18 ఫిబ్ర, 2014

స్పర్శవేది

       తలగవు కొండలకైనను
        మలగవు సింగములకైన! మార్కొను గడిమిన్
        గలగవు పిదుగులకైనను
        నిల బల సంపన్నవ్రుత్తి! నేనుగ గున్నల్
        
       నీరాట వనాటములకు
        బోరటం బెట్లు గలిగె! బురుషోత్తముచే
        నారాట మెట్లు మానెను
       ఘోరాటవిలోన భద్ర: కుంజరమునకున్

 యీ పద్యాలు చదువుతుంటే

భావం  అది వ్యక్త పరిచే పధ్ధతి
ఆ పదాలు దానిలో దాగున్న లయ
అవి మనల్ని వెంటాడతాయి


కానీ విమర్శకులు మాత్రం
 భూతద్దాలతో తయారై
మంచివని మనమనుకున్న వాటిల్లోంచీ కూడా లోపాలు వెదికి  చూపిస్తుంటారు
 

ఆరంధ్రాన్వేషణ వలన వారికీ మనకూ కూడా ఒరిగేదేమీలేదు
కాగా
కొంతకాలానికి మనకూ ఆజాడ్యం అంటుకోగలదు
 

మనకెందుకీ రభసలు 
హాయిగా నచ్చిన కవిత్వం చదువుకోక అనుకుంటాం మనం

మరి పోతన్నకు యెదురైన విమర్శలేమిటి
చూద్దామా


గజెంద్రమోక్షంలో అడవిని వర్ణిస్తూ 
పోతన్న వ్రాసిన వచనం వారి కాహారమైంది.
 

ఆధునికులు 
తండ్రితాతల అన్వేషణలో ముందుకు సాగితే
సంప్రదాయవాదులు గ్రామరునే ప్రామాణికంగా పెట్టుకున్నారు


అయినా ఉత్తమ గ్రంధాలను వ్రాసేవారు 
జనాలకోసం రాయనే రాయరు
తనకోసం తన ఆత్మానందం కోసం రాసుకున్నవి మనకు అమృతాలవుతాయి
జనాలను మెప్పించడానికి రాసేవానిలో ఆత్మ ఎక్కడుంటుందీ..


పోతన వ్రాసిన వర్ణన ఇదే
ఒకసారీ అడవిగుండా ప్రయాణించి అందాలు వీక్షించి పుట్టపర్తి వారేం చెప్పారో చూద్దాం సరేనా..


 అది మఱియును మాతులుంగ లవంగ లుంగ చూత కేతకీ భల్లాత కామ్రాతక సరళ పనస బదరీ వకుళ వంజుళ వట కుటజ కుంద కురువక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సిందువార చందన పిచుమంద మందార జంబూ జంబీర మాధవీ మధూక తాల తక్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బిల్వామలక క్రముక కదంబ కరవీర కదళీ కపిత్థ కాంచన కందరాళ శిరీష శింశుపాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికామతల్లికా ప్రముఖ నిరంతర వసంతసమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరు న్నివహా లంకృతంబును, మణివాలు కానేక విమల పులిన తరంగిణీ సంగత విచిత్ర విద్రుమలతా మహోద్యాన శుక పిక నికర నిశిత సమంచిత చంచూపుట నిర్దళిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫల రంధ్ర ప్రవర్షిత రసప్రవాహ బహుళంబును, కనకమయ సలిల కాసార కాంచన కుముద కల్హార కమల పరిమళ మిళిత కబళాహార సంతతాంగీకార భార పరిశ్రాంత కాంతా సమాలింగిత కుమార మత్త మధుకర విట సముదయ సమీపసంచార సముదంచిత శకుంత కలహంస కారండవ జలకుక్కుట చక్రవాక బలాహక కోయష్టిక ముఖర జలవిహంగ విసర వివిధకోలాహల బధిరీభూత భూ నభోంతరాళంబును, తుహినకరకాంత మరకత కమలరాగ వజ్ర వైఢూర్య నీల గోమేధిక పుష్యరాగ మనోహర కనక కలధౌత మణిమయానేక శిఖరితట దరీ విహరమాణ విద్యాధర విబుధ సిద్ధ చారణ గంధర్వ గరుడ కిన్నర కింపురుష మిధున సంతత సరససల్లాప సంగీతప్రసంగ మంగళాయతనంబును, గంధగజ గవయ గండభేరుండ ఖడ్గ కంఠీరవ శరభ శార్దూల చమర శల్య భల్ల సారంగ సాలావృక వరాహ మహిష మర్కట మహోరగ మార్జాలాది నిఖిల మృగనాథ సమూహ సమరసన్నాహ సంరంభ సంచకిత శరణాగత శమనకింకరంబునునై యొప్పు నప్పర్వత సమీపంబునందు.


                                                                       *** 




 
ప్రాచీనులలో అప్పకవి మొదలైన మహామహులకు పోతన్న కవిత్వము లాక్షణికముగ గనుపింపలేదు
అతడొనర్చిన పాపమేమనగా 
లఘ్వులఘురేఫములకు బ్రాస గూర్చుట..

ఇట్టి పనికిమాలిన యెత్తిపొడుపే పాలకురికి సోమనాధునిపైగూడ గలదు

యీ జాతి వారందరును 
కల్ప వృక్షములను దెగనరికి వంటకట్టెలు 
దయారు చెయుదమను రకము.

అప్పకవి వంటి వారికే గాదు కవుల మనుకొన్నవరిలోను చాలమందికి
పోతనామాత్యుల పై యనుగ్రహము మట్టమే

అందుకే 
ప్రాచీన కవి ప్రశంసల చిట్టాలలో నెక్కడో దప్ప
పోతన పేరు గనుపింపదు
యీ నడుమ
 పోతన్నను గురించి సాగిన విమర్శలు 
ఆయన యూరేది తండ్రి తాత లెవ్వరు
మొదలగు విషయములపైననే 
కొందరు విద్యాధికులాతని 
కవిగా తూచిన వ్రాతలును గలవు

కాని వీరిలో జాలమంది యాంగ్ల విద్యాభక్తులు
వారి సులోచనములు ధరించియే 
ప్రతి విషయమును జూతురు

ప్రాచీనులది అదొక గొడవ
కలమందికొన్నంతనే వారి కంటబడునది
మమ్మటుడు రుయ్యటుడు
తప్పులు బట్టుటలో నున్నంత చొరవ యొప్పులను గ్రహించుటలో లేదు

ఇంతకును 
నీ యిరుదెగల విమర్శనములతోను 
మనకు జరిగిన న్యాయము సున్న

గజేంద్ర మోక్ష కథలో నడవిని వర్ణించుచు 
పోతన్న యొక దీర్ఘ వచనమును వ్రాసినాడు 
దీనినొక ప్రసిధ్ధ విమర్శకుడు వెక్కిరించెను

అమర కోశమును దగ్గరుంచుకుని పోతన్న 
వనోషధి వర్గలోని చెట్ల పేర్లన్నియునిందు జేర్చినాడట
నిఘంటువును దగ్గర బెట్టుకుని 
పదములకు వెదుకవలసిన దురవస్థ 
ప్రాచీనకవులకు లేదు

వారు బాల్యముననే వానినెల్ల వల్లించెడు వారు
పూర్వకవులలో 
గొందరు సంస్కార హీనులైన నుండవచ్చును గాని యవ్యుత్పన్నులు లేరు

అట్టి ప్రబుధ్ధులున్నది మనలోనే..
ఆంగ్ల భాషాభ్యాసము మనకు గొంత 
స్వతంత్ర భావముల నొసగినది
అట్టివారును దక్కువయే

మనపూర్వులు ప్రాచీన సంప్రదాయములకు బానిసలని మనము వారిని నిందింతుము
కాని మనకథ యేమైనది ?
మనమంగ్ల సంప్రదాయములకు దాసులము

ప్రాచీనుల దాస్యములో 
మా యనుకొని సంతోషపడు నాత్మతృప్తియైన నున్నది
మనకదియులేదు..

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి