26 జూన్, 2015

యుధ్ధాలతో ఒరిగేదేమీ లేదు..

నేను పోస్ట్ చేసే విధిలో 
గూగుల్ నూ వెదికి కొంత సమాచారం తీసుకుంటాను
సామవేదం.. చాగంటి వంటి మహాత్ముల ప్రవచనాలు విని కొంత సంస్కారాన్ని పెంచుకుంటున్నాను..
 

పోతన్న రాయలసీమలో పుట్టినారని వ్రాసాను..
అది గూగుల్ నుంచీ తీసుకున్నదే..
 

శ్యామలీయం గారు
 ''కొంపముంచారు.. 
పోతన్న రాయలసీమలో పుట్టారంటే
తెలంగాణావాళ్ళతో విభేదం వస్తుందేమో నని .''

చ మత్కరించారు..

''యేమీ రాదులెండి.. 
 తెలంగాణా వాళ్ళు మాకు విరోధులేమీ కారు .. బంధువులే.. 
ఆ మాటకొస్తే ఆత్మ బంధువులు.. 
పోతన్న భాగవతమే భగవత్స్వరూపం .. 
'' భగవంతుడు .. భక్తుడు .. భాగవ తమూ ఒక్కటే వేరు కాదు ''
అన్న పుట్టపర్తి చివరి వాక్యాలు అర్థం కావడానికి 
ఎంతో ఔన్నత్యం కావాలి.. 

మాకు తెలంగాణా వారితో ప్రేమానుబంధాలే వున్నాయి మీ సంగతి చూసుకోండి అన్నగారూ..  
అంటూ ..

కవికి కులమతాలు లేవని జాషువా వంటి వారం టుంటే.. 
ప్రాంతీయతలు కూడానా.. 
అన్నారు కోస్తా ఆంధ్ర ప్రాంతాలకు చెంది
 పుట్టపర్తి పై రిసెర్చ్ చేసిన పద్మావతిగారు..''

మన విభేదాలు పోతన గారికి ఆపాదించడం ఎందుకులెండి వాళ్ళమానాన వాళ్ళని బ్రతకనిద్దాం.. 
నేను మా తండ్రి గారి విశేషాలు 
వారి అభిమానులకు అందించాలనే ఉద్దేశం తో 
బ్లాగు నడిపిస్తున్నానే తప్ప 
నేను పెద్ద జ్ఞాన వంతురాలిని కాదు.. 
కనీసం అలా చెప్పడం నటించటం కూడా రాదు 
నన్నిలా ఒదిలేయండి.. 

మనం 
పోతన్న తెలంగాణా వాడివన్నా పొంగిపోడు.. 
రాయలసీమ వాడివన్నా కుంగిపోడు.. 
అందుకే 
ఆయన భాగవతా న్ని పట్టుకుని ఎంతో మంది తరించిపోతున్నారు..
పుట్టపర్తి అనూరాధ. ''
అంటూ జవాబిచ్చాను .. 

తరువాత మనసంతా వికలమైంది. 
మొన్న పద్మావతి గారి సంభాషణ గుర్తుకొచ్చింది .. 
అది ఇదే .. 
ఆవిడ మాటల్లో నే ..

 '' ద్వానా శాస్త్రిగారు ఈ విషయాన్ని బాగా మేన్షన్ చేసారు   కవులందరినీ సంపుటిగా వేశారట ద్వానాశాస్త్రిగారు .. 
తన పుస్తకాన్ని ఆవిష్కరించడానికి పుట్టపర్తిని ఆహ్వానించారు ద్వానా శాస్త్రి గారు .. 
 సభలో పుస్తకం పరిశీలించారు పుట్టపర్తి 

ఆ పుస్తకం చూపించి సభాముఖంగానే..
 ఇందులో రాయలసీమ కవుల ప్రసక్తి ఎక్కడన్నా వుందా..
ఒక్కరిపేరైనా ప్రస్తావించారా .. 

మా రాయలసీమ కవుల పేర్లేమైనా వున్నాయా..
అని కోపంగా అడిగారు 
ద్వానా శాస్త్రి గారికీ కోపం వచ్చిం ది.. 

ఇద్దరినీ అనుసంధానం చేసారు జానుమద్ది .. 
ద్వానా శాస్త్రి గారింటికి వెళ్ళారు .. 
ద్వానా శాస్త్రిగారు .. బాగానే ఆదరించారు 

''నేను ఇట్లా   అన్నానంటే.. 

మీ కందరికీ కోపం రావచ్చు
కానీ నేను చెప్పకపోతే ఎలా తెలుస్తుంది..

నా కవకాశం వచ్చింది కాబట్టి చెప్పాను..

ఇది తప్పు .. .  పధ్ధతి కాదు 
 అని అన్నారట..

అప్పుడు ద్వానా 
శాస్త్రి గారి మనసులొ ఒక బీజం పడింది.. 
ప్రాంతీయతత్త్వం ఉండకూడదు..అని..
రాయలసీమ .. తెలంగాణ ఇలా అందరు కవులనూ కలుపుకోవటం ప్రారంభించారు..
అందరినీ సమాన దృష్టి తో చూడటం..
ఆదరించటం చేశారట..
 

సాహిత్య చరిత్రలో కూడా 
ఆంధ్ర రాయలసీమ తెలంగాణా ప్రాంతాల కవులను గురించి రాశారట..
సమానదృష్టితో చూడటం అలవర్చు కున్నారు..
 

పొట్టిశ్రీరాముల యూనివర్శిటీనుంచీ అవార్డ్ వచ్చిన సందర్భంలో
 

 ద్వానా శాస్త్రి గారికి 
కవులందరి పట్ల సమాన దృష్టి ఉంది.. 
ప్రాంతీయత అనే దురలవాటు ఈనకు లేదు 
అందుకే ఈ అవార్డ్ వచ్చింది అని శివారెడ్డి గారు వేదికపైనుంచీ చెప్పారట..
 

అప్పుడు జవాబుగా 
నాకు ఇటువంటి దృష్టి పడటానికి బేస్ యేది .. 
పునాది యేది అంటే..
పుట్టపర్తి నారాయణాచార్యులు గారు .. 

అని నాలో ఈ బీజం పడటానికి 
ఇదిగో ఈ సన్నివేశం అని చెప్పారట..
 

తరువాత 
ఉస్మానియా యూనివర్సిటీ లో 
పుట్టపర్తి ఉపన్యాసాల ద్వారా నేను స్పూర్తిని పొందాను..
ఇటువంటి దృష్టి నాకు 

నారాయణాచార్యుల వారి వల్లే పడింది..
అని చెప్పారట..
 

పద్మావతి గారు 
పుట్టపర్తి శ్రీనివాస ప్రబంధం పై రిసెర్చ్ చేస్తున్నారు..
ఆక్రమంలో రాళ్ళబండిగారినీ  ద్వానా శాస్త్రి గారినీ.. 

ఇలా ఎందరితో నో  ఇంటర్వ్యూ నిర్వహించి 
దాన్ని రికార్డ్ కూడా చేశారు..
ఆవిడ సబ్మిషన్ అదీ అయ్యాక 

అన్నీ మీకు అందజేస్తానని చెప్పారు..
ఈ సంఘటనను పెడదామని ఆలోచనలో వుండగానే..
శ్యామలీయం గారి ద్వారా దీన్ని చెప్పాల్సి వచ్చింది..
 

నేను పుట్టపర్తి కూతురిగా 
వీనిని వెలుగులోకి తెస్తున్నానే కానీ..
నాకు యేమీ జ్ఞానం లేదు..
నేనొక మూఢురాలిని అని గుర్తించి..
నా అజ్ఞానాన్ని మా తండ్రి గారిని చూసి క్షమించమని ప్రార్థన..


యే ప్రాంతం వారైనా..
పుట్టపర్తి ప్రబంధ నాయికలు ఉపన్యాసాలు యూనివర్శిటీలో ప్రత్యక్షంగా విన్న అదృష్టవంతులలో నేనూ ఒకడిని అన్న ద్వానా శాస్త్రి గారికి వినయంగా ప్రణమిల్లుతూ..
పుట్టపర్తి అనూరాధ.


24 జూన్, 2015

మా సీమ




ఈ గాలి ..
ఈ నేల ..
ఈ ఊరు .. సెలయేరు..
అని ఒకసినిమా పాట ..
ఎవరికైనా తాను పుట్టిన ఊరు..
ఆ గాలి..
ఆ నేల..
ఆ చరిత్ర మైమరపిస్తూనే వుంటుంది..
 

ఆ ప్రాంతపు నుడికారాలు.. ఊతపదాలు..
పదాల వాడుక..
ప్రతి ప్రాంతానికి భిన్నంగా వుంటాయి..

జాంకులు ఈడికి వస్తావుండె..
శానా నాళ్ళయిపాయ ఈ దిక్కుకే రాల్యా..
అంతలక్కల ఎదికినా..
యాడా దొరకల్యా...


 ఇది రాయలసీమ భాష.
జాంకులు అంటే మాటి మాటికీ
అంత లక్కల అంటే అన్ని చోట్లా అన ర్థం..
 

పుట్టినప్పటినుంచీ ఎరిగిన భాష కాబట్టి   
మాకు అర్థం అవుతుంది
వేరే ప్రాంతాల వారికి రాయలసీమలో అడుగు పెడితే 

కొంత గందర గోళం గానే ఉండచ్చు..
 

మాకూ ఆంధ్రా ప్రాంతాలకు వెళితే 
వారి భాష కొత్తగా వుంటుంది..
మా ఊరికి నా చిన్న తనంలో ఒక ఆంధ్ర ఆమె కూరగాయలండీ .. కూరగాయలూ..
అంటూ అమ్మేది..
అమ్మాయిగారండీ .. అబ్బాయిగారండీ..
అంటూ మాట్లాడేది..
అది మాకు వింత..
 

భాషదేముంది.. భావం అర్థమవా లి.. 
మనిషికీ మనిషికీ గుండెల్లో ప్రేమ పెరగాలి.
అంతే కానీ.. 
నీ భాష బాలేదు ..
మా భాష చాలా నాజూకైనది..
వంటి మాటలతో ఒకరినొకరు గాయపరచుకోవటం 

ఎవరికీ మంచిది కాదు.. అందువల్ల లాభమూలే దు.. 


అన్ని ప్రాం తా లకున్నట్టే 
రాయలసీమకు ఘన చరిత్ర వుంది...
ఒకప్పుడు కళల రాజ్జంగా ప్రజ్వరిల్లింది..


రాయలసీమ విజయనగర సామ్రాజ్యం లో భాగం

 శ్రీ కృష్ణదేవ రాయలచే పరిపాలించబడినది. 
అది వరకూ తూర్పు చాళుక్యుల పరిపాలనా కేంద్రంగా 
హిరణ్యక రాష్ట్రంగా ఈ ప్రాంతం విలసిల్లినది. 

తర్వాత 
రాయలసీమ పై చోళుల ప్రభావం పెరిగిం ది 
తెలంగాణ, కోస్తా ప్రాంతాలతో పోలిస్తే 
రాయలసీమ వైశాల్యంలో చిన్నదైనా .. 
తెలుగు,తమిళం, కన్నడ మరియు ఉర్దూ కళల్లో, సంస్కృతుల్లో, సాహిత్యంలో 
ఈ ప్రాంతం యొక్క ప్రభావం బహు అధికం.

విజయనగర సామ్రాజ్యపు చక్రవర్తి అయిన
 శ్రీ కృష్ణదేవ రాయలు హయాంలో 
ఈ ప్రాంతపు సంస్కృతి చాలా ఉన్నతి చెం దిం ది . 

అష్టదిగ్గజాలలో ఐదు మంది 
(అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, కందుకూరి రుద్రకవి (మాదయ్యగారి మల్లన), అయ్యలరాజు రామభధ్రుడు) ఈ ప్రాంతం వారే.
 
కడప జిల్లా కి చెందిన 
యోగి వేమన, బ్రహ్మం గారు తమ రచనల ద్వారా సామాన్య ప్రజానీకాన్ని విద్యావంతులని చేయటానికి ఎంతో కృషి చేశారు. 

శ్రీమద్భాగవతము రచించిన పోతనామాత్యుడు కూడా ఒంటిమిట్ట లోనే జన్మించాడన్న అభిప్రాయం

బళ్ళారి రాఘవ, 
ధర్మవరం రామకృష్ణమాచార్యులు, 
కోలాచలం శ్రీనివాసరావు 
వంటి రంగస్థల ప్రముఖులను అందించిన 
బళ్ళారి ప్రదేశానికి గొప్ప చరిత్ర 
బళ్ళారి లోని రాఘవ కళా మందిర్ 
బళ్ళారి రాఘవ పేరు పై స్థాపించినదే.

తత్త్వవేత్తలు, ఆధ్యాత్మిక గురువులు అయిన 
జిడ్డు కృష్ణమూర్తి, కట్టమంచి రామలింగారెడ్డి 
చిత్తూరుకి చెందినవారు.
చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన పలు ఉర్దూ రచయితలు ఉర్దూ సాహ్యిత్యానికి సేవ చేశారు.

బ్రాహ్మణ కులంలో కేవలం రాయలసీమ ప్రాంతానికి మాత్రం పరిమితమైనది ములకనాడు బ్రాహ్మణ ఉపకులం. 

ఈ కులానికి చెందిన త్యాగరాజు కాకర్ల (అర్ధవీడు)కి చెందినవాడు.

ప్రస్తుతం ఇది ప్రకాశం జిల్లా ఉన్నా.. 
 ఒకానొక గానంలో ఈయన పూర్వీకులు రాయలసీమకి చెందినవారని తానే స్వయంగా చెప్పుకొన్నారు.
 
వాగ్గేయకారుడైన అన్నమయ్య 
కడప జిల్లాకి చెందిన తాళ్ళపాకకి చెందినవాడు.
తరిగొండ నరసింహ స్వామి పై 
 వెంకటేశ్వర స్వామి పై అనేక గీతాలని రచించిన వెంగమాంబ తిరుపతి వద్దనున్న తరిగొండకి చెందినది.
 
ప్రముఖ సంగీతకారుడు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ అనంతపురానికి చెందినవాడు.
మన పుట్టపర్తి సంగతి తెలిసిందే .. 

ప్రముఖ సంగీతకారుడు (మరియు వైద్యుడు) అయిన శ్రీపాద పినాకపాణి జన్మత: శ్రీకాకుళం జిల్లాకి చెందినవారైననూ, కర్నూలులో స్థిర పడ్డారు.


రాయలసీమలోనివే అయినా కర్నూలు భాషపై..మహబూబ్ నగర్ ప్రభావమూ..
చిత్తూరుపై తమిళ భాష వాసన..
అలానే అనంతపురం ప్రజల భాషలో కన్నడ కస్తూరి గుబాళింపూ
కనిపిస్తాయి..


మా అయ్య
 ''ఊనప్పా అంటే..''
 అని ఎవరో అనేవారని
మాటి మాటికి అని నవ్వే వారు
ఊనప్పా అంటే.. నిజమే సుమా అని..


 ఇక విషయానికి వస్తే..
పోలా ప్రగడ సత్య నారాయణ గారు వ్రాసిన ఆ రోజుల్లో పుస్తకంలో..
వారు రాయలసీమలో పనిచేసిన రోజులను అతి సుందరంగా వర్ణించారు..


ఈనాడు సినిమాలలో చూస్తుంటే..
రాయలసీమ అంటే
అందరూ కత్తులు పట్టుకు నరుక్కుంటారనీ..
పగ ప్రతీకారాలతో రగిలిపోతుంటారనీ..
బాంబులు విధిగా తయారు చేస్తారనీ
అభిప్రాయాన్ని ఫిక్స్ చేసారు..
 

కానీ రాయల సీమ ప్రజలు అమాయకులు..
కల్లా కపటం తెలియని వారు
నటించటం..రాదు..
ఆత్మ వంచన చేసుకోవటం..తెలియదు
లోపలేముందో అదే మాట్లాడతారు..
మనసుకు నచ్చితే శక్తి వంచన లేకుండా చేస్తారు..
మరి ''ఆ రోజుల్లో'' కి వెళదామా..
  .




















16 జూన్, 2015

అక్కయ్యా మనకు దిక్కెవ్వరే ..??

పుట్టపర్తి సాహితీ సుధకు 
వెన్ను దన్నుగా నిలిచిన శ్రీశైలం గారి గొంతు ఇక వినిపించదు..తానే ఫోన్ చేసి డీటైల్స్ జిరాక్స్ కాపీ తో సహా అందించే ఆ మంచి హృదయాన్ని ఆ దేవుడు ఎందుకు తీసుకు పోయాడు.. 
దేవుడు మంచి మంచి పూలు యేరుకుంటాడట.. 
అంటే పూల వంటి మనుషులను .
మంచి మనుషులను,, 
మరి మంచి మనుషులు ఇలా హఠాత్తుగా మాయమైపోతే.. 
లోకంలో చెడే మిగిలిపోతుంది..
దేవుడా ఏమిటీ  అకృత్యాలు ..

మా అయ్య శిష్యులు 

రామావఝ్ఝుల శ్రీశైలం గారు పరమ పదించారు.. 
మనసు దుఃఖంతో మూల్గుతోంది.. 
మాకు తండ్రి దిశగా మార్గాన్ని చూపిన మహనీయుడాయన.. 
మాకోసం మా తండ్రి జ్ఞాపకాల నిధిని దాచిన ఉదాత్తుడాయన.. 
నాగక్కయ్యాతన wall పై  విషాదం పలికించింది.. 
దాని బ్లాగ్ లోకి వెళ్ళిన నాకు దుఃఖం ఆగలేదు.. 
వెంటనే .. 
అక్కయ్యా మనకు దిక్కెవ్వరే ..?? అని కామెంట్ పెట్టాను..
ఆ వాక్యం నన్ను గతం లోకి తీసుకెళ్ళింది..
అవి మా అమ్మ మంచం లో ఉన్న రోజులు..
అయ్య కడపలో ..
అమ్మ మరి కొందరు మద్రాసులో
అప్పట్లో మద్రాసు తప్ప 

వైద్య సదుపాయాలకు మరి వేరే దిక్కులేదు..
అక్కయ్యలు అప్పుడప్పుడూ వచ్చిపోతున్నారు..
ఆస్పత్రిలో అమ్మ శిష్యులు అండ్ కొడుకూ అయిన సుబ్రమణ్యం అన్నయ్య నేను..
నాకు పదిహేడు వయసు..
నాకు వంట రాదు..
ఏదో ఒకటి వండేదాన్ని
తిరుమల తిరుపతి వారి రూముల్లో ఉండేవాళ్ళం...
తమిళం రాదు.
సిటీ బస్సులో ప్రయాణం..
దిగే స్టాపు.. ఎక్కేస్టాపు తెలుసు అంతే...
చేతిలో పది వుంటే ఎక్కువ...
అమ్మకు బ్రెయిన్ కాన్సర్..
చేతులు కాళ్ళు .. మాట పడిపోయింది..
ఊరికే చూస్తూ ఉంటుందంతే..
అప్పుడప్పుడూ మాట్లాడుతుంది ఒకమాట అంతే..
మా రెండవ అక్కయ్య నేను ఊరెళ్ళిపోతానని గొడవ చేసి వెళ్ళిపోయింది..
అన్నయ్య బతిమాలాడు 

ఇంకా కొన్ని రోజులుండమని..

అన్నయ్య అంటే సొంత అన్నయ్య కాదు.. 
కొడుకు గా పెరిగిన ఒక కోమటి వాడు .. 
మానస పుత్రుడు .. 

కానీ వినలేదు..
నా సంసారం చూసుకోవాలంది..
అక్కయ్యను స్టేషన్ లో దిగబెట్టడానికి 

అన్నయ్య వెళ్ళాడు..
అప్పుడు నా కర్థమైంది..
నేను అమ్మ ఉన్నామంతే..
అప్పుడు నాకు ఏడుపు వచ్చింది..
అమ్మా మనకెవరు దిక్కు..
అమ్మా మనకెవరు దిక్కు ..
చెప్పమ్మా..
మనకెవరు దిక్కు అంటూ
అమ్మ పెదవులను నా వేళ్ళతో గబ గబా కదిలించాను..
ఆ మాట అమ్మ బ్రెయిన్ కు చేరింది..
అంతే..
అమ్మ పెదవి విప్పింది..
మనకు దేవుడే దిక్కమ్మా..
అవును మనకు దేవుడే దిక్కు...
అంది..

పుట్టపర్తి వంటి గొప్పవానికి భార్య అయి 
రామాయణ పారాయణలు అనేకంగా చేసి.. 
తన జీవౌన్నత్యాన్ని పెంచుకున్న అమ్మ
అంతే ..
తర్వాత మెదడు మూగబోయింది..
మాటలేని స్థితిలోకి వెళ్ళిపోయింది..
పుట్టపర్తి అనూరాధ..

12 జూన్, 2015

మా అమ్మ విశ్వనాధకూ అమ్మేనట..



అప్పుడప్పుడూ విశ్వనాధ సత్యనారాయణగారు మా ఇంటికి వచ్చేవారట..
కల్ప వృక్షం వ్రాసే టైం లో రామాయణ చర్చలూ జరిగేవట..
కానీ మా అయ్య మూడీ..
ఎవరొచ్చినా కొంచెం సేపు మాట్లాడి..
మీ అమ్మ వంట ఇంట్లో వుంది పో అని చెప్తారు..
అలానే విశ్వనాధకూ జరిగేదట..
విశ్వనాధవారితో నూ కొంచెంసేపు మాట్లాడి..
అమ్మ దగ్గరికి పంపేవారట..
మా అమ్మ అందరికీ అమ్మే..
వచ్చినవాళ్ళు పెద్దైనా .. చిన్నైనా..
వాళ్ళను చల్లగా మా అమ్మకు తగిలించి.. 

తన వ్యాసంగం చూసుకుంటారు..
ఆయన వంట ఇంటికి వెళ్ళి పీట వాల్చుకుని
అమ్మతోనూ చర్చలు సాగించేవారట.
తొమ్మిది గజాల చీర మడిచార పోసి కట్టి
ఆ కొంగును భుజం చుట్టూ కప్పుకున్న ఒక సగటు ఇల్లాలు..
విశ్వనాధతో రామాయణ హృదయాన్ని .. 
వాల్మీకి వర్ణనా గరిమనూ...
రామచంద్రుని  ధర్మాచర ణనూ .. మాట్లాడేది..
మా ఇంటికి వచ్చే శిష్యులు, భక్తులు, సాహిత్యకారులు .. అందరికీ..మా అమ్మ 
మీరు వేయి పడగలు చదివారా.. 
చదవండి అని చెప్పేదట..
ఈ నడుమ గూగుల్లో విశ్వనాధ ఫోటోలు..
చూస్తే అంతటి మహాకవి
ఎంత నిరాడంబరంగా ఉన్నారు.. అనిపిస్తుంది..
 

5 జూన్, 2015

తర తరాల నిశీధి దాటే చిరు వేకువ జాడతడే,,

''అదరక బదులే చెప్పేటి తెగువకు తోడతడే..
తర తరాల నిశీధి దాటే
చిరు వేకువ జాడతడే,,''
యేమిటీ ..
ఈమె అన్నీ సినిమా టైటిల్స్ పెడుతూ ఉంది..
 అని అనుకుంటూండవచ్చు..
ఈ తరం..
హీరోలంటే మహేష్ బాబనీ..
బాలయ్య అనీ..ఊగిపోతూంటారు..
నిజమైన హీరోలు ఎందరో ఉన్నారు..
జీవితమంటే..
యెవరో ఒకదాన్ని చూసి ప్రేమించేసి
పార్కులవెంటా పబ్బుల వెంటా చెడ తిరిగి
ఆపై అందరినీ యెదిరించి పెళ్ళి తాడేసేసే యువతకు
జీవితంలో చేయాల్సినవి ఇవి కాదని
ఎందరో ..
యెన్నో చెప్పి మార్గ నిర్దేశనం చేయడానికి ఉన్నారనీ..
నిజమైన హీరోలు వాళ్ళేననీ..
చెప్పడానికే..