28 ఆగ, 2015

ఊగిసలాటలో పుట్టపర్తి



ఆదికవి నన్నయ కాదు..పాల్కురికి! (14-Mar-2015)


దేశీ తెలుగుకు గుడి కట్టిన సోమనాథుడిదే ఆ స్థానం
డిగ్రీ కోర్సుల్లోని తెలుగు సిలబస్‌లో సమూల మార్పులు
భాష-సాహిత్యంలో తెలంగాణ కవులకే అగ్ర పీఠం
ఈ సవరణలపై పరిశీలనకు రివ్యూ కమిటీ ఏర్పాటు
తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయం
ఆంధ్ర కవుల పేర్లు పూర్తిగా తొలగింపుపై చర్చ
మరో సమావేశంలో నిర్ణయిస్తాం : వైస్‌ చైర్మన్‌ మల్లేశ్‌
హైదరాబాద్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ఆది కవి నన్నయ కాదు.. పాల్కురికి సోమనాథుడని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. బసవ పురాణం రచనతో దేశీ తెలుగు నుడికారానికి తొలి గుడి కట్టిన పాల్కురికి ని ప్రాచీన ఆదికవిగా గుర్తించింది. ఈమేరకు తెలంగాణలోని డిగ్రీ విద్యార్థులకు బోధించే ఆధునిక తెలుగు భాష- సాహిత్యంలో మార్పులు చేయాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. శుక్రవారమిక్కడ జరిగిన మండలి సమావేశంలో ఈ అంశంపై పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. డిగ్రీలోని అన్ని జనరల్‌ కోర్సుల్లో సెకండ్‌ లాంగ్వేజ్‌గా ఉన్న తెలుగు సిలబస్‌లో సమూల మార్పులు చేయాలని మండలి వైస్‌ చైర్మన్‌ ఆచార్య ఎస్‌ మల్లేశ్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం తీర్మానించింది. అదే సమయంలో తెలుగు సాహిత్యాన్ని బీఏలో ఒక సబ్జెక్టుగా ఎంచుకునేవారు చదివే సిలబస్‌లోనూ మార్పులూచేర్పులూ చేయాలని నిశ్చయించింది. డిగ్రీ తెలుగు సిలబస్‌ రివ్యూ కమిటీని ఆచార్య మల్లేశ్‌ ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.
డిగ్రీ స్థాయిలో ఏ కోర్సు తీసుకునేవారికైనా సెకండ్‌ లాంగ్వేజ్‌.. తెలుగు. ఈ సబ్జెక్టు సిలబస్‌ను చివరి సారిగా 2008-09 విద్యా సంవత్సరంలో సవరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపఽథ్యంలో ఇప్పు డు తిరిగి సిలబస్‌లో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో తెలంగాణ సంస్కృతి, ఆర్థిక, చారిత్రక అంశాలను పొందుపరచనున్నట్టు ప్రొఫెసర్‌ మల్లేశ్‌ తెలిపారు. ఈ సమయంలో ఆదికవిగా ఎవరిని పరిగణించాలనే చర్చ ముందుకొచ్చిందని చెప్పారు. నన్నయ అనువాద రచనలు చేస్తే.. పాల్కురికి సోమనాథుడు స్వతంత్ర కావ్యం రచించారని సమావేశం అభిప్రాయపడిందని చెప్పారు. కాబట్టి పాల్కురికి ని ప్రాచీన ఆదికవిగా తెలుగు పాఠ్యాంశాల్లో స్పష్టంగా పేర్కొనాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.
శ్రీశ్రీ, జాషువా మాటేమిటి?
డిగ్రీ మొదటి సంవత్సరం సిలబస్‌లో ప్రాచీన కవుల రచనలు ఉన్నాయి. నన్నయ, తిక్కన, సోమనాథుడు, తరిగొండ వెంగమాంబ తదితరుల సాహిత్యాన్ని చదువుతున్నారు. ఇప్పుడిక తెలంగాణ కవుల రచనలను మాత్రమే బోధించనున్నారు. ఆఽధునిక కవుల జాబితాలో గరిమెళ్ల, శ్రీశ్రీ, జాషువా, పుట్టపర్తి నారాయణాచార్యులు తదితర మహాకవుల రచనలు ఉన్నాయి. శ్రీశ్రీ, జాషువా కవుల రచనలు సిలబస్‌లో చేర్చాల్సిన ఆవశ్యకతపై కమిటీ చర్చించింది. డిగ్రీ సెకండియర్‌లో పాలగుమ్మి పద్మరాజు, కొలకలూరి ఇనాక్‌, పొట్లపల్లి తదితరుల రచనలు ఉన్నాయి. ఆధునిక కవుల్లో కుసుమ ధర్మన్న, పింగళి, కాటూరి, కాళోజీ, అందెశ్రీ, చెల్లూరి శ్రీనివాసమూర్తి వంటివారి సాహిత్యం ఉంది. ఇందులోంచి ఆంధ్ర కవుల రచనలు తొలగించాలని కమిటీ ప్రాథమికంగా నిర్ణయించినట్లు మల్లేశ్‌ తెలిపారు. అయితే పూర్తి స్థాయిలో తొలగించాలా లేక 80శాతం తెలంగాణ కవుల రచనలు, 20శాతం ఆంధ్ర కవుల రచనలు చేర్చాలా అనేది మరో సమావేశంలో కమిటీ నిర్ణయం తీసుకోనుంది. తెలుగు భాషను మెయిన్‌ సబ్జెక్టుగా బీఏ లిటరేచర్‌ కోర్సును తీసుకునే వారికి ‘తెలుగు సాహిత్యం’ సిలబస్‌ మార్చనున్నారు. ఆంధ్ర కవుల రచనలు తొలగించి తెలంగాణ కవుల సార్వస్వతాన్ని అందించనున్నారు. డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌లో (తెలుగు సాహిత్యం) నాలుగో పేపర్‌గా ‘ఆంధ్ర భాషా చరిత్ర’ ఉంది. పూర్తిగా తొలగించి ‘తెలంగాణ భాషా చరిత్ర’గా మార్చనున్నారు.
సిలబస్‌ రివ్యూ కమిటీ చైర్మన్‌గా ఆచార్య గోపి
మాజీ ఉప కులపతి, ప్రముఖ కవి ఆచార్య ఎన్‌ గోపిని సిలబస్‌ రివ్యూ కమిటీ చైర్మన్‌గా ఉన్నత విద్యా మండలి నియమించింది. డిగ్రీ స్థాయి తెలుగు భాష- సాహిత్యంపై గల సిలబస్‌లో మార్పులు చేర్పులు చేసేందుకుగాను మండలి వైస్‌ చైర్మన్‌ ఆచార్య మల్లేశ్‌ శుక్రవారమిక్కడ సిలబస్‌ రివ్యూ కమిటీని ఏర్పాటుచేశారు. కమిటీలో సభ్యులుగా నిత్యానందరావు, గోనానాయక్‌, వెంకటేశ్వర్లు, శ్రీదేవి, కనకయ్య, బాల శ్రీనివాసమూర్తిని నియమించారు

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి