21 జులై, 2014

ముంగిటి ముత్యము వీడు..

                       సరస్వతీపుత్రుడు.. 

             శ్రీ అవధానం చంద్రశేఖర శర్మ

సరస్వతీపుత్రుడు దైవ నిర్దిష్టమై 
మహర్షి శివానందుల దివ్యవాణితో అభినందనాశీరూపమున అభివ్యక్తమైన 
అపూర్వ సం కేతము. 

ఇతరులు వంచి యెగబడు 
సింహ  ..శార్దూలాదులను.. 
 సమ్రాట్ ..సార్వ భౌమ.. చక్రవర్తి ..
ప్రఖ్యాతులను బిరుదములను 
కడకంటనైన చూడక నారాయణాచార్యులవారు  
వానిని మనసార సవినయముగా నౌదల నలంకరించుకొన్నారు..
 
ప్రాచీన వాజ్మ యముతో ఒక శారదా తనయుడున్నాడు.
అది అతనికి పుట్టుపేరో ..పెట్టుపేరోమనకు తెలియదు
 
అంతకుదప్ప 
సరస్వతీపుత్ర సంకేతులు 
సాహిత్య ప్రపంచమున పూర్వ మెవ్వరునులేరు..
 
ఆచార్యులతరువాత
దానిని ఎవరేని తాల్చినను
 బరువో ..
అది అనుకరణమో.. 
అనుసరణమో ..
ఎదలో బరువో అనిపించుకొనక మానదు
 
వాగ్దేవి సహజ వాత్సల్యమున 
ప్రస్నుత ప్రయోధరయై ఆ పుత్రునికి
 సంగీత సాహిత్య రసమును చేసినది..
 
ఆయన ఆజీవితము దానిని కడుపార గ్రోలి 
తుష్టిని పుష్టిని పడసి ధన్యుడైనాడు
నిజముగా ఆయన సరస్వతీపుత్రుడు
 
ఆ సంకేతములో ప్రేమయున్నది..
మాధుర్యమున్నది
విన యమున్నది
నిగూఢమగు నహంకారమును ఉన్నది
కావుననే ఆయన
దోషమా.. లేక వినెడు వారి తప్పిదమా..?
అని ప్రశ్నించి..
కాదు.. భావభేదములె సుమ్ము..
అని గడుసుగా సమాధానించి యేనామ కేచిత్ అన్న భవభూతిని ప్రతిధ్వనించినాడు..

తన పదునాల్గవ యేట 
తాను కళాశాల విద్యార్థిగా నున్నపుడే
ఉలిచేరాలకు చక్కిలింతలద్ది
పెనుగొండలక్ష్మిని చేపట్టిన
 రసమయ హృదయుడు ఆయన.
 
ఆయన కవితా విపంచి తొలి మీటలోనే పంచమస్వరమును ప్రవచించినది..
నాటినుండి..
అరవదియేడులకు మింపుగా యెన్ని స్వరజతులు..లయవిన్యాసములు..
తాళములు కృతులు..
 
ఆంధ్రమునెల్ల దాటియు నినదించినచో 
దాదపు నూట యెనిమిదికి పైబడిన 
ఆచార్యులవారి కృతులలో 
పద్యములున్నవి
గద్యములున్నవి
విమర్శలున్నవి
మినీ కవితలున్నవి
గేయములున్నవి
షట్పదులున్నవి
వివిధ భాషా సంప్రదాయములున్నవి
లాస్యమున్నది
తాండవమున్నది..

ఆయన సారస్వత జీవితమున నెంతటి వైవిధ్యమున్నదో వైయక్తిక జీవితమున గూడ అంతటి వైవిధ్యమున్నది
వైవిధ్యము మాత్రమే కాదు
గుణముల పరస్పర వైరుధ్యము కూడ పెనగొనియున్నది
 
ఆ వైరుధ్యము గూడ 
రాజు నెదుట భృత్యుల వలె నిగూఢమై
ఆయనకు లొంగియుండుట వింత

ఆయన హృదయము మృదులము
కాని యెడనెడ తీక్ష్ణమే..
వాక్కు అనుకూలమైనంత వరకు మధురమే..
ఎదురు తిరిగెనా దారుణాఖండల శస్త్రతుల్యము. ఒక రచనకు పూనుకొనెనా..
ప్రపంచమే చేత నింపదు
ఆకాశము సైతము తన శబ్ద గుణమును పరిత్యజించును..
ఆకలి దప్పులు దరికి రావు..
ఆ దీక్ష నుండి విరమించెనా..
ఆ రచనా శేషమును సంధించుటకు రోజులు వారములు కావు
ఒకప్పుడు ఏండ్లును పూండ్లును పట్టును.
సంగీత సాధనములోను అంతే..
గ్రంధపఠనములో మునిగినచో నిద్రాహార స్ఫురణ ఉండదు. దానిని ఆవలవైచినచో మరల తాకుట యెన్నడో ఆయన జీవితములో
భోగము.. యోగము.. రాత్రింబవళ్ళు .
లాలసత ఎంత నభః స్పృశమో సమాధి అంత నిస్తరంగము..
పెద్దన గారి వరూధినిపై ఆయనకు వల్లమాలిన జాలి
దాక్షా రామ గంధర్వాప్సరసల వక్షోజ ద్వయముపై
అత్తమిల్లిన కవి సార్వభౌముని సౌభాగ్యరేఖపై నొకింత
అభిమానము.. 

అయిననేమి..
ఆయన నిరంతర.. నిరంతరాయాష్టాక్షరీ 
మంత్రమనన
స్నాత గంగాజలుడు..
భక్తి రసైక జీవనుడు
సమకాలిక కవులలో  ఆయన నవ్యులలో నవ్యుడు
ప్రాచీన పధాను యాయుతులలో నగ్రగామి..
వక్తలలో వక్త
భావుకులలో భావుకుడు
విమర్శకులలో విమర్శకుడు
వివిధ భాషలలోని ప్రాచీన మహాకవుల
గద్య పద్యములు వేలకొలది ఆయనకు మననారూఢములైఅన్ కంఠస్థములు

ఆధునికుల మేలి రచనములును ఎన్నియో నిత్య సన్నిహితములే..
ఆయన విజ్ఞానము సముద్రమంత గంభీరము
ఆయనను జిజ్ఞాస బడబానల కీల వలె క్రొత్త క్రొత్తలక్ నిత్యమును నాలుకలు సాచెడిది..

ఈర్ష్య లేదు..
స్పర్ధ కలదేమో
పొందిన అసంఖ్యా ఖండ సన్మానములకు సంతృప్తి ఒకవంక..
మరియొక వంక లోకము 
ఇంకను తన్ను గు ర్తింపవలసినంతగా గుర్తింపలేదే..
అను ననుక్షణాసంతృప్తి జ్వాల..
 
'శ్రీనాధుడు-మనస్తత్వము' అన వ్యాసములో 
ఆచార్యు ల వారు పలికిన యీ పలుకులు 
ఇంచుమించు వారి మనస్తత్వమునకు అన్వయించును..

''రసికతకును ధార్మిక దృష్టికిని చాల దూరమని
 శ్రీనాధుని తలంపు
అటులని నాస్తికుడు కాడు
శైవాగమములన్నియు మూలమట్టముగ శోధించినాడు
బ్రాహ్మిని మనసార నుపాసించినాడు..
 
శ్రీనాధుడు పరివర్తన శీలుడు
పాదరసమువంటి వాడు
ఒకచోట నిలువడు
ఒక సిధ్ధాంతమునే అంటియుండడు
 
ఐదు నిముషములు గడచులోపలనే 
పురుగు తొలుచును
భగవత్సేవయా..?
అదియొకవైపు..
భోగములా ..ఇవి యొక వైపు..
ఈ రెంటికిని సంబంధమే లేదు..
హృదయ పాతివ్రత్యమా..?
దాని లోతును గమనించినదెవ్వరు..?
 
మానవునికిది యొక్కటేనా చాపల్యము..?
దీనిని విడిచినంతనే వైకుంఠ మరచేత నిలుచునా..?
ఇతరములు వదలవలసినవెన్నిలేవు..?
వదలుచున్నామా..?
అసలీ విచారమంతయునెందుకు..?
హాయిగ బ్రదికి కన్నుమూసికొని పోక..
 
అతని జీవితమొక తుఫాను వంటిది..
అందులో మంచి చెడ్డలన్నియు కొట్టుకొని వచ్చినవి
మనకు కావలసిన దానిని వింగడించుకొనవలయునమే..
ఇందలి వాక్యము మనకును అన్వయించును
 
మనకు కావలసినది ఆచార్యులవారి సాహితీమూర్తి
అది అత్యుజ్జ్వలము..
అజరామరము..
దానికి జోహారులు పలుకుదము..

 

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి