16 ఏప్రి, 2012

పుట్టపర్తి నారాయణాచార్యులు ..జ్ఞానపీఠమూ..--పుట్టపర్తి అనూరాధ

  


 


పురస్కారాలు ఎలా ఇస్తారు ..?
వాని వెనుక యే యే శక్తులు పనిచేస్తాయి..?
ప్రతిభకన్నా పైరవీలు ముఖ్యమా..?
ఆగండాగండి..

మీరేదో రంగంలో బాగా కృషి చేసి 
ఏవైనా అవార్డుల కోసమో.. 
రివార్డులకోసమో.. 
ఎదురుచూస్తూ కూచున్నారో అయిపోయారే..
 
ఎంతసేపూ..                             
ఆ రంగంలో మరింత కృషిజేసి అందరితో శభాషనిపించుకోవటంతో పాటూ..
కాస్త చుట్టూ పరికించి..

పైకి పోతున్న వాళ్ళని 
కిందకి లాగడానికీ..
కిందనున్న వాళ్ళని 
వెకసెక్కమాడడానికీ..
రాజకీయ రంగంలోనో ..
మంచి పదవులలోనో..
ఉన్న వారి చిట్టా సంపాదించి ..
వారిని కాకా పట్టే కార్యక్రమానికీ శ్రీకారం చుట్టాలి.
 

ఎవరికైనా ఏదైనా గౌరవమొస్తే 
వాడు ఆ కులానికి చెందిన వాడు 
కాబట్టీ వచ్చిందనీ..
వీడు పదవిలో కొచ్చాడంటే 
ఈ రాజకీయగొడుగు కిందవాడు 
కనుక వచ్చిందనీ..
బురదజల్లడానికి తగిన ప్రాక్టీసులూ ..
అంతే చిత్తశుధ్ధిగా మొదలెట్టాలి..
 
దీనికి కావలసిన 
మనోబలాన్నీ.. వాక్శక్తినీ ..ఇమ్మని 
మొదటగా గణేశ పూజ సరస్వతీ పూజలూ
 కావాలంటే చేసుకోండి మీ ఇష్టం..
 
ఇందులో మీ కృషి ఫలించి ..
మీకు పుసుక్కున ఏ గౌరవమో వరించనూ వరించచ్చు..
29 Mar 2010 న ఒక వ్యాసం వచ్చింది పురస్కారాలపై..
ఇది చదివితే తెల్లబోవటం
మీవంతౌతుంది..
అవధరించండి.     


           
                     

    
       29 Mar 2010


పురస్కారాలకు నమస్కారాలు






పురస్కారము అంటే 
అనేక నైఘంటికార్థాలున్నాయి. 
ప్రధానంగా
ముందిడుకొను, పూజించు, సన్మానించు 
అనే అర్థాలున్నాయి. 
తక్కిన వారి కంటే 
ఇతడు ఎక్కువ అని తాత్పర్యార్థం. 


రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు 
కొన్ని పురస్కారాలు ప్రకటిస్తూ వుంటాయి. 
ముఖ్యంగా 
జనవరి 26 వ తేదీకి ప్రకటించే 
పద్మ పురస్కారాలు పద్మశ్రీ, పద్మభూషణ్‌, 
పద్మ విభూషణ్‌, భారతరత్న వంటివి. 


ఇవి రాజకీయ వేత్తలకు,
పారిశ్రామికవేత్తలకు, 
కవులకు, 
కళాకారులకు, 
సామాజిక శాస్త్ర వేత్తలకు, 
సంఘ సేవకులకు లభిస్తూ వుంటాయి. 


ఇవికాక 
కేంద్ర రాష్ట్ర సాహిత్య అకాడమీలు 
కొన్ని పురస్కారాలు ఇస్తుంటాయి. 
అలాగే సంగీత నాటక అకాడమీ సన్మానాలు 
కూడా ఉంటాయి. 
ఇంకా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని 
రాష్ట్ర ప్రభుత్వం 
కవులకు, పండితులకు వేద పండితులకు 
సన్మానాలు చేస్తూ ఉంటుంది. 








ఇంకా 
వివిధ విశ్వ విద్యాలయాలవారు 
కళా ప్రపూర్ణ, గౌరవ డాక్టరేటులు ప్రదానం చేస్తుంటాయి. 
ఇవన్నీ కొన్ని వర్గాలుగా విభజింపవచ్చు. 
స్థూలంగా 
ఇవి ప్రభుత్వ -ఉపప్రభుత్వ పురస్కారాల కిందికి వస్తాయి.

ఒక ప్రముఖుడు
 తన పేరుతో లేదా 
తన భార్య లేక 
తల్లిదండ్రుల పేరుతో పురస్కారాలు ప్రకటిస్తాడు. 
వీటికి చట్టబద్ధత ఉండదు 
ఒక సాంస్కృతిక సంస్థ 
హైదరాబాద్‌, ఢిల్లీ, చెన్నైలలో 
ఉగాది పురస్కారాలు ప్రకటిస్తుంది. 
మహాదేవి వర్మ
దీనికీ ప్రభుత్వ చట్టబద్ధత ఉండదు.


ఆ విధంగా చూస్తే 
జ్ఞానపీఠ పురస్కారం, 
సరస్వతీ సన్మాన్‌ పురస్కారం 
బిర్లాట్రస్ట్‌, 
సి.పి బ్రౌన్‌ అకాడమీ 
వంటి సంస్థల పురస్కారాలు 
ప్రైవేటు వ్యక్తులు అనధికారికంగా 
ఇచ్చిన పురస్కారాల క్రిందికే వస్తాయి. 


నోబెల్‌ బహుమతి ప్రపంచంలో 
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పురస్కారం.
అలాగే 
సినీ రంగంలో ఆస్కార్‌ పురస్కారాలు కూడా 

ఇవి కాక 
జర్నలిస్టులకు ఇచ్చే పులట్జురో పురస్కారాలు 
మెగాసెసే పురస్కారం,
 గ్రామో 
ఇలాంటివి కొన్ని ఉన్నాయి. 


కొందరు వ్యక్తులు పురస్కారాల కోసం 
పైరవీలు చేసుకోవటం సర్వసామాన్యాంశం. 
ముఖ్యంగా రాష్ట్ర కేంద్ర మంత్రులలో 
ఎవరి ప్రోద్బలమో లేకపోతే
 ప్రభుత్వ పురస్కారం రాదుగాక రాదు. 


ప్రతిభకూ పురస్కారాలకూ 
చాలా సందర్భాలల్లో 
తక్కువ సంబంధం ఉంటుంది.
శ్రీశ్రీకి 
కేంద్ర పురస్కారం తీసుకోవాలనే కోరిక ఉండేది.
 కాని 
ఆయన విరసం అధ్యక్షుడు కావటం వల్ల 
వారు ప్రభుత్వ పురస్కారాలు 
తీసుకోనీయకుండా 
అప్పుడు అడ్డుపడ్డారు. 


అలాగే పుట్టపర్తి నారాయణాచార్యుల వారికి 
రావలసిన జ్ఞానపీఠ పురస్కారం 
సి.నారాయణరెడ్డికి లభించింది. 
ఆ దు:ఖంతో పుట్టపర్తి వారు కన్నుమూశారు. 


సినీరంగంలో రఘుపతి వెంకయ్య పురస్కారం దాదాసాహెబ్‌ పాల్కే పురస్కారం 
ఇంకా 
వార్షిక స్వర్ణ రజత కాంస్య నందులు 
ఇటు రాష్ట్రం -స్వర్ణం, రజత, కమలాలు 
అటు కేంద్రం ఇస్తూ ఉంటుంది. 


వీటిని రికమెండ్‌ చేయటానికి 
కొన్ని కమిటీలు వేస్తారు. 
సామాన్యంగా కమిటీ సభ్యులు 
ప్రభుత్వపు కనుసన్నలలోనే ఉంటారు. 


మహానటి సావిత్రికి పద్మభూషణ్‌ వచ్చింది. 
కారణాలు సుస్పష్టం. 
ఎన్‌.టి.ఆర్‌ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం పురస్కారం ఇస్తున్నది. 


అలాగే 
శ్రీమతి లక్ష్మీపార్వతి గారు 
తమ ట్రస్టు పక్షాన పురస్కారం ఇస్తున్నారు. 
ఇందులో 
ఆమె ప్రమేయం ఏమీ ఉండదు. 
చేకూరి రామారావు, 
అబ్బూరి ఛాయాదేవి 
వంటి సభ్యులు కొందరుంటారు. 
వారి రికమెండేషన్‌ను ఛైర్మన్‌ ట్రస్టు వారికి అందజేస్తారు. సభ్యులు సామ్యవాదులైతే 
సౌమ్యవాదులకు పురస్కారాలు 
రాకుండా అడ్డుపడటం సహజమే. 

గత సంవత్సరం 
కన్నడ రచయిత బైరప్ప (2009) 
ఈ సంవత్సరం బెంగాలీ రచయిత మహాశ్వేతాదేవి (2010) గార్లకు ఈ పురస్కారాలు ప్రకటించారు. 
బైరప్ప సంప్రదాయద్వేషి. 
మహాశ్వేతదేవి స్వయంగా ఉగ్రవాద రచయిత్రి. 

కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షునిగా 
అస్సామీ రచయిత,ఇందిరా గోస్వామి
నారంగ్‌ లోగడ ఎన్నిక కాకుండా అడ్డుకున్నది. 
కాన్వాస్‌ చేసింది. 
ఐనా 
ఆమె కోర్కె ఫలించలేదు. 
బెంగాల్‌ ప్రభుత్వమూ ఉగ్రవాదులూ 
ఆమె వెనుక ఉన్నారు. 
అందుకని 
జ్ఞానపీఠ్‌ పురస్కారం కూడా తెచ్చుకోగలిగింది. 
నోబెల్‌ బహుమతి వచ్చినా 
ఏమీ ఆశ్చర్య పడనక్కరలేదు.


అలాగే 
బుకర్‌ వంటి 
అంతర్జాతీయ పురస్కారాలు 
అరుంధతీరాయ్‌ వంటి 
సంప్రదాయ వ్యతిరేకులకు వస్తూ ఉంటాయి. 
పురస్కారాల ద్వారా వారు 
ఆ వ్యక్తిని ప్రొజెక్ట్‌ చేయటం 
మొదటి ప్రయోజనం -
ధన సంపాదన 
రెండవ లక్ష్యం. 
వారు నమ్మిన సిద్ధాంతాలకు మాన్యత కల్పించటం మూడవ ప్రయోజనం!


ఆంధ్రప్రదేశ్‌ నుండి 
కేంద్ర సాహిత్య పురస్కారాలు పొందిన వారిలో
 కె.శివారెడ్డి, 
రాచమల్లు రామచంద్రారెడ్డి, 
అజంతా చేకూరి రామారావు, 
కేతు విశ్వనాథరెడ్డి, 
అబ్బూరి ఛాయాదేవి, 
బైరాగి, 
కాళీపట్నం రామారావు, 
సి.నారె. 
నక్కా గోపి ఇత్యాదులంతా లెఫ్టిస్టులే. 
వీరికి పురస్కార లబ్ధికి సంబంధించి 
మంచి నెట్‌వర్క్‌ ఉంది. 
తమకు కావలసిన వారికే వచ్చేటట్లు చూసుకోవటం 
ఆ సభ్యులు 
చక్కని సమన్వయాత్మక వ్యూహంలో నిర్వహిస్తారు. 
దీనిని తెరవెనుక పైరవీ                    
-లేదా గ్రౌండ్‌ వర్క్‌ అంటారు. 


ప్రొఫెసర్‌ భద్రిరాజు కృష్ణమూర్తి
కేంద్ర సాహిత్య అకాడమీ 
రెజిడినల్‌ కన్వీనర్‌గా ఉన్నప్పుడు 
ఈ పక్షపాతం బాగా ఉండేది. 
మంజుశ్రీ కాలంలో 
పక్షపాతం జరుగలేదు. 
అయినా జాతీయ స్థాయిలో అల్లరికి గురిఅయినాడు.
 ఆ వివరాలన్నీ మీకు తెలిసినవే కాబట్టి 
వివరణ అక్కరలేదు. 
గుంటూరు శేషేంద్ర శర్మ, 
రావూరి భరద్వాజ పేర్లు 
జ్ఞానపీఠ పురస్కారానికి రికమెండ్‌ చేయబడ్డాయి. 
అలాగే 
పద్మశ్రీకి కూడా శేషేంద్ర పేరును రికమెండ్‌ చేశారు. 
వారే అసూయతో కొందరు అడ్డుకున్నారు 

శేషేంద్ర పేరును వాజ్‌పేయి ప్రభుత్వం 
సినారె పేరును పివి నరసింహారావుగారు 
పుట్టప్ప పేరును కర్నాటక ప్రభుత్వం 
నోబెల్‌ పురస్కారానికి రికమండ్‌ చేసిందని వార్త. 


నోబెల్‌ శాంతి పురస్కారం కోసం 
ఎబి వాజ్‌పేయి ఎంతో తహతహలాడాడు 
కాని రాలేదు. 


హిందీలో ''బాహుబలి'' అనే పదం ఉంది -
అంటే 
రాజకీయ లబ్ధికోసం 
బలప్రయోగం చేసే దాదాగిరి అని అర్థం. 
పురస్కారాల విషయం 
కామ..కాంచన ప్రయోగం చేయటం 
బెదిరించటం 
వంటివీ జరుగుతూ ఉంటాయి. 


బెంగాల్‌ రాష్ట్రానికి చెందినవన్నీ 
రాజకీయ పురస్కారాలు కావటం వల్ల 
తరచూ వివాదాలల్లో చిక్కుకుంటూ ఉన్నాయి. 

ఋత్విక్‌ ఘటక్‌ అనే ప్రముఖుడు 
గాంధీజీని అశ్లీల భాషలో తిట్టాడు. 
అతనికి పద్మశ్రీ పురస్కారం లభించింది. 

ఇదేమిటయ్యా 
అని విలేఖరులు ప్రశ్నిస్తే 
అప్పుడు నాకు మతి స్థిమితం లేక తిట్టాను 
అని సమాధానం చెప్పి తప్పించుకున్నాడు.

శ్రీ పిరాట్ల వెంకటేశ్వర్లు
మాననీయ పి.వి నరసింహరావు గారు 
కేంద్రంలో ఉన్నప్పుడు 
విశ్వనాథ సత్యనారాయణ గారికి గుర్తింపునిప్పించారు. ఎ.ఆర్‌.కృష్ణ, 
కాళోజీ, 
సినారె వంటి కవిపండితులకు 
జాతీయ స్థాయిలో గౌరవం లభించింది. 


దీనిని బట్టి తేలేదేమంటే 
ఒక కళాకారుడు కవి ఎంత గొప్ప వాడైనా
 ఒక రాజకీయవేత్త సహాయ సహకారాలు లేకుండా స్వయం ప్రకాశం పొందజాలడు. 
వైజయంతిమాల, 
మంజుభార్గవి, 
శోభానాయుడు, 
స్వప్నసుందరి, 
రాజారెడ్డి, 
రాధారెడ్డి వంటి 
జాతీయ అంతర్జాతీయ స్థాయిలో 
గుర్తింపు పొందిన నర్తకీమణులకు 
అవకాశాలు పురస్కారాలు రావటానికి కూడా 
కొందరు ప్రముఖులు పట్టుదలతో చేసిన కృషియే కారణం. 
అంటే 
కళాకారుల కృషితో బాటు 
వారి ప్రోత్సాహకుల కృషి కూడా అత్యంత అవసరం 
అని నిరూపింపబడింది. 
మహాశ్వేతాదేవి మావోయిస్టు రచయిత్రి కాకపోతే 
ఆమెకు బెంగాల్‌లో 
ఇంత గుర్తింపు వచ్చి ఉండేది కాదు. 
ఆమె ఏయే సందర్భాలల్లో 
దేశ వ్యతిరేక ప్రకటనలు చేశారో
 23 మార్చి 2010 దిన పత్రికలో 
కృష్ణాపత్రిక సంపాదకులు శ్రీ పిరాట్ల వెంకటేశ్వర్లు 
సోదాహరణంగా ఒక వ్యాసం వ్రాశారు. 

ఎన్‌.టి.ఆర్‌ వంటి 
దేశ భక్తుడు జాతీయవాది పేర 
తస్లిమా నస్రీన్
ఒక వివాదాస్పద రచయిత్రికి 
పురస్కారం వివాదాస్పదమైంది.






బంగ్లాదేశ్‌కు చెందిన 
తస్లిమా నస్రీన్‌ అనే ముస్లిం రచయిత్రి 
లజ్జ                                                    
అనే గ్రంథం రచించారు. 
ఆ పుస్తకం పై 
ముస్లిం మత పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అలాంటప్పుడు 
ముస్లిం ఓటు బ్యాంకును కాపాడుకోవటం కోసం 
కలకత్తా నస్రీన్‌కు ఆశ్రయం కల్పించటానికి 
ప్రభుత్వం వెనుకాడింది. 


కాని 
హింసను సమర్థించే మహాశ్వేతాదేవిని నెత్తినెక్కించుకున్నారు -
ఇవే సాహిత్య రాజకీయాలంటే!

పురస్కారం యువతకు ప్రోత్సాహం -
పెద్దలకు సత్కారం 
కాని రాజకీయ పురస్కారాలు ఇచ్చేవారు పుచ్చుకునేవారు కూడా 
సిగ్గుతో తలవంచుకోవలసినవి -
ఇప్పుడు జరుగుతున్నది అదే! 

భారత దేశంలో అంతులేని దరిద్రం ఉంది. 
వాటిని వ్యాపారపుముడి సరుకులుగా 
మార్చుకోవటం 
కొందరు రచయితలకు, రచయిత్రులకు బాగా తెలుసు. 
పేదకన్నీటి ప్రవాహాలలో 
బోటు షికారు చేయటం
 మాయావతులకూ మహా శ్వేతలకు సమాన ధర్మం.
  
అందుకే ..
రామమూర్తి రేణుగారు ..
"మిత్రుడు మిగిల్చిన జ్ఞాపకాలు.. అనుభవాలు "లో 
ఇలా అని తృప్తి పడ్డారు..


"నేడు తన తీయని ..పవిత్ర స్మృతులను ..
మాత్రమే మనకు వదలి ..
నా నెచ్చెలి వెళ్ళి పోయాడు.
ఆ సరస్వతీ పుత్రుని సంభావించి ..సన్మానించిన ..
సంస్థలు తమ ఉనికిని స్థార్థకం చేసుకున్నాయి. 
పైరవీలకు ..ప్రలోభాలకు ...మాత్రమే సంక్రమించే..
పెద్ద పెద్ద సమ్మానాలు.. అవార్డులూ ..
రాకపోవటంతో ..
ఆయన నిష్కలంక చంద్రుడైనాడు.
ఆ సంస్థల పక్షపాత పంకం..
ఆయన నంటుకోక పోవటం.. 
ఆయన అదృష్టమే.. 
శివతాండవం ఆయన అక్షర శరీరం. 
నిస్సంశయంగా ..భర్తృహరి పలుకుల్లో .."

13 ఏప్రి, 2012

పుట్టపర్తి నారాయణాచార్యులు మృదంగ సాధన--పుట్టపర్తి అనూరాధ.



భాస్కర భట్ల కృష్ణమూర్తి ..
ఆకాశవాణిలో మృదంగ విద్వాంసుడు..
ఆయన భార్య పేరు భ్రమరాంబ..
వారికి లలితాంబ అని ఒక పాప ..
ఎర్రటి నోరు..
తెల్లటి పిల్ల ..రెండున్నర సంవత్సరాలేమో..
రెండు పిలకలు వేసుకొని ..

అమ్మ వెనకే నీళ్ళకు వచ్చేది. 
నాగ ఆపిల్లను బాగా ఆటపట్టించేది.
వాళ్ళు మా ఇంట్లో నీళ్ళు పట్టుకుని వెళ్ళేవాళ్ళు.
మా అక్కయ్యా రేడియోలో పని చేసేది డ్యూటీ ఆఫీసరుగా..
ఆ పిల్లను నీపేరేమిటే అంటే ..

లలితాంబ ..అనేది.
భ్రమరాంబ ను నేను 

అత్తా.. అత్తా ..అనేదాన్ని 
మా వేపు ఆడాళ్ళయితే ..అత్త మగాళ్ళైతే.. మామ..
ఆమె మడి నీళ్ళూ పట్టుకోడానికి..

తడి చీరెతో నే వచ్చేది.
ఆమె వెంట ఆ పిల్లానూ.
మా నాగ ఆపిల్లతో బాగా సరదాగా ఉండేది..
అయ్య అరుగుపై కూచుని అందరినీ చూస్తూ ఆనందించేవారు. 
అప్పట్లో ..
కడప రేడియో లో పని చేసే..
ప్రియంవద ..కొక్కొండ సుభ్రమణ్య శర్మ..
భూషణరావ్.. శేషగిరిరావ్..
అందరూ మాకు అతిధులే..
ప్రియంవద అక్క పెళ్ళి చేసుకోలేదు కుటుంబంకోసం.. ఆవిడ అలానే ఉండిపోయారు ..

ఆవిడకు కృష్ణుడంటే ఎంత భక్తో..
ఆవిడ కంఠస్వరం  సన్నగా.. తీగలా..
మధురంగా ..
అందులో ఏ భావమైనా అవలీలగా పలికేది..
అయ్య పాటలు ఎన్నిటినో ..

ఆమె స్వరపరిచింది భక్తి రంజని కోసం..
అవి అలాంటి ఇలాంటి పాటలు కాదు..

బ్రహ్మాండమైనవి,.
అక్కయ్య.. ఆమె కొలీగ్స్ ..

ఎన్నో ఈ మాసపు పాటలు కలిసి పాడారు.
అక్కయ్య ఆ రోజుల్లో..

ఎంతో హుషారుగా వుండేది..
జానపద గీతాలేమి ..లలిత గీతాలేమి..
జింగిల్స్ అయితేనేమి..
అన్నిటా నాగపద్మిని ఉండవలసిందే ..

నేనూ కవితలు వ్రాసేదాన్ని ..
అయ్య నాకు హయగ్రీవం ఉపదేశించారు.
నేనూ ..యువవాణి లో ..

అక్కడా ఇక్కడా కవితలు చదవటం
అక్కయ్యనూ నన్నూ చూసి ..

అయ్య అమ్మ ఎంతో మురిసి పోయేవారు ఆనందపడేవారు.
 
మా అయ్య.. 
మనుమడు శ్రీకాంతుతో ..
అప్పుడప్పుడూ సరదాగా కుస్తీ కి దిగేవారు .
నవ్వి ..నవ్వి ..

అయ్య ముఖమంతా ఎర్రగా అయిపోయేది.
అయ్యకు ఊరికే ..
అలా టైం వేస్ట్ చేయటం ఇష్టం ఉండదు.
ఎవరైనా రేడియో విన్నా ..

TV చూసినా.. 
అయ్యకు చెప్పలేనంత కోపం వస్తుంది.
బాగా తిట్టేవారు.
అయ్య రూం మిద్దె పైన ఉండేది ప్రశాంతంగా..
అయ్య రూం తలుపు వేయగానే..

 పెద్ద శబ్దం వస్తుంది. 
ఆ శబ్దం వినగానే హింట్.. 
అయ్య కిందకి వస్తున్నారని
 

అంతే ..
ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్..
 

అయ్య గొప్పవాడు కనుక ..
అందరూ మా ఇంటికి వచ్చి..
అయ్యను సేవించుకుని వెళ్ళేవారు.
భాస్కర భట్ల కృష్ణ మూర్తి గారు ..
తెల్లవారి నాలుగున్నరా.. అయిదుకి ..
మృదంగ సాధన చేసేవారు.
భ్రమరాంబగారి తమ్ముడు రామకృష్ణా హై స్కూల్ లోనే చేరాడు 

నేను తొమ్మిదవ తరగతి.
అప్పుడప్పుడూ వాడు అక్కా.. లెక్కలు చెప్పు 

అని వచ్చేవాడు.
అయ్య భాస్కర భట్ల గారి దగ్గర..
మృదంగ సాధన చేసేవారు ..
అప్పుడు ..
అయ్య వయసు డెబ్బయ్ అయిదుండవచ్చును.
అయ్యకూడా తెల్లవారే లేచి ..
ఆ జతులను  ప్రాక్టీసు చేసేవారు.

తధ్ధిన్నాంకిట ..తధ్ధినాంకిట..
తధ్ధిన్నాంకిట.. తత్తరికిటతక..


తత్తరిత్త ఝణు.. తత్తరిత్తధిమి ..
తధ్ధిమితకిట.. తరిగిట తరిగిట తోం..




9 ఏప్రి, 2012

పుట్టపర్తినారాయణాచార్యులు జనప్రియ రామాయణ రచన జనప్రియం 2--పుట్టపర్తి అనూరాధ

వల్లంపాటి గారు మా అయ్యపై ..
నా స్మృతి మంటపంలో పుట్టపర్తి ఎంత బాగా వ్రాసారు.
మేము చూసిన మా అయ్యను ఎంత బాగా అర్థం చేసుకున్నారు
మేము చూసినదాన్ని ఆయన నోట వింటున్నట్లుంది.
మేము అనుభవించినదాన్ని..ఆయన మా మనసుల్లోంచీ వెలికి తీసినట్లుంది.




సంవత్సరం జ్ఞాపకం లేదు కానీ, 
నంద్యాలలో జరిగిన రైతుమహాసభలో కూడా
వారు ఉపన్యసించారు. 
ఆ ఉపన్యాసాన్నివిన్నవారు కూడా 
ముగ్ధులైపోయారు. 
దురదృష్టవశాత్తు
ఈ రెండు ఉపన్యాసాలను గురించీ 
పెద్దలు చెప్పగా వినటమేకానీ, 
నేరుగా వినే అదృష్టం నాకు లేకుండా పోయింది.
సంస్కృతం – ఇంగ్లీషు, 
ప్రాచీనం – ఆధునికం, ఆధ్యాత్మికం –
సామాజికం, సమాజం – వ్యక్తి 
ఇలా అనేక ద్వంద్వాల విషయంలో
పుట్టపర్తి వారిలో 
నాకు తెలిసినప్పటినుంచీ ఊగిసలాట ఉండేది.


ఈ ఊగిసలాటను 
ప్రాచీన మార్గీయులు అవకాశవాదంగానూ..,
నవీనులు అశక్తతగానూ భావించేవారు..
 కానీ ఇరువురూవారిని ..
స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకునేవారు.
తమను తాము ..
వీరిద్దరూ కూడా ప్రమాణాలుగా భావించేవారు.


తమకంటే కాస్త ఎక్కువగా మారటం చేత ..
ప్రాచీనులూ,
తమంతగా మారకపోవటం చేత నవీనులూ..
వారిని..
నిరాదరంగా చూసేవారు..

మారటానిక్కానీ, మారలేకపోవటానిక్కానీ 
వారు అనుభవించిన వేదనను 
ఇద్దరూ గుర్తించేవారు కాదు.

చెప్పవచ్చేదేమిటంటే..
 పుట్టపర్తి వారు తన్ను తాను మార్చుకోవటానికి
శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. 
కానీ మారలేకపోయారు.
“ఇందులో వారు సాధించిందేమిటి? 
చివరకు రామాయణం వద్దకేవచ్చారు కదా?” 
అని కొందరు ప్రశ్నిస్తుంటారు. 

అది వారి రామాయణాన్ని
చదవకుండా అనే మాట.  
వారు తాను రామాయణాన్ని భక్తి కోసంరాశానని అన్నా, వారు దాన్ని కవిత్వం కోసం రాశారని నా నమ్మకం.

 తెలుగులో ఉన్న ఇతర రామాయణాలకూ, 
పుట్టపర్తి వారి“జనప్రియ రామాయణం” కూ
 ఉన్న తేడా మౌలికంగా కవిత్వంలోనే..
ఉందన్నది నా నిశ్చితమైన నమ్మకం. 
వాల్మీకికి దగ్గరగా ఉన్న రామాయణం 
పుట్టపర్తి వారిది మాత్రమే!
ఇరవయ్యవ శతాబ్దపు కవుల్లో ..
పుట్టపర్తివారిని సుదూరంగా పోలిన
పండితుడు కూడా లేడన్నది 

నా దృఢవిశ్వాసం..

అసలు వారు 
రామాయణాన్ని రాయటమే భక్తి కోసం.
మతవ్యవస్థలని సమర్థించటం కోసమో, 
ఖండించడంకోసమో 
తాను రామాయణాన్ని రాయటం లేదని చెబుతుండేవారు.


రామకథ కవియన్న వానికెల్లను సేద్యమైనదని అవతారికలోచెప్పారు.
తాను రామాయణంలో చేసిన మార్పుల్ని గురించి
 కూడా అప్పుడప్పుడూ ప్రస్తావిస్తుండేవారు.
 వారి రామాయణంలో కైక
దుర్మార్గురాలు కాదు.
దశరథుడు బహుపత్నీకుడూ,స్త్రీలోలుడూ అయిపోయాడు.
అతనితోరఘువంశం యొక్క కీర్తిప్రతిష్టలు, ధర్మనిష్టాపతనం కావటం ప్రారంభించాయి. 
రావణుని వంటి వారు అతని రాజ్యం మీద
అక్రమాలు చేస్తున్నా వారిని నిరోధించే శక్తిని
 దశరథుడు కోల్పోయాడు.


దశరథునిలో లేని గొప్ప గుణాలు
 కైకకు రామునిలో కనిపించాయి.
 లోకకల్యాణం కోసం, 
ధర్మరక్షణ కోసం తాను చెడ్డపేరును
 కోరి తెచ్చుకొని కైక రాముణ్ణి అడవులకు పంపింది. 
ఇదీ కైకకు
పుట్టపర్తివారి వ్యాఖ్యానం. 
“వాల్మీకి కథను మార్పు చేయటాని
కి నీకేం అధికారం ఉంది?” 
అని ఎవరైనా అడిగితే 
“రామకథను
 కావ్యాలుగా, నాటకాలుగా రాసిన వాళ్ళల్లో
 మార్పు చేయనివాణ్ణి
ఒకణ్ణి చూపించు” 
అనేవారు.
అంగదుని పాత్రను హామ్లెట్ ను ఆదర్శంగా
తీసుకుని తీర్చిదిద్దారు. 
అంగదుడు వాలి కొడుకు. 
అతని తల్లి తార
వాలిని చంపిన సుగ్రీవుణ్ణి పెళ్ళాడింది. 
తండ్రిని చంపినవాడి కొలువులో
అంగదుడు క్లాడియస్ కొలువులో హామ్లెట్ లాగా – ఆత్మను
చంపుకుంటూ జీవించవలసి వస్తుంది.  


“రామాయణం మీద
షేక్స్పియర్ ప్రభావమేమిటి?”
 అని ఎవరైనా ప్రశ్నిస్తే పుట్టపర్తి
వారు ఇలా సమాధానం చెప్పేవారు.
అంగదుని పాత్రను హామ్లెట్ ను ఆదర్శంగా
తీసుకుని తీర్చిదిద్దారు. 
అంగదుడు వాలి కొడుకు. 
అతని తల్లి తార
వాలిని చంపిన సుగ్రీవుణ్ణి పెళ్ళాడింది. 
తండ్రిని చంపినవాడి కొలువులో
అంగదుడు క్లాడియస్ కొలువులో హామ్లెట్ లాగా – ఆత్మను
చంపుకుంటూ జీవించవలసి వస్తుంది.  


“రామాయణం మీద
షేక్స్పియర్ ప్రభావమేమిటి?”
 అని ఎవరైనా ప్రశ్నిస్తే పుట్టపర్తి
వారు ఇలా సమాధానం చెప్పేవారు.

“ఏ రచయిత ఏం రాసినా ప్రాథమికంగా 
మానవ ప్రవర్తనను గురించే రాస్తాడు.


మానవ ప్రవర్తనలోని లోతులు 
వ్యాసునికి, షేక్స్పియర్ కూతెలిసినంతగా
ఎవరికీ తెలియవు. 
ఆ దృష్టితో చూసినప్పుడే
నాకు అంగదుడిలో హామ్లెట్ కనిపించాడు. 
షేక్స్పియర్ ను చదివినవాడి రాతకూ 
చదవనివాడి రాతకూ తేడా ఉంటుందని నా నమ్మకం”
 అనేవారు.
ఒకసారి నేనూ, పుట్టపర్తి వారూ కలిసి
 మదనపల్లెకు సమీపంలో
ఉన్న కలిచర్ల అన్న గ్రామానికి వెళ్ళాం. 
అక్కడ ఏడాదికోసారి చాలా
పెద్ద పరష (పశువుల సంత) జరుగుతుంది. 
అప్పుడు అక్కడ
తెలుగు పండితుడిగా పనిచేస్తున్న కథారచయిత వేణు, ఒక కవి గోష్ఠి ఏర్పాటు చేశాడు. 
అంటే పశువుల్ని కొనటానికో, అమ్మటానికో
వచ్చిన రైతులకు కవిత్వం చదివి చెప్పటమన్నమాట.


ఆ సందర్భంలోనే
 మరో వినోదాన్ని కూడా ఏర్పాటు చేశారు.
పరష జరిగేది ఒక పెద్ద తాటితోపులో. 
ఆ తోపులో ఉన్న
 ఏ చెట్టును చూపిస్తే దాన్ని 
ఒక వ్యక్తి తన చేతుల్తో ఊగించికూలదోసేస్తాడు. 
ఈ సంగతి తెలియానే పుట్టపర్తి వారు
చిన్నపిల్లాడిలా సంబరపడిపోవటం ప్రారంభించారు.

“ఒరే సుబ్బయ్యా, 
త్వరగా తయారుగా. మనం దగ్గరగా నిలబడి
 వాడి బలప్రదర్శన చూడవలె..
 నిజంగా అది సాధ్యమారా..?
ఇంకా అట్లాంటి బలవంతులు ఉన్నారంటావారా?” 
అంటూ మాట్లాడుతూనే ఉన్నారు.

అందరికంటే ముందుగానే ఆ తాటితోపు చేరుకున్నాం. ఎద్దుల మధ్య తిరుగుతూ..
 వారు ప్రతి చెట్టునూ పరిశీలించటం ప్రారంభించారు.
అలా కూలదోయటం కష్టం కావాలంటే..
 తాటి చెట్టు ఎత్తుగా ఉండాలా..?,
 లావుగా ఉండాలా..?
 అని ఆలోచించటం ప్రారంభించారు.
ఈలోగా ..
గుబురుగా ఉన్న తాటి చెట్ల వద్ద జనం చేరారు.
ఆ పరష జరిపిస్తున్న 
కలిచెర్ల నరసింహారెడ్డి గారు కూడా 
అక్కడికొచ్చారు.
పడదోసే తాటిచెట్టును వెదికే కార్యక్రమం ప్రారంభమైంది. అనుభవంఉన్న ముగ్గురు రైతులు ..
దాదాపు యాభై అరవై చెట్లను నిశితంగా
పరిశీలించి ఒకదాన్ని ఎంపిక చేశారు. 
ఆ చెట్టు బాగా బలంగా ఉంది.
వేళ్ళు భూమి లోపలికే ఉన్నాయి.
 ఎత్తు దాదాపు ఇరవై అడుగులుండవచ్చు.


తరువాత అక్కడి వాళ్ళు చెప్పారు.. 
చెట్టు ఎత్తు ఎక్కువ ఉండకూడదట,
అది బలంగా కౌగిలించుకోవటానికి 
వీలు లేనంత బలంగా ఉండాలట,
దాని వేళ్ళు భూమి పైన కాక, 
భూమి లోపల ఉండాలట, 
అందరూ
ఆ చెట్టు వైపుకు నడిచారు, 
పరిశీలించారు.
పుట్టపర్తివారుచిన్నపిల్లాడిలాగా దాని చుట్టూ తిరిగి చూశారు.
“ఒరే, వాడు నిజంగా దాన్ని తోసేస్తాడంటావా?”
 అని అడిగారు.
“చూద్దాం” అన్నాను.
ఇంతలో అసలు వ్యక్తి బయటికొచ్చాడు.
ఇప్పుడతని పేరు జ్ఞాపకం రావటం లేదు.
అతడు సాధారణంగా ఉన్నాడు.
పాంటు,షర్టు వేసుకున్నాడు.
అతడు ఆ ప్రాంతం వాడేనట.
బెంగళూరుహెచ్,ఏ,ఎల్ లో ఉద్యోగం చేస్తున్నాడట.

అతడు ముందుకొచ్చి చొక్కా, పాంటు విప్పి 
పక్కనున్నపొదమీద పారేశాడు.
లంగోటీలో నిలబడ్డ అతడు బలంగా ఉన్నాడే కానీ తాటిచెట్లను పెకలించేవాడిలాగా లేడు. 
పుట్టపర్తి వారు ఆసక్తిగా, అపనమ్మకంగా 
అతని వైపు చూస్తున్నారు.
అతడు పది బస్కీలూ,దండాలూ తీశాడు.
రెడ్డిగారికి నమస్కరించాడు.
తాటిచెట్టు వద్దకు వెళ్ళి దాని మొదలు తాకి 
మూడుసార్లు దండం పెట్టుకున్నాడు.


దాన్ని కౌగిలించుకుని కదిలించడం ప్రారంభించాడు.
పుట్టపర్తివారు ఆసక్తిగా..
దగ్గరకి వెళ్ళి నిలబడ్డారు.
మొదట చెట్టులో కదలిక కూడా లేదు. 
అరగంట తరువాత
తాటిమట్టలు గలగలలాడటం ప్రారంభించాయి.
మరో అరగంట తరువాత 
చెట్టు ఊగటం ప్రారంభించింది.
ఒకటొకటిగా చెట్టువేళ్ళు
పటపటమని తెగటం ప్రారంభించాయి. 
మరో గంటలో ఆ చెట్టుకూలిపోయింది. 
పుట్టపర్తివారు గొప్ప ఆరాధనతో 
ఆ వస్తాదునుచూస్తున్నారు. 
అతడు రెడ్డిగారి ముందుకొచ్చి నిలబడ్డాడు.
అతని వక్షస్థలమంతా గీక్కుపోయింది.
దండల మీద అక్కడక్కడా చిన్నచిన్న రక్తం చారికలు కనబడుతున్నాయి.


రెడ్డి గారు ఉద్రేకం పొంగుతున్న ముఖంతో
 అతనికి డబ్బూ,కొత్తబట్టలూ ఇచ్చారు.
వాటిని అందుకుని, రెడ్డిగారికి వినయంగా
నమస్కారం చేసి, 
మళ్ళీ కూలిపోయిన తాటిచెట్టు వద్దకు వెళ్ళి
దాన్ని మూడుసార్లు కళ్ళకద్దుకుని  నిలబడ్డాడు అతడు.


జనం అతణ్ణి వదిలేసి 
కూలిపోయిన తాటిచెట్టు చుట్టూరా చేరారు.
ఆ రోజు రాత్రి మదనపల్లి చేరుకున్నాం.
పుట్టపర్తివారు ఆ సంఘటనను
 గురించి ఆశ్చర్యంతో చెబుతూనే ఉన్నారు.
“ఒరే సుబ్బయ్యా, కవిగా నాలో ఒక గొప్ప బలహీనత ఉందిరా”
అన్నారు అకస్మాత్తుగా.
నేను నిశ్శబ్దంగా ఉన్నాను.
“నేను శృంగారాన్నీ,భక్తినీ,కరుణనూ అద్భుతంగా రాయగలనని నా నమ్మకం.
అందులో ఇప్పుడు రాస్తున్న తెలుగు కవులెవరూ
 నాదరిదాపులక్కూడా రాలేరు.
కానీ వీరరసం వద్దకు వచ్చేసరికి చతికిలపడిపోతాను.


ఇప్పుడు “జనప్రియ రామాయణం” లో 
సుందరకాండ రాస్తున్నాను కదా.
యుద్ధకాండ వస్తున్నదంటేనే భయంగా ఉంది.
దాన్నిరాయలేనేమోనన్న భయం 
లోపల్లోపల పీకుతూ ఉంటుంది. 
భుజబలం మీద పూర్తిగా నాకు విశ్వాసం లేదు.
అందుకే వాడెవడో తాటిచెట్టును
పడదోస్తానంటే నమ్మలేకపోయినాను.


ఇప్పటికీ వాడుచేసిన పని కళ్ళారా చూసినా
 నమ్మబుద్ధి కావటం లేదు.
వీరరసానికీ, నా తత్వానికీ పడదురా” 
అన్నారు.
నిజమే ..
వారు యుద్ధకాండ వద్దకే రాలేదు.
యుద్ధకాండ రాయకుండానే వెళ్ళిపోయారు…..

            జనప్రియ రామాయణ రచన జనప్రియం
డా. నారాయణం రామమూర్తి ఢిల్లీ..


రామకథను దేశభాషలలో ..
యెవరి అనుభూతి మేరకు వారు ..
అత్యద్భుతంగా రచించారు ..
మహాకవులెందరెందరో ..
ప్రపంచంలోని ఇతర భాషలలో కూడ ..
రామాయణ రచనలు చేసారు. 
రామగాధ దేశకాలాలకు అతీతంగా వుండి..
అందరినీ ఆకర్షించింది.. 
తెలుగు భాషలో ఎందరో మహానుభావులు
రామకథను అనేక ప్రక్రియలలో రచించారు.


త్యాగరాజస్వామి వారు..
రామకథను గేయ రూపంలో రచించి ..
స్వయంగా తానే వానిని..
మృదుమధుర రాగాలలో గానం చేసారు.

గోన బుధ్ధారెడ్డి ..
రంగనాధ రామాయణాన్ని ద్విపదలో రచించారు
అదొక విశిష్ట రచన..
కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణగారు రచించిన
శ్రీ మద్రామాయణ కల్ప వృక్షం..
 ఆంధ్రదేశంలో అమోఘమైన సంచలనం సృష్టించింది. 

ఇదే సమయంలో ..
పుట్టపర్తి వారు కూడ..
రామాయణ రచన చేయదలచారు..
ఇతర కవుల రచనల కన్న ..
పుట్టపర్తి వారి రామాయణ రచన యొక్క పరమార్థం విశిష్టమైనది.
పూర్వ రచనల కన్న భిన్నవైఖరి కలది.

సంస్కృతంలోని వాల్మీకి రామాయణం..
వ్రజభాష (హిందీ) లోని తులసీ రామాయణం ..
తెలుగు..
తమిళ ..
మరాఠీ..
మళయాళ భాషలలో..
వెలువడ్డ వివిధ రామాయణ రచనలు ..
ఒక్కసారిగ పుట్టపర్తి వారి మానసవీణను మీటి ..
ఆయన హృదయంలో ..
కవితామృతాన్ని నిపినాయి..

వెనువెంటనే ..
ఆచార్యుల వారు..
ఆధునిక కవులెవ్వరు అంటని ..
చతుష్పద షట్పదులను స్వీకరించి ..
గాన యోగ్యమైన తీరులో ..
రామాయణాన్ని ..
కిష్కింద ..
బాలకాండలు రచించారు..
దాని పేరే "జనప్రియ రామాయణము."
శ్రీ పుట్టపర్తి వారు..
రామకథా కధనలో..
తన మానస వీణను మీటిన..
మహానుభావుల నెందరినో ..
తన కావ్య పీఠికలో స్మరించి..
వారికి వినమ్రంగా అంజలి ఘటించారు.
 
రామాయణంలో..
అతికష్టమైన కిష్కింధ కాండను..
వారు మొదటిగ రచించారు..
దానిని పండిత పామర సభలలో వింపించారు. 
అందరు రచనను బహుధా ప్రశంసించారు.

రామాయణ రచన..
ఆచార్యుల వారి కలం నుండి....
యెంతో సరళ సుందరంగా జాలువారింది.

 అభిమానులు..
సాహితీ వేత్తలు ..
వారి రచనను ప్రోత్సహించారు. 
ప్రశంసించారు..
ఆచార్యుల వారు ..
రామాయణ రచనను పూర్తి చేసారు ..

కానీ ..
ఇప్పటికి..
బాల ..
కిష్కింధ కాండలు..
రెండు మాత్రమే ప్రచురింపబడ్డాయి..

ఈ రచన..
 పాఠకుల హృదయం నిండుగ..
 భక్తి భావాన్ని నింపుతుంది.. 
ఆచార్యులవారు రచించిన..
 జనప్రియ రామాయణములోని రాముడు..
 సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ..!!!
పాఠకులకు..
 ఆయన భగవంతునివలె అనుక్షణం దర్శనమిస్తాడు.  

కిష్కింధలోని తార..
అంగదుల పాత్రలు అత్యద్భుతాలు. 
తార పాత్ర పోషణలో..
రచయిత చూపిన ప్రతిభ విశిష్టమైనది.
పుట్టపర్తి వారు ..
రామకథా రచయితలైన వారిని 
కావ్యారంభంలో స్మరించిన తీరు గమనింప దగును.
వాల్మీకి
ఆదికవీ..!!వేదాత్మకమగు నీ
కవితామృతమున నవనియేమి..?నా
కమ్ముగూడ పూతమ్ముగ నైనది..
దీవింపగవలె నీదాసున్..
 
తులసీదాస్
ఆరఘువీరున కాప్తుడ వగునో
తులసీ నిద్రల మెలకువలను నీ
యడుగులు,నా దైవంబగుతన్..
తులసీ పవిత్ర వా
క్కులతోడ నిరతంబు
పూతమైనది నాదు మనమూ తద్రచిత
రామాయణమ్ము నా ధనమూ తచ్చరణ
కమల రజముల కధా కథనంబు సాగిపో
వును లోక కల్యాణ భూమిగా దిరముగా
 
కంబన్
ద్రావిడామ్నాయంబు
ధన్యముగ రఘువ్వరుని
కీర్తి బల్కిన యట్టి ఘనుడూ కంబరు మ
హాజ్ఞాని వేదార్థ విదుడూ తద్రచన
ములు ద్రావువారికి తరుల వచశ్చాతుర్య
మశున పక్షికి వినుచునట్టి తమ్మట రవము

ఆచార్యుల వారు.. 
బహుభాషా కోవిదులగుట వలన ..
సంస్కృత ..
హిందీ.. 
తమిళ ..
రామాయణాలలోని అందచందాలను..
 ఆపోశన పట్టి ..
తన రచనలో వానిని మెరుగులు దిద్దారు. 

వారి రామాయణములోని ప్రతి పాత్రలోను ..
భక్తి భరితమైన ఆర్ద్రత ..
పుష్కలంగా నిండి వుండి..
 పాఠకుల మనోకుహరంలో నొక వినూత్న భావ రేఖను ఉదయింప చేస్తుంది.

రామలక్ష్మణులతో..
సుగ్రీవునకు హనుమ ద్వారా మైత్రి ఏర్పడుతుంది. 
పిదప ..
సుగ్రీవుడు తన అన్న వాలిని..
రెండవమారు యుధ్ధానికి రమ్మని ..
సవాలు చేస్తాడు. 

సుగ్రీవుని మద గర్వాన్ని అంతం చేయాలని..
వాలి సన్నధ్ధుడౌతాడు.
 
అది గమనించిన తార 
చాల దూరాలోచన చేసి ..
"సుగ్రీవుని యువరాజు గ చేసి ..
భ్రాతృద్వేషాన్ని  పోగొట్టుకో వలసినదిగ హితముపదేశిస్తుంది. 

మరియు..

అన్నదమ్ములకు నగ్గి రగిల్చిన
కాకుత్థుని చెలికారము గోరుము
బలవంతులతో బగ లంటిన రా
జ్యమ్ములు బ్రదుకులు దక్కెడునే..

అని అంటూ..
సుగ్రీవునకు ..
పరాక్రమ వంతులైన..
 రామ లక్ష్మణుల అండదండలు ..
పుష్కలంగా వున్నాయని..
 వారి వల్లనే సుగ్రీవుడు నిన్ను..
యుధ్ధానికి మరల రమ్మని పిలుస్తున్నాడని..
యుధ్ధానికి పోవటం మంచిది కాదని ..
యుధ్ధానికి పోవటం మంచిది కాదని బోధిస్తుంది.
 
పైగా..
 మీ యిరువురకు యుధ్ధాన్ని రగిల్చిన..
ఆ రాముని స్నేహాన్ని ..
వాంచించమని చెబుతూ..
 బలవంతులతో పగ వల్ల ..
రాజ్యాలు.. 
జీవితాలు.. 
నాశనమవుతాయని హెచ్చరించిన రాజకీయవేత్తగ ..
పుట్టపర్తివారు ఆమెను చిత్రించారు. 

వారి పాత్ర చిత్రణ అమోఘమైంది.
శ్రీ రాముని బాణహతికి వాలి మరణిస్తాడు 
అతడి మరణానంతరం 
తార తన సమస్తాన్ని శాశ్వతంగా కోల్పోయినట్లు విపరీతంగా విలపిస్తుంది.

వగపెరుగని నా బ్రదుకిక వై ధ
వ్య విదూనితమై యపగత సుఖమై
కృపనంబై కడి యెడలిన పూలై
యనాధమై యిటె నశియించున్

అనియు

ఓయి..1 హృదీశ..! మహా యూధవ యూ
ధవ నీతోనే దలగెను నా యా
శలు, సంతోషమ్ములు నా కిక
మిగిలినదొకటే!! దుఃఖ వ్రతమూ..!!

అని విలపించింది.
 
భర్త ప్రాణంతో ముడిపడిన ..
తన సంతోషము ..
తన జీవనము ..
భర్త మరణంతో పూర్తిగ పోయాయని..
తనకిక మిగిలింది కేవలం సహగమనం ఒక్కటేనని..
 అదే శరణ్యమని..
 విలపిస్తుంది ఆమె. 

ఆమె దుఃఖం కట్టలు తెంచుకు ప్రవహిస్తుంది. 

నా గుండె ఇనప గుండె..
లేకున్న..
నీ మరణ వార్త వినగనే..
 వేయి ముక్కలు చెక్కలై పోవలసినది. 
కాలమే నీపై కత్తి కట్టి ..
నిన్నిట్లు సుగ్రీవునితో యీ ఘోరము చేయించినది ప్రాణములు కోల్పోయిన నీవు ధన్యుడవే. 
నేనే కుంకుమకు నోచుకోని దాన నైతిని. 
అని పైపరి విధముల..
 ఆమె విలపించుట గమనింపదగును.
 
వయసును రూపము నయమును గల వగకత్తెలు , 
నిను గుడి గ్రుత్తురు, కౌగిట
నాకములెఒ, మరి నా కుంకుమ మీ
నాటికి దీరినదోయి ప్రభూ

అనియూ

ఆ రవిజుని భార్యను బట్టితి, నా
తనిఁ దోలితి  సాంద్రారణ్యములకు
నా ఫలమే యిటులై నీ చావై
నా కుంకుమను దుడిచినదీ..
అని దుఃఖించినది. రుమను
చెరబట్టి సుగ్రీవుని అరణ్యములకు పంపి భార్యాభర్తలిరువురిని నీవు వేరు చేసితివి. 
ఆ పాప కార్య ఫలమే 
నా పాలిటి దుఃఖమై 
నిన్ను నాకు దూరము చేసినది
 నా నుదుటి కుంకుమ తుడిచివైచినదని
 దురపిల్లినది.
 
వాలి ప్రాణములు వీడిపోవుచు ..
తమ్ముడైన సుగ్రీవుని దగ్గరకు పిలిచి..
వినయముగ నీవు తార సూచనలను పాటించుము. 
రాజ్య పాలనమున ..
ఆమె అభిప్రాయములకు వెలకట్టుమని సూచించుచు..

తారాధిపముఖి, తార, సుషేణుని
కొమరిత, సూక్ష్మార్థములను గమనిం
చి నిర్ణయమ్ములు సేయుటలె గడు
మెలకువ గలయది, మది గలదీ..
ఒక్కట నున్నది, యొక్కట లేదని
చెప్పగాదు, తచ్చిక్షా దక్షత
శకునమ్ములు మొదలఖిల విద్యలను
బేరు మ్రోసినది యాతార..!!
తారా వచనము దప్పినది పోయినది
లే, దేనాడిది సత్యంబు.

తార గునగనాలను వ్యక్తీకరిస్తాడు.
 వాలికి తార మాట శిలాక్షరమైనది. 

ఆమె రాజ్యతంత్రము అమోఘమైనది. 
ఆమె సూక్షమ విషయగ్రాహి..
 సమస్త విద్యల యందు ఆరితేరిన..
ఆమె ఆలోచనలను పాటించుట వలన ..
యెల్లవేళల రాజ్యమునకు శుభమే కల్గినది కాని.. అపజయ మింతవరకును చవిచూడలేదని..
 సుగ్రీవునకు వాలి తెలియజేయుచు..
 తార గొప్పదనమును ప్రశంసించుట..
 బహుధా ప్రశంసించదగినది. 
వానర రాజ్యానికి ..
ఆమె ఆలోచనలు పెట్టని కోటలు..
 
సుగ్రీవుడు..
 సుఖజీవనంలో మునిగి తేలియాడుచు..
 రామున  కిచ్చిన వాగ్దానాన్ని మరచాడని ..
కోపగించిన లక్ష్మణుడు..
 సుగ్రీవుని రాజప్రాసాదానికి వెళ్ళి..
 తన ధనుస్సు నందలి వింటినారిని ఎక్కుపెట్టాడు. 

ఆ శబ్దానికి..
 అంతః పురంలో వున్న సుగ్రీవుడు..
 భయకంపితుడౌతాడు. 
 తన వాద నైపుణ్యంతో ..
లక్ష్మణుని శాంతింప జేయమని ..
సుగ్రీవుడు తారను ప్రార్థిస్తాడు. 

ఆమె లక్ష్మణుని శాంతమూర్తిని చేయుటలో చూపిన విజ్ఞత..
 నైపుణ్యంతో నిర్వహించిన రాయబారం..
 ప్రసంగించిన తీరు..
ఆమెకు గల లోకిక జ్ఞానాన్ని..
ధర్మాధర్మ విచక్షణనూ చాతుతాయి. 
ఆమె మన్మధుని ఆరవ బాణమా అనునట్లుండి..

కామసుఖంబఖిల జీవులకు నైజము గాదా.. !! 
నారీ విరహాకుల రాములకిది తెలియదటే..!!
మనసుగల మగలకు జెల్లవో..
మగువల కనువేదురలకు జిక్కని దెవడయ్యా ..??
అని కోపోద్రిక్తుడైన లక్ష్మణుని ముందుగ నిలదీసినది. 


పిదప ..
లక్ష్మణుని అనునయించుచు..
దిక్కెవ్వరు రవిజునకును మీరలు దక్కన్..
ఎవరది శాశ్వత మీ భువి
ఋతు పరివర్తనలు జీవుల బ్రతుకుల్..
అని వ్యాఖ్యానించినది. 

ఆ మాటలకు..
లక్ష్మణుని మనసు కొంత శాంతించినది. 
మరియు ..
తార యందు..
తన సోదరియగు శాంతాదేవి ..
లక్ష్మణునకు కల్పించినదని..
కవి అత్యధ్బుత కల్పన చేసినాడు...

ఆమె మాటలవల్ల..
లక్ష్మణుడు శాంతించి..
ఆమె ఆహ్వానాన్ని మన్నించి..
రాజ ప్రాసాదంలోకి నడిచి.. సుగ్రీవుని క్షమిస్తాడు. 

సుగ్రీవుడు..
సీతాన్వేషణ తత్పరుడై ..
సమస్త రాజ్యభారాన్ని తారపై మోపుతాడు. 
తన కన్న ..
ఆమెకే వ్యవహార దక్షత కలదని..
సుగ్రీవుడు భావిస్తాడు.

ఆచార్యుల వారి తార పాత్ర..
 చాల గొప్పగ చిత్రించబడినది..
 మహా భారతంలోని ..
సంజయ ..
శ్రీకృష్ణరాయబారాలకన్న..
 తార రాయబారం ..
మిక్కిలి జయాన్ని చేకూర్చింది..
 స్త్రీ యెంతటి వివేకవంతురాలో..
 దీనిలో చూడనగును. 

కట్టమంచివారే బ్రతికివుంటే..
 తాను యెంతగానో అభిమానించి..
 మెచ్చిన..
 ద్రౌపది పాత్రకన్న..
 శ్రీ పుట్టపర్తి వారు రూపొందించిన తార పాత్ర.. బహుశ్లాఘనీయమైనదని..
 అభినందించెడి వారేమో ??
 అలాగే అంగదుని పాత్ర అమోఘమైంది. 

మాన్యశ్రీ ..
డాక్టర్ నండూరి రామకృష్ణమాచార్యులుగారికి..
 శ్రీవారి జనప్రియ రామాయణం అంటే..
 యెనలేని అభిమానం వుంది. 
వారి మాటల్లో గమనించండి..
"జనప్రియ రామాయణం మహా కావ్యం..
 కొన్ని చోట్ల వారి రచన..
 వాల్మీకిని మించిపోయింది...
ఒక జన్మలో పొందిన సంస్కారం ..
ఇలాంటి రచనకు సాధ్యము కాదు.
వెనుకటి జన్మలో ..
పుట్టపర్తిగారి సాధన ..
ఆర్జించిన సంస్కారం తోడ్పడి..
యీ జన్మలో..
 యింతటి గొప్ప కావ్యం..
 ఆయనచే రచింపబడునట్లు చేసింది.
 
నేను..
 కవి సామ్రాట్..
 విశ్వనాధ సత్యనారాయణగారి శిష్యుణ్ణి ..
అభిమానిని..
 అయినా ..
రామాయణ కల్ప వృక్షము కంటే..
జనప్రియ రామాయణం చాల విశిష్టమైనది..
అన్నారు నండూరివారు. 

మిగిలిన కాండలు ప్రచురింపబడి ..
ప్రజలకు అందుబాటులో వుండాలి..
 శ్రీ పుట్టపర్తిగారికి ..
వేయ్యేండ్ల తెలుగు చరిత్రలో..
 ప్రధమ స్థానాన్ని సంపాదించి పెట్టేది.. 
రామాయణం మాత్రమే..