25 ఆగ, 2012

గురజాడ ఒక విద్యుత్తు.




"ఒపీనియన్స్  అప్పుడప్పుడూ చేంజ్ చేసుకోకపోతే పొలిటీషియన్ కానేరడోయ్.."
ఇది గురజాడ ప్రసిధ్ధి చెందిన వ్యాఖ్య..
ఇప్పటి నాయకులు 
దాన్ని అక్షరాలా పాటిస్తున్నారు
 
"ఈ సురోమని మనుషులుంటే 
దేశమేగతి బాగుపడునోయ్.."
అన్నది మరోటి
ఇ ది నాయకులు మనకు చెబుతుంటారు.
వాళ్ళు స్కాములమీద స్కాములు భోంచేస్తుంటే..
 
పాపం ..
మనుషులు అతీ గతీ లేక ఈశురోమని తయారవుతున్నారు.
అది వేరే విషయమనుకోండి..
 
"సొంత లాభము కొంత మానుక..
 పొరుగువాడికి సాయపడవోయ్.."
అన్నదీ
మనందరికీ తెలిసినా..
సొంత లాభం మానడానికి 
మనకెవరికీ ఇష్టం ఉండదు..
 
ఇక..
"కన్యాశుల్కం" 
బాల్య వివాహాలు .. వేశ్యావృత్తి లపై 
ఆ రోజుల్లో ప్రకటించిన ఓ యుద్ధం ..
 

1890ప్రాంతాల్లో రచింపబడి ..
వందల సార్లు ప్రదర్శింపబడి ..
అనేక భాషలలో అనువదింపబడిందీ నాటకం
వాడుక భాష లో రచనలు చేయటం  
చేతకాని తనం గా పరిగణించేవారు ఆ నా డు ..

గ్రాంధికం  రాజ్జమేలుతున్న రోజుల్లో 
గిడుగు రామ్మూర్తితో కలిసి 
వాడుక భాషావ్యాప్తికి కృషి చేసాడు..

అంతేకాదు..
ముత్యాలసరాలు
పుత్తడిబొమ్మ పూర్ణమ్మ..
కన్యక ..
ఇలా ఎన్నో రచించా
డు .

రాసిలో కొద్ది అయినా 
వాసిలో కెక్కినవి ఆయన రచనలు

అందుకే ..
1915 లో ఆయన మరణించినా..
1915 తర్వాతే ఆయన జీవించడం ప్రారంభించాడని దేవులపల్లి అన్నారు.

ఆంగ్ల కవి 
 "చాసర్ వాల్మీకి వంటి వాడని" అన్నాడు గురజాడ 
ఇంగ్లీషు వారికి లేని ప్రేమ ఈ యన కెందుకని అన్నారుకొందరు  

అలానే 
వర్డ్స్ వర్త్ అన్నా ..
ఆయన ఇంగ్లీషు అభిమానం 
సారంగధర కావ్యం గా అవతరించింది  


ఈ ప్రసంగం 30.11.1959 న కడప 
రామకృష్ణ సమాజం లో పుట్టపర్తి వారు చేసినది 
తదుపతి విశా లాంద్ర వారు ప్రచురించారు .

"తెలుగులో నన్నయభట్టే ఆదికవి 
అని చాలారోజులు అనుకొనేవాళ్ళం ..
నన్నయ భారతం వంటి ప్రౌఢ రచన 
హఠాత్తుగా ఒకనాడు  ఆవిర్భవించిందంటే 
 నమ్మడం చాల కష్టం ..

ఎన్నో తరాలుగా 
ఎంతమంది విస్మృత కవుల చేతిలోనో 
తెలు గు కవిత్వం క్రమక్రమంగా 
అభివృధ్ధి చెదుతూ వచ్చి ..
నన్నయ నాటికి భారతం పరిపక్వ స్తితికి వచ్చిందనుకోవడం సమంజసం .."
అంటారు వారు ..

"నన్నయ భారతంలో..
పంప భారతం యొక్క ప్రభావం కనపడుతున్నదని కొన్ని యేండ్ల క్రిందట ..
ఆలంపూర్ సాహిత్య సభలో ..
నేను సోదాహరణంగా నిరూపించినప్పుడు..
తెలుగు భక్తులందరూ ..
నామీద విరుచుకు పడినారు.."

అనడంలో ఆయనలోని 
చారిత్రక పరిశో ధకుడు  నిర్భయంగా  తొంగి చూసాడు 

ఇందులో  
మహాకవి ..
నన్నయ కు ముం దు..
పం డి తు డు ..
క్రాంతదర్శి..
ఇలా వివిధ ముఖాలుగా 
గురజాడను స్మరించడం జరిగింది 



మహాకవి మాత్రమే కాదు 
                    మహా పురుషుడు గురజాడ..               

               అప్పారావు కవికి శ్రీ పుట్టపర్తి నివాళి.

 
శ్రీ పుట్టపర్తి వారు కడపలో ఉపన్యసించిన తేదీ          30.11.1959
విశాలాంధ్రలో ఉపన్యాస పాఠం ప్రకటించిన తేదీ 30.12.1959

 
కడప పట్టణ యువజన సంఘ అధ్వర్యాన 
నవంబర్ 30 వ తేదీన 
శ్రీ రామకృష్ణ సమాజంలో 
"గురజాడ" వర్ధంతి జరిగింది 
శ్రీ ఆర్ . రంగనాధం గారు అధ్యక్షత వహించారు 
మహాకవి శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు ఉపన్యసించారు.
"దేశమును ప్రేమించుమన్నా"
అనే గురజాడ గీతాగానంతో 
సభ ప్రారంభమైంది. 

అధ్యక్షు ని ప్రసంగం తర్వాత 
శ్రీ నారాయణాచార్యులు గారిలా ప్రసంగించారు.
 
మహాకవి గురజాడ ఒక ఉద్యమం 
ఆయన సమకాలీకులు 
ఆయననేవిధంగా భావించినా 
మనం మాత్రం ఆయనను ఒక మహాకవిగా 
ఒక మహాపురుషు ణి గా గౌరవిస్తున్నాము. 

ఆ మహనీయుని 
ఈనాడు సంస్మరించుకోవటం సముచితం
 
పది ఉపన్యాసాలకంటే యెక్కువగా 
మహాకవి వాక్కు ఒకటి 
వేల హృదయాలను కదలింపగలదు. 
భావుకుడైన కవికి అట్టి శక్తి ఉంది. 

సృజనాత్మక శక్తి లోని ఆ మెరుపును 
ఆ ఆంతరంగిక జ్యోతిని గమనించి వినియోగించుకోలేకపోతే 
సామాజిక ఉద్యమాలు 
తమ ప్రయోజనాలను నెరవేర్చలేవు 

ఆనాటి సామాజిక ఉద్యమాలకు 
చేయూతనిచ్చిన గురజాడ
ఒక విద్యుత్తు. 
ఆయన మహాకవి మాత్రమే కాదు 
ఒక మహాపురుషుడు.

సాహిత్య కారులలో చాలమందికి 
"ఆత్మ స్తుతి"
ఒక చాపల్యంగా వుంటుంది. 
అది కొంతవరకు అవసరమేమో కాని 
దాని పాలు మితిమీరితే 
దురభిమానం అవుతుంది 
దురభిమానం విమర్శకులలో 
ఎక్కువగా ఉంటుంది. 
గురజాడమీద కూడ 
ఆ కాలంలో నిందా పూర్వకమైన 
దురుసు విమర్శలు అనేకం వచ్చాయి. 

కాని ..
ఆయన అన్నిటినీ శాంతంగా పరిశీలించి 
సరసంగా సమధానం చెప్పారు 
గొప్పవాళ్ళ లక్షణం అది.

అంతకంటే గొప్పది 
ఆయన సాహసం 
ఎండుగడ్డి వంటి శుష్క పాండిత్యమే 
కవిత్వం అనుకొనే రోజుల్లో 
అంతమంది కవి "వృషభులనూ.."
"కవి శరభులనూ.." ధిక్కరించి 
సంప్రదాయానికి ఎదురు తిరిగి నిలబడే 
సాహసం సామాన్యమైనది కాదు. 

ఆనాటి  పండితులు కూడా 
సామాన్యులేమీ కాదు. 
దిగ్దంతులవంటివాళ్ళు. 
శతావధానులు 

వాళ్ళందరూ వ్యావహారిక భాషకు వ్యతిరేకులు 
వా ళ్ళ గ్రాంధిక భాషావాదాన్ని 
చీల్చి చెండాడిన పిడుగు వంటి గిడుగు 
లక్షణ కర్త కాగా 
ఆయన లక్షణాలకు లక్ష్యంగా 
గురజాడ సాహిత్య సృష్టి సాగించినారు.
 
ఆనాటి సంఘ సంస్కరణోద్యమానికి 
వీరేశలింగం ఒక మహానేత . 
ఆయనకు అన్ని విధాలా 
అండదండగా వుండినవాడు గురజాడ. 

అయినా ..
కందుకూరిని కూడా విమర్శించడానికి 
వెనుదీయని సత్యప్రియుడు గురజాడ. 
శ్రీ కందుకూరి రచనల్లోని శృంగారాన్ని 
నిస్సంకోచంగా ఆయన విమర్శించారు.
 
క్రాంతదర్శి..
 
కవి క్రాంతదర్శి. 
నేటి పరిస్తితులను గమనించి 
రేపటికి సూచనలు చేయడమే క్రాంతదర్శి పని. అటువంటిది  గురజాడలో వుంది. 
ఒకనాటి అతివాదులు 
మరికొన్నాళ్ళకు మితవాదులు కావడం 
మనం చూస్తూనే వున్నాం 

ఈ దృష్టితో చూస్తే 
గురజాడ యెల్లప్పటికీ అతివాదే. 
ఆయన బ్రతికివుంటే 
మనలోని అతివాదుల కంటే 
అతివాదిగా ఉండేవాడనిపిస్తుంది.

 "నాచ్" (భోగం మేళాలు) సమస్య..
ఆనాడు ఒక ముఖ్య సాంఘీక సమస్య 
సానుల సమస్య కేవలం నైతిక సమస్య అని 
ఆనాటి వాళ్ళ అభిప్రాయం 

నీతి బోధలతోనే సానులను 
సంస్కరించవచ్చునని అనుకొనేవాళ్ళు 

కాని ..
వేశ్యావృత్తి ఆర్థిక సమస్యతో ముడిపడివుందని
ఈనాడు అందరికి తెలిసినదే ..
ఈ విషయాన్ని ఆనాడే గుర్తించారు గురజాడ 
"సంస్కర్త హృదయం" అన్న కధలో 
ఆయనకున్న ఆర్థిక దృక్పధం 
స్పష్టంగా కనపడుతుంది. 

పరివర్తన చెందే కాలంతో పాటు 
పరిణమించగల మేధస్సంపదా 
విశాలహృదయమూ సత్య ప్రియత్వమూ మహపురుషుని గొప్ప గుణాలు.
 
మహాకవి
 
నిజంగా గురజాడ మహాకవి. 

తెలుగువాళ్ళు గుడ్డివాళ్ళు 
కాబట్టి 
గురజాడ గొప్పతనాన్ని 
గుర్తించలేరని కొందరంటారు. 
ఇందులో సత్యం ఉన్న మాట నిజమే..!

కాని ఇలాంటి పోలికలు 
ఒక దౌర్బల్యం..

ఉదాహరణకు "ఇక్బాల్.. బంకిం"ల 
రచనలు మనకు తెలియవు 
మన కన్యాశుల్కం వంటి నాటకం 
తమిళులకు మళయాళీలకు లేనిమాట 
నిజం కావచ్చు 

కాని 
భారతి రచనల వంటి 
గానత్మక కవిత్వం మనకు లేదు 

అట్లే 
"వల్లధోల్" వలె బహు గ్రంధాలను 
ఉత్తమమైనవి రచించిన మహాకవులు 
మనకు లేరు. 

తమ రచనలతో బీరువాలు నింపిన కవులు 
మనకూ వున్నారు 
కాని వాళ్ళు గుణంలో 
వల్లధోల్  తో దీటురారు. 

మన పరోక్షంలో కూడా ఇతరులు మన్నించేటట్లు 
మనం మాట్లాడుకోవడం న్యాయం.
గురజాడ దేశభక్తి గీతం చాలా గొప్ప ది 
తెలుగులో అటువంటిది మరిలేదు 

అంతమాత్రాన 
ప్రపంచం సాహిత్యంలోనే 
అటువంటిది లేదనడానికి సాహసించరాదు 

అలాగే 
"మధురవాణి" పాత్ర విషయం 
మధుర వాణి పాత్ర గొప్పదే 
కాని వసంత సేన కంటే గొప్పదని నేననలేను. 

గురజాడకు కూడా 
ఇలాంటి అభిప్రాయాలున్నాయి 
"చాసర్ వాల్మీకి వంటివాడని.."
గురజాడ అన్నాడు 
చాసర్ మీద ఇంగ్లీస్ వాళ్ళకే లేని గౌరవం 
ఈయన కెందుకు కలిగిందో 
నాకు అర్థం కావడం లేదు 

అట్లే ..
వర్డ్స్ వర్త్ మీద కూడ 
గురజాడకు విపరీతమైన గౌరవం 
వర్డ్స్ వర్త్ కు పూర్వం ఉన్న కవిత్వమంతా 
రాజుల రాణుల ప్రేమ పురాణాలూ వీరగాధలే 

సామాన్యుల జీవితాన్ని 
ప్రతిబింబించే కావ్యాలు కూడా చాలవరకు 
ఆ విధంగానే వుందనవచ్చు 

కాని 
సంస్కృత ప్రాకృతాలలో 
మాగధి అపభ్రంశ వంటి భాషల్లో 
సామాన్యు ల  గాధలు అనేకం ఉన్నాయి
 
జైన బౌధ్ధ సాహిత్యమంతా సామాన్యుల కథలే ప్రసిధ్ధమైన గాధాసప్తశతి 
ఆనాటి సామాన్యుల జీవితాన్ని చిత్రించే 
మనోహర కావ్యం 

తెలుగులో మాత్రం 
మొన్న మొన్నటి వరకు 
కవులు రాజుల దగ్గర 
వేశ్యలవలెనే బ్రతికినారని చెప్పవచ్చు 

కాని 
తెలుగు సాహిత్యం అంతా 
అట్టి సాహిత్యం అనలేము.
 
నన్నయకు పూర్వం
 
తెలుగులో నన్నయభట్టే ఆదికవి 
అని చాలారోజులు అనుకొనేవాళ్ళం 
నన్నయ భారతం వంటి ప్రౌఢ రచన 
హఠాత్తుగా ఒకనాడు  ఆవిర్భవించిందంటే 
 నమ్మడం చాల కష్టం ..

ఎన్నో తరాలుగా 
ఎంతమంది విస్మృత కవుల చేతిలోనో 
తెలు గు కవిత్వం క్రమక్రమంగా 
అభివృధ్ధి చెదుతూ వచ్చి 
నన్నయ నాటికి భారతం పరిపక్వ స్తితికి వచ్చిందనుకోవడం సమంజసం
 
ముఖ్యంగా
బౌధ్ధులూ జైనులూ
దేశీయ భాష అయిన తెలుగులో 
ఎన్నో కావ్యాలు వ్రాసి వుంటారని నా విశ్వాసం 

ఆ యుగాల నాటి మత కలహాలలో 
హిందూ దురభిమానులు 
తమది పైచేయి అయినప్పుదు 
ఆ సాహిత్యాన్నంతా నాశనం చేసి వుంటా రు. 

గురజాడ బ్రతికి వుండగానే 
యుధ్ధమల్లుని బెజవాడ శాసనం దొరికింది. 
"యుధ్ధ మల్లుడే ఆదికవి.."
 యని ఆయన సాహసంగా గుర్తించినాడు. 
కన్నడంలోని పంప భారతం గురించి కూడా 
ఆయన ప్రస్తావించాడు. 


నన్నయ భారతంలో 
పంప భారతం యొక్క ప్రభావం కనపడుతున్నదని కొన్ని యేండ్ల క్రిందట 
ఆలంపూర్ సాహిత్య సభలో ..
నేను సోదాహరణంగా నిరూపించినప్పుడు 
తెలుగు భక్తులందరూ 
నామీద విరుచుకు పడినారు.
 
నేనసలు తెలుగు వాణ్ణే కాదనీ 
మారువేషంలో ఉన్న కన్నడం వాణ్ణనీ కూడా 
నన్ను నిందించారు 
నేను చెప్పిన అభిప్రాయం 
గురజాడ ఆనాడే వెలిబుచ్చినాడు
 
కానీ ..
తెలుగు వాళ్ళ దురభిమానం మితిలేనిది. 
నన్నయ మహాకవి 
అంటే వాళ్ళకు తృప్తి లేదు 
నన్నయ ఋషి అనే చాదస్తులూ 
నన్నయ దేవుడు అనే మూర్ఖులూ 
బయలుదేరినారు.
 
పండితుడు
 
గురజాడ చిన్నప్పటినుండే 
ఇంగ్లీషులో గద్యపద్యాలలో 
రచనలు చేసేవాడు. 
సంస్కృతం బాగా రావడమేగాక 
సంస్కృత వ్రాకరణం తో కూడ 
మంచి పరిచయం వున్నట్లు  ఊహించవచ్చు. 

ఆనంద గణపతి 
మహా ప్రౌడుడైన కవి 
ఆయన చుట్టూ 
దిగ్దంతులవంటి పండితుల చేత కూడా 
గౌరవం పొందినాడంటే 
వారి పాండిత్యం కూడ సామాన్యంగా వుండదు 

గజపతి వంటి వారు 
గురజాడను ఆదరించడం 
ఒక ఆశ్చర్య కరమైన విషయం
 
ఆయన సాధించిన సాహిత్య విప్లవం 
చాలా గొప్పది 
బాల వ్యాకరణ 
ప్రౌడ వ్యాకరణ సూత్రాలకు లోబడిన ప్రయోగాలు తెలుగులో చాలా ఎక్కువగా వున్నాయి 

ఆంధ్ర శబ్ద చింతామణి మొదలుకొని 
మన తెలుగు వ్యాకరణాలన్నీ 
చాలా సంకుచిత దృష్టి కలవి. 
మన వ్యాకరణ కర్తలు 
శైవ సాహిత్యాన్ని గుర్తించనేలేదు 

కృష్ణదేవరాయల తర్వాత వచ్చిన 
ప్రబంధాలకూ ..
మధుర ....
తంజావూరు ..
రాజుల కాలంలో వచ్చిన వచన సాహిత్యానికీ 
వాళ్ళు యేమాత్రమూ విలువ ఇవ్వలేదు. 
అందుకనే ఆ వ్యాకరణాలు 
అంత సంకుచితంగా తయారైనాయి.
 
అసలు ఒక జీవద్భాషను 
వ్యాకరణ సూత్రాలలో బంధింపజూడడమే 'కుంజరయూధమును దోమ కుత్తుకలో.." ఇరికించడానికి చేసే ప్రయత్నం వంటిది. 

జీవద్భాష అయిన తెలుగులో 
అనంతమైన ప్రాంతీయ భేదాలు వున్నాయి 
అట్లే సంస్కృతంలో కూడ 
పాణిని వ్యాకరణానికి 
వ్యతిరేకమైన ప్రయోగాలు 
వ్యాసునిలో.. వాల్మీకిలో ..
అంతకు పూర్వపు వైదిక సాహిత్యంలో ..
అనేకం వున్నాయి. 

సంస్కృతం జీవద్భాషగా వున్న రోజులలో 
బౌధ్ధ జైన వాఙ్మయాలలో 
ఈనాటి మహా పండితులకు కూడా 
అర్థం తెలియని ప్రయోగాలు చేయబడినాయి 

కాబట్టి జీవద్భాషను 
వ్యాకరణపు సంకెళ్ళతో బంధించబూనడం సాహితీపరులెవ్వరూ సహింపకూడని విషయం 

ఈ దృష్టితో వ్యాకరణ భక్తులకు 
వ్యతిరేకంగా గురజాడ చేసిన రచనలు 
తెలుగు సాహిత్యానికి 
నూత్న యవ్వనం ప్రసాదించినాయి.
 
సామాజిక దృష్టి.
ఆయన ప్రయత్నించిన సామాజిక విప్లవం కూడా 
చాలా గొప్పది 
తన కాలానికి అతీతమైన సామాజిక దృష్టి 
ఆయనకు వుండేది
ఆయన కథలలో ఆ దృష్టి బాగా కనపడుతుంది.

ఇక ఆయన హాస్యం 
తెలుగు సాహిత్యాలలో సాటిలేనిది. 
ఆయన ఉత్తరాలలో ..వ్యాసాల్లో కూడ ..
ఈ హాస్య దృష్టి కనపడుతుంది. 

సర్కస్ బఫూన్ లు చేసే 
ఆంగిక వికారాలతోను 
కృతకమైన శబ్ద చమత్కారాలతోనూ 
సృష్టించే హాస్యం అల్పమైనది. 

కన్యాశుల్కం లోని హాస్యం 
పాత్రల స్వాభావిక ప్రవర్తనలోనూ 
కథకు సహజమైన 
సన్నివేశాలలోనూ ఇమిడివుంది. 

ఇటువంటి హాస్యమే ఉత్కృష్టమైనది 
గురజాడ సృష్టించినట్టి నాజూకైన హాస్యం 
తెలుగులో మరి లేదు 
గిరీశం వంటి పాత్ర 
తెలుగు సాహిత్యంలో మరి లేదు 
గురజాడ కవిత్వంలో 
ఆంగ్ల సాహిత్యపు చాయలు వున్నాయి.
 
మొత్తం మీద 
ఇంగ్లీషు ప్రభావం 
ఆయన మీద ఎక్కువగా వుందని చెప్పవచ్చు 
ఆంగ్ల విద్య మీద ఆయనకు అమితమైన గౌరవం 
ఇది ఆనాటి కాల ప్రభావం 
అని చెప్పవచ్చు. 

ఇంగ్లీషురాని పండితులు 
ఆనాడు మహా చాందసులు 
కూపస్త మండూకాలు 
ఇంగ్లీషు విద్య వచ్చినవాళ్ళే 
అంతో ఇంతో స్వతంత్రంగా విశాలంగా 
ఆలోచించగలిగే వాళ్ళు 

ఇంగ్లీషు విద్య వల్లనే 
స్వతంత్ర ఆలోచనా శక్తీ 
విశాల దృష్టీ అలవడుతాయని అనుకోవడం 
ఆనాటి పరిస్తితులలో న్యాయమే. 

ఆనాటి యుగ స్వభావమే 
ఆయనలో ప్రతిఫలించింది.
"ముత్యాలసరాలు"
ఆయన తెలుగు కవిత్వానికి ఇచ్చిన కానుక 

ఆ చందస్సులో అంత క్రొత్తదనం లేక పోయినా 
బంధ కవిత్వాలూ 
గర్భ కవిత్వాలూ 
వ్రాసుకొనే రోజుల్లో సరళమైన గేయ ఛందస్సులో కవిత్వం రాయబూనడమే 
ఒక విప్లవం 

ఆయన సుభద్రలో 
అక్కడక్కడా కావ్య భాష దొర్లింది. 
ఋతశతకం అనేది 
సామాన్యులకు అర్థమయ్యేటట్లు లేదు 

వీటిని ఆయన చిన్నప్పుడు 
అంటే సాహిత్యాన్ని గురించే 
ఆయన విశ్వాసాలు పరిణతి చెదక మునుపు వ్రాసినాడేమో అనిపిస్తుంది. 

ఆయన ఖండ కావ్యాలు
 ఏవేవి యెప్పుడు వ్రాసిందీ తేదీలు కూడా 
లభ్యమయి వుంటే బాగుండేది.
 
కన్యక ..
పూర్ణమ్మ..
రెండూ కరుణాత్మక కావ్యాలు 
ఎంతో గంభీరమైన భావాలను కూడా 
సుటిగా హృదయాలకు తాకేటట్లు తేటగా 
పిల్లలకు అర్థమయ్యేటట్లు చెప్పడం 
గురజాడ లోని ఒక మహా శక్తి. 

కన్యకలోని ఇతివృత్తాన్ని 
మరేవి అయినా 
గంభీరమైన ప్రౌఢకావ్యంగా మర్చివుండును.

పూర్ణమ్మ కథలోని కరుణ 
మహా సుకుమారమైనది. 
దీనిలోని యెత్తుగడ ..అంతము ..
యెంతటి గంభీర హృదయాలనైనా 
చలింపచేసేటంత లలితంగా వున్నాయి. 

 ఇంత సరళంగా 
సూటిగా సుకుమారంగా చెప్పగలగడం 
మహాకవులకు మాత్రమే సాధ్యమౌతుంది. 

ఈ చిత్తవృత్తిలో 
ఆయన బాల సాహిత్యం వ్రాసివుంటే 
ఎంత బాగుండునో ..!!
 
యువజన సంఘ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి 
వందన సమర్పణ తో సభ ముగిసింది.

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి