప్ప
 మిగిలిన అందరూ రాసింది మా భాషే. కావాలంటే నన్నయ్య భట్టును మీరుంచుకొని 
మిగిలిన తెలుగు సాహిత్యాన్ని మాకిచ్చెయ్యండి” అన్నారట.

ఇలా ఎన్నో చేదు అనుభవాలు 
వారిని కాస్త పెళుసుగా తయారు చేశాయి. 


అందుచేతనే వారు శేషేంద్ర కావ్యానికి 
పీఠిక రాయనన్నారు.


 ఇంతలో కనకమ్మ గారు మిద్దెమీదికొచ్చి
 “ఏంరా, గురుశిష్యులేమో కొట్లాడుకుంటాఉన్నారు?” అన్నారు.

“ఏం లేదు, ఎవడో ఉత్తరాదోడు ఒక కావ్యాన్ని గిలికినాడంట.
వాడు వీడికి స్నేహితుడంట. 
దానికి నేను పీఠిక రాయాల్నంట” 
అన్నారు కోపంగానే.
 “పీఠికదేముంది, రాస్తే రాయొచ్చు,

లేదా మానెయ్యొచ్చు.
ముందు భోజనం కానివ్వండి” 
అన్నారు నవ్వుతూ.
 పుట్టపర్తి వారు

చిరచిరలాడుతూనే అన్నం తిన్నారు.
తరువాత పడుకొని నిద్రపోయి 
నాలుగ్గంటలకు లేచారు.
అంతవరకు 
అమ్మగారితో మాట్లాడుతూ కూచున్నాను.
నాలుగ్గంటలకు కాఫీ గ్లాసుతో పైకెళ్తున్న అమ్మగారితో పిల్లిలాగా పైకెళ్ళాను.

“ఏంరా, నువ్వింకా పోలా?” అన్నారు, నన్నుచుసి.
“వాడెక్కడికి పోతాడు? 



వాడు ఆ కావ్యమేదో చదువుతాడు.
వినండి. 
నచ్చితే పీఠిక రాయండి. 
నచ్చకపోతే వాణ్ణి నెత్తినగుడ్డేసుకుని పొమ్మనండి.. 
ఒరే సుబ్బయ్యా చదవరా” 
అన్నారు ఆమె.

పుట్టపర్తి వారు కాఫీ ముగించి
 “ఊ.. చదవరా..” అన్నారు.

మొదటి రెండు పద్యాలూ వారు శ్రద్ధగా వినలేదు.
 మూడవ పద్యంలో 
’సుమ సముద్రము’ అన్న మాట వస్తే
ఆ మాటను తనలో తాను ఒకసారి అనుకున్నారు. 


“కల్యాణ
హృదంతరాళ కలకంఠ స్వైరఘంటాపథ వ్యాకీర్ణ స్వర మాధురీ
లహరులై” 
అన్న సమాసాన్ని విని గట్టిగా నవ్వారు.
“శ్రీనాథుని మాదిరీ బిగువుగా రాస్తాడయ్యా” అని కనకమ్మ గారు వెళ్ళిపోయారు.

ముదుసలి తల్లిదండ్రులును ముగ్గురు పిల్లలు చిన్నచెల్లెలున్
ఒదిగి పరున్న జీర్ణకుటిలో ఇటువైపున్న భార్య యావలన్
జిదుకుల చెంత తాను శయనించును కన్నులు మూసి, మిన్నులన్
దదియ శశాంక రేఖయు నిశాంత నిశాగతి నస్తమింపగన్
-అన్న పద్యాన్ని చదివాను.
 “ఎవడ్రా వీడు! పద్యాన్ని ఇంత అశ్రమంగా రాస్తాడు” అన్నారు.
వారి ముఖంలోకి ప్రసన్నత వచ్చేసింది.
బ్రతికిపోయానురా దేవుడా అనుకున్నాను.
 మళ్ళీ చదవటం ప్రారంభించాను.
ఎవడో చాకలి ఆకలిన్ మరచి తానే దన్యమల్లీలతా
నివహక్రోడ పుటీతటాకముననో నిత్యశ్రమాజీవన
వ్యవసాయం బొనరించుచున్న ధ్వనియే వ్యాపించె ప్రాపంచిక
వ్యవహార ప్రవిహీన విశ్వహృదయ వ్యాపారమేమోయనన్.”
అన్న పద్యాన్ని చదివాను


ఆ పద్యాన్ని మళ్ళీ ఒకసారి చదివించుకున్నారు పుట్టపర్తివారు.

“ఒరే, వీడెవడో నిజంగానే మంచి కవి.
పద్యంలోని లగువులన్నీ వీడికి తెలుసు. 
వీడికి పీఠిక రాద్దాం. 
పుస్తకం నాకిచ్చి నువ్వెళ్ళిపో” అన్నారు.
నెల రోజుల తరువాత 
అద్భుతమైన ముందుమాట టపాలో వచ్చింది.

శేషేంద్ర పులకించిపోయారు.
మాట దక్కించుకున్నందుకు నేనూసంబరపడిపోయాను. 
ఉప్పు సెనగలూ, కారం పకోడీలు తెప్పించుకుని
 స్నేహితులందరూ పండగ చేసుకున్నాం. 


పుట్టపర్తి వారూ,
శేషేంద్రా మంచి స్నేహితులైపోయారు కూడా…
 మానవ సంబంధాలలో పుట్తపర్తి వారికి

కులమతాల పట్టింపులుఉండేవికావు.


 తాను వీరవైష్ణవుల కుటుంబంలో పుట్టిన వాడైనా “శివతాండవం” రాశారు.
 “శ్రీవిష్ణురేవ పరతత్వ మితిబ్రువంతః

శర్వస్స ఏవ పరయిత్యభి భర్తృయంతః
తేతేగతా వితతనైగమ వావదూకాః”…..
అంటూ త్యాగరాజును
 “అద్వైత సారసరణే” అన్నారు.


అప్పుడప్పుడూ సంభాషణల్లో
 “నా బుద్ధి అద్వైతం, 
హృదయం విశిష్టాద్వైతం”
అని నవ్వేవారు.


కొంతమంది బంధువులకు ఇది నచ్చేది కాదు.
వారిలో కొందరు “శివతాండవం విన్న వీరినోట కృష్ణలీలలు వినాలని
 ఉంది” అనో, 
లేకపోతే 
“శివతాండవం కన్నా మేఘదూతం మేలైన రచన
” అనో సన్నాయి నొక్కులు నొక్కేవారు.


 చాలా మంది బ్రాహ్మణులు
వారిని చెడిపోయిన బ్రాహ్మణ్ణిగానే చూసేవారు. కడపవీధుల్లో
జట్కాసాయిబుల భుజాల మీద చేయి వేసుకుని నడుస్తున్నవారిని చూసి 
లోపల్లోపల అసహ్యించుకునేవారు. 
ఎదుట పడ్డప్పుడు మాత్రం పాదాభివందనాలుచేసేవాళ్ళు.
పుట్టపర్తివారికి ఆధ్యాత్మిక, 
సాహిత్య శిష్యుల్లో అన్ని జాతులవాళ్ళూ
 మతాల వాళ్ళూ ఉండేవారు. 
వారి దగ్గర క్రమంగా పాఠం చెప్పించుకున్న కథారచయిత “సత్యాగ్ని” (షేక్ హుసేన్), 
సంపాదకుడు “శశిశ్రీ” (రహంతుల్లా) 
ఇద్దరూ ముస్లిములే.


తులసీదాసుకు శ్రీరాముడు సుల్తాను రూపంలో దర్శనమిచ్చాడని
 కూడా వారు చెబుతుండేవారు. 
వారిమీద సూఫీతత్వం ప్రభావం
 బలంగానే ఉండేదనుకుంటాను. 
వారు చిన్నతనంలో రాసిన “షాజీ”
 కావ్యం నుంచే ఆ ప్రభావం ప్రారంభమైంది. 
అది జీవితాంతం కొనసాగింది.

ఉపన్యసించడానికి పుట్టపర్తి వారిని చిత్తూరికి పిలిచాం. స్థానికులుకదా అని ఆ సభకు అధ్యక్షులుగా పూతలపట్టు శ్రీరాములురెడ్డి గారిని పెట్టాం. శ్రీరాములురెడ్డి గారు చాలా మంచివారు. 
 కానీసమకాలీన సాహిత్య రంగంలో

ఏం జరుగుతోందో 
వారు పూర్తిగాపట్టించుకునేవారు కారు. 
ఉపన్యాసాల్లో కూడా దాదాపు గ్రాంథికమేమాట్లాడేవారు.
ఆరోజు సభలో 
శ్రీరాములురెడ్డి గారిని 
మధురాంతకం రాజారాం గారూ, 
పుట్టపర్తివారిని నేనూ పరిచయం చేశాం. 
శ్రీరాములురెడ్డిగారు 
అధ్యక్షుని తొలి పలుకులు పలుకుతూ, 
“ఈమధ్య నేనొక పుస్తకాల కేటలాగును చూచితిని. అందులో “మిట్టపండ్ల మిటారి”, “
పెట్టమారి మగడు” 
మొదలైన అనేక పుస్తకములుండెను.


ఆధునిక సాహిత్యమనగా నిట్టిది. 
దానిని గూర్చి ఆచార్యులు గారు ప్రసంగింతురు. 
వారు మహాకవియట. 
అనేక భాషలలో పెద్ద పండితులట. 
ఈ విషయములు వారిని పరిచయం చేసిన
వారి శిష్యులు చెప్పిరి..” 
అన్నారు.


నాకూ, నా మిత్రులకూ ఏం జరగబోతోందో అర్థమైపోయింది. 
దాన్ని ఆపే శక్తి కూడా మాకు లేదని తెలుసు. 
కాబట్టి 
మాకు కాళ్ళూ చేతులూ ఒణకటం ప్రారంభించాయి.


పుట్టపర్తివారు లేచారు


రెండు చేతులూ పైకెత్తి కుర్తా రెక్కల్ని
మోచేతుల మీదికి తోసుకున్నారు. 
అది ఎంత ప్రమాద సూచనోమాలో కొందరికి తెలుసు. 


సభను కానీ, 
అధ్యక్షుణ్ణి కానీ
సంబోధించకుండా ప్రారంభించారు.


“మా తాతగారు కుకవుల మొహం చూసేవారు కాదు.
అలాంటివారు ఎక్కడైనా సభలోనో, సమావేశంలోనో తారసపడితే
ఇంటికి పోయి, స్నానం చేసి, గాయత్రి చేసుకునేవారు. అది వారి
దృష్టిలో వైష్ణవం. 
మా నాన్నగారున్నారు. 
వారు హోటళ్ళకువెళ్ళరు. 
హోటళ్ళకు వెళ్ళకపోవటమే వారి దృష్టిలో వైష్ణవమతం.
నేనున్నాను. 
నిద్ర లేస్తూనే హోటలుకు వెళ్తాను. 
అక్కడ కొన్నివేలపద్యాలు రాసినా 
ఒక్క గీతలోకి కూడా కవిత్వం జొరబడకుండా 
జాగ్రత్తపడిన కుకవిగాళ్ళు కనిపించినా 
వారితో కలిసి కాఫీ తాగుతాను. 
అదినా వైష్ణవమతంలో ఒక భాగం. 
జీవితంలోనే కాదు, 
సాహిత్యంలో కూడా మార్పులు వస్తాయి. 
అందులో ఎంతో సెన్సూ, నాన్సెన్సూ
ఉంటుంది. 
ఎవడెవడి జన్మ పరిపాకాన్ని బట్టి 
ఎవడికి ఏది అందాలో అది అందుతుంది. 
ఆధునిక సాహిత్యంలోని నాన్సెన్సును గురించి
అధ్యక్షుల వారు మాట్లాడారు. 
సెన్సును గురించి నేను మాట్లాడతా”
 అంటూ 
మూడు గంటలా పది నిముషాల సేపు ప్రసంగించారు.


ఉపన్యాసం పూర్తయ్యేసరికి శ్రీరాములురెడ్డి గారు, శరీరమంతాబాణాలు నాటుకున్న
 సైనికుడిలా అగుపించారు. 
వేదిక దిగుతున్న
పుట్టపర్తివారి వద్దకు వెళ్ళలేకపోయాం. 
దగ్గరికెళ్తే మేం కూడాకాలిపోతామేమో అనిపించింది. 


ఇంత జరిగినా శ్రీరాములురెడ్డిగారికి 
పుట్టపర్తి వారు ఎందుకంత కోపం చేసుకున్నారో
 అర్థం కాలేదు.


ఇలాంటి సంఘటనల్ని చూసి 
పుట్టపర్తి వారు 
ఎప్పుడూ నిప్పులుకక్కుతూ ఉండేవారనో, 
కనీసం చిరచిరలాడుతూ ఉండేవారనో
 అనుకోవటం తప్పు. 
వారు చాలా హాస్యప్రియులు. 
వారిఉపన్యాసాలు కూడా
 చక్కని చమత్కారాలతో తళతళలాడుతుండేవి.
ఒకసారి మా కాలేజీలో 
పాండురంగ మాహాత్మ్యాన్ని గురించిమాట్లాడుతూ అందులో వచ్చే కప్పల కథ చెబుతున్నారు. 
ఎవరో ముందు వరుసలో ఉన్న ఒక విద్యార్థి 
కిసుక్కున నవ్వాడు. 
వెంటనేపుట్టపర్తివారు ఆ వైపు తిరిగి
 “ఆడ కప్ప ఎంత అందంగా ఉందో 
మొగ కప్పకు తెలుస్తుంది. 
నీకేం తెలుస్తుందిరా?” అన్నారు. 


మొత్తం శ్రోతలు గొల్లుమన్నారు. 
మరో సందర్భంలో తనపేరు చెప్పుకుని
అంటే తాను పుట్టపర్తి వారి శిష్యుణ్ణని చెప్పుకుని
 బాగా డబ్బుసంపాదించుకుంటున్న 
వ్యక్తిని గురించి చెబుతున్నారు. 
“వాడేమో పుట్టపర్తి శిష్యుణ్ణి అని చెప్పుకుంటూ 
లక్షలు సంపాదించుకుంటున్నాడు.
మనమేమో ఇట్లానే ఉన్నాం.” అన్నారు. 
“ఈసారి ఎక్కడైనా సభలో
ఇద్దరూ కలిసినప్పుడు 
మీరు ’అతడు వినయంతో అలా చెబుతూఉంటాడు 
కానీ అతడు నాకేం శిష్యుడు కాదు, 
నేనే అతడికి శిష్యుడిని’ అనండి, 
అంతటితో అతడు 
చెట్టు పేరుతో కాయలమ్మే ప్రోగ్రాం ఆపేయవచ్చు”
అన్నాను. 
పుట్టపర్తి వారు గట్టిగా నవ్వి, 
“నిజమేరా. ఆ పని చేస్తా” అన్నారు.
అంతలోనే గంభీరంగా మారిపోయి, 
“ఒరే అది ప్రమాదంరా” అన్నారు.
 “ఎందుకు?” అన్నాను.

“ఇప్పుడు వాడు నేను పుట్టపర్తి శిష్యుణ్ణి అని చెప్పుకుంటూ
సంపాదించుకుంటున్నాడు. 
నువ్వు చెప్పిన పని చేస్తే
 ’నేను పుట్టపర్తికి గురువును’
 అని చెప్పుకుంటూ మరో వరస సంపాదించుకుంటాడు” అన్నారు నవ్వుతూ.

మరో సందర్భంలో
 వేలూరికి వెళ్ళాలని బయలుదేరుతున్నాం.
 రచయిత ముంగర శంకరరాజుగారు 
మా ఎదురింట్లో ఉండేవారు.
ఆయన ప్రయాణానికి సిద్ధమై మా ఇంటికొచ్చారు. పుట్టపర్తివారు
టిఫిన్ పూర్తి చేసి హిందూ పత్రిక చూస్తున్నారు. 
అప్పటికి కెన్నడీ హత్య జరిగి దాదాపు వారం రోజులైంది.
“ఆలస్యమైపోయింది. ఇంకా పత్రిక చూస్తున్నారా? అందులో ఏముంది?


లేవండి త్వరగా” 
అన్నారు శంకరరాజు గారు.

“ఉండరా, 
జాక్ రూబీ గాణ్ణి ఎవరైనా చంపారేమో అని చూస్తున్నాను” అన్నారు.
కెనడీని చంపిన ఆస్వాల్డ్ ను చంపినవాడు జాక్ రూబీ.
“వాణ్ణెందుకు చంపుతారు?” అన్నారు శంకరరాజు గారు.
 “ఆస్వాల్డ్ గాణ్ణి ఎందుకు చంపారో అందుకే” అంటూ లేచారు పుట్టపర్తి వారు.

వారితో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడూ,
 ఆప్తులైన మిత్రుల మధ్యలోఉన్నప్పుడూ 
వారు ఎలాంటి అరమరికలూ లేకుండా మాట్లాడేవారు.
తన పాండిత్యమూ, కీర్తీ అంతా మరచిపోయి చిన్నపిల్లవాడిలా ప్రవర్తించేవారు. 
అలాంటి సంఘటన ఒకటి జ్ఞాపకం వస్తోంది.


 ఒకసారి నేనూ, పుట్టపర్తి వారూ కలిసి 
మదనపల్లెకు సమీపంలోఉన్న 
కలిచర్ల అన్న గ్రామానికి వెళ్ళాం.
 అక్కడ ఏడాదికోసారి చాలాపెద్ద పరష 
(పశువుల సంత) జరుగుతుంది. 
అప్పుడు అక్కడ
తెలుగు పండితుడిగా పనిచేస్తున్న 
కథారచయిత వేణు, 
ఒక కవి గోష్ఠి ఏర్పాటు చేశాడు. 
అంటే పశువుల్ని కొనటానికో, అమ్మటానికో
వచ్చిన రైతులకు కవిత్వం చదివి చెప్పటమన్నమాట.


ఆ సందర్భంలోనే 
మరో వినోదాన్ని కూడా ఏర్పాటు చేశారు.
పరష జరిగేది ఒక పెద్ద తాటితోపులో. 
ఆ తోపులో ఉన్న ఏ చెట్టును చూపిస్తే దాన్ని
ఒక వ్యక్తి తన చేతుల్తో ఊగించికూలదోసేస్తాడు. 


ఈ సంగతి తెలియానే పుట్టపర్తి వారు
చిన్నపిల్లాడిలా సంబరపడిపోవటం ప్రారంభించారు.
“ఒరే సుబ్బయ్యా, త్వరగా తయారుగా.

మనం దగ్గరగా నిలబడి వాడి బలప్రదర్శన చూడవలె.. నిజంగా అది సాధ్యమారా?
ఇంకా అట్లాంటి బలవంతులు ఉన్నారంటావారా” అంటూ మాట్లాడుతూనే ఉన్నారు.


 అందరికంటే ముందుగానే 
ఆ తాటితోపు చేరుకున్నాం. 
ఎద్దుల మధ్య తిరుగుతూ వారు ప్రతి చెట్టునూ పరిశీలించటం ప్రారంభించారు.
అలా కూలదోయటం కష్టం కావాలంటే 
తాటి చెట్టు ఎత్తుగా ఉండాలా,
 లావుగా ఉండాలా 
అని ఆలోచించటం ప్రారంభించారు.


ఈలోగా 
గుబురుగా ఉన్న తాటి చెట్ల వద్ద జనం చేరారు.
ఆ పరష జరిపిస్తున్న
 కలిచెర్ల నరసింహారెడ్డి గారు కూడా అక్కడికొచ్చారు.


పడదోసే తాటిచెట్టును వెదికే కార్యక్రమం ప్రారంభమైంది. అనుభవంఉన్న ముగ్గురు రైతులు 
దాదాపు యాభై అరవై చెట్లను నిశితంగాపరిశీలించి ఒకదాన్ని ఎంపిక చేశారు. 
ఆ చెట్టు బాగా బలంగా ఉంది.
వేళ్ళు భూమి లోపలికే ఉన్నాయి. 
ఎత్తు దాదాపు ఇరవై అడుగులుండవచ్చు.


తరువాత అక్కడి వాళ్ళు చెప్పారు.. 
చెట్టు ఎత్తు ఎక్కువ ఉండకూడదట,
అది బలంగా కౌగిలించుకోవటానికి వీలు లేనంత బలంగా ఉండాలట,
దాని వేళ్ళు భూమి పైన కాక, 
భూమి లోపల ఉండాలట, 
అందరూఆ చెట్టు వైపుకు నడిచారు, పరిశీలించారు.
పుట్టపర్తివారు చిన్నపిల్లాడిలాగా 
దాని చుట్టూ తిరిగి చూశారు.
“ఒరే, వాడు నిజంగా దాన్ని తోసేస్తాడంటావా?” 
అని అడిగారు.
 “చూద్దాం” అన్నాను.

ఇంతలో అసలు వ్యక్తి బయటికొచ్చాడు.
ఇప్పుడతని పేరు జ్ఞాపకం రావటం లేదు.
అతడు సాధారణంగా ఉన్నాడు.
పాంటు,షర్టు వేసుకున్నాడు.
అతడు ఆ ప్రాంతం వాడేనట.
బెంగళూరుహెచ్,ఏ,ఎల్ లో ఉద్యోగం చేస్తున్నాడట.
 అతడు ముందుకొచ్చి చొక్కా, పాంటు విప్పి

పక్కనున్నపొదమీద పారేశాడు.
లంగోటీలో నిలబడ్డ అతడు బలంగా ఉన్నాడే
 కానీ తాటిచెట్లను పెకలించేవాడిలాగా లేడు. 
పుట్టపర్తి వారు ఆసక్తిగా,
 అపనమ్మకంగా అతని వైపు చూస్తున్నారు.


అతడు పది బస్కీలూ,దండాలూ తీశాడు.
రెడ్డిగారికి నమస్కరించాడు.
తాటిచెట్టు వద్దకు వెళ్ళి దాని మొదలు తాకి మూడుసార్లు దండం పెట్టుకున్నాడు.
దాన్ని కౌగిలించుకుని కదిలించడం ప్రారంభించాడు.పుట్టపర్తి
వారు ఆసక్తిగా దగ్గరకి వెళ్ళి నిలబడ్డారు.
మొదట చెట్టులో కదలిక కూడా లేదు.


అరగంట తరువాత
తాటిమట్టలు గలగలలాడటం ప్రారంభించాయి.
మరో అరగంట తరువాత 
చెట్టు ఊగటం ప్రారంభించింది.
ఒకటొకటిగా చెట్టువేళ్ళుపటపటమని 
తెగటం ప్రారంభించాయి. 
మరో గంటలో ఆ చెట్టుకూలిపోయింది. 
పుట్టపర్తివారు గొప్ప ఆరాధనతో 
ఆ వస్తాదునుచూస్తున్నారు. 
అతడు రెడ్డిగారి ముందుకొచ్చి నిలబడ్డాడు.
అతని వక్షస్థలమంతా గీక్కుపోయింది.
దండల మీద అక్కడక్కడా చిన్నచిన్న రక్తం చారికలు కనబడుతున్నాయి.
రెడ్డి గారు ఉద్రేకం పొంగుతున్న ముఖంతో 
అతనికి డబ్బూ,కొత్తబట్టలూ ఇచ్చారు.
వాటిని అందుకుని, 
రెడ్డిగారికి వినయంగానమస్కారం చేసి, 
మళ్ళీ కూలిపోయిన తాటిచెట్టు వద్దకు వెళ్ళి
దాన్ని మూడుసార్లు కళ్ళకద్దుకుని  
నిలబడ్డాడు అతడు.
జనం అతణ్ణి వదిలేసి 
కూలిపోయిన తాటిచెట్టు చుట్టూరా చేరారు.
 ఆ రోజు రాత్రి మదనపల్లి చేరుకున్నాం.

పుట్టపర్తివారు 
ఆ సంఘటనను గురించి 
ఆశ్చర్యంతో చెబుతూనే ఉన్నారు.


“ఒరే సుబ్బయ్యా, 
కవిగా నాలో ఒక గొప్ప బలహీనత ఉందిరా”
అన్నారు అకస్మాత్తుగా.
నేను నిశ్శబ్దంగా ఉన్నాను.

“నేను శృంగారాన్నీ,భక్తినీ,కరుణనూ 
అద్భుతంగా రాయగలననినా నమ్మకం.
అందులో ఇప్పుడు రాస్తున్న తెలుగు కవులెవరూ
 నాదరిదాపులక్కూడా రాలేరు.
కానీ వీరరసం వద్దకు వచ్చేసరికి చతికిల
పడిపోతాను.ఇప్పుడు “జనప్రియ రామాయణం” లో సుందరకాండ
 రాస్తున్నాను కదా.యుద్ధకాండ వస్తున్నదంటేనే భయంగా ఉంది.దాన్ని
రాయలేనేమోనన్న భయం లోపల్లోపల పీకుతూ ఉంటుంది. భుజబలం మీద పూర్తి
గా నాకు విశ్వాసం లేదు.అందుకే వాడెవడో తాటిచెట్టును
పడదోస్తానంటే నమ్మలేకపోయినాను.
ఇప్పటికీ వాడుచేసిన పని కళ్ళారా చూసినా నమ్మబుద్ధి కావటం లేదు.
వీరరసానికీ, నా తత్వానికీ పడదురా” అన్నారు.
 నిజమే వారు యుద్ధకాండ వద్దకే రాలేదు.
 యుద్ధకాండ రాయకుండానే వెళ్ళిపోయారు…..

అసలు వారు రామాయణాన్ని రాయటమే భక్తి కోసం.
మతవ్యవస్థలని సమర్థించటం కోసమో, ఖండించడం
కోసమో తాను రామాయణాన్ని రాయటం లేదని చెబుతుండేవారు.
రామకథ కవియన్న వానికెల్లను సేద్యమైనదని అవతారికలో
చెప్పారు.తాను రామాయణంలో చేసిన మార్పుల్ని గురించి
 కూడా అప్పుడప్పుడూ ప్రస్తావిస్తుండేవారు.
 వారి రామాయణంలో కైక దుర్మార్గురాలు కాదు.దశరథుడు

బహుపత్నీకుడూ,స్త్రీలోలుడూ అయిపోయాడు.అతనితో
రఘువంశం యొక్క కీర్తిప్రతిష్టలు, ధర్మనిష్టాపతనం కావటం
 ప్రారంభించాయి. రావణుని వంటి వారు అతని రాజ్యం మీద
అక్రమాలు చేస్తున్నా వారిని నిరోధించే శక్తిని దశరథుడు కోల్పోయాడు.
దశరథునిలో లేని గొప్ప గుణాలు కైకకు రామునిలో కనిపించాయి.
 లోకకల్యాణం కోసం, ధర్మరక్షణ కోసం తాను చెడ్డపేరును
 కోరి తెచ్చుకొని కైక రాముణ్ణి అడవులకు పంపింది. ఇదీ కైకకు
పుట్టపర్తివారి వ్యాఖ్యానం. “వాల్మీకి కథను మార్పు చేయటాని
కి నీకేం అధికారం ఉంది?” అని ఎవరైనా అడిగితే “రామకథను
 కావ్యాలుగా, నాటకాలుగా రాసిన వాళ్ళల్లో మార్పు చేయనివాణ్ణి
ఒకణ్ణి చూపించు” అనేవారు.
 వారి రామాయణంలో అంగదుని పాత్రను హామ్లెట్ ను ఆదర్శంగా

