5 ఫిబ్ర, 2014

ఆత్మలున్నాయా..

ఆత్మలున్నాయా..
కొంతమంది ఉన్నాయని విశ్వసిస్తే..
చాలా
మంది లేవని   
మానసిక భ్రమ మాత్రమే అనీ కొట్టిపారేస్తారు
 

మరికొంతమంది మాత్రం ఉన్నాయని అనిపించినా 
వానిని స్పష్టం చేయలేక
ఊరుకొంటున్నారు.
ఒక వేళ
ఆత్మలున్నా 
అవి మన మనుషుల్లాగ కనిపిస్తాయా..
లేక సినిమాల్లోలా తెల్లచీరలూ గట్రా ధరించి 

పగ సాధిస్తాయా..

ఆత్మలు గాలిరూపంలో వుంటాయని
పసిపిల్లలను కొత్తగా పెళ్ళయిన వాళ్ళనీ 

వంటరిగా వూరిచివర్లకీ వెళ్ళొద్దంటారు..

చాగంటి వారైతే..
అమెరికాలో లేదా దూర ప్రాంతాలలో పిల్లలు ఉన్న తలిదండ్రుల శవాలను దహనం చేయకుండా 

వారు వచ్చే వరకూ వైట్ చేయడం జరుగుతుంది
 

ఆ పరిస్థితులలో ఉగ్ర భూతాలు 
యీ ఆత్మలను భయపెడతాయని  
ఉత్తర కర్మలు జరిగిన తరువాతే 
ఆ ప్రేతం  విముక్తి పొందుతుందని అన్నారు

అయితే తాము ఆత్మ చూశామనీ, 
దానిని తమ కెమేరాలో బంధించామనీ అంటోంది 
లండన్ అతీత శక్తులపై పరిశోధనలు చేసే బృందం. 
  
ఇంతకీ ఆత్మలు ఉన్నాయా? 
అని విదేశీ ఫొటోగ్రాఫర్లను అడిగితే ఉన్నాయనే అంటున్నారు. 
తమ కెమెరాలతో వాటిని వెంటపడి బంధించామని కొందరు చెబుతుంటే 
మరి కొందరు ఏదో ఫొటో తీస్తుంటే 
తాము అనుకున్న బొమ్మతో పాటు 
తమకు తెలియకుండానే ఆత్మలు కూడా వచ్చాయని కొందరు చెబుతున్నారు. 
ఎదురుగా ఉన్న వస్తువుపై పడిన ఫ్లాష్‌ రియాక్టయి  
ఆత్మ ఆకారం వచ్చిందని 
కొందరు అంటుంటారు.

 ఒకసారి ఒకమ్మాయి ఇంట్లోంచీ అదృశ్యమైంది
ఇంట్లో వాళ్ళు కన్నీరు మున్నీరయ్యారు
నాలుగు వైపులా వెదికారు
ఎవరి సలహా వల్లనో 

అంజనం వేసే వాళ్ళు పిలిపించబడ్డారు
పెద్ద ముగ్గు వేసి 

ఒక చిన్న పిల్లాడిని పీటపై కూచో పెట్టారు
చిన్నపిల్లలు కళ్ళార్పకుండా చూడగలరట..
పూజ నడిచింది

 ఆ పిల్లవాడిని ఆ ముగ్గులోకి చూడమన్నారు
 

వాడికి అందులో 
ఆటో లో వాళ్ళ మామతో వెళుతున్న వాడి అత్త కనిపించింది
ఆ ఆటో వాళ్ళ ఇంకో అత్త ఇంటి ముందు ఆగింది 

అని వాడు చెప్పాడు
తర్వాత నిజంగానే 

ఆ అమ్మాయి ఆమె వదిన తమ్ముడిని ప్రేమించి
ఇంట్లో వాళ్ళు వద్దంటారని భయపడి
బంధువుల సహకారంతో అతణ్ణి పెళ్ళి చేసుకుంది.
వాడు చెప్పిన విషయం అక్షరాలా నిజమే..
 

మనకు తెలియని విషయాలన్నీ 
అపధ్ధాలని అనుకోవడం నిజంగా మన భ్రమే..
 


పుట్టపర్తి వారు కూడా 
ఒక దయ్యాల ఇంటిలో ఉండేవారట..
మా అక్కలు అప్పుడు చిన్న పిల్లలు
వాళ్ళు మిద్దె పైకి మెటికలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడూ వెనకనుంచీ ఎవరో తోసినట్లు అనిపించి

 కింద పడే వాళ్ళట..
ఆడుతూ ఆడుతూ తోసినట్లు 

ముందుకు పడిపోయేవారట..
ఆ యిల్లు గలాయనకు ముగ్గురు భార్యలు
ఇద్దరు చనిపోతే మూడవదాన్ని చేసుకున్నాడు
ఇల్లు ఖాళీ చేసేటప్పుడు మా అమ్మ అతనికి
చనిపోయిన ఆఇద్దరు భార్యలకు 

సరిగ్గా కర్మలూ అవీ  చేయమని
వారి పేరున ముత్తయిదలకు పసుపు కుంకుమ తాంబూలాలిచ్చి వారి కడుపు చల్ల చేయమని చెప్పివచ్చిందట..
 

ఒక్కటనిపిస్తుంది
మనం కడుపులో ఉన్నాం
బయటికొచ్చాం
ఒక రెండు మూడేళ్ళ వరకు 

మనకు యేమీ జ్ఞాపకం ఉండవు
కానీ అప్పుడు మనం లేమా ఉన్నాం
కానీ ఒక మూడేళ్ళ నుంచే మనకు మనవిషయాలు అమ్మా నాన్నా విషయాలు గుర్తుంటాయి..
అలానే మన దేహం పసితనం నుంచీ యవ్వనం నడివయసు వృధ్ధాప్యం లలో మార్పులు చెందుతుంది
చివరికి
కళ్ళు చెవులు కాళ్ళు చేతులు 

తమ పనిని చేయటం మానేస్తాయి
క్రమంగా శరీరం శుష్కించి పోతుంది
యేదో ఒకనాడు మనకు తెలియకుండానే 

మనం చనిపోతాం
తరువాత మనం లేమా..
లేకపోతే ఎక్కడికి పోతాం..
శరీరం ముసలిదయ్యిందే కానీ 

మనసు ఆలో చిస్తోందికదా..
మరి చనిపోవటం అంటూ జరిగాక మనసేమవుతుంది.. 
 మరణం తరువాతా మన కర్మ గతిననుసరించి 
ఎక్కడో ఒకచోట వుంటామేమో అనిపిస్తుంది
ఆ విషయం ఇప్పటి మనకు తెలియదంతే..


అప్పుడు నాకు పద్దెనిమిదేళ్ళు 
అది  మా అయ్య చనిపోయిన సాయంత్రం
అందరూ ఎక్కడి వాళ్ళక్కడ కూచుని మాట్లాడుకుంటున్నారు..
కరంటుపోయింది
 

నేను భోజనాల గదిలో
మా అయ్య ఫోటో గుండెలకు హత్తుకుని 
గోడకు ఆనుకుని కూర్చుని ఆలోచిస్తున్నాను అప్పుడప్పుడూ యేడుస్తున్నాను..
 

గతంలో 
నేను అలా ఆ గదిలో కూచునో పండుకొనో వున్నప్పుడు
మెల్లిగా మా అయ్య హాలునుంచీ నడుచుకుంటూ వచ్చి
'నాయనా మిద్దె మీద పడక వేసిరామ్మా ..'
అనే వారు..
నేను వెంటనే వెళ్ళి నవ్వారు మంచం పరుపు వేసి 

దోమల తెర కట్టి వచ్చేదాన్ని
ఒకవేళ దోమల తెర తరువాత కట్టినా 

ముందైతే పరుపు వేసేదాన్ని
అయ్య వచ్చి పడుకునేవారు
ఒక్కో సారి 'కొంచం కాళ్ళు వత్తమ్మా ..'

అనేవారు
నేను మా అయ్యసేవ 

ఆ భగవత్సేవ లాగనే భావించి చేసేదాన్ని 
హయగ్రీవం చెప్పుకుంటూ 
భక్తిగా అయ్య పాదాలు వత్తేదాన్ని

 అయ్య ఇక చాలు అనేవరకూ

ఆరోజు కూడా..
తలవంచుకుని వున్న నాకు 

'నాయనా  పైన పడకేసి రామ్మా..' అని వినిపించింది
నిజంగా నిజ్జంగా..
ఉలిక్కి పడ్డాను..
ఇది భ్రమా నిజమా అని ఆలోచించాను..
వెంటనే పైకి వెళ్ళాను..
పైనా అంతా చేకటి..
అక్కడ అయ్య కూచునే అరుగుపై కూచున్నాను..
అయ్యకోసం..
కానీ రాలేదు..
భగవన్నామం చెపుతూ 

యీ జగన్నాటకం నుంచీ నిష్క్రమించిన 
అయ్య దివ్యాత్మ 
నాకీ అనుభవమిచ్చినందుకు ఎంతో సంతోషపడ్డాను..




3 ఫిబ్ర, 2014

దురవస్థ


కొన్ని జ్ఞాపకాలు

గొల్లపూడి మారుతీరావు గారు కడప ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ డా. రేవూరి అనంత పద్మనాభరావు గార్లతో 

జిల్లెళ్ళమూడి అమ్మతో ఆ చిన్నపిల్లను నేనే ..
 ఇంకో విషయం చెప్పడం మరిచాను
అక్కడ కూర్చున్నప్పుడు జిళ్ళెళ్ళమూడి అమ్మ పక్కన ఉన్న పుట్టపర్తి వారి తలను నిమురుతూనే ఉంది..
ఆఫోటో కూడా వుందాలి అమ్మ అయ్య తలపి చేయి వేసి నిమురుతున్న ఫోటో



 రాజన్నతో


 కలకత్తా లో




2 ఫిబ్ర, 2014

పిబరే రామరసం


ఒకసారి విశ్వామిత్ర మహరాజు 
వశిష్టుని దర్శించటానికి వచ్చాడు
వెంట మహా సైన్యం..
వశిష్టుల వారిని సేవించి
కొంతసేపు అవీ ఇవీ మాట్లాడి 

వినయాను సంధానం చేసిన తరువాత..
ఇక బయలు దేరతానన్నాడు.
 

వశిష్టునికి విశ్వామిత్రునిపై అనుగ్రహం హెచ్చి
'మీరు మా ఆతిధ్యం స్వీకరించి వెళ్ళాలని 'కోరాడు
విశ్వామిత్రుడు
'వద్దులెండి..
మీరు తాపసులు..

 మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు.
ఊరకే మీ ఆశీర్వాదం కొరకు వచ్చాను ..
సెలవీయండి వెళతా'నన్నాడు
 

కానీ వశిష్టుడు
'మీరు మా అతిధి 

నేను గృహస్తును మీరు ఆతిధ్యం స్వీకరించాల్సిందే '
అని మొహమాట పెట్టాడు
'గురువుగారూ నేనొక్కడినే కాదు 

నావెంట బోలెడు సైన్యం వుంది..
అర్థం చేసుకోండి' అని విశ్వామిత్రుడు అనేలోగా
 

'మరేం పర్లేదు..
మీకు మీ సైన్యానికీ కూడా ఆతిధ్యమిస్తాం..'
అన్నాడు చిరునవ్వుతో వశిష్టుడు
 

'పెద్ద చిక్కొచ్చిందే .. 
వీళ్ళ దగ్గర మందీ మార్బలం లేవు
కావలసిన సరంజామా లేదు..
ఎలా ఈయన ఆతిధ్యం ఇస్తా .. ఇస్తా .. అంటున్నాడు..?'

అని ఆలోచనలో పడ్డాడు విశ్వామిత్రుడు..
 

'శబలా  'వశిష్టుడు పిలిచాడు
పిలవటమేమిటి ఒక ధేనువు వచ్చినిలబడింది
విశ్వామిత్ర మహారాజు అతని సైన్యం మన అతిధులు వీరిని తృప్తి పరచవలసిన బాధ్యత నీదే.. అని ప్రశాంతంగా చూచాడు ధేనువు వంక..
 

ఎన్నో రుచికరమైన పదార్థాలు 
ధేనువులోంచీ ఉద్భవించాయి
విశ్వామిత్రుడు ఆశ్చర్యంతో అలా చూస్తూనే వున్నాడు
సైనికులందరికీ మృష్టాన్న భోజనం అందింది..
భోజనానంతరం అందరూ వెనుదిరగాలి కదా
 

ఇప్పుడు 
విశ్వామిత్రుని మనసులో విషపుటాలోచన
ఆధేనువు తనది కావాలను కున్నాడు
 

వశిష్టుడిని ధైర్యంగా అడిగాడు కూడా
'యీ శబల ను నాకివ్వండి బదులుగా ఎన్నో కానుకలిస్తానన్నాడు'
వశిష్టుడు ఒప్పుకోలేదు

'ఇది నా హోమ ధేనువు ఇవ్వ'నన్నాడు..  
'నేను రాజుని ..
తన రాజ్జంలోని యేవస్తువుపైనైనా
 ప్రధమాధికారం రాజుకే కనుక
యీ శబల  పై అధికారం నాదే..
మర్యాద ఇస్తే ఇవ్వు ..

లేకపోతే బలప్రయోగం చేస్తా'
 

వెంటనే పదిమంది సైనికులు ఆధేనువును 
బలవంతంగా లాక్కుపోతున్నారు
ఇంతలో ఆ ధేనువు వారిని విడిపించుకుని

 పరిగెత్తుకుని వశిష్టుని సమీపించి
 

'మీకై మీరే నన్ను ఆ రాజు స్వాధీనం చేసారా
లేక బలవంతంగా వాళ్ళు నన్ను తీసుకుపోతున్నారా' 'అని అడిగింది
'నేను నిన్ను వదులుకో లేదు
వాళ్ళు నిన్ను బల ప్రయోగంద్వారా సొంతం చేసుకోవాలనుకుంటున్నారు'
అన్నాడు బ్రహ్మర్షి
 

అంతే శబల అగ్రహోదగ్ర అయ్యింది
ఆమె చెవులు కళ్ళు తోక పృష్టి పాదాలు గిట్టలు 

మొదలైన ప్రదేశాలనుంచీ 
వందలు వేల సైనికులు పుట్టుకొచ్చారు
విశ్వామిత్రుని సైన్యాన్ని చీల్చి చెండాడారు..
నిశ్చేష్టుఁడు  విశ్వామిత్రుడు 


వశిష్టునిది తపోబలమని గుర్తెరిగి
తపస్సుతో తానూ దాన్ని సాధించి 

తన మాట చెల్లించుకోవాలనుకున్నాడు
 

వెంటనే
తీవ్ర తపస్సు
పరమశివుని కై  
 శివుడు  ప్రత్యక్షం 
నాకు ధనుర్వేదంలోని సర్వ అస్త్రాలు.. 
 సాంగోపాంగంగా  ఇప్పటికిప్పుడు అనుగ్రహించమని కోరిక
విషయాన్ని గ్రహించిన శివుడు 

తనలో తను నవ్వుకున్నాడు 
తధాస్తు అన్నాడు
 

రెట్టించిన ఉత్సాహంతో 
తిరిగి వశిష్టుని ఆశ్రమానికి వచ్చిన విశ్వామిత్రుడు
తన అస్త్రాలన్నీ ప్రయోగించాదు
 

అన్నిటికీ వశిష్టుని బ్రహ్మదండమే సమాధానం చెప్పింది
విశ్వామిత్రుడు ప్రయోగించిన సర్వాస్త్రాలూ బ్రహ్మదండంలోకి చేరిపోయాయి
బ్రహ్మ బలం ముందు క్షత్రియ బలం ఓడిపోయింది
 

తరువాత జరిగిన కథలో విశ్వామిత్రుడు
బ్రహ్మర్షిత్వాన్ని సాధించాడు
గాయత్రీ మంత్ర కర్త అయ్యాడు
త్రిశంకు స్వర్గన్నే సృష్టించాడు..
హరిశ్చంద్రుణ్ణి పరీక్షించి వదిలాడు


ఇక్కడ చెప్పేదేమంటే
 ఎంతటి రాజాధిరాజులైనా 

భక్తులతో తప స్వులతో చెలగాటమాడారా
వారు పాములతో చెలగాటమాడినట్లే
అందరిలోనూ ఆ సర్వేశ్వరుని చూస్తూ 

సాధుజీవనం గడిపే భగవద్భక్తుల 
మనసు నొప్పించి ప్రవర్తిస్తే
ఇడుముల పాలు కావలసిందే..
 

తులసీ దాసు అక్బర్ నడుమ జరిగిన యీ ఉదంతం మనకిదే చెబుతుంది..


 అక్బరు తులసీ దాస్ వద్దకెళ్ళాడు
రామ దర్శనం ఇప్పించమన్నాడు
రామ దర్శనం అంత సులభంగా జరిగేది కాదు
కామ క్రోధాదులు జ్ఞానాగ్నిలో భస్మీపటలం అయితేనే రాముడనుగ్రహిస్తాడు
అనేక జన్మ వాసనా వాసితములైన కామ క్రోధాదులు అల్ప ప్రయత్నములతో నశింపవు
రాముని చేరుటకు రామభక్తి ఒక్కటే రాజమార్గం
ఆ దారిన పయనింప మొదలిడు
నీ తపన ఎంత తీవ్రమైతే గమ్యమంత చేరువవుతుంది అని చెప్పాడు తులసి
వెంటనే అక్బర్ కు తన చక్రవర్తిత్వం గుర్తొచ్చింది
ఫలితంగా తులసీదాస్ చెరసాల పాలయ్యాడు
ఆపైన యేం జరిగింది..?
తన భక్తుడు తులసీదాసు ను ఆ రాముడెలా రక్షించుకున్నాడు ..
 

పుట్టపర్తి వారి 'రాయల నీతి కథలు' లోని 
ఈ తులసీ దాసు ను  చదవండి..





30 జన, 2014

హోటల్లో తినే అప్రాచ్యుడు



కల డంభోధి 
గలండు గాలి 
గల డాకాశంబునం గుంభినిన్
గల డ గ్నిన్ 

దిశలం 
బగళ్ళ 
నిశలన్ 
ఖద్యోత చంద్రాత్మలన్
గల డోంకారమునం ద్రిమూర్తుల ద్రిలింగ 

వ్యక్తులం దంతటన్
గల డీశుండు గలండు దండ్రి ! 

వెదకంగా నేల యీ యా యెడన్.

 అని ప్రహ్లాదుడు 
హరి ఎక్కడెక్కడున్నాడో చెప్పాడు
 

నిజమే హరిని కొలిచేవారికి విగ్రహంలోనే కాక
ప్రతి ఫ్రేం లోనూ పరమాత్మ గోచరమవటంలో వింతేముంది
 

నిరంతరం అతని చింతనలో చేరువలో బ్రతికేవారికి 
అలా కనిపించటంలో ఆశ్చర్యంలేదు
ప్రపంచం కనిపిస్తేనే వింత..
 

పుట్టుకతో గొప్ప హరిభక్తిని పొందిన ప్రహ్లాదుడు
తన నైజాన్ని మనకెలా వివరించగలడు
చిత్తాన్ని ఎలా అర్థంచేయించగలడు
మనకీ ప్రపంచమెంత నిజమో 

అతనికి హరి అంత నిజం


కానీ ప్రహ్లాదుడు తన కొడుకులా మె లగి
రాక్షస రాజ్జాన్ని యేలాలని హిరణ్య కశిపుని కోరిక..
అందుకే.. 

ప్రహ్లాదుడు హరికై ఎంత వెంపర్లాడాడో
హిరణ్య కశిపుడూ తన కొడుకును 

భౌతికంలోకి లాగడానికి అంతగానూ ప్రయత్నించాడు..

మనం పిల్లలు మాటవినకపోతే
 గోడకుర్చీ వేయిస్తాం
అరచేయి చాపమని బెత్తంతో కొడతాం
పిల్లవాడి అరచేతులు వాతలు పడతాయి
వాడి కళ్ళలోంచీ నీళ్ళు ప్రవహిస్తాయి..
అంతే మన హృదయం ద్రవించి పోతుంది..
వాణ్ణి వెంటనే గుండెకు హత్తుకుని..
ఎందుకు నాన్నాచెప్పిన మాటవినవు..
అల్లరి చిల్లరిగా తిరగకురా..
బుధ్ధిగా చదువుకోరా అంటే వినవు.
అని మనం అన్నట్టుగా..
 

హిరణ్య కశిపుడూ ప్రహ్లాదుని శిక్షించాడు
ఎలా..

రాక్షస జన్మ కాబట్టి 
శిక్షలూ అంత భయంకరంగానూ వుంటాయి..
ఏనుగులతో తొక్కించడం
మంటల్లో వేయించటం
పాములతో కరిపించటం..
 

నిజానికి అవి చేయించటం 
హిరణ్య కశిపుని ఉద్దేశం కాదు
అక్కడిదాకా వెళ్ళాక
ఆ యేనుగులనూ పాములనూ చూసి భయపడనాన్నా ఇక నీవు చెప్పినట్లు వింటా నాన్నా
నన్ను పాములతో కరిపించవద్దు నాన్నా 

అంటాడని అతని ఊహ..

చక్రిచింత లేని జన్మంబు జన్మమే?
తరళ సలిల బుద్భుదంబు గాక
విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుడే?
పాదయుగము తోడి పశువు గాక. 


 అంటూ రా నన్ను తొక్కు
నన్ను కరువు..
ఓ అగ్నీ నన్ను కాల్చేయ్
అని చేతులు జోడించి హరి ధ్యానం చేస్తూ 

నిశ్చలంగా నిలబడ్డాడు..
 

హిరణ్య కశిపుడూ కుర్రాణ్ణి చదువులో వేశాడు
అక్కడా ఆ హరి ధ్యానమే..
పైగా అక్కడి రాక్షస బాలురకూ హరి భక్తిని నేరిపి వాళ్ళనీ చెడగొడుతున్నాడు..
'యేదీ చేతులు జోడించి
కళ్ళు మూసి
మనసునేకాగ్రం చేసి..
యీ నారాయణ మంత్రమనండీ..'
అన్నాడు..
పిల్లలందరూ
'ఓం నమో నారాయణాయ..'

అని అరుస్తూ మత్తెక్కి పోతున్నారు..
 

వెంటనే రాక్షస గురువులు చూసి 
గుండెలు బాదుకొని 
మళ్ళీ హిరణ్య కశిపుని దగ్గరికి తీసుకెళ్ళారు..
'ప్రభూ తమ చిరంజీవి..
చేస్తున్న నిర్వాకమిదీ అని.. '
 

'ఎందుకురా చదువుకోవూ
పక్కవాళ్ళనీ చెడగొడుతున్నావు 'అంటే


'అంబుజొదర దివ్య పాదారవింద
చింతనామృత పానవిశేష మత్త
చిత్త మేరీతి నితరంబు జేరనేర్చు
వినుతగుణశీల! మాటలు వేయునేల? '



'యేరా యెప్పుడు చూసినా హరీ హరీ
అంటావూ యెక్కడరా నీ హరి
రమ్మను ..
చూస్తాను'
 

హరి ఇక్కడున్నాడూ అనిచెప్పటానికి
హరి ఎక్కడ లేడు నాన్నా..
నాలోను మీలోనూ ఉన్నవాడు హరి కాడా..
అని హిరణ్య కశిపునికీ బదులి చ్చా డు ..


కోపం అవధులు దాటింది..
తననుంచీ తన కొడుకును దూరంచేస్తున్న 

ఆ హరిని చూడాలనుకున్నాడు
పైగా తమ రాక్షస జాతికి ఆ నారాయణుడు చేస్తున్న ద్రోహం నరాలనుడికిస్తోంది..
 

నిలువెల్లా కంపిస్తూ..
ఆ హరిని రమ్మను యీ రోజు అటో ఇటో తేలిపోవాలి
వాడు రాక్షస జాతికి చేస్తున్న అన్యాయాలు చాలక
నాకొడుకునూ లోబరుచుకుంటాడా..
ఆహరిని వదలనివ్వాళ.. అంటూ విపరీతమైన కోపంతో ..
 

చెప్పు ఇందులో ఉన్నాడా..
అందులో ఉన్నాడా
యీ స్థంభంలో ఉన్నాడా..
చెప్పరా చెప్పు..
అని గదనెత్తి స్థంభాన్ని దెబ్బ కొట్టాడు
 

అంతే..
హరి ఉగ్ర నారసిం హునిగా ఉద్భవించి..
హిరణ్య కశిపుని చీల్చి చెండాడి
పేగులు నరాలు మెడను ధరించి ..
ఇంకా ఆగ్రహం తీరక.. 

ఊగిపోతున్న నారాయణుని శాంతింపజేయటానికి
పరమ శివుడు సమస్త దేవతలూ 

తరలి వచ్చి స్తుతించారు..

 హిరణ్యకశపున్ని సంహరించిన 
నరసింహస్వామి బలాన్ని చూసి దేవతలు 
‘ఆహాబల’ అన్న ప్రదేశం 
ఇప్పుడు అహోబిలంగా మారింది. 

కృత యుగంలో స్వామి 
ఇక్కడ అవతారం ఎత్తాడని చెబుతారు. 
నరసింహ స్వామిని 
త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, 
ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు దర్శించుకున్నారని 
చరిత్ర చెబుతోంది. 

కలియుగంలో వెంకటేశ్వరస్వామి కూడా 
స్వామివారిని దర్శించుకున్నట్లు 
చారిత్రక సాక్ష్యా లున్నాయి.

అటువంటి మహిమాన్వితమైన అహోబిల క్షేత్రంలో

దర్శనానికై భక్తులు క్యూలో నిలబడ్డారు
నెమ్మదిగా క్యూ ముందుకు కదులుతూంది

అహోబిల నారసిం హుని దర్శనం కోసం 
క్యూలో నిలబడ్డారు పుట్టపర్తి కూ డా
వారి కప్పుడు నలభై సంవత్సరాలు ఉండవచ్చు 

నిరంతరం నారాయణ చింతనలో మసలి ఇపోతున్న పుట్టపర్తికి  కావలసిందేమిటి
చదువా
కీర్తా
ధనమా..
లేక
ప్రహ్లాదుని ఆదరించిన హరి ఒడా.. 


యెవరో పుట్టపర్తిని చూసి
'నీవు పుట్టపర్తి శ్రీనివాసాచార్యుల కుమారుడివి కదూ.. '' అని అడిగారు

అవును.. 
''ఎంత గొప్పదయ్యా మీ వంశం ,,
శ్రీకృష్ణ దేవ రాయల గురు పాదు లైన 
శ్రీ తిరుమల తాతాచార్యుల గారి వంశం . ''

అంటూ ఆయన
పుట్టపర్తి వంశాన్నీ
తండ్రి తాతలనూ కాసేపు పొగడి నిష్క్రమించాడు..


కృష్ణదేవరాయల రాజగురువు
 తిరుమల తాతాచార్యుల వంశం వారిది. 
తాతాచార్యులు గొప్ప శాస్త్ర పండితుడు.
'మాది తిరుమల తాతాచార్యుల వం శం  రా .. '
అని అన్నప్పుడల్లా 
పుట్టపర్తి ముఖం లో..  కళ్ళలో .. 
ఒక విం తైన కాంతి..
సాహితీ సమరాంగణ సార్వభౌముని కొలువు కూటాన సార్వభౌముని గురువుగా
రాయల కంటే ఎత్తైన పీఠాన్ని అధిరోహిస్తూ 

ఉన్నతోన్నత గౌరవాన్ని అందుకునే 
తాతాచార్యులవారి ఆజ్ఞ శిలాశాసనంగా జరిగేది..

పుట్టపర్తి మనసులో సన్నని బాధ
అంతటి గొప్పవంశంలో నావంటి  నీచుడు.. 
హోటల్లో తినే అప్రాచ్యుడు పుట్టాడే  అని..
 (జీవితం అనుభవాలు లత మాసపత్రిక నుంచీ )

photos