24 జూన్, 2015

మా సీమ




ఈ గాలి ..
ఈ నేల ..
ఈ ఊరు .. సెలయేరు..
అని ఒకసినిమా పాట ..
ఎవరికైనా తాను పుట్టిన ఊరు..
ఆ గాలి..
ఆ నేల..
ఆ చరిత్ర మైమరపిస్తూనే వుంటుంది..
 

ఆ ప్రాంతపు నుడికారాలు.. ఊతపదాలు..
పదాల వాడుక..
ప్రతి ప్రాంతానికి భిన్నంగా వుంటాయి..

జాంకులు ఈడికి వస్తావుండె..
శానా నాళ్ళయిపాయ ఈ దిక్కుకే రాల్యా..
అంతలక్కల ఎదికినా..
యాడా దొరకల్యా...


 ఇది రాయలసీమ భాష.
జాంకులు అంటే మాటి మాటికీ
అంత లక్కల అంటే అన్ని చోట్లా అన ర్థం..
 

పుట్టినప్పటినుంచీ ఎరిగిన భాష కాబట్టి   
మాకు అర్థం అవుతుంది
వేరే ప్రాంతాల వారికి రాయలసీమలో అడుగు పెడితే 

కొంత గందర గోళం గానే ఉండచ్చు..
 

మాకూ ఆంధ్రా ప్రాంతాలకు వెళితే 
వారి భాష కొత్తగా వుంటుంది..
మా ఊరికి నా చిన్న తనంలో ఒక ఆంధ్ర ఆమె కూరగాయలండీ .. కూరగాయలూ..
అంటూ అమ్మేది..
అమ్మాయిగారండీ .. అబ్బాయిగారండీ..
అంటూ మాట్లాడేది..
అది మాకు వింత..
 

భాషదేముంది.. భావం అర్థమవా లి.. 
మనిషికీ మనిషికీ గుండెల్లో ప్రేమ పెరగాలి.
అంతే కానీ.. 
నీ భాష బాలేదు ..
మా భాష చాలా నాజూకైనది..
వంటి మాటలతో ఒకరినొకరు గాయపరచుకోవటం 

ఎవరికీ మంచిది కాదు.. అందువల్ల లాభమూలే దు.. 


అన్ని ప్రాం తా లకున్నట్టే 
రాయలసీమకు ఘన చరిత్ర వుంది...
ఒకప్పుడు కళల రాజ్జంగా ప్రజ్వరిల్లింది..


రాయలసీమ విజయనగర సామ్రాజ్యం లో భాగం

 శ్రీ కృష్ణదేవ రాయలచే పరిపాలించబడినది. 
అది వరకూ తూర్పు చాళుక్యుల పరిపాలనా కేంద్రంగా 
హిరణ్యక రాష్ట్రంగా ఈ ప్రాంతం విలసిల్లినది. 

తర్వాత 
రాయలసీమ పై చోళుల ప్రభావం పెరిగిం ది 
తెలంగాణ, కోస్తా ప్రాంతాలతో పోలిస్తే 
రాయలసీమ వైశాల్యంలో చిన్నదైనా .. 
తెలుగు,తమిళం, కన్నడ మరియు ఉర్దూ కళల్లో, సంస్కృతుల్లో, సాహిత్యంలో 
ఈ ప్రాంతం యొక్క ప్రభావం బహు అధికం.

విజయనగర సామ్రాజ్యపు చక్రవర్తి అయిన
 శ్రీ కృష్ణదేవ రాయలు హయాంలో 
ఈ ప్రాంతపు సంస్కృతి చాలా ఉన్నతి చెం దిం ది . 

అష్టదిగ్గజాలలో ఐదు మంది 
(అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, కందుకూరి రుద్రకవి (మాదయ్యగారి మల్లన), అయ్యలరాజు రామభధ్రుడు) ఈ ప్రాంతం వారే.
 
కడప జిల్లా కి చెందిన 
యోగి వేమన, బ్రహ్మం గారు తమ రచనల ద్వారా సామాన్య ప్రజానీకాన్ని విద్యావంతులని చేయటానికి ఎంతో కృషి చేశారు. 

శ్రీమద్భాగవతము రచించిన పోతనామాత్యుడు కూడా ఒంటిమిట్ట లోనే జన్మించాడన్న అభిప్రాయం

బళ్ళారి రాఘవ, 
ధర్మవరం రామకృష్ణమాచార్యులు, 
కోలాచలం శ్రీనివాసరావు 
వంటి రంగస్థల ప్రముఖులను అందించిన 
బళ్ళారి ప్రదేశానికి గొప్ప చరిత్ర 
బళ్ళారి లోని రాఘవ కళా మందిర్ 
బళ్ళారి రాఘవ పేరు పై స్థాపించినదే.

తత్త్వవేత్తలు, ఆధ్యాత్మిక గురువులు అయిన 
జిడ్డు కృష్ణమూర్తి, కట్టమంచి రామలింగారెడ్డి 
చిత్తూరుకి చెందినవారు.
చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన పలు ఉర్దూ రచయితలు ఉర్దూ సాహ్యిత్యానికి సేవ చేశారు.

బ్రాహ్మణ కులంలో కేవలం రాయలసీమ ప్రాంతానికి మాత్రం పరిమితమైనది ములకనాడు బ్రాహ్మణ ఉపకులం. 

ఈ కులానికి చెందిన త్యాగరాజు కాకర్ల (అర్ధవీడు)కి చెందినవాడు.

ప్రస్తుతం ఇది ప్రకాశం జిల్లా ఉన్నా.. 
 ఒకానొక గానంలో ఈయన పూర్వీకులు రాయలసీమకి చెందినవారని తానే స్వయంగా చెప్పుకొన్నారు.
 
వాగ్గేయకారుడైన అన్నమయ్య 
కడప జిల్లాకి చెందిన తాళ్ళపాకకి చెందినవాడు.
తరిగొండ నరసింహ స్వామి పై 
 వెంకటేశ్వర స్వామి పై అనేక గీతాలని రచించిన వెంగమాంబ తిరుపతి వద్దనున్న తరిగొండకి చెందినది.
 
ప్రముఖ సంగీతకారుడు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ అనంతపురానికి చెందినవాడు.
మన పుట్టపర్తి సంగతి తెలిసిందే .. 

ప్రముఖ సంగీతకారుడు (మరియు వైద్యుడు) అయిన శ్రీపాద పినాకపాణి జన్మత: శ్రీకాకుళం జిల్లాకి చెందినవారైననూ, కర్నూలులో స్థిర పడ్డారు.


రాయలసీమలోనివే అయినా కర్నూలు భాషపై..మహబూబ్ నగర్ ప్రభావమూ..
చిత్తూరుపై తమిళ భాష వాసన..
అలానే అనంతపురం ప్రజల భాషలో కన్నడ కస్తూరి గుబాళింపూ
కనిపిస్తాయి..


మా అయ్య
 ''ఊనప్పా అంటే..''
 అని ఎవరో అనేవారని
మాటి మాటికి అని నవ్వే వారు
ఊనప్పా అంటే.. నిజమే సుమా అని..


 ఇక విషయానికి వస్తే..
పోలా ప్రగడ సత్య నారాయణ గారు వ్రాసిన ఆ రోజుల్లో పుస్తకంలో..
వారు రాయలసీమలో పనిచేసిన రోజులను అతి సుందరంగా వర్ణించారు..


ఈనాడు సినిమాలలో చూస్తుంటే..
రాయలసీమ అంటే
అందరూ కత్తులు పట్టుకు నరుక్కుంటారనీ..
పగ ప్రతీకారాలతో రగిలిపోతుంటారనీ..
బాంబులు విధిగా తయారు చేస్తారనీ
అభిప్రాయాన్ని ఫిక్స్ చేసారు..
 

కానీ రాయల సీమ ప్రజలు అమాయకులు..
కల్లా కపటం తెలియని వారు
నటించటం..రాదు..
ఆత్మ వంచన చేసుకోవటం..తెలియదు
లోపలేముందో అదే మాట్లాడతారు..
మనసుకు నచ్చితే శక్తి వంచన లేకుండా చేస్తారు..
మరి ''ఆ రోజుల్లో'' కి వెళదామా..
  .




















4 కామెంట్‌లు :

  1. >శ్రీమద్భాగవతము రచించిన పోతనామాత్యుడు కూడా ఒంటిమిట్ట లోనే జన్మించాడన్న అభిప్రాయం....
    కొంపముంచారు. ఈ మాటతో తెలంగాణావాళ్ళతో విరోధం వస్తుందే.

    రిప్లయితొలగించండి
  2. యేమీ రాదులెండి తెలంగాణా వాళ్ళు మాకు విరోధులేమీ కారు .. బంధువులే.. ఆ మాటకొస్తే ఆత్మ బంధువులు.. పోతన్న భాగవతమే భగవంతుడు భక్తుడు భగవంతుడూ భాగవతమూ ఒక్కటే వేరు కాదు అన్న పుట్టపర్తి చివరి వాక్యాలు అర్థం కావడానికి ఎంతో ఔన్నత్యం కావాలి.. మాకు తెలంగాణా వారితో ప్రేమానుబంధాలే వున్నాయి మీ సంగతి చూసుకోండి అన్నగారూ.. పుట్టపర్తి అనూరాధ.

    రిప్లయితొలగించండి
  3. కవికి కులమతాలు లేవంటుంటే.. ప్రాంతీయతలు కూడానా.. అన్నారు కోస్తా ఆంధ్ర ప్రాంతాలకు చెంది పుట్టపర్తి పై రిసెర్చ్ చేసిన పద్మావతిగారు..మన విభేదాలు పోతన గారికి ఆపాదించడం ఎందుకులెండి వాళ్ళమానాన వాళ్ళని బ్రతకనిద్దాం.. నేను మా తండ్రి గారి విశేషాలు వారి అభిమానులకు అందించాలనే ఉద్దేశం తో బ్లాగు నడిపిస్తున్నానే తప్ప నేను పెద్ద జ్ఞాన వంతురాలిని కాదు.. కనీసం అలా చెప్పడం నటించటం కూడా రాదు నన్నిలా ఒదిలేయండి.. మనం పోతన్న తెలంగాణా వాడివన్నా పొంగిపోడు.. రాయలసీమ వాడివన్నా కుంగిపోడు.. అందుకే ఆయన భాగవతా న్ని పట్టుకుని ఎంతో మంది తరించిపోతున్నారు..

    రిప్లయితొలగించండి
  4. అనురాధ గారూ, వ్యాసం చాలా బాగుంది.

    "జాంకులు ఈడికి వస్తావుండె..
    శానా నాళ్ళయిపాయ ఈ దిక్కుకే రాల్యా..
    అంతలక్కల ఎదికినా..
    యాడా దొరకల్యా"

    సీమ భాషలో రాసిన మాటలు కొన్నే అయినా పెసరబేళ్ళ కోసంబరి తిన్నట్టుంది. ఇదే భాషలో పూర్తి వ్యాసం ఉండి ఉంటే ఎంత బాగుండేదో!

    రిప్లయితొలగించండి