20 ఏప్రి, 2012

పుట్టపర్తి నారాయణాచార్యుల వ్యక్తిత్వ దర్శనం--పుట్టపర్తి అనూరాధ

puttaparthi  Anuradha
సకల శాస్త్రాలూ చదివి
పునర్జన్మ పట్ల కర్మ సిధ్ధాంతం పట్లా 
గాఢమైన నమ్మకం విశ్వాసం కలిగిన ఈ పండితుడు..
మార్క్స్ సాహిత్యాన్ని ఆమూలాగ్రం చదివి..
అతన్ని అతనికన్నా ప్రేమించి అర్థం చేసుకొని..
ఈ సిధ్ధాంతాలకు 

బహుధా వ్యతిరేకి అయిన మార్క్స్ ను 
మహర్షి అన్నాడు..
 
కారల్ మార్క్స్ కు ముందు 
ఈ సమాజంలో ఉండే చెడును పోగొట్టడానికి 
శాస్త్రీయ మార్గం ఏర్పడలేదు.
ఆయన తరువాత 
ఈ ప్రపంచంలో ఉండే చెడును అరికట్టడానికి 
మార్గం తెలిసింది. 
అందుకే అనేక సార్లు చెప్పాను 
ఆయన మహర్షి అని.
అంటాడు..
 

ఎవరికీ తలవంచని స్వతంత్ర ప్రవృత్తి 
విశృంఖలతకు దారి తీసినా 
ఆ ఇనుప సంకెళ్ళనుంచీ 
జాగ్రత్తగా తన జీవిత కమలాన్ని 
పరమాత్మ పాదాలకు 
సమర్పణ చేసే దిశగా పయనించి 
తిరిగి దిద్దుకోలేని తప్పులనే చీకటి లోయలలో పడిపోకుండా 
జీవితాన్ని ఎలా కాపాడుకోవచ్చో 
మానవజాతికి నిదర్శనంగా 
తన జీవితాన్ని చూపించాడు..మా అయ్య..




మార్క్స్ ను చదువు తున్నప్పుడు 
బ్రహ్మాండమైన సానుభూతీ..
తరువాత 

అరవింద ఘోష్ ను చదువుతున్నప్పుడు..
 

అయ్యో ..
కేవలం భౌతిక దృష్టి ఎక్కువై ..
మానవుడు తక్కినవన్నీ నిర్లక్ష్యం చేస్తున్నాడే..
అనే దృష్టీ ..
పృధివీ.. ప్రతిష్టా ..అంటాడు అరవిందుడు ..
భూమిలేనిది పరలోకమే లేదు పోరా.. అంటాడు. 

అందుకే ..
అతనంటే నాకు చాలా ఇష్టం. 
బుధ్ధిజాన్నీ ..సన్యాసి తత్వాన్ని ..
అతడు అంగీకరించడు..
కనుకనే ..
మార్క్స్ నూ ..అరవిందుడినీ..
ఎవరైనా దగ్గరికి తెస్తే బాగుంటుంది కదా 
అన్న చాపల్యం ..
తీవ్రంగా ఏడిపిస్తుంటుంది నన్ను .
నాకు వయసెక్కువైపోయింది నాచేతకాదు. 

ఏం 
కళ్ళల్లో నీరు తిరిగి అక్షరాలు కనబటంలేదా..
ఇంకా చూడండి..
 

శ్రీవైష్ణవుడై ..
దాసానుదాసత్వాన్ని శిరసావహించే 
ఈ మానవుడు..
సంప్రదాయవాదులు ఆచరించే 
నియమ నిబంధనలను తుంగల్లో తొక్కి..
వారి ఆగ్రహానికి గురి అయినాడు..

అందుకే 
కాఫీ తాగి అయ్య బీడీ వెలిగించటం 
పడమటి కొండల్లో పొద్దు పొడుపులాగా 
అనిపించింది వల్లంపాటి గారికి..


"కాఫీ తాగి తాజ్ మహల్ బీడీ వెలిగించారు.
వారు బీడీ వెలిగించడం నాకు 
ఎందుచేతనో చాలా చిత్రమనిపించింది.
అంతటి మహాకవీ, మేధావి, పండితుడూ, 
ముఖ్యంగా
సంస్కృతపండితుడూ, 
బీడీ కాల్చటం ఏదో పడమటికొండల్లో
 పొద్దుపొడుపులాగా విచిత్రంగా కనిపించింది"


అప్పుడప్పుడూ సంభాషణల్లో 
“నా బుద్ధి అద్వైతం, హృదయం విశిష్టాద్వైతం”
అని నవ్వేవారు.
కొంతమంది బంధువులకు ఇది నచ్చేది కాదు.
వారిలో కొందరు 
“శివతాండవం విన్న వీరినోట కృష్ణలీలలు వినాలని
 ఉంది” అనో, 
లేకపోతే 
“శివతాండవం కన్నా మేఘదూతం మేలైన రచన
” అనో సన్నాయి నొక్కులు నొక్కేవారు. 
చాలా మంది బ్రాహ్మణులు
వారిని చెడిపోయిన బ్రాహ్మణ్ణిగానే చూసేవారు. 

కడపవీధుల్లో
జట్కాసాయిబుల భుజాల మీద చేయి వేసుకుని నడుస్తున్న
వారిని చూసి లోపల్లోపల అసహ్యించుకునేవారు. 
ఎదుట పడ్డప్పుడు మాత్రం 
పాదాభివందనాలు చేసేవాళ్ళు.
భక్తికీ హృదయానికీ సంబంధాన్ని చూడండి.

“భక్తి నిరంతర ప్రేమ ప్రవాహమన్నాడు. 
అంతేకాదు, 
భగవంతుణ్ణి
బుద్ధితో కాకుండా హృదయంతో చూడడమే భక్తి. 
అన్నం లేకుండా బతకగలను.
కానీ భగవంతుడు లేకుండా బతకలేను” 
అనేవారు. 
వారి హృదయాన్ని
అర్థం చేసుకోవటానికి ’పాద్యము’ చదవటం అవసరమని
నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను.
 
                 





గొల్లాపిన్ని శేషాచలం గారు..
అయ్యకు సన్నిహితుడు..
మా అన్నయ్య అరవిందు వయసువాడు..
అయ్యపై సిధ్ధాంత వ్యాసం వ్రాసారు 

ఆయనకు ఫోన్ చేస్తే 
తన జ్ఞాపకాలు కొన్ని పంచుకున్నారు.
               


1960-62 మాట ..
తులసీదాసునీ ..శ్రీనాధునీ..

పరిచయం చేస్తూ పుట్టపర్తి వారు..
కడప , రామ కృష్ణా హైస్కూలులో..

దాదాపు అయిదారు గంటలపాటు క్లాసు తీసుకొనేవారు..
ఆ రోజు ఇక యే క్లాసులూ జరగవు..
ఆయనకి బుధ్ధి పుడితే..

లేకపోతే..
తన చదువూ తన వ్యాసంగంలోనే వుండేవారు..
ఎవ్వరూ ఆ స్కూలులో 

ఆయనని ..
మీరు అందరిలా క్లాసులు తీసుకోవాలనీ 
పాఠాలు చెప్పాలనీ 
నిర్బంధించేవారు కాదు..

 

ఎంత బాగుంది స్వామీ అని పొగడితే..
మీరెవర్రా పొగిడేదానికి 

వాళ్ళు స్వతహాగా గొప్పవారు
అని తిట్టేవారు..
 

జనప్రియరామాయణంపై సిధ్ధాంత వ్యాసం చేయాలనుకున్నాను స్వామీ 
అంటే..
నేను బ్రతికుండగానే చేయరా..
అన్నారు.
 
కానీ నా దురదృష్టం..
చేయలేకపోయాను..
 

ఆయన డెబ్బయ్ దాటిన వయసులో..
తబలా వాయిస్తుండగా ..
మా నాన్నగారితో వెళ్ళినప్పుడు ..
నేను చూసాను.

అలానే 
కడపలో గజ్జె కట్టడమూ నేనెరుగుదును..

ఇక అయ్యవ్యక్తిత్వంలోని వైశిష్ట్యాన్ని చూద్దామా.. 
                 
కవితా పుత్రుని కవితా మార్గం


గొల్లాపిన్ని శేషాచలం ,
ఆంధ్రోపన్యాసకులు,
ప్రభుత్వ జూనియర్ కళాశాల, తాడిపత్రి.



పుట్టపర్తి జనప్రియం (సిద్ధాంత వ్యాసం)
రచన : డా. గొల్లాపిన్ని శేషాచలం
పేజీలు : 352, వెల: రూ.250/-
ప్రతులకు : 09440745878
శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల వారిది 
ఒక విలక్షణమైన ప్రకృతి.
అనువంశికంగా అందిన ప్రతిభావ్యుత్పత్తులూ 
బహు భాషా పరిచయం వల్ల కలిగిన 
విశాల దృష్టి 
భారతదేశం లోని 
పలు ప్రాంతాలను దర్శించుటవల్ల కల్గిన అనుభవం 
వివిధ ప్రాంతాల రచయితల తోడి 
పరిచయం వలన కలిగిన 
శేముషీ విభవం 
పుట్టపర్తి వారిని 
ఒక విశిష్ట వ్యక్తిగా తీర్చినాయి.
 
జన్మతః సంక్రమించిన స్వతంత్రతా ప్రవృత్తి ..
విశృంఖలతకు దారితీసినా ..
సం యమన శీలంపై మక్కువతో..
ఆత్మావలోకనం చేసుకొనే గుణం సహజమైంది. 

అందుబాటులో ఉన్న ప్రతి కొత్తను..
తనదిగ చేసుకోవాలనే తహ తహ వుంది.
 
ఆ గుణం వల్లే 
పధ్నాలుగు భాషల అధ్యయనం సాధ్య పడింది. 
శృతి స్మృతి పురాణేతిహాస ప్రబంధాలను 
ఆపోశనం పట్టడం కూడ 
ఇందువల్ల సాధ్యమైంది.
 
ఆంగ్ల సారస్వత మధనం 

మార్క్స్ పంధా పరిశీలనం 
గాంధీ తత్వానుశీలనం 
 అంతెందుకు 
కంటికి కనపడిన 
చెవికి వినపడిన 
మనసుకు అందిన సర్వాన్ని 
తనదిగా చేసుకోదలచిన 
నిత్యాధ్యయనశీలి ఆయన.
 
ఆయా సమయాలలో చదివిన చదువులు
 క్రమ పరిణామశీలమైన వయసు 
విభిన్న సంస్కారులైన సహచరులు 
అతణ్ణి అతని భావాలను 
అనేక గతుల మార్చినాయి
 
ఆస్తికతపై ఆసక్తి 
భౌతికత వాదంపై అనురక్తి 
సంప్రదాయ సిధ్ధాలైన ఆచార వ్యవహారలపై విరక్తి 
ఇలాగ ఆయన భావాలు శబలితాలై కంపిస్తాయి.
 
పుట్టపర్తి శ్రీ వైష్ణవుడైననూ 
శివభక్తిని ప్రదర్శిస్తూ 
అనేక కీర్తనలూ 
శివతాండవమను కావ్యం రచించినాడు.
పోనీ ఆయన శైవుడందామా 
శ్రీ వైష్ణవ దాసానుదాసత్వము 
ఆయనకు ప్రీతికరమైన విషయము.
 
అద్వైతియా కాదు
అష్టాక్షరీ మంత్ర జప ప్రాయణత్వమే కాదు 
కీర్తన లన్నీ అష్టాక్షరీ మిళితాలే 
విష్ణు పారమ్యతను 
జనప్రియ రామాయణం లో 
శైవ వేష్ణవ ధనుశ్చరిత్రలో 
హృదయ గతంగా చాటినాడు.
 
పునర్జన్మ సిధ్ధాంతాన్ని 
కర్మ సిధ్ధాంతాన్ని నమ్ముతూ
 వాటిపై ఆధార పడిన 
పండరీ భాగవత రామాయణాదులను 
రచించినాడు.
ఈ సిధ్ధాంతాలకు బహుధా వ్యతిరేకి అయిన 
మార్క్స్ ను మహర్షి అన్నాడు. 
మేఘదూత అనే కావ్యాన్ని రచించాడు.
ఈ విధంగా ఇదమిధ్ధంగా 
ఇతడిట్టివాడని ఇతని తత్వమిట్టిదని 
తేల్చి చెప్పుటకు వీలులేని 
ఒక జటిలమైన వ్యక్తి శ్రీ పుట్టపర్తి.
ఆయన పెద్ద వయసు వరకు జీవించినారు
ఆయనలోని పరిణతి చాలా గొప్పది.
 
ఆయన బాణీననుసరించి 
కవిత్వం వ్రాయాలనే రచయితలున్నారు. 
కానీ 
ఆయనవలె పాండిత్యాన్ని సాధించిన వారు అరుదు. 
 ఆయనవలె పఠనాసక్తి గలవారు తక్కువ.
 
తనను విమర్శించిన వారిని కూడ పుట్టపర్తి 
తన రచనల్లో తప్పుపట్టలేదు.
 
"నవ్యతరమైన మధుర గాన స్రవంతి..
కొకడు తలయూచు మఋఇయొకడోసరిల్లు..
వీణదోషమా ..?లేక వినెడివారి..
తప్పిదమా..? కాదు.. భావ భేదమె సుమ్ము..!"
పుట్టపర్తి వారి షాజీ కావ్యం నుంచీ..
 
ఈ పద్యాన్ని మనసులో పెట్టుకుని 
పాణ్యం సోదరులు (ఉయ్యాలవాడ) 
ప్రభాతరేఖలు అన్న తమ కావ్యంలో 
ఇలా అన్నారు.  
"హారి ఘుమ ఘుమ పరిమళమౌచు తా సు
మమ్ము విచ్చుటే ప్రకృతి సిధ్ధమ్ము సుమ్ము..
కొన్ననేమి సరే కొనకున్ననేమి..
దానికేలాటివియు కొరతలును లేవు."

పుట్టపర్తి దృక్పధంలో 
తన కవిత్వం శ్రావ్యమై 
మనో హరం గా ఉండటమే కాదు 
జనప్రియంగా ఉండాలన్నది ఆయన కోరిక
 
అందుకే 
రాగ తాళ లయ బధ్ధంగా ఉండే రీతిగా 
తన రచనలను రూపొందించుకున్నాడు.
కవి వాల్మీకి అభిప్రాయం కూడా ఇదే కదా..
 
ఇంక కవిత్వంలో 
తన భావాంబర వీధిలో తళుక్కుమన్న ఊహలేకాక 
సార్వ కాలీనమైన 
పూర్వ కావ్యాలలోని 
ఇతర భాషా కవుల యొక్క భావాలను 
తన రచనలో ఇముడ్చుకొన్నారు.
ఆయన ఇతర కావ్యాలనుండి 
భావార్థాలను యధేచ్చాగా తీసుకోవటంలో 
తన రచన సర్వాంగ సుందరంగా 
వుండాలనే జన ప్రియంగా మలచాలనే 
ఉద్దేశ్యం ఆయనకుంది.
సంప్రదాయ కవిత్వరీతులు 
పాండిత్య ప్రకర్షపై అభిమానం 
(పండరీ భాగవతాదులు)
కలవాడైనా 
ఆయా సందర్భాలలో 
చందోబంధాల్నీ పాండిత్యాన్నీ వదిలేస్తారాయన 
దీనికి 
జనప్రియ రామాయణం 
మేఘదూతం 
చక్కని ఉదాహరణాలు.
 
పుట్టపర్తి కవి భావాలు 
చాల సునిశితమైనవి
ఆధునాతనకాలంలో కవిత్వాన్ని గూర్చి 
కొన్ని భావాలున్నాయి. 
సామాన్యులకు సైతం అర్థమయ్యేదే 
ఉత్తమ సాహిత్యం అని ఒక అభిప్రాయం.
 
పుట్టపర్తి ఈ అభిప్రాయానికి స్పందిస్తూ
సామాన్య ప్రజలు 
అన్నమాటకి అర్థం పరిమితమైంది
అందరికీ అర్థమయ్యేలా కవిత్వం ఎవ్వరూ చెప్పలేరు.
సంస్కారాలు భిన్నంగా ఉంటాయి 
అందరూ అర్థం చేసుకోలేరు అంటారు.
 
సామాజిక స్పృహ అనేమాట కొత్తది కాదని 
ప్రాచీనులలో అభ్యుదయ వాదులు లేరనడం 
పొరబాటనీ 
ఈనాడు వస్తున్న సాహిత్యంలో 
రాజకీయలు చోటు చేసుకొంటున్నాయనీ 
పుట్టపర్తి అభిప్రాయం 

అంతేగాక 
ఇనాడు 
సాహిత్యంలో ఒకరి రచనలు ఒకరు చదువరు
 పరస్పర గౌరవాభిమానాలు లేవు 
అని కూడా అంటుండేవారు 
కేవలం అభిప్రాయాలు 
అభిమాన దురభిమానాలను బట్టి ప్రకటిస్తారు 
అని అంటారు
 
ఇదే మాట 
విశ్వనాధ సత్యనారాయణగారు కూడ
మొదట చదవండి 
నచ్చకపోతే పారేయండి
అని అంటారొకచోట
 
అసలు కవిత్వానికి 
లయ ప్రధాన మంటారు పుట్టపర్తి 
ఇ రూపం అయినా సరే 
లయ అనేది లేకుండా 
కవిత్వం జీవించదనీ 
మానవ సృష్టిలోనే శరీర వ్యవస్థ లయ వుందనీ 
మనిషి ప్రతి కదలికలో లయ వుందనీ 
లయ లేకుండా 
మానవ సంబంధమైన కావ్యం 
ఇదీ లేదని 
నారాయణాచార్యులవారు 
పద్య కవిత్వానికి భవిష్యత్తు గూర్చి 
అభిప్రాయమిచ్చారు.
 
పుట్టపర్తి కవితాదృష్టి విశాలమైనది. 
సంప్రదాయ కవిత్వంపైన మక్కువ ఉంది. 
నవీన పధ్ధతులను 
ఆధునిక భావాలను 
రెండు చేతులా ఆహ్వానిస్తారాయన 
లయబధ్ధమైన గేయ కవిత్వాన్నీ 
మాత్రాచందస్సును ఆయన ఆదరిస్తారు.
మంచి వచన రచన ఆయన ప్రాణం.
కవితలో సమర్థవంతములైన 
అన్ని ప్రక్రియలూ శ్రీమాన్ పుట్టపర్తికి ఇష్టమే.

16 ఏప్రి, 2012

పుట్టపర్తి నారాయణాచార్యులు ..జ్ఞానపీఠమూ..--పుట్టపర్తి అనూరాధ

  


 


పురస్కారాలు ఎలా ఇస్తారు ..?
వాని వెనుక యే యే శక్తులు పనిచేస్తాయి..?
ప్రతిభకన్నా పైరవీలు ముఖ్యమా..?
ఆగండాగండి..

మీరేదో రంగంలో బాగా కృషి చేసి 
ఏవైనా అవార్డుల కోసమో.. 
రివార్డులకోసమో.. 
ఎదురుచూస్తూ కూచున్నారో అయిపోయారే..
 
ఎంతసేపూ..                             
ఆ రంగంలో మరింత కృషిజేసి అందరితో శభాషనిపించుకోవటంతో పాటూ..
కాస్త చుట్టూ పరికించి..

పైకి పోతున్న వాళ్ళని 
కిందకి లాగడానికీ..
కిందనున్న వాళ్ళని 
వెకసెక్కమాడడానికీ..
రాజకీయ రంగంలోనో ..
మంచి పదవులలోనో..
ఉన్న వారి చిట్టా సంపాదించి ..
వారిని కాకా పట్టే కార్యక్రమానికీ శ్రీకారం చుట్టాలి.
 

ఎవరికైనా ఏదైనా గౌరవమొస్తే 
వాడు ఆ కులానికి చెందిన వాడు 
కాబట్టీ వచ్చిందనీ..
వీడు పదవిలో కొచ్చాడంటే 
ఈ రాజకీయగొడుగు కిందవాడు 
కనుక వచ్చిందనీ..
బురదజల్లడానికి తగిన ప్రాక్టీసులూ ..
అంతే చిత్తశుధ్ధిగా మొదలెట్టాలి..
 
దీనికి కావలసిన 
మనోబలాన్నీ.. వాక్శక్తినీ ..ఇమ్మని 
మొదటగా గణేశ పూజ సరస్వతీ పూజలూ
 కావాలంటే చేసుకోండి మీ ఇష్టం..
 
ఇందులో మీ కృషి ఫలించి ..
మీకు పుసుక్కున ఏ గౌరవమో వరించనూ వరించచ్చు..
29 Mar 2010 న ఒక వ్యాసం వచ్చింది పురస్కారాలపై..
ఇది చదివితే తెల్లబోవటం
మీవంతౌతుంది..
అవధరించండి.     


           
                     

    
       29 Mar 2010


పురస్కారాలకు నమస్కారాలు






పురస్కారము అంటే 
అనేక నైఘంటికార్థాలున్నాయి. 
ప్రధానంగా
ముందిడుకొను, పూజించు, సన్మానించు 
అనే అర్థాలున్నాయి. 
తక్కిన వారి కంటే 
ఇతడు ఎక్కువ అని తాత్పర్యార్థం. 


రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు 
కొన్ని పురస్కారాలు ప్రకటిస్తూ వుంటాయి. 
ముఖ్యంగా 
జనవరి 26 వ తేదీకి ప్రకటించే 
పద్మ పురస్కారాలు పద్మశ్రీ, పద్మభూషణ్‌, 
పద్మ విభూషణ్‌, భారతరత్న వంటివి. 