తీసుకుని తీర్చిదిద్దారు. అంగదుడు వాలి కొడుకు. అతని తల్లి తార
వాలిని చంపిన సుగ్రీవుణ్ణి పెళ్ళాడింది. తండ్రిని చంపినవాడి కొలువులో
అంగదుడు క్లాడియస్ కొలువులో హామ్లెట్ లాగా – ఆత్మను
చంపుకుంటూ జీవించవలసి వస్తుంది.  “రామాయణం మీద
షేక్స్పియర్ ప్రభావమేమిటి?” అని ఎవరైనా ప్రశ్నిస్తే పుట్టపర్తి
వారు ఇలా సమాధానం చెప్పేవారు.
 “ఏ రచయిత ఏం రాసినా ప్రాథమికంగా మానవ ప్రవర్తనను గురించే రాస్తాడు.

మానవ ప్రవర్తనలోని లోతులు వ్యాసునికి, షేక్స్పియర్ కూ
తెలిసినంతగాఎవరికీ తెలియవు. ఆ దృష్టితో చూసినప్పుడే
నాకు అంగదుడిలో హామ్లెట్ కనిపించాడు. షేక్స్పియర్ ను
 చదివినవాడి రాతకూ చదవనివాడి రాతకూ తేడా ఉంటుందని నా నమ్మకం”
 పుట్టపర్తి వారికి ఇంగ్లీషు భాష మీదా, సాహిత్యం మీదా అపారమైన

గౌరవం ఉండేది. ఇంగ్లీషు బాగా నేర్చుకోవటానికి వారు చాలా
బాధలు పడ్డారు. ఇంగ్లీషులో కవిత్వం రాశారు. ఎలిజబెతన్ ఇంగ్లీషులో
సుయోధనుణ్ణి గురించి ’ది హీరో’ అన్న నాటకాన్ని రాశారు. భాగవతాన్ని
ఇంగ్లీషు వచనంలో రాయటానికి ప్రయత్నించారు.
1985లో ననుకుంటాను. కడపలో ఇంటర్మీడియెట్ బోర్డు వాళ్ళు
ఇంగ్లీషు వాల్యుయేషన్ పెట్టారు. చాలా రోజుల తరువాత నేనూ,
నేలమూరి ప్రసాదరావూ కలిసి పదిహేనురోజు లొకచోట ఉన్నాం.
 ప్రసాదరావు పుట్టపర్తి వారి చేత “ఉత్తరరామ చరిత్ర”ను పాఠం చెప్పించుకున్న
ధన్యుడు. వీరకంప రాయల చరిత్రను నవలగా రాయాలని పుట్టపర్తి వారు
 సేకరించిన సమాచారాన్ని ఆధారం చేసుకుని “మధురా విజయం” అన్న
 నవల రాసి గురువుగారి మెప్పు పొందినవాడు. గొప్ప పరిశ్రమా, ధారణా,
అసాధారణమైన పద్యరచనా శిల్పం, మంచి జబ్బపుష్ఠి, తిండి
పుష్ఠీ ఉన్నవాడు.రోజూ మేమిద్దరం కలిసి పుట్టపర్తి వారింటికి వెళ్ళేవాళ్ళం.
సాధారణంగా వై.సి.వి రెడ్డి కలిసేవాడు. మాకు వారు “శ్రీనివాస ప్రబంధం”
ప్రతిరోజూ రెండు గంటలసేపు చదివి వినిపించేవారు. నాకు తల చించుకున్నా
స్ఫురించని భావవ్యక్తీకరణ సౌందర్యాలూ, ఛందోవిన్యాసాలూ ప్రసాదరావుకు
అలా వింటే ఇలా స్ఫురించేవి. అతని గ్రహణశక్తిని చూసి ఆశ్చర్యపోతూ ఉండేవాణ్ణి.
ఒకరోజు సాయంకాలం ప్రసాదరావు, “సుబ్బయ్యా, గురువు గారికి
 సన్మానం చేద్దామా?” అన్నాడు. సై అంటే సై అనుకున్నాం. శ్రమ
లేకుండా ఏర్పాట్లు జరిగిపోయాయి. ఆ సభకు రెండు వందల మంది
ఇంగ్లీషు లెక్చరర్లు వచ్చారు. పుట్తపర్తి వారిని నేను పరిచయం చేశాను.
ప్రసాదరావు వారిని గురించి ఆశువుగా మంచి పద్యాలు చెప్పి శాలు
వా కప్పాడు. ఆ సన్మానానికి పుట్టపర్తి వారు నిజంగానే పులకించిపోయారు.
 ఆ సభలో వారు చెప్పిన విషయాలు ఇంకా నాకు చక్కగా జ్ఞాపకం ఉన్నాయి.
’ఒకనాడు సంస్కృతం రాని తెలుగు పాండిత్యానికి విలువ లేదు.
ఆనాడు విజ్ఞానాన్ని అందుకోవటానికి సంస్కృతం అవసరమైంది.
ఈనాడు ఇంగ్లీషు రాని తెలుగు పాండిత్యానికి విలువ లేదు.
ఈనాటి విజ్ఞానాన్ని అందుకోవటానికి ఇంగ్లీషు అవసరం. ఇంగ్లీషు బాగా
 వొస్తే ప్రపంచంలోని అన్ని భాషలూ వచ్చినట్లే. ఇంగ్లీషు ద్వారా
మొత్తం ప్రపంచ సాహిత్యాన్ని తెలుసుకోవచ్చు. తెలుగు సాహిత్యం
 భవిష్యత్తు ఇంగ్లీషు ఉపాధ్యాయుల చేతిలో ఉందని నా అభిప్రాయం.”
ఆ తరువాత కాస్సేపు ’శివతాండవం’, మరికాస్సేపు
’జనప్రియ రామాయణం’లో సరస్వతీదేవి స్వర్గలోకం నుంచి దిగివచ్చి
వాల్మీకి మనసులో లీనమయ్యే ఘట్టాన్నీ గానం చేశారు. రిక్షాలో
కూచుంటూ అది తనకు జరిగిన అత్యుత్తమ సన్మానం అన్నారు.
 మరుసటి రోజు మళ్ళీ ఈ విషయం చర్చకు వచ్చినప్పుడు

వారన్నమాట వారిని అర్థం చేసుకోవటానికి కీలకమని నేను
అనుకుంటాను. “మేము మారటం కష్టం. నా వరకు నేను మారాలని
ఎంతో ప్రయత్నించాను. కానీ వీలు కాలేదు. మీరింకా యువకులు.
మీరు మారవచ్చు. మీరు టీచర్లు కూడా కాబట్టి మార్పుకు
దోహదం కూడా చేయవచ్చు” అన్నారు.
 సంస్కృతం – ఇంగ్లీషు, ప్రాచీనం – ఆధునికం, ఆధ్యాత్మికం –
సామాజికం, సమాజం – వ్యక్తి ఇలా అనేక ద్వంద్వాల విషయంలో
పుట్టపర్తి వారిలో నాకు తెలిసినప్పటినుంచీ ఊగిసలాట ఉండేది.
ఈ ఊగిసలాటను ప్రాచీన మార్గీయులు అవకాశవాదంగానూ,
నవీనులు అశక్తతగానూ భావించేవారు. కానీ ఇరువురూ
వారిని స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకునేవారు.
తమను తాము వీరిద్దరూ కూడా ప్రమాణాలుగా భావించేవారు.
తమకంటే కాస్త ఎక్కువగా మారటం చేత ప్రాచీనులూ,
తమంతగా మారకపోవటం చేత నవీనులూ వారిని
నిరాదరంగా చూసేవారు. మారటానిక్కానీ, మారలేక
పోవటానిక్కానీ వారు అనుభవించిన వేదనను ఇద్దరూ గుర్తించేవారు కాదు.
 వారు చాలా సాంప్రదాయికమైన కుటుంబంలో పుట్టారు.
చాలా సాంప్రదాయికమైన చదువును చదువుకున్నారు.
 ఒక వ్యక్తి యొక్క వాస్తవిక మేధాశక్తి 
అతనికున్నవాస్తవిక సంబంధాల మీద 
ఆధారపడి  ఉంటుందన్న
ఎరుక వారికి కలిగే అవకాశం లేకుండా పోయింది.
వారి యవ్వన కాలం 
భావ, కవిత్వాల సంధియుగం.
సామాజిక చలనం తక్కువగా ఉండడం చేత రాయలసీమలోవాటి ప్రభావం చాలా తక్కువ. 
తాను మారాల్సిన అవసరాన్నిగుర్తించేసరికి 
తాను చేరుకోవాల్సిన గమ్యాలు 
చాలా దూరమైపోయాయి.
అందుచేతనే పుట్టపర్తి వారి కవిత్వంలో 
భావ, అభ్యుదయకవిత్వాలకు 
బలహీనమైన అనుకరణలు మాత్రమే వినిపిస్తాయి.


కానీ వారు మారటానికి నిజాయితీగా ప్రయత్నించారని
నేను నమ్ముతాను.
 ’అగ్నివీణ’, 
’పురోగమనం’, 
’మేఘదూతం’,
కావ్యాలు చూస్తే 
వారు ఏ దిశగా ప్రయాణం చేయాలనిప్రయత్నించారో అర్థమవుతుంది. 
మార్క్సిజాన్ని అర్థంచేసుకోటం కోసమూ, 
దాన్ని అంగీకరించటం కోమూ 
వారు కొన్ని సంవత్సరాలు ప్రయత్నించారు. 


మార్క్సిజం లోని సామాజిక కవిత్వం 
వారికి ఎంత ఆమోదయోగ్యంగా ఉన్నా,
 భక్తి వారిని విడిచి పెట్టలేదు.
 “భక్తి మధ్యయుగాల సెంటిమెంటు. 
భగవంతుని కోసం రాజ్యాన్నీ,
కుటుంబాన్నీ త్యజించే మీరా లాంటి భక్తులూ, భక్త్యావేశంలోకొడుకును నలగదొక్కే భక్తులూ 
ఈనాటి సమాజంలో ఉండటంఅసాధ్యం” 
అనేవారు వారి మిత్రులు.
 “భక్తిని గురించి రామానుజుడు ఏమన్నాడో తెలుసునా?”
అని ప్రశ్నించేవారు పుట్టపర్తివారు.
 “భక్తి నిరంతర ప్రేమ ప్రవాహమన్నాడు. 
అంతేకాదు, 
భగవంతుణ్ణిబుద్ధితో కాకుండా 
హృదయంతో చూడడమే భక్తి. 
అన్నం లేకుండా బతకగలను.
కానీ భగవంతుడు లేకుండా బతకలేను” 
అనేవారు. 
వారి హృదయాన్నిఅర్థం చేసుకోవటానికి  
పాద్యము’ చదవటం అవసరమని
నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను.
ఈ శతాబ్దానికి చెందిన 
ఇతర సంప్రదాయ కవులతో పోల్చి చూచినప్పుడు,
పుట్టపర్తి వారి ప్రత్యేకత ఈ సంఘర్షణే.  
ఇతర సంప్రదాయ కవులు
 (నవ్య సంప్రదాయ కవులు – అన్నమాట నాకు అసహ్యం) 
నిశ్చల నిశ్చితాలతో ప్రారంభించారు. 
వాటిలోనే కొనసాగారు. 
పుట్టపర్తివారునిశ్చల నిశ్చితాలను నమ్మలేదు. 


అందుచేతనే 
ఇతర సంప్రదాయకవుల్లో లేని అన్వేషణ 
వారిలో కనిపిస్తుంది. 
మనంతకు మనంఅన్వేషించుకుంటూ 
గమ్యం చేరుకోవటానికి, 
ఇతరులు నడిపిస్తే
నడిచి చేరుకోవటానికీ తేడా ఉందని 
పుట్టపర్తి వారి కవిత్వం,
వచన రచనలూ చదివితే తప్ప అర్థం కాదు.


వారు మారటానికి చేసిన ప్రయత్నాలకు గుర్తుగా 
రెండుసంఘటనలు చెబుతాను. 
1985 లో నెహ్రూ కేరళలో
నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని అకారణంగా 
కూలదోసిన రోజు
వారు మదనపల్లెలో ఉన్నారుట. 
ఆ ఊళ్ళో ఉన్న 
కాంగ్రెసేతరఅభ్యుదయ శక్తులంతా కలిసి 
నిరసన సభ ఏర్పాటు చేస్తే 
అందులోవారు ఉపన్యసించారట. 


ఆ ఉపన్యాసాన్ని గురించి ఇప్పటికీ 
ఈ ఊరి పెద్దలు చెప్పుకుంటూ ఉంటారు. 
ఉపన్యాసంలోఅంత ఆగ్రహాన్ని 
తామేనాడూ చూడలేదని వాళ్ళంటారు. 
వారుకేరళ నుంచి తిరిగి వచ్చి 
అప్పటికి చాలా కాలం కాలేదు.
వారు కేరళలో ఉండగా 
చాలామంది వామపక్ష మేధావులతో,
రచయితలతో వారికి దగ్గర సంబంధాలుండేవి.


సంవత్సరం జ్ఞాపకం లేదు కానీ, 
నంద్యాలలో జరిగిన రైతుమహాసభలో కూడా
 వారు ఉపన్యసించారు. 
ఆ ఉపన్యాసాన్నివిన్నవారు కూడా ముగ్ధులైపోయారు. దురదృష్టవశాత్తు
ఈ రెండు ఉపన్యాసాలను గురించీ 
పెద్దలు చెప్పగా వినటమేకానీ, 
నేరుగా వినే అదృష్టం నాకు లేకుండా పోయింది.
 చెప్పవచ్చేదేమిటంటే 
పుట్టపర్తి వారు తన్ను తాను మార్చుకోవటానికి
శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. 
కానీ మారలేకపోయారు.
“ఇందులో వారు సాధించిందేమిటి? చివరకు రామాయణం వద్దకే
వచ్చారు కదా?” అని కొందరు ప్రశ్నిస్తుంటారు. అది వారి రామాయణాన్ని
చదవకుండా అనే మాట.  వారు తాను రామాయణాన్ని భక్తి కోసం
రాశానని అన్నా, వారు దాన్ని కవిత్వం కోసం రాశారని నా నమ్మకం.
 తెలుగులో ఉన్న ఇతర రామాయణాలకూ, పుట్టపర్తి వారి
“జనప్రియ రామాయణం” కూ ఉన్న తేడా మౌలికంగా కవిత్వంలోనే
ఉందన్నది నా నిశ్చితమైన నమ్మకం. వాల్మీకికి దగ్గరగా ఉన్న
 రామాయణం పుట్టపర్తి వారిది మాత్రమే!
పుట్టపర్తి వారితో కలిసి చాలా ప్రయాణాలు చేశాను. వారూ, నేనూ
కలిసి రమణాశ్రమం వెళ్ళాం. చలం గారిని చూశాం. ఆ కలయిక
ఇద్దరికీ నచ్చలేదని నా అనుమానం. “జనప్రియ రామాయణం”
లోని రామజనన ఘట్టాన్ని వారు చలం గారికి చదివి వినిపించారు.
“ఒక్క మాట కూడా నాకు అర్థం కాలేదు” అన్నారు చలం గారు.
 “ఏం చేద్దాం ఎవడి స్థాయి వాడిది” అన్నారు పుట్టపర్తి వారు.


తిరుగు ప్రయాణంలో కూడా వారు దాన్ని గురించి మాట్లాడలేదు.
అందుచేత నేను అలాంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నాను.
 నా మనసు మీద శాశ్వత ముద్ర వేసిన మరొక ప్రయాణాన్ని గురించి చెప్పి,

నా అనుభూతులను కొన్ని నా కోసం మిగుల్చుకుంటాను.
ఒకసారి ఇద్దరం కలిసి తిరుత్తణి వెళ్ళాం. తిరుత్తణి తమిళ ప్రాంతమే
అయినా తెలుగు సాహిత్యాభిరుచి బాగా ఉన్న పట్టణం. ఆ ఊళ్ళో
బూదూరు రామానుజులురెడ్డి గారని ఒకరు ఉండేవారు. వారిని
మేమంతా ’సరిహద్దు సిపాయి’ అని పిలిచేవాళ్ళం. వారు
ఉపాధ్యాయుడు, తెలుగువారి హక్కుల కోసం నిరంతరం పోరాడే
ఉద్యమకారుడు, కవి. ఆహ్వానం వారిదే. వారు సభను గొప్పగా
 ఏర్పాటు చేశారు. చాలా పెద్ద హాలు. శ్రోతలతో కిటకిటలాడిపోతోంది.
 స్వాగతోపన్యాసాలూ, ఆహ్వానాలూ అయ్యాక పుట్టపర్తి వారు లేచి నిలబడ్డారు.
“మీరు ఫలానా విషయాన్ని గురించి మాట్లాడమని చెప్పలేదు.
నేనూ అనుకొని రాలేదు. ఏం మాట్లాడమంటారు?” అన్నారు.

మొదటి వరసలో కూచున్న సుందరవదనులు నాయుడు గారు
లేచి నిలబడ్డారు. వారు ఆజానుబాహువు. భారీ విగ్రహం కూడా.
మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ అధ్యక్షులుగా పని చేసి, రాజకీయాల
నుంచి విరమించి, తిరుత్తణి సమీపంలోని స్వగ్రామంలో విశ్రాంతి జీవితాన్ని
గడుపుతున్నారు. తెలుగు, ఇంగ్లీషు, తమిళం బాగా చదువుకున్నవారు.
 “అయ్యగారూ, మీకు చాలా భాషలు వచ్చు కదా. వాటిలో చాలా భాషల్ని
మేము ఎన్నడూ వినలేదు. మీ ఉపన్యాసాలు చాలా విన్నాం.
 ఈ రోజు మీరు ఒక కొత్త రకమైన ఉపన్యాసం చెప్పాలని ప్రార్థిస్తున్నాను.
మీకొచ్చిన ఒక్కొక్క భాష నుంచీ ఒక పద్యాన్ని చెప్పి అందులోని
సౌందర్యాన్ని వివరించండి.” అన్నారు.
 పుట్టపర్తి వారు ఒక నిముషం ఆలోచించి -
 “అట్లనే కానీ అప్పా”, అని ప్రారంభించారు.
మూడు గంటల కంటే ఎక్కువ కాలం కొనసాగిన ఆ ఉపన్యాసాన్ని
 గురించి ఏం చెప్పినా, ఎంత చెప్పినా ’గగనం గగనాకారం’ గానే ఉంటుంది.
అదొక పాండిత్య విశ్వరూప ప్రదర్శన. కవిత్వ సంవేదనకు పరాకాష్ఠ.
 ఆ ఉపన్యాసంలో సంస్కృతం, తెలుగు, తమిళం, కన్నడం,

మలయాళం, మరాఠీ, హిందీ, ఉర్దూ, ప్రాకృతం, పైశాచీ, ఇంగ్లీషు,
రష్యన్ భాషలు వారి నాలుక మీద నాట్యం చేశాయి. సరస్వతీదేవిని ’
రసనాగ్ర నర్తకీ’ అని ఎందుకంటారో ఆ రోజు అర్థమైంది. భవభూతి,
కాళిదాసు, తిక్కన, కృష్ణదేవరాయలు, ఇలంగో అడిగళ్, కులశేఖర
ఆళ్వార్, పంప, బసవేశ్వరుడు, ఎజితుచ్చన్, వల్లత్తోల్, తులసీదాస్,
సూరదాస్, గాలిబ్, ఫిరాక్, పుష్పదంతుడు, షేక్స్పియర్, షెల్లీ, ఏట్స్
(ఇతణ్ణి పుట్టపర్తి వారు ఈట్స్ అని అంటుండేవారు), పుష్కిన్ వంటి
కవుల మనస్సుల్ని విప్పి చూపించారు. మూడు గంటల తరువాత
“మీకూ నాకూ ఓపికుంటే తెల్లవారే వరకూ చెప్పవచ్చు. కానీ
బాగా అలసిపోయినా – మీరు అనుమతిస్తే మానేస్తా” అన్నారు.
“ఇంకా కొన్ని భాషలు రాలేదు” అన్నారు 
 సుందరవదనులు నాయుడు గారు.

“ఇంకోసారి మీ ఊరు వచ్చినపుడు వస్తాయి” అని కూర్చున్నారు
పుట్టపర్తి వారు.

ఆ సభలో నన్ను అమితంగా ఆకర్షించింది వారు చదివిన ప్రాకృత
కవితల్లో ఒకటి. దాన్ని వారు చదువుతూ ఉంటే “శివతాండవం”ను
 చదువుతూ ఉన్నట్టే అనిపించింది. “శివతాండవం” లోని ఛందస్సు
మీదా, లయ మీదా దాని ప్రభావం ఉందేమో అని కూడా అనిపించింది.
మరుసటి రోజు వారిని అడిగి చెప్పించుకొని ఆ కవితను రాసి పెట్టుకున్నాను.
ఆ కవి “జసరహచరిఉ” అన్న గ్రంథంలోనిదట. గ్రామాల్లో గ్రామదేవతల
(మారెమ్మ) జాతర జరిగినప్పుడు తాగి తందనాలాడే పోతుల రాజుల
ఆర్భాటాన్ని వర్ణిస్తుందీ కవిత.
జహిరసియ సింగాయ – ఉద్ధరియ కందాయి
భుయదండ ధక్కవియ – కోదండ దంచాయి
లంబంత మాయూర – పింఛోహణివ సణహి
మసిధా ఉమండణయి – పిత్తల విహూ సణయి
గడియద్ధ చలచీరి – యాయంధ జాలాయి
కరికథియ విప్పురియ – కత్తియక వాలాయి
పాయడియణి య గురన్ – వారూఢ లింగాయి
కులఘోస మయచమ్మ – పచ్చాయి మంగాయి
ముద్దా విశేశేణ – దూరంణ మంతాయ
పయఘఘ్ఘ రోలీహి – ఘనఘన ఘనంతాయి
కవకవ హంతాయి – పలియోర వేసాయి
ముక్కట్ట హాసాయి – ఝంపడియ కేశాయి
బలివిలిహ భేయాయి – కఉలాయి మిలియాయి
కీలంతి డడ్డరయి – అట్టంగ వలియాయి
జహికరడ పడహాయి – వజ్జంతి వజ్జాయి
ఇట్టాయి మిట్టాయి – పిజ్జంతి మజ్జాయి
మారీయి దేవియే – దేవాల యేతమ్మి

 రెండు చేతులూ పైకెత్తి తాళం వేస్తూ

ఈ కవితను పుట్టపర్తి వారుచదువుతూ ఉంటే 
సభ ఊగిపోయింది.

ఇవి పుట్టపర్తి వారికి సంబంధించిన 
కొన్ని అనుభవాలూ, అనుభూతులూమాత్రమే. అన్నిటినీ చెప్పేసి 
మనసును శూన్యం చేసుకోలేం కాట్టి 
కొన్నిటిని ముఖ్యంగా 
వారి సాహిత్య వ్యక్తిత్వానికి సంబంధించిన వాటిని మాత్రమే చెప్పాను.
 “పుట్టపర్తి వారిలో 
నీకు అన్నీ సుగుణాలే కనిపించాయా, 
లోపాలూ బలహీనతలూ కనిపించలేదా?” 
అన్నది పనికిమాలిన ప్రశ్న.
బలహీనతలు లేని వారు 
హిమాలయాల్లో ఉంటారేమో కానీ 
నిత్యజీవితంలో ఉండరు. 
నిత్యజీవితమే వాస్తవిక జీవితం. 
బలహీనత మానవత్వ లక్షణం, 
మానవ లక్షణం. 


ఎలాంటి బలహీనతలూ లేనివారంటే నాకు భయం.
నాకే కాదు
అలాంటి వారంటే తనకూ భయమేనని 
పుట్టపర్తివారు “కామకోటి” పత్రికలో కాబోలు రాశారు.



నేను సాహితీ మిత్రులకు చెప్పే సలహా ఒకటే. సాహిత్యంలో 
ఈస్థటిక్ వాల్యూకున్న ప్రాముఖ్యతనూ,
 స్థానాన్నీ అర్థం చేసుకోవటం కోసం
 “శివతాండవం” చదవమంటాను. 


కవిత్వమంటే 
పద్యకవిత్వంమాత్రమేనన్న భ్రాంతిలో ఉన్నవారిని 
వారి “పండరీ భాగవతం”
 “మేఘదూతం” చదవమంటాను. 
“పండరీ భాగవతం” లోని
ద్విపద సౌందర్యాన్ని, 
“మేఘదూతం” లోని 
భామినీ షట్పదివయ్యారాన్నీ చూడమంటాను. 


తెలుగులో, సంస్కృతంలో,
అవి రెండూ కలిగలిసిన బంగారపు తీగ లాంటి శైలిలో భావవ్యక్తీకరణను నేర్చుకోవటం కోసం
 కవిత్వ  ప్రసిద్ధమయిన
 “జనప్రియ రామాయణం” ను చదవమంటాను. 


పద్యాన్నిపునరుద్ధరించాలని 
ఆరాటపడిపోతున్న వారిని 
పద్యవిద్యకుపరాకాష్ఠయిన
 “శ్రీనివాస ప్రబంధం” చదవమంటాను. 


ప్రాచీన భారతీయ సమాజంలో 
వ్యవస్థల పతనాన్ని అర్థం చేసుకోవటం కోసం 
“మహాభారత విమర్శనం” చదవమంటాను.


మధ్యయుగాల సమాజాన్నీ, 
రాజ్యతత్వాన్నీ పరిపాలనాయంత్రాంగాన్నీ
అర్థం చేసుకోవటం కోసం
“విజయనగర సామాజిక చరిత్ర”ను
చదవమంటాను. 


వివరణా, విశ్లేషణా ప్రధానమైన 
సాహిత్య విమర్శనతెలుసుకోవటం కోసం 
వారి శతాధిక వ్యాసాలను చదవమంటాను.
వాటిని శ్రద్ధగా చదివి పనిలో పనిగా మంచి తెలుగు రాయటం నేర్చుకోమంటాను. 


“భాగవత సుధాలహరి” చదివి 
పాండిత్యమంటే ఏమిటో తెలుసుకోమంటాను. 


చిట్టచివరిగా.. 
కలుపుతో పాటు ..
పైరును కూడా పీకి పారేసే అలవాటును 
మానుకోవటం మంచిదంటాను.
 (రచన మాసపత్రిక నవంబరు 2002 సంచిక నుండి పునఃప్రచురణ – ’రచన’ సౌజన్యంతో ..)

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి