14 మార్చి, 2012

పుట్టపర్తి నారాయణాచార్యుల పద్మశ్రీ ఫొటో కథ..



పై ఫొటొ చూసారా..??
అయ్య కు పద్మశ్రీ వచ్చినప్పటిదిది అయ్య ఇందిరా గాంధీ తదితరులు ఉన్నారిందులో..
కానీ ఎందుకో ..
అయ్య కనుబొమ్మలు చిట్లించి ఉన్నారు ..
ఎందుకట..??
ఎందుకంటే..
అయ్య వెనకాతల..
 ఓ అందమైన అమ్మాయి నిల్చుందిగా..
ఆమె అయ్యను మరీ ఆనుకుని నిల్చుందిట..
అది అయ్యకు నచ్చలేదు..
అందుకే ..
అయ్య అలా ఉన్నారట..
నా చిన్న తనంలో ..
అమ్మ ..అక్కయ్యలు ..చెప్పి నవ్వుకొనేవారు..
రహస్యం ..
ఎవరికీ చెప్పకండి..!!

13 మార్చి, 2012

పుట్టపర్తి నారాయణా చార్యుల ఆధ్యాత్మిక అనుభవం









ఎవరు ఎంతెంత..
జ్ఞానం వేపు నడుస్తుంటే..
వాళ్ళతో ఆడుకోవటం పరమాత్మకు..
అంత సరదాగా ఉంటుంది....

పరతత్వ దర్శనం చేసిన వాడితో..
భగవంతుడు కూడా ..
పరాచికమాడతాడు..!!

మరీ బిర్ర బిగుసుకుపోయి..
అజ్ఞానంలో ఉన్నవాడిని చూసి..
వీడితో  నాకేంటి ఫో అంటాడు ..
ఆయన కూడా ..!!

లీలా శుకునికి ..
పరమాత్ముడు శ్రీరాముని రూపంలో కనిపించి..
తమాషా చేసాడు..

ఆయన మీరు భగవంతుడే ..
నేను మీకు నమస్కరించాలి..
లేకపోతే నా యందు దోషం ఉండి పోతుంది..
దోషం రాకుండా ..
మీరొక సర్దుబాటు చెయ్యండీ..
నేను నమస్కారం చేస్తానన్నాడు..

మీరు శ్రీ కృష్ణుడై..
నెమలి ఈక పెట్టుకుని..
వేణువు పట్టుకుని..
కనిపిస్తే నమస్కరిస్తానన్నాడు..
సాక్షాత్తూ..భగవంతుడే ..
అతని కృష్ణ భక్తిని చూసి ఆశ్చర్య పోయాడు..

ఆయనెలా ఆడాడో..
ఈయన అలానే ఆడాడు..

విహాయ కోదండ శరౌ ముహూర్తం ..
గృహాణ పాణౌ మణి చారు వేణుం..
మయూర వర్ధంచ నిజోత్తమాంగే ..
సీతాపతే త్వాం ప్రణమామి పశ్చాత్..
అలా రండి ..
మీకు నమస్కారం చేస్తానని దానర్థం..

రామ కృష్ణులు ..
వీరిదొక అనుభవం..
 
అమ్మా ..
ఎంతకాలం ఇలా జపిస్తూ కూచోవటం..??
నా జప తపాలు శూన్యమేనా ..??
నేను నిన్నెందుకు దర్శించలేక పోతున్నాను..??

ఇక ఈ జన్మకు..
నీవు నాకు కనిపించవా అమ్మా..??
అని ఆవేదన చెంది..

అమ్మ చేతనమా..??
అచేతనమా..??

చేతనమైతే ..
నా బాధ ఆమెకు తెలియదా.. ??
నా ఏడుపు ఆమెకు వినిపించదా..??
అనుకుని దగ్గరికి వెళ్ళి ..
అమ్మ ముక్కు కింద వేలు పెట్టి చూసాడు.

ఆ మహాను భావునికి..
 కాళికా మాత ..
ఉచ్చ్వాస నిశ్శ్వాసాలు గోచరించాయి..
ఉలిక్కి పడ్డాడు..

అంతే..

అమ్మా..
నన్ను క్షమించు ..
తల్లీ ..
నేను ఎంత పొరపాటు చేసానో చూడు..!!
నీవే లేనిచో నేనుండగలనా అమ్మా..??

ఏనాటికైనా ..
నీవు నాకు దర్శన మిస్తావు..
అని మురిసి పోయాడు..


ఇలాంటి సంఘటనలు ..
అయ్య అమ్మల జీవితంలో..
అడుగడుగునా వున్నాయి..


ఎందుకంటే ..
అయ్య పరుగెప్పుడూ..
పరతత్వం వేపే కాబట్టీ..


రామనవమికి 
భద్రాచలం వెళుతున్నారు..
అయ్యా ..
రఘూత్తమ రావ్..


భద్రాచలం ఇప్పట్లా డెవలప్ కాలేదు..
ఇసుకలో గుడారాలు..
కిలో మీటరు నడిస్తేనే మంచి నీళ్ళు..
అంత దూరమూ నడిచి ..
ఒక చిన్న కూజాతో నీళ్ళు పట్టుకొచ్చాడు..
మన రఘూత్తముడు.
 
ఒక గుడారంలో ..
అయ్య ..రఘూత్తముడు.
లోపల ..అయ్య ..
రామ చరిత మానస్.. పారాయణం
బయట స్టూలుపై ..
రఘూత్తముని కాపలా..
 
ఇంతలో ..
ఒక కాషాయాంబర ధారి..
ఒక పొడవు గడ్డము వాడు..
కడపనుంచీ వచ్చిన ..
పుట్టపర్తి నారాయణాచార్యులెక్కడా..?
అని అందరినీ విచారిస్తూ..
విచారిస్తూ..

వస్తున్నాడట..
 
ఇది సత్యం..
కల్పితం ఎంత మాత్రమూ కాదు..
 
వచ్చి.. వచ్చి ..
రఘూత్తముణ్ణి అడిగాడు..
అవును సరి అయిన ప్రదేశానికే వచ్చావు..
ఏమిటి పని..?
స్వామి వారు ..

లోపల పారాయణలో ఉన్నారు..
 

అవునా ..
చూద్దామని వచ్చానే..
కాసిని నీళ్ళియ్యవా..
ఎండనపడి వచ్చాను..
దాహంగా వుంది..
అడిగాడు అతను..
 
ఏమిటీ నీళ్ళే..?
కిలో మీటరు దూరం  ..
ఎండలో ఇసుకన నడిచి చూడు ..
రాముడు కనిపిస్తాడు..
కూజాడు నీళ్ళున్నాయ్ ..


ఆ నీళ్ళు నీకిస్తే ..
మేమేం తాగాలట..
స్వామికి డిస్టర్బ్ అవుతుంది.. 
వెళ్ళు..
అన్నాడట ..

ఇక్కడ రఘూత్తముని 
గురు భక్తి చూడండి..
 

మనకు ఓ శ్లోకం ఉంది.                             
నాస్తి గంగా సమం స్నానం ..
నాస్తి రూపం గురోః సమం..
నాస్తి గాయత్ర్యాః మంత్రం..
న మాతుః పర దైవతం..
 
ఈ లోకంలో గంగ కంటే పవిత్ర స్నానం ..
ఈ నదికీ వర్తించదు..
గందా నదిలో స్నానం చేస్తే..
ఇంక ఏ నదిలో ..
స్నానం చేయక పోయినా పరవాలేదు..


గురువు కంటే ..
ఈ లోకంలో ఎవరు గొప్ప వ్యక్తి కాదు...
గాయత్రి కంటే..
 గొప మంత్రం యేదీ లేదు..
తల్లికి మించిన దైవం లేదు..
అన్నిటికి అన్నీ అమోఘమైనవే ..
పేగు బంధం ..

ఎప్పుడు బాధ కలిగినా ..
"అమ్మా .."
అంటాం..
తల్లిని ప్రకృతి మనకు పరిచయం చసింది..
 

అన్నిటికి అన్నీ అమోఘమైనవే ..
యే ఒక్కటి పట్టుకున్నా..
పరమాత్మ వశుడవుతాడు.. .

 
కొంతసేపటి ..
అయ్య పారాయణ ముగిసింది..
ఎవరొచ్చారు..?
ఎవరో ..
మీ పేరు చెబుతూ ..
కడప నుంచీ పుట్టపర్తి నారాయణాచార్యులొచ్చారు..
ఎక్కడా ..
ఎక్కడా.. 
అని అందరినీ అడుగుతున్నాడు..స్వామీ
 
ఇక్కడ కొచ్చి..
దాహంగా వుంది ..
మంచినీళ్ళివ్వమన్నాడు..
నేను ఇవ్వలేదు..
 
ఇక్కడ నన్నెరిగిన వాళ్ళెవరున్నారు..?
ఏమో స్వామీ..
ఓరి దరిద్రుడా ..
ఎంత పని చేసావురా..
వచ్చిన వాడు శ్రీరామ చంద్రుడేరా..

అవునా..?
నా పేరు అడుగుతూ..
వెతుకుతున్న వాడు ..
ఆయన కాక ఇంకెవరు..?
మనం ఆయనను పారాయణతో పిలిస్తే..
ఆయన మన పేరు పిలుస్తూ వచ్చాడురా..
 
అని తిట్టుకుంటూ ..
ఆ ఎర్రటి ఎండలో ..
కణ కణలాడే ఇసుక లో వట్టి పాదాలతో పరిగెడుతూ
అరుస్తూ ..
పిలుస్తూ..
ముందు..
అయ్య ..


వెనక..రఘూత్తముడూ..
 


12 మార్చి, 2012

పుట్టపర్తి కనకమ్మ అప్పగింతల పాట..-పుట్టపర్తి అనూరాధ






అయోధ్యాకాండ లో..
అత్రి మహర్షి.. 
అనసూయను చూపించి..
ఈమె అనసూయ..
 నా భార్య ..
సమస్త భూతముల చేత ..
నమస్కరించబడేంత యోగ్యురాలు..

రామా.. 
నీవు సీతమ్మకు చెప్పు..                        
ఈమెకు నమస్కరించమని..
అన్నాడు..


అత్రి మహర్షికి తెలియదా..??
వచ్చినావిడ శ్రీ మహాలక్ష్మి అని..
సీతమ్మ ..
సాక్షాత్తూ లక్ష్మీ దేవి అయినా..
చిరునవ్వుతో నమస్కరించింది..
"అమ్మా కుశలమా..?"
అంది..                                           

సీతా నీవు సకల సౌభాగ్యవతివి..
అంది అనసూయమ్మ.

సీత ..
ఏం సౌభాగ్యమమ్మా ..
మేం క్షత్రియులం ..
ఇదిగో ఇలా అడవిలో పడ్డాం.. 
చూసారా ..
మా ఆయనకు కాళ్ళకు చెప్పులు కూడా లేవు..
అనలేదు..



అవును ..
సకల గుణాభిరాముడు అయిన శ్రీరాముని అనుగమించడం లో గొప్పేముందమ్మా..
అంది..


రావణాసురుడు 
అందరు స్త్రీలను తెచ్చి అనుభవించే కామి..
కానీ ..
మండోదరి మహా పతివ్రత..
వాలి ...
తమ్ముని భార్యను తెచ్చి ..
బలవంతంగా తన భార్యను చేసుకున్న వాడు..
కానీ ..
వాలి భార్య తార మహా పతివ్రత..


పురుషుడు దుర్మార్గుడై.. 
చేతకానివాడై..
కఠినుడై ..
భార్యను విడిచిపెట్టి తిరిగే టటువంటి వాడై వుంటే అటువంటి వాడిని కూడా అనుగమించి..
తిరిగే స్త్రీ గొప్పదేమో..

 
సకల లక్షణ లక్షితుడై ..
అమృతము వంటి హృదయము గలవాడై ..
ధర్మాత్ముడైన..
నా భర్త మాట ..
నేను వినడంలో గొప్పతనమేముందమ్మా.. 
అంది సీత..
 
వివాహం చేసే టప్పుడు ..
అగ్ని కార్యంలో ..
పక్కన కూచో బెట్టుకుని ..
మా అమ్మ నాకీ విషయాలే చెప్పిందమ్మా.. 
అంది కూడా..
 


ఆడపిల్లని కన్నతల్లి 
కన్యాదానం చేసే సమయంలో 
నీ అత్తగారిని ఇలా అను..
నీమామ గారిని ఇలా అను..
మీ ఆయన్ని ఇలా లొంగదీసుకో
మీ అత్తమామల నుంచీ కొదుకును వేరు చేయి
అల్లుడు మనింటికి రావాలి 
అల్లుడిని గౌరవించకూడదు.. 
అతడి తల్లీ తండ్రీ యేమైపోతే మనకెందుకు..
ఈ దిక్కు మాలిన కబుర్లు కాదు..
తల్లి తన కూతురికి చెప్పవలసినది..
 
అత్తవారింటి వైభవాన్ని నిలబెట్టు..
నీ భర్త మనస్సును చూరగొను ..
ఆయన వెనుక అనుగమించు..
నీకు ఇవ్వాల్టి నుంచీ ప్రత్యక్ష్య దైవం నీ భర్త ..
తండ్రితో సమానం మీ మామ గారు.. 
మీ అత్త గారిని నన్ను గౌరవించినట్లె గౌరవించు..
అని నేర్పాలి..
 
పాపమా తల్లి..
ఇరవై సంవత్సరాలు ప్రేమించి..
 పెంచి ..పెద్ద చేసిన కొడుకును ..
నీ చేతిలో పెడుతూంది..
ఆమె కడుపు మండేత తప్పు నీవు చేయకు..
అని చెప్పి ..
అత్తవారింటికి పంపాలి..
అన్నారు చాగంటి వారు. 

అమ్మకు ..
ముఫయ్ ముఫయయిదేళ్ళ వయసులో..
మా పెద్దక్కయ్య పెండ్లి అయ్యింది..
అంటే అక్కయ్యకు సరిగ్గా ఇరవై..
తరువాత్తరువాత.. 
ముగ్గురు ఆడపిల్లల పెళ్ళి చేసి నప్పుడు..
 అమ్మ కొంత రాటుదేలి వుంటుంది..
 
ఆ దుఃఖంలో అమ్మ ..
అప్పగింతల పాట వ్రాసింది..
 
చూడండీ ..
అందులో అమ్మ
సీతకు వాళ్ళమ్మ చెప్పిన బుధ్ధులే చెప్పింది..
 
ఇది ఎంతో ప్రసిధ్ధి పొందిన పాట..
ఈ పాట పాడుతూ ..
కంటనీరు రాని వాళ్ళు వుండరు...
సాధారణంగా ..
అందరూ అప్పగింతల లో..
అమ్మ వ్రాసిన పాటను పాడుతుంటారు..

మా అక్కయ్యల కందరికీ..
అప్పగింతల సమయంలో..
అమ్మ ఈ పాటను పాడి కళ్ళనీళ్ళు పెట్టుకుంది.
కానీ ..
నాకా అదృష్టం లేదు..
ఈ పాట మాత్రం ..
అమ్మ అమృత హృదయాన్ని..
జ్ఞాపకం తెస్తూ వుంటుంది...
అప్పుడప్పుడూ..
ఈ పాట పాడుకుని..
నా కళ్ళ నీళ్ళు..
నేనే తుడుచు కుంటూ ఉంటాను..


అమ్మరో..కౌసల్యా..
అతివ సుకుమారియగు..
ఇమ్మహీజాత గైకొమ్మ..వేవేగ..
సమ్మతిగ నీ సుతకు ...
సమముగా చూతువని..
నమ్మి మదిలోన మాయమ్మనొప్పించెదను..    
అమ్మరో కౌసల్యా..


మా ఇంటిలో వెలుగు..
మా కంటిలో పాప..
మాదు హృద్పేటికను ..
మలయు రత్నమ్మూ..
మా మనో రధ ఫలము..
మా వంశ గౌరవము..
మీ ఇంటి కనిపెదము.. 
నెలతరో కోడలిగా..
అమ్మరో.. కౌసల్యా....


మా ఇంట పారాడు..
మహ లక్ష్మి జానకిని..
మీ ఇంటిలోనుండ ..
మేమంపుచుండా..
వేయి కన్నుల గాచి ..
వేసరక పోషించి..
చేయి విడువను మనసు .
చేదు మింగినటుండే..
అమ్మరో కౌసల్యా..

పుట్టినప్పటినుంచి..
చిట్టిమాటల మనసు..
అట్టే భ్రమియించి ..
మది నానంద పరచీ..
కట్టకడ కెటులైన..
కాంతు జేరెడునంచు..
పట్టరాని ముదమ్ము..
పరిఢవిల్లేమనమ్మూ..
అమ్మరో కౌసల్యా..


తొలిఝాముననే లేచి..
ఇలుదీర్చి..పెద్దలకు
తలవంచి యువనీత..
లలిత గతులా..
పులుగడుగు ముత్తెమై..
పుట్టువెరుగని సీత..
తలలోని నాల్క వలె ..
మెలగు మీ ఇంటయనీ..
అమ్మరో కౌసల్యా..


ఎన్నేండ్లు పెంచినా..
ఎన్ని గోములు పడిన..
కన్న కడుపేయైనగాని ..కడపటికీ..
సన్నుతాంగుని భాను 
సన్నిభుని పతి గూడి..
కన్నె తానేగునని ..
అనుకొంటి..కనుగొంటీ.. 
అమ్మరో  ..కౌసల్యా..


తొలిప్రాయమున తండ్రి..
మలి ప్రాయమున భర్త..
మలి వయసునను సుతుడు.. 
పడతి కెపుడూ..
కలిగి రక్షింపగా..
తులలేని సౌఖ్యాల..
తులతూగునని ధాత..
లలనలకు వ్రాసెననీ..
అమ్మరో.. కౌసల్యా..


అత్త మామల ఆజ్ఞ..
అనుసరించు విధమ్మూ..
బావ మరదుల మాట ..
పాటించు విధమూ..
ఇరుగు పొరుగుల వారి 
నేమరకటంచునే..
నరమరికలను చాల..
 కలవరించితినమ్మా..
అమ్మరో.. కౌసల్యా..


ఆడుబిడ్డల మనసు .. 
అలరించెడు విధమ్ము..
ఈడువారలగూడి ..
యాడు విధమూ..
వాడగల వారలకు ..
తోడుగా నగు విధము..
ఈడు లేని విధాన..
నేర్పించినానమ్మా..
అమ్మరో ..కౌసల్యా..


జననమొందిన ఇంట..
చన్న ఇంటను గూడ..
వినయగా నేడు..
తరముల వారికెల్లా..
అనయంబు కీర్తి 
దెచ్చినదంచు జనులెల్లా..
కనుగొనగ కనులార..
అనిపెదము ఈ బాల.. 
అమ్మరో ..కౌసల్యా..

పసితనపు చాపలము ..
వశముగా నేమైన..
కసటు మాటలు బల్కా..
కష్టపడబోకూ..
పసిబాలికయే గాని..
పడతీ ప్రౌఢాంగనా..
వశవాక్కు గాదమ్మ.. 
దొసగులను మన్నించీ..
అమ్మరో ..కౌసల్యా..



8 మార్చి, 2012


సమయం ఆరు గంటలు..
ఒక్కొక్కరూ..
కడప మోచంపేటలోని ..
శివుని గుడికి చేరుతున్నారు.
గుడిలో ప్రదక్షిణాలు ముగించి ..
తలా ఓ ప్రదేశంలో కూర్చొని..
ఎదురుచూస్తున్నారు..
ఆచార్యుల వారికోసం..

అక్కడ..
గత కొన్ని సంవత్సరాలుగా..
పుట్టపర్తి నారాయణాచార్యుల వారు ..
ప్రవచనాలు చెబుతున్నారు..
ఇంతలో రానే వచ్చారు అయ్యగారు..
వేదిక సిధ్ధంగానే వుంది..
మైకు అరేంజ్ మెంట్స్ బానే వున్నాయి..
 
అయ్య వచ్చారు..
వెనకాతలే ఓ ఏడేళ్ళ పిల్లా..
అయ్య వేదికపై వెళ్ళి కూచుంది..
మైకు సవరించింది..
నీళ్ళు కింద పడేయ బోయింది..
అమ్మా..
రాధమ్మా..
వద్దమ్మా..
అక్కడి వాళ్ళు వారిస్తూనే వున్నారు..
వింటుందా..??
 
అయ్య ..
అక్కడ వున్న పటానికి నమస్కారం చేస్తున్నారు..
ఇంతలో ..
మైకు దొరకబుచ్చుకుందా పిల్ల..
మా అయ్యకు బుధ్ధిలేదూ....
గట్టిగా మైకులో అరిచింది..
అందరూ ఫకాల్న నవ్వారు..
 
అయ్య చటుక్కున చూసారు..
మళ్ళీ ..
మా అయ్యకు బుధ్ధి లేదూ....                                                            
గాట్టిగా అరిచింది..
అయ్య ముఖంలో పరచుకున్న చిరునవ్వు..
వేదికపై వచ్చారు..
అంతా నవ్వుతున్నారు..
 
అయ్యకు కాస్త సరిగా వినపడేది కాదు..
ఏమంది..ఏమంది..??
అడిగారు అయ్య..
చెప్పారు..
అయ్య..గల గలమని నవ్వారు..
రెండు బుగ్గలపై ముద్దులు పెట్టారు..
"అవునమ్మా నాకు బుధ్ధిలేదు.."
నవ్వి.. నవ్వి ..
ఎర్రబడిన ముఖంతో పలవరించారు ..

తప్పుకదూ అయ్యనలా అనొచ్చా..??
క్కయ్య అంది..చెవి పట్టుకుని..
అయ్యా.. అంటూ
మళ్ళీ అయ్య దగ్గరికే పరిగెత్తింది..
ఆ పోకిరి పిల్ల..
 
ఇక ఆ రోజంతా ఇంటిల్లిపాదీ..
గుడి లోని వారు..
ఇదే విషయం..
చెప్పి చెప్పి నవ్వుకోవటం..
ఇంట్లో అమ్మ పెదవులూ ..
చిరునవ్వుతో విచ్చుకున్నాయి..
అయ్యకు బుధ్ధిలేదన్నందుకు..
అందరూ ముద్దులు పెడుతున్నారేవిటా..?
 అని అనుకుందా పిల్ల..


4 మార్చి, 2012

శివ తాండవ కావ్య గుణములు..శ్రీపాద గోపాలకృష్ణ మూర్తి



శివతాండవం పలికిన అయ్య నోట..  
కృష్ణ లీలలు..
అయ్య నోట వినాలని వుందని కోరారు..
అదేవిటో మీరూ చూడండి.
అయ్య శివతాండవం..
1961 లో శ్రీ పాద గోపాల కృష్ణ మూర్తి గారు ..
పీఠిక వ్రాసినారు.
 
శివతాండవం..
జర్మను భాషలొకి అనువాదమైంది..

హిందీలోకి ..
ఇద్దరు ముగ్గురు పరివర్తించినారు..
నేను వానిని చూచినాను కూడా..
టువంటి గ్రంధాలు పరివర్తించటం కష్టం..
ఇటువంటి కార్యాల గౌరవం ..
ముఖ్యంగా శబ్దంపైన ఆధార పడుతుంది..
ఇంగ్లీషులోకి తెద్దామని..
 నేనే ఎన్నో సార్లు ప్రయత్నించినాను.
 కానీ..
 ఆ భాషాంతరీకరణం..
 నాకు ఎన్నడూ తృప్తి నిచ్చిందే లేదు..

అయ్యతొలిపలుకులు ..
 
రష్యన్ ఎంబసీ వారు కూడా..
శివతాండవాన్ని చదివించుకొని విన్నారు ..
అమితంగా ఆనందించారు.
 
రష్యన్ ఎంబసీ వారు..
అయ్యను అప్పట్లో సన్మానిస్తే..
అయ్య  రష్యన్ లోనే ఉపన్యసించి వారిని అబ్బురపరిచారు..
 
"శ్రీ శ్రీ గారి మహా ప్రస్థానంలా..
దీన్ని ముద్రించి..
పెద్ద వెల పెట్టి ..
నాకు ఆర్థికంగా యేదైనా..
ఉపయోగపడేటట్లు చేయాలని.. 
శ్రీ ధన్ గారు.. సంకల్పించారు..
 
ణానుబంధాలు ..
మహా విచిత్రంగా వుంటాయి..
భౌతిక కారణాలతో ..
వాని స్వరూప నిర్ణయాన్ని చేయడం కష్టం..!!"

 
ధన్ గారు వచ్చి ..
అయ్య పరిస్థితి చూసి..
ఒక మహా కవి నిస్సహాయుడుగా ..
నిలబడి పోవటమేమిటని ..??
తన స్వంత ధనంతో..
శివతాండవాన్ని ముద్రించి ఇచ్చారు.. 
బాపు గారు బొమ్మలు వేసారు..
కానీ ..
అవి ఎలా అమ్మాలి..??

 
ఎంతయినా ..
కొంత లౌకిక జ్ఞానం లేకపోతే ఎంత కష్టం..!!!
 

ఒకరి ముందు తలవంచటం ..
చేతులు కట్టుకు నిలబడటం వల్లనే ..
ఎందరో ఎన్నో పదవులు ..
అర్హత లేకపోయినా  ..
చిన్న వయసులోనే..
సాధించుకుంటున్నారు..!!!
 
ప్రాపంచిక వ్యవహారజ్ఞానం లేకపోయిన..
మేధో జీవి ఆత్మ కథ..
అయ్య కథ అవుతుందేమో..
అతడు గ్రహాంతర వాసిలా బిత్తరపోక తప్పదు..
 
సరే..
1961 లో ..
శ్రీపాద గోపాల కృష్నమూర్తి గారు పీఠిక రాస్తూ..
కృష్ణ లీలలు..
అయ్య నోట వినాలని వుందని కోరారు..
అదేవిటో మీరూ చూడండి..

 
శివ తాండవ కావ్య గుణములు..
శ్రీపాద గోపాలకృష్ణ మూర్తి

సత్కావ్యమును..
పదే పదే చదివి ఆనందించడమే శోభ కానీ..,
 దానిని విశ్లేషించి ..
అందాలు చూప యత్నించడము శోభ కాదు. 

అయితే ..
శివతాండవ పునర్ముద్రణ చేయించే సందర్భములో మిత్రులు నేలనూతల  కృష్ణ మూర్తి గారు ..
కావ్య గుణ ప్రస్తావన చేయమని..
 నాకు పని పెట్టినారు. 

ఆ అవకాశాన్ని పురస్కరించౌకుని..
శివతాండవముతో..
 సంబంధము కల్పించుకున్న..
నా చాపల్యమును సహించి..
యీ నాలుగు మాటల తాత్పర్యమును..
గ్రహించండని మనవి..!!
 
తన భావాల్నీ..
ఉత్సాహాన్నీ ..
కరుణనూ..
జుగుప్సనూ ..
భయాన్నీ ..
హాసాన్నీ ..
చదువరులకు కూడా కలిగించాలని..
కవి కావ్య రచన చేస్తాడు...!!

ఏ భావాలు చదువరికి కలిగి..
వాటి ఫలితమైన ఆనందంతో..
అతని హృదయము సంతుష్టి చెందడాన్ని..
రసానందము పొందడమంటారు...!!

శివతాండవములో..
కవి ..
ఆ తాండవమును..
ఊహా రంగము మీద దర్శించిన ఆశ్చర్యాన్ని ..
మాటలతో ..
పదకవితలో ..
వర్ణిస్తే ..
మనం చదివి ఆశ్చర్య చకితుల మౌతాము ..!!

" అలలై బంగరు కలలై పగడపు బులుగుల వలె మబ్బులు విరిసినయవి " .. 

"చతురాననుడే సవదరించునట శర్వునకుత్తమ సర్ప విభూషలు.."..

"శ్రుతిబట్టుటకు భృంగమ్ములు గొంతులు సవదరించెనట.."

"సెలకన్నెలు కుచ్చెళులెల్లడ 
విచ్చల విడిగా దుసికిళ్ళాడగ 
నాకసమున పరుగిడెనట.."

" సంధ్యా బిబ్బోకవతి ..
నవకుసుంభరాగవసనము ధరించెనట .."
శివపూజకు..!! 

అర్ధేందూత్ఫుల్లకేశం..
అంటూ నంది దేవభాషలో 
నాంది నారంచించెనట..
వీటన్నిటితో ..
మన అపేక్ష కేంద్రీకృతమౌతుంది..

"తలపైని జదలేటి యలలు దాండవమాడ..
 నలల దోపుడుల గ్రొన్నెల పూవు గదలాడ.."



శివుడు ఆడనారంభించేటప్పటికి ..
మనకి వేరు ధ్యాస ఉండదు..
బుసలు గొని.. తలచుట్టు ..బారాడు భుజగములు ..

సాంధ్యకిమ్మీర ప్రభలు గూడే తనువూ.. 

యెముక పేరుల మర్మరమూ ..

బింబాధరంబు గదంబించు తాంబూలమూ 

పరుపులై పడు.. కల్ప పాద పంబుల పూలూ 


వెన్నెలలు..
పల పలని చిలికించినట్లు..

తెలిబూది పూత తెట్టలు గట్టినట్లు..


మంచు గుప్పలు గూర్చినట్లూ..
 
ఆడే..

శివుడూ కళ్ళకు కట్టే సరికి 
సద్యః పనిర్వృతి కలుగు తుంది 

ఆవేశముతో అవి అల్లే ..
తీగలతో పాకి ..
మొగిలిపూల తావులతో విహరించి ..
తొలుకారు మెఋపులతో దోబూచులాడి ..
అచ్చెరువు రూపుగొనినట్లు నిలుస్తాము. 

ఘల్లు ఘల్లుమని ..
కాళ్ళ చిలిపి గజ్జెలు మ్రొగుతూనే వుంటాయి. 
కంఠహారాళి కదలి పోతూనే వుంటుంది. 
మనౌ లెక్కేమిటి.. ??
పరవశత్వమున శ్రీ పతియే చెమరుస్తాడు..
 
శివుడు 
లోకేశ్వరుడు..
విశ్వేశ్వరుడు..
సర్వేశ్వరుడు..

ఆయన నాట్యము 
నాట్యమునకే పరాకాష్ట..

తలపైన జదలేటి యలలు ..


మూడవకంటి కటిక నిప్పులు ..


మర్మరము సేయు యెముక పేరులు ..


పులితోలు హ్మొబట్టు..


క్రొన్నాగు మొలకట్టు..


బిరుదాడు పదకింకణులు..
నటరాజు ఆహార్యము...!!

అంగ ప్రత్యంగ ఉపాంగ చలనము 
తారహారముల కదలాట..
సుందర మంజీర కింకిణులూ ..
కుండల విలాసమూ..
చంచల హస్తాబినయమూ ..
నృత్తనృత్య తాండవ గతులూ ..
ఆయన ఆంగికము ..

జిగ జిగలాడే నక్షత్ర కలాపము ..

ఫక్కున నవ్వు కైలాస శిఖరములు..

ధిమి ..ధిమి ..ధ్వనులూరు.. గిరిగర్భములూ..

నాట్యములు వెలయించు నదులూ..

జలదాంగనలై వచ్చిన వియచ్చర న్యలూ..

ఆయన నాట్య రంగ ప్రసాధనము. 

షడ్జద్వయము నందించు..
వేణు మయూరములూ..


పంచమ మాలపించు పికమూ..
నిషాదమును తరుము..
 వెనకయ్య భృం హితమూ 
 ఆ నాట్యములోని స్వరనాదములు..

గంధర్వులు ..
అచ్చరలు ..
కిన్నరులూ ..
నిర్ఝరులూ..
దిక్పాలకులూ..
మునులూ..
శరజన్ముదూ ..
విఘ్నేశ్వరుడు ..
అమ్మవారు ..
బ్రహ్మ..
సరస్వతి..
శ్రీపతి ..
లక్ష్మి ..
చంద్రుడు..
సర్వ లోకాలూ ..
ఆ మహా నాట్యానికి ప్రేక్షకులు.. 

కవి గారి వ్యుత్పత్తి ..
తీర్చిన ఈ శివ తాండవములో
 పై సమ్మర్థము పూర్తిగా నిండుగా కాన వస్తుంది..
 
నారాయణాచార్యులు గారు ..
విజయ నగరాస్థాన విద్వద్వరేణ్యులు... 
తాతా చార్యుల వంశములోని వారు..
విజయ నగర సారస్వత విభూతి ..
వీరి రచనలో అక్కడక్కడ మెరుస్తూ..
ఇంపు గొలుపుతుంది. 

ఆంధ్ర వాఙయానికి ..
అభిసాప రూప మైన చంపూ పధ్ధతిని వీడి ..
ఈయన తెలుగు జిగిని చక్కగా వెలయించగల..
పద ఛందస్సును స్వీకరించుట..
ఈయన చేతన్యమును ప్రకాశింపజేయు దీపము.
 

శివతాండవమును విన్న తర్వాత..
వీరి నోట కృష్ణ లీలలు వినాలని వున్నది..నాకు ..
మీకూ లేదూ..??
మరొకమారు వినండి 
శివతాండవము.

శ్రీపాద గోపాల
కృష్ణ మూర్తి
19-7-1961

1 మార్చి, 2012

పుట్టపర్తి నారాయణాచార్యుల అవంతీ సుందరి దివి కేగి పోయింది..



అమ్మ 1983 లో పోయింది..
దాంతో అయ్య మనసు ..జీవితం..

ఖాళీగా అయిపోయాయి..
 

సీతమ్మ వారి అగ్నిప్రవేశం తరువాత..
రామ చంద్రుడు వుండలేనట్లు..
ఎప్పుడూ ఏదో వెలితి..
ఆశాంతి..
 

కోట్లకు కోట్లు జపం..
పదమూడు సంవత్సరాల తులసీ మధనం..
విద్యార్థి దశలోనే ముగించిన గాయత్రి..
సాహిత్య ..సంగీత ..నాట్య ..కళలలోనూ సాధన..

దేన్నో అన్వేషిస్తూ..
పదునాల్గు భాషల్లోనూ వెదుకులాట..
 

ఇంకేం చేయాలి..
ఇంకా ఏదో చేయాలి..



ఒకవేపు ఉక్కిరి బిక్కిరి చేస్తున్న..
భక్త్యావేశాలు..
దాన్లోంచి వచ్చాయి..
ఒక పండరీ భాగవతం..
ఒక జనప్రియ రామాయణం..
ఒక పాద్యం..                                          

ఒక శ్రీనివాస ప్రబంధం..
ఒక శివతాండవం..
 



జనం..
ఆహా.. ఓహో.. అన్నారు..
అయ్య లోని జీవుడు తృప్తి చెందలేదు..

ఎంత జటిలం ..
జీవుని వేదన..
 

ఆయనకు కావలసినవి ..
మెప్పులు కాదు..సత్కారాలు కావు..
వాటినుంచే నడచి వచ్చినా.
దృష్టి వేనిపైనా.. నిలవలేదు..
 

అన్నిటి వెనకా నిలిచిందొక నేస్తం..
భగవంతునికీ ..మనకీ ..

దూరాన్ని కొలుద్దాం రా.. అన్నాడు..
సరే పదమంది..ఆమె
 

అన్నిటా సమ ఉజ్జీ..
సమ ఉజ్జీతో ఆట..

భలే పసందుగా ఉంటుంది..
 

తులసీ రామాయణంలో ..
భక్తి ప్రవాహంలో మునకలేస్తూ..
ఆ అనుభవాన్ని వివరించాలని వెళ్తే..
వాల్మీకి రామాయణంలోని రాముణ్ణి ..

దర్శనం గావించింది..
 

ఔరా .. అనుకున్నాడు అయ్య..
 

పంచకావ్యాలూ ..
పురాణాలూ..
గ్రంధాలలో ..
ఒకరి భావాలు ఒకరు పంచుకున్నారు..
 

హిమాలయాలకు వెళతాను..
ఆత్మార్పణ చేస్తాను..
సాధు సంతులను కలుస్తాను..
ఈ అశాంతిని చేదిస్తాను..
అనుకుని వెళ్ళారు అయ్య..
ఓపికగా ఎదురు చూసింది..
 

ఇంట్లోనూ నీ మనసే ..
అక్కడా నీ మనసే..
వెర్రివాడా...
అనుకుంది అమ్మ..
 

తిరిగి..
తిరిగి.. 
తేలిక పడ్డ మనసుతో ..
అయ్య తిరిగి వచ్చారు అమ్మ దగ్గరే..
అమ్మ చిరునవ్వు నవ్వింది..
 

సాహిత్య సరస్వతిని సృష్టించసాగారు.. అయ్య..
అక్షర మక్షయమై.. 

మళ్ళీ అమ్మే నిలిచింది ..అమ్మ..
 

అయ్య పూనిక అమ్మ..
అయ్య ధైర్యం అమ్మ
అయ్య మనో బలం అమ్మ..
 

ఇప్పుడు అమ్మ ..
మనసులో ఉంది..
బయటలేదు..
 

ఏ జన్మ ఋణానుబంధమో..
ఈ మితృత్వం..
ఆ నేస్తం..
తన స్టేషనులో దిగిపోయింది ..

మాట మాత్రమైనా చెప్పకుండానే..
 

అయ్య ఇప్పుడు యేం చేయాలి..??
తన రాబోయే మజిలీ యేమిటి..??
తన ప్రయాణం ఎన్నడు ముగుస్తుంది..??

ఈ జీవిత కాలంలో నడచిన నడక..

సరైనదేనా..??
అంతర్ముఖుడయ్యాడు అయ్య..


                                   ***

అయ్య ఎప్పుడూ టి వి చూడరు..
అమ్మ నిష్క్రమణ తరువాత ..

అప్పుడప్పుడూ చూసేవారు..
 

ఓ రోజు..
చిత్రలహరి..
 


ఇది తొలి రాత్రి..
రాత్రి కదలని రాత్రి..


నీవు నాకు ..
నేను నీకు..
చెప్పుకున్న కథల రాత్రి ..

ఊర్వశి రావే ..
ప్రేయసి రావే..



ఆ రాగంలోని తడి..
యే గాయాన్ని తడిమిందో..
ఆ గాయం ..
యే బాధను స్రవించిందో..


పాట బావుంది..
అనేసి లేచి వెళ్ళి పోయారు అయ్య..