28 ఆగ, 2012

సరస్వతీపుత్రునికి నా ఆశీస్సు - శ్రీ ఆచంట జానకిరాం




“జీవితం ఒక రన్నింగ్‌ రేస్‌. 
అందరికీ మొదటి, రెండు, స్థానాలు రావు కదా. 
 అందుచేత ఫలమెలా పరిణమించినా 
మనం పట్టించుకోకూడదు. 
ఏది చేసినా బాగా మనస్సు పెట్టి చెయ్యాలి. 
మనిషికీ మనిషికీ మరి కాస్త అన్యోన్యత ఉండాలి…’


ఔను కదూ..
పరిగెట్టిన వాళ్ళందరినీ మొదటి బహుమతి వరించదుకదా..
అలా పరుగెడుతూనే ఉండాలి..
మన స్పూర్తి చూసి గెలిచిన వాళ్ళూ 
ఓడిన వాళ్ళూ ఉత్తేజితులవ్వాలి..

ఆచంట జానకి రాం గారి  గురించి వెతుకుతుంటే 
వారి ఫోటో దొరకలేదు.
"నా స్మృతిపధంలో.." అంటూ 
వారి జీవితంలో తారసిల్లిన 
గొప్ప వ్యక్తుల గూర్చి వ్రాసిన 
ఒక విధంగా ఆత్మావలోకనపు వివరణ  కళ్ళబడింది.


"జీవిత చరిత్ర "
అంటే జరిగిన ప్రతి సంఘటనా 
అందించాలని తాపత్రయ పడటం కాదు..
ప్రతి జీవితంలో 
ఎంతో కొంత చెత్త ఉండనే ఉంటుంది.
అవి తెలుసుకొని యేం ప్రయోజనం..
నలుగురికీ ఉపయోగకరమైనవి 
స్ఫూర్తి దాయకమైనవి కొన్నైనా చాలు
"గంగిగోవుపాలు.."
 
కొందరు తమ చరిత్రలలో ఆనాటి సామాజిక పరిస్తితులకు పెద్ద పీటవేస్తే
ఇంకొందరు మహోన్నత వ్యక్తుల 

వ్యక్తిత్వాలను మనకందిస్తారు..
 
వీరేశలింగం.. గురజాడ.. ఉన్నవ.. 
వంటి మహా  వ్యక్తుల పరిచయ  పరిమళాల 
నా స్వాదించిన  జానకిరాం గారు
 

నా స్మృతిపధంలో ..
అంటూ చెప్పడం మొదలెడితే  
చెవి కోసుకోని వారిది దౌర్భాగ్యమే.


  

మి స్టర్ గూగుల్ ఏమన్నాడంటే...

"నా స్మృతి పథంలో ..
 జానకిరాం స్వీయచరిత్ర మాత్రమే కాదు. 
కళాహృదయం ఉన్న ప్రతిమనిషి కధ అనిచెప్పవచ్చు 

సాగుతున్న జీవితయాత్రలో ఏదో సన్నివేశంలో 
మనలని మనం చూచుకొ గలుగుతాం. 

జానకిరాం 
ఆయన తిరిగిన ప్రదేశాల గురించి కాని 
అయనకు పరిచయమైన వ్యక్తులు గురించి కాని 
ఎంత విపులంగా రాశాడు. 

మనం ఆప్రదేశాలలో, 
ఆవ్యక్తులతో కలసి లీనమైన 
అనుభూతి కలుగుతుంది 

ఆయన జీవిత గమనంలో 
ఎన్నో మజిలీ లు
ఎక్కడో  ఒక చోట గాని 
ఏదో ఒక మజిలీలొ గాని 
మనం కూడా కలుస్తాం 

మరో రకంగా ఈ పుస్తకం 
ఒక గైడ్ లాంటిది 
అని చెప్పవచ్చు

ఎంతో మంది పండితులు , కవులు ,
కళాకారులు ,గాయకులు 
ఆయన జీవితం గమనం లొ కలసి ప్రయాణిస్తారు 

వారి అనుభవాలు అన్ని 
మనకు అనుభుతులు గా మిగిలి పొతాయి.."


"మీ అనుభవాన్ని ఎంతోభద్రంగా ఇన్నేళ్ళు 
ఆప్టర్ ఈవెంట్స్ వల్ల ఇన్ ప్లూయెన్సూ కాకుండా ఇసొలేట్ చేసి స్టెరిలైజ్ చేసి, దాచిఉంచి ,
ఈనాడు ప్రొడ్యూస్ చేయటం 
ఇన్నేళ్ళ తరువాత , 
ఇప్పటి జానకీరాం కాక, 
ఆనాటి జానకిరాం, 
ఆనాడే వీటిని రాసి పెట్టుకున్నాడా అనిపించింది . 
ఆ ఒక్క గుణం చాలు, 
అట్లాంటి రాతల్ని ప్యూర్ అర్ట్ గా మార్చటానికి.."

అని చలం గారు అన్నారట..  


జానకిరాం గారు పుట్టపర్తి వారిని కలవాలని 

ఎంతో ప్రయత్నించారు.
"నేను రెండు మూడు పర్యాయములు 
ఆయనను వెతుక్కుంటూ కడప వెళ్ళాను 
ప్రత్యేకించి ఆ పని మీదనే వెళ్ళాను. 

కాని అచ్చటి నా స్నేహితులు నాతో అన్నారు 
"ఇప్పుడు మీకు ఆయన దొరకరు ..
సాయంత్రం లైబ్రరీకి వస్తే..
మీ అదృష్టం బాగుంటే..
అప్పుడు వారిని కలుసుకోవచ్చు .."


సాహితీ విస్మే రం "లోని దీ  వ్యాసం 

               "సరస్వతీపుత్రునికి నా ఆశీస్సు.."

శ్రీ ఆచంట జానకిరాం 

శ్రీ నారాయణాచార్యుల వారికంటే 
నేను వయస్సున కొంచెము పెద్దవాడను కనుక 
వారి ఈ షష్టిపూర్తి సందర్భములో
 'వేయేండ్లు వర్థిల్లూ '
అని నేను ఆశీర్వదింపవచ్చును 

వేయేండ్లు అని ఎందుకంటున్నానంటే 
"సరస్వతీపుత్రుడు.."
 అనే సార్థక నామమును పొందినవారు 
ఇంతవరకూ చేసిన బాషాసేవ కంటే 
ఇంకా ఇంకా ఎంతో చేయవలసి ఉన్నది. 
మనలను ఆవరించి ఉన్న 
గాఢ తిమిరమును పారద్రోలి 
క్రొత్త వెలుగును ప్రసాదింపగల శక్తి 
కవిగా రచయితగా విమర్శకునిగా 
ఆయనయందు నిండుకొని ఉన్నవి. 
ఇవి స్వానుభవముతో చెప్పే మాటలు..

నేను రెండు మూడు పర్యాయములు 
ఆయనను వెతుక్కుంటూ కడప వెళ్ళాను 
ప్రత్యేకించి ఆ పని మీదనే వెళ్ళాను. 

కాని అచ్చటి నా స్నేహితులు నాతో అన్నారు 
"ఇప్పుడు మీకు ఆయన దొరకరు ..
సాయంత్రం లైబ్రరీకి వస్తే..
మీ అదృష్టం బాగుంటే..
అప్పుడు వారిని కలుసుకోవచ్చు ..

కాని మీతో ఒక సంగతి చెప్పాలి ..
ఆయన మితభాషి ..
మీతో ఎక్కువసేపు మాట్లాడక పోవచ్చును ..
మీరు నిరుత్సాహ పడవద్దు.." అన్నారు 

అప్పటి నాదృష్టం బాగోలేక 
నేను కడపలో ఉన్న మూడు రోజులూ 
ఆయన లైబ్రరీకి రాలేదు. 

ఏదో ఊరు 
భీమవరం కాబోలు సన్మానానికి వెళ్ళారట. 
ఆ సంగతి నా స్నేహితులకి తెలియదు. 

కాని కొన్ని ఏండ్ల తరువాత 
నేను భీమవరము వెళ్ళీనప్పుడు 
ఆ ఊరిలో ఉన్న నా స్నేహితులు 
అచ్చటి వారి కార్యక్రమ విశేషములు గురించి 
వివరముగా చెప్పి 
ఆయన వసుచరిత్రా విమర్శన పుస్తకం 
ఒక ప్రతి నాకు ఇచ్చారు. 
ఆ పుస్తకాన్ని ఇంకా పదిలంగా దాచుకున్నాను.

ఆ మధ్య కొన్నేళ్ళ క్రితం తిరుపతిలో 
వసు చరిత్రను గురించి మాట్లాడుతూ 
ఏదో ఒక చోట త్రోవతప్పి 
మరేవో విషయాలను గురించి 
చెప్పడం మొదలు పెట్టారు. 

సభలో ఉన్నవారికి తెలుసు 
ఆయన అసలు విషయాన్ని గురించి 
మాట్లాడటము లేదని. 

కాని ఎన్నెన్ని క్రొత్త విషయాలు చెప్పారు. 
అందరూ ఎంతో శ్రధ్ధతో విన్నారు. 
తరువాత ఒక అరగంట అయాక 
అసలు విషయానికి వచ్చి 
ఇంకో అరగంటసేపు ఆ ప్రబంధములోని 
అందచందాలను వివరించారు. 

ఆనాటి వారి ఉపన్యాసం  
ఇప్పటికీ జ్ఞాపకము చేసుకుంటూ ఉంటాను నేను
శ్రీ నారాయణాచార్యులు చూడటానికి 
మనతో అంత చనువుగా ఉండరేమో అనిపిస్తుంది 
కాని పరిచయమయ్యాక 
చాలా చక్కగా ఎన్నో విషయాలను గురించి 
ఎంతో  ఆసక్తితో మాట్లాడుతారు. 
ఇతరులలా గాక 
మనము చెప్పేది శ్రధ్ధగా వింటారు. 


వారికి ఎల్లా కలిగిందో ఆ భావ ము 
'నేను చాలా సుకుమారుడ ననీ ..
సౌందర్యోపాసకుడననీ..' 
ఒక సభలో నన్ను గురించి 
సభవారికి పరిచయం చేస్తూ ఆయన అన్నారు. 

"ఈయనకు గులాబీపువ్వులంటే చా లా ఇష్టము...
కాని గులాబీ పొద చుట్టు ప్రదక్షిణము చేసి. .
పూవులతో విలసిల్లుతున్న ఒక కొమ్మను 
అతి సుతారంగా తనవేపు వంచి ..
ఒకే ఒక పువ్వును కోస్తారు. 
అలా కోస్తూ అంటారు..
"నీకు నొప్పి కలిగిస్తున్నాను.. క్షమించు..!" అని 
ఇంతకూ ఆ పువ్వు తనకోసం కాదు..
 నా వంటి వానికి కానుకగా ఇయ్యడానికి.

ఆయన సంభాషణలో 
మంచి చమత్కారం ఉంటుంది. 
ఒకానొక కవి సమ్మేళనములో 
ఆహ్వాన సంఘాధ్యక్షుడు 
తన పాండిత్య ప్రకర్షణ కోసం కాబోలు 
"కవి వృషభులు అందరూ వేదిక నలంకరించి ఉన్నారు.." అన్నారు

 శ్రీ నారాయణా చార్యులు ప్రసంగిస్తూ 
తొలి పలుకుగా ఒక చురక వేసారు. 
"అధ్యక్షులు మమ్మల్ని అందరినీ 
ఆబోతులు క్రింద జమ కట్టారు 
ఆ గౌరవము నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తాము." అని

కొన్నేండ్ల క్రితము 
ఎన్నో ఏండ్ల క్రితము 
బొంబాయి నుంచీ వెలువడే ఇలస్ట్రేట్డ్ వీక్లీ లో 
"నేటి తెలుగు సాహిత్యము"ను గురించి 
నేను ఒక పెద్ద వ్యాసము వ్రాసాను 

అందులో 
శివతాండవ కావ్యమును గురించి కొన్ని పేరాలు రాస్తూ కొన్ని ఘట్టాలను వివరించాను 

కొన్ని భాగములను 
నా నేర్చిన మేర ఇంగ్లేషులోకి అనువదించాను కూడా. శివతాండవము చదువుతూ 
మరీ బాగున్నవి అనుకున్న పంక్తుల ప్రక్కన
 ఎర్ర పెన్సిల్ తో గుర్తు పెట్టే వాడను. 

గ్రంధము పూర్తిగా చదివాక..
ఎర్ర పెన్సిల్ గుర్తుల పంక్తులే ..
ఎక్కువగా కనుపించాయి.

శివతాండవము 
ఆచంద్రతారార్కము 
సాహితీ ప్రపంచమున వెలుగు ధ్రువతార 

ఇది కవనము కాదు ఒక ఆవేశము
(ఆవేశానికి ఇంగ్లేషులో ఇన్స్పిరేషన్) 
అంటారు అనుకుంటాను. 

తాండవాన్ని ప్రత్యక్షము చేసుకొని 
సొంపైన మాటలతో 
ఇంపైన వర్ణనలతో 
మనకు వర్ణనాతీతమైన ఆనందాన్ని కలుగ జేస్తారు 

నేను అనేక సార్లు అనుకుంటూ ఉంటాను 
వీరు ప్రదోషకాలమున 
శివతాండవాన్ని కళ్ళారా చూచి ఉంటారు అని 
ఇక మాటల ఎన్నిక 
వర్ణనల కూర్పు 
మనలను పులకాంకితులను జేస్తవి.

ఈ కాలపు ఎం ఏ తరగతి విద్యార్థులను సైతము "శివతాండవము చదివారా ../"
అని ప్రశ్నిస్తే ..వారిచ్చే సమాధానము 
"చదువ ప్రయత్నించాను.. 
కాని ఏమీ అర్థం కాలేదండీ.." అంటారు. 

అటువంటప్పుడు నాకు పట్టరాని కోపమూ 
నేటి మన తెలుగు జాతి ఎడల జాలీ కలుగుతుంది. వీరికంటే జంతువులే నయమనిపిస్తుంది కూడా.


"అల మృగములు గ
న్నుల భాష్పమ్ములు
విడిచెడు నెందుకు..?
విశ్వేశ్వరునకు
నడుగులు గడుగుట
కై పాద్యంబో..?

గుస గుసమని యీ
కిసలయములు స
మ్మదపూరముగా
మాటలాడునేదో..?
యేమున్నది.. లోకేశ్వరు
నాట్యమే...!!"

ఓహో హో హో
యూహాతీతం
బీయానందం
బిలాతలంబున.."

చెరుకు పానకంలా తీయనైన ఈ మాటలు 
ఎందుకు అర్థం కావు.. హృదయమున్న వారికి..?
ఈ కావ్యమంతా 
ఏరి కూర్చిన  చక్కని పదాలతో 
మధురమైన భావాలతో 

ఆశ్చర్యపరచే ఊహతో నిండి ఉంటుంది. 


నేననుకుంటాను..
కవి ఈ కావ్యాన్నంతా 
ఒక్క రాత్రిలోనే కలగన్నారని ..

ఈ మాటల ధోరణి చూడండి..

"తలపైని చదలేటి యలలు తాండవమాడ...
నలల త్రోపుల గ్రొన్నెరపూవు గదలాడ..."

ఎంత చక్కటి రూపకల్పన..
మరొకచోట ఈ మాటలు..

"పలపలని వెన్నెలలు జిలికించెడు విధాన ..
మనసులో సంతసము జారెడు విధాన.."

ఇంకొక ఘట్టములో..

"తరగలను చిరుగాలి పొరలు వేచినయట్లు..
చిరుగాలిలో దమ్మి ..విరులు గదలినయట్లు..
విరులలో నునుదావి.. తెరలు వేచినయట్లు..
తెరలపై చిత్రాలు ..పరిఢవించినయట్లు.."

అలా సాగిపోయే కవితా ధార..
మనలను మునుపెరుగని  
దూ రతీరాలకు తీసుకుపోతుంది. 

అక్కడ అద్భుతరసముతో 
మిళితమైన శాంతి లభిస్తుంది.

ఇవి  మాటలు కాదు ..
రసగుళికలు చూడండి..

"ప్రతి తారకయు విచ్చి.. ప్రత్యణువు బులకించి..
శితికంఠునకు నపుడు సెల్లించినది సేవ..
యానంద సాగరం బంతటను గలసికొన..
మీనములు దిమిఘటను మేదినీ జీవములు
బ్రతిప్రాణి హృదయమ్ము వల్లకీ వల్లరిగ
మతిమఱచి పాడినది మధుర సంగీతమ్ము..
జగమెల్ల భావంబె ..సడియెల్ల రాగంబె..
జగతియే యొక నాట్య సమ్రంభమునుగాగ..

నాడెనమ్మా శివుడు..!!
పాడెనమ్మా భవుడు..!!

ఇంకా కొన్ని వర్ణనలు ఎప్పటికీ మరపురానివి

"కనుదోయి సైగలకు.. గనుబొమలె బదులొసగ..
మనసులో నూహలకు.. దనువె బులకలు దాల్ప..

                                    ***
"ఇలయెల్ల చెలువు రూపెత్తి నిల్చినయ ట్లు
గలలెల్ల నిజములై గానుపించినయట్టు..
                          ***
తానె తాండవమౌనొ ..తాండవమె తానౌనొ..


కొన్నేళ్ళక్రితం నేను చిదంబరం వెళ్ళాను 
ఆలయపు ముఖ ద్వారపు తలుపులపైన 
పరమ శివుని నాట్య భంగిమలు
శాస్త్ర రీత్యా చెక్కబడివున్నాయి 

ఈ విషయాల గురించి బాగుగా తెలిసిన ఒకరు 
మాకు ప్రతి అంగుళౌ మేర విశదపరిచారు. 
ఎంతో నేత్రానందకరంగా ఉన్నవి.
కాని వానిలో దేనిలోనూ లేని చైతన్యం 
మన సరస్వతీపుత్రుని మాటలలో కనుపిస్తుంది నాకు.
 
మద్రాస్ కు సమీపాన 
తిరువెలంగాడు అనే ఊరు ఉన్నది 
"కాడు" అంటే ఊరిపేరుగా వాడతారు వారు.
" కాడు" అంటే మరుభూమి అని కూడా వారికి తెలుసు 

ఆ ఊరిలో వున్న 
ఒక ముసలి బ్రాహ్మడు నాతో చెప్పాడు 
ఒకసారి ఇల్లా 
" ఈ కాలం వాళ్ళు నమ్మరు కాని..
 అమినోల అనబడే పెద్ద బయలు మీదనే..
 శివుడు నాట్యమాడాడు..
 అందుకే ఈ పేరు వచ్చినది ఈ ఊరికి ..!"అని
 
నేను అనుకుంటూ ఉంటాను..
మన నారాయణాచార్యులు 
ఏ జన్మలోనో తిరువెలంగాడులో 
ఆ శివతాండవమును కనులారా తిలకించారు అని అటువంటి అనుభవమును పొందినవారికి 
ఇక మాటల కేమి కొదువ..?
 
నేను సాధారణంగా పురాణ శ్రవణం చేయను 
అంతసేపు కూర్చోలేనేమోనని భ్రమ. 

కాని ఇటీవల నేను కడప వెళ్ళినప్పుడు 
శ్రీ నారాయణాచార్యులు ఒక రాత్రి తొమ్మిది గంటలకు 
ఒక సమావేశమున చేస్తూన్న 
పురాణ పఠనమును వినడానికి వెళ్ళాను 

ఒకవైపు 
బారులు బారులుగా కూర్చున్న స్త్రీలతోనూ 
ఒకవైపు పురుషులతోనూ 
కిటకిటలాడుతోంది ఆ సభ 

నేను ఆ సభకు వెళ్ళగానే నన్ను గుర్తించి 
కొంచెం ఆశ్చర్య పడ్డారనుకొంటాను సరస్వతీపుత్రులు తరువాత "మీరూ వచ్చారే.."
 అంటూ నన్ను ఎంతో ఆదరించి 
తమ సన్నిధిని కూర్చోనియమించారు. 

ఆనాటి నా అనుభవము 
ఎప్పటికీ మరువరానిది. 
అప్పుడు వారు ..
శ్రీమద్రామాయణమును పఠిస్తున్నారనుకుంటాను. 

మూడే మూడు పద్యాలు సందర్భానుసారంగా మూలమునుండీ శ్లోకాలను వినిపిస్తూ చెప్పారు 
మధ్య మధ్య ఎన్నో వ్యాఖ్యానాలు
 ప్రజల నిత్య జీవితమునకు సంబంధించిన 
ఎన్నో విషయాలు గంటన్నర సేపు చెప్పారు. 

ఇదివరకు నేను ఏసభలోనూ 
అంతసేపు కదలక మెదలక కూర్చోలేదు.

శ్రీవారు ప్రచురించిన గ్రంధాలుగాక 
ప్రచురణకు సిధ్ధమైన గ్రంధాలు కూడా వున్నాయి 
వానిని కూడా ప్రచురించవలసిన బాధ్యత 
అందరిపైనా వున్నది 

ప్రత్యేకంగా 
ఇటువంటి సత్కార్యములు నిర్వహించడానికే
 ప్రభుత్వ ఆదరణను పొందుతూ వున్న 
కొన్ని సంస్థలు ఉన్నాయి హైదరాబాద్లో 

అచిరకాలంలో 
ఆగ్రంధములన్నీ అచ్చై 
పాఠకుల చేతులనలంకరిస్తాయని 
నా ఆశ.. విశ్వాసమూను...
 
 సుమారు పదేండ్లక్రితము 
శ్రీ నారాయణాచార్యులవారు నాకు 
తమ శివతాండవము ప్రతిని ప్రసాదించారు. ఆసందర్భములో ..
పుస్తకం మొదటిపేజీ మీద వ్రాసిన మాటలు 
ఇప్పుడు మరల వారికందిస్తున్నాను. 
ఎన్నో రెట్లు ఇనుమడించిన భక్తితో..
 
"స్నేహశీలి అమృతహృదయుడు ప్రణయోపహారము
 
శ్రీ సరస్వతీపుత్రులు సంకల్పించిన 
ప్రతి సంకల్పమూ దిగ్విజమంగా నెరవేరాలి. 
వారి కీర్తి శత సహస్ర విధాల వర్ధిల్లాలి. 

                                  శుభం..
                          ఆచంట జానకిరాం

26 ఆగ, 2012

పొస్ట్ మాన్ భక్తి





నెల్లూరు టౌన్ హాల్..
1990 పుట్టపర్తి వారి సంస్మరణ సభ..
బెజవాడ గోపాలరెడ్డి అధ్యక్షులు
కె.పి.నారాయణరావ్ తదితరులు మాట్లాడారు. 
ఆయన జడ్జి...
పుట్టపర్తి వారి సాహిత్యావలోకనం జరిగింది..

ఒకరు శివతాండవం అత్యుత్తమమైనదన్నారు.

కాదు కాదు..
జనప్రియ రామాయణం ..
పుట్టపర్తి వారి కీర్తి కిరీటంలో కలికితురాయన్నారు. 

ఇంకొకరు..
మరొకరు వారి వారి తొలి రచన పెనుగొండలక్ష్మి
వారి పాఠ్యపుస్తకంగా రావటం అద్భుతమని 

ఇది యే కవి జీవితంలోనూ ..
జరగని సన్నివేశమని వక్కాణించారు..

ఇంతలో..
ఓ గొంతు వినిపించింది  కిందనుంచీ
"నేనూ పుట్టపర్తి వారి గురించి మాట్లాడతాను.."
అందరూ అటువేపు చూసారు.
ఓ వ్యక్తి వేదికపైకి వచ్చాడు..

అతను రిటైర్డ్ పోస్ట్ మాన్
కడప మోచంపేటలోనే 
అతను ఉత్తరాలు పంచిపెట్టేవాడు.
పుట్టపర్తి వారిని రోజూ దాదాపు చూసేవాడు.
వారికి వచ్చిన ఉత్తరాలు ఇచ్చి ..
కాసేపు కూచునేవాడు.
వారు ఉత్తరాలలోని సారాంశాన్ని 
అతనికి వినిపించేవారు వారు
నమస్కరించుకుని వెళ్ళేవాడు.

అతను వేదికపైకి వచ్చి మైకు సవరించాడు.
"అతను ఎవరా..?"
"ఏం చెప్తాడా..?"
 అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

"మీ అందరికంటే ఎక్కువ 
నారాయణాచార్యులవారి గురించి నాకే  తెలుసు..
ఎలా అంటారా..?
నేను ఒక పోస్ట్ మాన్ . .
కడప నారాయణాచార్యులవారుండే మోచంపేటలోనే 
నా ఇరవైయ్యేళ్ళ డ్యూటీ..
ప్రతిరోజూ వారిని చూసే వాడిని మాట్లాడేవాడిని.
కాసేపు వారి పక్కన కూర్చుని 
నమస్కరించుకొని వెళ్ళేవాడిని

ఉత్తరాలలోని విషయాలు 
ఉత్తరం చదివి చెప్పేవారు అయ్యగారు.
అయ్యతో నాకున్నంత చనువు ఎవ్వరికీ లేదు.."
అన్నాడు అతను
అందరూ నివ్వెర పోయారు.

"అమ్మాయ్ ఇలా రా.."
అంటూ పిలిచాదు.
ఓ అమ్మాయ్ బహుశా ..
అతని కూతురనుకుంటా వేదికపైకి వచ్చింది.
"శివతాండవం చెప్పమ్మా.."
అన్నాడతను..

అంత చిన్నపిల్ల
పుస్తకం చూడకుండా..
ఎక్కడా తడబడకుండా ..
చక్కగా అత్యంత రసభరితంగా 
శివతాండవాన్ని గానం చేసింది..
సభ కరతాళ ధ్వనులతో మారుమ్రోగి పోయింది..
సభికులు ఆనంద పరవశులయ్యారు.




25 ఆగ, 2012

గురజాడ ఒక విద్యుత్తు.




"ఒపీనియన్స్  అప్పుడప్పుడూ చేంజ్ చేసుకోకపోతే పొలిటీషియన్ కానేరడోయ్.."
ఇది గురజాడ ప్రసిధ్ధి చెందిన వ్యాఖ్య..
ఇప్పటి నాయకులు 
దాన్ని అక్షరాలా పాటిస్తున్నారు
 
"ఈ సురోమని మనుషులుంటే 
దేశమేగతి బాగుపడునోయ్.."
అన్నది మరోటి
ఇ ది నాయకులు మనకు చెబుతుంటారు.
వాళ్ళు స్కాములమీద స్కాములు భోంచేస్తుంటే..
 
పాపం ..
మనుషులు అతీ గతీ లేక ఈశురోమని తయారవుతున్నారు.
అది వేరే విషయమనుకోండి..
 
"సొంత లాభము కొంత మానుక..
 పొరుగువాడికి సాయపడవోయ్.."
అన్నదీ
మనందరికీ తెలిసినా..
సొంత లాభం మానడానికి 
మనకెవరికీ ఇష్టం ఉండదు..
 
ఇక..
"కన్యాశుల్కం" 
బాల్య వివాహాలు .. వేశ్యావృత్తి లపై 
ఆ రోజుల్లో ప్రకటించిన ఓ యుద్ధం ..
 

1890ప్రాంతాల్లో రచింపబడి ..
వందల సార్లు ప్రదర్శింపబడి ..
అనేక భాషలలో అనువదింపబడిందీ నాటకం
వాడుక భాష లో రచనలు చేయటం  
చేతకాని తనం గా పరిగణించేవారు ఆ నా డు ..

గ్రాంధికం  రాజ్జమేలుతున్న రోజుల్లో 
గిడుగు రామ్మూర్తితో కలిసి 
వాడుక భాషావ్యాప్తికి కృషి చేసాడు..

అంతేకాదు..
ముత్యాలసరాలు
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ..
కన్యక ..
ఇలా ఎన్నో రచించా
డు .

రాసిలో కొద్ది అయినా 
వాసిలో కెక్కినవి ఆయన రచనలు

అందుకే ..
1915 లో ఆయన మరణించినా..
1915 తర్వాతే ఆయన జీవించడం ప్రారంభించాడని దేవులపల్లి అన్నారు.

ఆంగ్ల కవి 
 "చాసర్ వాల్మీకి వంటి వాడని" అన్నాడు గురజాడ 
ఇంగ్లీషు వారికి లేని ప్రేమ ఈ యన కెందుకని అన్నారుకొందరు  

అలానే 
వర్డ్స్ వర్త్ అన్నా ..
ఆయన ఇంగ్లీషు అభిమానం 
సారంగధర కావ్యం గా అవతరించింది  


ఈ ప్రసంగం 30.11.1959 న కడప 
రామకృష్ణ సమాజం లో పుట్టపర్తి వారు చేసినది 
తదుపతి విశా లాంద్ర వారు ప్రచురించారు .

"తెలుగులో నన్నయభట్టే ఆదికవి 
అని చాలారోజులు అనుకొనేవాళ్ళం ..
నన్నయ భారతం వంటి ప్రౌఢ రచన 
హఠాత్తుగా ఒకనాడు  ఆవిర్భవించిందంటే 
 నమ్మడం చాల కష్టం ..

ఎన్నో తరాలుగా 
ఎంతమంది విస్మృత కవుల చేతిలోనో 
తెలు గు కవిత్వం క్రమక్రమంగా 
అభివృధ్ధి చెదుతూ వచ్చి ..
నన్నయ నాటికి భారతం పరిపక్వ స్తితికి వచ్చిందనుకోవడం సమంజసం .."
అంటారు వారు ..

"నన్నయ భారతంలో..
పంప భారతం యొక్క ప్రభావం కనపడుతున్నదని కొన్ని యేండ్ల క్రిందట ..
ఆలంపూర్ సాహిత్య సభలో ..
నేను సోదాహరణంగా నిరూపించినప్పుడు..
తెలుగు భక్తులందరూ ..
నామీద విరుచుకు పడినారు.."

అనడంలో ఆయనలోని 
చారిత్రక పరిశో ధకుడు  నిర్భయంగా  తొంగి చూసాడు 

ఇందులో  
మహాకవి ..
నన్నయ కు ముం దు..
పం డి తు డు ..
క్రాంతదర్శి..
ఇలా వివిధ ముఖాలుగా 
గురజాడను స్మరించడం జరిగింది 



మహాకవి మాత్రమే కాదు 
                    మహా పురుషుడు గురజాడ..               

               అప్పారావు కవికి శ్రీ పుట్టపర్తి నివాళి.

 
శ్రీ పుట్టపర్తి వారు కడపలో ఉపన్యసించిన తేదీ          30.11.1959
విశాలాంధ్రలో ఉపన్యాస పాఠం ప్రకటించిన తేదీ 30.12.1959

 
కడప పట్టణ యువజన సంఘ అధ్వర్యాన 
నవంబర్ 30 వ తేదీన 
శ్రీ రామకృష్ణ సమాజంలో 
"గురజాడ" వర్ధంతి జరిగింది 
శ్రీ ఆర్ . రంగనాధం గారు అధ్యక్షత వహించారు 
మహాకవి శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు ఉపన్యసించారు.
"దేశమును ప్రేమించుమన్నా"
అనే గురజాడ గీతాగానంతో 
సభ ప్రారంభమైంది. 

అధ్యక్షు ని ప్రసంగం తర్వాత 
శ్రీ నారాయణాచార్యులు గారిలా ప్రసంగించారు.
 
మహాకవి గురజాడ ఒక ఉద్యమం 
ఆయన సమకాలీకులు 
ఆయననేవిధంగా భావించినా 
మనం మాత్రం ఆయనను ఒక మహాకవిగా 
ఒక మహాపురుషు ణి గా గౌరవిస్తున్నాము. 

ఆ మహనీయుని 
ఈనాడు సంస్మరించుకోవటం సముచితం
 
పది ఉపన్యాసాలకంటే యెక్కువగా 
మహాకవి వాక్కు ఒకటి 
వేల హృదయాలను కదలింపగలదు. 
భావుకుడైన కవికి అట్టి శక్తి ఉంది. 

సృజనాత్మక శక్తి లోని ఆ మెరుపును 
ఆ ఆంతరంగిక జ్యోతిని గమనించి వినియోగించుకోలేకపోతే 
సామాజిక ఉద్యమాలు 
తమ ప్రయోజనాలను నెరవేర్చలేవు 

ఆనాటి సామాజిక ఉద్యమాలకు 
చేయూతనిచ్చిన గురజాడ
ఒక విద్యుత్తు. 
ఆయన మహాకవి మాత్రమే కాదు 
ఒక మహాపురుషుడు.

సాహిత్య కారులలో చాలమందికి 
"ఆత్మ స్తుతి"
ఒక చాపల్యంగా వుంటుంది. 
అది కొంతవరకు అవసరమేమో కాని 
దాని పాలు మితిమీరితే 
దురభిమానం అవుతుంది 
దురభిమానం విమర్శకులలో 
ఎక్కువగా ఉంటుంది. 
గురజాడమీద కూడ 
ఆ కాలంలో నిందా పూర్వకమైన 
దురుసు విమర్శలు అనేకం వచ్చాయి. 

కాని ..
ఆయన అన్నిటినీ శాంతంగా పరిశీలించి 
సరసంగా సమధానం చెప్పారు 
గొప్పవాళ్ళ లక్షణం అది.

అంతకంటే గొప్పది 
ఆయన సాహసం 
ఎండుగడ్డి వంటి శుష్క పాండిత్యమే 
కవిత్వం అనుకొనే రోజుల్లో 
అంతమంది కవి "వృషభులనూ.."
"కవి శరభులనూ.." ధిక్కరించి 
సంప్రదాయానికి ఎదురు తిరిగి నిలబడే 
సాహసం సామాన్యమైనది కాదు. 

ఆనాటి  పండితులు కూడా 
సామాన్యులేమీ కాదు. 
దిగ్దంతులవంటివాళ్ళు. 
శతావధానులు 

వాళ్ళందరూ వ్యావహారిక భాషకు వ్యతిరేకులు 
వా ళ్ళ గ్రాంధిక భాషావాదాన్ని 
చీల్చి చెండాడిన పిడుగు వంటి గిడుగు 
లక్షణ కర్త కాగా 
ఆయన లక్షణాలకు లక్ష్యంగా 
గురజాడ సాహిత్య సృష్టి సాగించినారు.
 
ఆనాటి సంఘ సంస్కరణోద్యమానికి 
వీరేశలింగం ఒక మహానేత . 
ఆయనకు అన్ని విధాలా 
అండదండగా వుండినవాడు గురజాడ. 

అయినా ..
కందుకూరిని కూడా విమర్శించడానికి 
వెనుదీయని సత్యప్రియుడు గురజాడ. 
శ్రీ కందుకూరి రచనల్లోని శృంగారాన్ని 
నిస్సంకోచంగా ఆయన విమర్శించారు.
 
క్రాంతదర్శి..
 
కవి క్రాంతదర్శి. 
నేటి పరిస్తితులను గమనించి 
రేపటికి సూచనలు చేయడమే క్రాంతదర్శి పని. అటువంటిది  గురజాడలో వుంది. 
ఒకనాటి అతివాదులు 
మరికొన్నాళ్ళకు మితవాదులు కావడం 
మనం చూస్తూనే వున్నాం 

ఈ దృష్టితో చూస్తే 
గురజాడ యెల్లప్పటికీ అతివాదే. 
ఆయన బ్రతికివుంటే 
మనలోని అతివాదుల కంటే 
అతివాదిగా ఉండేవాడనిపిస్తుంది.

 "నాచ్" (భోగం మేళాలు) సమస్య..
ఆనాడు ఒక ముఖ్య సాంఘీక సమస్య 
సానుల సమస్య కేవలం నైతిక సమస్య అని 
ఆనాటి వాళ్ళ అభిప్రాయం 

నీతి బోధలతోనే సానులను 
సంస్కరించవచ్చునని అనుకొనేవాళ్ళు 

కాని ..
వేశ్యావృత్తి ఆర్థిక సమస్యతో ముడిపడివుందని
ఈనాడు అందరికి తెలిసినదే ..
ఈ విషయాన్ని ఆనాడే గుర్తించారు గురజాడ 
"సంస్కర్త హృదయం" అన్న కధలో 
ఆయనకున్న ఆర్థిక దృక్పధం 
స్పష్టంగా కనపడుతుంది. 

పరివర్తన చెందే కాలంతో పాటు 
పరిణమించగల మేధస్సంపదా 
విశాలహృదయమూ సత్య ప్రియత్వమూ మహపురుషుని గొప్ప గుణాలు.
 
మహాకవి
 
నిజంగా గురజాడ మహాకవి. 

తెలుగువాళ్ళు గుడ్డివాళ్ళు 
కాబట్టి 
గురజాడ గొప్పతనాన్ని 
గుర్తించలేరని కొందరంటారు. 
ఇందులో సత్యం ఉన్న మాట నిజమే..!

కాని ఇలాంటి పోలికలు 
ఒక దౌర్బల్యం..

ఉదాహరణకు "ఇక్బాల్.. బంకిం"ల 
రచనలు మనకు తెలియవు 
మన కన్యాశుల్కం వంటి నాటకం 
తమిళులకు మళయాళీలకు లేనిమాట 
నిజం కావచ్చు 

కాని 
భారతి రచనల వంటి 
గానత్మక కవిత్వం మనకు లేదు 

అట్లే 
"వల్లధోల్" వలె బహు గ్రంధాలను 
ఉత్తమమైనవి రచించిన మహాకవులు 
మనకు లేరు. 

తమ రచనలతో బీరువాలు నింపిన కవులు 
మనకూ వున్నారు 
కాని వాళ్ళు గుణంలో 
వల్లధోల్  తో దీటురారు. 

మన పరోక్షంలో కూడా ఇతరులు మన్నించేటట్లు 
మనం మాట్లాడుకోవడం న్యాయం.
గురజాడ దేశభక్తి గీతం చాలా గొప్ప ది 
తెలుగులో అటువంటిది మరిలేదు 

అంతమాత్రాన 
ప్రపంచం సాహిత్యంలోనే 
అటువంటిది లేదనడానికి సాహసించరాదు 

అలాగే 
"మధురవాణి" పాత్ర విషయం 
మధుర వాణి పాత్ర గొప్పదే 
కాని వసంత సేన కంటే గొప్పదని నేననలేను. 

గురజాడకు కూడా 
ఇలాంటి అభిప్రాయాలున్నాయి 
"చాసర్ వాల్మీకి వంటివాడని.."
గురజాడ అన్నాడు 
చాసర్ మీద ఇంగ్లీస్ వాళ్ళకే లేని గౌరవం 
ఈయన కెందుకు కలిగిందో 
నాకు అర్థం కావడం లేదు 

అట్లే ..
వర్డ్స్ వర్త్ మీద కూడ 
గురజాడకు విపరీతమైన గౌరవం 
వర్డ్స్ వర్త్ కు పూర్వం ఉన్న కవిత్వమంతా 
రాజుల రాణుల ప్రేమ పురాణాలూ వీరగాధలే 

సామాన్యుల జీవితాన్ని 
ప్రతిబింబించే కావ్యాలు కూడా చాలవరకు 
ఆ విధంగానే వుందనవచ్చు 

కాని 
సంస్కృత ప్రాకృతాలలో 
మాగధి అపభ్రంశ వంటి భాషల్లో 
సామాన్యు ల  గాధలు అనేకం ఉన్నాయి
 
జైన బౌధ్ధ సాహిత్యమంతా సామాన్యుల కథలే ప్రసిధ్ధమైన గాధాసప్తశతి 
ఆనాటి సామాన్యుల జీవితాన్ని చిత్రించే 
మనోహర కావ్యం 

తెలుగులో మాత్రం 
మొన్న మొన్నటి వరకు 
కవులు రాజుల దగ్గర 
వేశ్యలవలెనే బ్రతికినారని చెప్పవచ్చు 

కాని 
తెలుగు సాహిత్యం అంతా 
అట్టి సాహిత్యం అనలేము.
 
నన్నయకు పూర్వం
 
తెలుగులో నన్నయభట్టే ఆదికవి 
అని చాలారోజులు అనుకొనేవాళ్ళం 
నన్నయ భారతం వంటి ప్రౌఢ రచన 
హఠాత్తుగా ఒకనాడు  ఆవిర్భవించిందంటే 
 నమ్మడం చాల కష్టం ..

ఎన్నో తరాలుగా 
ఎంతమంది విస్మృత కవుల చేతిలోనో 
తెలు గు కవిత్వం క్రమక్రమంగా 
అభివృధ్ధి చెదుతూ వచ్చి 
నన్నయ నాటికి భారతం పరిపక్వ స్తితికి వచ్చిందనుకోవడం సమంజసం
 
ముఖ్యంగా
బౌధ్ధులూ జైనులూ
దేశీయ భాష అయిన తెలుగులో 
ఎన్నో కావ్యాలు వ్రాసి వుంటారని నా విశ్వాసం 

ఆ యుగాల నాటి మత కలహాలలో 
హిందూ దురభిమానులు 
తమది పైచేయి అయినప్పుదు 
ఆ సాహిత్యాన్నంతా నాశనం చేసి వుంటా రు. 

గురజాడ బ్రతికి వుండగానే 
యుధ్ధమల్లుని బెజవాడ శాసనం దొరికింది. 
"యుధ్ధ మల్లుడే ఆదికవి.."
 యని ఆయన సాహసంగా గుర్తించినాడు. 
కన్నడంలోని పంప భారతం గురించి కూడా 
ఆయన ప్రస్తావించాడు. 


నన్నయ భారతంలో 
పంప భారతం యొక్క ప్రభావం కనపడుతున్నదని కొన్ని యేండ్ల క్రిందట 
ఆలంపూర్ సాహిత్య సభలో ..
నేను సోదాహరణంగా నిరూపించినప్పుడు 
తెలుగు భక్తులందరూ 
నామీద విరుచుకు పడినారు.
 
నేనసలు తెలుగు వాణ్ణే కాదనీ 
మారువేషంలో ఉన్న కన్నడం వాణ్ణనీ కూడా 
నన్ను నిందించారు 
నేను చెప్పిన అభిప్రాయం 
గురజాడ ఆనాడే వెలిబుచ్చినాడు
 
కానీ ..
తెలుగు వాళ్ళ దురభిమానం మితిలేనిది. 
నన్నయ మహాకవి 
అంటే వాళ్ళకు తృప్తి లేదు 
నన్నయ ఋషి అనే చాదస్తులూ 
నన్నయ దేవుడు అనే మూర్ఖులూ 
బయలుదేరినారు.
 
పండితుడు
 
గురజాడ చిన్నప్పటినుండే 
ఇంగ్లీషులో గద్యపద్యాలలో 
రచనలు చేసేవాడు. 
సంస్కృతం బాగా రావడమేగాక 
సంస్కృత వ్రాకరణం తో కూడ 
మంచి పరిచయం వున్నట్లు  ఊహించవచ్చు. 

ఆనంద గణపతి 
మహా ప్రౌడుడైన కవి 
ఆయన చుట్టూ 
దిగ్దంతులవంటి పండితుల చేత కూడా 
గౌరవం పొందినాడంటే 
వారి పాండిత్యం కూడ సామాన్యంగా వుండదు 

గజపతి వంటి వారు 
గురజాడను ఆదరించడం 
ఒక ఆశ్చర్య కరమైన విషయం
 
ఆయన సాధించిన సాహిత్య విప్లవం 
చాలా గొప్పది 
బాల వ్యాకరణ 
ప్రౌడ వ్యాకరణ సూత్రాలకు లోబడిన ప్రయోగాలు తెలుగులో చాలా ఎక్కువగా వున్నాయి 

ఆంధ్ర శబ్ద చింతామణి మొదలుకొని 
మన తెలుగు వ్యాకరణాలన్నీ 
చాలా సంకుచిత దృష్టి కలవి. 
మన వ్యాకరణ కర్తలు 
శైవ సాహిత్యాన్ని గుర్తించనేలేదు 

కృష్ణదేవరాయల తర్వాత వచ్చిన 
ప్రబంధాలకూ ..
మధుర ....
తంజావూరు ..
రాజుల కాలంలో వచ్చిన వచన సాహిత్యానికీ 
వాళ్ళు యేమాత్రమూ విలువ ఇవ్వలేదు. 
అందుకనే ఆ వ్యాకరణాలు 
అంత సంకుచితంగా తయారైనాయి.
 
అసలు ఒక జీవద్భాషను 
వ్యాకరణ సూత్రాలలో బంధింపజూడడమే 'కుంజరయూధమును దోమ కుత్తుకలో.." ఇరికించడానికి చేసే ప్రయత్నం వంటిది. 

జీవద్భాష అయిన తెలుగులో 
అనంతమైన ప్రాంతీయ భేదాలు వున్నాయి 
అట్లే సంస్కృతంలో కూడ 
పాణిని వ్యాకరణానికి 
వ్యతిరేకమైన ప్రయోగాలు 
వ్యాసునిలో.. వాల్మీకిలో ..
అంతకు పూర్వపు వైదిక సాహిత్యంలో ..
అనేకం వున్నాయి. 

సంస్కృతం జీవద్భాషగా వున్న రోజులలో 
బౌధ్ధ జైన వాఙ్మయాలలో 
ఈనాటి మహా పండితులకు కూడా 
అర్థం తెలియని ప్రయోగాలు చేయబడినాయి 

కాబట్టి జీవద్భాషను 
వ్యాకరణపు సంకెళ్ళతో బంధించబూనడం సాహితీపరులెవ్వరూ సహింపకూడని విషయం 

ఈ దృష్టితో వ్యాకరణ భక్తులకు 
వ్యతిరేకంగా గురజాడ చేసిన రచనలు 
తెలుగు సాహిత్యానికి 
నూత్న యవ్వనం ప్రసాదించినాయి.
 
సామాజిక దృష్టి.
ఆయన ప్రయత్నించిన సామాజిక విప్లవం కూడా 
చాలా గొప్పది 
తన కాలానికి అతీతమైన సామాజిక దృష్టి 
ఆయనకు వుండేది
ఆయన కథలలో ఆ దృష్టి బాగా కనపడుతుంది.

ఇక ఆయన హాస్యం 
తెలుగు సాహిత్యాలలో సాటిలేనిది. 
ఆయన ఉత్తరాలలో ..వ్యాసాల్లో కూడ ..
ఈ హాస్య దృష్టి కనపడుతుంది. 

సర్కస్ బఫూన్ లు చేసే 
ఆంగిక వికారాలతోను 
కృతకమైన శబ్ద చమత్కారాలతోనూ 
సృష్టించే హాస్యం అల్పమైనది. 

కన్యాశుల్కం లోని హాస్యం 
పాత్రల స్వాభావిక ప్రవర్తనలోనూ 
కథకు సహజమైన 
సన్నివేశాలలోనూ ఇమిడివుంది. 

ఇటువంటి హాస్యమే ఉత్కృష్టమైనది 
గురజాడ సృష్టించినట్టి నాజూకైన హాస్యం 
తెలుగులో మరి లేదు 
గిరీశం వంటి పాత్ర 
తెలుగు సాహిత్యంలో మరి లేదు 
గురజాడ కవిత్వంలో 
ఆంగ్ల సాహిత్యపు చాయలు వున్నాయి.
 
మొత్తం మీద 
ఇంగ్లీషు ప్రభావం 
ఆయన మీద ఎక్కువగా వుందని చెప్పవచ్చు 
ఆంగ్ల విద్య మీద ఆయనకు అమితమైన గౌరవం 
ఇది ఆనాటి కాల ప్రభావం 
అని చెప్పవచ్చు. 

ఇంగ్లీషురాని పండితులు 
ఆనాడు మహా చాందసులు 
కూపస్త మండూకాలు 
ఇంగ్లీషు విద్య వచ్చినవాళ్ళే 
అంతో ఇంతో స్వతంత్రంగా విశాలంగా 
ఆలోచించగలిగే వాళ్ళు 

ఇంగ్లీషు విద్య వల్లనే 
స్వతంత్ర ఆలోచనా శక్తీ 
విశాల దృష్టీ అలవడుతాయని అనుకోవడం 
ఆనాటి పరిస్తితులలో న్యాయమే. 

ఆనాటి యుగ స్వభావమే 
ఆయనలో ప్రతిఫలించింది.
"ముత్యాలసరాలు"
ఆయన తెలుగు కవిత్వానికి ఇచ్చిన కానుక 

ఆ చందస్సులో అంత క్రొత్తదనం లేక పోయినా 
బంధ కవిత్వాలూ 
గర్భ కవిత్వాలూ 
వ్రాసుకొనే రోజుల్లో సరళమైన గేయ ఛందస్సులో కవిత్వం రాయబూనడమే 
ఒక విప్లవం 

ఆయన సుభద్రలో 
అక్కడక్కడా కావ్య భాష దొర్లింది. 
ఋతశతకం అనేది 
సామాన్యులకు అర్థమయ్యేటట్లు లేదు 

వీటిని ఆయన చిన్నప్పుడు 
అంటే సాహిత్యాన్ని గురించే 
ఆయన విశ్వాసాలు పరిణతి చెదక మునుపు వ్రాసినాడేమో అనిపిస్తుంది. 

ఆయన ఖండ కావ్యాలు
 ఏవేవి యెప్పుడు వ్రాసిందీ తేదీలు కూడా 
లభ్యమయి వుంటే బాగుండేది.
 
కన్యక ..
పూర్ణమ్మ..
రెండూ కరుణాత్మక కావ్యాలు 
ఎంతో గంభీరమైన భావాలను కూడా 
సుటిగా హృదయాలకు తాకేటట్లు తేటగా 
పిల్లలకు అర్థమయ్యేటట్లు చెప్పడం 
గురజాడ లోని ఒక మహా శక్తి. 

కన్యకలోని ఇతివృత్తాన్ని 
మరేవి అయినా 
గంభీరమైన ప్రౌఢకావ్యంగా మర్చివుండును.

పూర్ణమ్మ కథలోని కరుణ 
మహా సుకుమారమైనది. 
దీనిలోని యెత్తుగడ ..అంతము ..
యెంతటి గంభీర హృదయాలనైనా 
చలింపచేసేటంత లలితంగా వున్నాయి. 

 ఇంత సరళంగా 
సూటిగా సుకుమారంగా చెప్పగలగడం 
మహాకవులకు మాత్రమే సాధ్యమౌతుంది. 

ఈ చిత్తవృత్తిలో 
ఆయన బాల సాహిత్యం వ్రాసివుంటే 
ఎంత బాగుండునో ..!!
 
యువజన సంఘ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి 
వందన సమర్పణ తో సభ ముగిసింది.