అమ్మ 1983 లో పోయింది..
దాంతో అయ్య మనసు ..జీవితం..
ఖాళీగా అయిపోయాయి..
సీతమ్మ వారి అగ్నిప్రవేశం తరువాత..
రామ చంద్రుడు వుండలేనట్లు..
ఎప్పుడూ ఏదో వెలితి..
ఆశాంతి..
కోట్లకు కోట్లు జపం..
పదమూడు సంవత్సరాల తులసీ మధనం..
విద్యార్థి దశలోనే ముగించిన గాయత్రి..
సాహిత్య ..సంగీత ..నాట్య ..కళలలోనూ సాధన..
దేన్నో అన్వేషిస్తూ..
పదునాల్గు భాషల్లోనూ వెదుకులాట..
ఇంకేం చేయాలి..
ఇంకా ఏదో చేయాలి..
ఒకవేపు ఉక్కిరి బిక్కిరి చేస్తున్న..
భక్త్యావేశాలు..
దాన్లోంచి వచ్చాయి..
ఒక పండరీ భాగవతం..
ఒక జనప్రియ రామాయణం..
ఒక పాద్యం..
ఒక శ్రీనివాస ప్రబంధం..
ఒక శివతాండవం..
జనం..
ఆహా.. ఓహో.. అన్నారు..
అయ్య లోని జీవుడు తృప్తి చెందలేదు..
ఎంత జటిలం ..
జీవుని వేదన..
ఆయనకు కావలసినవి ..
మెప్పులు కాదు..సత్కారాలు కావు..
వాటినుంచే నడచి వచ్చినా.
దృష్టి వేనిపైనా.. నిలవలేదు..
అన్నిటి వెనకా నిలిచిందొక నేస్తం..
భగవంతునికీ ..మనకీ ..
దూరాన్ని కొలుద్దాం రా.. అన్నాడు..
సరే పదమంది..ఆమె
అన్నిటా సమ ఉజ్జీ..
సమ ఉజ్జీతో ఆట..
భలే పసందుగా ఉంటుంది..
తులసీ రామాయణంలో ..
భక్తి ప్రవాహంలో మునకలేస్తూ..
ఆ అనుభవాన్ని వివరించాలని వెళ్తే..
వాల్మీకి రామాయణంలోని రాముణ్ణి ..
దర్శనం గావించింది..
ఔరా .. అనుకున్నాడు అయ్య..
పంచకావ్యాలూ ..
పురాణాలూ..
గ్రంధాలలో ..
ఒకరి భావాలు ఒకరు పంచుకున్నారు..
హిమాలయాలకు వెళతాను..
ఆత్మార్పణ చేస్తాను..
సాధు సంతులను కలుస్తాను..
ఈ అశాంతిని చేదిస్తాను..
అనుకుని వెళ్ళారు అయ్య..
ఓపికగా ఎదురు చూసింది..
ఇంట్లోనూ నీ మనసే ..
అక్కడా నీ మనసే..
వెర్రివాడా...
అనుకుంది అమ్మ..
తిరిగి..
తిరిగి..
తేలిక పడ్డ మనసుతో ..
అయ్య తిరిగి వచ్చారు అమ్మ దగ్గరే..
అమ్మ చిరునవ్వు నవ్వింది..
సాహిత్య సరస్వతిని సృష్టించసాగారు.. అయ్య..
అక్షర మక్షయమై..
మళ్ళీ అమ్మే నిలిచింది ..అమ్మ..
అయ్య పూనిక అమ్మ..
అయ్య ధైర్యం అమ్మ
అయ్య మనో బలం అమ్మ..
ఇప్పుడు అమ్మ ..
మనసులో ఉంది..
బయటలేదు..
ఏ జన్మ ఋణానుబంధమో..
ఈ మితృత్వం..
ఆ నేస్తం..
తన స్టేషనులో దిగిపోయింది ..
మాట మాత్రమైనా చెప్పకుండానే..
అయ్య ఇప్పుడు యేం చేయాలి..??
తన రాబోయే మజిలీ యేమిటి..??
తన ప్రయాణం ఎన్నడు ముగుస్తుంది..??
ఈ జీవిత కాలంలో నడచిన నడక..
సరైనదేనా..??
అంతర్ముఖుడయ్యాడు అయ్య..
***
అయ్య ఎప్పుడూ టి వి చూడరు..
అమ్మ నిష్క్రమణ తరువాత ..
అప్పుడప్పుడూ చూసేవారు..
ఓ రోజు..
చిత్రలహరి..
రాత్రి కదలని రాత్రి..
నీవు నాకు ..
నేను నీకు..
చెప్పుకున్న కథల రాత్రి ..
ఊర్వశి రావే ..
ప్రేయసి రావే..
ఆ రాగంలోని తడి..
యే గాయాన్ని తడిమిందో..
ఆ గాయం ..
యే బాధను స్రవించిందో..
పాట బావుంది..
అనేసి లేచి వెళ్ళి పోయారు అయ్య..
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి