నేను చదువుకునే రోజుల్లో
రేడియోలో లలిత గేయాలు వచ్చేవి
అందులో ప్రతి నాలుగు రోజులకూ
ఎవరో ఒకరు.
ఓహో కిన్నెరసానీ.. అనేవాళ్ళు..
కిన్నెరసాని గోదావరి యొక్క ఉపనది..
వరంగల్ లోని మేడారం తాన్వాయి..
కొండ సానువుల్లో పుట్టి..
ఆగ్నేయంగా ప్రవహించి
ఖమ్మం జిల్లాలో భద్రాచలానికి కాస్త దిగువన
బూర్గంపాడు..వేలేరు గ్రామాల మధ్యన
గోదావరిలో కలుస్తుంది..
విశ్వనాధ కిన్నెరసాని పాటలు వ్రాశారు
విశ్వనాధ తండ్రి శోభనాద్రి గారు కష్టదశలో కిన్నెరసాని
వాగుకు ఆవల వున్న గ్రామంలో కౌలుకు భూమిని
తీసుకుని వ్యవసాయం చేశారు..
అప్పుడు విశ్వనాధ చిన్నవాడు..
తండ్రివెంట వెళ్ళేవాడు
వస్తూ వెళుతూ .. వాగును దాటేటప్పుడూ
భద్రాచలం అడవులలో పారే వాగును చూచినప్పుడూ
ఆ పసివాని హృదయం
ఆ నదితో గలగలా మాట్లాడింది..
ఆ నది లో అతనికి ఒక ప్రేమిక సాక్షాత్కరించింది..
అది ఆ పసివాని చిన్ననాటి మనసు ముద్ర..
పెద్దయిన విశ్వనాధ
అత్యంత ప్రాణప్రదంగా ప్రేమించిన భార్య
ముఫ్ఫయారేళ్ళ వయసులో మరణించింది
విశ్వనాధ ఆమె వియొగం తట్టుకోలేక పోయారు..
గుండెల్లో అంతులేని దుఃఖం వరదలైపొంగింది..
అప్పుడే మళ్ళీ చిన్ననాటి కిన్నెరసాని
మళ్ళీ మదిలో సుడులు తిరిగింది..
అందులో కొండగా మారిన భర్త తాను
మరలి రాని లోకాలకు వెళ్ళిపోయిన భార్య
కరిగి కరిగి భర్తపై కోపంతో నీరైపోయిన కిన్నెరసాని..
విరహమో దాహమో విడలేని మోహమో అన్న
జేసుదాసు గొంతుకలా
విశ్వనాధ ప్రేమ కొండయై అదృశ్యమైన భార్య ఉనికిని..
సుడులతో అలలతో నురగలతో ప్రవాహపు మెలికలతో
తనను చుట్టి ప్రవహిస్తూన్న కిన్నెరసాని
లో కనుగొంటూ ఆవేదన చెందుతుంది .
అన్యోన్య దంపతుల మధ్య ఎడబాటును
అద్భుతంగా చిత్రించినవా కిన్నెరసాని పాటలు..
25 కావ్యాలూ
6 శతకాలూ
13 గేయ కావ్యాలూ
15 నాటకాలూ
58 నవలలూ
ఇలా ఎన్నో వ్రాసిన విశ్వనాధ
వేయి పడగలూ..
రామాయణ కల్ప వృక్షమూ వ్రాసి
ఒకే ఒక్కడుగా నిలచిన విశ్వనాధ ..
కిన్నెరసాని పాటలకు ఎన్నో ప్రశంసలు పొందారు..
విశ్వనాధకు అప్పుడు నలభై ఎనిమిది
పుట్టపర్తికి ఇరవై ఎనిమిది..
విఖ్యాత పండితునిగా ఉన్న విశ్వనాధపై
అప్పుడప్పుడే కిరణాలు తొడుగుతున్న పుట్టపర్తి వ్యాసం
వ్రాసారు..
అది విశ్వనాధను అబ్బురపరచింది..
అప్పటికే పుట్టపర్తి కీర్తిని వినివున్న విశ్వనాధ
స్వయంగా వచ్చి అభినందించారు..
రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ మేనల్లునిగానూ వ్యాప్తిలో
నున్న పుట్టపర్తి
విశ్వనాధ రచనలనూ..వ్యక్తిత్వాన్ని
ఎలా వర్ణించారో మనకు తెలుసు
మరి కిన్నెర సాని గురించి వారేమన్నారో చూద్దాం..
భద్రాద్రి కొండ..
దాన్ని చుడుతున్న ప్రవాహమూ..
ఆమె తెనుగు సాని
అతను తెనుగు మగడు.
వారి తెనుగు కాపురమును చూచినాడట విశ్వనాధ..
గుట్ట కఠినము.. మగని హృదయంలా
ప్రవాహం లలితం స్త్రీ మనసులా..
ఇరువురిదీ ఒకటే దుఃఖం..
అతని హృదయం గంభీరం పగిలింది..
ఈమె హృదయం నీళ్ళలా ద్రవించింది..
ఇంకో విషయం..
మధుర భావుకులైన సూరదాసు చైతన్యుడూ
అందీ అందని ఆ అనుభూతికై వేకారి యేడ్చారట..
నాకు ఇందులో ప్రతి పదమూ అపురూపంగా అనిపిస్తూంది..
కిన్నెరసాని పాటలలో రసావేశము
గట్టులొరసి పారిందట..
కిన్నెరసాని దుఃఖానికి వనాలేకాక తెలుగు వారి బ్రదుకులన్నీ పాటలైపోతాయట..
ఇలా చెబుతూ పోతే ప్రతి వాక్యాన్నీ మళ్ళీ చెప్పవలసివస్తుంది..
మీరు చదివి పరవశించండి..
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి