31 ఆగ, 2012

మధునాపంతులకు పుట్టపర్తి లేఖ






ఒకప్పుడు 
నారద మహర్షి వాల్మీకిని కలిసారు 
నారద మునిని వాల్మీకి 
ఈ విధంగా ప్రశ్నిస్తారు. 


ఈ 16 గుణగణాలు కల వ్యక్తి 
ఇప్పటి కాలంలొ  (కృత యుగము) ఉన్నాడా.. ??


"కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ |
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ధృఢవ్రతః


చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః |
విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చ ఏక ప్రియదర్శనః


ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కః అనసూయకః |
కస్య బిభ్యతి దేవాః చ జాత రోషస్య సంయుగే


ఏతత్ ఇచ్ఛామి అహం శ్రోతుం పరం కౌతూలం హి మే |
మహర్షే త్వం సమర్థోఽసి జ్ఞాతుం ఏవం విధం నరం.."


ఈ లోకంలొ ఇప్పుడే, 

ఇక్కడే ఉన్న గుణవంతుడు, 

వీర్యవంతుడు, 

ధర్మాత్ముడు, 

కృతజ్ఞత భావం కలిగినవాడు

సత్యం పలికేవాడు 

ధృడమైన సంకల్పం కలిగినవాడు,


చారిత్రము కలిగినవాడు

అన్ని ప్రాణుల మంచి కోరేవాడు


విద్యావంతుడు


సమర్ధుడు, 

ఎన్నిసార్లు చూసినా 

ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు,


ధైర్యవంతుడు, 

క్రోధాన్ని జయించినవాడు, 

తేజస్సు కలిగినవాడు, 

ఎదుటివారిలొ మంచిని

చూసేవాడు, 

అవసరమైనప్పుడు కోపాన్ని 


తెచ్చుగోగలిగినవాడు 

ఉంటె నాకు చెప్పండి అని 

అడిగాడు.

నువ్వు చెప్పిన గుణాలన్నీ 

ఒకే మనిషిలొ ఉండడం 

కష్టమే, 

కాని ఒకడు ఉన్నాడు, 

నీకు ఇప్పుడు అతని 

గురించి చెప్తాను 

అని నారద మహర్షి ఇలా 


అన్నారు........
 

ఇక్ష్వాకువంశములొ 

రాముడని పేరుగల ఒక వ్యక్తి 

జన్మించాడు. 


ఆయనకి నువ్వు అడిగిన 16 గుణాలు 

ఉన్నాయి అని చెప్పి 


ఒక 100 శ్లోకాలలో సంక్షిప్త 


రామాయణాన్ని వాల్మీకి మహర్షికి నారదుడు చెప్పాడు


అలా ..

ఇది పుట్టపర్తి వారి సంక్షిప్త జీవిత కథ.
అది ఎంత హృద్యంగా ఉంటుందో
ఇదీ అంతే..
 


ఇందులో తండ్రికి భయపడే పుట్టపర్తిని 
మీరు చూస్తారు.

 

ఉపనయనమైన నాడూ 
బడితె పూజ తప్పని బాలునిగా
 పుట్టపర్తి మీకు దర్శనమిస్తారు..
 


తనకు నచ్చని
తండ్రి చెప్పిన పిల్లను 

పెండ్లి చేసుకోటానికి తయారవగా
ఆ పెండ్లిలో అత్త ..భార్య.. ఇంకో పిల్లాడూ..
ఠపా ఠపా అని ఎగిరిపోవటమూ 
వారి నోటి వెంట విని మనం నవ్వుకుంటాం.
 


తెల్లవారి లేచి బైబిలు వల్లించే 
పుట్టపర్తిని కలవాలని ఉందా..?
 


లెక్కలలో ఎప్పుడూ 
మూడు మార్కులు దాటని పుట్టపర్తి
జీవితపు లెక్కలు ఖచ్చితంగా వేసుకొని
అనుకున్నవన్నీ గబ గబా సాధించి
"ఒక్కడు నాచన సోముడు" లా
"ఒకే ఒక్క
డు పుట్టపర్తి"
 అని చరిత్రలో సువర్ణాక్షరాలతో 
తన పేరు నమోదు చేసుకున్నాడు.
ఆ లెజెండ్ కథ ఇది ..


ఇది మధునాపంతులవారికి 
పుట్టపర్తి టావెంకోర్ నుంచీ వ్రాసిన ప్రత్యుత్తరం
టిమాలజిస్ట్ గా అక్కడ వారి ఉద్యోగం


శ్రీ వల్లభాచార్యులు గారు 
1999 డిసెంబర్ లో 
"ప్రవాహవాణి" అనే పత్రికలో 
దీనిని ప్రచురించారు 


నాగక్కయ్య శివకర్ణామృతం అచ్చు వేసినప్పుడు 
దీనిని కూడా ముద్రించింది. 


మా అయ్యగారి సేవనే 
జీవిత పరమావధిగా పెట్టుకుని 
గత ఇరవయ్యేళ్ళుగా 
ఆనందంగా శ్రమిస్తున్న అక్కయ్యకు 
నా బ్లాగు ద్వారా అత్యంత ప్రేమతో 
అభినందనలు తెల్పుతున్నాను.


పరమాత్మునిలో ఐక్యమైన మా అయ్యగారు శుభాసీస్సులు మా కందించి 
ఇంకా ఇంకా తండ్రి సేవలో 
మేము చరితార్థులు కావాలని 
మమ్మల్ని ఆశీర్వదించమని మా ప్రార్థన
 


ఇక మధునాపంతుల వారి గురించి..


ఆంధ్ర దేశం లో సత్యనారాయణ శాస్త్రిని 
ఉత్తమోత్తమ కవుల శ్రేణిలో నిలిపిన మహాకావ్యం 'ఆంధ్రపురాణం'. 
ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు 
అందుకున్న ఈ కావ్యం 
ఎందరో విమర్శకుల ప్రశంసలు అందుకుంది నవపర్వశోభితమైన ఈ చారిత్ర క కావ్యం
 ఆధునికాంధ్ర పంచకావ్యాలలో 
ఒకటిగా వినుతి కెక్కింది. 
హిందీ వంటి ఇతర భాషలలోకి కూ డా 
ఈ కావ్యంలోని ఘట్టాలు అనువదితమయ్యాయి 
ఇక చదవండి ..       


             మధునాపంతులకు పుట్టపర్తి లేఖ
             
                                                                                                                                             తేదీ 1.7.1955
పుట్టపర్తి నారాయణాచార్యులు                                                                                   
ఎటిమాలజిస్ట్
మళయాళం లెక్సికన్ ఆఫీస్
యూనివర్సి టీ  ఆఫ్  ట్రవన్ కో ర్ .


శ్రీమన్మిత్రమహోదయుల సన్నిధికి 


నమస్కారములు
తమరు దయతో వ్రాసిన లేఖ యందినది. 


నేను వ్రాసిన నాల్గు ముక్కలకు సంతోషపడు 
తమ సహృదయత 


అంతేకాదు 
జననాంతర సౌహృదయులు సంభవించినపుడాయనుభూతి అట్లే యుండును..


మానవ తర్కమునకర్థముకాని 
రహస్యములలో 
నిదియు నొక్కటి.


మా యూరు పెనుగొండ 
అనంతపురం జిల్లా 
నేను జన్మించినది ఆనంద సం చైత్ర శుధ్ధ విదియ జన్మస్తానం చియ్యేడు. 


అది అనంతపురం సమీపమున నున్న పల్లె 
అది నా మాతామహగృహము. మేమిర్వురన్నదమ్ములము . 
నా తల్లి మెండమ్మ 
నా చిన్నతనముననే (నాల్గవ వయసున) గతించినది 


మెండమ్మ 
అలమేలుమంగలకు తెంగు సేత 



ఆమె సంస్కృతాంధ్రములలో చక్కని కవయిత్రి మానాన్నగారు శ్రీ పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు 
ఆయనదియు ఆంధ్ర పండితుల జీవనమే. 
చక్కని కవి ..


మా తల్లిదండ్రులు పద్యములలో శ్లోకములలో 
జాబులు వ్రాసుకొనెడివారు. 
మా తల్లి పద్యములు కొన్ని 
నేటికిని అముద్రితములున్నవి. 



మా నాన్నకు మంచి పౌరాణికుడని పేరు 
ఆయన కవిత్వము చక్కని సంప్రదాయ బధ్ధమైనది. 
నా చిన్న తనమున 
మా ఇంట సాహిత్య గోష్టులకు లెక్కలేదు. 



శ్రీ రాళ్ళపల్లి వారూ ..
వారి అన్న గోపాల కృష్ణశర్మ..
మానాన్నా.. పప్పూరు రామాచార్లూ ..
వీరంతా సమ వయస్కులు 
ఒక రీతిగా సహ పాఠులు.



రాళ్ళపల్లి మాటకు ముందు
 పెనుగొండ కు బర్వెత్తి వచ్చెడువారు. 
గోపణ్ణ కాజిల్లాలోనే రెవెన్యూ ఉద్యోగము. 
వీరందరూ చేరినచో 
యే ప్రబంధమునో 
తిక్కననో బట్టి సాధించెడివారు..



రాత్రి అన్నమునకు ఒంటిగంట. 
పగలు రెండు గంటలు 
మా నాన్నకు పెనుగొండ హైస్కూలు లో 
నాంధ్ర పండితుల పని  
వీరూరికి వచ్చిన వారు లీవు బెట్టెదరు. 
ఇంటిలో నొకటే గోల..

 

మా నాన్నకూ
గోపణ్ణకూ వసుచరిత్రపై ప్రీతి 
దానిలో వారికి దెలిసిన యర్థము లెన్నియో 
దేశమునకు దెలియవు 
తెలుపవలెనను యిఛ్చయు వారికి సున్న 



కవిత్వము ఉల్లాసమునకు వ్రాసికొనెడివారేగాని 
వానిని ప్రకటించు నపేక్షయే వారికి లేదు 
వారందరు జీవితములో అన్నివిధముల రసికు లు 



ఈ గుంపులో కొంత బయటికి దిరుగుచున్నది. 
రాళ్ళపల్లి వారే ..
వారికాముక్తమాల్యద ప్రాణము 


స్వఛ్చమై ఆత్మతృప్తితో గూడిన 
విద్యానగర రాసిక్యము వారిది 
నాకిప్పటికిని వారి జీవనమన్ననెంతో చాపల్యము 
వారి గోష్టులు 
నా చిన్నతనమున చదువకయే నామూల్య విషయములదెల్పెడివి. 



నాకు విజయనగర సాహితి పై నున్న 
యభిమాన మీ గోష్టుల బిక్షయే 
చిన్నతనమున మా నాయన పురాణమునకు 
నేను వాచకుడను 


దీనితో అనేకసార్లు భారతము 
సార్థకముగ చదువుటయ్యెను 
నా కవితా ధోరణి తిక్కన బిక్ష.


మా మాఱుదల్లిది మైసూరు 
ఆమె కర్ణాటక సంగీతము బాగుగా నేర్చినది. 
ఆమెకిర్వురు సుతులు.. ఒక ఆడుబిడ్డ..



మా తల్లి వద్ద నా సంగీత విద్యాభ్యాసము 
మా నాయనగారును అపుడపుడు చెప్పెడివారు 


ఒక సా రి  నేను క ళ్యా ణి వర్ణము తప్పు పాడగా 
మా నాయన శృతిపెట్టె నా నెత్తిన వేసెను 
ఆ యనుభవము నేటికిని గుఱుతున్నవి.


వానిలో కొన్నిటిని నేనే స్వరపరిచితిని 
కు.నా తనయలు 
వానిలో గొన్నిటిని బాడుదురు 
కృతులను ప్రకటించలేదు 
సాహిత్యమునకే ఉప్పు పుట్టని దేశమున 
వాగ్గేయకారుల కెవ్వరు పిలిచి పీటవేతురు. 



నాకు పద్యరచన కంటెను పద రచన ప్రీతి 
పద్యములు వ్రాసినను 
సంగీతము తోడులేనిది 
నాకు పదము వెళ్ళదు 
కొంత శబ్ద చాపల్యము కద్దు 


నా తనయలలో పెద్దదానికి 16 వయసు 
చిన్నదానికి 13. 
ఇద్దరూ కచేరి చేతురు. 
కొంత నా శిక్షణయే.



నాకు చిన్న తనాన నాట్యము బాగా వచ్చును 
దానికి గురువు బోవపు మహాలక్ష్మమ్మ 
ఆమెకు నేనిచ్చిన గురుదక్షిణ 
యామె ముడులుదుకుట 
తర్వాత యేవేవో యూహలతో 
నా సాధనము వదలిపెడితిని.


అప్పుడు నాట్యమునకు 
సమాజమున గౌరవము లేదు 


చిత్రలేఖనము 
కొన్ని రోజులు కొక్కిరి గీతలు వేసి వదలితిని
నేనత్యంతము పరాజయమందినదీ కళయందే.



నా హైస్కూలు చదువులో 
ఇంట్లో కావ్య పాఠము సాగెడిది. 
మా నాన్న ఆంధ్ర పంచకావ్యముల జెప్పెను 
శ్రీ బుక్కపట్టపు అణ్ణయాచార్ల వారి దగ్గర 
సంస్కృత పాఠము 



నేను హైస్కూలు మూడవ ఫారము ప్యాసు కానేలేదు లెక్కలలో మూడు మార్కులకు 
పైనెప్పుడూ వచ్చెడివికావు 



ఆంగ్లమప్పుడే బాగా వ్రాసెడు వాడను 
చిన్ననాడే నాకు హరికథలు చెప్పుట వాడుక 
నేను చెప్పిన మొదటి హరికథ 
 "ప్రహ్లాద చరిత్ర "పదవ యేట 
మా హైస్కూలుపాధ్యాయులాశ్చర్యపడిరి.



మా నాన్నను చూచిన నా కమిత భయము 
నేటికిని 
నా రచనలాయనకు చూపు ధైర్యము నాకు లేదు 

పసితనమున నా దుర్మార్గమున కంతులెదు 
ఊరివారికి నా చదువుపైనెత మెప్పో ..
నా దుర్మార్గమునకంత కంటగింపు..



మా తండ్రి తట్టుకొనలేక యూరకతన్నెడువాడు 
ఆరు నెలలకొకసారి 
దేశముపై బరువెట్టిపోయి మరల ఇల్లు జేరెడి వాడను
 బైట అప్పటి నా జీవనము హరికథలు



నా తొల్తటి రచన "పెనుగొండలక్ష్మి "
అది వ్రాసినది నా పండ్రెండవ యేట 
అప్పటికి నాకు ఛందస్సు రాదు 
తిక్కనను చదివిన యలవాటులో పద్యము లల్లితిని 
యతి ప్రస్ఠానములు సరిగా తెలియవు 
కాని ఛందస్సు ఆశ్చర్యకరముగా కుదిరెడిది. 



నాకది ఇప్పటికీ వింతయే 
అది ప్రింటయినది నా 22 వ యేట 
శ్రీ చిలుకూరి నారాయణరావు గారు 
దానిని చూచి మెచ్చి దయతో ప్రకటించిరి. 



కానీ అది వ్రాత ప్రతిలో నుండగనే 
యనేకులు కాలేజీ విద్యార్థులు 
దానిని వ్రాసికొనిరి 



ఒకటి నిజము ..
ఆ కావ్యము వ్రాయు చిఱు వయసుననే 
నేను మాయూఉరి పాడు గుడులను 
కోట క్రొత్తళములను చూచి 
ఊరక నాలో నేను యేడ్చుకొనెడి వాడను 
భట్టుమూర్తి వసుచరిత్ర వ్రాసిన చోటూ 
తిరుమల రాయుడు గోలకొండ నవాబులతో బోరినచోటూ నా హృదయమున దావాగ్ని నెగజల్లుచుండెను 



ఆ కాలమున నాకు బైరన్ రచనలెక్కువ ప్రీతి
ఎవ్వరి తోడను పలుకక 
మౌనముగ నాలో నేను
"కుసు ళ్ళు " పోయెడి వాడను 



స్కూలులో ఉపాధ్యాములు 
"చిన్న హామ్ లెట్"
 అని నన్ను బిల్చుచుండిరి. 



మా నాయన 
"మూగ వెధవా..
 నీవు ప్రపంచమున నెట్లు బ్రదికెదవని.."
 తిట్టెడువాడు .
నా కథ ఆయనకు దెలియదు.



నాకొక చెక్క పెట్టెయుండెడిది. 
ఒకనాటి ప్రొద్దున కాఫీ తాగి పెట్టెనానుకొని పెన్సలుతో "అలకవితా లోకమునకు.."
 అని గిలుకుచుంటిని 
మా తండ్రి నా యొద్దకు వచ్చి 
"యేమిటి బఱుకు చున్నావు..? "
అని కాగితము పెఱుక్కొని.. చదివి.. 
 'కలిమికి వైరంబదేల గల్లిగెను చెపుడా..
 కలికాల మహిమ సద్గుణ కలితుల నృపసిమ్హము లను గనకుండుటయే.." 
అని పట పట చెప్పివేసెను 

"వెధవా..
 పద్యము పూర్తి చేయలేని వానివి వెందుకు మొదలు బెట్టితివి..?" 
అని నా తలపై వేసి పోయెను. 
నా యశక్తకు నేనెంతో సిగ్గుపడితిని 


మాయూర చిన్ననాడే 
'బోగము మేళము " జరిగినను 
నాకు వారు దండము పెట్టవలెను 
లేకున్నచో 
ముద్రలోనో ..
అడుగులోనో ..
తప్పుపట్టి భంగింపనిది నాకు నిద్ర రాదు,.



నా ఉపనయనము 13వ యేట 
ఆనాడును ..
మా నాయనతో నాకు కాయశుధ్ధి తప్పలేదు 
వడుగైనది మొదలు ..
గాయత్రిని బాగుగా జపించి 
24 లక్షలు పూర్తి చేసితిని



నేను తిరుపతిలో 
సంస్కృత కాలేజీలో 14 వ యేట జేరితిని 
అప్పుడు నేను వ్రాసిన కావ్యం 
"వాలిచరిత్ర"
 పిదప వసుచరిత్ర వలె 
"ఇందుమతీ పరిణయము" వ్రాసితిని 



తర్వాత ఆ రెంటినీ నేను చించివేసితిని 
విద్యార్థి దశలో అవధానములు చేసెడివాడను 
అష్టావధానములెన్నియో చేసితిని 
అశువు వేగము జెప్పెడి వాడను 



కొన్ని దినములు పేరు 
  "అష్టావధాని" తగిలించుకొని 
పిదప అసహ్యమై వదలి వేసితిని 



నేను ఎంట్రెన్సులో ఉండగా 
"షాజీ.."
 అను పద్య కృతిని వ్రాసితిని 
అది మద్రాసు యూనివర్సిటీ 
ఇంటరుకు పాఠ్యగ్రంధమాయెను 
దానిని ప్రకటించిన వారు తోడి విద్యార్థులు 
వారందరకది గర్వ కారణమాయెను.



తిరుపతిలో నేను చదివినది వ్యాకరణమూ అలంకారణమూ 
ఆనాడు గోకర్ణమునకు బోయినది 
నేడు వచ్చునది సున్న..



ఆ నాళ్ళలో నాకింగ్లీషుపై మమకారము 
ప్రాతః కాలమున బైబిలు వల్లించెడివాడను 
షేక్స్పియర్ ..ఇట్సెన్.. షా ..
ప్రభృతులు నా కమిత మిత్రులు 
మిల్టన్ ఆరాధ్యదేవత 


ఇంగ్లీషంత బాగ మాట్లాడిన 
అంత నాగరకుడనుకొన్న రోజులవి.



రాళ్ళపల్లి నాకు మేనమామ 
ఆయన కడకు మైసూరు వెళ్ళెడి వాడను 
ప్రాకృతములపై నాభిమానము 
గల్గించిన దాయన దయ. 


పిదప చాలకాలము 
వానిని బట్టుకొని యూగులాడితిని 
నేటికిని సంస్కృతము కన్న 
ప్రాకృతములపై నాకభిమానమెచ్చు.

 

నా మొదటి వివాహము 19వ యేట జరిగెను మాంగల్యము కట్టిన రోజత్త యెగిరెను..
పిదప రెండు రోజులకు భార్య చచ్చెను..
పిదప రెండురోజులకొక శిశువు స్వాహా..


ఈ పెండ్లితో కట్టుకున్నది కర్మ మాత్రమే 
పాపము విందిల్లు కూలెను. 
తొల్తనే ఆవిడ వద్దంటిని 
మా నాయన వినలేదు. 
ఆయన అంటే నా కమిత భయము 



పిదప 6 నెలలకే రెండవ వివాహమైనది. 
ఆవిడ పేరు కుం. కనక వల్లీదేవి 
ఆమె పితామహుడు గొప్ప తార్కికుడు 
ఆమె వారికడ కావ్య పాఠము వ్యాకరణమూ ముగించెను. 
సంస్కృతాంధ్రములలో రచన సేయును. 
సంగీతము వచ్చును. 


మేరిర్వురమూ కలిసి వ్రాసిన పుస్తకములు
 అగ్నివీణ ..
గాంధీ మహా ప్రస్థానము..
రెండునూ ప్రింటైనవి 
ఆమెకు రచనా చాపల్యము చాల తక్కువ 


వాల్మీకి రామాయణము 
చాలా భాగమామె నోటికి వచ్చును 
మంచి చండీ ఉపాసకురాలు 
వాల్మీకి పఠనమామె జీవితమున మంచి చాపల్యము.



తర్వాత ఉద్యోగమునకై విద్వాను పాసైతిని 
ఆ యేడు నా పెనుగొండలక్ష్మి పాఠ్యగ్రంధము 



హిందీ భాషను చదువుకొంటిని 
నాకు తులసీ రామాయణమన్న ప్రీతి 
ఆ గ్రంధము నోటికి వచ్చును 
మీరా.. విద్యావతి.. రసఖాన్..
 ప్రభృతులు నా దేవతలు..



మహారాష్ట్రమును నేర్చితిని 
కారణము ..
నా యుపాసనా గురువు మహారాష్ట్రుడు 
అందుచే..
తుకారాం..
 జ్ఞానేశ్వర ..
ఏకనాధ ..
సమర్థ రామదాస..
 ప్రభృతుల రచనా ప్రభావము నాయందమితమైనది 



తెన్గు న క్షేత్రయ్య నా దగ్గరవాడు 
"నా సంస్కృతోఛ్చారణము 
మరాఠీ యుఛ్చారణమని.."
జమ్మల మడక మాధవరాయశర్మ 
యెప్పుడును తప్పులు పట్టును. 
కావచ్చునేమో ..?



కన్నడమున 
బసవడు ..
అక్కమహాదేవి..
సర్వజ్ఞుడు ..
కుమార వ్యాసుడు ..
మొదలగువారు నా ఇలవేల్పులు



శైవకవుల వచనములు యెప్పుడును చెప్పికొనుచుందును 



తమిళ మళయాళములు రావలెనని 
నాకు చా ల యేండ్లుగా నభిలాష యండెడిది. భగవంతుడాయవకాశమునిచ్చెను.
 వైష్ణవాళ్వార్ల రచనా మాధుర్యమూ 
నయనార్ల భక్యావేశమూ 
సిలప్పదిగారు శిల్పమూ 
మణిమేఖలా కధకధనమూ 
సంగ సాహిత్య విశృంఖల భావనా 
నాకత్యంత ప్రియమైనవి 


మళయాళపు 
ఎళుత్తచ్చెన్ నాకర్థమైనాడు 
చంద్రోత్సవ కావ్య శిల్పమూ ఆకళించితిని 
వల్లట్టోల్ను చదివినాను 
ముఖ్యముగ వరి అట్టకథలు నా మనస్సుపై 
మాయని ముద్ర వేసినవి..


నేను చిత్ర రచనలో వలె పరాజితుడనైనది 
ఫ్రెంచిభాషలో..
ఆ అనునాసికోఛ్చారణమునకాగలేక వదలివేసితిని 


రెండవది అణచిక్కు 
ఖురాన్లో రెండు సూరాలు చదివి 
స్పెల్లింగ్స్ గట్టి చేయలేక 
నమస్కారము బెట్టితిని 


సంస్కృతమున నా ప్రియులు 
భవభూతి ..వ్యాసుడు..
 వారి భావ తీవ్రత నాకిష్టము..


నా చిన్నప్పుడు 
"ఈ దృష్టితో.. నీవు పోను పోను 
జీవితమున చాల కష్టపడెదవని .."
రాళ్ళపల్లి జో స్యము చెప్పుచుండెను 


లీలాశుక ..
జయదేవ.. 
శంఖుక.. 
మయూరాదులు..
 నా స్వాములు ..


కాళిదాసును చదువగలను 
కాని నా కాత్మీయుడు కాడు 
మఱు జన్మమునకైన 
యాతని బ్రేమింపవలెనని నా యాశ. 

రాళ్ళపల్లి కాళిదాసు శిష్యుడు. 
ఆయన రఘువంశమునెంతో ముచ్చటనదెనిగించి బాగలేదని చించివేసెను 


ఆ విషయము నాకు చాల బాధ కలిగించును.
సంస్కృతములో శివసహస్రం నా కృతి 
అది ప్రింటు కాలేదు 


అందులో కొన్ని శ్లోకాలు మచ్చుకు

"శ్రీమంతస్సంతు సృష్టస్థితిలయ లసవత్కావ్యధారా ప్రమీల
ధ్వన్యధ్వ్న్యధ్వనీనాః కహ కహ నినధాపాధితాప్యాయి వేదా
సాకూత స్ఫార గౌరీ నయన చుళుకిత్పా, శేఖరచ్చంద్రచాంద్రీ
ప్రేయాంసః పుణ్యరూపాః కబళిత కకుభశ్శాంభవా స్సాంశ్రహాసాః
దేవాది దేవ మమతసీకుసుమానుకారి కంఠప్రభా నిచుళితాఖిల దిక్కరండం
మైరేయమత్త శబరీ మదనాభిభూత పీనస్తన త్రుటిత వక్షభూసమాశ్రయామః
గుజావిభూషిత శిఖం శిఖి పింఛ గుఛ్చ సమ్మర్ఠన శ్లసిత శైశవ చంద్ర భూషం
హస్తానుబధ్ధ శర కాండ మనల్ప తలం ఆలోకయే సతత మాత్మగతం కిరాతం
పద్యోనికృత్త వనహారణ కుంభకుంభ సంక్రాంత రక్త కణ దంతురితావకాశం
ముగ్ధం వహంత మమరీ తరుణీ కటాక్షఫుల్లంకపోల భరణం నమామి
ఆసీన కానన లతా ప్రతి బధ్ధ చూడ మారక్త నేత్ర తప వారణాఢ్యం
సమ్యుక్త గల్ల మనుబంధికుచైక పార్శ్య గౌర్యానికామ మభిసారిత మాగ్రియామయః
దావద్భిరంచిత భయై రటవీ కురంగైః వ్యావృత్త కంఠ మవలోకిత అత్తధన్యా
తద్దృష్టి గుఛ్చ గణ విఛ్చురితాప్తవేష శ్శంభుస్సుఖాయ భవతాన్మధురః కిరాతః
గుంజా విభూషణ శతంచ వరాహదంత తాటక మండనవతీం చ మహేంద్ర నీలాం
లజ్జాంచితాంచ గిరిజా మభివీక్షమాణో వః పునాతు పరికల్పిత భిల్లవేషః

వర్ధంతి శివ సాహిత్య మాకల్పం నిర్నిబంధనం

కారిక రజనీ నాధ చంద్ర కాధవళద్యుతిః

ఒకరి వివాహాన రచించిన చాటువు..
 

"కటాక్షాణాం కర్తా సుధిత సుధిత చంచల దృశా
మజయ్య శ్శర్వాశీ శబలిత తనోః ఖండ పరశోః
పృధూరోజశ్రీశా మమరదయితానాం రమయితా
విధత్తా మాశాస్యం కుసుమ శరధన్వా రతిపతిః"

ఇలాంటి చాటువులు తె న్గు సంస్కృతాలలో 
చాలా వున్నాయి 
ఎప్పుడు గడ్డకు వస్తాయో 

ఇంకొక అప్రకాశిత సంస్కృత కృతి సత్యాగ్రహ కావ్యం 
తెన్గు న కొన్ని అప్రకాశిత కావ్యాలున్నాయి 

పండరి భాగవతం (24 వేల ద్విపదలు) 
కాంగ్రెసు చరిత్ర గేయకావ్యం 
విజయనగర చరిత్ర రిసెర్చి ,
అనేక వ్యాసాలు 
"విరహ గోపి" ఖండకావ్యం 


ఒకసారి "అస్తసామ్రాజ్జం"
సుమారు రెండు వేల పద్యాలు వ్రాసితిని 
ఆ కాపీ యెక్కడో పోగొట్టుకొంటిమి ..
పేరు మహాత్యమేమో. .?


ఆంగ్లమున నేను వ్రాసిన "లీవ్స్ ఇన్ ద విండ్"
 అను కావ్యమునకు "హరీంద్ర నాధుడు"
 చక్కని పీఠిక వ్రాసినాడు. 
అదియు ప్రింటు కాలేదు 

నా 18 వ యట నుండి 30 వ వయసు వరకు వ్రాసిన ఖండికలు పెక్కులు అవి యెక్కడెక్కడో పోయినవి 


కొందరు సాహితీ ప్రియులు 
తమ పేరిట కొన్నిటిని ప్రకటించుకొన్నారు. 
ఎవరి పేరైతే లెమ్మని తృప్తి పడినాను 
కొందరు పెద్దవారే 
నా పరిశ్రమమును తమదిగా బ్రకటించుకొనిరి. 
ఇవన్నియు దేవ రహస్యములు 
మన దారిద్ర్యలోపము.


ఇప్పుడు ప్రింటులోని నా గ్రంధములివి
పెనుగొండ లక్ష్మి
షాజీ
సాక్షాత్కారము
శివతాండవము
పాద్యము
అగ్నివీణ
గాంధీ మహా ప్రస్థానము
మేఘదూతము
మొదలగునవి పద్యములు
ప్రబంధనాయికలు
వ్యాససంపుటి గద్య కృతులు
 

నాకు మొదటి నుండి 
యుపాసనాభిరతి యెక్కువ 
సాహిత్యమానుషంగికమే
ఆ పచ్చిలో తిరుగవేసిన తాంత్రిక గ్రంధములు పెక్కులు 


నా ప్రధమోపాసన లక్ష్మీనారాయణులు 
ఈ దృష్టియే గ్రంధమును పూర్తి చేయనివ్వరు 
నా యసంపూర్ణ గ్రంధములు కోకొల్లలు 
నన్నెరిగిన వారందరు నేను 'చపల చిత్తుడందురు' నిజమేనేమో ..


కానీ 
"ఋషి గాని వాని వాని వ్రాతలు మసి దండుగ గాక యేమి మాన్యత" యని నా ఊహ
 

నా మంత్రమష్టాక్షరి 
దానిని 13 కోట్లు చేసితిని 
కడకు విసిగి.. సంసారము వదలి..
సన్యా సు లను వెదకి కొనుచు 
ఉత్తర హిందూ స్థానమంతయు దిరిగితిని..



స్వామీ శివానందులు 
నన్ను కొంతకాలముంచికొని..
 శాంతినొసగి..
"సరస్వతీపుత్ర" యని బిరుదమిచ్చి పంపెను 


నాకీ బిరుదము వలదంటిని 
ఉండవలెనని పట్టుబట్టిరి.  



తర్వాత మహాకవి యొకటి చేరెను 
నాకు స్వభావతః బిరుదులు గిట్టవు 
చాల మట్టుకు 
అభినవ నన్నయ్య 
పోతన 
నాచన సోమనాధాదికములను 
ఇచ్చిన దాతలకే వెనక్కి ఇచ్చివేసినాను 



మిమ్ము జూచిన నాకసూయ 
మీకే బిరుదులును లేవు 
అట్టి స్వఛ్చ వ్యక్తిత్వము నాకు గావలెను 
మరి యెందుకో 
ఈ రెండును దగులు కొన్నవి 



నాకు ప్రియమైన చోటు ఇండియాలో రెండే 
పండరి 
బృందావనము 
అశాంతి గల్గినప్పుడు పండరికిబోవుట వాడుక



విజయనగర చరిత్రలో ప్రసిధ్ధులు 
కుమార తాతాచార్యుల వంశము మాది. 
వారిచ్చిన యగ్రహారములు మొన్నటి వరకుండెడివి 
ఈ నడుమ గ్రాసవాసోదైన్యము. 
కుమార తాతాచార్యులపయ్య దీక్షితుల ప్రత్యర్థి. 
మాకు శిష్యార్జముగ గూడ. 



నా చిన్నతనము వరకుండెడిది. 
నాగరకత బెరిగి యవి మాసిసోసి పోయినవి 
మా తిరుమల వారికి నేటికిని 
ప్రతి వైష్ణవ క్షేత్రమునను ప్రధమ తీర్థము కద్దు 
మా పెద్దలందరాచార్య పురుషులే 



విద్యానగర రాజులు 
 వైష్ణవులకు చిత్రావతీ నది పొడవునను 
స్మార్తులకు 
పినాకినీ నది పొడవుననూ 
అగ్రహారములు వెట్టిరి. 
నా యుభయ వంశములవారును చక్కని శాస్త్రవేత్తలు 



మా పెద్ద తండ్రి వ్యాకరణము కాశీలో జదివెను 
నా మాతామహ సంతతి 
తార్కికులు.. వేదాంతులు..
నా మాతామహులయన్నగారు 
నేత్రావధాన ప్రవీణులు 



వైష్ణవకవులలో వేదాంత దేశికులు 
నా యుపాసనామూర్తి 
వారి రచనలకు నా మనసుప్పొంగును.



నేను కొన్ని రోజులు
 ప్రొద్దుటూరులో సంస్కృత పాఠశాలలో 
ఉపాధ్యాయుని గనుంటిని 
నా పోషకులు శ్రీ కొప్పరపు సుబ్బయ్య శ్రేష్టి గారు. 



పిదప హైస్కూలున వారే చేర్చిరి. 
ఆ వరకు ఒక వర్షము 
అనంతపురపు కాలేజీలో నుంటిని 
ఆ కొల్వు నాకు గిట్టలేదు 
మరల వెన్క కు వచ్చి 
పొద్దుటూరనే కొన్ని యేండ్లుండి 
కారణాంతరములతో రాజీనామా ఇచ్చితిని 



అప్పుడే ఉత్తరదేశయాత్ర 
పిదప కడప వాసము..
నేడు తిరువాన్ కూరు 
రేపేదో ..?
జీవనమున నిలుకడ లేదు..!!
నాకు దశమస్థానము కేతువు నిల్కడగా కూర్చున్నాడు. 



పైకి నాదెంత నాగరక వేషమో..
హృదయమున నంత సనాతనుడను. 
మానసికమునెప్పుడును అష్టాక్షరి జపించుచుందును 
వైరభక్తి కంటెను ప్రేమభక్తి ప్రీతి 



నా హృదయమును లోగొన్నవారు 
హిందీ ..మహారాష్ట్ర భక్తులు ..
పోతన్న.. త్యాగయ్య.. క్షేత్రయ్యలు..
 సంస్కృతమున 
లీలాశుకాదులు ..


నా మానసిక ధర్మము శరణాగతి 
మానవుని వివేకమూ ..
పురుషకారమూ ..
వీనిపై నాకు నమ్మకము సున్న..


ఈ విషయమున 
నాకును రాళ్ళపల్లికిని యెప్పుడును రగడ 
నాయసంపూర్ణ కావ్యములు పెక్కులు 



ఏవో మొదలుపెట్టుదును..
"భగవత్సాక్షా త్కారము లేని కృతి 
విశ్వశ్రేయమేమి చేయునని .."తోచును 
అది నిల్పివేయుదును 



ఇప్పుడు నేను వ్రాసిన గ్రంధములన్నియు 
పది పదినేడునాళ్లలో ముగించినవే 
శివతాండవము ..
శివునకు దినము 108 ప్రదక్షిణలు సేయుచు 
15 నాళ్ళలో ముగించితిని..
 

అప్పుడు ప్రతిదినము అభిషేకము చేసెడివాడను వైష్ణవుడనై శివపూజ యేమిటని..?
నేటికినీ కొంతమంది వైష్ణవులకి నాపై గుర్రు 
ఆ వెర్రి దేవుని పై నాకు మమత 



పండరి భాగవతము నా పదునారేండ్ల రచన 
ప్రతిదినమూ రాత్రి 
భగవంతుని కడ గూర్చుండి వ్రాసెడువాడను 
అది నా సాధనలోని యొక భాగము 
శాపవశ మున పాలకురికిని జూచి 
వైష్ణవమున నట్టిదుండవలెనని వేసిన నడకయది 



కృతులిప్పుడును వ్రాయుచుందును. 
వానిలో క్షేత్రయ్య యగుపించును 
ఇవన్నియు నా సాధనలే 
ఇవి గడ్డకు రావలెనను ఆశయే నాకు లేదు.
 

నన్ను లోగొన్న రెండవది 
విజయనగర సాహిత్యము 
ఆ సామ్రాజ్జమన్న నా గుండెయంతయు గంపించును 
ఆ చరిత్రకు సంబంధించిన దేముక్క యున్నను 
జాగ్రత్త సేయుదును ..
వారి రసికత నాకు ప్రీతి ..


తిక్కనపై 
నా చిన్న తనమున అభిమానము గంపెడు 
నేడెందుకో చదువలేను..
భాగవతమెక్కువగా చదువుదును 
పోతన్నకు తెన్గు లు నిరాదరించినారని నా వేధ 
ఆయన భక్తి నాకు ప్రీతి ..
ఈ జీవనమన్న భయము ..


నేను వలచు జీవనము 
పండిత రాజ విద్యాపతులది.
 

శబ్దములో.. భావములో ..
రమణీయనూత్నత నాకు అభిమతము 
అందుకే నాకు తెన్నాలి బాగా నచ్చును 


శ్రీనాధుని విశంకట గతి నా వలచునది. 
అతని భావదాస్యము నాకు గిట్టదు 



కలము పట్టినచో..
నాకనేక కవులు అనేక భాషల నుండి 
జ్ఞాపకమునకు వత్తురు..
నా కలమాపి 
వారి రచనలు పాడుకొనుచు 
ప్రొద్దు పుత్తును ..
ఈ జీవితమింతేనేమో ..!

ఆధునాతన సాహితీ మార్గములలో 
పెక్కింటిపై నాకు సానుభూతి తక్కువ..
ఇజములన్న నాకు చెడ్డరోత ..
వ్యుత్పత్తి శూన్యులైన యనేక 
తెన్గు కవుల ను జూచినపుడు 
ఆంధ్రదేశము కొంతకాలము ..
కవిత్వమును బహిష్కరించిన 
బాగుండునా
యని నాకు దోచును..!


తెన్గు  దేశము..
నాట్య సంగీతములను పూర్తిగా పోగొట్టుకొని 
యొక కవిత్వమును బట్టి వ్రేలాడుచున్నది 



కేరళుడు శంకర కవి యన్నట్లు 
'శ్రీ మన్ముకుంద మురళీ మధురములు "
రచనలు నాకు కావలెను
 

మరల దేశమున 
సంస్కృత ప్రాబల్యమూ ..
సంస్కృత కవులూ.. 
రావలెనని నా కల..
అది రాదు ..


ఆధునాతన విమర్శక మతమున 
అది బ్రాహ్మణ భాష ..
ప్రపంచమును జెరచు పుస్తకములు 
వారు వ్రాసినారట ..

ఆ హా..

నాకు వర్ణాశ్రమ ధర్మ నిరాసమూ..
 ఇవి అత్యంతము గిట్టవు..
ఇది మనలో మాట.
 

"ఆమూలాద్రి రత్నసానో.."
అని పండితరాయలు సవాలు చేసినప్పుడు.. "దేవీంవాచముపాసతేహి.."

అని మురారి చప్పరించినప్పుడు..
నా రజో గుణ ముప్పొంగి పులకితుడనౌదును 
వారు నిజమైన సాహిత్య కారులు 



ఈ దుర్మార్గులు .. 
రా జకీయ వాదులు 
అట్టిజాతిని మరల రానివ్వరు 
నాలుగింగ్లీషు ముక్కలు చదివి 
సర్వజ్ఞులమనుకొను 
ఈ జాతిని చూచినప్పుడు 
నా కమిత బాధ ..నవ్వు..



వీరిపై యసహనముతో..
చిన్నతనాన షేక్స్పియర్ నాటకములు వల్లించితిని..
ఇపుడా దృష్టియు బోయినది ..



మహత్తరులైన 
తాతా సుబ్బరాయ శాస్త్రి.. సోమశేఖరులు..
మొదలగు వారిపై 
దేశమెంత యనాదరము జూపినది..
వారు పాపము.. 
దారిద్ర్యముననే బ్రదికిరి..
 

ఇకనేమి వ్రాతును.. భాయీ..
 

వెర్రికి బెట్టుకుని 
అవసరములు 
అనవసరములు 
అన్నియు వ్రాసితిని 
వీనిలో దయచేసి 
మీకు గావలసిన విషయములేరికొనుడు 



అయితే 
అధిక ప్రసంగముగా 
అనధికృతముగా 
అక్కడక్కడనేనేవి యున్న 
వానిని క్షమింపుడు..
 

తమ కమ్మ 
రెండు మూడు  మార్లు చదువుకొన్నాను 
సమానమైన హృదయధర్మము గలవారికి
చెలిమి తొలి చూపుననే యేర్పడి పోవును 
నేటి నుండి మీరు నా హృదయమున కభిన్నులు
 
ఇక నిలుస్తా..
నమాంసి.
పుట్టపర్తి 















కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి