6 జులై, 2014

అరిగా బంచమమేవగించి..


అళియ రామరాయల ఆస్థానంలో భూషణమై అలరారి
రామరాజ భూషణుడుగా ప్రశంసలందుకున్న భట్టుమూర్తి
రచించిన కావ్యాలలో 

వసుచరిత్ర..ప్రసిధ్ధి పొందింది..
 సంగీత రహస్యాల సారంగా
 వసుచరిత్రను
రామరాజ భూషణుడురచించాడు.
 

పింగళి లక్ష్మి కాంతం గారు.
ఈ కవి సంగీత కళానిధి గాయకుడు.. 

ఈతని రచనలన్నియు లఘు గమకములు గలవి 
కీర్తనల వలె పాడదగినవి..
ఇతనికే  శ్లేష.. సహజము..
అన్నారు..
 

దీనినే పుట్టపర్తి వారు..
తెనుగున భట్టుమూర్తి ఆడినది ఆట.. పాడినది పాట..
అతని నోట నే  మాటవెడలినను .. 

అందొక శ్లేష ఒక వైచిత్రి నవ్వు చుండును..
 

అంటూ అరిగా పంచమమేవగించి..
పద్యం లోని అందాల్ని చూపుతున్నారు. 

ఇది  పుట్టపర్తి వారి 'వసుచరిత్ర వైచిత్రి' వ్యాసం లోని ది 

అరిగా బంచమమేవగించి నవలా లవ్వేళ హిందోళ వై
ఖరి సూపం బికజాత మాత్మ రవభంగ వ్యాకులంబై వనీ
ధర నాలంబిత పల్లవ వ్రత విధుల్ దాల్పం దధీయ ధ్వనిన్
సరిగా గైకొనియెన్ వసంతము మహా సంపూర్ణ భావోన్నతిన్

 

శిశిర వసంతముల సంధికాలము వచ్చినది
అప్పుడు యువతులు హిందోళ రాగమునాలపించిరి
ఆ రాగమునకు పంచమ స్వరము వర్జ్యము
పికములకు పంచమ స్వరమే ప్రాణము
అది లేని హిందోళ వాని చెవులకు వోటైనది
 

ఎటులైనను ఆ జవ్వనుల సంగీతములో 
తాము స్థానము సంపాదించుకొనవలెననుకొన్నవి
అడవులలో జిగుళ్ళు మేయుచు వ్రతము పట్టినవి
వాని తపస్సు పండినట్లు వసంతము వచ్చెను
ఇంకనేమున్నది..?
 

కలకంఠ నాద ములతో కకుబంతములు మారుమ్రోగినవి
కలకంఠులు వల్లకులు మేళవించి 

వసంతరాగము నాలపించిరి
ఆ రాగము పిక ధ్వనిని కూడ దనలో గలిపికొని 

తన యుదారతను బ్రకటించెనట..
 

వసనము షాడవ రాగము
కాని రామ రాజ భూషణుని మతమున నది 

సంపూర్ణ రాగమేమో
సంగీత  కళా రహస్య నిధి సిధ్ధాంతము నందుకొనియే తర్వాత విద్వాంసులు 

చ్యుత పంచమము దానిలో నుపయోగించిరి
 

ఇక్కడ కవి సూచించిన సంగీత సంప్రదాయమట్లుండగా..
అరిగా సరిగా నన్న పదములలో మరికొంత చమత్కారమున్నది
ఆ స్త్రీలు అ రిగా పంచమమునేవగించిరట..
అనగా శత్రువుగా నన్న యర్థము స్పష్టమే
ఋషభ స్వర వర్జ్యముగా ననియు నర్థాంతరము
హిందోళము నందు పంచమము తో బాటూ
ఋషభమును వర్జ్యమే..
 

వసంతము పంచమమును సరిగా స్వీకరించెను
అనగా నారోహణమున 

షడ్జ ఋషభ గాంధార యుక్తముగా ననుట
ఇది రామ రాజ భూషణుడు జూపిన చమత్కారము