ఇవి రాజకీయ వేత్తలకు,
పారిశ్రామికవేత్తలకు, 
కవులకు, 
కళాకారులకు, 
సామాజిక శాస్త్ర వేత్తలకు, 
సంఘ సేవకులకు లభిస్తూ వుంటాయి. 


ఇవికాక 
కేంద్ర రాష్ట్ర సాహిత్య అకాడమీలు 
కొన్ని పురస్కారాలు ఇస్తుంటాయి. 
అలాగే సంగీత నాటక అకాడమీ సన్మానాలు 
కూడా ఉంటాయి. 
ఇంకా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని 
రాష్ట్ర ప్రభుత్వం 
కవులకు, పండితులకు వేద పండితులకు 
సన్మానాలు చేస్తూ ఉంటుంది. 








ఇంకా 
వివిధ విశ్వ విద్యాలయాలవారు 
కళా ప్రపూర్ణ, గౌరవ డాక్టరేటులు ప్రదానం చేస్తుంటాయి. 
ఇవన్నీ కొన్ని వర్గాలుగా విభజింపవచ్చు. 
స్థూలంగా 
ఇవి ప్రభుత్వ -ఉపప్రభుత్వ పురస్కారాల కిందికి వస్తాయి.

ఒక ప్రముఖుడు
 తన పేరుతో లేదా 
తన భార్య లేక 
తల్లిదండ్రుల పేరుతో పురస్కారాలు ప్రకటిస్తాడు. 
వీటికి చట్టబద్ధత ఉండదు 
ఒక సాంస్కృతిక సంస్థ 
హైదరాబాద్‌, ఢిల్లీ, చెన్నైలలో 
ఉగాది పురస్కారాలు ప్రకటిస్తుంది. 
మహాదేవి వర్మ
దీనికీ ప్రభుత్వ చట్టబద్ధత ఉండదు.


ఆ విధంగా చూస్తే 
జ్ఞానపీఠ పురస్కారం, 
సరస్వతీ సన్మాన్‌ పురస్కారం 
బిర్లాట్రస్ట్‌, 
సి.పి బ్రౌన్‌ అకాడమీ 
వంటి సంస్థల పురస్కారాలు 
ప్రైవేటు వ్యక్తులు అనధికారికంగా 
ఇచ్చిన పురస్కారాల క్రిందికే వస్తాయి. 


నోబెల్‌ బహుమతి ప్రపంచంలో 
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పురస్కారం.
అలాగే 
సినీ రంగంలో ఆస్కార్‌ పురస్కారాలు కూడా 

ఇవి కాక 
జర్నలిస్టులకు ఇచ్చే పులట్జురో పురస్కారాలు 
మెగాసెసే పురస్కారం,
 గ్రామో 
ఇలాంటివి కొన్ని ఉన్నాయి. 


కొందరు వ్యక్తులు పురస్కారాల కోసం 
పైరవీలు చేసుకోవటం సర్వసామాన్యాంశం. 
ముఖ్యంగా రాష్ట్ర కేంద్ర మంత్రులలో 
ఎవరి ప్రోద్బలమో లేకపోతే
 ప్రభుత్వ పురస్కారం రాదుగాక రాదు. 


ప్రతిభకూ పురస్కారాలకూ 
చాలా సందర్భాలల్లో 
తక్కువ సంబంధం ఉంటుంది.
శ్రీశ్రీకి 
కేంద్ర పురస్కారం తీసుకోవాలనే కోరిక ఉండేది.
 కాని 
ఆయన విరసం అధ్యక్షుడు కావటం వల్ల 
వారు ప్రభుత్వ పురస్కారాలు 
తీసుకోనీయకుండా 
అప్పుడు అడ్డుపడ్డారు. 


అలాగే పుట్టపర్తి నారాయణాచార్యుల వారికి 
రావలసిన జ్ఞానపీఠ పురస్కారం 
సి.నారాయణరెడ్డికి లభించింది. 
ఆ దు:ఖంతో పుట్టపర్తి వారు కన్నుమూశారు. 


సినీరంగంలో రఘుపతి వెంకయ్య పురస్కారం దాదాసాహెబ్‌ పాల్కే పురస్కారం 
ఇంకా 
వార్షిక స్వర్ణ రజత కాంస్య నందులు 
ఇటు రాష్ట్రం -స్వర్ణం, రజత, కమలాలు 
అటు కేంద్రం ఇస్తూ ఉంటుంది. 


వీటిని రికమెండ్‌ చేయటానికి 
కొన్ని కమిటీలు వేస్తారు. 
సామాన్యంగా కమిటీ సభ్యులు 
ప్రభుత్వపు కనుసన్నలలోనే ఉంటారు. 


మహానటి సావిత్రికి పద్మభూషణ్‌ వచ్చింది. 
కారణాలు సుస్పష్టం. 
ఎన్‌.టి.ఆర్‌ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం పురస్కారం ఇస్తున్నది. 


అలాగే 
శ్రీమతి లక్ష్మీపార్వతి గారు 
తమ ట్రస్టు పక్షాన పురస్కారం ఇస్తున్నారు. 
ఇందులో 
ఆమె ప్రమేయం ఏమీ ఉండదు. 
చేకూరి రామారావు, 
అబ్బూరి ఛాయాదేవి 
వంటి సభ్యులు కొందరుంటారు. 
వారి రికమెండేషన్‌ను ఛైర్మన్‌ ట్రస్టు వారికి అందజేస్తారు. సభ్యులు సామ్యవాదులైతే 
సౌమ్యవాదులకు పురస్కారాలు 
రాకుండా అడ్డుపడటం సహజమే. 

గత సంవత్సరం 
కన్నడ రచయిత బైరప్ప (2009) 
ఈ సంవత్సరం బెంగాలీ రచయిత మహాశ్వేతాదేవి (2010) గార్లకు ఈ పురస్కారాలు ప్రకటించారు. 
బైరప్ప సంప్రదాయద్వేషి. 
మహాశ్వేతదేవి స్వయంగా ఉగ్రవాద రచయిత్రి. 

కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షునిగా 
అస్సామీ రచయిత,ఇందిరా గోస్వామి
నారంగ్‌ లోగడ ఎన్నిక కాకుండా అడ్డుకున్నది. 
కాన్వాస్‌ చేసింది. 
ఐనా 
ఆమె కోర్కె ఫలించలేదు. 
బెంగాల్‌ ప్రభుత్వమూ ఉగ్రవాదులూ 
ఆమె వెనుక ఉన్నారు. 
అందుకని 
జ్ఞానపీఠ్‌ పురస్కారం కూడా తెచ్చుకోగలిగింది. 
నోబెల్‌ బహుమతి వచ్చినా 
ఏమీ ఆశ్చర్య పడనక్కరలేదు.


అలాగే 
బుకర్‌ వంటి 
అంతర్జాతీయ పురస్కారాలు 
అరుంధతీరాయ్‌ వంటి 
సంప్రదాయ వ్యతిరేకులకు వస్తూ ఉంటాయి. 
పురస్కారాల ద్వారా వారు 
ఆ వ్యక్తిని ప్రొజెక్ట్‌ చేయటం 
మొదటి ప్రయోజనం -
ధన సంపాదన 
రెండవ లక్ష్యం. 
వారు నమ్మిన సిద్ధాంతాలకు మాన్యత కల్పించటం మూడవ ప్రయోజనం!


ఆంధ్రప్రదేశ్‌ నుండి 
కేంద్ర సాహిత్య పురస్కారాలు పొందిన వారిలో
 కె.శివారెడ్డి, 
రాచమల్లు రామచంద్రారెడ్డి, 
అజంతా చేకూరి రామారావు, 
కేతు విశ్వనాథరెడ్డి, 
అబ్బూరి ఛాయాదేవి, 
బైరాగి, 
కాళీపట్నం రామారావు, 
సి.నారె. 
నక్కా గోపి ఇత్యాదులంతా లెఫ్టిస్టులే. 
వీరికి పురస్కార లబ్ధికి సంబంధించి 
మంచి నెట్‌వర్క్‌ ఉంది. 
తమకు కావలసిన వారికే వచ్చేటట్లు చూసుకోవటం 
ఆ సభ్యులు 
చక్కని సమన్వయాత్మక వ్యూహంలో నిర్వహిస్తారు. 
దీనిని తెరవెనుక పైరవీ                    
-లేదా గ్రౌండ్‌ వర్క్‌ అంటారు. 


ప్రొఫెసర్‌ భద్రిరాజు కృష్ణమూర్తి
కేంద్ర సాహిత్య అకాడమీ 
రెజిడినల్‌ కన్వీనర్‌గా ఉన్నప్పుడు 
ఈ పక్షపాతం బాగా ఉండేది. 
మంజుశ్రీ కాలంలో 
పక్షపాతం జరుగలేదు. 
అయినా జాతీయ స్థాయిలో అల్లరికి గురిఅయినాడు.
 ఆ వివరాలన్నీ మీకు తెలిసినవే కాబట్టి 
వివరణ అక్కరలేదు. 
గుంటూరు శేషేంద్ర శర్మ, 
రావూరి భరద్వాజ పేర్లు 
జ్ఞానపీఠ పురస్కారానికి రికమెండ్‌ చేయబడ్డాయి. 
అలాగే 
పద్మశ్రీకి కూడా శేషేంద్ర పేరును రికమెండ్‌ చేశారు. 
వారే అసూయతో కొందరు అడ్డుకున్నారు 

శేషేంద్ర పేరును వాజ్‌పేయి ప్రభుత్వం 
సినారె పేరును పివి నరసింహారావుగారు 
పుట్టప్ప పేరును కర్నాటక ప్రభుత్వం 
నోబెల్‌ పురస్కారానికి రికమండ్‌ చేసిందని వార్త. 


నోబెల్‌ శాంతి పురస్కారం కోసం 
ఎబి వాజ్‌పేయి ఎంతో తహతహలాడాడు 
కాని రాలేదు. 


హిందీలో ''బాహుబలి'' అనే పదం ఉంది -
అంటే 
రాజకీయ లబ్ధికోసం 
బలప్రయోగం చేసే దాదాగిరి అని అర్థం. 
పురస్కారాల విషయం 
కామ..కాంచన ప్రయోగం చేయటం 
బెదిరించటం 
వంటివీ జరుగుతూ ఉంటాయి. 


బెంగాల్‌ రాష్ట్రానికి చెందినవన్నీ 
రాజకీయ పురస్కారాలు కావటం వల్ల 
తరచూ వివాదాలల్లో చిక్కుకుంటూ ఉన్నాయి. 

ఋత్విక్‌ ఘటక్‌ అనే ప్రముఖుడు 
గాంధీజీని అశ్లీల భాషలో తిట్టాడు. 
అతనికి పద్మశ్రీ పురస్కారం లభించింది. 

ఇదేమిటయ్యా 
అని విలేఖరులు ప్రశ్నిస్తే 
అప్పుడు నాకు మతి స్థిమితం లేక తిట్టాను 
అని సమాధానం చెప్పి తప్పించుకున్నాడు.

శ్రీ పిరాట్ల వెంకటేశ్వర్లు
మాననీయ పి.వి నరసింహరావు గారు 
కేంద్రంలో ఉన్నప్పుడు 
విశ్వనాథ సత్యనారాయణ గారికి గుర్తింపునిప్పించారు. ఎ.ఆర్‌.కృష్ణ, 
కాళోజీ, 
సినారె వంటి కవిపండితులకు 
జాతీయ స్థాయిలో గౌరవం లభించింది. 


దీనిని బట్టి తేలేదేమంటే 
ఒక కళాకారుడు కవి ఎంత గొప్ప వాడైనా
 ఒక రాజకీయవేత్త సహాయ సహకారాలు లేకుండా స్వయం ప్రకాశం పొందజాలడు. 
వైజయంతిమాల, 
మంజుభార్గవి, 
శోభానాయుడు, 
స్వప్నసుందరి, 
రాజారెడ్డి, 
రాధారెడ్డి వంటి 
జాతీయ అంతర్జాతీయ స్థాయిలో 
గుర్తింపు పొందిన నర్తకీమణులకు 
అవకాశాలు పురస్కారాలు రావటానికి కూడా 
కొందరు ప్రముఖులు పట్టుదలతో చేసిన కృషియే కారణం. 
అంటే 
కళాకారుల కృషితో బాటు 
వారి ప్రోత్సాహకుల కృషి కూడా అత్యంత అవసరం 
అని నిరూపింపబడింది. 
మహాశ్వేతాదేవి మావోయిస్టు రచయిత్రి కాకపోతే 
ఆమెకు బెంగాల్‌లో 
ఇంత గుర్తింపు వచ్చి ఉండేది కాదు. 
ఆమె ఏయే సందర్భాలల్లో 
దేశ వ్యతిరేక ప్రకటనలు చేశారో
 23 మార్చి 2010 దిన పత్రికలో 
కృష్ణాపత్రిక సంపాదకులు శ్రీ పిరాట్ల వెంకటేశ్వర్లు 
సోదాహరణంగా ఒక వ్యాసం వ్రాశారు. 

ఎన్‌.టి.ఆర్‌ వంటి 
దేశ భక్తుడు జాతీయవాది పేర 
తస్లిమా నస్రీన్
ఒక వివాదాస్పద రచయిత్రికి 
పురస్కారం వివాదాస్పదమైంది.






బంగ్లాదేశ్‌కు చెందిన 
తస్లిమా నస్రీన్‌ అనే ముస్లిం రచయిత్రి 
లజ్జ                                                    
అనే గ్రంథం రచించారు. 
ఆ పుస్తకం పై 
ముస్లిం మత పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అలాంటప్పుడు 
ముస్లిం ఓటు బ్యాంకును కాపాడుకోవటం కోసం 
కలకత్తా నస్రీన్‌కు ఆశ్రయం కల్పించటానికి 
ప్రభుత్వం వెనుకాడింది. 


కాని 
హింసను సమర్థించే మహాశ్వేతాదేవిని నెత్తినెక్కించుకున్నారు -
ఇవే సాహిత్య రాజకీయాలంటే!

పురస్కారం యువతకు ప్రోత్సాహం -
పెద్దలకు సత్కారం 
కాని రాజకీయ పురస్కారాలు ఇచ్చేవారు పుచ్చుకునేవారు కూడా 
సిగ్గుతో తలవంచుకోవలసినవి -
ఇప్పుడు జరుగుతున్నది అదే! 

భారత దేశంలో అంతులేని దరిద్రం ఉంది. 
వాటిని వ్యాపారపుముడి సరుకులుగా 
మార్చుకోవటం 
కొందరు రచయితలకు, రచయిత్రులకు బాగా తెలుసు. 
పేదకన్నీటి ప్రవాహాలలో 
బోటు షికారు చేయటం
 మాయావతులకూ మహా శ్వేతలకు సమాన ధర్మం.
  
అందుకే ..
రామమూర్తి రేణుగారు ..
"మిత్రుడు మిగిల్చిన జ్ఞాపకాలు.. అనుభవాలు "లో 
ఇలా అని తృప్తి పడ్డారు..


"నేడు తన తీయని ..పవిత్ర స్మృతులను ..
మాత్రమే మనకు వదలి ..
నా నెచ్చెలి వెళ్ళి పోయాడు.
ఆ సరస్వతీ పుత్రుని సంభావించి ..సన్మానించిన ..
సంస్థలు తమ ఉనికిని స్థార్థకం చేసుకున్నాయి. 
పైరవీలకు ..ప్రలోభాలకు ...మాత్రమే సంక్రమించే..
పెద్ద పెద్ద సమ్మానాలు.. అవార్డులూ ..
రాకపోవటంతో ..
ఆయన నిష్కలంక చంద్రుడైనాడు.
ఆ సంస్థల పక్షపాత పంకం..
ఆయన నంటుకోక పోవటం.. 
ఆయన అదృష్టమే.. 
శివతాండవం ఆయన అక్షర శరీరం. 
నిస్సంశయంగా ..భర్తృహరి పలుకుల్లో .."

13 ఏప్రి, 2012

పుట్టపర్తి నారాయణాచార్యులు మృదంగ సాధన--పుట్టపర్తి అనూరాధ.



భాస్కర భట్ల కృష్ణమూర్తి ..
ఆకాశవాణిలో మృదంగ విద్వాంసుడు..
ఆయన భార్య పేరు భ్రమరాంబ..
వారికి లలితాంబ అని ఒక పాప ..
ఎర్రటి నోరు..
తెల్లటి పిల్ల ..రెండున్నర సంవత్సరాలేమో..
రెండు పిలకలు వేసుకొని ..

అమ్మ వెనకే నీళ్ళకు వచ్చేది. 
నాగ ఆపిల్లను బాగా ఆటపట్టించేది.
వాళ్ళు మా ఇంట్లో నీళ్ళు పట్టుకుని వెళ్ళేవాళ్ళు.
మా అక్కయ్యా రేడియోలో పని చేసేది డ్యూటీ ఆఫీసరుగా..
ఆ పిల్లను నీపేరేమిటే అంటే ..

లలితాంబ ..అనేది.
భ్రమరాంబ ను నేను 

అత్తా.. అత్తా ..అనేదాన్ని 
మా వేపు ఆడాళ్ళయితే ..అత్త మగాళ్ళైతే.. మామ..
ఆమె మడి నీళ్ళూ పట్టుకోడానికి..

తడి చీరెతో నే వచ్చేది.
ఆమె వెంట ఆ పిల్లానూ.
మా నాగ ఆపిల్లతో బాగా సరదాగా ఉండేది..
అయ్య అరుగుపై కూచుని అందరినీ చూస్తూ ఆనందించేవారు. 
అప్పట్లో ..
కడప రేడియో లో పని చేసే..
ప్రియంవద ..కొక్కొండ సుభ్రమణ్య శర్మ..
భూషణరావ్.. శేషగిరిరావ్..
అందరూ మాకు అతిధులే..
ప్రియంవద అక్క పెళ్ళి చేసుకోలేదు కుటుంబంకోసం.. ఆవిడ అలానే ఉండిపోయారు ..

ఆవిడకు కృష్ణుడంటే ఎంత భక్తో..
ఆవిడ కంఠస్వరం  సన్నగా.. తీగలా..
మధురంగా ..
అందులో ఏ భావమైనా అవలీలగా పలికేది..
అయ్య పాటలు ఎన్నిటినో ..

ఆమె స్వరపరిచింది భక్తి రంజని కోసం..
అవి అలాంటి ఇలాంటి పాటలు కాదు..

బ్రహ్మాండమైనవి,.
అక్కయ్య.. ఆమె కొలీగ్స్ ..

ఎన్నో ఈ మాసపు పాటలు కలిసి పాడారు.
అక్కయ్య ఆ రోజుల్లో..

ఎంతో హుషారుగా వుండేది..
జానపద గీతాలేమి ..లలిత గీతాలేమి..
జింగిల్స్ అయితేనేమి..
అన్నిటా నాగపద్మిని ఉండవలసిందే ..

నేనూ కవితలు వ్రాసేదాన్ని ..
అయ్య నాకు హయగ్రీవం ఉపదేశించారు.
నేనూ ..యువవాణి లో ..

అక్కడా ఇక్కడా కవితలు చదవటం
అక్కయ్యనూ నన్నూ చూసి ..

అయ్య అమ్మ ఎంతో మురిసి పోయేవారు ఆనందపడేవారు.
 
మా అయ్య.. 
మనుమడు శ్రీకాంతుతో ..
అప్పుడప్పుడూ సరదాగా కుస్తీ కి దిగేవారు .
నవ్వి ..నవ్వి ..

అయ్య ముఖమంతా ఎర్రగా అయిపోయేది.
అయ్యకు ఊరికే ..
అలా టైం వేస్ట్ చేయటం ఇష్టం ఉండదు.
ఎవరైనా రేడియో విన్నా ..

TV చూసినా.. 
అయ్యకు చెప్పలేనంత కోపం వస్తుంది.
బాగా తిట్టేవారు.
అయ్య రూం మిద్దె పైన ఉండేది ప్రశాంతంగా..
అయ్య రూం తలుపు వేయగానే..

 పెద్ద శబ్దం వస్తుంది. 
ఆ శబ్దం వినగానే హింట్.. 
అయ్య కిందకి వస్తున్నారని
 

అంతే ..
ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్..
 

అయ్య గొప్పవాడు కనుక ..
అందరూ మా ఇంటికి వచ్చి..
అయ్యను సేవించుకుని వెళ్ళేవారు.
భాస్కర భట్ల కృష్ణ మూర్తి గారు ..
తెల్లవారి నాలుగున్నరా.. అయిదుకి ..
మృదంగ సాధన చేసేవారు.
భ్రమరాంబగారి తమ్ముడు రామకృష్ణా హై స్కూల్ లోనే చేరాడు 

నేను తొమ్మిదవ తరగతి.
అప్పుడప్పుడూ వాడు అక్కా.. లెక్కలు చెప్పు 

అని వచ్చేవాడు.
అయ్య భాస్కర భట్ల గారి దగ్గర..
మృదంగ సాధన చేసేవారు ..
అప్పుడు ..
అయ్య వయసు డెబ్బయ్ అయిదుండవచ్చును.
అయ్యకూడా తెల్లవారే లేచి ..
ఆ జతులను  ప్రాక్టీసు చేసేవారు.

తధ్ధిన్నాంకిట ..తధ్ధినాంకిట..
తధ్ధిన్నాంకిట.. తత్తరికిటతక..


తత్తరిత్త ఝణు.. తత్తరిత్తధిమి ..
తధ్ధిమితకిట.. తరిగిట తరిగిట తోం..