10 జన, 2012

మిత్రుడు మిగిల్చిన అనుభవాలు.. జ్ఞాపకాలు..



అయ్య ..
రామ చరిత మానస్ ..
పదమూడు సంవత్సరాలు పారాయణ చేసారట.
ఇప్పుడు ..

ఈ వ్యాసాలు చదువుతుంటే ..
కనుల నీరు కమ్మి ..
మనసు మూగవోయి..
అప్పుడే ఎందుకు పుట్టలేదా..
అన్న విచారం మనసును క్రుంగదీస్తూంది..
 
అయ్యతో వ్యక్తిగత పరిచయమున్న వారు..
వారి అనుభూతులను వివరిస్తూంటే ..
మా కన్నా వారే ఎంత అదృష్ట వంతులో కదా..
అన్న విచారమూ కలుగుతోంది..

మేము కూడా పూర్వ జన్మలో ..
ఎంతో పుణ్యం చేసి వుంటాం..
కనుకే 
అంతటి మహోన్నత వ్యక్తి కడుపున 
జన్మించి తరించాము..



అప్పుడు ..
మా వయసు ప్రలోభాలు.. 
చిన్నతనం .. 
కనులకు మబ్బులుగా కమ్మి..
అయ్య విశ్వరూపాన్ని గమనించలేకపోయాం..
 

కానీ ఇప్పుడు ..
మా సర్వ శక్తులనూ వత్తులుగా చేసి ..
దివ్వెలుగా ఆయన ధీరత్వం ముందు వెలగాలని..
మనసు తపించిపోతూవుంది.. 

                     మిత్రుడు మిగిల్చిన ..
                 అనుభవాలు జ్ఞాపకాలు
        డా. వి. రామమూర్తి "రేణు"MA,Dlit
                                      

వాగ్దేవీ స్థనద్వయామృతాన్ని..
కడుపార గ్రోలి ..
సుష్టుగా జీర్ణించుకుని..
తృప్తిగా త్రేంచిన ..
అసలైన సిసలైన ..
సరస్వతీ పుత్రుడు శ్రీమాన్ నారాయణాచార్యులు.


ఆయన సాహితీ స్వరూపం..
బహుముఖాల సానలు తీరిన భారత జాతి రత్నం... 

తౌర్యత్రిక విద్యకు మరో పేరు పుట్టపర్తి.
 


ప్రేమ ..మధుర భక్తి మందాకినిలో..
మునిగితేలిన మహితాత్ముడు..
ఆయనతో పరిచయమున్న ఏ సహృదయుదికైనా..
ఇది ఏమాత్రమూ పొగడ్త అనిపించదు..

 

  
శ్రీ నారాయణచార్యులతో నాకు గల పరిచయం..
ఆత్మీయత ..అనురాగాలు ..
ఈనాటివి కావు. 

 1945లో అనుకుంటా ..
ఓ పర్యాయం ఆయన గుంటూరు వచ్చారు..
ఏదో సభలో పాల్గొనటానికి. 

ఆ రోజుల్లో ..
నేను హిందూ కాలేజీలో 
హిందీ ఉపాధ్యాపకుడిగా వున్నా.. 


కీ.శే . శ్రీ జమ్మలమడక మాధవరామ శర్మ ..నేను ..
ఒకే ఇంట్లో ..
ప్రక్క ప్రక్క వాటాల్లో ..
అద్దెకు ఉంటున్నాం...


శ్రీ శర్మ నన్ను తన వెంట సభకు తీసికెళ్ళారు. 
అందులో ..
ఆయన తన శివతాండవంలోని కొన్ని భాగాలు..
సమాహిత చిత్తంతో ..
తన్ను తానే మరచినట్లు గానం చేసారు. 


నా మనస్సు మీద ఆనాడే..
ఆయన వ్యక్తిత్వం చెరగని ముద్ర వేసింది.
 
ఆ రాత్రి..
శ్రీ శర్మ గారింట ఆయనకు ఆతిధ్యం ..
ఆ రాత్రంతా.. 
సాహిత్య గోష్టితో గడిచింది. 
ఆయన వ్రాసిన సాక్షాత్కారం..
లఘు కావ్యం ప్రతిని నాకిచ్చారు .


అందులో భక్త శ్రేష్టుడు 
శ్రీ గోస్వామి తులసీదాసు భక్తి సాధన ..
అనితర సాధ్యంగా వర్ణించబడింది.

ఆశ్చర్యంతో తులసీదాసును గురించి 
మీకెలా తెలుసునని ప్రశ్నించా ..
ఆయన నిమీలిత నేత్రాలతో ..
శ్రీ రామ చరితమానసం..
 పదమూడేండ్లు పారాయణం చేసానయ్యా..
అనడంతో బిత్తర పోయాను .


ఆనాడే ..
మా ఇద్దరి హృదయాలు ఏకమయ్యాయి.
శ్రీ తులసీ దాసు సాధనా పధాన్ని ..
అంత హృద్యంగా ..,అనవద్యంగా..,
కావ్యరూపంలో ..

 
నాకు తెలిసినంతవరకూ ..
హిందీ కవి కూడా నిబధ్ధించలేదు. 


మహాకవి "నిరాలా" ..
తన తులసీదాసనే ..
హిందీ కావ్య ఖండికలో ..
తులసీ హృదయ పరివర్తనను మాత్రమే..
అద్భుతంగా వర్ణించాడు. 


ఆ మహా భక్తుని భక్తి సాధనను ..
పుట్టపర్తి భావించినట్లుగా
మరే కవీ వర్ణించలేదు. 


పదమూడేండ్లు మానసాన్ని మధించిన..
మేధామందరం సరస్వతీపుత్రుడు. 
శివకేశవ అభేదాన్ని ..
అడుగడుగునా భావించి..

బోర్కర్
స్వస్థ సుందరమైన..
అద్వయ దృష్టితో రచించబడ్డ తులసీ మానసాన్ని..
పుష్కర కాలానికి పైగా ..
పారాయణం చేసిన ..శ్రీ వైష్ణవుని నోట..
శివతాండవ దర్శన ధార ప్రవహించడం..
అబ్బురం కాదనిపించింది...




హరి హర నాధునకు ..
అక్షర దేవాయతనం నిర్మించిన తెలుగు గడ్డ మీద..
నారాయణాచార్యుల వంటి బ్రహ్మ దృష్టి గల 
వాఙ్మయ తపస్వి పుట్టడం ..
సాధారణం కాకపోయినా..
అసహజం కాదు. 


కనుకనే .. 
ప్రాతఃస్మరణీయులు ..
పరమ హంసావతంసులు..

శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతీ శ్రీ చరణుల..
కామకోటి పరమాచార్యుల అనుగ్రహానికి.. భాజనులయ్యారు నారాయణాచార్యులు.

మామావరేర్కర్
  శ్రీమదప్పయ దీక్షితేంద్రులు ..
బిల్వ మంగళాచార్యుల వంటి..
స్వస్థసుందరమైన అద్వయ బ్రహ్మ దృష్టి ఆయనది.

శ్రీ నారాయణా చార్యులను గురించిన
స్మృతులెన్నెన్నో..
ఆయన తలంపుకు వచ్చినప్పుడల్లా 
గిలిగింతలు పెడుతుంటాయి ..

దినకర్.
 ఆయన తమ్ముడూ..
స్వస్థి సౌహార్ద్ర సంపదే ! 
అని వ్రాసిన జాబులెన్నింటిలోనో ..
నన్ను అనుజునిగా ..
సుహృదునిగా..
భావించి ..
ఏనాటిదో గదా ..
మన అనుబంధం..
అని ఆత్మీయతను వర్షించిన సన్నివేశాలు ..
మరపునకు రావు.

బనఫూల్
 పూజ్య పాదులు..
శ్రీ పరమాచార్యుల శ్రీ చరణాలవిందాల వద్ద ..
మేమిద్దరం గడపిన క్షణాలు ..
నేటికీ నాకు జీవన పాధేయాలుగా నిలిచాయి.

శ్రీశైల క్షేత్రంలో ..1968 లో ..
శివరాత్రినాడు.. 
శ్రీ పరతేశ్వరుని గర్భాలయంలో.. 
స్ఠిరలింగానికి ఎదురుగా ..
అచర లింగేశ్వర (కంచిస్వాముల ) సన్నిధిలో.. మేముభయులమూ అనుభవించిన..
ఆ దివ్యానుభూతిని 
నేటికీ స్మరించుకుంటాను.



దాదాపు 35 నిమిషాలు..
 శ్రీవారు కావించిన ..
దివ్యానుగ్రహ భాషణాన్ని..
"శ్రీశైల క్షేత్రం-శివరాత్రి" అనే ఉపన్యాసాన్ని ..
నేను రికార్డు చేసి చరితార్థుణ్ణయినాను.



శ్రీ నారాయణాచార్యుల ప్రతిభ ..
ఆంధ్ర రాష్ట్రపు టెల్లలను గూడ దాటి ..
ఆసేతు శీత నగ వ్యాప్తిని సంతరించుకుంది. 



Malayalaen Lexicon సంపాదకునిగా.. తిరువనంతపురంలో 
పేరు తెచ్చుకొన్న పుట్టపర్తిని ..
హిందీ మహా కవయిత్రి శ్రీ మహదేవి వర్మ..

శ్రీ మహదేవి వర్మ
   
1953లో ..
ఉత్తర ప్రదేశ్ లో..
శీతాచల సానువుల్లో..
నైనిటాల్ లో నిర్వహించిన.. 




అఖిల భారత సాహితీ సమారాధకుల 
శిబిరానికి తీసికెళ్ళారు.
తెలుగు భాషకు సంబంధించిన ..
ఒక ప్రముఖ ప్రతినిధి కవిని కూడ ...
వెంట బెట్టుకు రమ్మని.. 
శ్రీమతి మహాదేవి వర్మ నన్ను కోరడంతో ..
నా నెచ్చెలిని వెంట తీసితెళ్ళాను.


ఆ ఉత్తమ మైన నిర్ణయాన్ని తీసికున్నందుకు..
15 రోజులు సాగిన ఆ సాహిత్య గోష్టుల తర్వాత..
నేనెంతో తృప్తి పడ్డాను.


మైధిలీ శర్ణ్ గుప్త 



 ఆ శిబిరానికి ..
భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన దిగ్దంతులెందరో హాజరయ్యారు.


బనఫూల్..,
బోర్కర్.., 
మామావరేర్కర్..,
దినకర్.., 
మైధిలీ శర్ణ్ గుప్త..,
ఇలాచంద్ర జోషి ..
మొదలైన వారెందరో వచ్చారు.



చుక్కల్లో చంద్రుడిలాగ ..
అందరినీ తన శివతాండవంతో 
ఆకట్టుకున్నాడు పుట్టపర్తి. 
ఒకనాడైతే అందరం గుర్రాల మీద
Chinapeak అనే మంచు శిఖరానికెళ్ళాం..




అప్పుడు దినకర్ జీ ..
 "మహాకవీ ..యహ్ యోగ్య రంగ్ మంచ్ హై..
అపనీ శివ్ తాండవ్ కృతి గానేకేలియే..
  ఆయియే ..
హమే రసమగ్న బనాయియే.."

అని ఆహ్వానించారు




(మహాకవీ మీ శివతాండవ గానానికి అనువైన నాట్యశాల ఇది. లేవండి మమ్మల్ని రసాంబుధిలో తేల్చండి..)


ఆ నగాధిరాజ ప్రాంగణంలో ..
దాదాపు అరగంటసేపు సాగిన ఆ కావ్య గానం ..


శ్రీ నారాయణాచార్యుల సాహితీ వ్యక్తిత్వానికి..
అధ్బుతమైన మణికిరీటం..


అదే శిబిరకాలంలో చివర రోజులలో ..
ఒకనాడు అప్పటి ముఖ్యమంత్రి ..
మహా పండితుడు సంపూర్ణానంద్ ..


శిబిరంలో పాల్గొన్న పండితుల నందరనూ..
తన వేసవి నిలయంలో 
(National Government House) లో 

మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. 

ఆయన కోరిక మేరకు ..
ఆ చోట చేరి కవులందరూ ..
తమ తమ భాషా కవితలను వినిపించారు.
వాటన్నిటినీ ..

శ్రీ సంపూర్ణానంద్ శిరః కంపంతో అభినందించారు. 
సంపూర్ణానంద్


కాగా..
శ్రీ నారాయణా చార్యులు 
శివ తాండవం లోని ..
"నందీ నాందీ" శ్లోకాలు గానం చేయగానే..
ఆయన సంతోషంతో ఊగిపోతూ..
"వాహ్ ..వాహ్.. కైసీ అద్భుత్ రచనాహై ..
చిత్త ప్రఫుల్ల హోగయా.. 
అని మౌఖికంగా తమ ఆనందం ప్రకటించారు. 
అలాంటిదీ శ్రీ పుట్టపర్తి వ్యక్తిత్వం.



నేడు ..
తన తీయని పవిత్ర స్మృతులను ..
మాత్రమే మనకు వదలి ..
నా నెచ్చెలి వెళ్ళి పోయాడు.


ఆ సరస్వతీ పుత్రుని ..
సంభావించి ..సన్మానించిన ..
సంస్థలు తమ ఉనికిని స్థార్థకం చేసుకున్నాయి. 
పైరవీలకు ..
ప్రలోభాలకు ...
మాత్రమే సంక్రమించే..
పెద్ద పెద్ద సమ్మానాలు.. 
అవార్డులూ ..

రాకపోవటంతో ..
ఆయన నిష్కలంక చంద్రుడైనాడు.
 
ఆ సంస్థల పక్షపాత పంకం..
ఆయన నంటుకోక పోవటం.. 
ఆయన అదృష్టమే.. 
"శివతాండవం.."
ఆయన అక్షర శరీరం. 
నిస్సంశయంగా ..
భర్తృహరి పలుకుల్లో ..
ఆయన రససిధ్ధ కవీశ్వరుడు..
అజరామర జీవి..

8 జన, 2012

పుట్టపర్తి నారాయణాచార్యులు - పరమాత్మునికై ప్రాణత్యాగం - పుట్టపర్తి అనూరాధ


హిమాలయ పర్వతశ్రేణులు..
మంచు కొండల మధ్యన ఆశ్రమాలు.. .
ఆశ్రమాల్లో సాధు సంతులు.. నిస్సంగులు..
గడ్డ కట్టే చలిలో ఆవాసాలు..
దొరికితేనే తిండి.. దొరక్కపోతే గాలే భోజనం..
బట్టలూ అంతంత మాత్రమే..
దిగంబరులకైతే ఆ  బాధా లేదు..


మామూలు వాతావరణానికి భిన్నమైన పరిస్థితుల్లో
దేవుడి ఉపాసనే ప్రాణంగా బతికే ఈ జీవుల ఆయుష్షు ఎంతో తెలుసా?
మినిమమ్ 100 years ..
ఇంకా ముందుకు వెళ్తే ..
150  .. 250 ఏళ్ల పాటు జీవించిన వాళ్ళూ ఉన్నారంటే నమ్ముతారా? 
నమ్మాల్సిందే మరి..


అక్కడ మన పుట్టపర్తి ..
కైలాసంలో ప్రాణత్యాగం చేయాలని..
వెళుతున్నారు గంగ ఒడ్డున..

అప్పటికి ఆయనకు పెళ్ళై ఇద్దరు ఆడపిల్లలు..
ఓ రోజు ఇంట్లో తెల్ల కాగితంపై ఉత్తరం లాంటిది వ్రాసిపెట్టి హిమాలయాల దారి పట్టారు..

శివానందులు 

అతనికి శివానందులు అక్కడ ఉన్నారని తెలియదు..
ఆయన పుస్తకాలు చదివారు...

 




పుట్టపర్తి గంగ ఒడ్డున నడిచే సన్నివేశం..
శివానందులు ధ్యానమందిరం నుంచీ బయటకు వచ్చే సన్నివేశం ఒకేసారి జరిగాయి..

ఎవరు నీవు..?
ఎక్కడినుంచీ వచ్చావు..?
అని అడిగారు..
ఇక ఈ మహత్తర అనుభవం పుట్టపర్తి వారి నోటివెంటే వినండి..


నా ఇష్టదైవం కృష్ణుడు..
1945 వ సంవత్సరంలో నేను విధ్యార్థి దశలో ఉన్నప్పుడు..గాయత్రి ముగించినాను..

 
అటు తరువాత ఈ నారాయణం ..
పన్నెండు ..పదహైదు కోట్లు చాలా నియమంగానే చేసాను..
నాకు ఏదీ అనుభూతి కలుగలేదు..
తరువాత ..

ఒక రీతిగా ..
ఏమిరా జీవితం ..నిరర్థకంగా గడిచిపోతూవుందే..
అన్న పశ్చాత్తాపం కూడా నాకు కలిగింది.


దాన్నుంచీ..
 ప్రాణత్యాగం చేసుకుందామని ..
హిమాలయాలకు వెళ్ళిపోయాను. 

సాధువులనూ ..
సన్యాసులనూ..
వెతుక్కుంటూ ఇండియా అంతా తిరిగాను.. 
ఆ ఊపులో 
నేను హిమాలయాలలో 
కొంతకాలం ఉండడమూ ..
శివానంద సరస్వతుల
 అనుగ్రహం నా పై ప్రసరించడమూ జరిగింది.

వారే ఇచ్చింది 

సరస్వతీపుత్ర అన్న బిరుదు..

నేను కైలాసంలో 
ప్రాణత్యాగం చేయవలెననె పోతూ వుండినాను..
ఆ గంగ ఒడ్డున..
శివానందులు అక్కడ వున్నారని 
నాకు తెలియదు.
ఆయన పుస్తకాలు చదివినాను.
నేనా గంగ ఒడ్డున నడిచి వెళ్ళే సన్నివేశం..
ఆయన ధ్యానమందిరం నుంచీ గడ్డకు వచ్చే సన్నివేశం రెండూ ఒకే సారి జరిగినాయి ..

Who are you
where are you going  
అని ఆయన అడిగినారునన్ను.




నాకథ నేను చెప్పినాను..
లోపలికి పోదాం ..
రమ్మన్నారు. 
కొంతకాలం ఉంచుకున్నారు..

ఆయన 

సరే.. 
అన్ని విద్యలలోనూ పరీక్షించినారు..
భాగవతమన్నాడు.. 
సంస్కృతమన్నాడు..
ఇతర భాషల్లో అన్నాడు..
సంగీతమన్నాడు.. 
నాట్యం వచ్చునా ..
అన్నాడు..

అన్నీ అడిగినాడు..

కొంతకాలం వారితో ఉన్నాను నేను..
ఆయన "సరస్వతీ పుత్ర .."
అనే బిరుదిచ్చి..
నాయనా.. 
దీన్ని నువ్వు వాడుకోవలె..
నామీద ఉన్న గౌరవంతో 
అని అన్నాడు.. 

నువ్వు వెనక్కి పో .. 
నీకింకా కొంత కర్మ శేషమున్నది.. 
అంతా తృప్తిగా అనుభవించు ..
నువ్వు దేనికీ భయపడవద్దు.. 
నీది ఉత్తమమైన జన్మ ..
అని చెప్పి నన్ను వెనక్కి పంపినాడు..
ఆయన పుస్తకాలన్నీ ఇచ్చి..


కామకోటి చంద్ర శేఖర సరస్వతులకు నేనంటే చాలా ఎక్కువ ప్రేమ ప్రీతి ..
ఆయనకూడా జీవితంలో ఓ గొప్ప ధైర్యాన్ని ఇచ్చినారు..








డెబ్భయేడేళ్ళ సుదీర్ఘ సఫల సాహిత్య  జీవితాన్ని గడపిన పుట్టపర్తి ..
నేను నేర్చింది గోరంత ..
నేర్చుకోవలసినది కొండంత..
అంటూ.. 
సాహిత్య ..సంగీత ..తాత్విక..
విషయాల్లో ఎన్నో తెలుసుకోవాలని ఉంది.. 
ఒక్కోక్కటి అనుభవంలోకి వస్తున్నకొద్దీ ..
నాకు తెలిసింది చాలా తక్కువ అని అనిపిస్తోంది..
అని తన గొప్పదనాన్ని చాటుకొన్నారు..
 

5 జన, 2012

విదుషీమణి కవయిత్రి శ్రీమతి కనకమ్మ గారు


విశ్వనాధవారు మాఇంటికి తరచూ వచ్చేవారట..
అయ్యకూ ..ఆయనకూ పాండిత్యంలో సమాన స్థాయివున్నా..

అది ఆయన గుర్తించడం ఆయన గొప్పదనం..

పాండిత్యానికి మించి ..

అయ్యలోని పరమాత్మను గురించిన 
నిజమైన వేదన..
పారమార్థికంగా దేన్నో సాధించాలని..
దేన్నో చేరుకోవాలనే ఆరాటమూ..
ఆయనను ఆకర్షించి వుండవచ్చు..


మా ఇంటి వాతావరణం ..
నిత్య దారిద్యం..
నిరంతర పూజలూ .. జపాలు..
సంసారాన్ని పట్టించుకోకపోవటం..
ఇవన్నీ ఆయన్ని అబ్బురపరచి వుండవచ్చు..


ఇలాంటి మనిషికూడా ఈ లోకంలో వుంటాడా ..?

అని ఆయన ఆలోచించి వుండవచ్చు..

ఎప్పుడూ రమణులూ.. రామకృష్ణ పరమహం
లూ.. మదిలో తిరగాడుతూ వుండవచ్చు..

కానీ..
వారు చెప్పిన దాన్ని త్రికరణ శుధ్ధిగా ఆచరించ ప్రయత్నించడము సామాన్య విషయం కాదు కదా..
దానిలో అయ్య ఏమైనా సాధించారో.. లేదో..
అది తరువాతి విషయం..
ఈ రోజు కమలాలతో పూజ చేయాలి ..
అని అయ్య నోటి వెంట మాట వెలువడిన తక్షణం ..
పది మంది శిష్యులు ..            


ఏ ఎర్రగుంట్ల సమీపంలోని చెరువుకో ..
దువ్వూరు దగ్గర కొలనుకో.. 
వెళ్ళి తెల్ల తామరలు గోనె సంచుల నిండా పట్టుకొచ్చే వాళ్ళట..

ఫోటోలు పెట్టి ..శుక్రవారం మంగళవారం..
లక్ష్మీ నారాయణులకు పూజలు..
నిత్యం వండుకోవటమూ.. తినటమూ.. 
ఉద్యోగ వ్యాపారాలు విర్వహించుకోవటమూ ..
మానవులపని ఇంతే కదా..
మహా అయితే ఏ రోజో ఇంత పూజచేసి ..
ఒక కొబ్బరికాయ కొట్టి ..
గోవింద అని .. పూజ చేశామనిపించు కోవటమే తప్ప..
మరి విజయవాడలోని విశ్వనాధ ..
కడపలో అయ్యను వెతుక్కుంటూ రావటమూ..
అయ్యతో సాహిత్య చర్చలూ..
వంట ఇంట్లోని అమ్మకు రామాయణ కల్పవృక్షంలోని పద్యాలను వినిపించటమేమిటీ..
అమ్మ వానికి మూలంలోని శ్లోకాలను ఉదహరించటమేమిటి..
ఒక దశలో ఆయనా ..
అమ్మ అమ్మతనం ముందు పసిపిల్లవాడయిపోయారేమో నని నాకనిపిస్తుంది.. 


కానీ.. 
అమ్మ..
అయ్యకు సాహిత్యంలోనూ చేదోడు గా నిలచి..
అయ్య వెంట నీడలా నడచి ..

పిల్లల భవిష్యత్తును 
తన చేతనైనంత వరకు చక్కదిద్ది..
తన జీవిత పరమావధిగా పెట్టుకున్న 

రామాయణ పారాయణలోనే 
తన ముప్పావు వంతు జీవితాన్ని 
వెచ్చించిన అమ్మ..

చాలా దయనీయంగా ..
చాలా అన్యాయంగా చనిపోయింది..
నిరంతరం భగవన్నామం చేసే..
అమ్మకు బ్రెయిన్ క్యాన్సరు వచ్చింది..

ఏ బుధ్ధిలో 

రామాయణం అహరహమూ పారాడిందో..
ఏ బుధ్ధిలో 

దారిగాచె శబరీ రాముండిటు వచ్చుననీ ..
పూ గొనునటంచు.. 
అని శబరి సాక్షాత్కరించిందో..

ఆ బుధ్ధిలో 

క్యాన్సరు పుండు మహమ్మారియై ..
అమ్మను మింగేయటానికి అడుగుపెట్టింది.
ఆ తర్వాత 

అమ్మకు ఫిట్స్ స్టార్ట్ అయ్యాయి..
బ్రెయిన్లో రక్త ప్రసారం జరగటం లేదన్నారు..
ఎంత శారీరక బాధను అనుభవించిందంటే..
శత్రువులకు కూడా అంతటి బాధ రాకూడద
అమ్మను ముందుకు వంచి

కడుపులో తల వత్తి పట్టి ..
వెన్నులోకి పేద్ద సూదిని గుచ్చి ..
మెదడులోని నీరు తీయాలన్నారు..
అమ్మ ఊపిరి అందక కేకలు వేస్తే ..
అక్కడి మగ నర్సులు.. ఆయాలు ..
మమ్మల్ని పొమ్మని ..
వారు పది మంది అతి కర్కశంగా నొక్కి పట్టి ..
వెన్నులోకి సూదిని ఎక్కించారు..

ఇంత బాధ 

ఆ రాముని నమ్మిన ఆ శబరికి ఇవ్వటం 
ఆ రామయ్యకు న్యాయమా..??
రోజు రోజుకూ అమ్మ పరిస్థితి దిగజారిపోతూంది..
ఒక చేయి ఒక కాలు పడిపోయి పూర్తిగా పడకకే పరిమితమైపోయింది.
కనులవెంట 

ధారగా కన్నీరు కారిపోయేది..

ఆ రామయ్యకు ఎంతగా 

వేడు కొలుపులు ప్రాణ నివేదనతో చేసిందో 
నా తల్లి..
మరి ..
ఒక పక్క అయ్య కూడా 
పసివాడితో సమానమే..
అమ్మ వేదనను రామయ్య వినలేదు..
నా ప్రార్థన సీతమ్మ తల్లి ఆలకించలేదు..
మా అయ్య సగ ప్రాణాన్ని 

తనతో తీసుకునే పోయాడు కర్కశుడై రాముడు.

ఎందరి సమస్యలకో ..
తన పారాయణలో పరిష్కారం వెదకిన నా తల్లి ..



తన సమస్యలను 
ఆ రామునిపై వదలటం తప్ప యేం చేయలేకపోయింది..

తన కర్మను 

నిశ్శేషంగా అనుభవించిందన్నారు..
ఇప్పుడామె యోగస్థితిలో వుందన్నారు..

పరమేశ్వరుని లీలలు భక్తులకు తప్ప 

యెవరికి అర్థమౌతాయి..?

భగవంతుని చేతలకు భక్తులు 
మహత్తరమైన అర్థాన్ని వెతుక్కుని ఆనందపడుతుంటారు..
  


నేను అయ్యను ..అమ్మను ..
ఏ వివేకానందులతోనో రమణులతోనో 
పోల్చటానికి ప్రయత్నిస్తున్నానని.. అనుకోకండి..

చిన్నతనం నుంచీ మేము చూసిన మా అమ్మ అయ్యలను మీ ముందుంచుతున్నా..

అయ్యకు సంబంధించిన 

జ్ఞాపకాలు..
విషయాలు ..
కాలగర్భంలో కలిసిపోకూడదని..
విజ్ఞులు మీరే ఆలోచించండి..






విదుషీమణి  కవయిత్రి శ్రీమతి కనకమ్మ గారు
Dr.నందుల రామలింగేశ్వరుడు.





శ్రీమాన్ పుట్టపర్తివారి సాహిత్య సమాలోచనాన్ని సాగిస్తున్నప్పుడు ..
మనకొక అజ్ఞాత సాహితీ విదుషీమణి తారసపడుతుంది.
ఆమె పేరు కనకమ్మ గారు..

ఆ మహా ఇల్లాలు సాక్షాత్తూ..
శ్రీ పుట్టపర్తి వారి సతీమణి..

ఆమెగారి సంపూర్ణ సహకారం పుట్టపర్తి వారికి పుష్కలంగా లభించిందనే చెప్పాలి.

ఆమె శ్రీమాన్ ఆచార్యులవారి నిజ జీవితంలోనూ ..
సాహితీ జీవనంలోను ..
ముమ్మూర్తులా అర్ధాంగియే.


సరస్వతీ పుత్రుని రచనా వ్యాసంగంలో ..
ఆమె గారి సంపూర్ణ సహకారం సర్వదా లభించేదని స్పష్టమౌతొంది.

ఆమె గారి ప్రోత్సాహమే శ్రీవారిని బహుముఖ ప్రజ్ఞా వంతుని గావించింది..

శ్రీమతి కనకమ్మ గారు ..
అలనాటి ఉద్దండ పండితులైన శ్రీమాన్ ధన్నవాడ రాఘవాచార్యులుగారి మనుమరాలు..
సంస్కృతాంధ్రాలో..
ఆమె గారికి మంచి పాండిత్యం పారంపర్యంగా లభించింది. వాల్మీకి రామాయణం వారికి కంఠస్ఠం . 
చక్కని ..చిక్కని ..
పాండిత్యం చేజిక్కించుకున్న విదుషీమణి ఆమె . 

గృహ కలాపాల నుండి బయటపడిన పిదప..
ఆమె తీరిక సమయాలలో ..
తనలో తలెత్తిన తీవ్ర వేదనను ..
కవితా ఖండికల రూపంలో అభివ్యక్త పరచటం సర్వసాధారణాంశం.

పుట్టపర్తి దంపతులు అగ్నివీణ..
గాంధీజీ మహా ప్రస్ఠానం ..
కలిసి వ్రాసి వారే స్వయంగా ప్రచురించారు. 

శ్రీమతి కనకమ్మ గారు స్వయంగా సంస్కృతంలో రామ సుప్రభాతం నరసిమ్హ సుప్రభాతం రచించారు. 
తెలుగులో పార్థసారధి సుప్రభాతం రాసారు. 

ఆమె గారు తన రచనలు చేయటం కంటే ..
తమ శ్రీవారి రచనలను వ్రాయటం లోనూ..
వారికి సహాయ పడటంలోనూ..
సంతృప్తి పొందిన సాధ్వీమణి..


1936 లో పుట్టపర్తి వారు శ్రీమతి కనకమ్మ గారిని సహధర్మచారిణిగా స్వీకరించారు. 
నాటినుండి ఆమెకు కుటుంబ బాధ్యతలతో పాటూ 
శిష్యులతో సాహిత్య పునశ్చరణ చేయించటం ..
మంత్ర లోపాలను సవరించటం ..
కూడా ఒక బాధ్యతగా తయారైంది. 


తీరిక సమయాలలో..
ఆమె రహస్యంగా వ్రాసుకున్న కవితా ఖండికలు
ఒకసారి ఆచార్యుల వారి కంట పడ్డాయి.

వానిలోని స్త్రీ సహజమైన కోమలత్వం ..
భావ ప్రకటనలోని పరిపక్వత భాషా సౌందర్యం ..
ఆచార్యుల వారిని బాగా ఆకట్టుకుంది. 



వెనువెంటనే ..
వారే స్వయంగా వానిని పత్రికలకు పంపటం ..
అవి ముద్రించబడి ..
సహృదయులైన పాఠకుల అభిమానాన్ని చూరగొనడం క్షణాలలో జరిగిపోయింది. 

నాటి నుండీ ..
అడపా దడపా ..ఆమె గారి రచనలు పత్రికలలో ముద్రితమౌతూనే వచ్చాయి.

మహాత్మా గాంధీ దారుణ హత్యకు గురి కావటం..
ఆ దంపతుల కవి హృదయానికి పెద్ద గాయమైంది.



వారి శోకం గాంధీజీ మహా ప్రస్థానం అందులోని మొదటి మజిలీ మొత్తం పుట్టాపర్తి కనకమ్మ గారిదే. మూర్చనలు పోయింది.


ఆమె భావాలు లలిత పరంపరకి ప్రతీకలు..
మహాత్ముని మరణాన్ని శ్రీమతి కనకమ్మగారు ఇలా సంభావించారు. 
ఆ భావాలలోని మధురిమను ఆస్వాదించటం మనవంతు.

ఎన్ని సుమములో భువి జనియించు గాని..
ఆ సురభిళమ్ము పువింక యవని లేదు..!!
మధుకరము లేడ్చులే బిట్టు మసలి మసలి..
వెనుదిరుగునేమె..? గడిచిపోయినవి కలలు..!!

శ్రీ కనకమ్మ గారిది భక్త హృదయం..

వాల్మీకి రామాయణమంటే ఆమెకి పంచ ప్రాణాలు వారానికో మారు రామాయణాన్నంతా పూర్తిచేసి ..


ప్రతి శనివారం ..
పేద్ద యెత్తున పట్టాభిషేకం చేసి పారాయణ ముగించటం మరుసతి రోజు మళ్ళీ పునః ప్రారంభించటం ఆమెకు ఆనవాయితీ.

ఆమె పాండిత్యాన్ని పుట్టపర్తి వారి మాటలే మనకు తెలియజేస్తాయి.

నా భార్య 387 సార్లు రామాయణాన్ని పారాయణ చేసింది
విశ్వనాధ సత్యనారాయణగారు మా ఇంటికి వస్తే
వంట ఇంట్లో నా భార్యకు తన కల్ప వృక్ష పద్యాలను వినిపించే వాడు. 
ఆ పద్యాలకు corresponding verses ఆమె మూలం నుంచీ చెబుతుండేది.
ని వారే స్వయంగా చెప్పారు.
ఆమె పాండిత్యం..
రామాయణ పారాయణ ప్రావీణ్యం..
ఆయమ్మది అంతటిది.
శ్రీ రామచంద్రుడు ఆమె ఆరాధ్య దైవం...

ఆచార్యులవారు రచించిన శ్రీనివాస ప్రబంధంలో 
ఆమె ప్రసక్తి యెలా వుందో గమనించండి..

మద్భార్య వాల్మీకి మారంద మాధుర్య..
రచనా విశేష విక్రాంత హృదయ..

అని వారు ఆమె పాండితిని ఆవిష్కరించారు.
శ్రీరాముని గూర్చి పరమ తారకనామ ముద్రలో అనేక భక్తి రచనలను చేసారీమే.

నేటికీ ఆకాశవాణి కేంద్రాలనుండి అయ్యవారి అష్టాక్షరీ రచనలు ..
అమ్మగారి తారక రాముని ప్రస్తుతి గీతాలు..
భక్తి రంజనిలో వస్తూనే వుంటాయి.

విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుండీ..

రాముని సేవించెను ప్రేమమ్మున సకల ప్రకృతి

 అన్న భక్తి కీర్తన నిరంతరం వి
నినిపిస్తూనే వుంటుంది.
అది కనకమ్మ గారి రచనయే...
కాని..
ఆమె గారిపేరు ప్రచారం లోకి రావాలనే ఉబలాటం ఆమెకి యే మాత్రం ఉండేది కాదు.

ఆమె యెల్లవేళలా అయ్య గారికి "వ్రాయసగత్తె" (స్క్రైబ్ గా) పనిచేయటంలోనే అమితానందాన్ని పొందేది.
అయ్యగారు TTD దేవస్థానం వారికి వ్రాసిన "భాగవత సుధా లహరి" సంపుటాలన్నీ స్వామివారు చెపుతుంటే ఆమె వ్రాసినవే...
ఆమె మరణానంతరం నిజంగా ఆపని ఆగిపోయింది. 


 ఆచార్యుల వారిలో ఒక నిర్లిప్తత.. 
నిరాసక్తత ..
చోటు చేసుకున్నాయి..
ఆమె గారి లేఖిని నుండి "కురుమూర్తి విలాసం" అన్న నాటకం వెలువడింది 
కాని అది వెలుగు చూడలేదు. 
ఆమె కవితా ఝరి మనోహరమైంది. 

అగ్నివీణ తెండవ మూర్చనలో 
ఆమె వ్రాసిన పద్యంలో యెంత స్త్రీ హృదయం వుందో ఊహ కందదు.
హృదయమే లేని రాముండు ప్రేమ మయిని
విడిచినాడి చాకలి వాని నుడుల కొగ్గి..
హృదయముండిన సీత జీర్ణించుకొన్న
దాత్మ దూఖంబు దయితుని యశము కొరకు..




అంటుందామె. 

రామునికి హృదయం లేకపోయినా 
సీతకు మాత్రం ఆత్మ ఉంది. 
ఆమె ఏకైక లక్ష్యం తన భర్త కీర్తి..
అందుకే దుఃఖాన్ని ఆత్మలో దిగ మింగిందని..
ఆమె ఆ ఘట్టాన్ని చక్కగ వ్యాఖ్యానించింది.

శ్రీమతి కనకమ్మ గారి సాహిత్య సేవను గమనించిన ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడ
మి అంతర్జాతీయ మహిళా సంవత్సరాన్ని పురస్కరించుకొని..
ఆమెను 27.11.1975 న 1974 సంవత్సరపు ఉత్తమ కవయిత్రిగ సమ్మానించి తన కీర్తిని నిలుపుకొంది.


శ్రీమతి కనకమ్మ గారి రచనలలో..
శ్రీరామ సుప్రభాతం వంటివి కొన్ని వెలుగు చూచినా..
ఇంకా చాలా రచనలు అముద్రితంగానే కాలం వెళ్ళదీస్తున్నాయి.
బహుకుటుంబీకురాలైన ఆమెను అందరూ అత్యంతాదరాభిమానాలతో గౌరవించటం హర్షించదగింది.
ఆమెను మాతృ మూర్తిలా పూజించే ఆత్మీయులూ శిష్యవర్గం నేటికీ వుందంటే ఆశ్చర్యం కదూ..
శ్రీ స్వామివారి వ్యక్తిత్వంలో పూర్తిగా కలిసి పోయి..
వారి కీర్తి పరిమళం లో ..
తన జీవన సుమ సుగంధాన్ని కలబోసిన ..
అపర పతివ్రతా శిరోమణి ..
కుంకుమ సౌభాగ్యవతి గానే తనువు చాలించింది (1983)

అల్లాంటి సహధర్మచారిణీ దొరకటం..
పుట్టపర్తి వారి అదృష్టం..
ఆయన జీవన నౌకకు ఆనాడే చుక్కాని విడిపోయింది.
తదాది ..
ఆచార్యులవారు అంతర్ముఖులై ..
నారయణ స్మరణ మాత్రంగానే శేష జీవితం గడిపారు.
ఆచార్యులవారి బహుముఖ ప్రజ్ఞా పాండిత్యాలకు..
ఆమె చేయూతయే ఆలంబన..
వారిరువురిదొక అపూర్వ దాంపత్యం..
ఆ దంపతులదొక విశిష్ట సాహితీ సంగమం.
అదొక అజరామరానుభూతి.

అందుకే..
శ్రీ పుట్టపర్తి దంపతులు సాక్షాత్తూ లక్ష్మీనారాయణులు..
వాణీ చతుర్ముఖులు..
శివాశివులు..
ఆ అపూర్వ సాహితీ సంగమ మూర్తులకు నా కైమోడ్పులు.

 

1 జన, 2012

పుట్టపర్తి నారాయణాచార్యులు - రవివర్మ రామయ్య. - పుట్టపర్తి అనూరాధ


మా ఇంట మా అమ్మతో మూడు వందలకు పైగా పట్టాభిషేకాలు మహదానందంగా అందుకున్న రవివర్మ రామయ్య.
మా ఇంటి వాకిళ్ళు 
ఎప్పుడూ మూసి వుండేవికావు..
ఎప్పుడు ఎవరో ఒకరు వచ్చే వారే..


    
ఆడవాళ్ళు 
ఇంట్లో పనీ పాటలు ముగించుకొని 
మా ఇంటికి వచ్చి 
ఏదో స్తోత్రాలు 
చెప్పుకుంటూ 

దేవుని రూము ఎదురుగా కూచునే వారు.


లోపల అమ్మ 
రామాయణ పారాయణ చేస్తూ వుంటుంది..
నిశ్శబ్దంగా అలా కూచునేవారు..
తలుపుకు ఇటువైపు జ్ఞానమ్మత్త..
అటువైపు వార్తాంబ అత్త ..
పైగా 
వాళ్ళిద్దరూ మడి కట్టుకుని వుండేవాళ్ళు.
వాళ్ళని యెవరూ తాకకూడదు..




నేను ఇంత పెద్ద పావడా 
వేసుకుని గేటు వేసి ..
రివ్వుమని పరిగెత్తుకుంటూ..
లోపలికి వచ్చేదాన్ని ..
ఏయ్ మెల్లిగా రాలేవూ.. 
అని నన్ను గదిరే వాళ్ళు..
నాకవేవీ పట్టేవి కావు.. 
అమ్మా ..అమ్మా.. 
అని అమ్మను ఏదో..
 అడగడానికో.. చెప్పడానికో ..
రావటమూ అంతే స్పీడుగా వెళ్ళడమూ..
అమ్మ మెల్లగా నవ్వుకొనేది..
అయ్యకు అన్నం పెట్టడానికో ..
ఇంక దేనికో ..
అమ్మ బ్రేక్ ఇచ్చినప్పుడు..
అమ్మ కాళ్ళకు నమస్కరించుకొని వెళ్ళేవాళ్ళు. .
 
అందరూ..
  అలా నమస్కరించడం ..
అమ్మకు ఇష్టం వుండేది కాదు..
అయ్యకు కూడా అంతే ..
కానీ ..
వాళ్ళు వినేవారు కారు.
ఇంక ..
ఊరికి వెళుతున్నప్పుడు ..
పనిపై వెళుతున్నప్పుడు ..
పరీక్షలకు వెళుతున్నప్పుడు.. 
మా ఇంటి చుట్టుపక్కలవారు ..
అందరూ వచ్చి ..
అయ్యకో అమ్మకో ..
నమస్కరించుకొని వెళ్ళేవారు..
 
అందరూ వట్టి చేతులతో వచ్చేవారు కారు..
పండో ఫలమో పట్టుకొచ్చేవారు.
అమ్మ ..
అదే విధంగా ..
దోసిళ్ళతో పండ్లూ ఫలాలూ ..
అందరికీ పంచేసేది..

31 డిసెం, 2011

మధురై మణి అయ్యర్



మధురై మణి అయ్యర్ సంగీతం అయ్యకు ఎంతో ఇష్టం.

అందులో ..
ఈ ఇంగ్లీష్ నోట్ ను ఎంతో ఎంజాయ్ చేస్తూ వినే వారు నడుమ.. నడుమ ..
అయ్యా పాడేవారు..
 

ఉత్సాహం ఉరకలు వేసేది..
మా నాగక్కయ్య రేడియోలో చేరిన కొత్తల్లో ..
మధురై మణి అయ్యర్.. 
జి ఎన్ బాల సుబ్రమణ్యం.. 
పుదుక్కోటై ..
ఇంకా ఎందరివో ..
రికార్డులని ఎంతో ఓపికగా 
కాసెట్లలో రికార్డ్ చేసుకొని వచ్చింది..
అయ్య మహదానందంగా వినే వారు..
ఇదిగో మీరూ వినండి..

28 డిసెం, 2011

బ్రాహ్మీమయమూర్తి

బ్రాహ్మీమయమూర్తి
పుట్టపర్తి అరవింద్










శివతాండవం ఊరికే పాడటమేనా ఆడికూడా చూపిస్తావా ఆచార్లూ..
ఆ కాలేజీ ఉపన్యాసకులు ఆంజనేయ శర్మ గారు


అంతే..
కాళ్ళకు గజ్జెలు కట్టి నడుముకు దట్టీ కట్టి..
సాక్షాత్తూ ఆ పరమ శివుడు కైలాసంలో నాట్యం చేసినట్లు పుట్టపర్తి వారు నాట్యం చేసి చూపించారు..


ఈ సన్నివేశం మదనపల్లె కాలేజీలో జరిగిందట..

అరవింద్ మా అన్నయ్య..
అయ్య అరవిందుల వారి తత్వాన్ని..సాహిత్యాన్ని.. మధించే సమయంలో పుట్టాడని..



ఆయనపై తనకు గల ఆరాధనకు గుర్తుగా
అరవిదుల వారి పేరును మా అన్నయ్యకు పెట్టారు.
అన్నయ్య అయ్యను తన మాటలలో చెప్ప ప్రయత్నించాడు ..
చదవండి మరి...

పదునాల్గు భాషల పండితుడునూ ..
సరస్వతీ పుత్రులును ..
ప్రపంచ కవుల చరిత్రలో పేరెన్నిక గన్న..
శ్రీమాన్ డాక్టర్ పుట్టపర్తి నారాయణాచర్యులవారు పూజ్యులగు మాపితృ పాదులు...
అశేష శేముషీ దురంధరురాలు ..
సాక్షత్తూ లలితా స్వరూపిణి..
శ్రీమతి కనకమ్మ గారు మా తల్లిగారు..
ఈ దంపతులకు ఏకైక పుత్రుడను. ..
మా తండ్రిగారు అరవిందుల శిష్యులు. 
వారి ఉపనిషద్వాణి 
మా తండ్రిగారి కవితలో సంలీనమైనది. 
వారి  గురువులైన అరవిందుల జ్ఞాపకార్థము..
నాకు అరవింద్ అని నామకరణము చేసినారు..

బాల్యమునుండి 
మా తండ్రి గారు రచించిన అనేక కవితలను 
అనేక శ్లోకములను 
అనేక గేయములను వినుచూ 
పరవశించెడి వాడను. .
మా తాత గారు శ్రీ పుట్టపర్తి శ్రీనివాసాచార్యుల వారు ప్రసిధ్ధ పండితులు కావడం..
మా నాయనమ్మ ప్రసిధ్ధ సంగీత విద్వాంసురాలు కావడంవలన..
మా తండ్రి గారికి బాల్యం నుండి
 సంగీత సాహిత్యాలు అలవడినవి..


వారు బాల్యమునుండి మహా ప్రతిభా సంపన్నులు. 
దీనికి తోడు మహా కోపిష్టులు. 
వీరి హృదయము చాలా సరళమైంది...
నిర్మలమైంది..
మా తండ్రి గారు ఎంతో కరుణార్ద్ర హృదయులు..


నేను పుట్టక పూర్వం 
వారు రచించిన గ్రంధములు అనేకములు. 
నా పుట్టుక తర్వాత కూడా 
శతాధిక గ్రంధములను రచించినారు. 


మా పితృపాదులకు పదునాల్గు భాషలలో పాండిత్యము ఎనిమిది భాషలలో కవిత్వము వ్రాయు శక్తి ఉండెడిది.


దాక్షిణాత్య భాషలగు 1) ఆంధ్రము 2) తమిళము 3) కన్నడము 4) మళయాళము (సౌథెర్న్ లంగూగెస్) ఔత్తరాహుల భాషలగు 
1) సంస్కృతము 2) ప్రాకృతము
3) హింది 4) అవధి 5) మహరాష్ట్ర 6) బెంగాలి 7) వ్రజ 8)పంజాబి 9) కాశ్మీరి 
ఇవి గాక మాగధి అర్థమాగధి సౌరసేని పైశాచికము అను భాషలు 
తరువాత ఇతర దేశ భాషలగు (Forign languages) 1) ఇంగ్లిష్ 2) లాటిన్ 3) గ్రీకు కలవు.

ఇంగ్లీషు భాషలో బ్రిటన్ ఇంగ్లీష్ 2) అమెరికన్ ఇంగ్లీష్ 3) రష్యన్ ఇంగ్లీష్ కలవు. 
పై అన్ని భాషలను 
మా తండ్రి గారు అభ్యసించినారు. రాత్రి పూట రేడియోను ద్గ్గరగా పెట్టుకోని ఇతర దేశ భాషలను 

ఇవి గాక ..
బానిస భాషలగు ఎరికల భాష ..
సుగాలీ భాష.. 
కోయభాష ..
అను మూడు భాషలలో 
తిరువాన్కూరులో ఉన్నప్పుడు మా తండ్రిగారు 
ఎరుకల భాషకు లిపిని కనుగొన్నారు.

వార్థక్యములో పలక బలపము తీసుకొని 
ఉర్దూ భాషను నేర్చుకొనటము 
నేనెరుగుదును. 
ఆ ముసలితనములోనే మృదంగమును 
కూడా అభ్యసించినారు. 
మా తండ్రి గారు పై భాషలను నేర్చుకొనుటలో 
ఎంతో పట్టుదల 
ఆకలి నిద్రలను లెక్కజేసేవారు కాదు. 




విశ్వనాధ సత్యనారాయణగారు రచించిన 
ఏకవీర అను నవల మళయాళ భాషలోనికి అనువదించినారు. 
మహరాష్త్ర భాషలోని బుధ్ధ చరిత్రను 
తెనుగులోనికి అనువదించినారు.


వీరు ఇంగ్లీషులో మహాకవులై పండితులై 
Leaves in the wind 
అను నాటకమును రచించినారు. 
 The Hero  అను నాటకములో 
ప్రధాన నాయకుడు దుర్యోధనుడు. 
ఇతనిని శ్రంగార పురుషునిగా చిత్రించడములో
 మా తండ్రిగారు చూపించిన నేర్పు చాల గొప్పది. 

Leaves in the wind  అను కావ్యమును 
ప్రముఖ సమకాలీన ఆంల కవులు చాలా ప్రశంసించినారు. 
దైవభక్తి సంగీతము పెనవేసుకొనిన 
జీవితమగుట వలన మా తండ్రిగారు 
కొన్ని వేల భక్తి కృతులను 
అష్టాక్షరీ ప్రభావమును 
తెలుపుతూ రచించినారు. 
ఆంధ్రములో పెనుగొండ లక్ష్మి మొదలు 
శ్రీనివాస ప్రబంధము వరకూ గల 
శతాధిక గ్రంధాలు కాక 
సంస్కృతములో శివకర్ణామృతము 
త్యాగరాజ సుప్రభాతము 
అగస్యేశ్వరసుప్రభాతం 
అను మూడు కావ్యములను రచించినారు. 
మా తండ్రిగారి ప్రేరు ప్రతిష్టలకాలవాలమైనది శివతాండవము వీరు అనేక సభలలో ..

ఏమానందము భూమీతలమున..
శివతాండవమట శివలాశ్యంబట..

అని గొంతెత్తి ఆలాపన చేసినపుడు..
మనుషులే కాదు 
జంతువులు సైతం పులకరించి పోయెడివి. 

ఎండిన మోడులు  కిసలయించినవేమో.. 
ఆ మహనీయ గూధర్వమూర్తి 
సాహిత్య కవిత్వ సంగీతముతో పాటు
 నాట్య శాస్త్ర పారమెరింగినవారు.


ఒక పర్యాయము 
మదనపల్లె కాలేజీలో 
మా పితృపాదులు గానం చేసేటప్పుడు 
ఆ కాలేజీ ఉపన్యాసకులు ఆంజనేయ శర్మ గారు 

"గానం చేయడమేనా..? నాట్యం చేసి చూపిస్తావా.. ఆచార్యులూ..

అని అడుగగా వెను వెంటనే కాళ్ళకు గజ్జెలు కట్టి.. నడుముకు దట్టీ కట్టి..
ప్రత్యక్షంగా ..
సాక్షాత్తూ శివుడు తాండవము చేసిన యటుల..
మా తండ్రి గారు నాట్యం చేసి చూపించారు.

1981  వ సంవత్సరములో 
తిరుమల తిరుపతి దేవస్థానంవారు 
భాగవతముపై విమర్శ వ్రాయమని కోరగా
 మా తండ్రి గారు పోతన భాగవతము 
మరియు శ్రీధర భాగవతముల ఆధారముగా 
తన వ్యాఖ్యలతో 
"భాగవత సుధాలహరి" అను పేరుతో 
మా తల్లిగారు శ్రీమతి కనకమ్మ గారి సహాయ సహకారములతో ..
ప్రధమ ద్వితీయ స్కంధములను వ్రాసినారు. 


అప్పట్లో మా తండ్రిగారు చెబుతుంటే ..
మా తల్లిగారు వ్రతప్రతిని వ్రాస్తూ ఉండేవారు. 
1983 వ సంవత్సరము మా తల్లిగారి 
మరణానంతరము ఆ పని ఆగిపోయినది. 



మా తల్లిగారు చక్కని విదుషీ మణి. గొప్ప పండితురాలు. 
వాల్మీకి రామాయణమును 
వారం రోజులు పఠించి 
ప్రతి శనివారం రాముల వారి పట్టాభిషేకములు జరుపుతుండెడిది. 

ప్రముఖ కాశీ పండితులైన 
శ్రీ ధన్నవాడ రాఘవాచార్యులవారి 
మనుమరాలు మా అమ్మ. 
చిన్నతనమునందే పంచకావ్యాలు 
పఠించిన ప్రజ్ఞానిధి. 
మా తండ్రిగారి దగ్గరకు వచ్చే శిష్యులకు వచ్చే సందేహాలను తీరుస్తూండేది. 

మా తండ్రి గారి ఆదేశముననుసరించి ..
అప్పుడప్పుడూ..
వారికి సంస్కృత పాఠములను బోధిస్తూ ఉండేది.
ఇంతటి మహా పండితునకు సేవచేయుటకు 
వారసునిగా జన్మింపజేసిన 
ఆ భగవంతునికి కేల్మోడ్చుచూ..
ఊహా జనితమైన 
మా తండ్రిగారి పాదపద్మములకు నమస్కరించుచున్నాను.